Sunday, 31 July 2016

కలువ నీవు -- కలువనీవు

కలువ నీవు -- కలువనీవు

నాదు కలల కాసారము లో నెమో కలువ నీవు
కనుల ఎదుట కనిపించీ నన్నేమో కలువనీవు

ముద్దుముద్దు పలుకులతో మురిపించే చిలుక నీవు
మోము పైన దరహాసము నను జూచిన చిలుకనీవు

నా ఊహల వయ్యారికి చంద్రవంక నగ నీవు
నీవే ఆ వయ్యరివి అందామన  కనగనీవు

పూల తావి, పిల్లగ్రోవి రవళిని కల గాలి నీవు
నీదు ప్రేమ తీరానికి ననుగొనిపో కలగాలి నీవు

నీ కొరకై వేచినాను చేసి హృదిని నాక వనము
నీకే అంకితమైనది కలకాలము నా కవనము

హృది హ్రదమందందముగా విరిసిన చెంగలువ నీవు
 'మోహనా' అని యంటూ రావా నను కలువ నీవు

No comments:

Post a Comment