Monday, 16 November 2015

మన ఘనత

మన ఘనత
పండుతేనె తెనుంగు ప్రాచిపోవగజూచు
ప్రభుత గలిగినట్టి ప్రతిభ మనది
నన్నయ తిక్కన్న నాణెంపు కవితల
కాలాన గలిపేటి ఘనత మనది
శాస్త్రీయ  సంగీత ఛాయనాసాంతమ్ము
పడనీక కాపాడు పాట మనది
అలవలాతలగూడ  యద్భుతమ్మౌ కైత
లనుచు కొండాడేటి యాస్థ మనది

అమెరికా తప్పుటడుగులనడుగులిడుచు
స్వాభిమానమ్ము నమ్మేటి సరళి మనది
విల్వలకు వల్వలెల్లను విప్పివేసి
గంతులేయించుచున్నట్టి గరిత మనది

చెరుకు రామ మోహన్ రావు

Saturday, 14 November 2015

నాకు శివునితో పోలిక

నాకు శివునితో పోలిక
ఫాల నేత్రమ్మేది పంచాస్త్రునెదిరింప
గడుసుజటలవేవి గంగ నిల్ప
మురహరి తోడేది ముప్పురాల జయింప
గణములేవి ధూర్త గుణము తప్ప
కంఠాన విషమేది కారుణ్యమునుదెల్ప
శంకరార్పణమేది శంక దప్ప
ఆలు మగనిలోన అర్ధభాగంబను
సాంబశివునికేను సాటి గాను

ఇట్టి వైరుధ్యముల ప్రక్కనెట్టి నేను
సామ్యమొక్కటి చూపింప సాహసింతు
పాప ధారిని తాగూడ పాపదాల్పు
చాలునీమైత్రి తనతో మసలగ నేను

నేను పాపమును ధరించినవాడను ఆయనపాపలు అంటే పాములు ధరించినవాడు . ఇద్దరికీ ఉన్న సామ్యము ఒకటే. 'పాప' శబ్దము ఆయనకు అన్వయమైనది (తెలుగులో) నాకూ'పాప' శబ్దము ఉన్నది సంస్కృతములో. ఇద్దరమూ 'పాప' ధారులము కావున  (‘పాప’ కలిగిన వారమైనందువల్ల) మాకు సామ్యము చెల్లినది అని నా ఉద్దే్శ్యము.

చెరుకు రామ మోహన్ రావు 

Friday, 13 November 2015

మామ మామ మీకు

నేను వ్రాసిన ఈ పద్యానికి కాస్త అర్థము చెప్పే ప్రయత్నము చేస్తాను
మామ మామ మీకు మా సంపదలనిచ్చి
మసల జేయు మంచి సంతు నిచ్చి
మామదీశు నతము మది నిల్పి నుతియించి 
మంచి పొందగలరు మరల మరల
మామ మామ అంటే మామకు మామ అని. లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు విష్ణువుకు మామ . అదే విధంగా విష్ణువు పాదముల వద్ద పుట్టుట వల్ల (హరి పాదోద్భవ ) ఆయన కుమార్తెయై సముద్రుణ్ణి కలవటం వల్ల, సముద్రుడు తిరిగి విష్ణువుకు అల్లుడైనాడు. అంటే విష్ణువు సముద్రునికి మామ అయినాడు . ఇది మామ మామకు అర్థము.
మా అంటే లక్ష్మి లేక సిరి. కాబట్టి మాసంపదలు అంటే సిరిసంపదలు అని. మా అంటే మహా లేక గొప్పగా అధికముగా అనే అర్థము కూడా వుంది . అంటే మీకు ఐశ్వర్యము అధికముగా ఇస్తూ మంచి సంతాన సౌభాగ్యాన్ని కూడా కలిగించాలి అని
అటువంటి, మామదీశు అంటే లక్ష్మీదేవి మనసుకు అధిపతి యైన వాడు,అంటే విష్ణువును కలకాలము భక్తితో ప్రార్థించుతూ మీరు కోరుకొనే మంచినెల్లా పొందగలరు అని నాకు తెలిసిన అర్థము.

Thursday, 12 November 2015

హరిహర సమరస కార్తీకం (అప్పయ్య దీక్షితులు)

హరిహర సమరస కార్తీకం

https://cherukurammohan.blogspot.com/2015/11/blog-post_12.html

మారమణ ముమారమాణం ఫణధరతల్పంఫణధరాకల్పం

ముర మధనం పుర మధనం వందే బాణారి మసమ భాణారిం

మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని

నవస్తూ భేదః ప్రతిపత్తి రస్తుమే తధాపిభక్తిః తరుణేందుశేఖరే  (అయ్యప్ప దీక్షితులు)

 

లక్ష్మీపతి యగు విష్ణువు సర్పము పై శయనించితే ఉమాపతి సర్పములనే దేహముపై 

ధరించినాడు.హరి మురారి యితే హరుడేమో పురారి.హరి బాణాసురహర్త

 హరుడేమో మారుని సంహర్త (మారుడు=మన్మధుడు). మహితాత్ములగు వారిరువురికీ 

నమస్కారము.

జగదధీశ్వరుడు మహేశ్వరుడు. జగదంతరాత్ముడు జనార్దనుడు. వస్తుతః

 వారిరువురికీ భేదము లేనప్పటికీ నాకు తరుణేందు శేఖరునిపై తపము సిద్ధిస్తూవుంది. (హరిహర ప్రీతికరమైన కార్తీక మాస సందర్భంగా)

Ma (Lakshmi) is the consort of Hari, Uma is the consort of Hara. 

Hari lays on Sarpa (Snake). Hara wears sarpas on his body. Hari 

killed Mura a demon. Hara killed the three demons called 

Tripuraasuraas. Hari killed Banasura. Hara killed Manmadha. They 

are equivalent in every respect. Somehow my mind stays on Hara.

(In the context of the beginning of Karthika masa.)

 

చెరుకు రామ మోహన్ రావు

Wednesday, 11 November 2015

దుర్జనుని లక్షణము

దుర్జనుని లక్షణము

జాడ్యం హ్రీమలిగణ్యతే వ్రతరతే దంభ శ్శుచౌకై తనం,
శూరే నిర్ఘృణతా మునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని|
తేజస్వి న్యవలి ప్తతా ముఖరతా వక్తవ్య శక్తిస్థిరే,
తత్కోనామగుణో భవేత్సుగుణినాం యా దుర్జనై ర్నాంకితః|| 
 - నీతిశాస్త్రము


మంచినెపుడు తాను మరి చెడ్డగా నెంచు
మౌని జూచి మూగ యని దలంచు
కలుగ నియతి నిష్ఠ కపటిగా దలపోయు 
దుర్జనుండు వాడు దూరముండు

తా. దుర్జనుఁడు సజ్జనుల యందుగల సద్గుణములను దుర్గుణములుగా నెంచును.  లజ్జావంతునిజూచి జడుఁడని చెప్పును, వ్రతశీలుని డాంబికుఁడని , ఆచారవంతుని కపటుఁడని , శూరుని కనికరములేనివాఁడని , తేజస్సుగలవానిని గర్వించు వాఁడని , సద్వర్తనుని వాచాలునిగా నెంచును, కావున దుర్జనునికి  జనులయందలి సద్గుణ మెన్నటికీ కానరాదు. 

A repugnant thinks the seasoned to be bad, a silent to be dumb, a devout to be a hypocrite, a charming to be a grandiose, a soothing speaker to be a garrulous .
Hence to an evil person can see nothing good in his vicinity. 

Monday, 9 November 2015

కార్తీక మాస ప్రాశస్త్యము


కార్తీక మాస ప్రాశస్త్యము

పాశ్చాత్యులు, వారిలో ఏ దేశస్థులో గుర్తులేదు, Light Trapping System అన్న ఒక పద్ధతిని వారి వారి పేర్లమీద ప్రచారమునకు తెచ్చినారు. మరి దేనికయినా ఒక మూలము అవసరము కదా! దానికి మూలము మన దేశమే! మనము పిలుచుకొనే దీపావళి, దీపోత్సవము , కార్తీక దీపారాధన ప్రభావమే వారి పుర్రెలో పుట్టిన భావము. అసలీ దీపోత్సవము వెనుక దాగియున్న శాస్త్రీయతను చూద్దాము. పంటల వర్షములు వర్ష ఋతువులో వర్షము పడుట మూలమున పెరిగిన పంటలు కోతలకు రావటముతో అవి కోయుటవలన వానిపై నివసించిన కీటక,పతంగములు ఇళ్ళలోనికి రావటము ఎక్కువౌతుంది. భూమి లోపల చేరిన నీటి కారణమున అంతకు ముందు ఋతువులో గ్రహించిన వేడితో మిశ్రితమౌట వలన వివిధ వాయువులు (విషవాయువులు ఎక్కువగా వుంటాయి) ఆవిరులరూపములో వాతావరణములో ప్రవేశించుతాయి. పగలైతే సూర్య ప్రకాశము వుంటుంది కానీ రాత్రికి ఎట్లు ? అందుకే కార్తీక మాసములో నూనె దీపములు వెలిగించేది. మన ఋషులు ద్రష్టలు. వారు అనుగ్రహించిన విధానమే ఈ కార్తీక దీపారాధన. దీనికి కేవలము నూవుల నూనెను మాత్రమె ఉపయోగించ వలెనన్నది వారి యాదేశము. ఇందుకు ముఖ్యమైన కారణములు రెండు. ఒకటి ఆ దీపములనుండి వచ్చు పొగ విషవాయువులకు విరుగుడుగా పని చేస్తుంది. ఆ దీపమూల వెలుగులకు ఆకర్షింపబడి క్రిమి కీటక పతంగ శలభములు, అందులో ఆహుతి యగుట చేత మానవాళి రోగముల నుండి రక్షింపబడుతుంది. ఇంత గొప్ప విషయమును పేరుకొరకు ప్రాకులాడకుండా ప్రజలకు పంచినవారు మన ఋషులు. మనమేమి చేసినా వారి ఋణము తీరదు కానీ మనసారా మరచి పోకుండా వారిని తలచుకొంటూ వుందాము. ఇక కార్తీక మాసములోనికి అడుగు పెడదాము.
కృత్తికా నక్షత్రమునకు, పున్నమి చంద్రుడు దగ్గరగుటవల్ల ఈ మాసమునకు కార్తీక మాసమని పేరు. కార్తీకమాసంలో సూర్యుడు తులారాశియందు ప్రవేశించును. ఆ సమయమున సమస్త నదులు కూడా గంగానది తో సమానముగా విష్ణుమయమౌతాయని కార్తీక పురాణమున చెప్పబడినది. కార్తీకమాసం వర్షాకాలం ముగిసిన తరువాత వస్తుంది. అంటే శరదృతువు లోని చివరి నెల కార్తీకము. అప్పటిదాకా వానలు పడి చిత్తడిగా ఉన్న భూములు పొడివారతాయి. అటు వానలు, ఇటు ఎండలు లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి వాతావరణము ఇటు శరత్తులోను అటు వసంతములో వస్తాయి. అందువలన అన్ని పండుగలకు నోములకు ఆలవాలము.
విష్ణుమూర్తి ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు నిద్ర కుపక్రమించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి. పరమ శివుడు త్రిపురాసురుడను రాక్షసుని కార్తీక పౌర్ణమి నాడు సంహరించి జగతిని కాపాడినాడని మనకు కార్తీక, శివ పురాణములద్వారా తెలియవస్తుంది.
ఈ మాసమున ప్రాతః కాలముననే లేచి శిరస్నానం చేసినవారు పుణ్యప్రదులౌతారని చెప్పబడినది. స్నానము , వాపీ కూప,తటాక నదీ జలములందు స్నానమాచరించ వలయునని యున్నది.ఆ విధముగా స్నానాదులను చేసి తమ జప తపములను దీక్షతో చేసుకొనేవారు అశ్వమేధ ఫలాన్ని పొందుతారని వసిష్ఠ మహర్షి వివరణ. ఈ కాలము నదీ స్త్నానములు చేయుట అంత సులభము కాదు . అందుకే ‘ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు’ అని ఇంట్లో స్త్నానము చేసుకోనేటపుడు చెప్పుకొనవలెను. సోముడు అనగా చంద్రుడు శివుని మౌళియందు ఉంటాడు కాబట్టి కార్తీక సోమవారం శివునికి ఎంతో ప్రీతికర మైనది. నిజానికి ఈ మాసములోని ప్రతి రోజూ అత్యంత పుణ్య ప్రదమైనదే! ఈ మాసములో నైనా కుటుంబీకులు ప్రతిరోజూ తెల్లవారుఝాముననే లేచి నదీ తటాకములందు కాకపోయినా ఇంటిలోనే స్నానము చేసి సంప్రదాయ దుస్తులు ధరించి శివ దర్శనము కావించి ధూప దీప నైవేద్యములు సమర్పించి స్వామికి రుద్రాబిషేకం జరిపించిన చేసిన పాపాలు పోయి మోక్ష ప్రాప్తి కలుగును అని కార్తీక పురాణము తెలుపుతున్నది. అసలు కార్తీక స్నానమును గూర్చి ఈ శ్లోకమును ఒకసారి చదవండి.
కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన
ప్రీత్యర్థ తవ దేవేశ దామోదర మయ స్సహః
ఓ జనార్దనా, దేవతలకు అధిపతివైన దామోదరా నిన్ను ప్రసన్నము చేసుకొనుటకు నేను కార్తీక మాసమందు ప్రాతః కాలమందే స్నాన మాచరిస్తున్నాను. ఈ మాసములో చేసే పవిత్ర కర్మలను ' కార్తీక దామోదర ప్రీత్యర్థం' అని ఆరంభింప వలెనని శాస్త్రములు చెబుతున్నాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. తులసి చెంత హరిపూజ సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ అత్యంత పుణ్యప్రదం. అసలు తులసి అంటేనే తులనమునకు సాటి లేనిది అని అర్థము .కాబట్టి తులసి అంత ప్రధానము, పవిత్రము అయినది. ఆషాఢ ఏకాదశి (శయనైకాదశి) నాడు యోగనిద్రకు ఉపక్రమించిన విష్ణువు కార్తీక ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయని ముందే చెప్పుకున్నాము. అందుచేత 'త్యజనిద్రాం జగత్పతే, త్వయిస్సుప్తే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్" (నీవు నిదురించితే లోకము నిదురిస్తుంది, నీవు మేలుకొంటే లోకము మేలుకుంటుంది, కాబట్టి స్వామీ నిద్ర వదులు ) అనే మంత్రంతో ప్రార్థనచేసి, శ్రీమహావిష్ణువును అర్చించి, ఉపవాసముంటే విష్ణుమూర్తి అనుగ్రహంతో అనుకున్న కార్యాలు చేకూరుతాయన్నది పెద్దల మాట. అలాగే ఈ రోజున భాగవతంలో "అంబరిషోపాఖ్యానం" చదివినా, విన్నా మేలు జరుగుతుందన్నది ఆర్యవాక్కు.

అదేవిధంగా
అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియో శివః’ అన్నది పెదాల మాట. అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును అన్నది శాస్త్ర వచనము. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయముగా ఈ ప్రదోషకాలము చెప్పబడినది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ | అని ఒక్క బిల్వ దళము శివుని కర్పించితే ఎంతటి పాపమైనా పటాపంచాలే !

న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
కార్తీకమాసానికి సమానమైన మాసము, సత్యయుగంతో సమానమైన యుగము,వేదములతో సమానమైన శాస్త్రము, గంగ తో సమానమైన నది ఏదీ లేదన్నది శాస్త్ర వచనము.
ఈ మాసంలో వస్తద్రానం, హిరణ్యదానం, కన్యాదానం, భూదానం చేస్తే విశేష ఫలితాలు పొందడమే కాకుండా, తేజస్సు, యశస్సు, కార్యసిద్ధి, జ్ఞానలబ్ధి, సౌభాగ్యాలు కలుగుతాయి. కార్తీక శుద్ధ పౌర్ణమినాడు కేదారేశ్వర వ్రతమాచరిస్తే సమస్త సౌభాగ్యములు కలుగునని వ్రతరాజము తెలుపుతున్నది, శుక్ల దశమి నాడు ”యాజ్ఞవల్క్య జయంతి ”శుక్ల ఏకాదశి' మహా పర్వ దినము నక్తము పాటించి అంటే రాత్రి దాకా భోజనము లేకుండా యుండి చంద్ర దర్శనము అయిన తరువాత శివుని దర్శించి భోజనం చేస్తారు, ఆలయాలలో ఆకాశ దీపాలు పెడతారు, ఈ మాసమునందలి శుక్ల ద్వాదశి ని ”చిలుకు ద్వాదశి లేక క్షీరాబ్ధి ద్వాదశి ”అంటారు. క్షీరసాగర మంథన ఫలితమును దేవతలు ఈ దినము పొందినట్లుగా చెప్పుకొంటారు.

ఈ దినము సాయంకాలము ఉసిరిక చెట్టు క్రింద, తులసి చెట్టు వద్ద పూజలు చేస్తారు. ఈ మాసము వనభోజనములకు ఎంతో వనరైనది. మనకు ' కరతలామలకము' అన్న ఒక సామెత వుంది. ఆమలకము అంటే ఉసిరిక కాయ. దానికి అనేకమయిన ఔషధగుణములున్నాయి. కార్తీక మాసములో ఆ చెట్టు ఇంకా ప్రతిభావంతమౌతుందట. అందుకే ఈ మాసములో ఆ చెట్టుకు పూజ చేసి దాని క్రింద భోజనము చేయుట శుభప్రదమని అని పురాణ వివరణ. కార్తీక మాసపు శుక్ల పక్షములో వనభోజనము చేసినవారు పాప విముక్తులై విష్ణు ధామాన్ని పొందుతారు అన్న విషయము మనకు ఈ శ్లోకము ద్వారా తెలియుచున్నది.

యః కార్తీకే శితే పక్షే వనభోజన మాచరేత్
సయాతి వైష్ణవం ధామ సర్వ పాపై ప్రముచ్యతే

ఈ మాసము అన్ని శివ క్షేత్రాలూ క్రిక్కిరిసి వుంటాయి. నేను చాలా క్లుప్తముగా ఈ మాసము నందు అరుణాచల క్షేత్రమును గూర్చి మీ ముందుంచుతాను.
భూమండలంలోనే అతి పెద్ద స్వయంభు మూర్తి కలిగిన క్షేత్రము అరుణాచలము లేక తిరువణ్ణామలై. పర్వతంపైన వున్న ఒక్కొక్క రాయి ఒక్కొక్క స్వయంభు లింగం. అడుగుకొక లింగం చొప్పున చిన్న చిన్న శకలాలు సైతం కోటాను కోట్ల లింగాలు అని అగస్త్యులవారు అన్నది ఆధ్యాత్మిక రహస్యం. అరుణాచలమే పరమేశ్వరుని పుణ్యప్రదమైన శరీరమని తెలియజేయడం వల్ల, పొద్దు గడపడానికో కారణం లేకనో పర్వత ఆరోహణ చెయ్యకూడదు. మొక్కు బడి అయితే పర్వతం మీద కాలు మోపవచ్చు. కార్తీక దీపంనాడు, జ్యోతికవసరమైన నూనె, నెయ్యి, పత్తి కర్పూరము తీసుకొని పోవచ్చు. ఈ కైంకర్యాల గురించి తెలియని వారికి సహాయపడడానికి కొండనెక్క వచ్చు. మిగతా సమయాలలో కారణం లేకుండా కొండనెక్కడానికి ప్రయత్నము చేయకూడదు. శివనామ కీర్తన చేస్తూ కొండనెక్కేవారికి ఫలం అధికముగా ఉంటుంది.

పలుసిద్ధ పురుషులు ఆధ్యాత్మిక పరమైన మహిమగల మూలికల తైలాలను కార్తీకదీపం రోజున, ఉపయోగించే ఆవు నేతిలో మిశ్రమం చేస్తారు. వాటి మహిమతో, వెలుగుతున్న జ్యోతినుండి వెలువడే పవిత్రమైన ధూమం గాలితో కలిసి భూమండలంలోనే కాక యితర లోకాలలో సైతం ప్రసరించి దుష్ట శక్తులను నశింప జేస్తుంది.
సిద్ధపురుషులు, బ్రహ్మజ్ఞానులవంటి మహితాత్ములు చేసిన పూజాఫలములను , మూలికాతైల కర్పూర ములతో వెలిగింపబడిన జ్యోతిరూపములో ప్రస్ఫుటము కాగా వానిని ధరించి భగవంతుడు ప్రకాశిస్తున్నాడు. మానవుని ప్రయత్నంవల్ల జ్వలింపచేసిన జ్యోతి మాదిరి కనుపించినా, భగవంతుడు తన భక్తులను జ్యోతిరూపంలో కటాక్షించే పవిత్రమైన రోజు ఈ దీపోత్సవ దినము. ఈ సమయంలో పర్వతపు అంచులలో నక్షత్ర్రములవలె ప్రకాశించేవి, జ్యోతులు లేక దివిటీలు కావు. అవి మహర్షులు, దేవతల పవిత్ర స్వరూములగు నక్షత్రములని విశ్వాసము. భక్తీ భావము ఒకటైతే భగవంతుడు కనిపిస్తాడు.

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుం విష్ణోశ్చ హృదయం శివం

యథా శివమయోర్విష్ణుః ఏవం విష్ణు మయఃశివః
యధాంతరన్నపశ్యామి తథామే స్వస్తిరాయుషి
శివకేశవ అభేదమును ఎవరు గుర్తించుతారో వారు కలకాలమూ సుఖ సంతోషాలతో తులతూగుతారు.
స్వస్తి.

Sunday, 8 November 2015

అనుపమ వర్ణనా వైభవం! -- వేముల రామా భట్టు

Satyanarayana Choppakatla
అనుపమ వర్ణనా వైభవం!
నాటికీ,నేటికీకూడా ప్రతిభావంతులైన కవులకులోటులేదు.అటు ఆంధ్రదేశంలోను,యిటుతెలంగాణ,లోనూ వ్యుత్పన్నులయిన కవులుచక్కనికావ్యాలురచించి,భాషాయోషనలంకరించారు. యెటొచ్చీ,వారికృషినితెలిసికోలేకపోవటంమనఅలసత్వమే! సందేహంలేదు.
పాలమూరుజిల్లాలో ఒకచిన్నసంస్థానం మానాజీపేట.తూమువంశీయులైనరెడ్డిప్రభువులదిదానియాధిపత్యం.1830-1835 మధ్యలో ఆసంసంస్థానాధిపతి 'తూమురామచంద్రారెడ్డి.స్వయంగాకవి.ఆయనరచన"అలమేల్మంగాపరిణయం"వారియాశ్రితకవి వేముల రామాభట్టు.ఆయన"గౌరీవిలాసం"యిదియీనాకీఅముద్రితమే!
అందులో నాయిక చెలికత్తెలుచేస్తున్నకోలాహలాన్ని, యెంతరసరమ్యంగా,వర్ణించారోమనమిప్పుడు పరిచయంచేసికొందాం!
సీ:అబ్జాస్య నేనంచు నదురుటింతయులేక,
నంచక నడకఁ జూపించునొకతె;
బింబోష్ఠి నేనంచు భీతిగైకొనక రా
చిలుకకు పద్యంబుఁ జెప్పు నొకతె;
ననబోణి నేనంచు నళుకునొందకను కో
కిలకు గానపుధాటిఁ దెలుపు నొకతె;
నీల భుజంగ రోమాళి నేనని తత్త
రించక శిఖిని యాడించు నొకతె;
గీ: ఘనకచనటంచు, సాంకవ గంధిననుచు,
రామననుచు, శరద్ద్విజ రాజకిరణ
హాసనను గర్వముల బొంది, యతివలిట్లు
క్రీడలొనరింతురా పైడి మేడ లందు;
నేను అబ్జాస్యని,అనిభయపడకుండా ఒకతెహంసలకేనడకలునేర్పుతున్నదట. భయమెందుకట? హంసలు తామరలను తింటాయికనక. దీనికిసమాధానంయెత్తుగీతిలో వివరంచాడు.ఆమెఘనకచయట. (మేఘంవంటి జుట్టుకలది)హంసకుమేఘమంటేభయం! అదీసంగతి!
నేనుబిబోష్ఠినే(దొండపండువంటిపెదవిగలది)యనేభయంలేకుండా చిలుకకు పద్యాలు నేర్పుతోందటమరొకతె.చిలుకలు దొండపండుతింటాయిగదా!అందుకు భయం. కానీ యామె "సాంకవగంధి" యనిచెప్పిభయనివారణ కారణమునునిరూపిసాంకవగంధంఅంటే జవ్వాది.అదిజవ్వాదిపిల్లినుండివస్తుంది.పిల్లంటే చిలుకకుభయం!
నేను నన బోణి ననే భయంలేకుండా(చిగురాకువంటిమేనుగలది) కోకిలకుపాటలునేర్పుతున్నదటమరొకతె.భయమెందుకు?కోకిలకు చిరుగులాహారం.అందుకు. రామననియామెభరోసా!( మనోహరమైనదాననని, కోకిలకూతయుమనోహరమేగదా)
నేను నీలభుజంగరోమాళినేయని(నల్లనిపామును బోలిననూగారుగలది) భయపడక,మరియొకతెనెమలికి నాట్యమునేర్పుచున్నదట. పాముకునెమలికి విరోధం. అందుకుసభయం,కానీ,శరచ్చంద్రుని వంటిముఖముకలదటయామెకు.అదియామె ధైర్యానికికారణం.శరత్కాలంవస్తే నెమళ్ళకు కామముడిగిపోతుంది.అందువల్లభయపడనవసరములేదని,సమాధానం.
ఈవిధంగాపరస్పరవిరధ్ధమయిన విషయాలను చక్కగాసమన్వయ పరుస్తూయెంతచక్కగావర్ణన నిర్ వహించాడోచూడండి!