నాకు శివునితో పోలిక
ఫాల నేత్రమ్మేది పంచాస్త్రునెదిరింప
గడుసుజటలవేవి గంగ నిల్ప
మురహరి తోడేది ముప్పురాల జయింప
గణములేవి ధూర్త గుణము తప్ప
కంఠాన విషమేది కారుణ్యమునుదెల్ప
శంకరార్పణమేది శంక దప్ప
ఆలు మగనిలోన అర్ధభాగంబను
సాంబశివునికేను సాటి గాను
ఇట్టి వైరుధ్యముల ప్రక్కనెట్టి నేను
సామ్యమొక్కటి చూపింప సాహసింతు
పాప ధారిని తాగూడ పాపదాల్పు
చాలునీమైత్రి తనతో మసలగ నేను
నేను పాపమును
ధరించినవాడను ఆయన’పాప’లు అంటే
పాములు ధరించినవాడు . ఇద్దరికీ ఉన్న సామ్యము ఒకటే. 'పాప' శబ్దము ఆయనకు అన్వయమైనది (తెలుగులో) నాకూ'పాప'
శబ్దము ఉన్నది సంస్కృతములో. ఇద్దరమూ 'పాప' ధారులము కావున (‘పాప’ కలిగిన వారమైనందువల్ల)
మాకు సామ్యము చెల్లినది అని నా ఉద్దే్శ్యము.
చెరుకు రామ మోహన్ రావు
No comments:
Post a Comment