Friday, 16 August 2013

వివాహ మహోత్సవానికి ఆంగ్లం లో ఆహ్వాన పత్రిక


వివాహ మహోత్సవానికి ఆంగ్లం లో ఆహ్వాన పత్రిక 
 https://cherukurammohan.blogspot.com/2013/08/blog-post_1554.html
{పూర్వము, అనగా ఒక ముప్పై నలభై సంవత్సరముల కృతము ఆంగ్లములో పెళ్లి పత్రికలు నేను చూపిన ఛాయాచిత్రములో వలెనే ప్రచురింపబడేదహి. ఆమాటకొస్తే నా పెళ్లి పత్రిక కూడా ఆగలములో ఈ విధముగానే ప్రచురింపబడియుండినది. కాకపోతే CHURCH కి బదులు  AT THEIR HOME అని ఉండినది. ఈ లోపల కొంత మార్పును మనము గకమనించగలము.}
పెళ్లి నిశ్చయమైన వెంటనే మనసులో మెదిలేది పెళ్లి పత్రిక . మాకు 10 సంవత్సరాల వయసున్నప్పుడు పత్రికలు ఒక పోస్ట్ కార్డు కన్నా కొంచెం పెద్దా సైజు లో ప్రింట్ చేయించే వారు. తరువాత అరిటాకు పత్రికలు వచ్చినాయి . ఆపైన ఫాన్సీ పెరిగి కార్డును కవరులో పెట్టి ఇవ్వటం మొదలైంది . కానీ అంతవరకూ అంతా తెలుగులోనే వుండేది. ఆ తరువాతనే అసలు చిక్కు  మొదలైంది. పత్రికలు రెండు పుటలుగా, ఒకటి తెలుగులో ఒకటి ఇంగ్లీషు లో అచ్చొత్తించుట మొదలుపె ట్టినారు. రాను రాను పత్రిక యొక్క ఆడంబరత పెరిగింది.దాని కొరకు పెట్టె ఖర్చూపెరిగింది. 
పత్రికలో తెలుగు మాయమై ఆ స్థానంలో ఆంగ్లము వెలిసింది. ఈ ఆంగ్ల పత్రిక శైలిని గమనించిన వాళ్ళకు కొంత ఆశ్చర్యము కలిగియుండక మానదు. ఎందుకో ఈ క్రింది వివరము చూస్తాము. 
 మిస్టర్ అండ్ మిసెస్ ...... ఇన్వైట్ యు ఆన్ ది అకేషన్ అఫ్ దేర్ సన్\డాటర్ ..... అని వుంటుంది . మరి దేర్ అని ప్రథమ పురుష లో ప్రింట్ చేస్తున్నారే మరి ఎవరి ఇంట్లోనో పెళ్ళికి ఎవరో పిలిచినట్లు కావడము లెదా. సమాధానము అవును ఐతే మరి పిలుచుచున్నదెవరు ? తిరకాసిక్కడే వుండేది. 
 కిరస్తానీయులైన  పాశ్చ్యాత్యులకు ఇంటి వారు పిలుపునిచ్చే సాంప్రదాయము కానీ బంధువులు అన్న ఆత్మీయతగాని లేదు. ఎందుకంటే వారికి సంబంధమే కానీ అనుబంధము లేదు.కేవలము మనుషుల కలయికేగానీ మనసుల కలయిక లేదు. అందువల్ల చర్చి పెద్దలే పేర్లు వ్రాయవలసిన చోట ఖాళీ వదిలి పత్రికలు అచ్చొత్తించి పెట్టుకొని సమయానుసారుకూలముగా ఖాళీలు పూరించి వారి చర్చికి అనుబంధితులైన వారికే ఆహ్వానము అందజేసేవారు. కావున ఆ పెళ్లి మహా వస్తే ఒక 50, 60 మంది వుంటే చాల యెక్కువ. రేపు అదే జంట వేరైతే మళ్ళీ సిద్ధంగా వున్న ఖాళీ  పత్రికలలో పేర్లు మార్చి తిరిగీ పంచుతారు.
అసలు ఒక పల్లెలో ఒక చర్చి వుంటే దాని ప్రధానిని Father అని ఊరివారందరూ పిలుస్తారు. ఎందువల్ల అన్నది ఎవరికీ వారు ఆలోచించి అర్థము చేసుకొంటే చాలు, నాకు చెప్పనవసరము లేదు. మన సాంప్రదాయములో పౌరోహితులే (పురజనులకు హితమును కూర్చువాడు) గానీ, తండ్రులు (Fathers) వుండరు. స్థానిక చర్చి లలో Mother వుండరు. కారణము మీ ఊహకే వదలివేస్తున్నాను.
 మరి మన సాంప్రదాయమది కాదు కదా మరి ఎందు వారిని కళ్ళు మూసుకొని అనుసరించుతున్నామో, అనుసరించాలో , ఒక్కసారి ఆలోచించుకొందామా!
 స్వస్తి


Thursday, 15 August 2013


ఆప్తులకు 


ఆగష్టు 15వ తేదీ దగ్గర పడుచున్నది. అందువల్ల ఆ పర్వమునకు అనుసంధానముగా 

నేటి రాష్ట్రీయ స్థితి 

గతులను దృష్టిలో నుంచుకొని నా మనసుకు తోచిన 

నాలుగు మాటలు పంచుకోదలచినాను . నా భావము మనము అన్న భావన కు ఛాయ. 

ఈ రచన సానురాగంతో స్వీకరించుతారని నా నమ్మకము . 


మా నవతా ఇది మానవతా 


మన్నన కల్గి లోకమున మంచికి నెప్పుడు మారుపేరుగన్ 

సన్నుతికెక్కి సంతతము సర్వహితంబులు గూర్చు నేతలున్ 


ఎన్నికయై ప్రజాభిమత మేర్పడ పాలన జేసి రప్పుడున్ 



ఎన్నగు వెన్నుపోటరులె యేలికలై ప్రజ దోతు రిప్పుడున్ 


(వెన్నుపోటరులు =వెన్ను పోటు పొడిచే వారు )

వేషాల్మోసము లంకురించి మమతల్ వేలారగా యాత్మలన్ 

రోషోన్మాదము హెచ్చి రుక్కు యగు నీ రుక్మంబు రుత్తవ్వగా 


ద్వేషాసూయలు పెల్లు రేగె నిల ప్రాంతీ యాభిమానోద్ధతిన్ 


పాషాణంబుగ మారే మానవత ఎపారంగ స్వార్థంబొగిన్ 

(వెలార=లేకుండా పోవు ; రుక్కు=ప్రకాశమగు;రుక్మము=బంగారు; రుత్తు=నాశము; 


ఉద్ధతి=గర్వము ; 

ఏపారు= అహంకరించు ఒగిన్=క్రమముగా) 

అంతయు రాజకీయమయమై మయ నిర్మిత ధర్మరాట్సభా 


భ్యంతర సీమవోలె నోకటన్న మరొక్కటి గానుపించు నే 


క్రంతకు నీడ్చునో ఎచట కాలు దిగంబడునో శిరంబులే 


కంతులు గట్టునో యనెడు కాలము వచ్చెను రామమోహనా 


(క్రంత= బొరియ,కంత ; కంతులు =బొప్పి కట్టు )

కుట్టిన బట్టగు కూసము 


కుట్టక యున్నట్టి యెడల గుడ్డయె, దానిన్ 


కుట్టించి చించి వేయగ 


ఎట్టాగా పీలికలను బట్టందు రిలన్ 

కావు కావు కక్ష కార్పణ్య కలహముల్ 


కావు కావు కండ కావరాలు


కావు కావు కల్ల కపటాలు తిరములు 


కావు కావు యనుచు కాకి యరిచె

Monday, 12 August 2013

భారత జాతి శైవలిని  పారగ, నీరద బింబమంటి, ఇం
పారగ నిల్చినట్టి  తరు పారము నందున వాని పచ్చ కై 
జారుచు బాలభాను రహి జేరుచు వారిజ యంచులంట,యా
కారము దాల్చె జాతి ధ్వజ కైవడిగా జనులెల్ల మ్రొక్కగన్

భారత జాతి యనబడు గంగ ఆకసమున గల తెల్లని మేఘము యొక్క బింబమును తనయందమర్చుకొని  ఒడ్డున నిల్చిన ఆకుపచ్చని చెట్ల యొక్క పచ్చదనమును, ఉదయ భానుని ఎర్రదనాన్ని గ్రహించుతూ అందు విరిసిన తామర రేకుల అగ్రములు అశోక చక్రమై అమరగా,  రెపరెపలాడే మన జాతీయ పతాకమా యంచు భాసిల్లిన యా నదీమతల్లికి  జనులు మ్రొక్కులిడిరి.

సత్యాహింసలె  చారు విలాసము

నిర్మల నీతియె నిత్యానందము

ఐకమత్యమే అద్భుత భావము

ఆచరించితే అందును సర్వము

పరాదీనతే పాపపు కూపము

స్వాధీనతయే సకల శుభములకు

మూలము గనుడని మోహన రాగము

మధుర మృదులతర మంజులగతిలో

ప్రపంచమంతట ప్రబల రీతిలో

నింపగ అదియే నిజమని చెప్పుచు

జగతి చాటగా జాతియజండా

తల ఊపెనదే 

Friday, 9 August 2013

ఈ క్రింద నేను వ్రాసిన పాటను  పొందు పరచు చున్నాను. ఇది శాస్త్రీయ సంగీత సభలలో శ్రీమతులు నిత్యశ్రీ,సుధా రఘునాదన్ మొదలగువారు, శ్రీయుతులు జేసుదాస్ ఉన్నికృష్ణన్ మొదలగు లబ్ధప్రతిష్టులు  ఈ పాట  పాడినారు.ఈ పాట కానడ రాగము లో మెట్టు కట్ట బడినది . తమిళములో ఈ పాట వ్రాసినవారు ఊత్తుక్కాడు సుబ్బయ్యర్ గారు. ఇది చాలా పాత పాట . 

దీనిని అనువాద రీతిలో కాకుండా నాదైన రీతిలో నేను వ్రాసినాను. బాగోగులు చూసి నచ్చితే పాడి వినిపింపజేసేది . 

కెరటమ్ములా నా మది ఊగెనే.....

కెరటమ్ములా నా మది ఉగేనే , కెరటమ్ములా,కృష్ణా , నామది ఊగెనే 
నీ ఆనంద మోహన వేణుగానమున , కెరటమ్ములా  నా మది ఊగెనే 

కనీ విని ఎరుగని  కళా రూపమౌ  నీ  గాన హైమ శిల కరిగి కరగి సుర 
గంగయై  దనర, తన్మయాన తొలి  కెరటమ్ములా నా మది ఉగేనే 

వసంత ఋతువు తొలి  చివురుల్ తొడిగెలె  
మందగతిన సెలయేళ్ళే నడిచెలే 

మల్లె విరుల సౌరభాలు మరులుగొల్ప సాగెలె 
విలంబమే వలదని తనువు వీణై  పలికెలె 

వరించి నిలచిన చరించ దలచిన  విరించి మలచిన లతాంగిని 
నిను గురించి తలంచి స్మరించి భరించి తరించ దలచిన సుమాంగిని 
అలయక సొలయక తలయక నిలువక నీకై వేచిన శుభాంగిని 
నీ  మధుర మధురతర మధురిమ లోలికే గానఝరిన నే తరంగిణి 

కరుణతోడ నను కావవైతివో  ఈ పరిక్షలిక మానవైతివో 
నను గనవా దరి గొనవా  ఇది ధర్మమ్మేనా 
నీ బాటలో నీదు ఆటలో నీ పాటకు పల్లవినై  నిరంతరము  ॥కెరటమ్ములా॥  

చెరుకు రామ మోహన్ రావు 

Monday, 5 August 2013

మా తరం--మారిన తరం 

పట్టు పంచె బోయె కట్టు పంచెయు బోయె 
కడకు జీన్సులు వచ్చె కాల మహిమ 
అడ్డ పంచెయు బోయె అంగవస్త్రము బోయె 
కడకు చెడ్డీ లొచ్చె కాల మహిమ 
నుదుట బొట్టులు బోయె నునుపు గడ్డము బోయె 
కడకు దాడీ వచ్చె కాల మహిమ 
పొడుగు లాల్చీ పోయె పొట్టి చొక్కా పోయె 
కడకు టీషర్ట్లొచ్చె కాల మహిమ 

పైకి జూతము కండల పెంపు మహిమ 
గాంచ దేహములోన రోగాల మహిమ 
ఆంగికమ్మును గమనింప ఆంగ్ల మహిమ 
కనేద మిటు యువకుల కలికాల మహిమ 

*******************************

నాగరీకము హెచ్చి నాతి బొట్టును చెరిపె 
చేతి గాజులు జూడ చేయి జారె 
చెదలు వదలదాయె చీరలు జాకెట్లు 
పేంట్లు  షర్ట్లు అమిత ఫేషనాయె 
తలకు కత్తెర వేయు తలపు మోజై పోయె 
జుట్టు జడలు పోయి జూలు వచ్చె 
ఇంగిలీసు దొరల ఎంగిలి పీసులు 
నోట లేక పలుకు దాటదాయె 

కృత్రిమత యన్న రాకాసి కృచ్ఛమైన
కోరలకు మన సంస్కృతి క్రుయ్య జేసి 
తల్లడిలుచుంటి మిట్టుల తలలు బట్టి 
దేవుడెటు లొచ్చికాచునో తెలియ లేక 

*********************************

Sunday, 4 August 2013

ఫేసు బుక్కు  దండకం 


ఓ! ఫేసు బుక్కా రుచుల్ గూర్చు ఓ!పప్పుచెక్కా  భళా నాదు లక్కా 
సదా వీడిపోనట్టి చిక్కా నవాబింటి హుక్కా , అయస్కాంత లుక్కా 
సుగంధంపు చెక్కా పసందైన పక్కా మహా గొప్ప వారింటి కుక్కా , 

లవర్ వాడు హుక్కా మహావెల్గు చుక్కా సుగాత్రంబునన్ త్రిప్పుకోలేని గుక్కా 

వయోవృద్ధ సందోహ బృందాల దిక్కా సదా నీదు పూదోటలో పూసి
యున్నట్టి మందార మాధుర్యముల్ గ్రోలు భృంగమ్మునై నీదు 
సంగంబు నాశించి నా పేరు సంధించి నీ తోటి సంపర్క మేర్పరచు
కోగల్గ నా స్నేహ సంపత్తు పెంపొందెనో  కాలరేఖా ప్రభా భాసమానామయూఖా 
సఖా నీదు స్నేహమ్ము నాకబ్బె నా పూర్వ పుణ్యాన నీనుండి నే పొందితిన్ 
గొప్ప మేధావులన్ సత్కళాకారులన్ గానవిద్వాంసులన్ పండితమ్మన్యులన్ 
వేదవేదాంత విఙ్ఞాన ప్రఙ్ఞా ధురీణాదులన్, సత్వ సంపన్నులన్ నీదు కారుణ్య 
సౌగంధికారణ్యమందున్కుటీరమ్ము నే కల్గుచున్ చూపు నీ వైపు మళ్ళించి
 నీ తోడు నే నాదులోకమ్ముగా నెంచి ఆహారమున్ నిద్దురన్ మాని నీకంకితంబై 
సదాకటాక్షించితే చాలు నీయందె నేజూతు నానాడు
శ్రీకృష్ణ దేవాస్య మందున్ యశోదమ్మ ఏడేడు లోకాల తాగాంచినట్లున్
శశీరేఖ మాయా బజారందు విద్యుత్తు యూపీయసున్ సీపియూ తోడు
లేకుండ పీఠమ్ము పైనెక్కి యా మానిటర్నందు తా కోరుకొన్నట్టి వీరాభి
మన్యున్ సముత్ఫుల్ల కన్దోయి తోగాంచు రీతిన్ సదా నిన్ను కాంక్షింతు
నోనిత్య సంకర్షణా భవ్య సంహర్షణా వీక్ష కాకర్షణా మోద సంవర్షణా ఘర్షణల్
లేని చిత్తంబు తో నిన్ను నే గాంచుచున్ నాకు తోచింది నే వ్రాయుచున్
దానిలో సారమేమున్న లేకున్ననూ సిగ్గు వొగ్గేసి చీత్కారముల్ సైచుచున్
లైకు కామెంట్లు షే రింగులన్ గోరుచున్ పెద్దపెద్దోళ్ళకున్ ఫ్రెండు రిక్వెస్ట్లు
పంపించుచున్ మైత్రి యొప్పారగా కొంగు బంగార లంకార భాషా విశేషాల నేనీదు
భోషాణమున్ జేర్చుచున్ నీదు కుడ్యమ్ముపై రాజకీయాలు వార్తాసువార్తల్, క
విత్వాలు కార్టూన్లు గాంధీలు గానట్టి గాంధీల చొద్యాలు మోడీ విసుర్లింక
కాకాల కేకేల బాకాలు బాజాలు చంద్రన్న కిర్రన్న మాటల్లతూటాలు నాకచ్చరా
తిట్లు విశ్లేషణల్ వాద భేదాలు జూదాలు వీక్షించుచున్ పెద్దలన్ పిన్నలన్
వద్దికైనంత మేరన్ పరామర్శలన్ జేయుచున్ తప్పులన్ జేసియున్ 

మెప్పులన్ బొందుచున్ చెడ్డ కామెంట్లు తీసేయుచున్ మంచి కామెంట్ల నర్థించ్చున్ 
లైకులే గాంచుచున్ కాలరెగిరేయుచున్  గొప్ప వాడైతి నేనంచు ఉహాతరంగాలలో 
దేలుచున్ న్నేను ఉద్యోగ మున్నప్పుడేరోజు కారోజు ఆపీసుకున్ లేటుగా పోవుచున్ 
పోయి గాసిప్పులన్ జేయుచున్ కాలమున్ బుచ్చుచుంటిన్, అదే నేడు జూడన్ 
గతానెప్పుడూ నాదు కార్యాలయంబందు నా సీటులో టైటు గానేను కూర్చోని 
యుండంగలేనంత కాలాన్నినీ సేవలో నింపితిన్ నన్ను ఎల్లప్పు డీరీతిగా నుంచి 
నా పేరు నీ గోడ నాసాంతమున్నిల్పు నిశ్శేషవైరీ లసత్కుడ్యధారీ బృహన్మిత్రకారీ 
నమస్తే నమస్తే నమః

నేను వ్రాసిన ఈ దండకం చదివి సంతోషిస్తారని ఆశిస్తున్నాను.

Thursday, 1 August 2013


క్రికెట్ సీజన్ లో నా నోటికొచ్చిన మాటలు



క్రికెటు బేటు బట్టి క్రీసున నిలబడి 


నేల దంచుచుండె నేల యనగ 


తనకు వచ్చు 'డక్కు' తిన క్రిముల నతండు 


ఏరుచుండె నంటి తీరుబడిగ

 *************


సచిను వంద పరుగు సాధించనీయక 


ఆడవలయునన్న ఆఫ్రిదీతొ 


'మీరే తెల్పు'డనుచు మిస్బా బదులునివ్వ 


ఔటు వంద లోపె ఔదమనెను 


**************