Thursday, 7 May 2020

వసుచరిత్రలో సంగీత-సౌందర్య దర్శనం


వసు చరిత్రలో సంగీత-సౌందర్య దర్శనం!

రాయల నాటి అష్ట దిగ్గజాలలో ఒకరైన భట్టుమూర్తి గారు (రామరాజ 

భూషణుడు) తన వసుచరిత్రలో సౌందర్యముతో బాటూ సంగీతమును  గూడా 

మేళవించి చెప్పిన ఈ అందమైన పద్యం ఒకసారి తిలకించండి..

మ: " పదమెత్తం గలహంసలీల , నధర స్పందంబుఁ సేయన్ ,శుభా

స్పదమౌ రాగ కదంబకంబు , శ్రుతిఁ జూపన్ శ్రీవిలాసంబు , కే

ల్గద లింపన్ సుకుమార పల్లవ న వైలాలక్ష్మి , వీక్షింప ష

ట్పదియున్ బొల్చుఁ , దరంబె కన్నెఁ గొనియాడన్ ,గేయవాక్ప్రౌఢిమన్;

వసుచరిత్రము: తృతీయాశ్వాసము -59వ పద్యము;


సందర్భము: మంజు వాణి ప్రణయ దౌత్య ము; వసురాజుతో గిరికను గూర్చి చెప్పుట;

రామ రాజ భూషణుడు సాహిత్యమునందే గాదు ,సంగీతమునందుఁ గూడ 

నిష్ణాతుడు. సందర్భమును బట్టి అవకాశము ననుసరించి సంగీత విషయములను 

గూడ వసుచరిత్రమునందు నిపుణముగా నుపదేశమొనరించెను. ప్రస్తుత పద్యంలో 

గిరిక సౌందర్యముతో బాటు ఆమెగాన కళానైపుణ్యమును గూడ జోడించి 

నిపుణముగా నీపద్యమును విరచించినాడు.శ్లేష వలన (శబ్దశక్తి మూలక శ్లేష ) ఇది 

సాధింపబడినది.

అర్ధములు:- పదము-కాలు,పాట; కలహంసలీల- రాయంచవలె,హంసధ్వనివలె

రాగకదంబకంబు:- కడిమిపూల యెర్రదనం, రాగమాలికలు; శ్రుతి- చెవి

నాదముయొక్కస్థాయి;

శ్రీవిలాసంబు- శ్రీకారపు సొంపు, శ్రీరాగము ; నవ+ఏలాలక్ష్మి-కొత్త ఏలకీతీగె సొగసు

కొత్తవియగు ఏలల యందము; షట్పది- తుమ్మెద, షట్పద గానము;

వ్యాఖ్యానము: ఆకన్య కాలు కదిపినదా కలహంస నడకలే! పెదవి విప్పెనా 

అనురాగరాగ రంజితమే! చెవి జూపెనా శ్రీకార శోభలే! చేయికదపెనా వసంత 

లాస్యమే(నవ యేలకీలతలూగిన చందమే) వసంతలక్ష్మివలె ఉంటుందని చెప్పటం) 

కన్నులు తెఱచినదో తుమ్మెదల చాలనమే (కనులు నల్లనై తుమ్మెదలను 

బోలియుండుననుట) తుమ్మెదలకు ద్విరేఫమను నామాంతరమున్నది. రారా 

యనుట.కన్నులు విప్పెనా అది ప్రణయాహ్వానమే! యిట్టి లోకోత్తర సౌందర్యముగల 

కన్య గిరిక యని సౌందర్యపరమైన యర్ధము.

సంగీతము:- ఈకన్య పాట నందుకొన్నదో హంసధ్వని రాగమే! పెదవి విప్పెనా 

రాగమాలికలే !శ్రుతి ప్రకటమొనరించెనా శ్రీరాగమే!(పలుకును) చేతులతో తాళము 

నందుకొన్నదా సుకుమారమైన యేలలను గీతములే!(పలుకును) కనులు దెరచి 

చూచెనా షట్పదులే!( తుమ్మెదపదములు పలుకును) ఆమెసంగీత పాటవమును 

యేమని చెప్పను? అంటోంది మంజువాణి. బాహ్య సౌందర్యమేగాదు, మనోల్లాసాన్ని 

కలిగించే సంగీతంలోకూడా గిరిక దిట్ట!

యని చెపుతున్నది. ఇదీ భట్టుమూర్తిగారిసౌందర్య సంగీత "జుగల్ బందీ"!






















Saturday, 4 April 2020

కనక దుర్గమ్మ


కనక దుర్గమ్మ
https://cherukurammohan.blogspot.com/2020/04/blog-post.html
ధాన్య కటకమును రాజధానిగా చేసుకొని ఇంచుమించు క్రీ.శ. 540 ప్రాంతములో విష్ణుకుండిన వంశజుడగు మహేంద్రవర్మ పరిపాలించేవాడు. ఆయన కుమారుడు మాధవ వర్మ. ఒకనాడు మాధవ వర్మ వనవిహారార్థమై, యువకుడగుటచే అవసరమునకు మించిన వేగముతో తన రథముపై, నాటి అత్యంత సుందరమగు వనమునకు, బయలుదేరినాడు.
అనుకోని విధముగా ఆ రథ మార్గమునకు అడ్డముగా ఒక పశుపాలకుడగు బాలుడు ఆ త్రోవన నడిచే ఆవులను తప్పించి, తానూ తప్పుకోలేక రాతచాక్రములకు ఆహుతియైపోయినాడు. యువరాజు తన రథమును ఆపక ప్రయాణమును కొనసాగించినాడు. లేక లేక కలిగిన ఆ బాలుని తల్లికి విషయము తెలిసి తన కుమారుని శవము వద్దకు వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించి రాజునకు ఫిరియాదు చేయ నిశ్చయించుకొని రాజధానికి బయలుదేరి పోయి తన బాధను రాజుకు మొరపెట్టుకొనింది. ధర్మ పథమును దాటని రాజు నేరస్థుని కనుగొని, ఆ బాలుడు మరణించిన రీతిగానే మరణ శిక్ష విధించుతానని నిండు సభలో ప్రతిన బూనినాడు.
తక్షణము తన గూఢచర్యవర్గమునకు తగిన ఆదేశములిచ్చి నేరస్థుని పట్టి తెమ్మన్నాడు.
రాజాజ్నకు కట్టుబడిన ఆ గూఢచారులు వాస్తవమును రాజు చెవిన వేసినారు.
పుత్రహీన యైన ఆ తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టి ధర్మమునకు స్వపర భేదము లేదని చాతదలచిన వాడై, యువరాజును బంధించి ఆ గోపబాలుడు మరణించిన స్థలమునకు తెమ్మని ఆజ్ఞానొసగినాడు.  తానూ రథముపై బయలుదేరి నిర్ణీత ప్రదేశమును జేరినాడు.
ఆబాలుడు మరణించిన తీరుగనే యువరాజు కూడా రథము తొక్కిడితోనే  మరణించవలెనని దండన విధించినాడు.
ఆయన తన భటులకు ఆజన యొసంగినా ఎవరూ ముందుకు రాలేదు. ఎట్టకేలకు రాజే దండన అమలుపరచినాడు, జరిగిన ఈ వృత్తాంతమునంతా అక్కడే  కొండపైనున్న ఒకదేవతామూర్తి రాజు ధర్మనిరతికి హర్షించి బంగారు కాసులు వర్షిన్చుతయే గాక బాలకులిరువురినీ తన కరుణాకటాక్ష వీక్షణతో బ్రతికించినది.
ఆతల్లినే వారంతా కనక దుర్గ అను పేరుతో ఆలయము నిర్మించి పూజించినారని కథనము.
ఆ ప్రాంతమే నేటి విజయవాడ.
స్వస్తి.

Wednesday, 25 March 2020

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు...


ఆంద్ర మహా భారతము-విరాట పర్వములో 
ఒక పద్యము
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు...
తిక్కన భారతంలోని విరాట పర్వంలోని పద్యమిది. అజ్ఞాత వాసగ్రస్తులైన పాండవులు విరాట రాజు కొలువు చేరి వివిధ ఉద్యోగములలో తమ తమ ప్రతిభానుసారముగా చేరిపోతారు. విరాట పర్వము  అన్న పేరు ఈ విధముగా ఆ విభాగమునకు వచ్చినదని తలుస్తారు. నాకు ఇందులో మరియొక విశేషము అగుపించుచున్నది. మహాభారతములోని 18 పర్వములలో ఇది ‘విరాట్’ పర్వము. ఇది అత్యున్నతము అత్యుత్తమము అయినది. క్షామ కాలములో వానలు కురియుట మొదలుకొని, అనేకములగు మానజీవితములోని బాధలకు, విరాట పర్వ పఠనము’ పరిష్కారమని పెద్దలు చెబుతారు.అందుకే ఇది ‘విరాట్ పర్వము’ అయ్యింది. ఇందులోని, ఈ క్రింద కనబరచిన పద్య విమర్శ మన ప్రస్తుత కార్యము. ముందు పద్యమును చదువుదాము.
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడువారాశుల
కడపటి కొండపై గలయ బ్రాకు
నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు
 నర్తనశాల చలనచిత్రములో ఉపయోగించుకొన్న ఈ పద్యమును ఘంటసాల వారు బృహన్నల వేషధారియైన N.T. రామారావు గారి కొరకు పాడుతారు. కానీ నిజానికి విరాట పర్వములో ఈ పద్యమును ద్రౌపది చేత పలికించుతాడు తిక్కన. ఇందుకు ఒనకూడిన సమయ సందర్భాలను గూర్చి విపులముగా తరువాత చర్చించుకొందాము. పద్యము తెలుగువారి సొంతము. ఈ పద్యాలాపన ప్రక్రియ మనకు మరాఠీ రంగస్థలమునుండి వచ్చినదని పెద్దలు చెబుతారు. పద్యమును ఆలపించుట చేత  నోరు, గొంతు, శ్వాస శుభ్రపరుపబడుతాయని వైద్యులు చెబుతారు. కానీ మనము STATES వారు చెబితే లేక చేస్తే మనము చేస్తాము. వాళ్లకు ఈ పద్య ప్రక్రియ లేదు కాబట్టి వారు చెప్పారు. వారు చెప్పరు కాబట్టి మనము చేయము.
ఇక పద్యార్థమునకు పోదాము.
ఎవ్వాని వాకిట - ఎవని వాకిట్లో, ఇభ - ఏనుగుల, మద - మద ధారల చేత ఏర్పడిన, పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, రజోరాజిన్ - రజము అంటే ధూళి రాజి అంటే గుట్ట రజోరాజి అంటే గుట్టగా పడుతున్న ధూళి చేత, అడగు - అణగు (అణిగిపోతుందో)
అతని వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు. ఆ ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారుతోంది. రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు. వాళ్ళేమో కిక్కిరిసి ఉన్నారు. ఆ రాపిడికి ఆ రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది. ఆ ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి.

ఎవ్వాని చారిత్రము - ఎవని చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై - గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు - గొప్పదనుము లేదా పద్ధతి (అంటే ధర్మజుడు వినయమునకు ఒరపురాయి లేక గీటురాయి అని అర్థము) , కఱపు నేర్పునో.
 ఎవని చరిత్ర గురువై వినయముయొక్క గొప్పతనమును లోకమున చాటుతుందో

ఎవ్వని కడకంట - ఎవని కనుకొలకుల, నివ్వటిల్లెడు - వ్యాపించే లేదా అతిశయించే, చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన, సంపదలు, ఈను చుండు ప్రసాదించుతుందో  (ప్రసాదిస్తూ ఉంటుందో)
ఎవని కడకంటి చూపు గొప్ప సంపదలను ప్రసాదిస్తుందో
ఎవ్వాని గుణలతలు - ఎవని గుణములనే లతలు, ఏడు వారాశుల - సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు - అంతటా ప్రాకుతున్నాయో
ఇక్కడ గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి. ఎక్కడికి? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి. అంటే ఎవని గుణములు ఈ భూమండలము దాటి నభోమండలమును అనగా స్వర్గాది లోకములను చేరుచున్నాయో,
అతడు,
భూరి ప్రతాప - అధికమైన ప్రతాపమను, మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత, దూర విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ, గర్వాంధకార - గర్వమనే పెను చీకటిని (పారద్రోలి), వైరి వీర - శత్రు వీరుల యొక్క, కోటీర - కిరీటములందు ఉన్న, మణి ఘృణి - మణుల యొక్క కాంతి, వేష్టిత - చుట్టబడిన, అంఘ్రితలుడు - పాదములు కలిగినవాడు.

అతను తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారమును  పారద్రోలినవాడు, అలా గర్వం తొలగింపబడిన ఆ రాజులు ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు. ఆవిధముగా గర్వోపశమనము గలిగినతరువాత, వాఋ ఆయన పాదములనంటి మ్రొక్కుటచే  కిరీటములలో పొదగబడిన మణిగణ దీప్తిచె విరాజిల్లు పాదములు గలవాడై ఉంటాడు.
ఈ కొండవీటి చాంతాడు సమాసం ఎందుకో ఒకసారి తడిమి చూద్దాము. ఇందులో అందమంతా, ఏవిధముగా అయితే కిరీతములకు మణులను తాపినట్లు తిక్కన గారు  ఈ సుదీర్ఘ సమాసములో అక్షర మణులను తాపినారు. ఆ విధమగు పొహళింపు, ఆయనకు దక్క అనితర సాధ్యము. సాధారణ వాక్యములలో చెప్పునపుడు వచ్చే విభక్తి ప్రత్యయాలు సమాసములలో అదృశ్యమైపొతాయి. క్రియలు విశేషణములుగా మారిపోతాయి. "మహా ప్రదీప దూర విఘటిత గర్వాంధకారము" - మామూలు భాషలో చెప్పాలంటే "మహాజ్యోతి చేత గర్వమనే చీకటి దూరంగా కొట్టబడింది" అని చెప్పాలి. సమాసంలో అన్ని పదాల అవసరం ఉండదు. పటిష్ఠమైన సమాస గ్రధనం వల్ల సాధించే క్లుప్తత యిది. కవిత్వం తెలిసినవాళ్ళకి దీని అవసరం తెలుస్తుంది.

తర్కించి చూడగా మ్నాత్రమే ఇతను ఎవరు అన్నది బోధ పడగలడు.  ఇన్ని విశేషణములు కలిగినవాడు కేవలము  మానవుడని అనుకొనదగునా! మానవుడే ఆయెను పో సాధారణమైన మనిషి కాగలడా! ఎవరీతను? ధర్మ నందనుడు అంటే యమ ధర్మ రాజు అంశచే  జనియించిన వాడు. పాండవ జ్యేష్ఠుడు. ఇక్కడ ధర్మజుడు ఎంత ఉదాత్త చరితుడో ఈ పద్యము ద్వారా మనకు తెలియబరచుచున్నాడు తిక్కన.
సాధారణంగా ఎక్కువమందికి  ధర్మరాజును గూర్చి  తెలిసినది తక్కువ. కారణము ఏమిటంటే మనది వినికిడి భారతము కాబట్టి ఎక్కువగా భీమార్జునులను గూర్చి వారి శౌర్య పరాక్రమములను గూర్చి వింటాము. కానీ యీ పద్యాన్ని చదివిన తరువాత "ఆఁ! ధర్మరాజు నిజంగా యింత గొప్పవాడా!" అని ఎవరూ అనుకోక మానరు. ఈ పద్యం ఎత్తుగడలోనే మనసులని కట్టిపడేసే అద్భుతమైన అలంకారాన్ని ప్రయోగించినాడు తిక్కన. దానికి దీటైన నడక. ధర్మరాజు వైభవాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించినాడు. రెండవపాదంలో అతని స్వభావాన్నీ, ప్రసిద్ధినీ వర్ణించినాడు. మళ్ళీ మూడవపాదములో  అతని సంపద్విభవముల  గూర్చి తెలుపుతూ  నాల్గవపాదములో అతని కీర్తి ప్రసిద్ధులను కీర్తించుతాడు. ఇంతగా కీర్తించిన పిదప ఆయన అసలు సిసలైన గుణాన్ని ఎత్తుగీతిలో మూడు పాదాలు ఆక్రమించే ఒక సుదీర్ఘ సమాసములో దట్టించి చెబుతాడు. అది ఏమిటి అంటే  అతని ప్రతాపము. అదేకదా క్షత్రియులకు అలంకారమగు అతి ముఖ్య గుణము. ఇక్కడ మనము పైన చెప్పుకొన్న మాటను చెప్పి పద్యమును ముగించుతాడు.
ఇదీ తిక్కన పద్య రచనా శిల్పనైపుణ్యము. ఆయన ఈవర్ణనకు ఎన్నుకొన్నది సీస పద్యము. అట్టి పద్యమును ఎన్నుకొనుటకు ముఖ్యకారణము ధర్మజునిలో తాను తలచిన విశేషణములన్నీ  ఒకే పద్యములో  ఇమిడ్చి ఎత్తుగడ మొదలుకొని ఆసాంతమూ  ఏవిధముగా నడిపించి  ఎట్లు  ముగించితే అది చదివేవారి వినేవారి హృదయాంతరాళాలలో  ముద్రపడిపోతుందో ఆ విధముగా నడిపించినాడు తిక్కన. ఆయన శబ్దాలంకారములకు అధికమగు ప్రాదాన్యతనివ్వాడు. ప్రాధాన్యత అంతా రసపుష్టికే! అచ్చతెలుగు పదాలకు ఆయన అక్షర భాండాగారము. అట్లని సంస్కృత, తత్సమ శబ్దములు వాడడా అంటే సమయోచితముగా వాడి సందర్భమునకు నాటకీయత సృష్టించుతాడు. ఉదాహరణమునకు ఇదే విరాట పర్వములో ఉత్తర గోగ్రహణమ్మున ‘భీష్మద్రోణ కృపాది ధన్వి నికరాభీలమ్ము.....’ అన్న పద్యము ఒక ఉదాహరణ మాత్రమే! అదే అంకములో పద్యము బృహన్నలచే పలికిన్చునపుడు ‘ప్రాణములు తీపన మున్ వినవే బృహన్నలా...’ అని అనిపించుతాడు. ‘నర్తన శాల’ చలన చిత్రములో ఘంటసాల గారు ఆలపించినపుడు అసలు తన కలలోనో ఊహలలోనో తిక్కనతో మాట్లాడి ఈ విధముగా ఆలపించినాడేమో అనిపిస్తుంది.  అంతటి మహాకవియగు తిక్కన   యీ పద్యమును అంత గొప్పగా ఒక అసామాన్య శిల్ప కారుని వలె మలచినాడు కాబట్టే పద్యము అంత ప్రసిద్ది పొందినది.

మనము ముందే చెప్పుకొన్నాము, నర్తనశాల చిత్రమును చూసినవారు యిది బృహన్నల ద్రౌపదీ భీములతో  చెబుతున్న పద్యమని అనుకుంటారు. అందులో దర్శకుడు అటువంటి ఒక సన్నివేశమును సృష్టించి, అందుకు తగిన విధముగా ఆ రీతిన చిత్రీకరించినారు. వాస్తవానికిది భారతములో బృహన్నల చెప్పినది కాదని ముందే చెప్పుకొన్నాము. ఈ పద్యమును చెప్పినది ద్రౌపది.

ఇపుడు ద్రౌపది యొక్క గుణమును గూర్చి తెలుసుకొందాము. శ్రీ కృష్ణుని రాయభారమునకు పంపు సమయములో ద్రౌపది తనను గూర్చి తానె ఈ విధముగా చెప్పుకొంటుంది.
వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు బాండు భూ
వరునకు గోడలైతి జనవంద్యుల బొందితి , నీతి విక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్ , సహజన్ముల ప్రాపు గాంచితిన్
సరసిజనాభ! యిన్ని ట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్.
ద్రౌపది తన సౌశీల్యమును గూర్చి తానే చెప్పుకొనే ఈ పద్యములో అక్షరమక్షరమూ స్వభావోక్తే కానీ అణుమాత్రము కూడా అతిశయోతి లేదు. ఈ పద్యమును గమనించితే కఠిన సమాసమే లేకుండా ఇది నడుస్తుంది. పాఠకునికి లేక శ్రోతకు ఆమె గుణముల లోని అక్షరమక్షరమూ తెలియవలెనను నెపముతో సరళమైనభాష లో శ్రీకృష్ణునికి చెప్పించినాడు. వేరొక విధముగా గమనించితే, ద్రౌపది కృష్ణునికి పాండవులంతా తమ అభిప్రాయములను తమదైన శైలిలో చెప్పినారు. ఇపుడు ద్రౌపది వారి పోకడలకు భిన్నముగా తన మనసులోని ఆణువణువూ అర్థము చేసుకోను విధముగా ద్రౌపది చెప్పింది. వివరణాత్మకముగా పరిశీలించితే ద్రౌపది మహాభారతంలో మనకు పట్టువీడని పడతిగా పైకి కనిపిస్తుంది. కాని, ఆమె - అత్యంత అరుదైన సౌందర్యరాశి, సద్గుణశీల, సూక్ష్మగ్రాహి, సహనశీలి, చమత్కారి, అభిమానవతి, పౌరుషంతో కూడిన నీతి గల్గినది. అధర్మం పాలిట కాళరాత్రి. ధర్మాధర్మ విచక్షణశీల. ధర్మసంస్థాపనకు మార్గదర్శి, క్షమ ద్రౌపది. మహాభారత సంగ్రామానికి కారణభూతి. నారీలోకానికి శిరోమణి, గృహస్థ్ధధర్మానికి నిలువెత్తు సాక్ష్యము, భర్తల అనురాగము పొందటంలో అద్వితీయ స్త్రీరూపము. ఇచ్ఛా జ్ఞాన క్రియారూపమైన త్రివిధ శక్తుల సమాహారము ద్రౌపది. తిక్కన మహాకవి ఘంటమనే ఉలి చెక్కిన స్త్రీశక్తిస్వరూపిణి ద్రౌపది. ఇంతటి మహాఖ్యాతి పొందిన వినయగుణశీల ద్రౌపది.


పై పద్యములో అంత స్వాభిమానిగా అగుపించే ద్రౌపది, భర్తయే కానీగాక, ధర్మరాజును గూర్చి అంతా పొగడుతుందా అంటే అక్కడే ఉంది చమత్కారము. ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. ఆమె ఇచ్ఛా జ్ఞాన క్రియారూపమైన త్రివిధ శక్తుల సమాహారమని ముందే చెప్పుకొన్నాము. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది.
ఇపుడు ఈ పద్యమునకు సంబంధించిన సందర్భమును పరిశీలించుదాము. సైరంధ్రి రూపములో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవాన్ని పొందుతుంది. కామాంధుడైన కీచకుడు ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికి వచ్చి నిలుస్తాడు. అప్పుడామె విరటుని నిలదీస్తుందిఆ దారుణానికి పరిష్కారము చెప్పమని. దూరమునుండి యిది గమనించుచున్న భీముడు కోపము పట్టలేక పక్కనున్న చెట్టును పెరికే ప్రయత్నము చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపది తో ‘నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడుచున్నావు అంటాడు. నిండు సభలో మిక్కుటమగు స్వాభిమానము కలిగిన గృహిణిని ఇట్టి మాటంటే సహించగలదా? కానీ ద్రౌపది ఆవేశమునకు  లోనుకాలేదు. తనలోని విచక్షణకు తలుపు తెరచింది. సభా మర్యాద, పాతివ్రత్యమూ మాట అటుంచి ఆవేశము చెలియలికట్ట దాటితే తమ నాటకము బయటపడి మళ్ళీ వనవాసం చెయ్యవలసి వస్తుంది. నాట్యకత్తెలా తైతక్కలాడుచున్నావు అన్న మాటను పట్టుకొని  తన చాకచ్యవంతమైన మాటలతో ధర్మరాజు గుండెలో ఒక్క పోటుపొడిచి వెళ్ళిపోతుంది. ఆమె అన్న మాట పద్య రూపములో ఇది:
"నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు
పెద్దవారి యట్ల పిన్నవారు
గాన, బతుల విధమ కాకయె శైలూషి
గాననంగ రాదు కంక భట్ట

అట్లగుటం జేసి నాకు నాట్యంబును బరిచితంబ. మత్పతి శైలూషుండ కాడు కితవుండును గావున జూదరియాలికి గఱువతనంబెక్కడియది"
"అయ్యా కంకభట్టూ! నా భర్తే ఒక పెద్ద నటుడు. పెద్దల తోవలోనే కదా చిన్నవాళ్ళూ వెళతారు. అంచేత నా భర్తల తీరే నాదీను. నన్ను నాట్యకత్తె అని తూలనాడుట ఎందుకు? స్వతహాగా నా భర్తగొప్ప నటుడు. (శైలూషుడు అంటే నటుడు) అంతేకాదు పెద్ద జూదరి (కితవుడు అంటే జూదరి) కూడాను. జూదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి?" అంటుంది. ఇక ధర్మరాజు తలెక్కడ పెట్టుకోవాలో చూడండి. ఇదండీ తిక్కన గారి నాటకీయత. అందుకే ఆయనను ‘కవిబ్రహ్మ’ అన్న బిరుదము ఆయన కవితా శక్తికి అద్దము పట్టింది.

ఇదంతా ఈవిధముగా జరిగిపోయిన పిదప, తనలో రగులుతున్న బాధను తీర్చుకొనేందుకు , భీమసేనునికి చెప్పుటకు వస్తుంది. కీచకుడు తనని చేసిన అవమానాన్ని వివరంగా చెపుతుంది. తన దుఃఖాన్ని వెళ్ళగక్కుతుంది. "మీ యన్న పెద్దతనము జూచితి నేమందు ననిల తనయ" అంటుంది. "ఇంతా జరిగిన తరువాత, మీ అన్నగారు చూపించిన పెద్దతనం చూచినావుగదా, ఇంక నేనేమనగలను?" అని నిలదీస్తుంది. నన్నా కీచకుడవమాన పరచినపుడు,  ధర్మరాజు ఎలా చూస్తూ ఊరుకున్నాడని ప్రశ్నిస్తుంది. అప్పుడు భీముడు ద్రౌపదికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. ధర్మరాజే కనక ఆపకపోయి ఉంటే తానా కీచకుని విరటుని  అక్కడే చంపేవాడినని అంటూ, అదే జరిగితే తిరిగీ వనవాసానికి వెళ్ళవలసి వచ్చేదనీ, అప్పుడందరూ తమ ఇరువురినే తప్పుబట్టే వారనీ చెపుతాడు. అంచేత ధర్మరాజుని మెచ్చుకోవాలి కాని పరుష వాక్కులు పలుకకూడదు అంటాడు. అప్పుడు ద్రౌపది తన ఆవేశము అనర్తదాయకమని గ్రహించి, భీమునితో ధర్మరాజు గొప్పదనం తనకు తెలియక కాదు అంటుంది. అంతేకాక అప్పుడు ధర్మరాజు గుణగణములను పొగడుట  మొదలుపెడుతుంది. ఆ వరసలో చెప్పిన పద్యమే ఇది.
ధర్మరాజుని పొగిడి ఊరుకోదు. అంతటివానికి యిన్ని కష్టాలు వచ్చాయే అని వాపోతుంది. ఆ తర్వాత వరుసగా భీమసేనణ్ణి, అర్జునుణ్ణీ, నకుల సహదేవులనీ పేరుపేరునా పొగుడుతుంది. వారికొచ్చిన కష్టాలకి బాధపడుతుంది. చివరికి తనంత దానికి వచ్చిన కష్టాలని చెప్పుకుంటుంది. మనకు ఇందులో ఆమె లౌక్యము కూడా ప్రస్ఫుటమౌతుంది.
ఇందఱకు నిన్నిభంగుల నిడుమ గుడువ
వలసె ధర్మతనూభవు వలన జేసి
దాయ లొడ్డిన మాయజూదంపుటురుల
బడి కులంబున కతడిప్పాటు దెచ్చె
ఇదీ ద్రౌపది వాక్పటిమ. ఇదీ ద్రౌపది దృఢమైన సంపూర్ణమైన వ్యక్తిత్వ చిత్రణ!
ఇంచుమించు ఇదంతా సంస్కృత భారతంలో కూడా ఉన్నదే. కాని తిక్కన దాన్ని మరింత నాటకీయంగా తీర్చిదిద్దాడు. సంస్కృతంలో ద్రౌపది వచ్చీ రాగానే తన గోడంతా వినిపించేసి, పాండవులందరి గొప్పతనాన్నీ వర్ణించేసి వాళ్ళిన్ని కష్టాలు పడుతున్నారే, దీనంతటికీ కారణం ధర్మరాజే అని ముగిస్తుంది. భీముడు ఆ తర్వాత మాట్లాడతాడు. కాని తెలుగు భారతంలో ద్రౌపది భీముల మధ్య మాటలు నాటకంలో సంభాషణల్లా సాగుతాయి. అది తిక్కన రచనలోని నేర్పు. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే  ద్రౌపది ధర్మజుని ఎంత మెచ్చుకొన్నా చివరకు తప్పు మాయా ద్యూతపు ఉరులలో చిక్కుకొన్న ఆయనదే తప్పని తెలుస్తుంది.
మహనీయుల కావ్యముల మాన్యతను గుర్తించండి. భారతము వంటి మహాకావ్యమును వ్రాసిని వ్యాసుని, ఆంధ్రీకరించిన కవిత్రయమును పాదాభివందనము చేస్తూ శెలవు తీసుకొంటున్నాను.
మన దృష్టిలో సంఘసంస్కర్తలను నుద్ర వేయించుకొన్న మహనీయులు కొందరు తెలుగు గొప్పదనమును సర్వనాశనము చేసినారు. కనులు తెరువండి వాస్తాన్ని గమనించండి, తెలుగు గొప్పదనమును జగతికి చాటండి. తెలుగును పునః ప్రతిష్ఠించండి. 
ఆంధ్రభారతము తలమసనికము. అది శిరౌధార్యము.
స్వస్తి.

Wednesday, 4 March 2020

నేతి వడ్డన-ఒక చాటువు


నేతి వడ్డన-ఒక చాటువు
ఆనంద తాండవ పురే ద్రవిడస్య గేహేl
చిత్రం వశిష్ట వనితా సమం ఆజ్య పాత్రంl
విద్యుల్లతేన పరిణుత్యతి తత్ర దర్వి l
దారాంబు లోకయతి కస్య నయోగి సిద్ధాఃll
చిదంబరేశ్వరునిది ఆనందతాండవము. అందుచే చిదంబరమునకు ఆనందతాండవ పురము అన్నది మరియొక పేరు. అవి భోజనవిక్రయశాలలు లేని రోజులు. అతిథి కొరకై గృహస్తు వీధుల కూడలిలో వేచి ఆయనను సాదరముగా ఆహ్వానించి ఇంటికి గొంపోయి ఆయన తృప్తి మేరకు కొసరి కొసరి వడ్డించి తినిపింపజేసే రోజులవి. ఆ ఊరికి క్రొత్తగా వచ్చిన బ్రాహ్మణుని ఒక గృహస్తు తనయింటికి భోజనమునకు సాదరముగా అహ్వానించినాడు. సంతోషముతో ఆ అగుంతకుడు ఆ గృహస్తును అనుసరించినాడు. ఇంతవరకు అంతా సవ్యముగానే జరిగింది.
కాళ్ళు కడుగుకొని వచ్చి అతిధి ఆసనము అలంకరించినాడు. అరటియాకు కడిగి, వేసి వండిన వంటకము వడ్డించినది ఆ ఇల్లాలు. ఆ ఇల్లాలి చేతిలోని నేతిపాత్రాయే కనిపించీ కనిపించనంతగా ఉంది. వడ్డన ముగిసిన తరువాత అభికరణము అంటీ అన్నముపై నేతిచుక్క రాల్చి ఇక భోజనము చేయండి అనుట సాంప్రదాయము.  ఇక భోజనము ఆరంభించండి అని ఆ ఇల్లాలు, అతిథితో  అనుటతో ఆతంతు ముగిసింది అని ఊహించినాడు అతిథి. నిజానికి అతనికంటికి ఆ రాలినచుక్క కనిపించలేదు. ఆ బ్రాహ్మడు  అన్నములో పప్పు కలిపి నెయ్యి వడ్డించమని అడిగినాడు. మిళ్ళె నేతిపాత్ర అడుగునకు ఠంగుమన్న శబ్దముతో తాకించి ఉరుము శబ్దమును గుర్తు చేసిన ఆయువతి ఆ మిళ్ళెను వ్రేళ్ళతో అత్యంత లాఘవముగా కదిలించి నేతి చినుకును రాల్చింది. అతిధికి ఉరుము వినిపించింది మెరుపు కనిపించింది, కానీ అన్నము మేతుకులపై నేతి చినుకులు మాత్రము అగుపించలేదు. భోజనము ముగిసిన పిదప తన ఊరు వెళ్లి ఆ బాపడు తన మిత్ర బాంధవులతో పై ఉదంతమును, ఇల్లాలి చాకచాక్యమును పైవిధముగా వర్ణించి చెప్పినాడు.
వర్ణనా చాతుర్యమును గమనించండి ఎంత గొప్పగా ఉన్నదో!
స్వస్తి.

Sunday, 23 February 2020

వేదమార్గము


వేదమార్గము
యావైదికమనాదృత్సకర్మ స్మారేతిహాసకం|
మోహాత్యమాచరే ద్విప్రోనసపుణ్యనయుజ్యతే||''
ఎవరైతే, వేదమార్గ ప్రతిపాదితమైన కర్మలను వదలివేసి అనగా ఆచరించక మాని, అన్యములైన వానిని ఆచరింప చూచినచో వారికి పుణ్యగతులు లేవనిరి.


Sunday, 16 February 2020

ఆయుర్వేదము


ఆయుర్వేదము ఉపోద్ఘాతము
నేను వైద్యుడను కాను. ఈ వ్యాసములో ఏ వ్యాధికి ఏమందులు వాడవలెను అన్న విషయమును గూర్చి వ్రాయబోవుట లేదు. నా తపన అంతా ఇది ఒక మహత్తర వైద్యశాస్త్రము అన్న విషయమును నాకు దొరకిన  ఆధారపూర్వకముగా దొరికిన అంశములను మీముందుంచే ప్రయత్నము చేయుచున్నాను.
ఉపన్యాసమునకు రచనకు ఎంతో తేడా ఉంది. ఉపన్యాసములో తప్పులు దొరలినా గాలిలొ కలసి పోతాయి. రచన అజరామరముగా నిలచిపోవచ్చు. శాస్త్ర, పురాణ, ఇతిహాసములవలె. అట్లని నేను వ్రాసే ఈ నాలుగు మాటలూ చిరస్థాయిగా నిలుస్తాయి అని చెప్పుట లేదు. అది ఆ రచన యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఇక అసలు విషయముయోక్క ఉపోద్ఘాతమునకు వద్దాము.
పునరుజ్జీవనం (Renaissance)మధ్య యుగాల తరువాత యూరోపియన్ సాంస్కృతిక, కళాత్మక, రాజకీయ మరియు ఆర్థిక “పునర్జన్మ” యొక్క తీవ్రమైన కాలం. సాధారణంగా 14 వ శతాబ్దం నుండి 17 వ శతాబ్దం వరకు జరుగుతున్నట్లు వర్ణించబడింది. చీకటి నుండి కాంతి వైపునకుపునరుజ్జీవనం ప్రారంభమైంది. దీనిని "చీకటి యుగము" అని కూడా పిలుస్తారు, ఈ యుగం తరచుగా యుద్ధం, అజ్ఞానం, కరువు మరియు మహమ్మారి, ప్లేగ్ వ్యాధుల కాలము  అని కూడా అంటారు.
అసలు ఆయుర్వేదానికీ ఈ పునరుజ్జీవన విషయానికీ గల సంబంధమేమి అని మీలో ఒక సంశయము ఈపాటికే ఉత్పన్నమై ఉండవచ్చు. ఈ ప్రస్తాపన ఎందుకు తెచ్చినానంటే,
పునరుజ్జీవనం (Renaissance) వచ్చేవరకు పాశ్చాత్యులలో చెప్పుకోదగ్గ చరిత్ర లేదు. మరి మనదో, అప్పటికే ఎన్నో లక్షల సంవత్సరములనుండి నడచుచున్న చరిత్రగలిగిన దేశము. అంత చరిత్ర ఉంటె అంత సంస్కృతి అంత విజ్ఞానము మనవద్ద ఉన్నట్లేకదా!
అంటే మనవద్ద ఆయుర్వేదమే కాకుండా,
Human Anthropology -మానవ వికాస శాస్త్రము
Geography - భూగోళ శాస్త్రము
Human Geography - మానవ భూగోళ శాస్త్రము
Political Administration - రాజ్కనీతి శాస్త్రము
Military Administration - సైన్య నియంత్రణ శాస్త్రము
Defense Strategies - సైనిక వ్యూహా శాస్త్రము
Architecture - వాస్తు శాస్త్రము
Communication Engineering - ప్రసార శాస్త్రము
International Relations - అంతర్జాతీయ సంబంధములు, దౌత్య సంబంధములు
Trade Commerce and Industries వర్తక వాణిజ్య పరిశ్రమ విభాగము
Human Relations మానవీయ సంబంధములు
Astronomy ఖగోళ శాస్త్రము
Astrology జ్యోతిష్ శాస్త్రము
Aeronautics వైమానిక శాస్త్రము
Forestry and Animal Husbandry వన మరియు జంతు శాస్త్రము
Family Ethics కుటుంబ విధానము
Marriage వివాహ విధానము
Human Customs and Beliefs మానవీయ సంప్రదాయాలు మరియు విలువలు
Town Planning and Village Administration పట్టణ, గ్రామ వాస్తు మరియు నియంత్రణ
Diplomatic Relationships దౌత్య సంబంధములు
Naval Administration నౌకాయాన విధివిధానములు
Metallurgy లోహశాస్త్రము
Sculpture Art and Architecture శిల్ప మరియు నిర్మాణ శాస్త్రము
Music and Drawing-సంగీతము చిత్రలేఖనము వంటి 64 కళలు
Mathematics - గణిత శాస్త్రము
External Affairs విదేశీ వ్యవహారములు
Civil Administration పౌర శాస్త్రము
Moral Science నీతి శాస్త్రము
Science of Warfare = యుద్ధతంత్ర శాస్త్రము
Leadership qualities నాయకత్వ లక్షణములు
ఇన్ని శాఖలలో మనదేశము నైపుణ్యము సాధించియున్డినది. మరి అటువంటి సనాతన దేశ సంస్కారమును, సంపత్తిని ఎంతవరకు నిలుపుకోగలుగుచున్నాము. ఈ భావమును మనసున నింపుకొని ఈ వ్యాసము చదువ మొదలుపెట్టండి.
రేపటినుండి అసలు విషయము......

ఆయుర్వేదము

ముందు ఈ దేశము యొక్క గొప్పదనమును గూర్చి ప్రపంచ సాహిత్య  పితగా కొనియాడబడిన అమెరికన్ దేశవాసియగు  మార్క్ ట్వైన్ ఏమన్నాడో ఒకసారి గమనించండి అతని మాటలలోనే:
It was Mark Twain who once said: So far as I am able to judge, nothing has been left undone, either by man or nature, to make India the most extraordinary country that the sun visits on his rounds. Nothing seems to have been forgotten, nothing overlooked.
అంతటి భారత దేశము మనకొసంగిన అమృత భాండమే ఆయుర్వేదము. ‘ఆయుః’ అంటే ఆయుస్సు ఆరోగ్యము ఆయుస్సులది అవినాభావ సంబంధము.
ఆయుస్సు యొక్క ఆయుస్సు ఎల్లప్పుడూ ఆరోగ్యముతోనే ముడిపడి ఉంటుంది. ‘విద్’ అన్నదాతు జన్యము వేదము. వేదము అంటే సులభమగు రీతిలో అర్థము చెప్పుకోనవలసివస్తే ‘జ్ఞానము’ అని చెప్పుకొన వచ్చును. ఈ ఆయుర్వేదమును ఉపవేదము అనుటకూడా కద్దు. దీనిని మనకు నాలుగవ వేదమగు అథర్వణ వేదము అందిస్తూవుంది.
అట్టి ఆయుర్వేదము శరీర రుగ్మతలకు మూలకారణములేమని చెప్పిందో చూడండి.
క్రోధశోకభయాయాస వృధాన్నభోజన తాపోన్నలాన్ లవణ క్షార ...... రక్తపిత్త ప్రకోపయేత్
కోపము, నిస్పృహ, దుఃఖము, పరిధి లేని భయము, అధికమైన అలసట, శ్రుతిమించిన సోమరితనము, అధిక లవణ క్షార ఆహార పదార్థ వినియోగము అన్నవి ప్రాణఘాతుక రోగాకారకములు. కానీ ఈ దుర్గుణములను దూరముంచుటకు ఆచరించవలసిన
ఆరోగ్య సూత్రములు అతి సులభములు.
నిత్య హిత మిత ఆహార సేవి , సమీక్షకారి, దాత, సమః, సత్యాపర, క్షమావాన్,ఆప్తోపసేవీ భవేత్.
‘అనునిత్యమూ హితమూ మరియు మితమైన ఆహార సేవనము, చేతికందిన పనిని చేయతగునా చేయనగునా అన్న ఆత్మసాక్షితో కూడిన విచికిత్స, దానగుణము కలిగియుండుట,  తన పర అన్న భేదభావా రహితుడైయుండుట, సత్యపాలకుడగుట, క్షమాహృదయుడైయుండుట, తనను ఆశ్రయించినవారికి అండదండగా నిలుచుట’ అన్న ఈ నియమములను నిష్ఠతో పాటించిన వాడు ఆయురారోగ్యములనెడు ఐశ్వర్యమును కలకాలమూ కలిగియుంటాడు.
గణితము మరియు సైన్సు(science అన్న మాట శాస్త్రము అన్న పదమునకు సమానార్థకము కాదు.) లో, విరళ సిద్ధాంతము(nonlinear system) లో  input=నివిష్టము output=ఉత్పాదితము నకు అనులోమానుపాతంలో ఉండదు. ఈ విరళ సిద్ధాంత సమస్యలు  ఇంజనీర్లు, జీవశాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు మరియు అనేక ఇతర శాస్త్రవేత్తలకు ఆసక్తికరమైన విషయములు, ఎందుకంటే విరళ సమీకరణములు (Nonlinear Equations), కాలక్రమేణా అస్థిర వర్గము( variables) లోని  మార్పులను వివరిస్తూ, అస్తవ్యస్తంగా, అనూహ్యంగా లేదా ప్రతికూలంగా కనిపిస్తాయి, అతి సులభమైనమైన సరళ వ్యవస్థల(Linear System)తో విభేదిస్తాయి.
పైన తెలియజేసిన విషయమును సాధారణ పాఠకునికి అర్థమయ్యే రీతిలో చెప్పవలసి వస్తే ఒక శాఖాహారి తన కంటి ఎదుట అసంకల్పితముగా ఒక జంతువధ చూస్తే, అతను మైకముతో పడిపోవచ్చు, భయంకరమైన తలనొప్పి రావచ్చు, కడుపులో దేవినట్లయి వాంతులు వచ్చే ప్రమాదము కలుగవచ్చు, మాట పెగలక పోవచ్చు, అన్నము సహించక పోవచ్చు. ఇన్నివిధములుగా ఒకే విషయము ఒక వ్యక్తిపై ప్రభావము చూపగలదు. అందుచేత ఆరోగ్యము కోరుకొనే వ్యక్తికి చిత్త శాంతి, మానసిక సంతులనము ఎంతో అవసరము.
ఒకసారి మనకందరకూ తెలిసిన ఒక ప్రాకృతిక పరిశీలనను పునశ్చరణ చేసుకొందాము. అమావాస్య పున్నమి వేళలలో చంద్రునియొక్క ఆకర్షణకు లోబడి సముద్రము అలలు ఉవ్వెత్తుగా ఎగసి పడుతుంటాయి. సముద్రజలము అల్లకల్లోలముగా అగుపించుతుంది. తగిన ధ్యాస పెట్టకపోవుటవల్ల మనకు తెలియని విషయము ఏమిటంటే మానవ శరీరములో కూడా అధికాంశము నీటిచే నిండియున్నది. మరి అటువంటప్పుడు చంద్రుని ప్రభావము శరీరముపై లేకుండా ఎట్లు వుంటుంది? అందుకే ఆయుర్వేదములో, రోగ చికిత్స చేయుటయందు గ్రహచారమునకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఈ విషయమును తేలికగా కొట్టివేసే నేటి అపరిపక్వ వైద్యులు కూడా Scientists అని నమ్మే న్యూటన్ మరియు గలీలియోలిరువురూ జోతిష్యమును నమ్మి అడిగిన ఎంతోమందికి జాతకాలు, ప్రతిఫలాపేక్షతో చెప్పేవారు. గ్రహచార విధానము వైద్యశాస్త్రమునకు తగినదే కానీ చీమలపుట్ట పగిలినట్లున్న నేటి జ్యోతిష్కుల వద్దకు భవిష్యత్తును గూర్చి తెలుకొనుటకు పోవుట అర్థవంతమగు విషయము కాదు. అట్లని జ్యోతిషము శాస్త్రము కాదు అని నేననుటలేదు.
ఆయుర్వేదము ఒక ఋషీశ్వరుని అంతర్దృష్టి, అనుభవము, ఆత్మసాక్షి కలిగిన పరిశీలన పరిశోధన కలిగిన  వైద్యశాస్త్రము. అది కేవలము, ఆలోపతి వైద్యమువలె ఆత్యయిక విషయ నియంత్రణ అనగా emergency case-control studies వంటిది కాదు. అంటే ఆయుర్వేదము, పిండికి పిడుక్కు ఒకే మంత్రము వలె కాదు. అది వ్యాధి ఒకటే అయినా రోగి రోగికీ మందు మారుతుంది. ఆయుర్వేదములో చికిత్స ఈ క్రింది విధములుగా విభజించబడినది.
1.క్ష్వేళా విసర్జన (Detoxification)-పంచకర్మ
2. పథ్యము (Diet)
3.యోగక్రియ(Yoga)
4. మూలికా వైద్యము(Herbal Medications)
5. ధ్యాన ప్రార్థనలు(Meditation and Prayer of any God)
6. ఆయుర్వేద శస్త్ర చికిత్స (Ayurvedic Surgery)
ఆయుర్వేదము అందున  శస్త్ర చికిత్సను గూర్చి  వేల సంవత్సరముల క్రితమే ప్రపంచమునకు  మొట్టమొదటి సారిగా తెలిపిన దేశము ఈ భారత దేశము. శస్త్ర చికిత్సకు ఆద్యుడు శుశ్రుతుడు.
క్లిష్టమైన కపాల శస్త్ర చికిత్స లో నైపుణ్యతకు తగిన రంపములనుపయోగించి చికిత్సను విజయవంతము చేసేవారు. ఇదికాక శరీరములో పేరుకొన్న రాళ్ళుతీయుట,  నాసికా నిర్మాణ చికిత్స, ప్రసూతి లేక శిశూదయము, గర్భ విచ్ఛిక్తి, గర్భాశయ నిర్మూలనము, శల్య చికిత్స, శరీరములోని వ్రణ నిర్మూలనము(Tumor Surgery) మొదలగునవే కాక ఇంకా అనేకానేక శాస్త్ర చికిత్సల గూర్చి తన శుశ్రుత సంహితలో శుశ్రుతుడు ఎంతో విపులముగా విశధముగా వ్రాసినాడు. శాస్త్ర చికిత్సకు సంబంధించిన 127 శాస్త్ర చికిత్సా పరికరములను తన గ్రంధములో చిత్రముల రూపములో చూపించినాడు. ఆ రోజులలో రోగికి శస్త్ర చికిత్స చేయుటకు గాను అపస్మారక స్థితి కలిగించుట (Anaesthesia) సమ్మోహన క్రియ (Hypnotysing) మొదలగు విషయములలో అధికముగా నైపుణ్యము కలిగియుండినారు. ఈ రోజుకు కూడా ఆయుర్వేదములోని క్షారసూత్ర ప్రక్రియ యే మొలల(Piles) శాశ్వత నిర్మూలనకు ఉపకరణము. భగంధ్రము (Fistula)నకు కూడా ఆయుర్వేద శస్త్ర చికిత్స శాశ్వత పరిష్కారము. అపూతిక (Antiseptic) చికిత్సలో కూడా నాడు ఎంతో ముందంజ మన పూర్వులు ముందంజ వేసియుండినారు. స్పోటకమునకు  (Small Pox)టీకాలు వేయుటకు ఉపయోగించే నేటి Lancet (శస్త్రము) నాటి శస్త్రమునే పోలియుంటుంది. అసలు ఎడ్వర్డ్ జెన్నర్ ఆవిష్కరణగా చెప్పుకొనే ఈ విధానము, ఆయన శుశ్రుత సంహిత నుండి సంగ్రహించినదే! అసలు Dr. T.Z. Holwell, నాటి వంగ ప్రాంతమున 10 సంవత్సరములు ఈ టీకాల విషయములో, విశ్రుతముగా పరిశోధనలు ఆయుర్వేదములో జరిపి, తాను పొందిన అనుభవసారమును London Royal College of Physicians 1747లో  ప్రకటించుట కూడా జరిగినది. అంటే ఈ టీకాల విధానము వేళా సంవత్సరముల పూర్వమే భారత దేశమున యుండినదని తెలియజేసినాడు.
ఆయుర్వేదము-2

ఆయుర్వేద వైద్యుడగుటకు ఔషధ చికిత్స, శస్త్ర చికిత్స రెండూ నేర్చుకొని తీరవలసిందే! విద్యార్థి ఎక్కువ కాలము గురువు వద్ద ఉండవలసి వచ్చేది. పలు విధములగు రొగములను, రోగులను పరీక్ష, గురువు సారత్యములో చేస్తూ నేర్చుకొంటాడు శిష్యుడు. శరీర శాస్త్రమునకు తప్పక శవముల ఆవశ్యకత నాడుకూడా ఉండేది. ఇంకా ముఖ్యమగు విషయమేమిటంటే సూక్ష్మదర్శనిలు(Mycroscopes) కనిపెట్టబడని వేల సంవత్సరముల క్రితమే చరకుడు, శుశ్రుతుడు శరీరములోని ప్రతి అంగము కణముల (Cells) సహాయముతో ఏవిధముగా పని చేస్తాయి అన్నది నిశితముగా తెలియజేసినారు. వ్యాధి మూలకములగు 20 విధముల సూక్ష్మ జీవులను గూర్చి తెలిపినారు, ముఖ్యముగా హృద్రోగమును గూర్చి.

ఆంగ్ల శబ్ద కోశములో HEART అన్న మాటకు అర్థమయితే ఇచ్చినారు కానీ దాని పుట్టుకను గూర్చి నేను పరిశీలించినంత మేరకు కానరాలేదు. నా ఉద్దేశ్యములో 'హృత్' శబ్దము నుండి HEART పుట్టివుంటుంది. మనలనుపాలించిన వారు కదా మన భాషను తమ భాషకు మాతగా ఒప్పుకొనుటకు ఆభిజాత్యము అడ్డము వచ్చి  యుండవచ్చు.
సంస్కృతములో మాత్రము నిరుక్తమున ఎంత హృద్యముగా 'హృదయము' అన్న మాటకు వ్యుత్పత్తి చెప్పినారో అది తెలిపిన వారి మేధస్సును వర్ణింప నాతరము కాదు. వారు హిమవన్నగము వంటివారయితే నావంటి వారందు పిపీలిక సమానులు (పిపీలికము=చీమ). ఈ శ్లోకమును గమనించండి:
తదేతత్ త్ర్వక్షరంహృదయమితి, హృత్ ఏకం మహాక్షరం ద ఇత్యేకాక్షరం
యమిత్యేకం యివం హరతేర్ దదాతేరాయతేర్ హృదయ శబ్ద నిరుక్తః
'హృ' అంటే హరతి = గ్రహించునది
'' అంటే దదాతి = తిరిగి ఇచ్చునది
'' అంటే అయతి= ప్రవహింప జేయునది
మొత్తము గుండెయొక్క కార్యక్రమమంతా మూడు అక్షరములు కల ఒక పదములో వచ్చివేసినది. దీనిని 'సింధు' అనటము కూడా కద్దు. నదులు సంద్రమునకలిసి తిరిగి వర్షముతో నదులుగామారి సంద్రమున కలుస్తున్నాయో రక్తము కూడా గుండెతో అదే సంబంధమును నిరంతరమూ కలిగియున్నది కదా!
హృదయము యొక్క అర్థమును గూర్చి తెలుసుకొన్నాము. ఇపుడు ఆ హృదయమును గూర్చి వేదములోని మంత్రపుష్పమునందు ఏమి తెలిపినారో చూద్దాము.
మంత్రపుష్పమును విధిగా పూజల్లోనూ, వ్రతములలోనూ, దేవాలయములలోనూ పూజావసాన సమయమును చెబుతూ వుంటారు. అందువల్ల ఆ మంత్రమును మన హృదయమునకు సంబంధించిన మేరకు మీ ముందుంచుతూ నాకు చేతనయినంత వరకు  వివరించుతాను.
పద్మ కోశ ప్రతీకాశగ్౦ హృదయంచా ప్యదో ముఖం ||
అధో నిష్ట్యా విత స్త్యాన్తే నాభ్యాముపరి తిష్టతి|
జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహత్ ||
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం|
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మంత స్మిన్సర్వం ప్రతిష్టితం ||
తస్యమధ్యే నుహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః|
సోగ్రభుగ్విభ జన్తిష్ట న్నాహార మజరః కవిహ్ ||
తిర్యగూర్ధ్వ మధ శ్శాయీర శ్మయస్తస్య సంతతా|
సంతాపయతిస్వం దేహమాపాద తలమస్తకం ||
తస్యమధ్యేవ హ్నిశిఖా అణీ యోర్ధ్వా వ్యవస్దితః|
నీలతో యద మధ్య స్ధాద్విద్యుల్లెఖేవ భాస్వరా ||
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణూపమా|
తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్ ||
మంత్రార్థమును తెలుపుటకు మునుపు మంత్ర పుష్పము అన్న పేరును గూర్చి తెలుసుకొందాము. పుష్పములు స్నిగ్ధత సౌకుమార్యము కలిగినవి. వానిలో శ్రేష్ఠతమమయినది తామర. అందుకే ఎర్ర తామర లక్ష్మీ నివాసమయితే తెల్లతామర వాణీ విలాసము. మన శరీరములో కూడా ఒక ఎర్రతామర మొగ్గ వుంది. మంత్రపుష్పము దాని గూర్చియే తెలుపుతుంది కాబట్టి అది మంత్రపుష్పము అయినదని నా ఊహ.
ఇపుడు ఈ మంత్రార్థమును నా శక్తి మేరకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను. నావేవయినా తప్పులు వుంటే విజ్ఞులు సవరించగలరు. హృదయము తలక్రిందులుగా వున్న తామర మొగ్గవలె భాసిల్లుచున్నది. నిష్ఠి అంటే తెలుగులో ముచ్చెన గుంత అంటారు. ఈ గుంత అటు కంఠానికీ ఇటు ఎదకు మధ్యన వుంటుంది. దానినుండి క్రిందికి వితశ్శాంతిఅంటే జానెడు దూరము, మరియు నాభ్యం ఉపరి అంటే బొడ్డునుండి పైకి జానెడు దూరములో ఈ మొగ్గ వున్నది. మరి కొలత ఏవిధముగా చేయాలి అన్నది తరువాతి సందేహము. కుడి ప్రక్కకా ఎడమ ప్రక్కకా లేక నిటారుగానా అన్న సందేహము వస్తుంది. నిటారుగా రెండు చేతులను ఉపయోగించి అటు నాభినుండి ఇటు నిష్ఠి నుండి లంబముగా అంటే నిటారుగా ఉంచితే రెండూ కలుస్తాయి. అందువల్ల అక్కడ అది లేదు అని తెలుస్తుంది. ఇక కుడి ఎడమ. గుండె 99 శాతము మానవులకు ఎడమవైపునే వుంటుంది కానీ 1 శాతము కుడివైపు కలిగినవారు కూడా వుంటారు. దీనిని Dextrocardia అంటారు ఆంగ్లములో. ఇది పారంపర్యముగా వచ్చే అవకాశము ఎక్కువగా వుంటుంది. ఆంగ్లములో దీనిని congenital అంటారు.
ఆయుర్వేదము-3
మరి పారంపర్యముగా వస్తూవుంది అన్నా కూడా దానికీ ఒక ఆది అన్నది ఉంటుందికదా! కాబట్టి మనము ‘కుడిఎడమయినా పొరబాటు లేదు’ అనుకోవలసి వస్తుంది. కాబట్టి మన రెండు చేతుల జానలను అటుగానీ ఇటు గానీ బొటన వ్రేళ్ళను ఆయా కేంద్రములనుడి కదిలించక చిటికెన వ్రేళ్ళను ఎడమకు (కుడి కూడా తీసుకొనవచ్చును అని చెప్పుకొన్నాము) కదిలించుతూ పోతే ఎక్కడ తాకబోతాయో అది హృదయస్థానము. కత్తులు కటార్లు ఈటెలు బాకులు వాడకుండా హృదయస్థానమును లక్షల సంవత్సరముల క్రితమే నిర్ణయించిన మన పూర్వీకుల ప్రతిభ, ప్రశస్తిని ఏమని ఎంతని పొగడ గలము. జ్వాల+ మాల+ ఆకులము అంటే నిప్పురవల మాల ను బోలుతూ చెదరుతూ అంటే చుట్టుప్రక్కల వ్యాపించుతూ వుంది.   విశ్వస్య ఆయతనం మహత్ అంటే ఈ విశ్వము యొక్క పుట్టుకకు మూలము అదియే! ఈ విషయమునే NASA(USA) కూడా ధృవపరచడము జరిగింది. ఇంకా వారు భగవంతుడు ఇక్కడ ఉంటాడా అని పరిశోధనలు చేస్తున్నారట. ఒక్క విషయము ఆలోచించుదాము. మనిషిలో వేడి లుప్తమయితే మృతుడే! మరి వేడి ఉన్నంతవరకు మనిషి బ్రతి ఉన్నాడు. మరి ఆవేడికి కూడా మూలము ఉండవలెను కదా! ఆ మూలమే దేవుడు. ఆ మూలము ఎక్కడుంది ఆ మూలములో ఆయన ఎక్కడున్నాడు అన్నది చూద్దాము. సంతతగ్ం శిలాభిస్తు లంబతి ఆకోశ సన్నిభం అంటే ఆ హృదయము వద్ద ఎల్లపుడు శిలాభిః (‘ర’’ల’యోరభేదః) అంటే శిరలు (శిలాభిః) లంబముగా ఆ పద్మ కోశమునకు ఆనుకొని వ్రేలాడుతున్నాయి. ఆ కోశమునకు అంతమందు సుషిరగ్ం  సూక్ష్మం అంటే మిక్కిలి చిన్నదియైన ఒక రంధ్రము వుంది. తస్మిన్, అందులో సర్వం ప్రతిష్ఠితం అంతా అందులోనే ప్రతిష్ఠింపబడి వుంది. అక్కడ అంటే ఆ రంధ్రములో మహత్తరమగు అగ్ని వుంది. దానివలననే ఈ ప్రపంచమంతా వెలుగుతూ వుంది.

    ఇక్కడ ఒక్క మాట చెప్పుకొనవలసి ఉంటుంది. మరి ప్రకృతిలోని మానవేతర స్థావర జంగమములకు లోపల ఈ వెలుగు లేదా! అంటే వానికి మానవ భాషలో తెలిపినా అర్థము చేసుకోనలేవు. అందుకే వేదము మానవులకు చెప్పబడింది. మళ్ళీ విషయమునకు వస్తే అది విశ్వార్చిర్ విశ్వతోముఖః అంటే దానివలననే ఈ విశ్వము అంతా వెలుగుచున్నది ఎందుకంటే విశ్వతోముఖః అది ప్రపంచమంతా  వ్యాపించి యున్నది. విశ్వము వెలుగుతూ వుంటే మరి సూర్య చంద్రాగ్నులు అవసరము లేదు కదా! అంటే సూర్యుడు అగ్నిగోళం, చంద్రుడు, తనపైబడు సూర్య కిరణ పరావర్తనముచే మాత్రమే వెలుగుచున్నాడు. ఇక అగ్నిది ప్రకృతితో కాకుండా మానవునికి సంబంధించిన వరకు అది పరిమిత ప్రయోజకత్వమునే ప్రసాదించుతుంది. కాబట్టి ఆ మూడు లేకపోతే ప్రాణికోటి లేదు అని తలువ వచ్చును. కావున అవి వుండి తీరవలసిందే! మరి ఈ వెలుగు మాటేమిటి. మనము ప్రకృతిలో గమనించితే పచ్చటి చెట్లలో ఒక కాంతిని చూస్తాము. అది వాడిపోయిన చెట్లలో అగుపించదు. వయసులో వున్న యువతీయువకులలో వుండే కళ ముదుసలివారిలో చూడలేము. అంటే ఏ వెలుగయితే మనలో ఉన్నదని చెప్పుకొన్నామో అది మెల్లమెల్లగా అధోముఖము పడుతూ ఉందన్నమాట. అసలు రంగులతో నిమిత్తము లేకుండా దాదాపు సమానమగు వయసులో ఉన్నవారి మధ్యన కూడా వర్చస్సులో కాంతి భేదములను చూడవచ్చు. లోపలి వెలుగునుబట్టే బయట నిగారింపు కనబడుతూవుందన్నమాట. నేటికి కూడా తపోసాధకులగు గురువుల ముఖములు ఎంతో వెలుగుతో, ప్రసన్నతతో, ఇంకా చూడవలెననిపించే రీతిగా వుంటాయి. దానికి వారి సమగ్ర సాధనయే కారణము.
తస్య మధ్యే వహ్ని శిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః అంటే ఏ వెలుగును గురించియయితే ఇంతవరకూ మాట్లాడుకొన్నామో దాని మధ్యన ఒక అగ్ని శిఖ ఊర్ధ్వ ముఖముతో భాసిల్లుచూ వున్నది. అందులో అణువును బోలి ఊర్ధమునకు చూసే ఒక అంతశ్శిఖను కలిగియున్నది. నీలతోయదము అంటే వర్షము కురియుటకు సిద్దముగానున్న నీలిమేఘము. దాని మధ్యలో మెరిసే మెరుపువలె ప్రస్ఫుటమగుచూ ఇక ఛేదించలేని అణు రూపమై ప్రభావించుతూ వున్నది. అదే మంత్రములో ఈ విధముగా చెప్పబడినది.
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా
తస్యః శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్
ఈ మెరుపులో, నీవార ధాన్యము యొక్క ముల్లు, (నేను చూడలేదు కానీ వడ్లగింజ కున్న ముల్లుతో పోల్చుకొందాము..) అంతటి చిన్న ముల్లు లాంటి వెలుగులో పరమ పరమాణు రూపములో ఊర్ధ్వముఖముగా ప్రజ్వరిల్లే జ్యోతి మధ్యలో పరమాత్మ నివసిస్తూవున్నాడు. ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రాదులంతానేకాదు వారిని కలిగిన పరమస్వరాట్ అయిన సకలచరాచర సృష్టికి మూలకారకుడు కూడా వున్నాడు.
    ఇక్కడ Science పరముగా ఒక మాట చెప్పుకోనవలసినది వున్నది. మన గుండెలో sinoatrial node అనే ఒక స్థానం ఉంది, దానినుండి ఒక విద్యుత్తరంగము లాంటిది వెలువడి గుండెను పని చేయిస్తూ వుంది. దీనికి కొంత దూరంలో atrioventricular node  ఉంటుంది, ఈ రెండూ కలిస్తేనే గుండె పని చేస్తుంది. ఈ sinoatrial node  నుండి  విడుదలయ్యే విద్యుత్తు ఏవిధముగా పుడుతుంది అన్నది మన Scientists కు ఇంకా తెలిసిరాలేదు, దీనినే pacemaker అని చెబుతున్నారు మన Scientists. గుండెను పని చేయించేది ఇదే. మన వేదములోని మంత్రపుష్పము దీని లోని ఆ అత్యంత పరమాణు రూపమునే పరమాత్మ అంటూ వుంది.
రేపు కలుద్దాము......
ఆయుర్వేదము-4

ఆయుర్వేద శాస్త్రము ఎంత నిశితమైనది అంటే వమనము తినే తిండికి ఏ కంచము ఏ ఆకులు శ్రేయస్కరము అన్నది కూడా వదిలిపెట్టకుండా తెలిపినారు. ఆకులలో అరటి, మోదుగ, బాదాము, ఆకులు శ్రేష్ఠము మరియు ఆరోగ్య ప్రదము. కంచములలో ఇత్తడి, కంచు, రాగి మరియు వెండి శ్రేష్ఠము. ముఖ్యముగా వెండి అత్యంత శ్రేష్ఠము. వెండి 5 నిముసములలో రోగకారక సూక్ష్మ క్రిములను నాశనము చేస్తుంది. దేహానికి మేలు చేసేవాని జోలికి పోదు. క్షణాలలో శరీరములోని రోగ నిరోధక వ్యవస్థను ధృడపరుచుతుంది.
COLD కు మూలము తగిన చికిత్స కొరకు 1949 నుండి 1999 వరకు ఇంగ్లాండులో అలుపు ఆయాసము లేకుండా పరిశోధనలు చేసి ‘మాకు అంతు చిక్కలేదు’ అని తీర్మానించినారు. ఇందుకు తగిన ఔషధము ఆయుర్వేదములోనే అగుపించుతుందని తీర్మానించినారు. అల్లము, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి, తేనెల వాడకము స్వాస్థ్యతను చేకూరుస్తుందని నిర్ధారించినారు.
చివరిగా, చదివిన వారికి వచ్చే చిన్నదయినా అతి పెద్ద సందేహమును నాకు తెలిసిన రీతిలో తీర్చ ప్రయత్నించుతాను. ఆ వెలుగు మనకు కనబడుట లేదే? కనబడదా? ఎందుకు కనబడదు? అన్నది ఆ ప్రశ్న. కృషి వుంటే మనుషులు ఋషులౌతారు అన్న వేటూరి వారి మాట మీకు తెలిసినదే కదా! ఆ వెలుగును చూడగలిగిన వారే ఋషులయినారు. మరి మనమో, లోపల తళుక్కుమన్నపుడల్లా సంసారమో, పిల్లలో, అందమయిన అమ్మయిలనో/అబ్బాయిలనో సినిమాలనో, షికార్లనో చూసుకొంటూ ఇంకా కాలాన్ని వ్యర్థపుచ్చుతూ ఉన్నాము. సందర్భోచితమని తలచి పెద్దలు చెప్పిన మాట ఈ దిగువన మీకు అందించుచున్నాను.
కావ్యశాస్త్రవినోదేన,కాలో గచ్ఛతి ధీమతాంl
వ్యసనేన తు మూర్ఖాణాం,నిద్రయా కలహేన వాll
ధీమంతులైనవారికి కావ్యశాస్త్రపురాణాది వినోదముతో మనోవికాసముతో, కాలము గడుస్తుంది. మూర్ఖులకు వ్యసనంతో గాని,నిద్రతోకాని, కలహంతోకాని కాలం గడుస్తుంది. కావున
ఇకనైన మేలుకొని, మెళుకువలో కళ్ళు మూసుకొని అంతర్ముఖులమై అనుదినమూ ధ్యానించితే పరమాత్ముని మనలోనే సందర్శించగలము. దానికి అంతః శుద్ధి, బాహ్యశుద్ధి, త్రికరణ శుద్ధి తోడయితే అసలు మనమే పరమాత్మ స్వరూపులమని తెలుసుకొనగలుగుతాము.
మిగిలినది మరొకసారి......
ఆయుర్వేదము-5 (చివరిభాగము)
ఇపుడు ఆయుర్వేదము ఇంకా మనకేమేమి ఇచ్చిందో ఒక పర్యాయము చూద్దాము.
ఈ దిగువన కనబరచిన అంశములను గూర్చి సవిస్తారముగా అందించినది ఆయుర్వేదము.
శరీర ధర్మ శాస్త్రము (physiology )
వ్యాధి లక్షణ శాస్త్రము (symptomatology)
శస్త్ర చికిత్స (surgery)
ఔషధ చికిత్స (drug therapy)
పథ్యము లేక ఆహార నియమములు (diet)
హృద్రోగమును గూర్చి ఇంచుమించు నేటి వైద్య పుస్తకములలో ఉండే విషయములను ఎటువంటి పరికరములు లేకున్నా తమ అతీంద్రియ శక్తితో తెలియ జేసిన ఘనత మన భిషగ్వర శ్రేష్ఠులగు ధన్వంతరి, దివోదాసుడు, చరకుడు, శుశ్రుతుడు, వాగ్భటుడు (అష్టాంగ హృదయం, అష్టాంగా సంగ్రహ కర్త, చరకుల వారి శిష్యుడు, 135 సంవత్సరములు జీవించి, బ్రహ్మచారిగా జీవితము గడిపి తన జీవిత కాలమును వైద్యమునకే ధారపోసిన మహనీయుడు.) మొదలగు నిస్వార్థమగు మహానుభావుల సేవ నేటి పాశ్చాత్య ప్రభావ గ్రహణగతులమైన మన ఊహకు అందనిది.
హృద్రోగ లక్షణములను ఆయుర్వేదము ఎంత చక్కగా వివరించిందో గమనించండి.
అథాథో హద్రోగప్రతీశేదం వ్యాక్యస్వామ్యః యథోవాచా భగవన్ ధన్వంతరిమ్:
  “అయామ్మ్యాథే మారుతజే హ్రదయం తుడ్యతే,
     నిర్మాతియతే ధీర్యతే చ స్పోట్యతే
     పాతిచ త్రిష్ణౌషధాః అచోషామ్ స్యుహు పైతికేచ,
     ధూమాయం చ మూర్ఛా చ స్వేదహకో. ”
(ఈ అధ్యాయంలో భగవన్ ధన్వంతరి (విష్ణుమూర్తి అవతారమైన, ఆయుర్వేద దేవత) వ్యక్తిగతంగా గుండె జబ్బుల లక్షణాలను మరియు గుండెపోటుతో రాబోయే మరణాన్ని వ్యక్తిగతంగా వివరిస్తాడు. “రోగి, కొన్ని సమయాల్లో, హృదయములో సూది పోట్లవలె నొప్పి , అధిక హృదయ కంపనము , మండుచున్నట్లు నొప్పి, కొన్ని సమయాల్లో నొప్పి ఛాతీని గొడ్డలితో రెండు భాగాలుగా విభజించినట్లు ఉంటుంది! రోగికి అసాధారణ దాహము, ఉండవచ్చు, శరీరమంతా మండుచున్నట్లు ఉండుట, శ్వాసావరోధము, విపరీతమైన అలసట, నాసికా రంధ్రములు ఊపిరి పీల్చుటకు చాలవు అన్న తపన, విపరీతమైన చెమట, పాలిపోయిన ముఖము, కొయ్యబారిన శరీరము, చివరకు అపస్మారక స్థితి కూడా సంభవించవచ్చు. ”)
అసలు ఒక ఆయుర్వేద వైద్యుడు, వృత్తిని చేపట్టునపుడు చేసే ప్రమాణము, అల్లోపతి డాక్టరు చేసే హిప్పోక్రటిస్ ప్రమాణమునకంటే ఇంకా నిర్దుష్టముగా ఉంటుంది.
అసలు గ్రీకులు అలెగ్జాండరు కాలములో ఎంతోమంది భారతీయ పండితులను, శాస్త్ర గ్రంధములను భాసరత దేశమునుండి తీసుకో పోయినట్లు ప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడైన పోకాక్ మహాశయుడు సోపపత్తికముగా నిరూపించినాడు.
చరక, శుశ్రుత సంహితలు కాకుండా ఆయుర్వేదములో అష్టాంగ హృదయము,, అష్టాంగా సంగ్రహము, మాధవ నిధానము వంటి అనేక గ్రంధములు ఆయుర్వేద శాస్త్రమును ఆచంద్ర తారార్కముగా నిలిపి ఉంచేవి. బహు భాషలు బహుళ సంస్కృతులు కలిగిన ఈ దేశమును సంస్కృతము ఒకటిగా కట్టి యుంచి యుండినది. మెకాలే కుతంత్రముతో సంస్కృతమునకు నామ రూపములను నామావశిష్ఠము చేసి మన శాస్త్రములకు, విజ్ఞానమునకు దూరము చేసినాడు. నేను చెప్పవచ్చింది ఏమిటంటే ఇన్ని భాషలు, సంస్కృతులు, నైసర్గిక భేదములు ఉండుటచే ఆయుర్వేదము కూడా ప్రాంతీయపరముగా అభివృద్ధి అయి ఉండినది. ప్రతిశాస్త్రమూ దైవత్వముతో ముడిపడి ఉంటుంది. ఆ వాస్తవాన్ని నేడు మనము గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది.
యూరోపు, ఉత్తర అమెరికా, ఆగ్నేయ ఆశియా జపాన్ మున్నగు దేశములలో ప్రత్యేక పాఠశాలలు మరియు కళాశాలను ఏర్పరచి  మన ఆయుర్వేదమును బోధింప జేయుచున్నారు. మనలో చాలా మందికి ఆయుర్వేదమంటేనే చిన్న చూపు. నాకు 10 సంవత్సరములు వచ్చేవరకు కూడా ఆయుర్వేద ఔషధ వైద్యము బ్రాహ్మలు చేసేవారు. రోగి రోగము నయమయిన తరువాత ఇచ్చినస్ది పుచ్చుకోనుతయే తప్ప ఇంత ఇమ్మని ఏరోజూ నిబంధన ఏర్పరుచలేదు. కాలము మారినది అల్లోపతి మందేలేని ‘రొంప’ జలుబు’ పడిశము’నకు (మూడూ ఒకటే) స్పెషలిస్టు డాక్టరు వద్దకు పోతే ముందు 500 రూపాయల ఫీసు గుంజుతూ వున్నాడు. శస్త్ర చికిత్సలు కంటి శుక్లములు మొదలగునవి మంగలి వారు (మంగళమయమగు కార్యములకు ముందుండేవారు) చేసేవారు. ఇక వ్యాధిగ్రస్తుడగు వ్యక్తి చర్మమును వలువ వలసి వస్తే మాదిగ వారు చేసేవారు. అందరూ వారి వారి వృత్తులకు అనుకూలముగా వ్యవహరించేవారు. ఎవరూ ఎవరినీ చిన్న చూపు చూసేవారు కారు. ఈ తారతమ్యాలు ఎక్కువగా బ్రిటీషువారు సృష్టించినవి. విదేశాలకు శాస్త్రములపై ఉన్న శ్రద్ధ చూస్తూవుంటే రాబోయే కాలములో ఆయుర్వేదము అద్వితీయ స్థానమును పొందుతుంది అని నా మనోప్రబోధన. అప్పుడు ఈ అత్యంత ఆధునిక ధనవ్యయ వైద్యము తోక ముడుచుకోనక తప్పదు. ఆయుర్వేదము అమెరికాలో ప్రబలుతూనే మనము అప్పుడు దానిని ఆశ్రయించుతాము. అల్లోపతి తాత్కాలిక, ఆత్యయిక, పరిస్థితులకు మాత్రమే పనికి వస్తుంది.
ఆయుర్వేదము దీర్ఘ  మరియు మొండి రోగములకు చక్కని మందుల నిచ్చుటయేగాక మన జేబుకు అనుకూలముగా వుంటుంది.
ఒక సంస్కృత చాటువు ఈ విధముగా చెబుతూ వుంది.
అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధంl
అయోగ్యః పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభఃll
అంటే వైద్యమునకు పనికిరాని మూలములు అనగా వేర్లు లేక కుదుళ్ళు, బెరడు, ఆకులు ఏవీ లేవు కాకపోతే ఆ విషయమును గూర్చి మనకు క్షున్నముగా తెలిసి ఉండవలెను. అంతే కాకుండా మంత్రము కాని అక్షరము లేదు, అయోగ్యుడగు వ్యక్తి లేదు కానీ ఆయా విషయములను సక్రమముగా ఉపయోగించుకొనే వ్యక్తి దొరకుతయే దుర్లభము.
 వైద్యజ్ఞ చరకుడు ఆయుర్వేదమునకు అతి చక్కని నిర్వచనమునిచ్చినాడు.
జీవితము యొక్క బాగోగులు, సుఖదుఃఖాలు, పరిపూర్ణ అపరిపూర్ణ సుఖమయ జీవితము, జీవిత ప్రమాణములను తెలియజేసే విధానము సుఖమయ జీవన నిదానమైన ఆయుర్వేదము.
సహకారము:
Kutumbiah P. Ancient Indian Medicine.
Hegde BM: Angina an Indian Disease.
David Frawley.  Ayurveda and the Mind. 
 స్వస్తి.