Sunday, 16 February 2020

ఆయుర్వేదము


ఆయుర్వేదము ఉపోద్ఘాతము
నేను వైద్యుడను కాను. ఈ వ్యాసములో ఏ వ్యాధికి ఏమందులు వాడవలెను అన్న విషయమును గూర్చి వ్రాయబోవుట లేదు. నా తపన అంతా ఇది ఒక మహత్తర వైద్యశాస్త్రము అన్న విషయమును నాకు దొరకిన  ఆధారపూర్వకముగా దొరికిన అంశములను మీముందుంచే ప్రయత్నము చేయుచున్నాను.
ఉపన్యాసమునకు రచనకు ఎంతో తేడా ఉంది. ఉపన్యాసములో తప్పులు దొరలినా గాలిలొ కలసి పోతాయి. రచన అజరామరముగా నిలచిపోవచ్చు. శాస్త్ర, పురాణ, ఇతిహాసములవలె. అట్లని నేను వ్రాసే ఈ నాలుగు మాటలూ చిరస్థాయిగా నిలుస్తాయి అని చెప్పుట లేదు. అది ఆ రచన యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఇక అసలు విషయముయోక్క ఉపోద్ఘాతమునకు వద్దాము.
పునరుజ్జీవనం (Renaissance)మధ్య యుగాల తరువాత యూరోపియన్ సాంస్కృతిక, కళాత్మక, రాజకీయ మరియు ఆర్థిక “పునర్జన్మ” యొక్క తీవ్రమైన కాలం. సాధారణంగా 14 వ శతాబ్దం నుండి 17 వ శతాబ్దం వరకు జరుగుతున్నట్లు వర్ణించబడింది. చీకటి నుండి కాంతి వైపునకుపునరుజ్జీవనం ప్రారంభమైంది. దీనిని "చీకటి యుగము" అని కూడా పిలుస్తారు, ఈ యుగం తరచుగా యుద్ధం, అజ్ఞానం, కరువు మరియు మహమ్మారి, ప్లేగ్ వ్యాధుల కాలము  అని కూడా అంటారు.
అసలు ఆయుర్వేదానికీ ఈ పునరుజ్జీవన విషయానికీ గల సంబంధమేమి అని మీలో ఒక సంశయము ఈపాటికే ఉత్పన్నమై ఉండవచ్చు. ఈ ప్రస్తాపన ఎందుకు తెచ్చినానంటే,
పునరుజ్జీవనం (Renaissance) వచ్చేవరకు పాశ్చాత్యులలో చెప్పుకోదగ్గ చరిత్ర లేదు. మరి మనదో, అప్పటికే ఎన్నో లక్షల సంవత్సరములనుండి నడచుచున్న చరిత్రగలిగిన దేశము. అంత చరిత్ర ఉంటె అంత సంస్కృతి అంత విజ్ఞానము మనవద్ద ఉన్నట్లేకదా!
అంటే మనవద్ద ఆయుర్వేదమే కాకుండా,
Human Anthropology -మానవ వికాస శాస్త్రము
Geography - భూగోళ శాస్త్రము
Human Geography - మానవ భూగోళ శాస్త్రము
Political Administration - రాజ్కనీతి శాస్త్రము
Military Administration - సైన్య నియంత్రణ శాస్త్రము
Defense Strategies - సైనిక వ్యూహా శాస్త్రము
Architecture - వాస్తు శాస్త్రము
Communication Engineering - ప్రసార శాస్త్రము
International Relations - అంతర్జాతీయ సంబంధములు, దౌత్య సంబంధములు
Trade Commerce and Industries వర్తక వాణిజ్య పరిశ్రమ విభాగము
Human Relations మానవీయ సంబంధములు
Astronomy ఖగోళ శాస్త్రము
Astrology జ్యోతిష్ శాస్త్రము
Aeronautics వైమానిక శాస్త్రము
Forestry and Animal Husbandry వన మరియు జంతు శాస్త్రము
Family Ethics కుటుంబ విధానము
Marriage వివాహ విధానము
Human Customs and Beliefs మానవీయ సంప్రదాయాలు మరియు విలువలు
Town Planning and Village Administration పట్టణ, గ్రామ వాస్తు మరియు నియంత్రణ
Diplomatic Relationships దౌత్య సంబంధములు
Naval Administration నౌకాయాన విధివిధానములు
Metallurgy లోహశాస్త్రము
Sculpture Art and Architecture శిల్ప మరియు నిర్మాణ శాస్త్రము
Music and Drawing-సంగీతము చిత్రలేఖనము వంటి 64 కళలు
Mathematics - గణిత శాస్త్రము
External Affairs విదేశీ వ్యవహారములు
Civil Administration పౌర శాస్త్రము
Moral Science నీతి శాస్త్రము
Science of Warfare = యుద్ధతంత్ర శాస్త్రము
Leadership qualities నాయకత్వ లక్షణములు
ఇన్ని శాఖలలో మనదేశము నైపుణ్యము సాధించియున్డినది. మరి అటువంటి సనాతన దేశ సంస్కారమును, సంపత్తిని ఎంతవరకు నిలుపుకోగలుగుచున్నాము. ఈ భావమును మనసున నింపుకొని ఈ వ్యాసము చదువ మొదలుపెట్టండి.
రేపటినుండి అసలు విషయము......

ఆయుర్వేదము

ముందు ఈ దేశము యొక్క గొప్పదనమును గూర్చి ప్రపంచ సాహిత్య  పితగా కొనియాడబడిన అమెరికన్ దేశవాసియగు  మార్క్ ట్వైన్ ఏమన్నాడో ఒకసారి గమనించండి అతని మాటలలోనే:
It was Mark Twain who once said: So far as I am able to judge, nothing has been left undone, either by man or nature, to make India the most extraordinary country that the sun visits on his rounds. Nothing seems to have been forgotten, nothing overlooked.
అంతటి భారత దేశము మనకొసంగిన అమృత భాండమే ఆయుర్వేదము. ‘ఆయుః’ అంటే ఆయుస్సు ఆరోగ్యము ఆయుస్సులది అవినాభావ సంబంధము.
ఆయుస్సు యొక్క ఆయుస్సు ఎల్లప్పుడూ ఆరోగ్యముతోనే ముడిపడి ఉంటుంది. ‘విద్’ అన్నదాతు జన్యము వేదము. వేదము అంటే సులభమగు రీతిలో అర్థము చెప్పుకోనవలసివస్తే ‘జ్ఞానము’ అని చెప్పుకొన వచ్చును. ఈ ఆయుర్వేదమును ఉపవేదము అనుటకూడా కద్దు. దీనిని మనకు నాలుగవ వేదమగు అథర్వణ వేదము అందిస్తూవుంది.
అట్టి ఆయుర్వేదము శరీర రుగ్మతలకు మూలకారణములేమని చెప్పిందో చూడండి.
క్రోధశోకభయాయాస వృధాన్నభోజన తాపోన్నలాన్ లవణ క్షార ...... రక్తపిత్త ప్రకోపయేత్
కోపము, నిస్పృహ, దుఃఖము, పరిధి లేని భయము, అధికమైన అలసట, శ్రుతిమించిన సోమరితనము, అధిక లవణ క్షార ఆహార పదార్థ వినియోగము అన్నవి ప్రాణఘాతుక రోగాకారకములు. కానీ ఈ దుర్గుణములను దూరముంచుటకు ఆచరించవలసిన
ఆరోగ్య సూత్రములు అతి సులభములు.
నిత్య హిత మిత ఆహార సేవి , సమీక్షకారి, దాత, సమః, సత్యాపర, క్షమావాన్,ఆప్తోపసేవీ భవేత్.
‘అనునిత్యమూ హితమూ మరియు మితమైన ఆహార సేవనము, చేతికందిన పనిని చేయతగునా చేయనగునా అన్న ఆత్మసాక్షితో కూడిన విచికిత్స, దానగుణము కలిగియుండుట,  తన పర అన్న భేదభావా రహితుడైయుండుట, సత్యపాలకుడగుట, క్షమాహృదయుడైయుండుట, తనను ఆశ్రయించినవారికి అండదండగా నిలుచుట’ అన్న ఈ నియమములను నిష్ఠతో పాటించిన వాడు ఆయురారోగ్యములనెడు ఐశ్వర్యమును కలకాలమూ కలిగియుంటాడు.
గణితము మరియు సైన్సు(science అన్న మాట శాస్త్రము అన్న పదమునకు సమానార్థకము కాదు.) లో, విరళ సిద్ధాంతము(nonlinear system) లో  input=నివిష్టము output=ఉత్పాదితము నకు అనులోమానుపాతంలో ఉండదు. ఈ విరళ సిద్ధాంత సమస్యలు  ఇంజనీర్లు, జీవశాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు మరియు అనేక ఇతర శాస్త్రవేత్తలకు ఆసక్తికరమైన విషయములు, ఎందుకంటే విరళ సమీకరణములు (Nonlinear Equations), కాలక్రమేణా అస్థిర వర్గము( variables) లోని  మార్పులను వివరిస్తూ, అస్తవ్యస్తంగా, అనూహ్యంగా లేదా ప్రతికూలంగా కనిపిస్తాయి, అతి సులభమైనమైన సరళ వ్యవస్థల(Linear System)తో విభేదిస్తాయి.
పైన తెలియజేసిన విషయమును సాధారణ పాఠకునికి అర్థమయ్యే రీతిలో చెప్పవలసి వస్తే ఒక శాఖాహారి తన కంటి ఎదుట అసంకల్పితముగా ఒక జంతువధ చూస్తే, అతను మైకముతో పడిపోవచ్చు, భయంకరమైన తలనొప్పి రావచ్చు, కడుపులో దేవినట్లయి వాంతులు వచ్చే ప్రమాదము కలుగవచ్చు, మాట పెగలక పోవచ్చు, అన్నము సహించక పోవచ్చు. ఇన్నివిధములుగా ఒకే విషయము ఒక వ్యక్తిపై ప్రభావము చూపగలదు. అందుచేత ఆరోగ్యము కోరుకొనే వ్యక్తికి చిత్త శాంతి, మానసిక సంతులనము ఎంతో అవసరము.
ఒకసారి మనకందరకూ తెలిసిన ఒక ప్రాకృతిక పరిశీలనను పునశ్చరణ చేసుకొందాము. అమావాస్య పున్నమి వేళలలో చంద్రునియొక్క ఆకర్షణకు లోబడి సముద్రము అలలు ఉవ్వెత్తుగా ఎగసి పడుతుంటాయి. సముద్రజలము అల్లకల్లోలముగా అగుపించుతుంది. తగిన ధ్యాస పెట్టకపోవుటవల్ల మనకు తెలియని విషయము ఏమిటంటే మానవ శరీరములో కూడా అధికాంశము నీటిచే నిండియున్నది. మరి అటువంటప్పుడు చంద్రుని ప్రభావము శరీరముపై లేకుండా ఎట్లు వుంటుంది? అందుకే ఆయుర్వేదములో, రోగ చికిత్స చేయుటయందు గ్రహచారమునకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఈ విషయమును తేలికగా కొట్టివేసే నేటి అపరిపక్వ వైద్యులు కూడా Scientists అని నమ్మే న్యూటన్ మరియు గలీలియోలిరువురూ జోతిష్యమును నమ్మి అడిగిన ఎంతోమందికి జాతకాలు, ప్రతిఫలాపేక్షతో చెప్పేవారు. గ్రహచార విధానము వైద్యశాస్త్రమునకు తగినదే కానీ చీమలపుట్ట పగిలినట్లున్న నేటి జ్యోతిష్కుల వద్దకు భవిష్యత్తును గూర్చి తెలుకొనుటకు పోవుట అర్థవంతమగు విషయము కాదు. అట్లని జ్యోతిషము శాస్త్రము కాదు అని నేననుటలేదు.
ఆయుర్వేదము ఒక ఋషీశ్వరుని అంతర్దృష్టి, అనుభవము, ఆత్మసాక్షి కలిగిన పరిశీలన పరిశోధన కలిగిన  వైద్యశాస్త్రము. అది కేవలము, ఆలోపతి వైద్యమువలె ఆత్యయిక విషయ నియంత్రణ అనగా emergency case-control studies వంటిది కాదు. అంటే ఆయుర్వేదము, పిండికి పిడుక్కు ఒకే మంత్రము వలె కాదు. అది వ్యాధి ఒకటే అయినా రోగి రోగికీ మందు మారుతుంది. ఆయుర్వేదములో చికిత్స ఈ క్రింది విధములుగా విభజించబడినది.
1.క్ష్వేళా విసర్జన (Detoxification)-పంచకర్మ
2. పథ్యము (Diet)
3.యోగక్రియ(Yoga)
4. మూలికా వైద్యము(Herbal Medications)
5. ధ్యాన ప్రార్థనలు(Meditation and Prayer of any God)
6. ఆయుర్వేద శస్త్ర చికిత్స (Ayurvedic Surgery)
ఆయుర్వేదము అందున  శస్త్ర చికిత్సను గూర్చి  వేల సంవత్సరముల క్రితమే ప్రపంచమునకు  మొట్టమొదటి సారిగా తెలిపిన దేశము ఈ భారత దేశము. శస్త్ర చికిత్సకు ఆద్యుడు శుశ్రుతుడు.
క్లిష్టమైన కపాల శస్త్ర చికిత్స లో నైపుణ్యతకు తగిన రంపములనుపయోగించి చికిత్సను విజయవంతము చేసేవారు. ఇదికాక శరీరములో పేరుకొన్న రాళ్ళుతీయుట,  నాసికా నిర్మాణ చికిత్స, ప్రసూతి లేక శిశూదయము, గర్భ విచ్ఛిక్తి, గర్భాశయ నిర్మూలనము, శల్య చికిత్స, శరీరములోని వ్రణ నిర్మూలనము(Tumor Surgery) మొదలగునవే కాక ఇంకా అనేకానేక శాస్త్ర చికిత్సల గూర్చి తన శుశ్రుత సంహితలో శుశ్రుతుడు ఎంతో విపులముగా విశధముగా వ్రాసినాడు. శాస్త్ర చికిత్సకు సంబంధించిన 127 శాస్త్ర చికిత్సా పరికరములను తన గ్రంధములో చిత్రముల రూపములో చూపించినాడు. ఆ రోజులలో రోగికి శస్త్ర చికిత్స చేయుటకు గాను అపస్మారక స్థితి కలిగించుట (Anaesthesia) సమ్మోహన క్రియ (Hypnotysing) మొదలగు విషయములలో అధికముగా నైపుణ్యము కలిగియుండినారు. ఈ రోజుకు కూడా ఆయుర్వేదములోని క్షారసూత్ర ప్రక్రియ యే మొలల(Piles) శాశ్వత నిర్మూలనకు ఉపకరణము. భగంధ్రము (Fistula)నకు కూడా ఆయుర్వేద శస్త్ర చికిత్స శాశ్వత పరిష్కారము. అపూతిక (Antiseptic) చికిత్సలో కూడా నాడు ఎంతో ముందంజ మన పూర్వులు ముందంజ వేసియుండినారు. స్పోటకమునకు  (Small Pox)టీకాలు వేయుటకు ఉపయోగించే నేటి Lancet (శస్త్రము) నాటి శస్త్రమునే పోలియుంటుంది. అసలు ఎడ్వర్డ్ జెన్నర్ ఆవిష్కరణగా చెప్పుకొనే ఈ విధానము, ఆయన శుశ్రుత సంహిత నుండి సంగ్రహించినదే! అసలు Dr. T.Z. Holwell, నాటి వంగ ప్రాంతమున 10 సంవత్సరములు ఈ టీకాల విషయములో, విశ్రుతముగా పరిశోధనలు ఆయుర్వేదములో జరిపి, తాను పొందిన అనుభవసారమును London Royal College of Physicians 1747లో  ప్రకటించుట కూడా జరిగినది. అంటే ఈ టీకాల విధానము వేళా సంవత్సరముల పూర్వమే భారత దేశమున యుండినదని తెలియజేసినాడు.
ఆయుర్వేదము-2

ఆయుర్వేద వైద్యుడగుటకు ఔషధ చికిత్స, శస్త్ర చికిత్స రెండూ నేర్చుకొని తీరవలసిందే! విద్యార్థి ఎక్కువ కాలము గురువు వద్ద ఉండవలసి వచ్చేది. పలు విధములగు రొగములను, రోగులను పరీక్ష, గురువు సారత్యములో చేస్తూ నేర్చుకొంటాడు శిష్యుడు. శరీర శాస్త్రమునకు తప్పక శవముల ఆవశ్యకత నాడుకూడా ఉండేది. ఇంకా ముఖ్యమగు విషయమేమిటంటే సూక్ష్మదర్శనిలు(Mycroscopes) కనిపెట్టబడని వేల సంవత్సరముల క్రితమే చరకుడు, శుశ్రుతుడు శరీరములోని ప్రతి అంగము కణముల (Cells) సహాయముతో ఏవిధముగా పని చేస్తాయి అన్నది నిశితముగా తెలియజేసినారు. వ్యాధి మూలకములగు 20 విధముల సూక్ష్మ జీవులను గూర్చి తెలిపినారు, ముఖ్యముగా హృద్రోగమును గూర్చి.

ఆంగ్ల శబ్ద కోశములో HEART అన్న మాటకు అర్థమయితే ఇచ్చినారు కానీ దాని పుట్టుకను గూర్చి నేను పరిశీలించినంత మేరకు కానరాలేదు. నా ఉద్దేశ్యములో 'హృత్' శబ్దము నుండి HEART పుట్టివుంటుంది. మనలనుపాలించిన వారు కదా మన భాషను తమ భాషకు మాతగా ఒప్పుకొనుటకు ఆభిజాత్యము అడ్డము వచ్చి  యుండవచ్చు.
సంస్కృతములో మాత్రము నిరుక్తమున ఎంత హృద్యముగా 'హృదయము' అన్న మాటకు వ్యుత్పత్తి చెప్పినారో అది తెలిపిన వారి మేధస్సును వర్ణింప నాతరము కాదు. వారు హిమవన్నగము వంటివారయితే నావంటి వారందు పిపీలిక సమానులు (పిపీలికము=చీమ). ఈ శ్లోకమును గమనించండి:
తదేతత్ త్ర్వక్షరంహృదయమితి, హృత్ ఏకం మహాక్షరం ద ఇత్యేకాక్షరం
యమిత్యేకం యివం హరతేర్ దదాతేరాయతేర్ హృదయ శబ్ద నిరుక్తః
'హృ' అంటే హరతి = గ్రహించునది
'' అంటే దదాతి = తిరిగి ఇచ్చునది
'' అంటే అయతి= ప్రవహింప జేయునది
మొత్తము గుండెయొక్క కార్యక్రమమంతా మూడు అక్షరములు కల ఒక పదములో వచ్చివేసినది. దీనిని 'సింధు' అనటము కూడా కద్దు. నదులు సంద్రమునకలిసి తిరిగి వర్షముతో నదులుగామారి సంద్రమున కలుస్తున్నాయో రక్తము కూడా గుండెతో అదే సంబంధమును నిరంతరమూ కలిగియున్నది కదా!
హృదయము యొక్క అర్థమును గూర్చి తెలుసుకొన్నాము. ఇపుడు ఆ హృదయమును గూర్చి వేదములోని మంత్రపుష్పమునందు ఏమి తెలిపినారో చూద్దాము.
మంత్రపుష్పమును విధిగా పూజల్లోనూ, వ్రతములలోనూ, దేవాలయములలోనూ పూజావసాన సమయమును చెబుతూ వుంటారు. అందువల్ల ఆ మంత్రమును మన హృదయమునకు సంబంధించిన మేరకు మీ ముందుంచుతూ నాకు చేతనయినంత వరకు  వివరించుతాను.
పద్మ కోశ ప్రతీకాశగ్౦ హృదయంచా ప్యదో ముఖం ||
అధో నిష్ట్యా విత స్త్యాన్తే నాభ్యాముపరి తిష్టతి|
జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహత్ ||
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం|
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మంత స్మిన్సర్వం ప్రతిష్టితం ||
తస్యమధ్యే నుహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః|
సోగ్రభుగ్విభ జన్తిష్ట న్నాహార మజరః కవిహ్ ||
తిర్యగూర్ధ్వ మధ శ్శాయీర శ్మయస్తస్య సంతతా|
సంతాపయతిస్వం దేహమాపాద తలమస్తకం ||
తస్యమధ్యేవ హ్నిశిఖా అణీ యోర్ధ్వా వ్యవస్దితః|
నీలతో యద మధ్య స్ధాద్విద్యుల్లెఖేవ భాస్వరా ||
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణూపమా|
తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్ ||
మంత్రార్థమును తెలుపుటకు మునుపు మంత్ర పుష్పము అన్న పేరును గూర్చి తెలుసుకొందాము. పుష్పములు స్నిగ్ధత సౌకుమార్యము కలిగినవి. వానిలో శ్రేష్ఠతమమయినది తామర. అందుకే ఎర్ర తామర లక్ష్మీ నివాసమయితే తెల్లతామర వాణీ విలాసము. మన శరీరములో కూడా ఒక ఎర్రతామర మొగ్గ వుంది. మంత్రపుష్పము దాని గూర్చియే తెలుపుతుంది కాబట్టి అది మంత్రపుష్పము అయినదని నా ఊహ.
ఇపుడు ఈ మంత్రార్థమును నా శక్తి మేరకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను. నావేవయినా తప్పులు వుంటే విజ్ఞులు సవరించగలరు. హృదయము తలక్రిందులుగా వున్న తామర మొగ్గవలె భాసిల్లుచున్నది. నిష్ఠి అంటే తెలుగులో ముచ్చెన గుంత అంటారు. ఈ గుంత అటు కంఠానికీ ఇటు ఎదకు మధ్యన వుంటుంది. దానినుండి క్రిందికి వితశ్శాంతిఅంటే జానెడు దూరము, మరియు నాభ్యం ఉపరి అంటే బొడ్డునుండి పైకి జానెడు దూరములో ఈ మొగ్గ వున్నది. మరి కొలత ఏవిధముగా చేయాలి అన్నది తరువాతి సందేహము. కుడి ప్రక్కకా ఎడమ ప్రక్కకా లేక నిటారుగానా అన్న సందేహము వస్తుంది. నిటారుగా రెండు చేతులను ఉపయోగించి అటు నాభినుండి ఇటు నిష్ఠి నుండి లంబముగా అంటే నిటారుగా ఉంచితే రెండూ కలుస్తాయి. అందువల్ల అక్కడ అది లేదు అని తెలుస్తుంది. ఇక కుడి ఎడమ. గుండె 99 శాతము మానవులకు ఎడమవైపునే వుంటుంది కానీ 1 శాతము కుడివైపు కలిగినవారు కూడా వుంటారు. దీనిని Dextrocardia అంటారు ఆంగ్లములో. ఇది పారంపర్యముగా వచ్చే అవకాశము ఎక్కువగా వుంటుంది. ఆంగ్లములో దీనిని congenital అంటారు.
ఆయుర్వేదము-3
మరి పారంపర్యముగా వస్తూవుంది అన్నా కూడా దానికీ ఒక ఆది అన్నది ఉంటుందికదా! కాబట్టి మనము ‘కుడిఎడమయినా పొరబాటు లేదు’ అనుకోవలసి వస్తుంది. కాబట్టి మన రెండు చేతుల జానలను అటుగానీ ఇటు గానీ బొటన వ్రేళ్ళను ఆయా కేంద్రములనుడి కదిలించక చిటికెన వ్రేళ్ళను ఎడమకు (కుడి కూడా తీసుకొనవచ్చును అని చెప్పుకొన్నాము) కదిలించుతూ పోతే ఎక్కడ తాకబోతాయో అది హృదయస్థానము. కత్తులు కటార్లు ఈటెలు బాకులు వాడకుండా హృదయస్థానమును లక్షల సంవత్సరముల క్రితమే నిర్ణయించిన మన పూర్వీకుల ప్రతిభ, ప్రశస్తిని ఏమని ఎంతని పొగడ గలము. జ్వాల+ మాల+ ఆకులము అంటే నిప్పురవల మాల ను బోలుతూ చెదరుతూ అంటే చుట్టుప్రక్కల వ్యాపించుతూ వుంది.   విశ్వస్య ఆయతనం మహత్ అంటే ఈ విశ్వము యొక్క పుట్టుకకు మూలము అదియే! ఈ విషయమునే NASA(USA) కూడా ధృవపరచడము జరిగింది. ఇంకా వారు భగవంతుడు ఇక్కడ ఉంటాడా అని పరిశోధనలు చేస్తున్నారట. ఒక్క విషయము ఆలోచించుదాము. మనిషిలో వేడి లుప్తమయితే మృతుడే! మరి వేడి ఉన్నంతవరకు మనిషి బ్రతి ఉన్నాడు. మరి ఆవేడికి కూడా మూలము ఉండవలెను కదా! ఆ మూలమే దేవుడు. ఆ మూలము ఎక్కడుంది ఆ మూలములో ఆయన ఎక్కడున్నాడు అన్నది చూద్దాము. సంతతగ్ం శిలాభిస్తు లంబతి ఆకోశ సన్నిభం అంటే ఆ హృదయము వద్ద ఎల్లపుడు శిలాభిః (‘ర’’ల’యోరభేదః) అంటే శిరలు (శిలాభిః) లంబముగా ఆ పద్మ కోశమునకు ఆనుకొని వ్రేలాడుతున్నాయి. ఆ కోశమునకు అంతమందు సుషిరగ్ం  సూక్ష్మం అంటే మిక్కిలి చిన్నదియైన ఒక రంధ్రము వుంది. తస్మిన్, అందులో సర్వం ప్రతిష్ఠితం అంతా అందులోనే ప్రతిష్ఠింపబడి వుంది. అక్కడ అంటే ఆ రంధ్రములో మహత్తరమగు అగ్ని వుంది. దానివలననే ఈ ప్రపంచమంతా వెలుగుతూ వుంది.

    ఇక్కడ ఒక్క మాట చెప్పుకొనవలసి ఉంటుంది. మరి ప్రకృతిలోని మానవేతర స్థావర జంగమములకు లోపల ఈ వెలుగు లేదా! అంటే వానికి మానవ భాషలో తెలిపినా అర్థము చేసుకోనలేవు. అందుకే వేదము మానవులకు చెప్పబడింది. మళ్ళీ విషయమునకు వస్తే అది విశ్వార్చిర్ విశ్వతోముఖః అంటే దానివలననే ఈ విశ్వము అంతా వెలుగుచున్నది ఎందుకంటే విశ్వతోముఖః అది ప్రపంచమంతా  వ్యాపించి యున్నది. విశ్వము వెలుగుతూ వుంటే మరి సూర్య చంద్రాగ్నులు అవసరము లేదు కదా! అంటే సూర్యుడు అగ్నిగోళం, చంద్రుడు, తనపైబడు సూర్య కిరణ పరావర్తనముచే మాత్రమే వెలుగుచున్నాడు. ఇక అగ్నిది ప్రకృతితో కాకుండా మానవునికి సంబంధించిన వరకు అది పరిమిత ప్రయోజకత్వమునే ప్రసాదించుతుంది. కాబట్టి ఆ మూడు లేకపోతే ప్రాణికోటి లేదు అని తలువ వచ్చును. కావున అవి వుండి తీరవలసిందే! మరి ఈ వెలుగు మాటేమిటి. మనము ప్రకృతిలో గమనించితే పచ్చటి చెట్లలో ఒక కాంతిని చూస్తాము. అది వాడిపోయిన చెట్లలో అగుపించదు. వయసులో వున్న యువతీయువకులలో వుండే కళ ముదుసలివారిలో చూడలేము. అంటే ఏ వెలుగయితే మనలో ఉన్నదని చెప్పుకొన్నామో అది మెల్లమెల్లగా అధోముఖము పడుతూ ఉందన్నమాట. అసలు రంగులతో నిమిత్తము లేకుండా దాదాపు సమానమగు వయసులో ఉన్నవారి మధ్యన కూడా వర్చస్సులో కాంతి భేదములను చూడవచ్చు. లోపలి వెలుగునుబట్టే బయట నిగారింపు కనబడుతూవుందన్నమాట. నేటికి కూడా తపోసాధకులగు గురువుల ముఖములు ఎంతో వెలుగుతో, ప్రసన్నతతో, ఇంకా చూడవలెననిపించే రీతిగా వుంటాయి. దానికి వారి సమగ్ర సాధనయే కారణము.
తస్య మధ్యే వహ్ని శిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః అంటే ఏ వెలుగును గురించియయితే ఇంతవరకూ మాట్లాడుకొన్నామో దాని మధ్యన ఒక అగ్ని శిఖ ఊర్ధ్వ ముఖముతో భాసిల్లుచూ వున్నది. అందులో అణువును బోలి ఊర్ధమునకు చూసే ఒక అంతశ్శిఖను కలిగియున్నది. నీలతోయదము అంటే వర్షము కురియుటకు సిద్దముగానున్న నీలిమేఘము. దాని మధ్యలో మెరిసే మెరుపువలె ప్రస్ఫుటమగుచూ ఇక ఛేదించలేని అణు రూపమై ప్రభావించుతూ వున్నది. అదే మంత్రములో ఈ విధముగా చెప్పబడినది.
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా
తస్యః శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్
ఈ మెరుపులో, నీవార ధాన్యము యొక్క ముల్లు, (నేను చూడలేదు కానీ వడ్లగింజ కున్న ముల్లుతో పోల్చుకొందాము..) అంతటి చిన్న ముల్లు లాంటి వెలుగులో పరమ పరమాణు రూపములో ఊర్ధ్వముఖముగా ప్రజ్వరిల్లే జ్యోతి మధ్యలో పరమాత్మ నివసిస్తూవున్నాడు. ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రాదులంతానేకాదు వారిని కలిగిన పరమస్వరాట్ అయిన సకలచరాచర సృష్టికి మూలకారకుడు కూడా వున్నాడు.
    ఇక్కడ Science పరముగా ఒక మాట చెప్పుకోనవలసినది వున్నది. మన గుండెలో sinoatrial node అనే ఒక స్థానం ఉంది, దానినుండి ఒక విద్యుత్తరంగము లాంటిది వెలువడి గుండెను పని చేయిస్తూ వుంది. దీనికి కొంత దూరంలో atrioventricular node  ఉంటుంది, ఈ రెండూ కలిస్తేనే గుండె పని చేస్తుంది. ఈ sinoatrial node  నుండి  విడుదలయ్యే విద్యుత్తు ఏవిధముగా పుడుతుంది అన్నది మన Scientists కు ఇంకా తెలిసిరాలేదు, దీనినే pacemaker అని చెబుతున్నారు మన Scientists. గుండెను పని చేయించేది ఇదే. మన వేదములోని మంత్రపుష్పము దీని లోని ఆ అత్యంత పరమాణు రూపమునే పరమాత్మ అంటూ వుంది.
రేపు కలుద్దాము......
ఆయుర్వేదము-4

ఆయుర్వేద శాస్త్రము ఎంత నిశితమైనది అంటే వమనము తినే తిండికి ఏ కంచము ఏ ఆకులు శ్రేయస్కరము అన్నది కూడా వదిలిపెట్టకుండా తెలిపినారు. ఆకులలో అరటి, మోదుగ, బాదాము, ఆకులు శ్రేష్ఠము మరియు ఆరోగ్య ప్రదము. కంచములలో ఇత్తడి, కంచు, రాగి మరియు వెండి శ్రేష్ఠము. ముఖ్యముగా వెండి అత్యంత శ్రేష్ఠము. వెండి 5 నిముసములలో రోగకారక సూక్ష్మ క్రిములను నాశనము చేస్తుంది. దేహానికి మేలు చేసేవాని జోలికి పోదు. క్షణాలలో శరీరములోని రోగ నిరోధక వ్యవస్థను ధృడపరుచుతుంది.
COLD కు మూలము తగిన చికిత్స కొరకు 1949 నుండి 1999 వరకు ఇంగ్లాండులో అలుపు ఆయాసము లేకుండా పరిశోధనలు చేసి ‘మాకు అంతు చిక్కలేదు’ అని తీర్మానించినారు. ఇందుకు తగిన ఔషధము ఆయుర్వేదములోనే అగుపించుతుందని తీర్మానించినారు. అల్లము, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి, తేనెల వాడకము స్వాస్థ్యతను చేకూరుస్తుందని నిర్ధారించినారు.
చివరిగా, చదివిన వారికి వచ్చే చిన్నదయినా అతి పెద్ద సందేహమును నాకు తెలిసిన రీతిలో తీర్చ ప్రయత్నించుతాను. ఆ వెలుగు మనకు కనబడుట లేదే? కనబడదా? ఎందుకు కనబడదు? అన్నది ఆ ప్రశ్న. కృషి వుంటే మనుషులు ఋషులౌతారు అన్న వేటూరి వారి మాట మీకు తెలిసినదే కదా! ఆ వెలుగును చూడగలిగిన వారే ఋషులయినారు. మరి మనమో, లోపల తళుక్కుమన్నపుడల్లా సంసారమో, పిల్లలో, అందమయిన అమ్మయిలనో/అబ్బాయిలనో సినిమాలనో, షికార్లనో చూసుకొంటూ ఇంకా కాలాన్ని వ్యర్థపుచ్చుతూ ఉన్నాము. సందర్భోచితమని తలచి పెద్దలు చెప్పిన మాట ఈ దిగువన మీకు అందించుచున్నాను.
కావ్యశాస్త్రవినోదేన,కాలో గచ్ఛతి ధీమతాంl
వ్యసనేన తు మూర్ఖాణాం,నిద్రయా కలహేన వాll
ధీమంతులైనవారికి కావ్యశాస్త్రపురాణాది వినోదముతో మనోవికాసముతో, కాలము గడుస్తుంది. మూర్ఖులకు వ్యసనంతో గాని,నిద్రతోకాని, కలహంతోకాని కాలం గడుస్తుంది. కావున
ఇకనైన మేలుకొని, మెళుకువలో కళ్ళు మూసుకొని అంతర్ముఖులమై అనుదినమూ ధ్యానించితే పరమాత్ముని మనలోనే సందర్శించగలము. దానికి అంతః శుద్ధి, బాహ్యశుద్ధి, త్రికరణ శుద్ధి తోడయితే అసలు మనమే పరమాత్మ స్వరూపులమని తెలుసుకొనగలుగుతాము.
మిగిలినది మరొకసారి......
ఆయుర్వేదము-5 (చివరిభాగము)
ఇపుడు ఆయుర్వేదము ఇంకా మనకేమేమి ఇచ్చిందో ఒక పర్యాయము చూద్దాము.
ఈ దిగువన కనబరచిన అంశములను గూర్చి సవిస్తారముగా అందించినది ఆయుర్వేదము.
శరీర ధర్మ శాస్త్రము (physiology )
వ్యాధి లక్షణ శాస్త్రము (symptomatology)
శస్త్ర చికిత్స (surgery)
ఔషధ చికిత్స (drug therapy)
పథ్యము లేక ఆహార నియమములు (diet)
హృద్రోగమును గూర్చి ఇంచుమించు నేటి వైద్య పుస్తకములలో ఉండే విషయములను ఎటువంటి పరికరములు లేకున్నా తమ అతీంద్రియ శక్తితో తెలియ జేసిన ఘనత మన భిషగ్వర శ్రేష్ఠులగు ధన్వంతరి, దివోదాసుడు, చరకుడు, శుశ్రుతుడు, వాగ్భటుడు (అష్టాంగ హృదయం, అష్టాంగా సంగ్రహ కర్త, చరకుల వారి శిష్యుడు, 135 సంవత్సరములు జీవించి, బ్రహ్మచారిగా జీవితము గడిపి తన జీవిత కాలమును వైద్యమునకే ధారపోసిన మహనీయుడు.) మొదలగు నిస్వార్థమగు మహానుభావుల సేవ నేటి పాశ్చాత్య ప్రభావ గ్రహణగతులమైన మన ఊహకు అందనిది.
హృద్రోగ లక్షణములను ఆయుర్వేదము ఎంత చక్కగా వివరించిందో గమనించండి.
అథాథో హద్రోగప్రతీశేదం వ్యాక్యస్వామ్యః యథోవాచా భగవన్ ధన్వంతరిమ్:
  “అయామ్మ్యాథే మారుతజే హ్రదయం తుడ్యతే,
     నిర్మాతియతే ధీర్యతే చ స్పోట్యతే
     పాతిచ త్రిష్ణౌషధాః అచోషామ్ స్యుహు పైతికేచ,
     ధూమాయం చ మూర్ఛా చ స్వేదహకో. ”
(ఈ అధ్యాయంలో భగవన్ ధన్వంతరి (విష్ణుమూర్తి అవతారమైన, ఆయుర్వేద దేవత) వ్యక్తిగతంగా గుండె జబ్బుల లక్షణాలను మరియు గుండెపోటుతో రాబోయే మరణాన్ని వ్యక్తిగతంగా వివరిస్తాడు. “రోగి, కొన్ని సమయాల్లో, హృదయములో సూది పోట్లవలె నొప్పి , అధిక హృదయ కంపనము , మండుచున్నట్లు నొప్పి, కొన్ని సమయాల్లో నొప్పి ఛాతీని గొడ్డలితో రెండు భాగాలుగా విభజించినట్లు ఉంటుంది! రోగికి అసాధారణ దాహము, ఉండవచ్చు, శరీరమంతా మండుచున్నట్లు ఉండుట, శ్వాసావరోధము, విపరీతమైన అలసట, నాసికా రంధ్రములు ఊపిరి పీల్చుటకు చాలవు అన్న తపన, విపరీతమైన చెమట, పాలిపోయిన ముఖము, కొయ్యబారిన శరీరము, చివరకు అపస్మారక స్థితి కూడా సంభవించవచ్చు. ”)
అసలు ఒక ఆయుర్వేద వైద్యుడు, వృత్తిని చేపట్టునపుడు చేసే ప్రమాణము, అల్లోపతి డాక్టరు చేసే హిప్పోక్రటిస్ ప్రమాణమునకంటే ఇంకా నిర్దుష్టముగా ఉంటుంది.
అసలు గ్రీకులు అలెగ్జాండరు కాలములో ఎంతోమంది భారతీయ పండితులను, శాస్త్ర గ్రంధములను భాసరత దేశమునుండి తీసుకో పోయినట్లు ప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడైన పోకాక్ మహాశయుడు సోపపత్తికముగా నిరూపించినాడు.
చరక, శుశ్రుత సంహితలు కాకుండా ఆయుర్వేదములో అష్టాంగ హృదయము,, అష్టాంగా సంగ్రహము, మాధవ నిధానము వంటి అనేక గ్రంధములు ఆయుర్వేద శాస్త్రమును ఆచంద్ర తారార్కముగా నిలిపి ఉంచేవి. బహు భాషలు బహుళ సంస్కృతులు కలిగిన ఈ దేశమును సంస్కృతము ఒకటిగా కట్టి యుంచి యుండినది. మెకాలే కుతంత్రముతో సంస్కృతమునకు నామ రూపములను నామావశిష్ఠము చేసి మన శాస్త్రములకు, విజ్ఞానమునకు దూరము చేసినాడు. నేను చెప్పవచ్చింది ఏమిటంటే ఇన్ని భాషలు, సంస్కృతులు, నైసర్గిక భేదములు ఉండుటచే ఆయుర్వేదము కూడా ప్రాంతీయపరముగా అభివృద్ధి అయి ఉండినది. ప్రతిశాస్త్రమూ దైవత్వముతో ముడిపడి ఉంటుంది. ఆ వాస్తవాన్ని నేడు మనము గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది.
యూరోపు, ఉత్తర అమెరికా, ఆగ్నేయ ఆశియా జపాన్ మున్నగు దేశములలో ప్రత్యేక పాఠశాలలు మరియు కళాశాలను ఏర్పరచి  మన ఆయుర్వేదమును బోధింప జేయుచున్నారు. మనలో చాలా మందికి ఆయుర్వేదమంటేనే చిన్న చూపు. నాకు 10 సంవత్సరములు వచ్చేవరకు కూడా ఆయుర్వేద ఔషధ వైద్యము బ్రాహ్మలు చేసేవారు. రోగి రోగము నయమయిన తరువాత ఇచ్చినస్ది పుచ్చుకోనుతయే తప్ప ఇంత ఇమ్మని ఏరోజూ నిబంధన ఏర్పరుచలేదు. కాలము మారినది అల్లోపతి మందేలేని ‘రొంప’ జలుబు’ పడిశము’నకు (మూడూ ఒకటే) స్పెషలిస్టు డాక్టరు వద్దకు పోతే ముందు 500 రూపాయల ఫీసు గుంజుతూ వున్నాడు. శస్త్ర చికిత్సలు కంటి శుక్లములు మొదలగునవి మంగలి వారు (మంగళమయమగు కార్యములకు ముందుండేవారు) చేసేవారు. ఇక వ్యాధిగ్రస్తుడగు వ్యక్తి చర్మమును వలువ వలసి వస్తే మాదిగ వారు చేసేవారు. అందరూ వారి వారి వృత్తులకు అనుకూలముగా వ్యవహరించేవారు. ఎవరూ ఎవరినీ చిన్న చూపు చూసేవారు కారు. ఈ తారతమ్యాలు ఎక్కువగా బ్రిటీషువారు సృష్టించినవి. విదేశాలకు శాస్త్రములపై ఉన్న శ్రద్ధ చూస్తూవుంటే రాబోయే కాలములో ఆయుర్వేదము అద్వితీయ స్థానమును పొందుతుంది అని నా మనోప్రబోధన. అప్పుడు ఈ అత్యంత ఆధునిక ధనవ్యయ వైద్యము తోక ముడుచుకోనక తప్పదు. ఆయుర్వేదము అమెరికాలో ప్రబలుతూనే మనము అప్పుడు దానిని ఆశ్రయించుతాము. అల్లోపతి తాత్కాలిక, ఆత్యయిక, పరిస్థితులకు మాత్రమే పనికి వస్తుంది.
ఆయుర్వేదము దీర్ఘ  మరియు మొండి రోగములకు చక్కని మందుల నిచ్చుటయేగాక మన జేబుకు అనుకూలముగా వుంటుంది.
ఒక సంస్కృత చాటువు ఈ విధముగా చెబుతూ వుంది.
అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధంl
అయోగ్యః పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభఃll
అంటే వైద్యమునకు పనికిరాని మూలములు అనగా వేర్లు లేక కుదుళ్ళు, బెరడు, ఆకులు ఏవీ లేవు కాకపోతే ఆ విషయమును గూర్చి మనకు క్షున్నముగా తెలిసి ఉండవలెను. అంతే కాకుండా మంత్రము కాని అక్షరము లేదు, అయోగ్యుడగు వ్యక్తి లేదు కానీ ఆయా విషయములను సక్రమముగా ఉపయోగించుకొనే వ్యక్తి దొరకుతయే దుర్లభము.
 వైద్యజ్ఞ చరకుడు ఆయుర్వేదమునకు అతి చక్కని నిర్వచనమునిచ్చినాడు.
జీవితము యొక్క బాగోగులు, సుఖదుఃఖాలు, పరిపూర్ణ అపరిపూర్ణ సుఖమయ జీవితము, జీవిత ప్రమాణములను తెలియజేసే విధానము సుఖమయ జీవన నిదానమైన ఆయుర్వేదము.
సహకారము:
Kutumbiah P. Ancient Indian Medicine.
Hegde BM: Angina an Indian Disease.
David Frawley.  Ayurveda and the Mind. 
 స్వస్తి.


Sunday, 2 February 2020

వాచాలత-ఇది ఒక కథ


వాచాలత-ఇది ఒక కథ
ఇది యేదో నా విషయములో జరిగిన ఉదంతమని పొరపడవద్దు. ఇది కేవలము నా కల్పన మాత్రమే. ఉత్తమ పురుష లో వ్రాస్తే బాగుంటుందని వ్రాసినాను. నవ్వు వస్తే ఆపుకోవద్దని మనవి. ఈ కథ 2014 ఫిబ్రవరి, 3 న నేను ఆస్య గ్రంథిలో ప్రకటించిన కథ. ఆదరణ అమితముగా పొందుటచే 6 సంవత్సరముల తరువాత తిరిగీ మీ ముందు ఉంచుచున్నాను.

వాచాలత
అనగా అనగా ఒక నేను. పెద్దవాడయిన తరువాత ఆ నేనుకు ఒక శిష్యుడు. నా గొప్ప తెలుపుటకు "శిష్యా! 'వాచాలత' అన్న శీర్షిక క్రింద మొన్న జరిగిన ఒక ఉదంతము వ్రాయబోవుచున్నాను"అన్నాను. " "గురువు గారూ ఒక చిన్న సందేహము " లత అంటే ఒక అమ్మాయి పేరని నాకు అర్థమైనది మరి వాచా అంటే ఏమిటి ? బహుశా వాచి + ఆ = వాచా అని అను కొంటాను. అంటే వాచ్ కట్టుకొన్న ఆ లతా ను గూర్చి వ్రాయబోతున్నారన్నమాట" అన్నాడు. అప్పుడు జీవితములోని ఒక వాస్తవము నా కర్థమైనది. అది ఏమిటంటే 'పిచ్చయ్య పుల్లట్ల కొట్టుకు పిజ్జా లకోసం రారు కదా'అని, వానితోనే సర్దుకు పోతున్నాను ఏదోవిధంగా . నేను వానితో వచస్సు అంటే మాట రా వాచాలత అంటే అవసరానికి మించి మాట్లాడుట అంటే అధిక ప్రసంగము అని అదీ కాదంటే నోటి దురద అని అర్థము చెప్పి ఒప్పించే లోపు తల బొప్పి కట్టింది.
మా నాన్న నాకు రామ మోహన్ రావు అని పేరు పెట్టినా రాముడూ అని ఎంతో ప్రేమతో పిలిచేవారు. అమ్మ లేని నన్ను పెంచిన అమ్మమ్మ కూడా ఆ విధంగానే పిలిచేది. నేను ఒంటరిని తుంటరిని కావడంవల్ల మా నాన్న నాకు ఏదో ఒక పని చేయమని చెప్పేవాడు. అప్పుడు రాను రానూ నాకు అర్థమైంది నన్ను రాముDO అని ఎందుకు పిలుస్తాడో అని. కానీ బయటి వారు పనిచేబితే తప్పించుకొనుటకు వీలుగా చివర 'రావు' చేర్చిన ఆయన చాకచక్యాన్ని నేను మరచి పోలేను.
ఇక మోహన శబ్దాన్ని గూర్చి ఒక్క మాట. అయిన వాళ్ళు పిలిస్తే వినటానికి మనసుకు ఎంత సంతోషంగా వుంటుందో, మనసుకు కానివాళ్ళు అంటే ఎదో బాధ.  వాళ్ళనోటినుండి ఆమాట విన్నప్పుడల్లా మోహనా‘కారం’ అన్నట్లనిపిస్తుంది కానీ మొహనాకారం అని అనిపించదు. ఇది లౌకికము లేని నేను తెలుసుకొన్న సత్యము. మీరు కూడా తెలుసుకొంటారు ఈ నిజము.
       నా శిష్యుడు అనవలెనో నా పరమానందయ్య శిష్యుడు అనవలెనో నేను తేల్చుకోలేక యున్నాను గానీ నేనెక్కడికి పోయినా నా వెంబడే 'లైఫ్ బాయ్ ఎక్కడ వుంటే ఆరోగ్యము అక్కడ వున్న'ట్లు నాతోనే ఉంటాడు. ఒకవేళ ఎవరైనా ఏ సభకో సమావేశానికో పిలిస్తే 'కారులో పోదా'మని నేనంటే నా శిష్యుడు ఈ విధంగా అనేవాడు "గురువుగారూ మీరు ప్రాయములో వున్నవారు కారు ఏటికి నడచెదము రండి బయటికి" అనేవాడు.మొదట్లో వాడు నన్ను 'ప్రాయములో వున్నవాని'గా పోగడుచున్నాడని ఎంతో సంతసించే వాడిని. ఒక రోజు నా భార్య నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను పిలిచి "వాడు మిమ్మల్ని గౌరవించుటలేదు సరికదా ఎగతాళి చేస్తున్నాడు అని చెప్పింది. నేను ఆశ్చర్యముతో అదెట్లు అన్నాను. తాను ఇట్లు చెప్పింది"వినండి. గురువుగారూ మీరు ప్ర్రాయములో వున్నవారు కారు, ఏటికి వెళ్ళెదము రండి" అంటే మీ ఆత్మను, బ్రతికి ఉండగానే, పరమాత్మలో కలుపుతాను అని అంటున్నాడని చెప్పింది. విస్తు పోవటం నా వంతయింది . వాని మనోభావాన మీకు చెప్పుకోలేనుకాని నాకు పూర్తిగా అర్థమైపోయింది. నా మూర్ఖత్వం నా భార్యాశిష్యులమధ్య దాక్కొంది.
ఒకసారి నాలో ఏమి కనిపించిందనోనన్ను వక్తగా ఆహ్వానించినారు ఒక మోస్తరు సభకు. సాయంకాల సభ కాబట్టి, 'వక్త' గా పిలచినా 'భోక్త'ను కూడా చేస్తారనే నమ్మకముతో సరే అన్నాను, నా శిష్యుని సలహా మేరకు, ఆపై నాకు చేదోడు వాదోడుగా ఉంటాడన్న భరవసాతో, భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా అగర్ బత్తీ లాగా. కార్యకర్త కనిపించకుంటే నాశిష్యునితో అతనిని పిలువమన్నాను. వాడు వెళ్లి సవినయంగా ' గురువుగారు రమ్మంటున్నా'రని చెప్పినాడు . ఆ మహాశయుడు ఏ లోకములో ఉన్నాడో 'rum' అని వూహించి, కంఠ శుద్ధి కోసమేమోనని భావించి ఏ బ్రాండన్నాడు. గతుక్కుమన్న శిష్యుడు తన సరళి మార్చి 'మిమ్ము మా గురువుగారు పిలువమన్నారు' అని అర్థమయ్యే భాషలో చెప్పి, నా చెంతకు చేర్చినాడు. అతనితో ముచ్చటించవలసిన నాలుగు మాటలూ ముచ్చటించినతరువాత "మీరు నాకొరకు ఏర్పాటుచేసిన ఈ 'రజని' నా మనో రంజనియై మదిలో పదిలంగా వుంటుంది " అన్నాను, అతని ఇల్లాలు అతని ప్రక్కనే వున్నది గమనించకుండా . "మీకు సభ్యత సంస్కారము శూన్యమనిపిస్తూంది నాకు , ఈవిడ నాభార్య 'రజని' " అన్నాడు అగ్గిమీద గుగ్గిలంలా సెగలు పొగలు కక్కుతూ. అనర్థాన్ని ఆపే ప్రయత్నంగా నేనతనికి క్షమాపణ చెప్పి , 'రజని'కి చీకటి అన్న అర్థము ఒకటుందనినా పాండిత్యాన్ని తెలిపే ప్రయత్నములో పప్పులో/తప్పులో కాలు వేసినానని చెప్పి ఆ గండం నుండి గట్టెక్కినాను.
శ్రోతలతో సభనిండింది, నాలోని పస పిస పిస అని తెలియక. సభాధ్యక్షుణ్ణి,నన్ను వేదిక మీదికి ఆహ్వానించినారు. కూర్చున్న తరువాత శ్రోతలకు పరిచయ వాక్యాలు చెప్పే అతడు వచ్చే లోపు నేను అధ్యక్షునితో "సభ నిండుకున్నది" అన్నాను. అతడు ప్రపంచములోని అసహ్యమునంతా ముఖముపై అలదుకొని ఒక బొద్దింకను చూసే చూపులతో "నిండుకున్నది " కాదండి "నిండుగున్నది" అని అనవలె నన్నాడు. నేనన్న దానిలో తప్పేమి అని అడిగి నా మూర్ఖతను ఇంకా ప్రదర్శించకముందే "నిండుకున్నది" అంటే 'ఏమీ లేదని' అర్థము అని విశధ పరచినాడు, ఇది తెలియదా నీ  'ఉడతలు పట్టే వాని ముఖము' నీవూనూ అన్నట్లు చూస్తూ.
ఎందుకో గానీ 'పోడియం' వద్ద మైకులు రెండు ఎర్పాటు చేసినారు. పరిచయ వాక్యాలు మొదలైనవి ముగిసిన తరువాత పోడియం వద్దకు నన్ను ఆహ్వానించినారు. ఆనందాతిరేకం లో అప్రయత్నంగా కాలికి మైకుల వైర్లు తగిలి పడబోతూ తమాయించుకొని పోడియం వద్దకు చేరినాను. నాకాలు తగలటము వల్లనేమో ఏదో Connection లూజై మైకులు పనిచేయుట మానివేసినాయి. సైగ చేసి నా శిష్యునితో చెప్పినాను. వాడు'మై'అన్నఅక్షరము పలికి, ఒక క్షణము,  ఏమైందో ఏమో, విరామమిచ్చి,   'కులట’ అంటున్నారు గురువుగారు' అని వాడు బిగ్గరగా అన్నది చుట్టు ప్రక్కల అందరికీ వినిపించింది. అంటే వాడు ‘మై’ 'కులట’ అన్నట్లు అందరికీ అనిపించింది. గతములో నాతో ఇలాంటి చేదు అనుభవము కలిగిన నిర్వాహకుడు ఆగ్రహోదగ్రుడై వీధి భాగవతంలో వీరభద్రునివలె విజృంభించి ఆంగ్లములో "Who is this useless person and what is this nonsense. How can he dare to say కులట" అని కోపం తో ఊగిపోతూ ఇంకా ఎదో అనే లోపే ఆ మాటలు లీలగా వినిపించిన నేను 'మైకు' 'మైకు' అన్నాను. తనతప్పుకు నాలుక కరచుకొని 'మైకులు సరిచేయించినాడు నిర్వాహకుడు. నేను మైకం వదిలించుకొని మైకు చెంతకు చేరి గొంతు సవరించుకొని నా ఊపన్యాసమును ఆరంభించినాను.
సభకు నమస్కారం
మా ఇంటి పేరు చెరుకు
నాకు మాట్లాడడమంటే బెరుకు
మైకంటే మనసు వెనక్కు ఉరుకు
ఎందుకంటే నాలో లేదంత సరుకు"
అని అన్నాను .
అంతే కరెంటు పోయి కటిక చీకటి ఆవహించింది ఆ ప్రదేశాన్ని. జనరేటరు పని చేయక జనం ఇంటి దారి పడితే నేను కూడా అదేపని చేసినాను శిష్యుని సహాయంతో.
నీతి: ఉన్నదెంతో తెలియకుండా లేనిది ఆశించకు
స్వస్తి
Medhekonduru Visswanath Prasad బావున్నది మైకోపాఖ్యానము. మై-కులట పదప్రయోగమూ హాస్యభరితమూ....రజనీ అంటే చీకటీ అని అర్ధం కూడా ఉన్నదన్నమాట. ఏటికి నడిచెదము......పది సార్లు చదివితే గాని అర్ధము కాలేదు. ఉత్తమపురుషలో వ్రాయడం వలన హాస్యం పండినది అనుకుంటాను
3Manohar Borancha కోకెత్తుకెళ్ళింది కొండగాలీ.....అని రికార్డ్ ప్లే అవుతున్నది. పిన్ను పాడయ్యో ,రికార్డ్ పాడయ్యో కోకెత్తు , కోకెత్తు కోకెత్తు కోకెత్తు అని ప్లే అవుతుంటే.. ఒక రసికుడు నాలుగు వైపులా చూసాడు ఆత్రంగా !!
3Subrahmanya Chakravarthi Oruganti హహహ.. సూపర్. ఇది చదివిన తర్వాత నాకో జోకు గుర్తొచ్చింది. శోభనం గదిలో శబ్దాలు వినిపించకుండా ఒక ముందుచూపున్న పెళ్ళికొడుకు గ్రాంఫోన్ సెటప్ చేసి "ఏ దూరదేశాల" అన్న పాట పెద్ద సౌండుతో పెట్టాడట. రికార్డు అరిగిపోయి 2,3,4 అక్షరాలే రిపీటెడ్ గా ప్లే అయ్యాయిట.
3Manohar Borancha Ammo! Subrahmanya chakravarthi oruganti gaaru Rasikule!!!
2D Subrahmanyam hahaha super
B V Narasimha Rao Vachi +lata chala Bagunnadandi.enjoyed the Humor.Dhanyavadamulu.
1Jayanthi Kumar Peyyeti "PRAYAMU"--- RUMmantunnaru--baagunnayi
1Kalyani Gauri Bhamidipati Kadupubbanavvincheru.konnivyakthi
1Kalyani Gauri Bhamidipati Gatha kaaranaala valla! Udaaseenam vunna naa manasu kadu vullasa parachinadi mee lekhinee chaathuryam dhanyavaadlu\
Cheruku Ramamohanrao చాలా సంతోషమమ్మా
Sriramachandramurthy Poduri Mee Hasya spurtiki dhanyavadamlu
1Srinivas Iduri గురువుగారూ రాముDO ప్రయోగం బాగుంది. మనం ఏది రాసినా అది మనకే ఆపాదించే పాఠకుల పుణ్యమా అని రాసేటప్పుడు పరిపరివిధాల ఆలోచించాల్సి వస్తున్నది. మీరు ముందే చెప్పి జాగ్రత్త పడ్డారు :)
1Vijaya Suvarna 'వాచా 'లత' గురించి మీరు వివరించిన మొదటి సన్నివేశమే నవ్వు ఆపుకోలేనంత ... నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళుతూ చదివినప్పుడు, మొదట చిన్న నవ్వుతో మొదలయి, తరవాత కిసుక్కుమని నవ్వుతుంటే, చుట్టూ ఉన్నవాళ్ళు వింతగా చూస్తున్నారు. నా చేతిలో ఉన్న పరికరాన్ని బట్టి వాళ్ళకు అర్థం ఐపోయి ఉంటుందనే అనుకుంటున్నాను... ధన్యవాదాలండి ...

Wednesday, 22 January 2020

వందేమాతరం


వందేమాతరం
ఈగీతము యొక్క పూర్తి పాఠమును ఈ దిగువన కనబరచుచున్నాను. ‘మన జాతీయ గీతము’ అన్న శీర్షిక గల వ్యాసమును 25వ తేదీ లోపల ముగించు ఉద్దేశ్యముతో ‘వందేమాతరం గేయము యొక్క పూర్తి పాఠమును దాని భావమును నాకు చేతనయిన రీతిలో స్వేచ్ఛానువాదమును, ఈ రోజే మీ ముందుంచుచున్నాను. ఇందు దేశమును మాతగానూ, మాతను దుర్గా, లక్ష్మి, సరస్వతులతోను బంకించంద్రుడు పోల్చినాడు కానీ ఈ గీతమును దుర్గ యొక్క గుణ గానమును చేస్తూ వ్రాయలేదు అన్నది చదువరులు తక్షణమే గ్రహించగలరు. రవీంద్రుడు అంటే  సూర్యుడు,(బంకిం) చంద్రుని తన వెలుగులోనే ఉనికిని చాటుకొమ్మంటాడు కదా! రేపు మన జాతీయ గీతము-4వ భాగముతో కలుద్దాము.
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం వందేమాతరం
భావము: నా స్వేచ్ఛానువాద గీతము(యథా తథ అనువాదము కాదు)
నమామి మాతా నమో సుజాతా
కరుణా భరితా కామిత సరితా
గలగల గంగా ప్రవాహగతుల
సుందరవనముల సుమధుర ఫలముల
మలయానిలముల మంద వీచికల
సస్య శ్యామలా సాధన శీలా llనమామిll
శరదృతువులో శశిబింబముతో
తారలు కలిసిన తరుణము నందున
విరిసే తరువుల విరుల శోభతో
పున్నమి నవ్వుల పులకరింతతో
అవ్యయ వరములు అతులిత సుఖమును
అందగజేసే  అసమదేవతా llనమామిll
కోటి కంఠముల కోటి కరముల
కరాళ ధ్వనితో ఖర శస్త్రమ్ముల
నిర్బలావళికి నిబ్బరమొదవే
బహుబల ధారిణి బహు వ్యథ తారిణి
రిపుదళ వారిణి శుభ ఫల కారిణి
భారత మాతా భవ్య సుచరితా llనమామిll
నీవే ఆద్యవు నీవే విద్యవు
నీవే ధర్మము నీవే మర్మము
నీవే ప్రాణము నీవే త్రాణము
సకల శుభంకర శక్తివి భుక్తివి
శుభముల మూలము శోభన మయము
ప్రతి హృది గుడిలో ప్రతిమవు నీవే
పావన చరితా పాడెద గరిత   llనమామిll

దశహస్తాయుధ ధారిణి ద్యుమణీ
కమలామల కాంతార విహారిణి
ధరణీ విద్యా ధారిణి భరణీ
శ్యామల సుహృది సరళా  విరళా
అమలా సుజలా అతులా సుఫలా
వందే మాతా వరప్రదాతా    llనమామిll

Wednesday, 25 December 2019

భారతమందున గుహ్య భాషణము


భారతమందున గుహ్య భాషణము
భారతమునందు గుహ్యభాషణము
భారతము అంటే పాండవులు కౌరవులు కృష్ణుడు, శకుని, కర్ణుడు, భీష్ముడు ద్రోణుడు మొదలగువారు తెలుసు సాధారణ పాఠకుడికి. కానీ అది  అశేష అనర్ఒ రత్ఘ సముదాయమును కల్గిన మహార్ణవమని ఎందరికి తెలుసు. నేటి యువతకు తెలుగు భారతము చదివే శక్తిలేదు. కొందరికి అసలు ఆ ఉద్దెశ్యమే లేదు. లక్షలు పెట్టి Motivation Lectures కు పోతారు గానీ అవన్నీ ఒక వ్యాసభారతము కలిగియున్నది అన్నది  ముఖ్యముగా యువత తెలియలేకున్నది. ఒక్క భగవద్గీత తప్పించి ఆంద్ర భారతము కూదా అంతే గొప్పగా వ్రాయబడినది. భగవద్గీత తెనిగింపబడలేదు. వాడుకభాష పేరుతో మనకు సకల ఆంద్ర గ్రంధములనూ దూరము చేసి, ఆంగ్లేయులచే బిరుదములు పొంది, ఆధునిక వాదులచే అందలమెక్కి ఊరేగుచున్న మహనీయులకు నమస్కారము.
భారతములోని కొన్ని ఘట్టములలో ఆయా పాత్రలు తమ మధ్య, మిగతా పాత్రదారులుండగనే, రహస్య సంభాషణలు జరుపుకొన్న సంనివేషములు ఉన్నాయి. అందు రెండు మీకు అందజేయుచున్నాను. చదివేది.

యో జానాతి సంప్రజ్ఞాం నీతి శాస్త్రానుసారిణీంl
విజ్ఞాయేవ తథాకుర్యాదాపదం నిస్తారేద్యథాll
నీతి శాస్త్రమును అధ్యయనముచేసి అనుసరించేవాడు తదనుగుణముగా వ్యవహరించి ఆపదలను  బాపుకొంటాడు  అన్నది నీతిశాస్త్ర నిర్వచనము. నీతి జీవితరీతి అయినదంటే ఆ వ్యక్తి ఆలోచనకు పెద్దపీట వేస్తాడు. అందువల్ల ఆపదలను దరి రానీడు. తనమాటపై గౌరవమున్నా లేకున్నా తానూ చెప్పదలచినది చెప్పుటకు తటపటాయించడు. తనలోని చురుకుదనముతో తనకు అయినవారికి పదిమంది మధ్యలో ఉన్తూకూడా తానూ చెప్పదలచినది గుహ్యమయిన రీతిలో తెలియజేస్తాడు. తనకూ తానూ చెప్పెవ్యక్తికి నడుమ అంతటి ప్రగాఢ సంబంధము నెలకొనియుంటుంది. దీనిని అనుసరించి మన వ్యాస భారతములో ప్రకాశముగా జరిగిన అంటే ఒకవ్యక్తి తాను చెప్పదలచినది చెప్పవలసిన వ్యక్తితో చెప్పవలసిన మాట బిగ్గరగా అతని చురుకుదనమును అంచనావేసి అతనికి అర్థమయ్యే రీతిలో చెబుతూ ఉంటాడు కానీ చుట్టూ వున్న ఇతరులకది చేతిలో కోయుటకు కత్తిలేని పనసపండే!
ఇటువంటి సంభాషణల ద్వారా ఒక విషయము మనకు తెలియవస్తూవుంది. ఈ సంస్కృత భాష ఈ  సంస్కృతి ఇప్పటిదికాదు మరి ఎప్పటిదో తెలియదు అని. ఎందుకంటే ఒక క్రొత్త భాష పుట్టవలెనంటే దానికి  ఆలంబనమగు ఒక భాష ఉంది తీరవలసిందే! తరచి చూసినవారికి గ్రీకు లాటిన్ అరబిక్ ఫార్సీ వంటి అతిపురాతనమైన భాషలని చెప్పుకొనే భాషలకు కూడా జన్మస్థానము అని తెలుస్తుంది. మరి అత్తిభాశాలకన్నా పురాతనమైన భాష సంస్కృతము. దీనిని దేవ భాష అన్నారు. కావున ఇది భగవద్దత్తము. అంత పురాతనమైన భాష కావుననే,  ఎన్నేన్నో కల్మషములు కలిసినా కూడా  గంగ తన మౌలిక గుణములు పోగొట్టకొనకుండా కొనసాగుచున్నట్లు, ఎంతో పాత భాశ్జలుఇగా చెప్పబడే Latin, Old English, Aramaic, Ancient Greek, Old Norse, Coptic, Iberian, Etruscan మొదలగు భాషలెన్నో కాలగర్భములో కలసిపోయినవి. కానీ అన్నివిధములగు ఆటుపోటులకు ఎదురునిలచి సంస్కృతము తన ఉనికిని కాపాడుకొంటూ వున్నది. అసలు మన దేశాభాషలలోనే కాదు ప్రపంచ భాషలలో కూడా సంస్కృత పదాలను కలుపుకొని మాట్లాడబడని భాష లేదు.
అంత పురాతనమైన మరియు నిర్దుష్టమైన వ్యాకరణము కలిగిన భాష కాబట్టే ఇంకా బట్టకట్టుకొని భూమిపై నిలబడింది. అందువల్లనే ఆభాషకు ఎందఱో మహానుభావులు ఎన్నేన్నో వన్నెలు తీర్చిదిద్దినారు.
అందులో ఒక పంథా ఈ గుహ్య సంభాషణము. ఇందుకూడ మూస పోసినట్లు ఒకే విధమును నాడు అన్సరించలేదు. ఈవిశాయమును రుజువు పరుచుటకు వ్యాస మహాభారతములోని రెండు ఉదంతములను విడివిడిగా తీసుకొని వివరింపబూనుకొనుచున్నాను.
మొదటిది ఆది పర్వములోని లాక్ష్యాగృహ దహనము. రెండవది ఉత్తర గోగ్రహణము.
ఇటువంటి సంభాషణల ద్వారా ఒక సమూహములో తనమాటలు తాను అనుకొన్న విధముగా అర్థముచేసుకొనగల మరియొక వ్యక్తికి మాత్రమే అర్థమయ్యే రీతిలో పదముల విరుపులోగానీ అక్షరమును అధికముగా చేర్చుట చేతగానీ లేక తీసివేయుట చేత గానీ లేక  ఉన్న అక్షరమునకు బదులుగా కొంత భిన్నముగా శబ్దించే అక్షరము ఉంచుటవల్ల గానీ మనసులోమాట తెలియజేస్తాడు. ఎంత భావుకత, ఎంత భాషపై పట్టు వుండవలెనో ఈ ఉదంతములు మనకు తెలుపుతాయి. వరుసక్రమములో మొదట లక్క ఇంటి తగులవేతను తీసుకొందాము. ఇది భారతములోని ఆది పర్వములో వస్తుంది. ముందు నాలుగు మాటలు ఈ లక్క ఇంటి నిర్మాణమునకు హేతువు తెలుసుకొందాము.
దుర్యోధనుడు కపటోపాయము కలిగినవాడై  కొందరు మంత్రులను పాండవుల వద్దకు పంపి  వారణావతమను పట్టణమును గూర్చి  ఆసక్తి కలిగింప జేస్తాడు. చూడవలెనన్న కుతూహలము కలిగింన పాండవులు దృతరాష్ట్రుడు కూడా " మీ తల్లితో కొంతకాలం  వారణావతములో విశ్రాంతి తీసుకుని రండి. గంగా తీరాన ఉన్న ఆ నగరం అత్యంత ఆనందదాయకముగా ఉంటుంది అని విన్నాను." అని అనుటచే! ధర్మరాజు వల్లెయని భీష్మ, ద్రోణ, కృపాది పెద్దల ఆశీస్సులతో  తల్లిని, తమ్ములను వెంట పెట్టుకుని వారణావతము బయలుదేరుతాడు. అనుకొన్న ప్రకారము జరుగుచున్నందుకు ఆనందము చెందుతాడు దుర్యోధనుడు. కారణమేమిటంటే  పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణునిచే ముందుగానే వారణావతములో పాండవుల కొరకు లక్క, మట్టి, నెయ్యి, మిశ్రమంతో చేసిన సువిశాల భావన నిర్మాణమును చేయించి అందు పాండవులు ఉందుటకు  ఎన్నో సదుపాయములను ఏర్పరచి యుంచుతాడు. ఏమరుపాటుగా, నిద్రలో ఉన్న  సమయములో  గృహదహనమునకు  ఆదేశించుతాడు.. విదురునికి ముందే ఈ విషయము చూచాయగా తెలుసును కాబట్టి  ఎంతో నర్మగర్భముగా ధర్మరాజుతో తన సందేశాన్ని ఈ శ్లోక రూపములో చెబుతాడు.
అలోహం నిశితం శస్త్రం  శరీర పరికర్తనం l
యోవేత్తి నతుతం ఘ్నంతి ప్రతిఘాత విదం ద్విషఃll
బాహిరమగు అర్థము ఏమిటంటే లోహము అనగా ఇనుము ఉక్కు తో చేయబడని వాడియగు ఆయుధముతో  శరీరమును ముక్కలు చేయగలదు. అది తెలుసుకొని దానిని నిర్మూలించకుంటే ఎదురుదెబ్బ తినే అవకాశము ఉంటుంది.
కానీ ఆంతరంగికముగా ఆయన ధర్మజునకు మాత్రమే అర్థమయ్యే విధముగా ఏమి చెప్పినాడంటే
అ‘న’ల+ ఊహం = అనలోహం (‘న’ అధికముగా చేరింది.)= అగ్నిని ఆకర్షించే వస్తువులతో
నిశి+తం+శస్త్రం= నిశి+తం+సస్త్రం(‘శ’ కు బదులుగా ‘స’ ను ఉంచుకోవాలి. సస్త్రం అంటే ప్రాసాదము లేక భవనము అన్న అర్థము ఉన్నది. సప్తి అస్మిన్ ఇతి సస్త్రం అన్నది వ్యుత్పత్తి. అంటే ఇక్కడ ‘స’ కు బదులుగా ‘శ’ వాడి వర్ణవికారము చేయబడినది.) ఎందుకంటే రాత్రివేళ ఆ భవనములోనే కదా వారంతా నిదురించుతారు. కాబట్టి ఆసమయమున వారికి దాహక పదార్థ సంయోగముచె కట్టబడిన ఆభవానములో   ముఖ్యముగా రాత్రి సమయమున జాగ్రత్తగా ఉండమని చెప్పినాడు విదురుడు.  
ఇక్కడ రహస్య సంభాషణమునకు తోడుగా నాటి వాస్తు కళ మరియు గృహనిర్మాణ వైశిష్ట్యము మనకు తెలియవస్తూవున్నది. భారతమును కథ కొరకు గాక అందులోని విశేషములను, విశేషణములను చాలా జాగ్రత్తగా చదువవలసి ఉంటుంది. మన భాషా నిర్లక్ష్యత మనలను ఆంద్ర భారత , భాగవతము వంటి ఎన్నో మహాకావ్యములను కనీసము తాకే యోగ్యత కూడా లేవకుండా చేసినది, వ్యావహారిక భాషా ఉద్యమము. ఆంగ్లేయుల ప్రాపు కోరి తెలుగునకు తెగులు తగిలించిన మహానుభావులకు, ఈ సందర్భమున నమస్కరించక ఉండలేక పోతున్నాను.
ఇక రెండవ ఉదాహరణము చూద్దాము.
ఉత్తర గోగ్రహణ కథ నేరుగా భారతము ద్వారా చదివినా చదవకున్నా నర్తనశాల సినిమా చూచుట ద్వారా ఎక్కువమందికి పరిచయమైయుండవచ్చునన్న ఉద్దేశ్యముతో నేను తిరిగీ ఆ కథను ఇక్కడ తెలుపబోవుట లేదు, కానీ ఆ సందర్భమును  ఇచట ప్రస్తావించుచున్నాను. అర్జునుడు, బృహన్నల వేషమును వీడి విల్లంబులు ధరించి ఉత్తరకుమారుడు సారధ్యమును నెరుపగా కౌరవులను ఎదిరింప బయలుదేరినాడు.
దూరక్ము నుండియే వచ్చేడు వాడు పార్థుడని సందేహించి అతని అజ్ఞాతవాస సమయము ముగిసినదో లేదో అని డోలాయమనస్కుడై భీష్మునితో మాట్లాడే ఘట్టములో ఆయన తన ప్రక్కనున్న భీష్మునితో  చేసిన నర్మ గర్భ సంభాషణము మన ప్రస్తుత రచనా వస్తువు.
తమ తమ రథాలలో భీష్మ ద్రోణ దుర్యోధనులు ప్రక్క ప్రక్కనే ఉంటారు. ద్రోణుడు తన సందేహమును నేరుగా భీష్మునకు ఎరుకపరుపలేదు, దుర్యోధనుడు విని తనను తప్పుగా తలచుతాడు కాబట్టి. కావున భీష్ముడు మాత్రమే అర్థము చేసుకొను రీతి, ఈ శ్లోక పాదములో తన సందేహమును వెలిబుచ్చుతాడు:
నదీజలం కేశవ నారికేతుః నగాహ్వయో నామ నగారి సూనుః 

నదీజలం, కేశవ, నారి, కేతు, నగాహ్వాయ, నగారి అన్న పదాలకు అర్థ అన్వయము కుదరదు. భీష్ముడు ద్రోణుడు యుద్ధకోవిదులే గాక బుద్ధికోవిడులు కూడా కాబట్టి ఒకరు చెబితే మరియొకరు అర్థము చేసుకోన వలసిన రీతిలో అర్థము చేసుకొన్నారు. ఇటువంటి సంభాషణ మనకందించిన వ్యాసులవారికి సాష్టాంగ పాదాభివందనము చేయుచున్నాను. ఈ శ్లోక పాదము 39వ అధ్యాయములోని 10 వ శ్లోకమని విన్నాను గానీ నా వినికి లో పొరబాటు కూడా దొరలియుండే అవకాశము ఉంది. అయినా ఈ శ్లోకము మాత్రము నిర్ద్వంద్వముగా ఆ ఘట్టము లోనిదే!
పై శ్లోక పాదమును అర్థవంతము చేయుటకు ఈ విధముగా విభజించుకొనవలసియుంటుంది.
  
నగ=న గచ్చతీతి నగః, అంటే అది చెట్టయినా కావచ్చు కొండ లేక పర్వతమైనా కావచ్చు. ఆహ్వాయము అంటే పేరు అని అర్థము. కావున నగాహ్వయ అంటే ఒక చెట్టు పేరును తనపెరుగా కలిగినవాడు అనిఅర్థము. మరి అర్జునము అన్న పేరుగల చెట్టు ఉన్నది కదా!  కావున ఆ వ్యక్తి పేరు అర్జునుడు. ఇక నగారి =పర్వతముల శత్రువు, ఇంద్రుడు, సూనుడు=కుమారుడు. అర్జునుడు ఇంద్రుని కుమారుడే కదా! ఎంతటి ప్రచ్ఛన్న భావ గర్భితమో చూడండి. ఇటువంటి, ప్రపంచ భాషలకే మాతృకయైన మన సంస్కృతమును వదులుకొన్నామే, లేశమాత్రమైనా చింతపడనవసరము లేదా, శిగ్గుపడలేకపోయినా!!
ద్రోణుడు చెప్పిన మాటను విని అర్థము చేసుకొన్నవాడైన భీష్ముడు, చెంతనున్న రారాజును కాదని ఆచార్యునితో సంభాషించుట సవ్యము కాదని ఎరింగి సందేశము ద్రోణుని చెవిని పడునట్లు బిగ్గరగా మాటలాడదొడగినాడు. ఇద్దరు పరిపక్వత గడించిన వృద్ధుల మధ్య గలుగు సంభాషణా చాతుర్యము, అవగాహనా సాన్నిహిత్యము ఈ సంభాషణ తెలియజేస్తుంది. తిక్కన ఈ విషయమును, వ్యాసుని తన శైలిలో అనువదించినాడు. అంటే భాషణా చతురత ద్వాపరములో ఎంతటి ఉన్నత శిఖరమును చేరియుండినదో మనము గమనింపవచ్చును. తిక్కన సంస్కృతాంధ్ర పాండిత్యము మరియు లోకానుభవము ఈ పద్యము చాటుచున్నది.
తలపగ రిపులకు నిమ్మగు
కొలది గడచి వచ్చితిమి: యకుంఠిత బాహా
బలము నెరప దరియయ్యెను
జలిమ్పవలదింక మనకు శత్రుల వలనన్
తలపగన్=నెమ్మదిగా ఆలోచిస్తే: రిపులకున్=శతృవులకు: ఇమ్ము+అగు=అనుకూలమైన: కొలది=హద్దు (కొద్ది, అన్న అర్థమే కాకుండా ఈ అర్థము కూడా వున్నది. ఇదికాక మరో అర్థము తరువాత తెలుపుతాను): కడచి వచ్చితిమి=దాటి వచ్చినాము:
అకుంఠిత బాహాబలము= మొక్కవోని మన భుజబలమును: నెరపన్=చూపుటకు: తరి=సమయము అయ్యేన్=ఆసన్నమైనది:
శత్రులవలనన్= శత్రువులవలన మనకున్=మనకు, చలింపవలదు=బెడురనవసరము లేదు.
దుర్యోధనుని వైపు చూసి చెబుతున్నాడు కదా మరి అప్పుడు భీష్ముడు తాను చెప్పేమాట అన్వర్థకముగా ఉండవలెను కదా! అందుకే పాండవుల ప్రస్తాపనే లేకుండా శత్రు సీమలు దాటినాము ఇక మన బాహుబలము వారికి నిస్సంశయముగా చవిజూపవచ్చును అని అన్నాడు. మరి ద్రోణునికి ఇవే మాటలతో సందేశమును ఏవిధముగా చేరవేసినాడో చూద్దాము.
తలపగన్=పరిశీలించగా(లెక్కించగా)రిపులకున్=శత్రువులైన కౌరవులకు: ఇమ్మగు=అనుకూలమైన: కొలది=కాలపరిమితి అనగా గడువు (ఇక్కడ అర్థము మళ్ళీ మారినది. సందర్భ శుద్ధికి ఉపయోగించు ఇటువంటి అనర్ఘ పదరత్న సంపదను చేజేతులారా నాశనము చేసుకొంటున్నాము. ఇకనైనా కళ్ళు తెరుస్తాము అన్న ఒక సదాలోచన మనకు కలుగక పోతుందా అని శ్రమకోర్చి ఇటువంటి మాణిక్యములను రత్నగర్భలైన మన కావ్యములనుండి వెలికి తీసి మీముందు ఉంచుతున్నాను.): అకుంఠిత బాహాబలమున్ నెరుపన్= మొక్కవోని భాహుబలమును ప్రదర్శింప ససమయమేతెంచింది: శత్రులవలనన్=శత్రువులగు కౌరవులవలన, మనకున్=మనకు(ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే భీష్మద్రోణులు బాహిరముగా దుర్యోధను పక్షమే అయినా అంతరంగమున వారు పాండవ పక్షమే! అందుకే ‘మనకు’ అన్న శబ్దము వాడబడింది. ‘మనమిరువురము’ అనికూడా అన్వయించుకొనచ్చును)చలింపన్ వలదు=బెదర పని లేదు.
గడువు ముగిసింది కావున మనము భయపడనవసరము లేదు. వచ్చేడువాడు ‘ఫల్గుణుడే! ఎంత గంభీరమైన విషయాన్ని ఎంత సునాయాసముగా చెప్పినాడో చూడండి.
అప్పుడు ద్రోణుని మానసిక స్పందన చూడండి.

అనవుడు నాచార్యుం దయ్యర్థంబు గనిగొని పార్థునకు సమయ భంగంబు వలని సంకటంబు లేకునికి మనంబునంప్రియంబంది మొగంబునన్ దోపనీక పుయిలోట(సంకోచము) దక్కి(తక్కి=విడిచిపెట్టి) యిట్లనియె.
సింగంబాకటితో గుహాంతరమునం జేద్పాతుమైనుండి మా
తంగస్ఫూర్జిత యూధదర్శన సముద్యత్ క్రోధమై వచ్చు నో
జిం గాంతార నివాస ఖిన్నమతి నస్మత్సేనపై వీడె వ
చెం గుంతీసుత మధ్యముండు సమరస్తేమాభిరామాకృతిన్
సింగంబు=సింహం ఆకటితోన్=ఆకలితో గుహ+అంతరమునన్=గుహ లోపల చేద్పాటుమైన్+వుండి=దిగులుతో వుండి (కష్ట పరిస్థితిలో ఉండి)మాతంగ=ఎనుగులయొక్క  స్పూర్జిత=ప్రకాశిస్తూవున్న యూథ=సమూహము యొక్క దర్శన=చూడటం చేత సముద్యత్=పైకి వస్తున్న(విజృంభించుచున్న), క్రోధము+ఐ=కోపము కలిగినట్టిదై, వచ్చు+ఓజన్=వచ్చురీతిగా, కాంతార=అడవియందు, నివాస=నివాసముండుటచేత,  ఖిన్నమతిన్= దుఃఖాన్ని పొందిన మనస్సుతో, అస్మత్= మనయొక్క
సేనపైన్= సైన్యము పైకి, వీడె=ఆ వచ్చేవాడే, కుంతీసుత మధ్యముండు=కుంతీ కుమారులలో మధ్యవాడగు అర్జునుడు, సరస్థేమ=యుద్ధములో స్థిరత్వము మనోహరమగు ఆకారముతో, ఇపుడే వచ్చినాడు.
అర్జునుడు 12 సంవత్సరములు అరణ్యవాసములో యుద్ధము లేక ఉండిపోవుటచే ఆకలిగొన్న సింహమైగుహలో పదియుండినది గుహబయతటికి వచ్చినది.  
ఈ వ్యాసమునకు ఇక్కడ భారత వాక్యమును పలుకుచున్నాను. చదివి మన పూర్వుల, మన సంస్కృతి యొక్క, మన సంస్కృతాంధరముల యొక్క గొప్పదనమును గుర్తించి కీర్తించేది.
స్వస్తి.

Tuesday, 24 December 2019

రాజనందన రాజ రాజాత్మజుల సాటి


రాజనందన రాజ రాజాత్మజుల సాటి
https://cherukurammohan.blogspot.com/2019/12/blog-post_24.html
సీ: రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
 రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
గీ: భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను.

ఇది ప్రెగ్గడ నరసరాజను ఉద్దండ పండితుడు రాయలవారి ఆస్థానములో చెప్పిన పద్యము. దీనికి బదులుగా 'మేకతోకుమేక' అన్న పద్యమును తెనాలి రామలింగడు చెప్పి అర్థమడిగి, ఆయన చెప్పలేకపోతే పరాభవము చేస్తాడు.
కానీ ఈ పద్యానికి వేదమూర్తులు  దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు ఈ విధం గా అర్థం చెప్పుట జరిగింది.
ఈ సీస పద్యంలోని మొదటి చరణము, తేటగీతిలోని మొదటి పాదముతోరెండవది రెండవదానితో మూడవది మూడవదానితో నాల్గవది నాల్గావదానితో  క్రమంగా అన్వయించిన మనకు అర్థము ఈ విధముగా స్ఫురించగలదు.

రాజ నందన = చంద్రుని కొడుకైన బుధుడు,
ర = సమర్థుడైన, అజ= ఈశ్వరుడు
రాజ = దేవేంద్రుడు
ఆత్మజులు = బ్రహ్మదేవుడును
తలపన్ = ఆలోచించగా
అల్లయ వేమ ధరణిపతికి = అల్లయ వేమారెడ్డి అనే రాజుకు
సాటి = సమానులు
భావ = బుద్ధియందు
భవ = ఐశ్వర్యమునందును
భోగ = వైభవంలోనూ
సత్కళా = శ్రేష్టమైన విద్యలయొక్క
భావములను = అతిశయమందును
బుద్ధియందు, ఐశ్వర్యమందు, వైభవంలోను, శ్రేష్టమైన  విద్యల యొక్క అతిశయములందూ, చంద్రుని కుమారుడైన బుధుడు, సమర్థుడైన ఈశ్వరుడు, దేవేంద్రుడు, బ్రహ్మదేవుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

రెండవ చరణద్వయాల అర్థం, అన్వయం:
ర + అజ + నందన = మనోహరుడైన శివునికి కుమారుడైన కుమారస్వామి
రాజ = కుబేరుడు
ర + అజ  = శ్రేష్ఠుడైన , రఘువు కుమారుడైన అజుడు
ఆత్మజులు = చంద్రుడును

తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు.
భావ = క్రియ యందు
భవ = ధనమునందు
భోగ = పరిపాలనలో
సత్కళా = శ్రేష్ఠమైన కాంతి యొక్క
భావములను = సమూహమునందును
క్రియయందు, ధనమునందు, పరిపాలనలో శ్రేష్ఠమైన కాంతి సమూహమునందును, మనోహరుడైన శివుని కుమారుడైన కుమార స్వామి , కుబేరుడు, శ్రేష్ఠుడైన రఘువుకు కొడుకైన అజుడు, చంద్రుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

మూడవ చరణద్వయాల అర్థం, అన్వయం:
ర + అజ + నందన = బంగారం వంటి కాంతిగల బ్రహ్మకు పుట్టిన సనత్కుమారుడు
ర + అజ = శ్రేష్ఠుడైన బ్రహ్మకు పుట్టిన వశిష్ఠుడు
 రాజ = క్షత్రియుడైన
ఆత్మ + జ  =  బృహస్పతియందు పుట్టిన కచుడును
తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు.
భావ = ఆత్మ జ్ఞానమునందు
భవ = పుట్టుకయందు
భోగ = అనుభవమునందు
సత్కళా = అభివృద్ధియొక్క
భావములను = పద్ధతులందును
ఆత్మ జ్ఞానమునందు, పుట్టుకయందు, అనుభవమునందు, అభివృద్ధియొక్క పద్ధతులందును బంగారువంటి కాంతి కలిగిన బ్రహ్మకు కుమారుడైన సనత్కుమారుడు, శ్రేష్ఠుడైన బ్రహ్మకుపుట్టిన వశిష్ఠుడు, క్షత్రియుడై బృహస్పతి వలన పుట్టిన కచుడునూ,  ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

నాలగవ చరణద్వయాల అర్థం, అన్వయం :
ర + అజ + నందన = శ్రేష్ఠుడైన మన్మధుని కుమారుడైన అనిరుద్ధుడును
ర + అజ = సర్వ వ్యాపకుడైన విష్ణువు
రాజ = యక్షుడును (నలకూబరుడు ?)
ఆత్మజ = మన్మధుడును
తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు ( అన్ని పాదాలకీ ఒకే అర్థం)
భావ = ఆకారమునందును
భవ = సంసారమందును
భోగ = సుఖానుభవమునందును
సత్కళా = సౌందర్యము యొక్క
భావములను = రీతియందును
ఆకారమునందు, సంసారమందు, సుఖానుభవమునందు, సౌందర్యముయొక్క రీతియందును, శ్రేస్ఠుడైన మన్మధునికుమారుడైన అనిరుద్ధునికి, సర్వ వ్యాపకుడైన విష్ణువు, యక్షుడైన నలకూబరుడు, మన్మధుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

గీత పద్య పాదానికి, సీసపద్యపాదానికీ మధ్య ఉన్న క్రమాలంకారం గమనించితే కవి గొప్పదనము మనకు అర్థమౌతుంది. ఇంతటి ప్రశంశ కు లొంగని రాజు ఎక్కడ ఉంటాడు! కాబట్టి మాటకు అంత గొప్పదనము వున్నది. ఈ పద్యములోని భావమును నిజానిజాల దృష్టితో కాక కవి కల్పనా చాతుర్యమును భావాన్వయమును మనము గమనించవలసియున్నది. అందుకే పాండిత్యమును కవిత్వమును  కళలకు తలమానికముగా రాజులు పూజించినారు. 'భూప సభాన్తరాళమున పుష్కల వాక్చతురత్వము' అంటే ఇదే!
స్వస్తి.




Tuesday, 10 December 2019

ప్రతి పర్వం రసోదయం-ఒక చాటువు


ప్రతి పర్వం రసోదయం

https://cherukurammohan.blogspot.com/2019/12/blog-post.html
అనగా అనగా ఒక రాజు. ఆ రాజుఆశ్రయం కోరి ఒక కవి వచ్చినాడు. సామర్థ్యము కలిగినవానికే రాజువద్దకు వెళ్ళే ధైర్యము ఉంటుంది. అట్లుకాకపోతే అర్థించి రాజు యొక్క అనుగ్రహము పొంది తృణమో పణమో తీసుకొని పోతారు. ఈ కవి కొంత సత్తా ఉన్నందువల్ల కావచ్చు రాజు పరీక్షకు నిలచినాడు.
రాజుగారు ఆ కవిని  ఈవిధముగా అడిగినాడు “ ఓ కవీ! భారతాన్ని, చెరుకుగడని, సముద్రాన్ని ఒకే విధముగా ఒకే శ్లోకములో  వర్ణించుము” అని. అప్పుడు ఆ కవి “ఓ రాజా! ఒకే పాదంలో మూడింటిని వర్ణిస్తాను” అని చెప్పి (పై శ్లోకంలో నాల్గవ పాదం) “ ప్రతి పర్వ రసోదయం” అని వర్ణించినాడు.
భారతం, ఇక్షుఖండంచ
సముద్రమపి వర్ణయ
పాదే నైకేన వక్ష్యామి
ప్రతిపర్వ రసోదయం
అంటే:
భారతంలో భాగాలను ‘పర్వములు’అంటారు ( భారతం పదునెనిమిది పర్వాలను కలిగియుంది.) ఇక 'ఇక్షువు' అంటే చెరుకుగడ. చెరుకు కణుపులను సంస్కృతంలో పర్వములని అంటారు. అలాగే పర్వము అంటే పండుగ అని కూడ అర్థముంది. పర్వదినాలు అన్న మాట మనము వాడేదే కదా! ఆకవి "అయ్యా మీరు చెప్పిన మూడింటి రుచీ ఒకే పాదములో చెబుతాను" అని అన్నాడు.
ఇప్పుడు పర్వముతో ఏ విధముగా రసోదయమైనదీ చూదాము. భారతంలో ఏ పర్వము చదివినా రససిద్ధి కలుగుతుంది అంటే రసోదయమౌతుంది. అలాగే చెరుకుగడ ప్రతి కణుపులోను చక్కని రసం ఊరుతుంది. చెరుకు రుచిని గూర్చి నేను చెప్పనవసరము లేదు. కాబట్టి ఇక్షుపర్వముతో కూడా రసోదయమైనట్లే కదా! అట్లే సముద్రుడు ప్రతి పర్వదినానికి ( పున్నమి రోజులలో) కెరటాలతో ఎగిసి ఎగిసి పడి ఆనందిస్తాడు. మరి సముద్రునిలో రసోదయమైనట్లే కదా! ఎంత గొప్ప వర్ణనో  గమనించినారుకదా! 
కవి చమత్కారము అంటే అదే!