Sunday, 22 April 2018

ఉన్నమాటకేల ఉలుకు నీకు (మన ప్రాచీన శాస్త్రజ్ఞత)

ఉన్నమాటకేల ఉలుకు నీకు (మన ప్రాచీన శాస్త్రజ్ఞత)
https://cherukurammohan.blogspot.com/2018/04/blog-post_22.html

ఎంచి జూచి నిజము నేర్పడ జెప్పెద
ఉన్న మాటకేల ఉలుకు నీకు
నాటి ఘనుల దారి నడువుము యువకుడా
దేశ హితము చేతి దీవిటీగ
విశధముగా ఈ క్రింది లంకెలో భక్తీ ధ్యాసలతో చదివి భావి దేశ పురోగతికి బాట వేసేది.

ఈ ఉపోద్ఘాతమంతా మీరు ఈ దిగువ కనబరచిన లంకెలో మన పూర్వుల ఆవిష్కరణలు చదివి చైతన్యవంతులగుదురన్నది నా ఆశ.
https://cherukurammohan.blogspot.in/2018/04/blog-post_22.html

కల్లబొల్లి పలుకు కడుతీయనై తోచు

ఉన్నమాటకేల ఉలుకు నీకు 

మసిని పూసి చేయు మారేడుకాయలు 

వైద్యగుణములెట్లు బడయ గలవు 

 

ఉన్నమాటకేల ఉలుకు నీకు (మన ప్రాచీన శాస్త్రజ్ఞత)
ఆపి స్వర్ణమయీ లంకా నమె లక్ష్మణ రోచతే l  
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ॥
ఇది వాల్మీకి రామాయణములో లేని శ్లోకము కానీ ఈ శ్లోకము యొక్క సాంద్రత మాత్రము  వాక్కునకతీతము. శ్రీరామ చంద్రునితో లక్ష్మణుడు లంకాపురీ ప్రవేశము చేస్తూ చెప్పే మాటకు శ్రీరాముని సమాధానమిది. 'మాతృభూమి స్వర్గమునకన్నా గొప్పది'. మన పూర్వులు ఆ మాటను తు,, తప్పక పాటించినారు. పేరుకు ఇసుమంత కూడా ప్రాకులాడలేదు. వారి ఆవిష్కరణలు తెలుసుకొంటే అవాక్కయి పోతాము. 50 సంవత్సరముల క్రితము ఎవడయినా నాలాంటివాడు వాళ్ళ గొప్పదనము చెబితే మనవాళ్ళే వెక్కిరించేవారు. నేడు పరిస్థితి మారినది. రుజుమార్గమున నడిచే ఆలోచనలు కలిగిన వారు కష్టపడి గతమును త్రవ్వి తెలుసుకొంటున్నారు. మిగతా వారి కొరకే నేను వ్రాసే ఈ రాతలు. వాస్తవాన్ని గ్రహించి యువత దేశాభ్యున్నతికి భాషాభ్యున్నతికి పాటుపడగలిగితే  మన ప్రగతి జగతికే తలమానికమౌతుంది.
ఆనోభద్రాః క్రతవో యంతు విశ్వతో వి దభ్దాసో అపరితాస ఉద్బితఃI
 దేవానో యథా సదమిధృతే అసన్నప్రాయువో రిక్షితారో దేవేదివేII ఋగ్వేదము 25-14.
సద్భావనా సుమసౌరభములు దశాదిశలనుండి మనల నలరించుగాక.
ఈ ఉపోద్ఘాతమంతా మీరు ఈ దిగువ కనబరచిన లంకెలో మన పూర్వుల ఆవిష్కరణలు చదివి చైతన్యవంతులగుదు రన్నది నా ఆశ.
https://cherukurammohan.blogspot.in/2018/04/blog-post_22.html
ఎంచి జూచి నిజము నేర్పడ జెప్పెద
ఉన్న మాటకేల ఉలుకు నీకు
నాటి ఘనుల దారి నడువుము యువకుడా
దేశ హితము చేతి దీవిటీగ
ఆర్యావర్తము, అజనాభము అన్న పేర్లను కలిగి అంకెలకు అందని కాలములోనే సృష్టికి ఆది యగు ఈ భారతావని మహనీయులకు ఆటపట్టు. నిరంతర నియమనిష్టాగరిష్ఠులగు మహర్షులకు ఆలవాలము. శరదిందు చంద్రికా ధవళ కాంతులతో  కలకాలము మెరిసే శాస్త్రజ్ఞ తారకల వినీలాకాశము ఈ దేశము.
కానీ మన పూర్వుల గొప్పదనము తెలుసుకొనే సామర్థ్యమును మనలో మిగిలించలేదు మనలనేలిన ఆంగ్లేయులు. మేలుకొంటే, అంతవరకూ మనమున్న స్థితిని  నిద్ర అంటారు, అట్లు కాకుంటే మరణము అంటారు. మరణము కన్నా మేలుకొనుట మేలుకాదా! కావున మేలుకొందాము, ఖర్చయినా పరవాలేదు మేలు కొందాము.
ఈ ఉపోద్ఘాతమును ఇక్కడ నిలిపి నాటి మన ద్రష్టల, ఋషుల, శాస్త్రజ్ఞుల, ఇతిహాసకారుల ఆవిష్కరణల గూర్చి తెలుసుకొందాము. తాళ పత్రములలోని మన యొక్క విజ్ఞానమును దోచుకొని తమవిగా తమ పేరును ఆయా ఆవిష్కరణలకు తగిలించుకొనిన పయోముఖవిషకుంభములను ప్రభంజనములై పగులకొట్టుట నేటి యువత కర్తవ్యము.
ఇక ఈ వాస్తవాలను గమనించండి.
గర్భవతులు, భక్తిగాథలు వీరగాథలు వినవలెనని, మనసును ప్రశాంతముగా  వుంచుకోనవలెనని, భీతావహ, విషాద సంఘటనలకు దూరముగా ఉండవలెనని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కృతయుగములో ప్రహల్లాద చరిత్ర, ద్వాపరములో అభిమన్యు వృత్తాంతము ఇందుకు ప్రబలమైన ఉదాహరణలు. అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డకోసం శ్రీరాముని లేక శ్రీకృష్ణుని చిత్రపటాన్ని చూలాలు తన మంచమునకు దగ్గరగా గోడకు తగిలించియుంచుకొనవలెనన్నది  పెద్దల మాట. మరి ఈ గొప్పదనమును ఫ్రాయిడ్ కు అంటగట్టుట న్యాయమా! మన పెద్దలు మనకు మంచిని ఉపదేశము చేసినారేకానీ మేమే లోకానికి చాటినదని చంకలు గుద్దుకోలేదు. మన ఆవిష్కరణలకు తమ పేర్లను ఎంత చక్కగా అతికించుకొన్నారో గమనించండి.
పాశ్చాత్యులు ‘బిగ్ బ్యాంగ్ థియరీ’ ని ప్రతిపాదించి ఒక మహాగ్నిగోళం బ్రద్ధలయి సృష్టి ఏర్పడిందని తేల్చినారు కదా! A Belgian priest named Georges Lemaître first suggested the big bang theory in the 1920s when he theorized that the universe began from a single primordial atom.
మరి ఈ భారత భూమిలోని అనామకుడు కూడా "బ్రహ్మాండం బద్దలయ్యిందనే" అంటున్నాడుకదా! మరి ఈ వేదచోదిత వాస్తవాన్ని సామాన్యుని నాలుకపై నాన జేసియు పేరుకు ప్రాకులాడని మన ద్రష్టలు ఎంతటి గొప్పవారు, ఒకపరి ఆలోచించండి. భూమి మీద ప్రకృతి ఏర్పడి దాదాపు 200కోట్ల సంవత్సరాలయిందని నేటి సైటింష్టులు చెబుతున్నారు కదా!
పాశ్చాత్యుల ప్రకారము సృష్ట్యాది క్రీస్తుకుపూర్వము 2000 సంవత్సరముల క్రితం జరిగినది. కానీ మన ఖగోళ శాస్త్ర ప్రకారము సృష్టి జరిగి 195,58,85,123 సంll (2021 వరకు) అయినవి. ఇది ప్రతి ఉగాదికి వచ్చే మన పంచాంగములలో ప్రతివర్షము తెలియజేస్తారు. “మిస్టీరియస్ యూనివర్స్” గ్రంధ కర్త మరియు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త యైన ‘సర్ జేమ్స్ జీన్స్’ పై పుస్తకములో చేసిన అంచనా (ఇంచుమించు 200 కోట్లు). మన పూర్వీకుల ప్రమాణమునకు చేరువలోనున్నది. ఇప్పటి కలి యుగము వచ్చి 5119 (2022 నకు) సంవత్సరములైనది. ఇంత నిర్డుష్ఠముగా లెక్కలు కట్టి వ్రాయబడినదే “పంచాంగము”. మరి మనశాస్త్రములు నిరాధారమయినవా! సృష్ట్యాది మొదలు అనేక విషయములను తమ దివ్య దృష్టి చే పరీక్షించి పరిశీలించి పరిశోధించిన మన మహర్షులు శాస్త్రజ్ఞులు అయిన పూర్వీకులు పాశ్చాత్యులు చెప్పినట్లు ఆటవికులా! అనాగారికులా!

బిగ్ బేంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని అది తిరిగి కేంద్రం వల్ల ఆకర్షింపబడి పదార్థం ఏర్పడటం వల్ల సృష్ఠి నశించి శూన్యం అవుతుందనీ అది  మళ్ళీ బ్రద్దలయి సృష్ఠి మొదలవుతుందని ఇలా జరుగుతునే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వముకుళిత సూత్రము కదా!
      మరి వేదసారమైన భగవద్గీత లో చెప్పబడిందేంటి?కల్పాంతమునందు సకల ప్రాణులూ తనయందు లీనమవుతాయని మళ్ళీ కల్పారంభములో అన్నీ తననుండి పుట్టుకొస్తాయని భగవానుడు చెప్పినట్లు వున్నది కదా! అసలు మనవారి సిద్ధాంతమునకు మూలము భగవంతుని నిశ్వాసమగు వేదము కాదా!

'ప్రతీ చర్యకూ సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుం'దనేది (For every actio there is equal and opposite reaction)న్యూటన్ చెప్పిన సూత్రముగా మనము పాఠ్యాంశములలో  చదువుతూనే ఉన్నాము కదా!
 మరి వేల సంవత్సరాలనుండి భారతదేశంలో వినిపించే కర్మసిద్ధాంతము చెప్పేది అదికాదా! ఒకచేతితో చేస్తే వేరొక చేతితో అనుభవించవలసిందే అన్న నానుడి ఏ చదువురాని వ్యక్తిని అడిగినా చెబుతాడు. మరి అంతమాత్రానికి న్యూటన్ ఎందుకు? అసలు ఎవరు ముందు చెప్పినట్లు?

ఇక తొలివిమాన నిర్మాణము  చేసిన మేధావులు రైట్ సోదరులు అని కదా
మనచేవులలో ఆంగ్లేయ విద్యావేత్తలు బాకాలూదినారు.  
రైట్ సోదరుల కంటే ముందు శివకర్ బాపూ తల్పాడే అనే పండితుడు భరద్వాజుని ‘యంత్ర సర్వస్వము’ అన్న గ్రంధములోని ‘విమాన శాస్త్రము’ ఆధారంగా తయారుచేసిన  ‘మరుత్సఖి’ గాలిలో ఎగిరింది కదా! ఆయనను మభ్యపెట్టి ఆ విమాన నిర్మాణ సూత్రములను గ్రహించిన ఆంగ్లేయులు రైటు సోదరులకమ్మి సోమ్ముచేసుకొని తల్పాడే గారిని పిచ్చివానిగా చేసి, ప్రప్రథమ విమాన నిర్మాతలుగా వారికి పట్టము కట్టినారు. ఆ విమాన నిర్మాణమునకు మన తెలుగువాడయిన వేదమూర్తులు సుబ్బరాయ శాస్త్రిగారి సహకారము తల్పాడే గారికి ఉండినదని ఎంతమందికి తెలుసు.

మొక్కలకు ప్రాణము వున్నదని  నిరూపించినది మన  దేశీయుడైన శాస్ర్తవేత్త జగదీశ్ చంద్రబోస్ కదా! ఆ ఆవిష్కరణకు ఆధారము అధర్వణవేదము కాదా! మన గ్రంధాలలో వృక్షముల ప్రస్తావనలు లెక్కలేనన్ని ఉన్నాయే! మన ఋషులు యాగాది క్రతువులకు దర్భ మొక్కలను  భాధ పెడుతున్నందుకు క్షమించమని ప్రార్థించే దర్బలను కోసేవారని, ఆవిధములగు మంత్రములు వేదములలో వున్నాయని పెద్దల ద్వారా విన్నాను. మరి వారికి ఈ విషయాలు తెలియదనే అనుకుందామా!

వృక్షాదిః ప్రాణ సంబంధి 16.57

ఛాందోగ్యోపనిషత్తు

అస్య సౌమ్య మహతో వృక్షస్య యహా మూలే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్, యోమధ్యేభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్

యహ అగ్రే అభ్యహన్యాత్ జీవన్ స్రవేత్ సహా ఏతేన  జీవేన ఆత్మనా అనుప్రభూతః తెతీయమానః మోదమానః తిష్ఠతి.

వృక్షము యొక్క మొదలుకు దగ్గగ్గరగా ఒక బలమైన గాటు పెడితే ఆ గాటు నుండి ఒక రసమేదో ఊరుతుంది. దానిని సంస్కృతములో నిర్యాసం అంటారు. తెలుగులో నాకు తెలిసి 'రసి' అని పిలుస్తారు. చెట్టుకు మధ్యలో గాటు పెట్టినా ఆ 'రసి' వస్తుంది. పైన గాటు పెట్టినా వస్తుంది. మనకు కూడా అంతే కదా ఎక్కడ గాటు పెట్టినా ఒక ఎర్రటి ద్రవము ముఖ్యముగా వస్తుంది. దానిని మనము 'రక్తము' అంటాము. అంచనా వేయలేని కాలముననే ఇటువంటి వాస్తవములు చెప్పిన మనపూర్వులు గొప్పవారు కాదా!

పెద్దపెద్ద వృక్షాలగా రూపు దిద్దుకొనే  మొక్కలను  రూపలక్షణములు మారకుండా కుండీలలో 

చిన్నమొక్కలుగా పెంచే ప్రక్రియ"బోన్సాయ్"నేటి విజ్ఞానశాస్త్రమని అనుకోనుచున్నాము కదా!

మరి భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరకసంహిత గ్రంథంలో "వామన తను వృక్ష్యాది విద్య"అను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్దవృక్షాలను గుణం చెడకుండా చిన్నమొక్కలుగా పెంచే ఈ విధానాన్ని  తెలిపినాడే! దానిని గూర్చి ఏనాడయినా విన్నామా చదివినామా!
తులసి మొక్క ద్వారా స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాదుల్ని అరికట్టవచ్చని వైద్యులు ఇప్పుడు ఒప్పుకుంటూ వుంటే ,  మరి యుగాల కాలం నుండి ప్రతి ఇంట తులసి మొక్కను పూజించుచున్నామని మనలోనే ఎందఱో మూర్ఖులు ఎగతాళి చేసేవారే ఎందువల్ల?
సముద్రగర్భంలో అగ్నిపర్వాతాలు ఉన్నట్లు మనం ఈమధ్య గమనించినట్లు చెప్పుకుంటున్నాము కదా! మరి మన వేద పురాణాలలోనే  ఈ "బడభాగ్ని"ప్రస్తాపన ఏవిధముగా వచ్చినది?
భారతీయ సంతతికి చెందిన గోవు మానవుని ఆరోగ్య ప్రదాత అని శాస్త్రవేత్తలు పరీక్షించి ఇప్పుడు నిర్దారిస్తే....మరి గోమాతను దైవంగా భావించి కొలిచే ఆనవాయితీ అనంత యుగకాలము  నుండి  మనకు ఎవిధముగా సంక్రమించినది చెప్పవచ్చు?
లోహవిజ్ఞానంలో ఆధునిక Scientists ఎంతో పురోగతి సాధించినట్లు చెబుతున్నారుకడా! మరి ఢిల్లీలో వున్న ఉక్కు స్తంభము (విష్ణు ధ్వజము) ఇప్పటికీ త్రుప్పు పట్టకుండా నిలిచి వున్నది, అది కాక కొల్లూరులో జాలరులచేత నిర్మింపబడిన త్రుప్పు పట్టని స్తంభము  ఇంకొకటి నేటికీ వున్నది. నేను కుటుంబముతో కూడా వెళ్ళినపుడు చూచినాను. ఇంతటి విజ్ఞానము తమవారికి ఆ కాలములో లేదని నేటి Scientists కూడా ఆ రహస్యము తెలియలేదని తెలియజేయుచున్నారా! మరి జాలరులు బ్రాహ్మణులు కాదుకదా! మరి వారికి ఇంత విజ్ఞానము ఎట్లు అబ్బినట్లు?
యశదమును (zinc) ముడిపదార్థమునుండి వేరుపరచుట మనకు తప్ప అసలు ప్రపంచ దేశములలో ఎవరికీ తెలియని కాలములోనే మనకు తెలుసు. యశదమును ఖనిజము నుండి వేరు పరచు విధానము మన వారికి మాత్రమే 4000 సంవత్సరముల క్రితమే తెలుసు.ఆ విధానము ఒకసారి గమనించండి.యశదము 997 డిగ్రీల సెల్షియస్ లో ద్రవీభవించుతుంది. అది 1000 సెల్షియస్ లో ఆవిరి ఔతుంది. అంటే  ముడేమూడు డిగ్రీల వ్యత్యాసములో ఈ పరివర్తన జరుగుతుంది. సాధారణంగా క్రింద వేడిచేసి పైనుండి ఆవిరిని వేరొక పరికరములోనికి పట్టి లోహమును వేరుచేస్తారు. కానీ మన పూర్వులు మంట పైనపెట్టి క్రిందినుండి తగిన పాత్రలలో, సరియైన ఉష్ణోగ్రత వద్ద పట్టి దానిని శీతలీకరణ విధానముతో  దానిని యశదముగా మార్చుతారు. మరి మనవారు అంతటి ఘనులని ఎవరయినా Scientists తెలిపినారా!
నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక నిపుణులు (Engineers) చాలా ముందున్నట్లు  చెప్పుకుంటారు  కదా!
అయితే వేలకు వెల  వేల సంవత్సరాల నాటి ఆలయాలు కోటలూ ఇప్పటికీ నిలచి ఉంటే, గత 500 సంII లోపు నిర్మాణాలు నిలబడుటలేదేమి?
మన పూర్వులగు శాస్త్రజ్ఞులు గొప్పవారా కాదా!
గోల్కొండకోటలోని శబ్ధప్రసారపద్దతి వివిధ దేవాలయాలోని సంగీతం పలికే స్తంభాలూ శివాలయంలో లింగంపై చెక్కుచదరని నీడ పడే నిర్మాణాలూ..... ఏ సమయంలోనూ నీడ కనిపించని ఆలయాలు, స్తంబాలు గాల్లో నిలబడి బరువులు మోసే భారీ కట్టడాలు, గోపురం నీడ ఒక సమయంలో వ్యతిరేకదిశలో పడే అద్బుత కట్టడములు వీటన్నింటి గురించి ప్రాచీన భారతీయులకు నేటి ప్రపంచం ఇచ్చే సమాధానము ఏమిటి?
అణువు పరమాణువు గురించి వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా!
     మరి భారతీయ గ్రంధాలు తిరగేస్తే పరమాణువుల గురించి "వైషేశిక సూత్రం"అంటూ ఓ గ్రంధమే కనిపిస్తుందే...దీనిని వ్రాసిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాదమహర్షి అను పేరువచ్చినట్లు తెలుస్తోంది....ఎవరు ముందు చెప్పినట్లు?? 
రామాయణములో, లంకలో విద్యుత్ ఘటములు (Cells) వాడి విద్యుదుత్పాదనతో కోట తలుపులు యాంత్రికముగా మూసి తెరిచే విధానము, విద్యుద్దీపముల వాడకము ఉండినది. అనార్ద్రఘటము (Dry Cell) ఆవిష్కరించిన మహనీయుడు అగస్త్య మహర్షి. 
మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పాదరసం,బంగారం పక్కపక్కన చూపించేవరకూ పాదరసం నుండి బంగారం చేయవచ్చని మన Scientists కు తెలియదని కదా మన శాస్త్రజ్నులపై ఒక అపప్రథ. మరి రసవిద్య నాగార్జనుడు ఏవిధముగా నేర్చుకొని లోకానికి చాటగలిగినాడు.
సూర్యుడు ఓ నక్షత్రమనీ చాలా నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్రజ్ఞుల విజ్ఞానం కదా!
    మరి మన పూర్వీకులకు ఇది తెలియకుండానే అరుణ మంత్రంలో "సప్తదిశో నానా సూర్యాః"అని చెప్పినారనుకుందామా?

భూమినుండి విడివడిన శకలమే అంగారకుడు అని నేటి Scientists చేబుతూవున్నారే మరి అంగారకుని ‘భూమి పుత్ర’ అనేకదా వేదాలు చెబుతూ వున్నాయి.
  ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం గురించి మొదటగా చెప్పింది చైనావారని చెప్తున్నారు కదా!(2137 క్రీ.పూ)
అంతకు పూర్వమే చెప్పిన అత్రిమహాముని చరిత్రకు పనికిరానివాడెలా అయినట్లు?ఆయన తయారు చేసిన "తురీయ బ్రహ్మ"అనే దూర్భిణి (Telescope) సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించినాడే, (ఋగ్వేదం 5వమండలం 40-6 మంత్రం) మరి దాని మాటేమిటి?
ఈ విషయం మన గ్రంధాలలో అనేక చోట్ల కనిపిస్తోందని శ్రీ బాలగంగాధర్ తిలక్ తేల్చిచెప్పిన విషయమును ఎంతమందిమి చదివినాము, ఎందరికి తెలుసు? 
ఖగోళము, జ్యోతిషముల యందు ఎన్నో ఆవిష్కరణలు చేసిన మన పూర్వులు అసామాన్యులు. గణితమునకు వారు అందించిన ఆవిష్కరణలు అపారము. త్రికోణమితి (Trigonometry) కలనము (Calculus), బీజగణితము(Alzebra), రేఖాగణితము (Geometry) ఈవిధముగా ఎన్నో గణిత శాఖలలో మంనవారు పేరుకు ప్రాకులాడక చేసిన ఆవిష్కరణలకు ఆంగ్లేయులు తమ పేరును ముందు ఉంచుకొన్నారు.  మన ఇస్రో నాసా వారు కూడా, తమసందేహములను, వేదపరమైన సమాదానములతో, నేటికి కూడా పూరీ శంకరాచార్యులగు నిశ్చలానంద సరస్వతి స్వాములవారి  నివృత్తి చేసుకొంటూ ఉంటారు. 

ఇయాన్ స్టీఫేన్సన్ అన్న psychiatrist పునర్జన్మ ఉన్నది అని ప్రయోగ పూర్వకముగా నిరూపించినాడు. ఒక నడుము నొప్పిచేత బాధ పడుచున్న వ్యక్తిని trans లో ఉంచి వివరాలు తెలుసుకొంటే గత జన్మలో తన ఊరిని ఆనుకొని ఉన్న అడవికి వెళితే దుండగులు బలంగా కొడితే నడుమోనొప్పి కలిగినట్లు తెలిపినాడు.  యథా స్థితి చేరిన పిదప ఆ నొప్పి మాయమయ్యింది. అంటే అంతకాలమూ అనుభవించినది ఆత్మగతమగు నొప్పి అని అవగతమైనది. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు 1960 ప్రాంతములో మనదేశములో కూడా తెలియవచ్చినాయి. పునర్జన్మ లేదు అని వాదించే అనంత మేధావులంతా తమ మతమును కాపాడుటకు అబద్ధములు చెబుతున్నారు అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మరి 'వాసాంసి జీర్ణాని యథా నిహాయ' అని చెప్పిన భగవద్గీతకంటే ఈయన ముందువాడు కాదుగదా!

యాజ్ఞవల్క్య స్మృతి, మను స్మృతి, పరాశర స్మృతులను పెట్టుకొని న్యాయ శాస్త్రము కొరకు వెంపర్లాడ వలసిన అవసరము మనకేమి పట్టినది. ఏతా వాతా కాలానుగుణమగు మార్పులు చేసుకోవలసి రావచ్చు అంతేకదా! మరి ప్రస్తుత భారతదేశం న్యాయవ్యవస్ద, విదేశాలను అనుసరించింది అని వాదిస్తుంటారే! అది తప్పు కాదా!
శుశ్రుతుడు మొదటి శస్త్ర చికిత్సకుడు. దివోదాసు,చరకుడు మొదలగువారు  ఈ భారత ఖండమునకు ఆదివైద్యులు. అప్పటికి ఐరోపీయులే కన్ను తెరువలేదు, ఇక వైద్యమెక్కడిది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో! మన పూర్వుల ఆవిష్కరణలను గుర్తించక పోగా అంతా తమ తెలివి తేటలే అన్న వారి మాటలకు బసవన్నల మాదిరి తలలూపుచున్నామే, మరి ఇకనైనా కనులు తెరువనవసరము లేదా! మనకు జరిగిన అన్యాయం వర్ణించలేనిది.
జలవనరులనుపయోగించుట , flush Toilets అన్నపేరుతో నెడు మనము ఉపయోగించే ప్రసాధనలు (Toilets),ఆ మలినజలము పోవుటకు భూగర్భ జలమార్గములు సింధూనాగరికతలో బయల్వెడలినవని  జిజ్ఞాసవున్న ప్రతి చదువరికీ తెలుసు. అంటే నేటి ఈ Toilet విధానము మన పూర్వులకు క్రొత్త కాదు అన్న విషయము తెలియుట లేదా!
గ్రీకులు తోళ్ళు కట్టుకొనే కాలానికే మనము నూలు వస్త్రములు కట్టేవాళ్ళము. ఎవరి నాగరికత ముందు అన్నది ఒకపరి ఆలోచించండి.
నేడు చీడ పురుగులచే వక్రీకరింపబడిన మన చరిత్రను నమ్మి మన భారత జాతిని, పురాణాలను, గ్రంధాలను, ఇతిహాసాలను తూలనాడే స్థితిలో దయవుంచి వుండిపోవద్దు.
వివేకానందుడు పదే పదే  మనకు ప్రభోదించిన కఠోపనిషద్వాక్యము
ఉత్తిష్ఠ జాగ్రత ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధార నిశితాదురాత్యయ” (Arise, Awake and Stop not, until the goal is reached) మరువవద్దు.
భారతమాత బిడ్డలుగా పుట్టినందుకు గర్వించుదాము. ఇప్పటికీ మనము ఎందులోనూ తక్కువ కాదు. ప్రయత్నిస్తే మనము మాధ్యందిన మార్తాండులము కాగలము.
స్వస్తి.
 
  

Tuesday, 17 April 2018

వ్యష్టి - సమిష్టి


వ్యష్టి - సమిష్టి 

https://cherukurammohan.blogspot.com/2018/04/blog-post_17.html

స్వానుభవమును వ్యష్టి అంటారు. అదే అనుభవము సామూహికముగా జరిగితే సమిష్టి అంటారు. ఒక రైతు సాటి రైతుల వలె వాతావరణానుకూలమగు  పంటను  వేయక తనకు తోచింది వేసినాడు అనుకొందాము. ఆతను నష్టపోతాడు అది అతని అనుభవము మాత్రమె. అది వ్యష్టి అవుతుంది. అదే మిగత రైతులందరూ   వాతావరణానుకూలమగు  పంటను వేసి మంచి ఫలితము  అది సమిష్టి అవుతుంది. ఒక్కొక్క పర్యాయము బస్సు, రైలు లేక విమాన ప్రమాదములు జరుగుతూ వుంటాయి. ఒకేసారి ఉమ్మడిగా కొంత మంది ప్రయాణీకులు ఆయా ప్రమాదములకు ఆహుతి అవుతూ వుంటారు. అదే సమిష్టి. అంటే వారు ఒకే విధమగు కర్మఫలమును అనుభవించినారన్నమాట.
ఈ విషయమై ఒక చిన్న కథ చెబుతాను. ఒకసారి ఒక బస్సులో కొంత మంది ప్రయాణీకులు పోతూ వుండినారట. అందులో ఒక జ్యోతిష్యుడు, ఈ బస్సులో కూర్చున్న జనానికి,
 ఇందులోవున్న 

ఒక వ్యక్తిచే ప్రాణాపాయము కలుగనుంది అని చెప్పినాడట. అట్లు చెప్పి అతడు తన మజిలీ వద్ద దిగిపోయినాడు. డ్రైవరు బస్సు నిలిపి ఎదురుగా వున్న చెట్టును చూపి ఒక్కొక్కరిగా ఆ చెట్టు వద్దకు పోయి రమ్మన్నాడట.  అందరివంతూ అయిపొయింది ఒక్కడు మాత్రము మిగిలినాడు. బస్సులోనున్న ప్రయాణీకులంతా ఇక అతనిని దింపివేస్తే సరిపోతుంది అతనే ఆ నష్టజాతకుడని నిర్ధారించినారు. ఆతనిని దింపి బస్సును పోనివ్వమన్నారు. అంతే! కొంత దూరము పోతూనే పెద్ద ప్రేలుడు సంభవించి లోన వున్నవారంతా అగ్నికి ఆహుతియైపోయినారు. ఇక్కడ దిగినవాని కర్మ వ్యష్టి పోయినవారిది సమిష్టి.

 ఈ అనుభవము అన్నది ఒక గత స్మృతి. ఇవి అన్నీ ఒకే విధముగా వుండవు. కొన్ని చెరగని ముద్ర వేస్తే కొన్ని మసకగా జ్ఞాపకు వుంటే కొన్ని స్మృతి పథము నుండినే ఎగిరిపోతాయి. జీవితములో ఒక వ్యక్తికి ఎన్నోకలలు వస్తాయి. అది తన సుషుప్తిలో జరుగుతూవుంది. సుషుప్తి వీడనంత వరకూ, కల జరుగుతూ ఉన్నంతవరకు తాను పాత్రధారి అయినా కాకున్నా ఆ విషయమునకు తానూ సాక్షీభూతమై మసలుతాడు. అదీ అనుభవమే! మేలుకొన్న తరువాత కూడా అది తన మదిలో నిలచిపోతూవుంది, దాని ప్రాముఖ్యతను బట్టి. మరి ఆ అనుభవమునకు ఒక సాక్షి లేకపోతే సుషుప్తిలో వున్న నీకు ఎవరు జ్ఞాపకము చేసినట్లు? కాబట్టి నీకు తెలియకుండానే నీలో ఒక నిర్విరామ నిరంతర సాక్షి ఉన్నట్లే కదా! ఆ సాక్షే లేకుంటే నీకు అనుస్యూతి (Continuity) ఏర్పడదు. ఈ అనుస్యూతి వల్లనే కర్మ ఆత్మ యొక్క జన్మ జన్మాంతరాలను అనుసంధానము చేస్తూవుంది. అది ఆ విధముగా వస్తూవున్నది కాబట్టే ఆయా అనుభవ కర్మఫలముల బట్టి ఈ 'పునరపి జననం పునరపి మరణం' జరుగుతూ వుంది.

 ప్రతిజీవిలోనూ అవ్యక్తుడగు వ్యక్తి  సాక్షిగా ఉన్నాడు అన్నది ఒక మరువగూడని సత్యము. అతడు వ్యాపించి ఉన్నాడు.  అతడే మార్గదర్శి (guide, ఉపదేష్ట), రక్షకుడు (care-taker)

ఇక్కడ వ్యష్టి , సమిష్టి అనే పదాలకు అర్థము ఆంగ్లములో చెప్పుకోనవలసివస్తే,  individual, dividual అని చెప్పుకొనవచ్చును. రెండో పదం వాడుక తక్కువ. Individual = (n) a single human being, as distinguished from a group. (Adj) single; particular; separate; dividual = (adj) divisible or divided, distributed; shared. Aspect of one ultimate truth is in you, located in you.

కావున ఏ సాక్షి మనకొరకు మన కర్మఫలమును గుర్తు పెట్టుకొని ఆయా అనుభవ ఫలితములను మనము అనుభవింపజేస్తున్నాడో ఆయనను సర్వాంతర్యామిగా కీర్తించున్నాము.

స్వస్తి.

 

Sunday, 15 April 2018

శిభక్తికి ప్రతిరూపమే అప్పయ్య దీక్షితులు

శిభక్తికి ప్రతిరూపమే అప్పయ్య దీక్షితులు

https://cherukurammohan.blogspot.com/2018/04/blog-post_15.html

అప్పయ్య దీక్షితుల వారు  తమిళనాడు నందలి  తిరువణ్ణామలై జిల్లా, పట్టు చీరలకు 

పేరుగాంచిన  అరణికి దగ్గరగా వున్న  అడయపాలెం అన్న ఊరియందు ప్రమాదీచ నామ 

సంవత్సరము ఆశ్వయుజ(అని విన్నాను) మాసము, కృష్ణ పక్షము ఉత్తరాభాద్ర నక్షత్రమున 

క్రీ.శ. 1520 లో  జన్మించినారు.  అప్పయ్య దీక్షితుల వారి పూర్వ నామము వినాయక 

సుబ్రహ్మణ్యం.  వీరితండ్రి  రంగారాజాధ్వరి. యజ్ఞ క్రతువులు చేసినవారిని ఆధ్వరి 

అంటారు. ఆధ్వరము  యజ్ఞము.  దీక్షితుల వారు విద్యాభ్యాసమును రామకవీంద్ర 

గురుముఖతః చేసినట్లు చెబుతారు.

వీరు శంకరాద్వైతమును త్రికరణ శుద్ధిగా అనుష్ఠించిన వారు. ఆయన చిత్తము మొత్తము 

పరమేశ్వర పాదయుగళికి అంకితము చేసిన మహాభక్తుడు. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ 

వేదాంతాది సకల శాస్త్రములకు ఆయన ఆటపట్టు. అద్వైతి కాబట్టి ఒకసారి వెంకటేశ్వర 

దర్శనార్ధమై ఆయన తిరుమల వెళ్ళినపుడు వేంకటేశ్వరుడు, లింగాకృతిలో దర్శనమిచ్చుట 

జరిగినదని చెబుతారు. అసలా విగ్రహము స్వయంభూ విగ్రహము. సకల దేవతానురూప సారము. బాల త్రిపుర సుందరిగా భావించి కొందరు భక్తులు బాలాజీ అంటారు. అసలు వెంకట అన్న పదము కాలాంతరములో చేరిన తమిళ పదము. మిగిలినది ఈశ్వర  శబ్దమే. ఆ విగ్రహమునకు నాగాభరణములు గలవు. ఆయనకు స్వామి అన్నపేరు కలదు. స్వామి అన్నపేరు ఒక్క సుబ్రహ్మణ్యునికి మాత్రమే కలదు. గురువారము నాడు అభిషేక 

సమయములో విగ్రహము యొక్క మూడవ కన్నును చూడవచ్చునని చూసిన అర్చకులు 

చెప్పేవారట. ఇక విష్ణు రూపుడు అనుటకు కూడా ఆధారాలు మనము చూస్తూ ఉన్నాము. 

ఒకానొక కాలములో ఈ విగ్రహమునకు 6 నెలలు శివునిగానూ 6 నెలలు విష్ణువుగానూ 

పూజ జరిగేదట. ఇక విగ్రహము యొక్క ఉష్ణోగ్రత ఎప్పుడూ 110°ఉంటుందట. 

విగ్రహము వెనుకవైపు నీటి గలగలల శబ్దము చాలా ఎక్కువగా ఉంటుందట.ఇవన్నీ 

విగ్రహము యొక్క శివ తత్వమును తెలుపవా! అందుకే పరమ అ భక్తుడైన అప్పయ్య  

దీక్షితులగారికి వేంకటేశ్వరునిలో ఈశ్వరుడు కనిపించినాడు.

ఆయన తపస్సిద్ధి పొందిన మహనీయుడు. ఆయనకు కడుపునొప్పి విపరీతముగా 

వుండేది. అది ఆయన తపస్సాధనకు ఎంతో అంతరాయమును కలిగించేది. నైష్ఠిక  

బ్రాహ్మణులు జపానుష్ఠానాది సమయములలో తమ వద్ద ఒక తడి తుండుగుడ్డ 

పెట్టుకొంటారు. అప్పయ్యగారు కూడా ఆ విధముగానే ఒక తుండును వుంచుకొనేవారు. 

ఆయన తన యావత్తు జప సమయములో ఆ కడుపునొప్పిని ఆ తుండులోనికి 

ఆవాహనముజేసి తన దీక్షలో తానూ మునిగిపోయేవారు. ఆ సమయమంతా ఆ తుండు 

విపరీతముగా కంపించేది. ఈ ఉదంతము ఆయన సాధనకు తార్కాణము. ఆయన శివ 

భక్తి నిరుపమానము. వారిచే రచింపబడిన ఈ శ్లోకము అందుకు తార్కాణము. విద్యలలో 

వేదం విద్య ఉత్కృష్టమైనది. అందులో రుద్రములోని 11 వ అనువాకము శ్రేష్ఠము. 

అందులో పంచాక్షరి మిక్కిలి శ్రేష్ఠము, అందులో 'శివ' అన్న శబ్దము అత్యంతశ్రేష్ఠము.

ఈ భావమును అప్పయ్య దీక్షితులు గారు వ్రాసిన ఈ క్రింది శ్లోకము 

తెలియజేయుచున్నది.

విద్యాసు శ్రుతిరుత్కృ ష్టా రుద్రైకాదశిని శ్రుతౌI

తత్ర పంచాక్షరీ తస్యాం శివ ఇత్యక్షరద్వయంII

ఆయన అద్వైత తత్పరత ఒకసారి చూద్దాము.

మారమణ ముమారమాణం ఫణధరతల్పంఫణధరాకల్పం

ముర మధనం పుర మధనం వందే బాణారి మసమ భాణారిం

మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని

నవస్తూ భేదః ప్రతిపత్తి రస్తుమే తధాపిభక్తిః తరుణేందుశేఖరే  (అయ్యప్ప దీక్షితులు)

లక్ష్మీపతి యగు విష్ణువు సర్పము పై శయనించితే ఉమాపతి సర్పములనే

దేహముపై ధరించినాడు. హరి మురారి అయితే హరుడేమో పురారి. హరి

బాణాసురహర్త హరుడేమో మారుని సంహర్త (మారుడు=మన్మధుడు).

మహితాత్ములగు వారిరువురికీ నమస్కారము.

జగదధీశ్వరుడు మహేశ్వరుడు. జగదంతరాత్ముడు జనార్దనుడు. వస్తుతః

వారిరువురికీ భేదము లేనప్పటికీ నాకు తరుణేందు శేఖరునిపై తపము

సిద్ధిస్తూవుంది. ఒక మాట ఆయన పాండిత్యమును గూర్చి చెప్పుకొందాము.

అప్పయ్య దీక్షితులవారు మహా వేదాంతి మరియు పండితుడు. ఆయన ఎన్నో

రాజాస్థానములు తిరిగి ఆయా ఆస్థానముల దిగ్దంతులగు పండితులను తమ

అసమాన పాండితీ ప్రకర్షతో ఓడించి సన్మానములను అందుకొనేవారు. ఆ

ప్రకారంగా ఆయన ఒక పర్యాయము జింజి సంస్థానమును సందర్శించుట

తటస్తించినది. అక్కడ రాజు కొలువులో శ్రీనివాస దీక్షితులు అన్న మహాపండితుడు

ఉండేవాడు. ఆయనకు తనను మించిన పండితుడు లేడన్న నమ్మకమే కాక ఎన్నో

సంస్థానములు తిరిగి ఎందఱో పండితులనోడించిన అప్పయ్య దీక్షితులను ఓడించి

తన పాదములకు నమస్కరింప జేసుకొనవలెనను తపన తలమీద తాండవము

చేయుచుండెడిది. అవకాశము అందివచ్చినది కాబట్టి ఆయన వాగ్వాదమునకు

దీక్షితులవారితో తలపడినాడు. వాదములో రోజులు గడువగా తాను ఓటమికి

దగ్గరలోవున్నట్లు అర్థమైపోయింది శ్రీనివాస దీక్షితులవారికి. విషణ్ణవదనుడై 

అగమ్యగోచరునిగా అగుపించుచున్న శ్రీనివాస దీక్షితులకు మహారాజు చక్కని సలహా

ఇచ్చినాడు."మీరు మీ అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లిచేయ దలచుచున్నారని నేను

చెబుతాను. ఆయన కాదనలేడు. పెళ్లి పూర్తయిన పిదప సతీసమేతముగా ఆయన

మీ పాదాలాంటి నమస్కరిస్తాడుకదా!" అని సలహా ఇచ్చినాడు. శ్రీనివాస దీక్షితులు

ఆవిధముగాజేసి తన గౌరవమును కాపాడుకొన్నాడు. అప్పయ్య దీక్షితులవారు

అంతటి ప్రతిభాశాలి.

ఒకసారి తమలోని శివభక్తిని పరీక్షించుకొనదలచి ఒక శిష్యుని పిలిచి దత్తూర ఫల

రసము అంటే ఉమ్మెత్తకాయ రసము (ఇది తాగిన వానిని ఉన్మత్తునిచేస్తుంది) ను

తెమ్మన్నాడు. శిష్యునికి ఈ విషయమును చెప్పి దాని విరుగుడు కూడా చేతికిచ్చి

ఫలరసము త్రాగి ఉన్మత్తుడైనాడు. ఆ రసము త్రాగినా త్రాగకున్నా అచంచలమైన

తన మనసు శివ పూజారతి విడువక శివునిపై ఏబది శ్లోకములను ఆశువుగా

చెప్పినాడు. అది నేటికీ భక్తజన రసనలపై ఉపలబ్ధము. పుస్తకరూపములో కూడా

నేటికాలమున లభించుచున్నది. దానిని 'ఉన్మత్త పంచశతి' యని  'ఆత్మార్పణస్తుతి'

అనీ అంటారు.

అది ముగిసిన వెంటనే విరుగుడు త్రావి తన సహజస్థితికి వచ్చి తృప్తిచెందినాడు, తానూ 

శివ ధ్యానము ఏ పరిస్థితిలోనూ వీడనందుకు ఎంతో సంతసించినాడు. మచ్చుకు 

అందులోని ఒక పద్యమును చిత్తగించండి.

అర్కద్రోణప్రభృతి కుసుమైః అర్చనంతే విధేయం I

ప్రాప్యంతేన స్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీఃI

ఏతజ్ఞానన్నపి శివ శివ వ్యర్థయః కాలమాత్మా I

ఆత్మద్రోహీకరణ వివశో భూయసాధః పతానిI

శివ శివా! నీ అనుగ్రహమును ఏమని వర్ణించను. సులభముగా లభించే జిల్లేడు

తుమ్మి పూవులతో పూజలందుకొని భక్తులకు మోక్ష సామ్రాజ్య లక్ష్మిని

అనుగ్రహించుచున్నావు. ఈ సూక్ష్మమును మేము తెలుసుకోలేక కాలమును వ్యర్థము 

చేయుచున్నాము. ఆ మహనీయుని భక్తిభావము అమోఘము అద్భుతము

అసమానము.

 

అద్వైతిగా దీక్షితులవారు పరబ్రహ్మతత్వములో భేదమును చూడలేదు. శివవైష్ణవ

తారతమ్యమును పరిగణింపలేదు. కానీ వేదపురాణములకు గల వేర్వేరు

భాష్యములను ఖండించలేదు. దీక్షితులవారి మాటల్లో - "బ్రహ్మసూత్రములే వేర్వేరు

అర్థములను చూపినప్పుడు మనమెందుకు ఒకటిగా పరిగణింపవలెను"? అన్నారు. కానీ 

ఆయనకు త్రాసులోని ముల్లువలె కాసింత శివునిపై మక్కువ ఎక్కువ.

అందుకే ఈ క్రింది శ్లోకములో ఆయన  తానద్వైతియే అయినా కాస్త శివునిపై

మమకారము పెచ్చు అన్న అర్డుథములో ఈ శ్లోకమును చెప్పినాడు.

మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దానేవా జగదంతరాత్మనిI

నవస్తుభేడ ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరేII

కాంచీపురమందలి అదెహోల గ్రామమందు, పెనుగొండ వేంకటపతి రాయల

ఆస్థానంలోను, మధురానగర తిరుమ నాయకుని ఆస్థానంలోను, వెల్లూరు

చిన్నబొమ్మని ఆస్థానంలోను కొంతకాలం ఉన్నట్లు పండితుల అభిప్రాయం.

అప్పయ్యదీక్షితులు వెల్లూరి పాలకుడైన చిన్న బొమ్మరాజు ఆస్థానంలో ముప్ఫై

సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నో రచనలు చేయుట జరిగింది. ఒకసారి వేదాంత

దేశికుల రచనయైన యాదవాభ్యుదయానికి సరళ వ్యాఖ్య వ్రాయమని

చిన తిమ్మరాజు కోరగా ఆ పనిని పూర్తిచేసి రాజుగారి దగ్గర నుండి

గౌరవసన్మానాభిమానాన్ని పొందినారు.

ఈవిధంగా అప్పయ్య దీక్షితులు అద్వైతాచార్యునిగా ప్రజలకు బోధ చేస్తూ అనేక

గ్రంథాలను రచనచేస్తూ తనకు ఆస్థానంలో స్థానం ఇచ్చిన రాజులకు

మతాచారాల్లోను, రాజ్యవ్యవహారాల్లోను తగిన సలహాలు ఇస్తుండేవారు.  ‘మార్గ

బంధుస్తవం’ లాంటి రచనలు చేసి అటు భగవంతుని ఆశీర్వాదాన్ని ఇటు ప్రజల

అభిమానాన్ని ఇంకొక ప్రక్క రాజుగారి ఆదరణను  చూరగొన్న అప్పయ్య

దీక్షితులగొప్పదనమును గూర్చి ఎంత చెప్పినా తక్కువే.

ఈయన సుమారుగా 104 గ్రంథాలను వ్రాసినారని ప్రసిద్ధి. సిద్ధంత లేశ సంగ్రహం,

నయమంజరి, న్యాయరక్షామణి (బ్రహ్మసూత్ర భాష్యం), శివార్కమణి దీపిక

(శ్రీకంఠభాష్య వ్యాఖ్య), రత్నత్రయ పరీక్ష, శిఖరిణీమాల, మయుఖావళి,

విమతఖండనము, మధ్యతంత్రముఖ మర్దనము, మధ్వవిధ్వంసనము (వ్యాఖ్య),

యాదవాభ్యుదయ వ్యాఖ్య, హరివంశసార చరితావ్యాఖ్య రామాయణ సారస్తవము,

భారతతాత్పర్య సంగ్రహం, వృత్తివార్తికము, కువలయానందము, చిత్రమీమాంస

అనే వేదాంత, దార్శనిక కావ్య, అలంకార గ్రంథాలను వ్రాసిన శైవమతానుయాయి,

మహాపండితుడు, అప్పయ్యదీక్షితులు.

ఆయనకు ఆంధ్రము అంటే అత్యంత అభిమానము ,ప్రేమ గౌరవము. అందుకే

ఆయన   'ఆంధ్రస్య మాంధ్ర భాషాచ| నాల్పస్య తపసః ఫలం|| ' అని అన్నారు.

ఆంధ్రుడైపుట్టట గొప్ప అదృష్టము . ఆంద్ర భాష మాట్లాడగలగటం గొప్ప తపస్సు

‘’అని చెప్పిన  అప్పయ్య దీక్షితుల ను ’’పాపం పిచ్చివాడు ‘’అన్నారు పుట్టపర్తి

నారాయణాచార్యులవారు నేటి తెలుగుకున్న ప్రాముఖ్యాన్ని చూసి బాధ పడుతూ.

స్వస్తి.

Saturday, 14 April 2018

అమ్మవారి అగ్ని స్వరూపము – జ్వాలాముఖీ క్షేత్రము


అమ్మవారి అగ్ని స్వరూపము జ్వాలాముఖీ క్షేత్రము
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములోని కాంగడాా లోయకు 30 కిలోమీటర్ల దూరములో 'జ్వాలాముఖి దేవి' ఆలయము వెలసి యున్నది. ఇది 51 శక్తిపీఠములలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ ఆలయమును ఆ ప్ర్తాన్తములో 'జోతావాలీ మందిర్' అనీ 'నగర్ కోట్' అనుట కూడా కద్దు. విగ్రహము దుర్గా స్వరూపము.
సతీదేవి తానూ దక్షయజ్ఞములో ఆత్మాహుతి చేసుకొన్నపుడు  కొందరు ఈ శరీర శకలములు 18 చోట్ల పడినవి అని చెబితే కొందరు 51 అని అంటారు. ఆమె నాలుక ఈ క్షేత్రములో పడినట్లు చెబుతారు. మరి ఏవిధముగా వెదకినారో ఎందుకు వెదకినారో నేను చదువుట తటస్థించలేదు కానీ  ఈ ప్రాంతమును పాండవులు కనుగొన్నట్లు స్థానికులు చెబుతారు. ఈ మందిర ప్రాంతమునకు దగ్గరగా 'బాబా గోరా/ గోరఖ్  నాథ్' మందిరము కూడా వున్నది. ఈ పుణ్యపురుషునికి ఈ చుట్టుప్రక్కల ప్రాంతములలో భక్తులు ఎక్కువ.
అమ్మవారి గర్భగుడిలో  ‘జ్వాల’ తప్ప మరే విగ్రహమూ కనిపించదు. జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఓ స్థలపురాణం వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజుగారైన భూమి చంద్ నకు  అమ్మవారు కలలో కనిపించి తన ఫలానా చోట ఉన్నానని చెప్పిందట. అమ్మవారు చెప్పిన ప్రాంతాన్ని ఎంత కూలంకషంగా వెతికినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు  భగభగ మండుతున్న మంట మాత్రం తప్ప. అదే అమ్మవారి రూపంగా భావించిన రాజుగారు, ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.
ఇక ఈ జ్వాలాముఖి క్షేత్రమును గూర్చి చెప్పవలసివస్తే, ఆదిగా అమ్మవారికి రాజా భూమిచంద్  ఒక మందిరమును ఏర్పాటు చేయగా ఆ తరువాత చరిత్ర ప్రసిద్దుడగు సిఖ్ఖు రాజు 'రాజా రంజీత్ సింహ్ మరియు రాజా 'సంసార్ చంద్'  లు ఈ మందిర నిర్మాణమును సంపూర్ణము గావించినారు. ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు ఈ తల్లిని తమ కులదేవతగా భావిస్తుంటారు. ఈ జ్వాలలు నిరంతరమూ అఖండముగా జ్వజ్వాలాయమానముగా వెలుగుతూ ఉండుట అందరినీ అబ్బురపరచే విషయము.
ఇక్కడ అమ్మవారి విగ్రహము వుండదు. కేవలము అగ్నిజ్వాలలు మాత్రమే!అని పైనే చెప్పుకొన్నాము. నాలుక పడుటచేత ఈ జ్వాలలు నాలుక చాస్తున్నట్లుగా  ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు.  మొగల్ చక్రవర్తి అక్బర్  ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా నిప్పును ఆర్పే ప్రయత్నం చేసినాడు కానీ పూర్తిగా విఫలుడై వెనుదిరిగినాడు.
ఇక్కడ మనకు తొమ్మిది అగ్నికీలలు అగుపించుతాయి. అవి 1. మహాకాళి  2. అన్నపూర్ణ  3. చండి 4. హింగలాజ 5. వింధ్యావాసిని 6. మహాలక్ష్మి 7. సరస్వతి 8. అంబిక  9 అంజీ దేవి గా వ్యవహరిపబడుతాయి.
ఒక గోపాలుడు తన ఆవు పాలు ఇవ్వక పోగా మిగతా ఆవులతో బాటూ మేయుట కూడా లేదని గ్రహించి దానిని వెెంబడించగా అది ఆ జ్వాలలో వున్న ఒక సుందరాంగికి తన స్థన్యమునిచ్చుటగమనించి రాజునకు తెలుపగా, అది వాస్తవమని తన భటుల ద్వారా నిర్ధారించుకొన్న భూమిచంద్ రాజుగారు అక్కడ అమ్మవారికి మందిరము నిర్మించుట జరుగుతుంది. ఈ మందిరములో 9 జ్వాలలూ మనకు వేరు వేరుగా దర్శనమిస్తాయి. మందిరమునకు బయట అక్బరు కట్టించిన కొలను మనకు ఇప్పటికీ సాక్షాత్కరిస్తుంది. అందలి నీటితోనే ఆ కీలలను ఆర్పుటకు తాను విశ్వప్రయత్నము చేసినాడట. ఈ దేవాలయములో నవరాత్రులను ఎంతో విశేషముగానూ వైభవముగానూ చేస్తారు. అమ్మవారి ఉదయము మొదలు శాయనిచే వరకు 5 ఆరతులు ఇస్తారు. శయన ఆరతికి భక్తులు క్రిక్కిరిసి యుంటారు.
దౌలాధర్ పర్వతాల దిగువన, ధర్మశాల- సిమ్లా రోడ్డు మార్గమున వుండే ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నడుమ, నిత్యాగ్నిహోత్రమై వెలుగుతున్న అమ్మవారిని సందర్శించుకుని భక్తులు పునీతులవుతూ వుంటారు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ, ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తుంటాయి. ఉత్తర ప్రదేశ్ లోని శక్తిసాగర్ ఆలయం, ముక్తినాధ్ లోని జ్వాలామాయి ఆలయం వీటిలో ప్రముఖమైనవి.
పఠాన్ కోట్ నుండి ప్రత్యేకముగా రైలు మారండా వరకు పోతుంది. అక్కడనుండి బస్సు లేక కారు వసతులు మందిరము చేరుటకు కలవు. బస్సుమార్గమయితే దిల్లీ సీమ్లా, పఠాన్ కోట్ ల నుండి నేరుగా జ్వాలాముఖికే బస్సువసతి కలదు.
చిత్రవిచిత్రములయిన అనేకానేక భగవద్దర్శనీయ స్థలములు కలిగిన ఈ దేశములో పుట్టినందుకు ఆ పరమాత్మకు అంజలి ఘటించుదాము.
స్వస్తి.

Wednesday, 11 April 2018

సీతమ్మా శ్రీరాముని కొమ్మా


సీతమ్మా శ్రీరాముని కొమ్మా
నాకు సహజన్ములు లేకపోయినా రామరాజుగారిని త్రికరణ శుద్ధిగా నా అన్నగారిగా తలుస్తాను. వారి శ్రీమతి సీతమ్మ నా వదినమ్మే! పంచ మాతృకలలో వదినది రెండవ స్థానము. అంటే తల్లి తరువాత తల్లి వంటిది ఆమె నాకు. నా కుటుంబముపై ఆమెకు గల వాత్సల్యమును నేను ఈ జన్మకు తీర్చుకోగలిగినది కాదు. కానీ ముభావముగా వుండిపోలేక అశ్రునయనములతో నా భావమును ప్రకటించుచున్నాను.
సీతమ్మా శ్రీరాముని కొమ్మా
నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా
మెరిసె నవ్వై విరిసే పువ్వై
మచ్చలేని పూర్ణేందుబింబమౌ 
చందన నందన వదనమునందున
వెలలకు అందని నవ్విక ఏదమ్మా
                సభ్యసమాజపు కాసారంలో
                మెరమెచ్చులనే కలుష జలంలో
                పంకమునంటక ఉదయ కిరణముల
                రంగులనంతా గ్రహించి  భానుని
                రంగులనంతా గ్రహించి  భానుని

                తెల్లమొగము వేయించుచు తల్లీ
                విరిసినావు నవ పుండరీకమై
                సీతమ్మా శ్రీరాముని కొమ్మా
                నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా

కరి మకరులచే కలతల చెందక
పాల వెలుగు దీపాల తారకల
చూపి నీవు నీ దరహాసమ్మున
సౌదామినులుగ భ్రమింప జేసి 
పారద్రోలితివి భయమే చెందక
ఎంత ధైర్యమది ఏమి స్థైర్యమది
సీతమ్మా శ్రీరాముని కొమ్మా
నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా
                రామ రాజ్యమే నీకాసారము
                నీ కాసారమె నీ సంసారము
                పూరేకులె నీ పుత్రీపుత్రులు
                పగలు రాత్రులే సుఖ దుఃఖమ్ములు
               పతిదేవుడు తన పనుల మునిగినా
               సంసారమ్మును చక్కగ నడిపిన
               సీతమ్మా శ్రీరాముని కొమ్మా
               నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా
చెరుకు రామ మోహన్ రావు