Monday, 16 June 2014

రుద్ర న్యాసము - రుద్ర పంచ ముఖ శ్లోకములు

రుద్ర న్యాసము

రుద్ర పంచ ముఖ శ్లోకములు

https://cherukurammohan.blogspot.com/2014/06/blog-post_16.html

కార్తీక మాసము లో ఒకసారయినా శివుని తలచుకొందాము. శివుడు పంచ ముఖుడు. సింహానికి కూడా పంచ ముఖమన్న పేరు 

వుంది.అదట్లుంచితే బ్రాహ్మలు సంధ్యావందనమునకు పూజకు వాడే పాత్రను 

పంచపాత్ర అంటారు. పంచ అంటే వెడల్పయిన అని ఒక అర్థము.గంగ,చంద్రుడు

మూడుకన్నులు, వ్యోమకేశాముల జటలు మరి ఇన్ని ఉన్నపుడు ఆయన ముఖము 

కూడా పంచముఖమే. పైపెచ్చు మహాన్యాసము ఆయనకు ఐదు ముఖాలు కూడా 

ఉన్నవని చెబుతూ వుంది.  తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ

ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో 

బోధాయనులు రచించినారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస 

ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే శివ పంచానన స్తోత్రం అని 

కూడా అంటారు.


తత్పురుష ముఖ ధ్యానమ్

సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోమయం

గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం

అర్ధేందుద్యుతిలోలపింగలజటా  - భారప్రబద్ధోరగం

వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః

తాత్పర్యము:

ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ,తటివిద్యుత్ 

(మెరుపు)తేజముతోను, కరిగిన బంగారు కాంతితోను పోటీ పడు తేజములను 

తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితమై భయంకరమైన 

అగ్నిశిఖలవలె వలె ప్రకాశించు ఎర్రని పెదవులు కలదియు, బాలేందు ద్యుతి 

(బాల చంద్ర రేఖలు)తో కూడిన  పింగళ వర్ణపు జటాపటలమును కల్గి  (జడల 

గుంపు),భుజంగ భూషణములచే వలయితమై (చుట్టబడినదై), సిద్ధులు

సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున 

ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (ఇందు రజోగుణ ప్రధానమైన 

సృష్టి తత్వము ఇక్కడ స్తుతియింప బడినది)

అఘోర ముఖ ధ్యానమ్

కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం

కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం

సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణ సంచారగం

వందే దక్షిణమీశ్వరస్య కుటిల - భ్రూభంగ రౌద్రం ముఖం

తాత్పర్యము: నల్లని మేఘములతోనూ, తుమ్మెదల నల్లదనముతోనూ పోలిన 

కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి వెడల్పయిన గోరోజనపు వర్ణపు 

కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప 

శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న, మొలకల వలె వాడియైన కోరలు  

కలదియు, సర్పములతో పాటు హారముగా కూర్చబడిన కపాలములు 

కలదియు, శుక్తి ఖండములతోనూ (ముత్యపు చిప్పల ముక్కలు), ఎగుడు 

దిగుడగుచు, వంకరలుగా నున్న కనుల యొక్క కనుబొమల ముడులతో 

భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు 

చున్నాను. (తమో గుణ ప్రధాన లయకర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)

సద్యోజాత ముఖ ధ్యానమ్

ప్రాలేయాచల చంద్రకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం

భస్మాభ్యక్తమనంగదేహ దహన - జ్వాలావళీలోచనం

బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతి పరై - రభ్యర్చితం యోగిభిః

వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం

తాత్పర్యము:  హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల(మల్లె) పూవు వలె 

మరియు ఆవుపాలపై నురగ వలె తెల్లని కాంతి కలదియు, భసితోద్ధూళిత 

మైనదియు (విభూతి పూయబడినది), మన్మథుని శరీరమును దహించు 

జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేంద్రాది 

దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ 

బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును 

అగు శివుని పశ్చిమ ముఖమునకు నమస్కరించు చున్నాను. (సత్వ గుణ 

ప్రధాన రక్షణకర్త తత్వమును ఇక్కడ  స్తుతించ బడినది)

వామదేవ ముఖ ధ్యానమ్

గౌరం కుంకుమ పంకిలం సుతిలకం - వ్యాపాండు గండ స్థలం

భ్రూ విక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం

స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం - నీలాల కాలం కృతం

వందే పూర్ణ శశాంకమండల నిభం - వక్త్రం హరస్యోత్తరం

తాత్పర్యము:  గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ 


పూతతో నిండినదియు,సొగసైన తిలకము కలదియు, అత్యంత తెల్లదనము 


కల చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి 


చూపుల ప్రకాశముతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ 


పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవిపై 


స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని తుమ్మెద రెక్కలవంటి ముంగురులచే 


అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలు ప్రకాశము కలిగిన 


శివుని ఉత్తరముఖమునకు నమస్కరించు చున్నాను. (గుణత్రయ మిశ్రమమగు 


ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)

 ఈశాన ముఖ ధ్యానమ్

వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం - శట్త్రింశతత్వాత్మకం

తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః

వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం

శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం

తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము అను రెండు రెండు లక్షణములే కాక తద్భిన్నమైన  

లక్షణములు  కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  

సకల తత్వముల కంటెను ఉన్నతమైఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ 

దగినదియు, తమో గుణ రహితమును, త్రినేత్రసహితమును, సూక్ష్మాతిసూక్ష్మమగు 

నదియుశాస్తము మరియు ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన 

రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత 

బ్రహ్మతత్వమును ఇక్కడ స్తుతించబడినది) 

స్వస్తి.



No comments:

Post a Comment