Saturday, 16 January 2021

మంచి స్నేహితము - చెడు సహవాసము

 

మంచి స్నేహితము మాన్యత బెంచును 

చెడు సహవాసము ఛిద్రత గూర్చును

https://cherukurammohan.blogspot.com/2021/01/blog-post_16.html

క్షీరేణాత్మ గతోదకాయ హి గుణా దత్తా: పురాతే2ఖిలా:

క్షీరోత్తాప మవేక్ష్య తేన పయసా స్వాత్మాకృశౌ హుత: l

గంతుం పావక మున్మనస్త దభవ దృష్ట్వాతు మిత్రాపదాం

యుక్తం తేన జలేన శ్యామతి సతాం మైత్రీ పునస్త్వీదృశీ ll

క్షీరము మున్ను నీటి కొసఁగెన్ స్వగుణంబులు దన్నుఁజేఱుటన్

క్షీరము తప్త మౌటఁగని చిచ్చురికెన్ వెతచే జలంబు, దు

ర్వార సుహృద్విపత్తిఁగని వహ్నిఁజొరం జనె దుగ్ధ , మంతలో

నీరముఁగూడి శాంతముగ నిల్చు, మహాత్ముల మైత్రి యీ గతిన్.

పాలతో కలిసిన నీటికి పాల గుణము వచ్చింది కానీ పాలకు నీటిగుణము రాలేదు. ఏవి 

పాలో, ఏవి నీళ్ళో అన్నది తెలుసుకోలేనంతగా రెండూ చక్కగా కలిసి పోయినాయి. 

పాలతో కలిసిన నీటికి పాల గుణము వచ్చింది కానీ పాలకు నీటిగుణము రాలేదు. ఇందు 

గమనించవలసిన విషయము ఏమిటంటే నీరు తనలోని కొన్ని వసరములేని 

గుణములను వదులుకొని, పాలలోని రుచిని, తెల్లదనమును మీగడ పెరుగు వెన్న 

మొదలగు రూపములను ధరించి ఇతోధికముగా లోకానికి సేవ చేసింది. ఇక స్నేహితాన్ని 

ఏ విధముగా నిభాయించినదో చూడండి. పాలు సలసలా మరగడం చూసి, మిత్రునకు 

వచ్చిన కష్టమును చూసి, సహించలేక బాధతో అగ్నిలో దుమికింది. మిత్రుడు తన కోసం 

అగ్నిలో దుమకడం చూసి, అతనికి వచ్చిన ఆపద చూసి కలవర పడి క్షీరం కూడా 

అగ్నిలో దుమికింది. అంటే, నీళ్ళతో కలిసిన పాలు, పొంగి, అగ్నిలో పడడం జరిగిందన్న 

మాట. అయితే, నీటితో కలిసిన పాలు అగ్నిలో పడడం వలన అగ్ని చల్లారి పోయింది. 

మహాత్ముల మైత్రి ఇలాగే ఉంటుంది మరి!

చెడ్డ వారితో స్నేహం పనికి రాదు సుమీ ! ఎందుకంటే,

పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినమ్l

వర్జయేత్తాదృశమ్ మిత్రం విషకుంభ పయో ముఖమ్ ll

నోరు మాటలాడు నొసలు చేయును గేలి

చెడ్డ వాని తోటి చెలిమి ఇట్లు

ఆపదున్న, హితుడు అడ్డమ్ము తా నిల్చు

చెలిమి వారితోటి చేయుమోయి

ఎదుట పొగిడి వెనుక ఏవగించెడువారు

పైని పాలు పాత్ర లోని విషము

ఎరుగుమట్టివారు ఎదురైనచో నీవు

రామమోహనుక్తి రమ్య సూక్తి

ఎదుట పొగుడుతారు. వెనుక గోతులు త్రవ్వుతూ ఉంటారు. వారిని పయోముఖ 

విషకుంభములంటారు. అట్టి వారిని గుర్తించుటకు నీ చాకచక్యము ఎంతో అవసరము. 

కొందరు చెడుగు చేయకపోయినా, మంచి చేయకనే ఎదో మంచి చేసిన రీతి మానను 

నమ్మింప జూస్తారు. వారితోటి చెలిమి ఓటి పడవ ప్రయాణమే! నీ జాగరూకత నిన్ను 

కాపాడుతుంది.

నా మాటలలో మంచి మిత్రుని లక్షణాలు ఎలాంటివంటే,

ఆపదలందు తోడుపడు ఆత్మన మేలు దలంచు నెప్పుడున్

గోపన జేయు నీకునగు గోప్య విశేషములెల్ల వేళలన్

నీపయి బ్రేమతో నొసగు నీ వ్యథ బాపెడు సూచనల్ సదా

రూపము చూడకన్ గనుము రూఢిగ నీవటువంటి మిత్రునిన్

ఆపదలో నీకు తోడుగా ఉంటూ ఎల్లపుడూ నీమేలు తలచుతూ, నీరహస్యములను, 

బలహీనతలను గోప్యముగా ఉంచుతూ, నీ పాయి ప్రేమతో నీకష్టములను 

దూరముచేయు  సలహాలనిస్తూ, ఉండే  మంచి మిత్రుని రూపము చూడబోకు. 

ఇటువంటి సల్లక్షణములు కలిగిన వ్యక్తితో తప్పక చెలిమి చేయి.

స్వస్తి.

Sunday, 10 January 2021

చాణక్య - నవ నందులు - ఒకజ క్లుప్తమైన వివరణ

చాణక్య - నవ నందులు - ఒక క్లుప్తమైన వివరణ

https://cherukurammohan.blogspot.com/2021/01/blog-post_10.html

 P D Prasada Rao

గురువు గారికి నమస్కారములు. కఠోర మనస్కుడై తనకు జరిగిన అన్యాయమునకు 

నందవంశము నాశనము చేసినాడు. దయచేసి ఇందు నందవంశము నకు వివరణ 

ఇవ్వగలరు.

నాకు తెలిసిన మేరకు వీలయినంత  క్లుప్తముగాఈ సంశయము తీర్చే ప్రయత్నము చేస్తాను.

 క్షౌర వృత్తి చేసే మహాపద్మనందుడు శిశునాగ వంశమునకు చేందిన చివరి  రాజుకు క్షవరము 

చేసే సమయములో రాజు 'క్షురకుడా' అని అవమానించే వాడు ఆ అవమానము భరించలేక 

ఒక రోజు మహాపద్మనందుడు క్షవరం చేసే సమయములో ఆ కత్తితోనే ఆ రాజును సంహరిస్తాడు. ఆ తరువాత మహాపద్మనందుడు అఖీల భారతావనిని ఆక్రమించుకోని నంద రాజ్యమును స్థాపించి పాలిస్తాడు. కానీ వేరువేరు చరిత్రకారులు ఈ విషయమును వేరువేరుగా తెలిపినారు. ఏది ఏమయినా ధన నందుడు క్షురక వంశమునకు చెందినవాడన్నది బహుళముగా ప్రచారములో ఉన్నది.

పై విధముగా మహా పద్మనందుడు నందవంశపు మూలపురుషుడైనాడు(క్రీ.పూ.424, కాల 

నిర్ణయము తప్పు కూడాకావచ్చు). అసలు మహా పద్మము విలువ లక్ష కోట్లు.అంత 

బంగారమును గంగానది నీటిని మరలించి ఆ ఇసుకలో దాచియుంచుట చేత ఆయనకు 

ఆపేరు వచ్చినట్లు కూడా చెబుతారు. ఆతను కానీ అతని కుమారులగు నవనందులు కానీ 

మంచిపేరు తెచ్చుకోలేక పోయినారు. మహా పద్మనందుని పెద్ద కుమారుడు ధనందుడు రాజై 

ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేళీవిలాసాలకు బానిసై కాలక్షేపం చేసే సంగతి దక్షిణాదిని 

(ప్రస్తుతం మైసూరు) పాలిస్తున్న ఉత్తుంగ నరసింహుడుకి తెలుస్తుంది. అతడు తెలివైనవాడు. 

శక్తిమంతుడు. మగధపై దాడి చేసి తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేస్తాడు. ఈ 

విషయం తెలిసిన చాణక్యుని తండ్రియగు చణకుడు మహానందుడిని కలిసి రాబోతున్న 

ముప్పు గురించి హెచ్చరిస్తాడు. ‘ఏం చెయ్యాలో నాకు తెలుసు. నాకు నీతులు చెప్పడానికి 

వస్తావా?’ అని ఆగ్రహించి అతనికి మరణ శిక్ష విధించుతాడు. అలక్జాండర్ దండయాత్ర 

విషయములో ఇదేవిధముగా చాణక్యుడు లేక కౌటిల్యుడు లేక విష్ణుగుప్తుడు (ఈ మూడూ ఒక 

వ్యక్తి పేర్లే!) సలహా ఇవ్వ బోతే అతని జుట్టుబట్టి బయటికి లాగించుతాడు ధననందుడు. ఆ 

సందర్భములో చాణక్యుడు నందవంశ పాలన నిర్మూలనానంతారమే ఆ జుతూ 

ముడివేసుకొంటానని శపథము చేసి వెళ్ళిపోతాడు.

నవ నందులు

 పంధుక నంద

 పంఘుపతి నంద

భుతపలనంద

 రస్త్రపలన నంద

 గొవిషనక నంద

 దషసిధక నంద

 కైవర్త నంద

 మహేంద్ర నంద

 ధన నంద – (‘నవనంద’ రాజులలో చివరి వాడా మొదటివాడా అన్నది శేష ప్రశ్నయే!)

మహా పద్మ నందుని భార్యయో లేక వివాహేతర సంబంధమో నిర్దారించలేము కానీ 

చంద్రగుప్తుని గుర్తించి అతనికి సకల విద్యలూ నేర్పించి రాజగుటకు తగిన యోగ్యతను 

సంతరించి తిరుగుబాటు యుద్ధము లేకుండానే నందులను రాజ్యభ్రష్టులను చేసి 

చంద్రగుప్తుని రాజుగావించుతాడు.

ఆ విధముగా రాజ్య బహిష్కృతులైన నవనందులు నలమల అడవులుజేరి కర్నూలు జిల్లా 

నంద్యాలకు దగ్గర ఉండే మహానంది సమీపములో నవనదిఆలయములను నెలకొల్పి 

గుట్టుగా రాజ్య పాలన చేసినారని చెబుతారు. ఇది కాకా ఎన్నో వేరు వేరు కట్గాలు కూడా ఉన్నాయి.

ధననందుడు తన రాజ్య కాలములో మంత్రి రాక్షసుని మంత్రాంగముతో చాణక్యుని ఎన్నో 

ఇడుముల పాలు జేసినా అన్నింటినీ అధిగమించి చంద్రగుప్త మహారాజును చేస్తాడు.

Dr. చంద్రప్రసాద్ ద్వివేది హిందీలో రచించి, దర్శకత్వము నేరిపి, చాణక్యునిగా నటించిన 

‘చాణక్య- దూరదర్శన శృంఖల’ ఆసాంతము చూస్తే అనేక విషయములు తెలియగలవు. 

ఆయన పరిశోధన ఫలితము ‘చాణక్య’.

స్వస్తి

Wednesday, 6 January 2021

మహాభక్త కనకదాసు

మహాభక్త కనకదాసు

లంకె: https://cherukurammohan.blogspot.com/.../01/blog-post_6.html

భక్తుల గాథలు దైవ చింతకులకు తొలకరి జల్లు.ఎందఱో పరమాత్మను తాము భగవంతుని బ్రతికియుండగానే సాధించినారు. అట్టివారి శిష్యరికముతో తాముకూడా అంత గొప్పవారయిన ఉదంతములు మనకు వాస్తవాల రూపములో చరిత్ర పుటలలో కనిపిస్తాయి. ఓపిక, జిజ్ఞాస ఉంటే చాలు. తాదాత్మ్యముతో తరించవచ్చు. దీనికి కులముతో పనిలేదు. అందుకే అన్నమయ్య

ఏ కులజుడైననేమి యెవ్వడైననేమి

ఆకడ నాతడె హరినెఱిగినవాడు

పరగిన సత్యసంపన్నుడైన వాడే

పరనిందసేయ దత్పరుడు గాని వాడు

అరుదైన భూతదయానిధి యగువాడే

పరులదానే యని భావించువాడు

నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే

ధర్మతత్పరబుధ్ధి దలిగిన వాడు

కర్మమార్గములు తడవనివాడే

మర్మమై హరిభక్తి మఱవనివాడు

జగతి పై హితముగా జరియించువాడే

పగలేక మతిలోన బ్రదికినవాడు

తెగి సకలము నాత్మ దెలిసినవాడే

తగిలి వెంకటేశు దాసుడయినవాడు

అన్నాడు. ఇదే కోవకు చెందినా కనకదాసు, గోపకులజుడైనా(కురుబ) గోవర్ధనుని చేరినాడు. చదవండి.

మిగిలినది రేపు ...........

మహాభక్త కనకదాసు -2వ భాగము

 కనకదాసు (1509-1609) కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, తత్వవేత్త

సంగీతకారుడు, స్వరకర్త. కనకదాసు కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో రచించిన 

కీర్తనలు, ఉపభోగాల వలన బాగా ప్రాచుర్యమును పొందినాడు. ఇతర హరిదాసుల్లాగే 

ఇతను కీర్తనల్లో సాధారణ కన్నడ భాషను ఉపయోగించినాడు.

కర్ణాటక రాష్ట్రంలో హవేరీ జిల్లా, బాద గ్రామంలో బీరప్ప గౌడ,బాచమ్మ దంపతులకు 

కనకదాసు 1509 సం.లో జన్మించినాడు. కనకదాసు అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. 

ఇతను బాగా చదువుకొని సమాజాన్ని అన్ని కోణాలలో సూక్ష్మ పరిశీలన చేసినాడు. చిన్న 

వయస్సులోనే ఇతను నరసింహ స్తోత్రం, రామధ్యాయ మంత్రం, మోహన తరింగిణి అనే 

కవిత్వాలను రచించినాడు. కనకదాసు సామాన్యులకు అర్ధమయ్యే విధంగా 

కాలాంతరములో, కన్నడ భాషలో రచనలు చేస్తూ, కీర్తనలు రాస్తూ, వేదాంతాన్ని 

అభ్యసించి గొప్ప కృష్ణ భక్తుడడైనాడు.

యుద్ధవీరుడై, కొంత సైనిక బలగమునకు నాయకుడగుటచే, ఆయన తిమ్మప్ప 

నాయకుడైనాడు. అతని కీర్తనలో ఒకదాని ప్రకారం కనకదాసు కనక నాయకుడు అన్న 

బిరుదముతో అలరారినాడు.  ఒక యుద్ధంలో తీవ్రముగా గాయపడినాడు కానీ తాను 

నమ్ముకొన్న ఆదికేశవ స్వామి దయతో ప్రాణాపాయం తప్పింది. దీనితో కగినెల్లి ఆదికేశవ 

స్వామికి అంకితమై, సైన్యమును విడచి, వ్యాసరాయల శిష్యుడై  'కనకదాసు' అని గురువు 

పెట్టిన పేరుకు సార్ధకత  తెచ్చి  సామాన్యులకు అర్ధమయ్యే కన్నడ భాషలో కీర్తనలు 

రాస్తూ రచనలు చేస్తూ వేదాంతాన్ని అభ్యసించి  మహా కృష్ణ భక్తుడైనాడు. తరువాత తన 

సైనిక వృత్తిని విడిచిపెట్టి, తత్వజ్ఞానాన్ని పామరులకు అర్థమయ్యేలా సంగీత 

సాహిత్యాలతో కూర్చి అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసినాడు. ఈయన 

అనేక వేదాంత గీతాల్ని రచిస్తూ పాదిన వాగ్గేయకారుడు. కష్టించి పనిచేసే తక్కువ 

జాతులవారిని హీనంగా చూడనవసరము లేదని, పాటలు, పదాల రూపంలో తన 

ఆవేదనను వెలిబుచ్చుతూ శ్రీకృష్ణ సాయుజ్యమును పొందిన మహాభక్తుడు ఈయన.

ఈ అధిక అధమ తారతమ్యమును గూర్చి తాను రచించి గానము చేసిన  రామాధ్యాన 

చరిత్ర లోనిఈ చక్కటి కథను ఒకసారి చదవండి.

‘ఒక సారి ఒక బియ్యపుగింజకు, రాగిగింజకు వివాదం వచ్చింది. రాగి ప్రజలందరి ఆకలీ 

తీరుస్తుంది, బియ్యం ఒక్క ధనవంతులుకే అందుబాటులో ఉంటుంది. మరి దాని విలువ 

ఎక్కువ. కానీ రాగిలో పోషక విలువలు ఎక్కువ. నేను గొప్పంటే నేను గొప్పని రెండూ 

వాదులాడుకుంటూ రాముడి దగ్గరకు వెళ్ళాయి తీర్పు చెప్పమని. ఇద్దరి వాదనలూ విన్న 

రాముడు ఆరు నెలలు రెండు రకాల గింజల్నీ గాలి చొరని, చీకటికొట్లో బందీగా 

ఉండమన్నాడు. ఆరు నెలల అనంతరం బయటికి తీసి పరీక్ష చేయించాడు. బియ్యం 

గింజ పాడయిపోయి, పొడి పొడిగా రాలి పోయింది. రాగి గింజ చెక్కు చెదరకుండా 

నిలిచింది. అప్పుడన్నాడా దేముడు. 'కష్టించి పని చేసే జీవుల్లాగే రాగిగింజ కూడా 

ఎటువంటి స్థితినైనా తట్టుకుని నిలబడుతుంది, ధనవంతుల శరీర మనో బుద్ధుల్లాగే 

బియ్యపుగింజ ఆటుపోట్లొస్తే నిలువలేక పోతుంది అని తీర్పు నిచ్చినాడట రాముడు.

ఎంత భావయుక్తమగు కథయో చూడండి.

 మిగిలినది రేపు .........


Monday, 4 January 2021

పాద పూజ - నీ పాదకమల సేవయు

 

పాద పూజ - నీ పాదకమల సేవయు

https://cherukurammohan.blogspot.com/2021/01/blog-post.html

శ్రీకృష్ణుని చరిత్ర అంతా మనకు భాగవతములోని దశమస్కందములో మొదలౌతుంది. బలరామ కృష్ణులు కంసుని ఆహ్వానమును అకౄరునిచే అందుకొని మధురా నగరము ప్రవేశించి అచట గల తమ భక్తుల తాపముల దీర్చుతూ కంసుని అంతపురమువైపు అడుగులు వేస్తూ వుంటారు. ఆ సందర్భమున వారికి తమ ప్రియభక్తుడగు పుష్పమాలికలు కట్టే సుదాముడు (కుచేలుడు కాదు) గుర్తుకొస్తాడు. దైవస్వరూపులకు భక్తుని భక్తి ప్రాధాన్యము కానీ నేటి ఐశ్వర్యవంతులవలె అంతస్తు ప్రాధాన్యము కాదు కదా!

 బలరామ కృష్ణుల అడుగులు  సుదాముని ఇంటికి దారి తీస్తాయి. .

వారిని చూచిన వెంటనే తత్తరపాటుతో తన ఆసనము నుండి లేచి  నమస్కారముచేసి అర్ఘ్య పాద్యాలను , తాంబూలాలను , పూలు , గంధము మొదలైన వస్తువులను ఆనందభరితుడై వారికి ఇచ్చి, పరిమళాలు వెదజల్లే పూలమాలలతో వారి గళసీమను అలంకరించుతాడు .

అవధి లేని ఆనంద పారవశ్యముతో ఆతను "మీ రాకతో నా ఇల్లు పావనమయ్యినది , తపస్సు పండినది , నా ఇల్లు సిరి సంపదలతో నిండినది. మీరు నాయింట్లో ఉంటె శ్రీమహాలక్ష్మి కూడా మాయింట ఉన్నట్లేకదా! , నా కోరికలన్నీ తీరినాయి. నేను మీకు ఏ విధమైన సేవ చేయగలవాడను" అని ఎంతో వినమ్రతతో కూడిన ఉచ్ఛారణతో అనునయ పూర్వకముగా పలికినాడు. ఎంతో సంతోషించిన బలరామకృష్ణులు ఏ వరము కావాలో కోరుకొమ్మన్నారు .

ఆ సందర్భంలో సుదాముని నోటినుండి వచ్చిన మాటలు పద్య రూపంలో మన కందించినాడు మహనీయుడు పోతన.

నీ పాదకమల సేవయు

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూతదయయునుఁ

దాపసమందార! నాకు దయచేయఁ గదే! భాగవతము - 10.1-1272

తాపసులకు కల్పవృక్షం వంటివాడా! శ్రీకృష్ణా! కమలముల వంటి నీ పాదాల పరిచర్యను, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమినీ, సర్వ ప్రాణులమీద అపరిమితమైన దయనూ నాకు ప్రసాదించు.

 

ఒకానొక కాలములో ఈ పద్యమురాని తెలుగువాడు ఉండేవాడు కాదు. నేడు ఆపద్యము వచ్చినవాడు దొరికేది దుర్లభమైపోయింది.

ఏమయినా కోరి యుండవచ్చు. నిస్వార్థ భక్తి కలిగిన మహనీయులు కళ్ళారా భగవంతుని జూచిన తరువాత వేరేమి కోరుతారు.ఆ ముగ్ధమోహన దేవతామూర్తుల దర్శనంతో కోరికలన్నీ నశిస్తాయి . వారి పాదసేవ వినా పరిశుద్ధ మనస్కులు వేరేమీ కోరలేరు.

 భగవద్వర్ణన , మనుష్య వర్ణనలను ఎట్లా ఆరంభించాలనేదానిపై మన పూర్వులు ఒక నియమం ఏర్పరచినారు.

'అలంకార శేఖరము' అన్న లక్షణ గ్రంధములో ఈవిధముగా చెప్పబడినది.

చిరంతన స్యాసితథా శివచంద్రస్య బాలతా l

మానవా మౌళితో వర్ణ్యాదేవాశ్చరణతః పునః ll

దైవాకార వర్ణన పాదాలతో మొదలుపెట్టవలెనట. మానవాకార వర్ణన మోము తో మొదలుపెట్టవలెనట,

మూక పండితుని ‘పంచశతి’లోని పాదారవింద శతకం కేవలం కంచి కామాక్షీ దేవి పాద వర్ణనకే రచించబడింది. శంకరాచార్యులవారి ‘పాదావికేశాంతస్తవంలోనూ.. పాద మహిమాభి వర్ణన ఉంది. పాదపూజ- పాద పవిత్రత యింత గొప్పది కాబట్టే- పూర్వ పూర్వులైనవారు,

పూర్వము యోగ్యులగు వారికి, వయసులో పెద్దలకు పాద స్పర్శ చేతులతో చేసి నమస్కరించేవారు.  నేడు ఆ తేడాలేకుండా ఎక్కువగా అయోగ్యుల పాదసేవ చేయుచున్నారు.

స్వస్తి

Saturday, 2 January 2021

అజరామర సూక్తి – 99 పై స్పందన ప్రతి స్పందన. (దత్తాత్రేయుని గురువులు)

 

అజరామర సూక్తి – 99 పై స్పందన ప్రతి స్పందన.

https://cherukurammohan.blogspot.com/2021/01/99.html

అజరామర సూక్తి పై శ్రీనాథ బాబు గారు, రవి సుధాకర్ గారు, పార్వతీశం గారు నా

లేఖనమును అణువణువూ చదివి స్పందించినారు.  వారికి హృదయపూర్వక 

ధన్యవాదములు.

వారి స్పందనలను దృష్టిలో ఉంచుకొని నాకు తోచిన నాలుగు మాటలు 

వ్రాయుచున్నాను. ఇందులో ఊకదంపుడు ఉండదు.

Srinatha Babu

Chakkani Ajaramara Sukthi. Manasuku aalochana kaluga chesthundi. Meeku dhanyavadamulu.

Ravi Sudhakar Musunuri

కాకి వెనుక ఇంత కథ ఉందా? చాల బాగుంది బావగారు

పార్వతీశం గారి అభిప్రాయము:

అజరామర సూక్తి..99

ఇది నిజంగా అజరామరమేనండి ఎందుకంటే కాకి తత్వము గూర్చి చెప్పినది. కాకులు 

భువిని ఉన్నా,పోయినా వాటి తత్వం మాత్రం భూమిపై ప్రజలు నోళ్ళలో నిలచి 

ఉంటుంది...

శ్లోకం

కాకా ఆహ్వయతే కాకాన్,యాచకో న తు యాచకాన్

కాకా యాచకయోర్మధ్యే వరం కాకోన న యాచకః

కాకి తనకు కాసిన్ని మెతుకులు దొరికినంతనే తాను తినక కావు కావు మని మిగిలిన 

కాకులను పిలిచి వాటితో యీ కాసిన్ని మెతుకులనూ పంచుకుంటుంది.

కాని దొంగ తనకు యెంతో ధనము దొరికిననూ అది యెవరితోనూ పంచుకోడు అని 

వివరించారు.

అందువల్లనే "యాచకో యాచకశ్శతృః"అన్నట్లు తెలిపారు.

ఒక ధనికుడు మరణించగా తమ భటులు వస్తే అతనికీ యమభటులకూ, జరిగిన 

సంభాషణా,ధనికుని భంగపాటు, చాలా హాస్య భరితంగా జ్ఞానోదయం కలిగించే రీతిలో 

చెప్పేరు.

గొప్ప మెదడు గల మానవుడు యోచించలేని పరహితాన్నీ ఉన్నది పంచుకోడాన్నీ 

హృదయము గల కాకి యోచించి ఆచరించింది.అది వివరించే యీ మీ పద్యం అతి 

ముఖ్యమైనది.

"కాకియొకటి దొరుకుకాసిన్ని మెతుకుల

నైన వారి బిల్చి యారగించు

కాకి బుధ్ధి మనకు కలనైన రాదిది

రామ మోహనుక్తి రమ్య సూక్తి"

అనే పద్యంతో వివరించేరు....

చాలా చాలా విశేషమైన విశిష్టమైన విశ్లేషణ,పద్య రచన లకు అనేకానేక 

అభినందనలండీ రామ మోహన రావు గారూ. వందనములండి

Ravi Sudhakar Musunuri

Parvateesam Vepa అన్నయ్య గారు - మీ విశ్లేషణాత్మక స్పందన అద్భుతం.

Parvateesam Vepa

Ravi Sudhakar Musunuri తమ్ముడు గారూ మీకు నా విశ్లేషణ నచ్చినందుకు చాలా 

సంతోషం.

నా ప్రతిస్పందన

దత్తాత్రేయులవారు తనకు ఎవరెవరు గురువులని తెలుపుచున్నారో గమనించండి. నేను 

సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుండీ జ్ఞానం సంపాదించాను. చెప్తాను విను.

ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. కొన్నింటినుండి ఎలా ఉండాలో 

తెలుసుకున్నాను, కొన్నింటినుండి ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. అని

1. భూమి నుండి – క్షమా, పరోపకారత్వం నేర్చుకున్నాను.

2. వాయువు నుండి- నిస్సంగత్వం, నిర్లేపత్వం.

3. ఆకాశము నుండి- సర్వవ్యాపక తత్త్వం.

4. జలము నుండి – నిర్మలత్వం, మాధుర్యం స్నిగ్ధత్వం,

5. అగ్ని నుండి – తేజస్సు, ఈశ్వర తత్త్వం.

6. సూర్యుని నుండి - జలగ్రాహి, జలత్యాగియు,లోకబాంధవుడు, సర్వలోకాలకు 

అతడొక్కడే అని తెలుసుకున్నాను.

7. చంద్రుని నుండి – వృద్ధి క్షయాలన్నవి దేహానికే కాని, ఆత్మకు కావు అని 

తెలుసుకున్నాను.

8. పావురాల జంట నుండి – కామక్రోధాలకు వశమైనచో ఆత్మానురాగం కోల్పోతారని 

తెలుసుకున్నాను.

9. అజగరము నుండి (కొండ చిలువ) – దైవికంగా లభించిన దానికి తృప్తి చెంది

లభించని దానికై వెంపర్లాడక ఉండాలని కొండచిలువ నుండి నేర్చుకున్నాను.

10. సముద్రం నుండి- తనలో ఉన్న మనోభావాలను బైటకు పొక్కనీయకూడదని 

నేర్చుకున్నాను.

11. మిడత నుండి – సుఖమని భ్రమించి మోహమనే జ్వాలాగ్నికి బలి అయి, మృత్యువుకి 

చేరువవుతుందని తెలుసుకున్నాను.

12. తేనెటీగ – యోగి ఎవరినీ నొప్పించకుండా భిక్ష సంపాదించుకొన్నట్లు, తేనెటీగ 

కూడా ఏ పువ్వు కూడా బాధపడకుండా, గాయపడకుండా తేనెను సంగ్రహిస్తుంది. ప్రతీ 

పుష్పాన్ని వదలకుండా తేనెను సేకరించినట్లే ఏ గ్రంథాన్ని, ఏ ఒక్క విషయాన్ని 

వదలకుండా శాస్త్రాధ్యయనం చేయాలనేది తెలుసు కున్నాను. తాను కష్టపడి కూడబెట్టిన 

తేనెను (తేనెపట్టును) పరాయి వారికి వదిలేస్తుంది. కానీ యోగులు రేపటి అవసరాల 

కోసం సంపాదించరు.

13. వారణము (ఏనుగు) నుండి – ఏనుగు తనకున్న స్త్రీలౌల్యం వల్ల ఎంత 

బలమైనదైనప్పటికీ, ఇతరులకు వశపడుతుంది.

14. మధుహారి – ఇతరులు కూడబెట్టిన వస్తువును, న్యాయాన్యాయాలు 

ఆలోచించకుండా అపహరించేవాడు నీచుడు అనబడతాడు.

15. లేడి నుండి- అమాయకత్వంతో వేటగాని వలలో పడుతుంది. అమాయకత్వం 

కూడదని తెలుసుకున్నాను.

16. చేప నుండి – జిహ్వ చాపల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి ఎరకు చిక్కి 

బాధపడుతుంది. జిహ్వ ఎంత చేటు చేస్తుందో తెలుసుకున్నాను.

17. పింగళ (ఒక వేశ్య) నుండి – భౌతిక వాంఛలకు, ధనాశకు లొంగి కాలాన్ని

సాధనాన్ని (మనశ్శరీరాలు) దుర్వినియోగం చేసుకోకూడదని తెలుసుకున్నాను.

18. కురరము (లకుముకి పిట్ట) నుండి – ఇతరులకు, తనకు మధ్య తేడాలు గ్రహించక 

వారితో పోటీపడటం మంచిది కాదు అని గ్రహించడం.

19. బాలుడి నుండి – పాపపుణ్యాలు ఎరుగక యోగితో సమానుడిలా ఉండాలని 

తెలుసుకున్నాను.

20. కన్యక నుండి - ఎటువంటి పరిస్థితులున్నప్పటికీ, కుటుంబ గౌరవాన్ని కాపాడటం.

21. శరాసనుని (విలుకాడు) నుండి – ఏకాగ్రత.

22. సర్పము నుండి – జీవితం అశాశ్వతమని గ్రహించినదానివలె తనకంటూ 

స్థిరనివాసం ఏర్పరుచుకోదు.

23. సాలెపురుగు – ఎన్నిసార్లు లయమయినా, మరల మరల సృష్టిస్తుంది. ప్రయత్నం 

వల్ల కార్యసిద్ధి.

24. పురుగు నుండి – భ్రమరకీటకన్యాయం వలె మనస్సంతా భగవంతుని మీదే 

లగ్నంచేసి చివరకు భగవంతునిలో లీనం అవ్వాలి అనేది తెలుసుకున్నాడు.

ఆ విధంగా ప్రకృతిలోని ప్రతీ అణువు తనకు గురువేననీ, తన మనస్సు కూడా తనకు 

గురువేనని తెలియచెప్పినారు.

ఆ విధంగా తానే స్వయంగా దేవతలు, రాజులు, మహర్షులకి ఎందరికో గురువైనప్పటికీ

అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతీ అణువు నుండి నేర్చుకుంటూ శిష్యుడు కూడా 

అయినాడు.

ఇంత పరిశీలన చేసే ఓర్పు, సమయము, ఆకాంక్ష, సాత్వికత, కామ వికర్షణ మనలో మచ్చుకయినా ఉన్నాయా!

పురాణ ప్రవాచకులగు కొందరి బియ్యములో ఊక ఎక్కువ. మనకు వూకను వేరుచేసి 

బియ్యము తీసుకొనే శక్తి ఓపిక రెండూ లేవు.  వారు ఊక ఉంచకుంటే తరువాతి రోజుకు 

తగినంత విషయముండదన్న చింత. 'ధనమూలమిదం జగత్' కదా. జ్ఞాన సంపన్నుడు 

ఆ దిగులు పెట్టుకోడు.

ఏతావాతా నేను చెప్పదలచుకొన్నదేమిటంటే

క్షణశః కణశశ్చైవ - విద్యామర్థంచ సాధయేత్ l

క్షణ త్యాగే కుతోవిద్యా  -  కణ త్యాగే కుతో ధనంll

అన్నారు పెద్దలు. నేర్పించే సద్గురువు దొరికినపుడు క్షణము కూడా వృధా చేయకుండా 

విద్య ఏర్చుకోవాలి. చీమకు ఆహారమే ధనము. ఒక్కొక్క రేణువును తన సహచరుల 

సహాయముతో కూడబెడుతుంది. మనిషి తప్పనిసరి అయితే తప్ప ధనము 

విషయములో  ఒకరి సహాయము కోరడు. అయినా అవసరానికి మించకుండా ధనము అణువణువూ కూడబెట్టవలసినదే, అవసరము లేని ఖర్చులు చేయకుండా! ఇది జీవిత సత్యము. మంచి తెలుసుకొనుట జీవితమునకు ఎంతో మంచిది.

స్వస్తి.