Tuesday, 17 April 2018

వ్యష్టి - సమిష్టి


వ్యష్టి - సమిష్టి 

https://cherukurammohan.blogspot.com/2018/04/blog-post_17.html

స్వానుభవమును వ్యష్టి అంటారు. అదే అనుభవము సామూహికముగా జరిగితే సమిష్టి అంటారు. ఒక రైతు సాటి రైతుల వలె వాతావరణానుకూలమగు  పంటను  వేయక తనకు తోచింది వేసినాడు అనుకొందాము. ఆతను నష్టపోతాడు అది అతని అనుభవము మాత్రమె. అది వ్యష్టి అవుతుంది. అదే మిగత రైతులందరూ   వాతావరణానుకూలమగు  పంటను వేసి మంచి ఫలితము  అది సమిష్టి అవుతుంది. ఒక్కొక్క పర్యాయము బస్సు, రైలు లేక విమాన ప్రమాదములు జరుగుతూ వుంటాయి. ఒకేసారి ఉమ్మడిగా కొంత మంది ప్రయాణీకులు ఆయా ప్రమాదములకు ఆహుతి అవుతూ వుంటారు. అదే సమిష్టి. అంటే వారు ఒకే విధమగు కర్మఫలమును అనుభవించినారన్నమాట.
ఈ విషయమై ఒక చిన్న కథ చెబుతాను. ఒకసారి ఒక బస్సులో కొంత మంది ప్రయాణీకులు పోతూ వుండినారట. అందులో ఒక జ్యోతిష్యుడు, ఈ బస్సులో కూర్చున్న జనానికి,
 ఇందులోవున్న 

ఒక వ్యక్తిచే ప్రాణాపాయము కలుగనుంది అని చెప్పినాడట. అట్లు చెప్పి అతడు తన మజిలీ వద్ద దిగిపోయినాడు. డ్రైవరు బస్సు నిలిపి ఎదురుగా వున్న చెట్టును చూపి ఒక్కొక్కరిగా ఆ చెట్టు వద్దకు పోయి రమ్మన్నాడట.  అందరివంతూ అయిపొయింది ఒక్కడు మాత్రము మిగిలినాడు. బస్సులోనున్న ప్రయాణీకులంతా ఇక అతనిని దింపివేస్తే సరిపోతుంది అతనే ఆ నష్టజాతకుడని నిర్ధారించినారు. ఆతనిని దింపి బస్సును పోనివ్వమన్నారు. అంతే! కొంత దూరము పోతూనే పెద్ద ప్రేలుడు సంభవించి లోన వున్నవారంతా అగ్నికి ఆహుతియైపోయినారు. ఇక్కడ దిగినవాని కర్మ వ్యష్టి పోయినవారిది సమిష్టి.

 ఈ అనుభవము అన్నది ఒక గత స్మృతి. ఇవి అన్నీ ఒకే విధముగా వుండవు. కొన్ని చెరగని ముద్ర వేస్తే కొన్ని మసకగా జ్ఞాపకు వుంటే కొన్ని స్మృతి పథము నుండినే ఎగిరిపోతాయి. జీవితములో ఒక వ్యక్తికి ఎన్నోకలలు వస్తాయి. అది తన సుషుప్తిలో జరుగుతూవుంది. సుషుప్తి వీడనంత వరకూ, కల జరుగుతూ ఉన్నంతవరకు తాను పాత్రధారి అయినా కాకున్నా ఆ విషయమునకు తానూ సాక్షీభూతమై మసలుతాడు. అదీ అనుభవమే! మేలుకొన్న తరువాత కూడా అది తన మదిలో నిలచిపోతూవుంది, దాని ప్రాముఖ్యతను బట్టి. మరి ఆ అనుభవమునకు ఒక సాక్షి లేకపోతే సుషుప్తిలో వున్న నీకు ఎవరు జ్ఞాపకము చేసినట్లు? కాబట్టి నీకు తెలియకుండానే నీలో ఒక నిర్విరామ నిరంతర సాక్షి ఉన్నట్లే కదా! ఆ సాక్షే లేకుంటే నీకు అనుస్యూతి (Continuity) ఏర్పడదు. ఈ అనుస్యూతి వల్లనే కర్మ ఆత్మ యొక్క జన్మ జన్మాంతరాలను అనుసంధానము చేస్తూవుంది. అది ఆ విధముగా వస్తూవున్నది కాబట్టే ఆయా అనుభవ కర్మఫలముల బట్టి ఈ 'పునరపి జననం పునరపి మరణం' జరుగుతూ వుంది.

 ప్రతిజీవిలోనూ అవ్యక్తుడగు వ్యక్తి  సాక్షిగా ఉన్నాడు అన్నది ఒక మరువగూడని సత్యము. అతడు వ్యాపించి ఉన్నాడు.  అతడే మార్గదర్శి (guide, ఉపదేష్ట), రక్షకుడు (care-taker)

ఇక్కడ వ్యష్టి , సమిష్టి అనే పదాలకు అర్థము ఆంగ్లములో చెప్పుకోనవలసివస్తే,  individual, dividual అని చెప్పుకొనవచ్చును. రెండో పదం వాడుక తక్కువ. Individual = (n) a single human being, as distinguished from a group. (Adj) single; particular; separate; dividual = (adj) divisible or divided, distributed; shared. Aspect of one ultimate truth is in you, located in you.

కావున ఏ సాక్షి మనకొరకు మన కర్మఫలమును గుర్తు పెట్టుకొని ఆయా అనుభవ ఫలితములను మనము అనుభవింపజేస్తున్నాడో ఆయనను సర్వాంతర్యామిగా కీర్తించున్నాము.

స్వస్తి.

 

Sunday, 15 April 2018

శిభక్తికి ప్రతిరూపమే అప్పయ్య దీక్షితులు

శిభక్తికి ప్రతిరూపమే అప్పయ్య దీక్షితులు

https://cherukurammohan.blogspot.com/2018/04/blog-post_15.html

అప్పయ్య దీక్షితుల వారు  తమిళనాడు నందలి  తిరువణ్ణామలై జిల్లా, పట్టు చీరలకు 

పేరుగాంచిన  అరణికి దగ్గరగా వున్న  అడయపాలెం అన్న ఊరియందు ప్రమాదీచ నామ 

సంవత్సరము ఆశ్వయుజ(అని విన్నాను) మాసము, కృష్ణ పక్షము ఉత్తరాభాద్ర నక్షత్రమున 

క్రీ.శ. 1520 లో  జన్మించినారు.  అప్పయ్య దీక్షితుల వారి పూర్వ నామము వినాయక 

సుబ్రహ్మణ్యం.  వీరితండ్రి  రంగారాజాధ్వరి. యజ్ఞ క్రతువులు చేసినవారిని ఆధ్వరి 

అంటారు. ఆధ్వరము  యజ్ఞము.  దీక్షితుల వారు విద్యాభ్యాసమును రామకవీంద్ర 

గురుముఖతః చేసినట్లు చెబుతారు.

వీరు శంకరాద్వైతమును త్రికరణ శుద్ధిగా అనుష్ఠించిన వారు. ఆయన చిత్తము మొత్తము 

పరమేశ్వర పాదయుగళికి అంకితము చేసిన మహాభక్తుడు. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ 

వేదాంతాది సకల శాస్త్రములకు ఆయన ఆటపట్టు. అద్వైతి కాబట్టి ఒకసారి వెంకటేశ్వర 

దర్శనార్ధమై ఆయన తిరుమల వెళ్ళినపుడు వేంకటేశ్వరుడు, లింగాకృతిలో దర్శనమిచ్చుట 

జరిగినదని చెబుతారు. అసలా విగ్రహము స్వయంభూ విగ్రహము. సకల దేవతానురూప సారము. బాల త్రిపుర సుందరిగా భావించి కొందరు భక్తులు బాలాజీ అంటారు. అసలు వెంకట అన్న పదము కాలాంతరములో చేరిన తమిళ పదము. మిగిలినది ఈశ్వర  శబ్దమే. ఆ విగ్రహమునకు నాగాభరణములు గలవు. ఆయనకు స్వామి అన్నపేరు కలదు. స్వామి అన్నపేరు ఒక్క సుబ్రహ్మణ్యునికి మాత్రమే కలదు. గురువారము నాడు అభిషేక 

సమయములో విగ్రహము యొక్క మూడవ కన్నును చూడవచ్చునని చూసిన అర్చకులు 

చెప్పేవారట. ఇక విష్ణు రూపుడు అనుటకు కూడా ఆధారాలు మనము చూస్తూ ఉన్నాము. 

ఒకానొక కాలములో ఈ విగ్రహమునకు 6 నెలలు శివునిగానూ 6 నెలలు విష్ణువుగానూ 

పూజ జరిగేదట. ఇక విగ్రహము యొక్క ఉష్ణోగ్రత ఎప్పుడూ 110°ఉంటుందట. 

విగ్రహము వెనుకవైపు నీటి గలగలల శబ్దము చాలా ఎక్కువగా ఉంటుందట.ఇవన్నీ 

విగ్రహము యొక్క శివ తత్వమును తెలుపవా! అందుకే పరమ అ భక్తుడైన అప్పయ్య  

దీక్షితులగారికి వేంకటేశ్వరునిలో ఈశ్వరుడు కనిపించినాడు.

ఆయన తపస్సిద్ధి పొందిన మహనీయుడు. ఆయనకు కడుపునొప్పి విపరీతముగా 

వుండేది. అది ఆయన తపస్సాధనకు ఎంతో అంతరాయమును కలిగించేది. నైష్ఠిక  

బ్రాహ్మణులు జపానుష్ఠానాది సమయములలో తమ వద్ద ఒక తడి తుండుగుడ్డ 

పెట్టుకొంటారు. అప్పయ్యగారు కూడా ఆ విధముగానే ఒక తుండును వుంచుకొనేవారు. 

ఆయన తన యావత్తు జప సమయములో ఆ కడుపునొప్పిని ఆ తుండులోనికి 

ఆవాహనముజేసి తన దీక్షలో తానూ మునిగిపోయేవారు. ఆ సమయమంతా ఆ తుండు 

విపరీతముగా కంపించేది. ఈ ఉదంతము ఆయన సాధనకు తార్కాణము. ఆయన శివ 

భక్తి నిరుపమానము. వారిచే రచింపబడిన ఈ శ్లోకము అందుకు తార్కాణము. విద్యలలో 

వేదం విద్య ఉత్కృష్టమైనది. అందులో రుద్రములోని 11 వ అనువాకము శ్రేష్ఠము. 

అందులో పంచాక్షరి మిక్కిలి శ్రేష్ఠము, అందులో 'శివ' అన్న శబ్దము అత్యంతశ్రేష్ఠము.

ఈ భావమును అప్పయ్య దీక్షితులు గారు వ్రాసిన ఈ క్రింది శ్లోకము 

తెలియజేయుచున్నది.

విద్యాసు శ్రుతిరుత్కృ ష్టా రుద్రైకాదశిని శ్రుతౌI

తత్ర పంచాక్షరీ తస్యాం శివ ఇత్యక్షరద్వయంII

ఆయన అద్వైత తత్పరత ఒకసారి చూద్దాము.

మారమణ ముమారమాణం ఫణధరతల్పంఫణధరాకల్పం

ముర మధనం పుర మధనం వందే బాణారి మసమ భాణారిం

మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని

నవస్తూ భేదః ప్రతిపత్తి రస్తుమే తధాపిభక్తిః తరుణేందుశేఖరే  (అయ్యప్ప దీక్షితులు)

లక్ష్మీపతి యగు విష్ణువు సర్పము పై శయనించితే ఉమాపతి సర్పములనే

దేహముపై ధరించినాడు. హరి మురారి అయితే హరుడేమో పురారి. హరి

బాణాసురహర్త హరుడేమో మారుని సంహర్త (మారుడు=మన్మధుడు).

మహితాత్ములగు వారిరువురికీ నమస్కారము.

జగదధీశ్వరుడు మహేశ్వరుడు. జగదంతరాత్ముడు జనార్దనుడు. వస్తుతః

వారిరువురికీ భేదము లేనప్పటికీ నాకు తరుణేందు శేఖరునిపై తపము

సిద్ధిస్తూవుంది. ఒక మాట ఆయన పాండిత్యమును గూర్చి చెప్పుకొందాము.

అప్పయ్య దీక్షితులవారు మహా వేదాంతి మరియు పండితుడు. ఆయన ఎన్నో

రాజాస్థానములు తిరిగి ఆయా ఆస్థానముల దిగ్దంతులగు పండితులను తమ

అసమాన పాండితీ ప్రకర్షతో ఓడించి సన్మానములను అందుకొనేవారు. ఆ

ప్రకారంగా ఆయన ఒక పర్యాయము జింజి సంస్థానమును సందర్శించుట

తటస్తించినది. అక్కడ రాజు కొలువులో శ్రీనివాస దీక్షితులు అన్న మహాపండితుడు

ఉండేవాడు. ఆయనకు తనను మించిన పండితుడు లేడన్న నమ్మకమే కాక ఎన్నో

సంస్థానములు తిరిగి ఎందఱో పండితులనోడించిన అప్పయ్య దీక్షితులను ఓడించి

తన పాదములకు నమస్కరింప జేసుకొనవలెనను తపన తలమీద తాండవము

చేయుచుండెడిది. అవకాశము అందివచ్చినది కాబట్టి ఆయన వాగ్వాదమునకు

దీక్షితులవారితో తలపడినాడు. వాదములో రోజులు గడువగా తాను ఓటమికి

దగ్గరలోవున్నట్లు అర్థమైపోయింది శ్రీనివాస దీక్షితులవారికి. విషణ్ణవదనుడై 

అగమ్యగోచరునిగా అగుపించుచున్న శ్రీనివాస దీక్షితులకు మహారాజు చక్కని సలహా

ఇచ్చినాడు."మీరు మీ అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లిచేయ దలచుచున్నారని నేను

చెబుతాను. ఆయన కాదనలేడు. పెళ్లి పూర్తయిన పిదప సతీసమేతముగా ఆయన

మీ పాదాలాంటి నమస్కరిస్తాడుకదా!" అని సలహా ఇచ్చినాడు. శ్రీనివాస దీక్షితులు

ఆవిధముగాజేసి తన గౌరవమును కాపాడుకొన్నాడు. అప్పయ్య దీక్షితులవారు

అంతటి ప్రతిభాశాలి.

ఒకసారి తమలోని శివభక్తిని పరీక్షించుకొనదలచి ఒక శిష్యుని పిలిచి దత్తూర ఫల

రసము అంటే ఉమ్మెత్తకాయ రసము (ఇది తాగిన వానిని ఉన్మత్తునిచేస్తుంది) ను

తెమ్మన్నాడు. శిష్యునికి ఈ విషయమును చెప్పి దాని విరుగుడు కూడా చేతికిచ్చి

ఫలరసము త్రాగి ఉన్మత్తుడైనాడు. ఆ రసము త్రాగినా త్రాగకున్నా అచంచలమైన

తన మనసు శివ పూజారతి విడువక శివునిపై ఏబది శ్లోకములను ఆశువుగా

చెప్పినాడు. అది నేటికీ భక్తజన రసనలపై ఉపలబ్ధము. పుస్తకరూపములో కూడా

నేటికాలమున లభించుచున్నది. దానిని 'ఉన్మత్త పంచశతి' యని  'ఆత్మార్పణస్తుతి'

అనీ అంటారు.

అది ముగిసిన వెంటనే విరుగుడు త్రావి తన సహజస్థితికి వచ్చి తృప్తిచెందినాడు, తానూ 

శివ ధ్యానము ఏ పరిస్థితిలోనూ వీడనందుకు ఎంతో సంతసించినాడు. మచ్చుకు 

అందులోని ఒక పద్యమును చిత్తగించండి.

అర్కద్రోణప్రభృతి కుసుమైః అర్చనంతే విధేయం I

ప్రాప్యంతేన స్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీఃI

ఏతజ్ఞానన్నపి శివ శివ వ్యర్థయః కాలమాత్మా I

ఆత్మద్రోహీకరణ వివశో భూయసాధః పతానిI

శివ శివా! నీ అనుగ్రహమును ఏమని వర్ణించను. సులభముగా లభించే జిల్లేడు

తుమ్మి పూవులతో పూజలందుకొని భక్తులకు మోక్ష సామ్రాజ్య లక్ష్మిని

అనుగ్రహించుచున్నావు. ఈ సూక్ష్మమును మేము తెలుసుకోలేక కాలమును వ్యర్థము 

చేయుచున్నాము. ఆ మహనీయుని భక్తిభావము అమోఘము అద్భుతము

అసమానము.

 

అద్వైతిగా దీక్షితులవారు పరబ్రహ్మతత్వములో భేదమును చూడలేదు. శివవైష్ణవ

తారతమ్యమును పరిగణింపలేదు. కానీ వేదపురాణములకు గల వేర్వేరు

భాష్యములను ఖండించలేదు. దీక్షితులవారి మాటల్లో - "బ్రహ్మసూత్రములే వేర్వేరు

అర్థములను చూపినప్పుడు మనమెందుకు ఒకటిగా పరిగణింపవలెను"? అన్నారు. కానీ 

ఆయనకు త్రాసులోని ముల్లువలె కాసింత శివునిపై మక్కువ ఎక్కువ.

అందుకే ఈ క్రింది శ్లోకములో ఆయన  తానద్వైతియే అయినా కాస్త శివునిపై

మమకారము పెచ్చు అన్న అర్డుథములో ఈ శ్లోకమును చెప్పినాడు.

మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దానేవా జగదంతరాత్మనిI

నవస్తుభేడ ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరేII

కాంచీపురమందలి అదెహోల గ్రామమందు, పెనుగొండ వేంకటపతి రాయల

ఆస్థానంలోను, మధురానగర తిరుమ నాయకుని ఆస్థానంలోను, వెల్లూరు

చిన్నబొమ్మని ఆస్థానంలోను కొంతకాలం ఉన్నట్లు పండితుల అభిప్రాయం.

అప్పయ్యదీక్షితులు వెల్లూరి పాలకుడైన చిన్న బొమ్మరాజు ఆస్థానంలో ముప్ఫై

సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నో రచనలు చేయుట జరిగింది. ఒకసారి వేదాంత

దేశికుల రచనయైన యాదవాభ్యుదయానికి సరళ వ్యాఖ్య వ్రాయమని

చిన తిమ్మరాజు కోరగా ఆ పనిని పూర్తిచేసి రాజుగారి దగ్గర నుండి

గౌరవసన్మానాభిమానాన్ని పొందినారు.

ఈవిధంగా అప్పయ్య దీక్షితులు అద్వైతాచార్యునిగా ప్రజలకు బోధ చేస్తూ అనేక

గ్రంథాలను రచనచేస్తూ తనకు ఆస్థానంలో స్థానం ఇచ్చిన రాజులకు

మతాచారాల్లోను, రాజ్యవ్యవహారాల్లోను తగిన సలహాలు ఇస్తుండేవారు.  ‘మార్గ

బంధుస్తవం’ లాంటి రచనలు చేసి అటు భగవంతుని ఆశీర్వాదాన్ని ఇటు ప్రజల

అభిమానాన్ని ఇంకొక ప్రక్క రాజుగారి ఆదరణను  చూరగొన్న అప్పయ్య

దీక్షితులగొప్పదనమును గూర్చి ఎంత చెప్పినా తక్కువే.

ఈయన సుమారుగా 104 గ్రంథాలను వ్రాసినారని ప్రసిద్ధి. సిద్ధంత లేశ సంగ్రహం,

నయమంజరి, న్యాయరక్షామణి (బ్రహ్మసూత్ర భాష్యం), శివార్కమణి దీపిక

(శ్రీకంఠభాష్య వ్యాఖ్య), రత్నత్రయ పరీక్ష, శిఖరిణీమాల, మయుఖావళి,

విమతఖండనము, మధ్యతంత్రముఖ మర్దనము, మధ్వవిధ్వంసనము (వ్యాఖ్య),

యాదవాభ్యుదయ వ్యాఖ్య, హరివంశసార చరితావ్యాఖ్య రామాయణ సారస్తవము,

భారతతాత్పర్య సంగ్రహం, వృత్తివార్తికము, కువలయానందము, చిత్రమీమాంస

అనే వేదాంత, దార్శనిక కావ్య, అలంకార గ్రంథాలను వ్రాసిన శైవమతానుయాయి,

మహాపండితుడు, అప్పయ్యదీక్షితులు.

ఆయనకు ఆంధ్రము అంటే అత్యంత అభిమానము ,ప్రేమ గౌరవము. అందుకే

ఆయన   'ఆంధ్రస్య మాంధ్ర భాషాచ| నాల్పస్య తపసః ఫలం|| ' అని అన్నారు.

ఆంధ్రుడైపుట్టట గొప్ప అదృష్టము . ఆంద్ర భాష మాట్లాడగలగటం గొప్ప తపస్సు

‘’అని చెప్పిన  అప్పయ్య దీక్షితుల ను ’’పాపం పిచ్చివాడు ‘’అన్నారు పుట్టపర్తి

నారాయణాచార్యులవారు నేటి తెలుగుకున్న ప్రాముఖ్యాన్ని చూసి బాధ పడుతూ.

స్వస్తి.

Saturday, 14 April 2018

అమ్మవారి అగ్ని స్వరూపము – జ్వాలాముఖీ క్షేత్రము


అమ్మవారి అగ్ని స్వరూపము జ్వాలాముఖీ క్షేత్రము
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములోని కాంగడాా లోయకు 30 కిలోమీటర్ల దూరములో 'జ్వాలాముఖి దేవి' ఆలయము వెలసి యున్నది. ఇది 51 శక్తిపీఠములలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ ఆలయమును ఆ ప్ర్తాన్తములో 'జోతావాలీ మందిర్' అనీ 'నగర్ కోట్' అనుట కూడా కద్దు. విగ్రహము దుర్గా స్వరూపము.
సతీదేవి తానూ దక్షయజ్ఞములో ఆత్మాహుతి చేసుకొన్నపుడు  కొందరు ఈ శరీర శకలములు 18 చోట్ల పడినవి అని చెబితే కొందరు 51 అని అంటారు. ఆమె నాలుక ఈ క్షేత్రములో పడినట్లు చెబుతారు. మరి ఏవిధముగా వెదకినారో ఎందుకు వెదకినారో నేను చదువుట తటస్థించలేదు కానీ  ఈ ప్రాంతమును పాండవులు కనుగొన్నట్లు స్థానికులు చెబుతారు. ఈ మందిర ప్రాంతమునకు దగ్గరగా 'బాబా గోరా/ గోరఖ్  నాథ్' మందిరము కూడా వున్నది. ఈ పుణ్యపురుషునికి ఈ చుట్టుప్రక్కల ప్రాంతములలో భక్తులు ఎక్కువ.
అమ్మవారి గర్భగుడిలో  ‘జ్వాల’ తప్ప మరే విగ్రహమూ కనిపించదు. జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఓ స్థలపురాణం వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజుగారైన భూమి చంద్ నకు  అమ్మవారు కలలో కనిపించి తన ఫలానా చోట ఉన్నానని చెప్పిందట. అమ్మవారు చెప్పిన ప్రాంతాన్ని ఎంత కూలంకషంగా వెతికినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు  భగభగ మండుతున్న మంట మాత్రం తప్ప. అదే అమ్మవారి రూపంగా భావించిన రాజుగారు, ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.
ఇక ఈ జ్వాలాముఖి క్షేత్రమును గూర్చి చెప్పవలసివస్తే, ఆదిగా అమ్మవారికి రాజా భూమిచంద్  ఒక మందిరమును ఏర్పాటు చేయగా ఆ తరువాత చరిత్ర ప్రసిద్దుడగు సిఖ్ఖు రాజు 'రాజా రంజీత్ సింహ్ మరియు రాజా 'సంసార్ చంద్'  లు ఈ మందిర నిర్మాణమును సంపూర్ణము గావించినారు. ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు ఈ తల్లిని తమ కులదేవతగా భావిస్తుంటారు. ఈ జ్వాలలు నిరంతరమూ అఖండముగా జ్వజ్వాలాయమానముగా వెలుగుతూ ఉండుట అందరినీ అబ్బురపరచే విషయము.
ఇక్కడ అమ్మవారి విగ్రహము వుండదు. కేవలము అగ్నిజ్వాలలు మాత్రమే!అని పైనే చెప్పుకొన్నాము. నాలుక పడుటచేత ఈ జ్వాలలు నాలుక చాస్తున్నట్లుగా  ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు.  మొగల్ చక్రవర్తి అక్బర్  ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా నిప్పును ఆర్పే ప్రయత్నం చేసినాడు కానీ పూర్తిగా విఫలుడై వెనుదిరిగినాడు.
ఇక్కడ మనకు తొమ్మిది అగ్నికీలలు అగుపించుతాయి. అవి 1. మహాకాళి  2. అన్నపూర్ణ  3. చండి 4. హింగలాజ 5. వింధ్యావాసిని 6. మహాలక్ష్మి 7. సరస్వతి 8. అంబిక  9 అంజీ దేవి గా వ్యవహరిపబడుతాయి.
ఒక గోపాలుడు తన ఆవు పాలు ఇవ్వక పోగా మిగతా ఆవులతో బాటూ మేయుట కూడా లేదని గ్రహించి దానిని వెెంబడించగా అది ఆ జ్వాలలో వున్న ఒక సుందరాంగికి తన స్థన్యమునిచ్చుటగమనించి రాజునకు తెలుపగా, అది వాస్తవమని తన భటుల ద్వారా నిర్ధారించుకొన్న భూమిచంద్ రాజుగారు అక్కడ అమ్మవారికి మందిరము నిర్మించుట జరుగుతుంది. ఈ మందిరములో 9 జ్వాలలూ మనకు వేరు వేరుగా దర్శనమిస్తాయి. మందిరమునకు బయట అక్బరు కట్టించిన కొలను మనకు ఇప్పటికీ సాక్షాత్కరిస్తుంది. అందలి నీటితోనే ఆ కీలలను ఆర్పుటకు తాను విశ్వప్రయత్నము చేసినాడట. ఈ దేవాలయములో నవరాత్రులను ఎంతో విశేషముగానూ వైభవముగానూ చేస్తారు. అమ్మవారి ఉదయము మొదలు శాయనిచే వరకు 5 ఆరతులు ఇస్తారు. శయన ఆరతికి భక్తులు క్రిక్కిరిసి యుంటారు.
దౌలాధర్ పర్వతాల దిగువన, ధర్మశాల- సిమ్లా రోడ్డు మార్గమున వుండే ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నడుమ, నిత్యాగ్నిహోత్రమై వెలుగుతున్న అమ్మవారిని సందర్శించుకుని భక్తులు పునీతులవుతూ వుంటారు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ, ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తుంటాయి. ఉత్తర ప్రదేశ్ లోని శక్తిసాగర్ ఆలయం, ముక్తినాధ్ లోని జ్వాలామాయి ఆలయం వీటిలో ప్రముఖమైనవి.
పఠాన్ కోట్ నుండి ప్రత్యేకముగా రైలు మారండా వరకు పోతుంది. అక్కడనుండి బస్సు లేక కారు వసతులు మందిరము చేరుటకు కలవు. బస్సుమార్గమయితే దిల్లీ సీమ్లా, పఠాన్ కోట్ ల నుండి నేరుగా జ్వాలాముఖికే బస్సువసతి కలదు.
చిత్రవిచిత్రములయిన అనేకానేక భగవద్దర్శనీయ స్థలములు కలిగిన ఈ దేశములో పుట్టినందుకు ఆ పరమాత్మకు అంజలి ఘటించుదాము.
స్వస్తి.

Wednesday, 11 April 2018

సీతమ్మా శ్రీరాముని కొమ్మా


సీతమ్మా శ్రీరాముని కొమ్మా
నాకు సహజన్ములు లేకపోయినా రామరాజుగారిని త్రికరణ శుద్ధిగా నా అన్నగారిగా తలుస్తాను. వారి శ్రీమతి సీతమ్మ నా వదినమ్మే! పంచ మాతృకలలో వదినది రెండవ స్థానము. అంటే తల్లి తరువాత తల్లి వంటిది ఆమె నాకు. నా కుటుంబముపై ఆమెకు గల వాత్సల్యమును నేను ఈ జన్మకు తీర్చుకోగలిగినది కాదు. కానీ ముభావముగా వుండిపోలేక అశ్రునయనములతో నా భావమును ప్రకటించుచున్నాను.
సీతమ్మా శ్రీరాముని కొమ్మా
నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా
మెరిసె నవ్వై విరిసే పువ్వై
మచ్చలేని పూర్ణేందుబింబమౌ 
చందన నందన వదనమునందున
వెలలకు అందని నవ్విక ఏదమ్మా
                సభ్యసమాజపు కాసారంలో
                మెరమెచ్చులనే కలుష జలంలో
                పంకమునంటక ఉదయ కిరణముల
                రంగులనంతా గ్రహించి  భానుని
                రంగులనంతా గ్రహించి  భానుని

                తెల్లమొగము వేయించుచు తల్లీ
                విరిసినావు నవ పుండరీకమై
                సీతమ్మా శ్రీరాముని కొమ్మా
                నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా

కరి మకరులచే కలతల చెందక
పాల వెలుగు దీపాల తారకల
చూపి నీవు నీ దరహాసమ్మున
సౌదామినులుగ భ్రమింప జేసి 
పారద్రోలితివి భయమే చెందక
ఎంత ధైర్యమది ఏమి స్థైర్యమది
సీతమ్మా శ్రీరాముని కొమ్మా
నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా
                రామ రాజ్యమే నీకాసారము
                నీ కాసారమె నీ సంసారము
                పూరేకులె నీ పుత్రీపుత్రులు
                పగలు రాత్రులే సుఖ దుఃఖమ్ములు
               పతిదేవుడు తన పనుల మునిగినా
               సంసారమ్మును చక్కగ నడిపిన
               సీతమ్మా శ్రీరాముని కొమ్మా
               నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా
చెరుకు రామ మోహన్ రావు

Sunday, 21 January 2018

మనము మన ధర్మము ---బాధాకర విషయము

బాధాకర విషయము.
మనది ధర్మమే కానీ మతము కాదు అన్నది మనకు తెలిసిన విషయమే! ప్రపంచములో ఆదిపత్యమునకై పోరాడుచున్న పెద్ద మతములు తమ మాట గ్రంధములను అనుసరించవలెనన్నది ఆయా మతముల నిబంధన.
మన ధర్మమే మనదారి. మన దారిలో మనము పోతున్నాము. ఒకానొక కాలములో అది రాజ మార్గము. రథ్యల(Roads) కు ఇరువైపులా ఆహ్లాదము గొలిపే చెట్లు ఉండేవి. సువాసనలు వెదజల్లే పూలమొక్కలు ఉండేవి. ఆకలిగొన్నవారికి ఆహారమునందించే ఫలసాలములు ఉండేవి. విమతస్థులుు ఆ చెట్లను నరికినారు.  మొక్కల పెరికినారు. ఫలసాలముల పాదులలో విషము కలిపినారు. అయినా మనకేమీ పట్టదుు. మనము ఉదారవాదులము, మానవతా వాదులము అన్న బిరుదములను మనకు మనమే ఇచ్చుకొని మన సముదాయమునే మనము మార్చుకొనే ప్రయత్నమూ చేస్తాము. ఇది తను కూర్చున్న కొమ్మను తానే నరికే కాళిదాసు  మనకాదర్శ ప్రాయుడు. మహాపండితుడు, సకల శాస్త్రవేత్త, మహాకవి అయిన కాళీదాసు పేరు తప్ప మనకేమీ తెలియదు. తెలుసుకొనుటకు ఉత్సాహమూలేదు, సంస్కృతమూరాదు.  నేర్చుకోవాలన్న తపన లేదు. సంస్కృతము వరకెందుకు  మనకు సరిగా తెలుగే రాదు.  మాతృ భాషయే సరిగా రాదన్న బిడియము లేదు.
సాధికారికముగా English New Year’s Day అన్నది మన పండుగ కాదు, ఆమాటకొస్తే అది పండుగే కాదు, అందులో అసలు పండుగ చేసుకొనే విధానమే లేదు అని నెత్తిన నోరుపెట్టి కొట్టుకొన్నా చేస్తే తప్పేమి అనే వాళ్ళను మనము ఎంతోమందిని చూస్తున్నాము.  ఇటువంటి ఆలోచనా విధానమే మతస్థులు  మన సాంప్రదాయములతో  ఆడుకొనే అవకాశమును కల్పించుచున్నాము.
తమిళనాడులోని ఒక క్రైస్తవ సంఘము చేసిన నిర్వాకము ఇందుతో జతపరచిన చిత్రములో చూడండి. సనాతన ధర్మ అనుయాయులగు తలిదండ్రుల సంతానమగు వారెవరికయినా అది చూస్తే అసవేశము కలుగక మానదు. కానీ ‘ ఆవేశము అనర్థదాయకము.’ ‘ఆలోచన సమర్థనీయము.’ మా జీవితాలు ఈ ధర్మముతోనే ముగుస్తుంది. మరి నేటి యువతీయువకులు వారిసంతానమును గూర్చి ఆలోచించితే ఆవేదన పెల్లుబుకుతుంది.
ఇక్కడ ఇంకొక్క విషయమును చెబుతాను. Constanzo Besci అను 18 వ శతాబ్దములో తమిళనాడులో ఏర్పడిన ఒక మత సంస్థ ‘పెరియనాయగి’ అన్న మన గౌరీమాత పేరును తమ ‘మేరీ మాత’కు తగిలించుకొన్నారు. కాలాంతరములో ఈ పేరు మన అమ్మవారిది అని మరచిపోయి అది మేరీ మాతడే అన్న ఒక దౌర్భాగ్య స్థితికి చేరుకొంటాము. అసలు వారి ‘మేరీమాత’ క్రైస్తవ పరమగు సిద్ధాంతము ప్రకారము Holy Trinity లో కూడా లేదు. అసలు ఉన్నా లేకున్నా మనకు సంబంధములేదు. దీనిని బట్టి వారికి ఎంత సాప్రదాయ దారిద్ర్యము వుందో అర్థము చేసుకొనేది. లౌకికమయిన మతాన్తరీకరణల గూర్చి ఆలోచిన్చుతున్నారే గానీ పారమార్థికముగా ఎంత వెనకాలున్నారో గమనించండి. ఇది ఇట్లుంటే ఐరోపా ఖండములోని ఫ్రాన్సు, స్పెయిను, జర్మని, ఇంగ్లాండు, ఇటలీ మొదలగు దేశాలు అన్నీ కలిసి ఐరోపా ఖండమే ఇస్లాం ఖండముగా మారిపోవనుందట. 'Everyone will be Muslim because of our stupidity': Catholic leader says Europe will become an Islamic
State because of the migrant crisis. కారణము ఒక్కటే వలస వచ్చిన ముస్లిములు 5,6 మంది పిల్లలను ఉత్పత్తి చేస్తూ వుంటే క్రిస్తియన్లు 2 లేక మహా అంటే ముగ్గురిని ఉత్పత్తి చేస్తున్నారు. అసలు ఈ మాట ఒక ఇమాం కూడా చెప్పి ఈ విషయమును బలపరచినట్లు whatsap లో వినివుండినాను.
ఇది మనకు వర్తించదా! తమ మాత్రు భూమిలో తమ ఉనికికే ప్రమాదము రాబోతూవుంటే క్రిస్టియనులు మనదేశాములోని అమాయకులపి ఏరా వేస్తున్నారు. ఇప్పటికయినా మన ఉదార లౌకిక వాదులు కన్ను తెరుస్తారోలేదో! ఈ మాట చెబుతూ వుంటే నాకు భాగవతమున ప్రహ్లాద చరిత్రములోని లోని ఈ పద్యము గుర్తుకొస్తూ వుంది.
అంధేందూదయముల్ మహాబధిరశంఖారావముల్ మూకస
ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్.
            లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు; మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరికలు ఫలించదు; కృతఘ్నుడికి బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగ మైనవి; పిసినిగొట్టు వాడికి సంపదపనికి వచ్చేది కాదు;పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియనే తెలియవు; అలాగే విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారము లైనవి, వ్యర్థము లైనవి. అని భావిస్తాను. ఇక్కడ విష్ణుభక్తికి బదులు దేశ భక్తి, మన ధర్మముపై భక్తిని అన్వయించవలసి వుంటుంది.

స్వస్తి.

Monday, 25 December 2017

పరమాత్మ సాయుజ్యమునకు మన కృషి (దేవుని చేరుటకు మన ప్రయత్నము)

పరమాత్మ సాయుజ్యమునకు మన కృషి

https://cherukurammohan.blogspot.com/2017/12/blog-post_25.html

ఆత్మామ్బోధేస్తరంగోSస్మ్యహమితిగమనే భాయయన్నాసనస్థ

సంవిత్సూత్రానివిద్ధో మణిరహమితి వాస్మీన్ద్రియార్థప్రతీతౌ l

ద్రష్టోSమ్యాత్మలోకాదితిశయన విధౌ మగ్న ఆనందసింధా-

వంతర్నిష్ఠో ముముక్షః స ఖలు తనుభ్రుతాం యో నయత్యేవమాయుః ll

నీవు నడుస్తూ వున్నపుడు నిన్ను, ఆత్మ (పరమాత్మ ) అన్న సముద్రము నుండి బయలుదేరిన అలలా భావించవలెను . ఆభావన నీకార్యములను నియంత్రించి నిన్ను రుజుమార్గములో నడుపుతుంది. నాకు నేను లేచినాను ఫలానా చోటికి పోతున్నాను అన్న భ్రమ నుండి బయటపడి, నీవెట్లు తిరిగినా కడలి కడుపుకే కడకు చేరవలసినది అన్న స్పృహ ఉంచుకొంటే దుష్కార్యకారణభావావేశాములకు

తావుండదు. నీకు, నీవు నడచుచున్నంతసేపూ గుర్తుంచుకొనవలసినది  నీ

మూలము అంటే ఆత్మా అను కడలిని. నీవు అలవు మాత్రమే! తిరిగీ సంద్రమును సంగమించవలసిందే!

నీవు కూర్చున్న సమయమందు దారము దూర్చిన మణిపూస మాదిరి స్థిరముగా నిలిచిపో! అంటే నీ మనసు నిన్నొదిలి పయనించకుండా వుండేవిధముగా స్థిరచిత్తునివై కూర్చో, దారానికి కూర్చబడిన మణి తన పరిమితిలో తానుంటుంది. నీ భావములో ఈ ఆలోచన మెదిలితే నీవు నిశ్చల చిత్తునివై వుండగలుగుతావు.

నీచర్మ చక్షువులతో నీకు ప్రీతికరమైన లేక నీ మనసు పడిన వస్తువు అంటే జీవి కావచ్చు నిర్జీవి కావచ్చు, నీకు కనబడనేలేదను భావమును ఏర్పరచుకొనగలిగితే నీ ధ్యానదశ భగవంతునికి చేరువైనట్లే! నీ మనసు అచంచలముగా నిలిచి ఆత్మతో అనుసంధానమైనట్లే!

ఇక నీవు నిదురకు పూనుకొని పడుకొంటే ఆత్మానంద సాగరములో మునుగుతున్నాను అన్న తలంపుతో నిదురించితే నీ  చిత్తము శివమయమై ఆత్మానంద జలధిలో అన్య చింతన లేక అనన్య ఆనంద పూరితునివై నీ సుషుప్తి కాలమంతా పరమాత్మ సాయుజ్యమునందే గడుపుతావు.

ఈసనాతన ధర్మము ఒకే విషమును ప్రతిపాదించుతుంది మరియు అదే విషయమునకు కట్టుబడియుంటుంది, అదేమిటంటే

అనాయేసేన మరణం వినా దైనఎన జీవితంl

దేహాంతే తవసాయుజ్యం దేహిమే పార్వతీ పతే ll

‘దేహిమే శ్రీసతీ పతే!’ అని శివకేశవ భేదమును పాటించేవారు ‘ప్రతినియుక్తము’ చేసుకొన వచ్చును. శివుడు వేరు విష్ణువు వేరు అన్న సంకుచిత భావము వీడితే ఈ లోకమంతా పరమాత్మ స్వరూపము గానే కనబడుతుంది.

భావమును నా చేతనయిన రీతిలో తెలిపినాను కానీ నేనూ సాధకుడనే! ఈ జన్మకు సాధించుతానో లేదో కూడా తెలియదు. నాకు తెలుసు, నా నిష్ఠ చాలదు. అయినా పిన్న వయస్కులు సాధన మొదలుపెట్టవలెననే బలమైన తలంపు గలవారు, అభినవ విద్యాతీర్థ మహా స్వామివారు చెప్పిన ఈ శ్లోకమును మనసావాచాకర్మణః ఆచరించుతారనే నమ్మకముతో తెలుపుచున్నాను.

 చెరుకు రామ మోహన్ రావు