Sunday, 25 August 2019

వైద్యో నారాయణో హరి:


వైద్యో నారాయణో హరి:
https://cherukurammohan.blogspot.com/2019/08/blog-post_60.html
శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరేl 
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరి:ll 
శరీరం అశాశ్వతం. దీనికి జరామరణాలు సహజం. ప్రాణాలు ఉన్నకాలంలో శరీరాన్ని బాధలపాలు చేసేవి వ్యాధులు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నది పెద్దలమాట. మనం చేసిన పాపాలకు ప్రతిరూపాలుగా రోగాలు మనను ముసిరి ముప్పుతిప్పలు పెడతాయి. రోగానికి ధన్వంతరిగా శ్రీమహావిష్ణువు అవతరించాడు. ఎన్నో ఔషధాలను తయారుచేసి మాన వాళికి అందించాడు. ఆ విధంగా నారాయణుడు ధన్వంతరి రూపు దాల్చి  వైద్య నారాయణుడైనాడు. ఆయన జగ త్తునకే వైద్యుడు. ఆయన సృష్టించి ఇచ్చిన దివ్య ఔషధం గంగాజలం. ఇప్పుడు కాలుష్యం బారిన పడినా గంగ లోని మౌలిక లక్షణాలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా సజీవంగానే ఉంటాయి. దాన్ని అసలు  కలుష్యము నుండి  కాపాడుకోగలిగితే  నిజానికి దేశాన్నే ఆరోగ్యముగా ఉంచినవారమౌతాము. ప్రాణమే పోతుంది అన్న క్షణంలో గంగా జలం తాగి లేచి కూచున్న వారెందరో మన సామాజిక అనుభవములో అగుపించుతారు. గంగాజలము  అందుబాటులో లేనివారు ఇప్పటికీ తులసీతీర్థం ప్రాణము పోయే సమయములో రోగికి పోయడము చూస్తూనేవుంటాము. బ్రతకలేదు అంటే ఋణము తీరింది అనిగానీ భగవంతుని అనుమతి లేదు అనిగానీ తలువవలసి ఉంటుంది.
అసలు వ్యాధి అన్నది ఏ పూర్వజన్మ వశాత్తో సంక్రమించితే దానిని తొలగించుకొనుటకు వైద్యశాస్త్రములో ఏమి చెప్పబడిందో ఒకసారి గమనించండి.
“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్ఛాంతిః ఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”

అంటూ శారీరక,మానసిక రుగ్మతలకు ఉపశాంతిగా ఔషధులు,దానాలు,జపాలు,హోమాలు చేయుట ద్వారా తగ్గించుకొనవచ్చునని చెప్పబడినది. కలిమాయలకాలవాలమైన ఈ కాలములో కనికరించి మంచి చేసే మనిషి దొరికితే తప్పకుండా హోమము కూడా సత్ఫలితమును ఇస్తుంది. కొంత అసంగతమని పాఠకునికి అనిపించినా కొంచెము హోమ సమిదేలను గూర్చి తెలియజేస్తాను.  హోమములో నవగ్రహములలో ఒక్కొక్క గ్రహమునకు ప్రీతికరమైన ఒక్కొక్క సమిధ ఉపయోగించుట వలన ఒక్కొక్క రోగము నివారించబడుతుంది.

హోమ ధూమము కంటిని  కప్పుట వలన కంటిలో ఉన్న నలతలన్నీ కన్నీటి రూపములో వెళ్లిపోతుంది. హోమాగ్ని సెగ మోకాళ్ళకు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. గ్రహాలకు వేరు వేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తే వేరు వేరు సత్ఫలితాలు సమకూరుతాయి.

రవి:-తెల్లజిల్లేడు వాత,కఫ వ్యాదులను తగ్గిస్తుంది.తెల్లజిల్లేడు సమిధలతో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి. కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయి. కోపము యొక్క తాపము తగ్గుతుంది. తలనొప్పి భాధలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం తెల్లజిల్లేడుకు  కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుందని ఆయుర్వేద వైద్యులు చెప్పేవారు..

చంద్రుడు:-మోదుగ సమిధలతో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు.ఆలోచనావిధానంలో మార్పులు వస్తాయి. సుఖవ్యాధులు దరిచేరవు. మోదుగాకును మెత్తగా నూరి పాలతో తాగిన స్త్రీలకు ఋతుసంబంధ సమస్యలు,గర్భ సంబంధ సమస్యలు ఉండవు. మోదుగ పువ్వులు,గింజలు ఎండబెట్టి నీటిలో ఒక పావు చెంచా వేసి కాగబెట్టుకొని తాగితే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు. వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది అని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతూవుంటారు.

కుజుడు:-చండ్ర సమిధతో హోమం చేస్తే ఎర్రరక్త కణాల ఇబ్బందులు,ఎముకల బలహీనత ఇబ్బందులను అరికడుతుందంటారు. పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మధుమేహం,కోపస్వభావాలు తగ్గుతాయని చెబుతారు.

బుధుడు:-ఉత్తరేణి సమిధను హోమంలో ఉపయోగిస్తే చర్మవ్యాదులు తగ్గుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు. ఉత్తరేణి పూల్లతో గాని,వేరుతోగాని రోజూ దంతధావనం చేసుకుంటే దంతదోషాలు తొలగిపోతాయి. ఉత్తరేణి ఆకులు,గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలంగా ఉన్న దగ్గు,జలుబు,ఆయాసం తగ్గుతాయి అన్నది విజ్ఞుల వాక్కు.

గురువు:-రావి సమిధలతో హోమంచేస్తే సంతాన ప్రాప్తి జరుగుతున్దంటారు. ఈ ధూమము శరీరములో చేరి భార్యాభర్తల దోషములను భారించుతుందని చెబుతారు .రావి చెక్కకాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి. నోటిపూత పోతుంది. రావి చెక్కకాషాయాన్ని రోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.

శుక్రుడు:-మేడి చెట్టు సమిధలతో హోమంచేస్తే వివాహ సమస్యలు, వైవాహిక సంబంద సమస్యలు ఉండవు. గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు). దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మరూపంలో సుప్రతిష్టితులై ఈవృక్ష మూలమునందు ఉంటారని అంటారు. దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధుమేహవ్యాధి నివారించబడుతుంది అని వైద్య శాస్త్రమున చెప్పబడినది. దీని విత్తనాలు పొడి చేసి, తేనెతో కలిపి తీసుకున్నా మధుమేహం దరిదాపుల్లో కనిపించకుండా పోతుందంటారు.

శని:-జమ్మి సమిధలతో హోమంచేస్తే అప మృత్యు భయం తొలగి పోతుందణి శాస్త్ర వచనము. దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. జమ్మిచెట్టు గాలి శరీరానికి కలిగిన ఇబ్బందులు తొలగించుతుంది. ప్రతి రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసినచో దీర్ఘకాల అస్వస్థతలు తొలగిపోతాయి.

రాహువు:-గరికలతో హోమంచేస్తే ఇంటిలో నరదృష్టి తొలగిపోయి సర్ప సంభంద దోషాలు తొలగిపోతాయి. గరిక రసాన్ని గజ్జి,చర్మంపైన ఉన్న కురుపులపై పెట్టిన ఎడల చర్మరోగాలు నివారించబడతాయి. దెబ్బతగిలి రక్తం కారిపోతుంటే గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.

కేతువు:-ధర్భలతో హోమంచేస్తే కాలసర్పదోషాలు తొలగిపోతాయి. మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.

జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే శాంతి ప్రక్రియలో భాగంగా హోమం చేసుకోవాలి అని చెబితే ఇంట్లో స్థలం లేదని దేవాలయంలోనో, మరెవరైనా ఇంట్లోనో హోమాలను చేయించుట కూడా కద్దు.  ఈ విధముగా చేయుటవల్ల గ్రహ బాధలు తొలగిపోవు. ఇబ్బంది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే హోమం చేస్తే మంచి ఫలితము దక్కుతుంది. హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. హోమము ప్రత్యక్షముగా
మనకారోగ్యమును,  పరోక్షంగా నవగ్రహాల అనుగ్రహమును మనకు అందించుతాయి.
తిరిగీ అసలు విషయానికొస్తే ..........
రోగపీడల నుంచి జీవజాతులను కాపాడి ఆనంద తీరాల వైపు నడి పించగల మహనీయ మూర్తి విష్ణుమూర్తి. ఒకరిని బతికించాలన్నా, సంహరించాలన్నా విష్ణుమూర్తి సంకల్పించుకోవాల్సిందే! అందుకే గీత లో కూడా అధర్మవర్తనులైన రాజలోకాన్ని చంపినట్లు భగవంతుడు చెబుతాడు. అదే ధోరణి అన్నిటా వర్తిస్తుంది. రోగకారకుడు, రోగ నిర్మూలకుడు కూడా ఆయనే! అందుకే ‘నాహం కర్త హరి: కర్త’ అన్న శాస్త్ర వాక్యమును అక్షరాలా మనము పాటించితే భూమిపై ఉన్నా భూమి దాటుకున్నా ఆనందముతోనే ఉండగలము. కర్త నారాయణుడు. ఆయన అనుగ్రహంతో చికిత్సకు, వైద్య ప్రక్రియకు పూనుకునేవాడు వైద్యుడు. పూర్వము నారాయణుని ప్రతినిధిగా వ్యవహరించేవాడు వైద్యుడు, ఇప్పుడు పార్టీ ఫిరాయించి యముని మినిస్ట్రీ లో చేరినాడు.యముని ప్రభుత్వమునకు కలిపురుషుడు Chief Secretary అయినాడు. అందుకే ఈ నూతన నారాయనుడైన వైద్యునిచేతిలో రోగి హరీమంటున్నాడు.    ఈ విషయము అందరు వైద్యులకు వర్తించదు. లోకములో విధి బాధ్యత కర్తవ్యముగా నెంచి చికిత్స చేసే వైద్యులు కూడా ఉన్నారు. ఎటొచ్చీ మేకకు Butcher ఎవరు Vet. Doctor ఎవ్వరు అన్నది నిర్దుష్టముగా తెలియవలసిన అవసరము ఎంతో వున్నది.
ఆది వైద్యుడు ధన్వంతరి రూపుడైన విష్ణువే కావచ్చు కానీ  వైద్యవిద్యకు ఆద్యుడు బ్రహ్మ. ఆయన దక్షప్రజాపతికి దాన్ని అందించినాడు. ఆయన ఆశ్వనీదేవతలకు అందించినాడు. వారు ఇంద్రుడికి అప్పగించినారు. ఆయన భరద్వాజ మహర్షికి ఇచ్చినాడు. ఆ మహర్షి ఆత్రేయ మహర్షికి ఇచ్చినాడు. ఆయన పునర్వసుకు, ఆయన అగ్నివేశుడికి ఇచ్చినాడు. ఆ తర్వాత ఈ విద్యలో విశేష పరిశోధనలు చేసినవాడు చరకుడు. ఆయన సాంఖ్య, వైశేషిక, న్యాయ శాస్త్రాల నుంచి సాంకేతిక పదాలను స్వీకరించి వైద్యం ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆది దైవికాలకు భిన్నమైనదికాదని ఇది కూడా ఒక వైదిక కార్యమేనని నిరూపించినాడు. ఈ రోజులలో డాక్టర్లు చదువుకుంటున్న అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, క్లినికల్‌ మెడిసిన్‌ వంటి పలు అంశాలను చర కుడు ఆనాడే స్పృశించినాడు. ఆ తర్వాత వచ్చిన వాడు శుశ్రుతుడు. ఆయన శుశ్రుత వ్రాసినాడు. ఈయనను మొదటి శస్త్ర చికిత్సకునిగా పాశ్చాత్యులు కూడా గుర్తించినారు.
మనకు సనాతన వైద్యవిద్యగాఅందివస్తున్న ఆయుర్విద్యను ఉపవేదంగా  గుర్తించి మన పెద్దలు దానిని ఆయుర్వేదమన్నారు. ఈ విద్యకు అథర్వణ వేదం తల్లి. ఈ వేదం నుండి పుట్టిన గర్భోపనిషత్తు కూడా ఆయుర్వేదమునకు ఉపాంగమైయున్నది.
చాణుక్యుని నీతిశాస్త్రము ఈ విధముగా అంటూవున్నది:
ధనిక: శ్రోత్రియో, రాజా, నదీ, వైద్యస్తు పంచమ:
పంచ యత్ర నవిద్యంతే తత్ర వాసం న కారయేత్‌
ధనికుడు, బాగా చదువుకున్నవాడు, రాజు, నది, వైద్యుడు- ఈ అయిదుగురు లేని ఊళ్ళో ఉండకు అని దాని అర్థం. ఇదే క్రమం కాకపోయినా, ఒక్క రాజును వదలి, దాదాపు ఇలాంటి మాటే అన్నాడు సుమతీ శతకకారుడగు మన బద్దెన కవి
అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు ఎడతెగకపారు యేరును, ద్విజుడున్‌
చొప్పడిన నూర నుండుము
చొప్పడకున్న ఊరు చొరకుర సుమతీ!
నేటి వైద్యుల పరిస్థితికి నేను వ్రాసిన  ఈ శ్లోకము అద్దము పడుతుంది గమనించండి.
రోగార్తస్య భిషక్ దేవో రోగాంతేచ భిషక్ నరఃl
మూల్య పత్ర ప్రదానేన వైద్యో భవతి రాక్షసఃll
వ్యాధిగ్రస్థునికి వైద్యుడు దేవునివలె కనిపించుతాడు. రోగము ఉపశమించిందంటే ఆదిదేవుడు, రోగము కుదిరిన వానికి సాధారణ మానవునిగా కనిపించుతాడు. అదే వైద్యునికి డబ్బు ముట్టజెప్పేటపుడు, వైద్యుడు రక్కసునిగా అగుపించుతాడు.
నిజమే కదా!
స్వస్తి.


Thursday, 11 July 2019

నా అనుభవము



భగవద్గీతలోని పదమూడవ అధ్యాయమగు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని మొదటి శ్లోకము ఈ విధముగా వుంటుంది.
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే
ఏతద్యో వేత్తి తమ్ ప్రాహుఃక్షేత్రజ్ఞ ఇతి తద్విదః
క్షేత్రము అంటే శరీరము. క్షేత్రజ్ఞుడు తానేనని పరమాత్మ వెంటనే రెండవ శ్లోకములో తెలుపుతాడు. ప్రతి జీవి శరీరము ఒక క్షేత్రమయితే క్షేత్రజ్ఞుడు పరమాత్మ అయితే ఆయన ప్రతి జీవిలోనూ, ముఖ్యముగా ఆవిషయమును గ్రహించగలిగిన మానవునిలో ఆత్మయై ఉన్నాడన్న విషయము మనకు తెలుస్తుంది.ఇదే విషయాన్ని పరిపరి విధములుగా విశదీకరించి ప్రవచనకారులు చెబుతూ వుంటారు.జనసామాన్యమును రుజుమార్గములో నడిపింప కంకణము కట్టుకొన్న వారి ప్రతి మాట బహిర్గతమగుటకు ముందు ఆత్మకు సమర్పించుకోనవలసి వుంటుంది. పులుపుకు ఉప్పు, చేదుకు తీపి ఎట్లు వ్యతిరిక్తముగ ఉన్నవో అట్లే శరీరములో కామమునకు దానము, కోపమునకు దయ, లోభమునకు ఔధార్యము, మోహమునకు వైరాగ్యము, మదమునకు వినయము, మత్సరమునకు ప్రేమ అను వ్యతిరిక్తగుణములు కలిగి మంచిని పంచవలసియుంటుంది.

నేను చెప్పదలచుకొన్న విషయమునకు పైన చెప్పినది ఉపోద్ఘాతమే! ఒక 3 సంవత్సరముల క్రిందటి మాట. పేర్లు తెలుపుట సభ్యత కాదు కావున నేను తెలుపుట లేదు. ఒక వ్యక్తి ఒక ప్రవచనకారుని వద్ద శిష్యునిగా వుండి, నాకు తెలియని కారణముల వల్ల వేరొకరి శిష్యుడయినాడు. అది తనకు తానే నాతో చెప్పిన మాట. కొంత కాలము తరువాత అతను 'గురువుగారు గోశాల ఏర్పాటు చేస్తున్నారు, దానికి ఆర్ధిక సహాయము చేయమని నన్ను అడిగినాడు. జవాబుగా నేను ' నాయనా నాలాంటివారు ఆ మహానుభావునికి ఇచ్చేటంత వసతి లేనివారు, రాజు తలచుకొంటే అన్నట్లు ఆయన ఎ వ్యాపారవేత్తనో, పారిశ్రామిక వేత్తనో, ప్రభుత్వ ప్రధాన యంత్రాంగాధికారినో అడిగితే ధనము ఆయన వద్దకు వరదయై వచ్చి చేరుతుంది అని చెప్పినాను.ఇక్కడ నేను చెప్పదలచుకొన్నది ఏమిటంటే, ఆ వ్యక్తి నాకు తెలియజేసినట్లే ఇంకా ఎంతో మందికి పంపి ఉంటాడు కదా! ఆ విధముగా పంపబడినవారిలో ఆ ప్రవచనకారునికి ముఖ్యుడగువాడు వుండే అవకాశము వుంది. అట్లుకాకున్నా ఇటువంటి విషయములు దావానలమై ఆతనికి చేరే అవకాశము వుంది. మరి ఇన్ని ప్రసార మాధ్యమములు ఉండికూడా ఆయన అటువంటి వారిని నమ్మవద్దు అని ఇచ్చిన ప్రకటన నేను చూచుట తటస్థించలేదు.

దాదాపు ఒక 8,10, నెలల క్రితము మన దేశ సైన్యమునకు మద్దత్తుగా ఒక సన్నిహితుడు సైన్యము యొక్క చిహ్నమును నా WhatsApp కు అనుసంధించినాడు. ఆతరువాత కొన్ని రోజులకు ఆ ప్రవచనకారుని భక్తగణము ఒక WhatsApp సమూహమును తయారుచేసి, వారు నన్ను విశ్రాంత సైనికాధికారిగా తలచి, తమకు తామే నన్ను అందులో చేర్చుకొని, ఆ ప్రవచన కారుడు మహిమాన్వితుడైపోయినాడు, ఆయన సాక్షాత్తు దైవస్వరూపమే! అందువల్ల సతీసమేతుడగు ఆయన ఛాయా చిత్రమును పూజగదిలో వుంచుకొని ప్రార్థించితే ధనవంతునివి కాగలవు అనే వార్త పంపినారు. నేను స్పందించలేదు. తరువాతిరోజు సతీసమేతుడగు ఆయన చాయాచిత్రమును పంపి ఆ పాదాలను సేవించితే అన్నికష్టాలూ వెనువెంటనే తొలగిపోతాయి అన్న సందేశమును పంపినారు. అది చూసి నేను ఆ సమూహమును వదలిపెట్టినాను, తక్షణమే!

ఆయన వ్రాసిన ఒక పుస్తకములో రుద్రము లోని ప్రార్థనా శ్లోకములోని ' ఏకం ఈశం అనిశం' నకు బదులుగా 'మీనం మేషం మహిషం' అనియుండుట నేను చూచుట తటస్తించినది. ఆయన గొప్పవాడు. విషయ పరిజ్ఞానము అధికముగా వున్నవాడు. సంఘములో అధికముగా గుర్తింపబడిన ప్రతిభావంతుడు. పుస్తకము యొక్క proof ను ఆయన చూడకుండినా ఆయన శిష్యులలో విషయ పరిజ్ఞానము గలవారు చూసియుంటారుకదా! పోనీ పుస్తకము వెలికి వచ్చిన తరువాతనయినా ఎదో ఒక భక్తుడు వారికి తెలియజేసే అవకాశము లేకపోలేదు కదా! ఇది పొరబాటు అని వారు కానీ వారి ప్రతినిధి కానీ చెబితే బాగుండేదికదా!

ఇవి చాలా కాలము క్రితము జరిగినవి. ఈ రోజు యెందుచేత చెప్పవచ్చినానంటే నేను పైన తెలిపిన సంఘము వంటిది, ఆయన మహిమలను గూర్చి ఆస్య గ్రంధిలో ఒక 3 రోజుల క్రితము ప్రచురించియుండినారు. ఇది రానురాను చిలువలు పలువలై అమాయకులు ఎర ఔతారను ఉద్దేశ్యముతో వ్రాసినాను. నేను వారి కున్నంత విజ్ఞత కలిగినవాడిని కాదు. ఆయనవేద పురాణ శాస్త్రేతిహాసములు తెలిసినవానిగా గుర్తింపబడినవాడు, ఆ విధముగా సంఘములో గౌరవ ప్రతిష్ఠలు గలవాడు కావున భగవద్గీతలో చెప్పినట్లు
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే || 3-21 ||
ఆయన చెప్పినది వేదం చేసినది మోదం. సాధారణ జనులు ఆయనను భగవదంశగా నమ్మి పాటించే అవకాశము పుష్కలము. ఇప్పటికే చాలా మంది బాబాలతో స్వాములతో నిండిన ఈ సమాజమునకు ఇంకొకరిని చేర్చి సాధారణ జనులను అయోమయము లోనికి నెట్ట వద్దు అన్న ఉద్దేశ్యముతో ఈ నాలుగు మాటలు వ్రాసినాను. భక్తజనాళి ప్రత్యక్షముగా ఆయన మహిమలు చూసే అవకాశము కలిగినపుడు వారే ఆయనకు భక్తులౌతారు, ప్రచారకర్తలౌతారు. ప్రసార మాధ్యమాలధికముగావున్న ఈ కాలములో ప్రచార మాధ్యమాలు పెద్దగా అవసరముండదు. దీపమును ఎక్కువసేపు చేతులతో కప్పియుంచలేము కదా!
అతి సర్వత్ర వర్జ్యేత్
సర్వేజనాస్సుఖినోభవంతు.

Thursday, 27 June 2019

కాళిదాసు చెప్పిన చమత్కార శ్లోకము


కాళిదాసు చెప్పిన చమత్కార శ్లోకము
https://cherukurammohan.blogspot.com/2019/06/blog-post_27.html
కాళీదాసు భోజరాజుల మైత్రీ బంధము అజరామరము. భోజునితో ఉన్నది కాళీదాసు-2.
మొదటి కాళీదాసు విక్రమార్కుని కాలము వాడు మరియు రఘువంశాది కావ్యములను, అభిజ్ఞాన శాకుంతలము వంటి నాటకములను వ్రాసిన మహాకవి. కాళీదాసు-2 విద్వద్వరేణ్యుడేగానీ, ఆయన కావ్యములు వ్రాసినట్లు తెలిసిరాదు, కానీ భోజుడు వ్రాసిన రామాయణ చంపు అన్న భోజుని ఆశు కావ్యమునకు సహకారమునందించినాడు అన్న ప్రతీతి కలదు. భోజ కాళీ దాసుల నడుమ ఎన్నో విచిత్ర సంవాదములను సన్నివేశములను చూస్తూ ఉంటాము. అటువంటి వానిలో ఇదీ ఒకటి.
ఒకసారి భోజ రాజు ఒక విచిత్రమైన సమస్య సభికులకు ఇవ్వటము జరిగినది. సముద్రానికి అనేక పర్యాయపదాలలోని 6 పదములను ఒక శ్లోకపాదముగా తీసుకొని పూరించమన్నాడు. అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి: అన్నదే ఆ శ్లోక పాదము.
ఎవరూ పూర్తి చేయలేక పోయినారు సభలో. కాళిదాసు ఒక చక్కటి సన్నివేశమును ఊహించినాడు. ఆ ఊహించిన సన్నివేశము ఇది.
పార్వతికి కోపము వచ్చింది ఎందుకు? ఎందుకు వచ్చిందంటే తనభర్త తనకో సవితి ని తీసుకొని రావడమే గాక ఆమెని నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు. తన బాధను శూరుడు దేవ సేనాని మరియు తన కుమారుడైన షణ్ముఖుడికి  తన కష్టం చెప్పుకుంది. కుమారుడు పరమశివుడి దగ్గరకు వెళ్లి నాన్నా నీవు అమ్మకు సవితిని తెచ్చుటయేగాక ఆమెను నెత్తిన పెట్టుకోన్నావని అమ్మకు ఎంతో కోపము అంతకు మించిన తాపము కలుగుచున్నది. నువ్వు నెత్తిన పెట్టుకున్న గంగమ్మను విడిచి పెట్టు.  అన్నాడు. అప్పుడు పరమశివుడు కుమారా! చిరకాలంగా నాదగ్గరే ఉంటున్న గంగను ఇప్పుడు నేను వదిలేస్తే పాపం ఎక్కడికి పోతుంది అన్నాడు మహదేవుడు.
తన తల్లి యొక్క సవితిని తండ్రి వెనకేసుకొని రావడం షణ్ముఖుడికి  బొత్తిగా నచ్చలేదు. అందువల్ల కోపముతో ఊగిపోతూ వెళ్లి సముద్రములో దూకమును (నదీనాం సాగరో గతి:) తన ఆరు ముఖాలతో ఒక్కొక్కసారి ఒక్కొక్క సముద్ర పర్యాయ పదమును వాడుతూ 6 చెప్పినాడు. అదే అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి: అంటూ భోజరాజు సభలో ఇచ్చిన సమస్య.
 దానిని కాళీదాసు ఎంత చమత్కారంగా పూరించినాడో చూడండి.
అంబా కుప్యతి తాత మూర్ద్ని విలసత్ గంగేయముత్సృజ్యతాం !
విద్వన్ షణ్ముఖ! కా గతి:మయి చిరాత్ అస్యా: స్థితాయా:వద?
కోపావేశవశాతశేష వదనై:ప్రత్యుత్తరం దత్తవాన్
అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి:
నీవు నెత్తిన గంగను పెట్టుకున్నావని అమ్మకు కోపం వచ్చింది.ఈ గంగను విడిచి పెట్టు సర్వం తెలిసిన షణ్ముఖుడా! .పాపం చిరకాలం గానన్ను నమ్ముకొని నా దగ్గరే వుంటున్నది  యిప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుంది? అన్నాడు శివుడు.అప్పుడు షణ్ముఖుడు కోపంతో తన ఆరుముఖాలతో సముద్రం లోకి పొమ్మను.అని ఆరు సార్లు సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం అని సముద్రానికి పర్యాయపదాలు ఆరు చెప్పాడు. ఆ అద్భుత మైన ఊహకు, పూరణకు భోజరాజు ఉబ్బి తబ్బిబ్బై సింహాసనం దిగి వచ్చి కాళిదాసును కౌగలించుకొని, ఉచిత రీతిని సత్కరించినాడు.
ఆ శ్లోకార్థము దిగువన ఇవ్వబడినది.
అంబా కుప్యతి =అమ్మకోపిస్తున్నది,
మూర్ద్ని విలసత్ గంగా ఇయం ఉత్సృజ్యతాం ! = నీ శిరసు మీద వున్న గంగ పరిత్యజింప బడుగాక!  
ఇది షణ్ముఖుడు చేప్పిన మాట. ఆ మాటకు బదులుగా శివుడు ఈ విధముగా అంటూవున్నాడు.
విద్వన్  షణ్ముఖ =సర్వము తెలిసిన షణ్ముఖుడా!
మయి చిరాత్  స్థితాయా: -అస్యా: - కా గతి: -వద =నాతోనే చిరకాలంగా వుంటున్న ఈమె గతి ఏమిటి? ఎక్కడికి పోతుంది? చెప్పు అన్నాడు.
ఆమాట విని స్కందుడు అగ్గిమీద గుగ్గిలమైపోయినాడు. అప్పుడు
కోప- ఆవేశవశాత్ - అశేష వదనై: -ప్రత్యుత్తరం దత్తవాన్ = కోపావేశాలతో కూడిన 6 ముఖములు కలవాడగు సుబ్రహ్మణ్యుడు తన ఆరుముఖాలతో సముద్రము లోకి పోయి దూకమను.అని ఆరు సార్లు సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం అని 6 పర్యాయపదములనువాడుతూ ఉచ్చస్వరముతో అన్నాడు.
మహామహితాత్ముల బుద్ధిగున విశేషాలు ఈవిధముగా వుంటాయి. అంతా వాగ్దేవి కరుణ.
స్వస్తి.

Saturday, 15 June 2019

బుద్ధిః కర్మానుసారిణీ


బుద్ధిః కర్మానుసారిణీ
https://cherukurammohan.blogspot.com/2019/06/blog-post_15.html

నేను అంటే శరీరం – మనస్సు – బుద్ధి.
శరీరము బాహిరమైనది. దానికి సంజ్ఞలందజేసేది మనసు. దానిని ప్రచోదనము చేసేది బుద్ధి.
 పూర్వజన్మముల కర్మఫల సారాంశమే బుద్ధి. తప్పో ఒప్పో మనసును ప్రేరేపించేది బుద్ధి.
మరి బుద్ధికి కూడా వెనుకల ఒక నడిపే శక్తి అవసరము. పరమేశ్వరునికే పరాశక్తి అవసరమైతే మనమెంత. కావున ఈ బుద్ధిని ఉసిగొల్పుటకు ఏర్పడిన శక్తే కర్మఫలము.
ఒక చిన్న ఉదాహరణ తీసుకొందాము. పదవీ విరమణ చేసిన 65 సంవత్సరముల వ్యక్తి తానూ పనిచేస్తూ వుండిన కార్యాలయము ఇంటికి దూరమైనా అదేపనిగా ఆటో లో వెళ్లి వయసులో ఉన్న పారిశుధ్యపు కార్మికురాలితో పరాచికాలాడేవాడు. ఒకరిద్దరు అతనితో ఇదేమి ఖర్మ అంటే నాకు తెల్లవారితే స్నానము దేవుడు దైవము ఏదీ అనిపించదు, కనిపించదు. ఈమెయే కళ్ళముందు కనిపిస్తుంది. కష్టముమీద కార్యాలయ సమయము వరకు వేచియుండి ఆమెతో పరాచికాలాడుటకు వస్తాను అని చెప్పినాడు. ఈ విషయమును ఇక్కడ నిలిపితే, ఆ వయసు వారందరూ ఆపని చేయుట లేదు. వాళ్ళు గుడి గోపురము, దేవుడు దైవము అంటూ తిరుగుచున్నారు. దీనివల్ల మనకేమి తెలియుచున్నది. బుద్ధిని ప్రేరేపించే శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉన్నది అని తెలియవస్తూవుంది. ఆ శక్తియే వారి వారి కర్మ ఫలము.
భగవద్గీత ఈ క్రింది శ్లోకముతో మొదలౌతుంది.
శ్లో.ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మమకాః పాణ్డవాశ్చైవ కిమ కురవత సంజయ
ఈ శ్లోకాన్ని బాహ్యంగా గమనిస్తే
సంజయా! యుద్ధము చేయ నిచ్చగించినవారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున కూడిన నావారును పాండవులును ఏమి చేసిరి?
ఇందులో అత్యంత గూడార్థము ఇమిడియుంది. ఒకసారి విశ్లేషించుకొందాము.
'క్షి' యనగా నాశము (చెడు కర్మలు చేయుటవల్ల)
'త్ర' అనగా రక్షణ (పుణ్య కార్యములు చేయుటవల్ల) 'కురు' చేయుటవల్ల కలిగించేది. ఆక్షేత్రము వేరేదీ కాదు ఈ శరీరమే. అందువల్ల ఈ శరీరమే కురుక్షేత్రమయ్యింది.
మమకారము తనవారిపైన చంపుకోలేని ధృతరాష్ట్రుడు అందుకే 'మామకాః' అని వాడినాడు. మామ అంటే ఒకవిధముగా అంతా నాకేకావలెనన్న అత్యాశగా చెప్పుకోనవచ్చును. ఇక 'పాండవాః'
అని కూడా ఆయన వాడుతాడు. 'పాండువు' అంటే తెలుపు స్వచ్చత అని అర్థం. పాండురాజు రక్త హీనత వల్ల పాలిపోయిన శరీరుడై (బొల్లి - తెల్లదనము వల్ల) పాండురాజైనాడు. ఇక పాండు కు 'స్వచ్చత' అన్న అర్థము ఉండుటవల్ల సత్వ గుణ సంపన్నులైన పాండవులు ధర్మ పరులైనందువల్ల ఆమాట ఆయనచే వాడబడినట్లు తెలియుచున్నది కదా!.
కావునకురుక్షేత్ర సంగ్రామ ఉపోద్ఘాతములోనే చెడ్డ పై మంచి గెలుస్తుందని చెడ్డని పుట్టించిన వ్యక్తి(తండ్రి) యే చెప్పినాడంటే భారత కాలములో వైయక్తిక జీవన విదానమేట్లున్నది మనము అర్థము చేసుకోన వచ్చును.
ఈ శరీరిభూమిపై ఉన్నంత కాలము ఈ మంచిచెడుల అంతర్మథనము కొనసాగుతూనే వుంటుంది.
కావున ఈ వివరణను సంగ్రహించితే, 'శ్లోకము', కురుక్షేత్రమగు ఈ శరీరముతో సత్కర్మల నాచరించి దానిని ధర్మ క్షేత్రమొనరించి రజస్తమోగుణములపై సత్వము జయము సాధించవలయునని తెల్పుచున్నదని నా భావము .
భగవద్గీత కర్మ యోగములో కర్మలు చేయక తప్పదు అని పరమాత్ముడు మనకు తెలుపుతాడు. అసలు ఊరక కూర్చునత కూడా ఒక కర్మే. దానికి తగిన సమయములో ఫలితముంటుంది.  ఒకవేళ  కర్మ సత్కర్మయైుతే కర్తకు సత్ఫలితం వస్తుంది. దుష్కర్మ అయితే కర్తకు దుష్ఫలితమే వస్తుంది. అయితే ఈ కర్మఫలాలు కర్మ చేసిన వెనువెంటనే రాకపోవచ్చు, కనిపించపోవచ్చు. అందుకే పుణ్యాలు చేస్తున్నవాళ్లు సుఖాలు పొందుతున్నట్లు కనిపించకపోవడం, పాపాలు చేస్తున్నవాళ్లు కష్టాలు అనుభవిస్తున్నట్లు కనిపించకపోవడం చూస్తుంటాం. ఈ విపరీతమే జనులను పుణ్యకార్యాలను చేయడంలో నిరుత్సాహపరచడం, పాపాలను చేయడంలో ప్రోత్సహించడం చేస్తుంది. దీనిలో మనం చేయగలిగింది ఏదీ లేదు. ప్రకృతి నియమం ఆవిధముగా ఉంది.
ఈ కర్మలను నియంతించేది కూడా ప్రమాత్మయగు అంతరాత్మ. కావున మన కర్మ బుద్ధిని ప్రేరేపించినా ఆవిషయమును అంతరాత్మకు నివేదించి అనుజ్న పొంది చేయవలసి ఉంటుంది.
క్లుప్తముగా తెలిపినాను.
కనుకనే కర్మానుసారాణీ బుద్ధిః అన్నారు.
స్వస్తి.

Friday, 14 June 2019

భగవద్గీతా ప్రవేశము


భగవద్గీతా ప్రవేశము

ఎందఱో మహనీయులు, మహానుభావులు,మహాగురువులు భాష్యము వ్రాసిన భగవద్గీత తిరిగీ నేను విమర్శనాత్మకంగా తెలియబరచే అవసరము గానీ,శక్తి గానీ భగవంతుడు నాకు ఇవ్వలేదు. అయినా ఒక్క విషయము మాత్రము శ్రద్ధాళువులతో పంచుకోవాలనిపించి ఈ చిన్న ప్రయత్నము.

భారత యుద్ధ వార్తలను ధృతరాష్ట్రునకు చెప్పుటకై వేదవ్యాసులవారు సంజయునికి కురుక్షేత్ర సంగ్రామము వీక్షించగల దివ్య దృష్టి నొసంగి నియమించిరి.

ఈ గీతా ప్రవేశద్వారము వద్ద మొదట నిలిచినది ధృతరాష్ట్రుడు .
ధృతముఅంటే ధరింపబడిన అని అర్థము, రాష్ట్రుడు అంటే రాష్ట్రమును కలిగినవాడు అని అర్థము. అంటే చక్రవర్తి యని అర్థము. ఈ పేరుకు ఇంకొక అర్థమూ వుంది. ధృతమన్న మాటకు ఆనందము అని ఒక అర్థము. రాష్ట్రము అన్న మాటకు ఉత్పాతము అని ఒక అర్థము (బ్రౌణ్య నిఘంటువు). అంటే ఉత్పాతములయందు ఆనందమును పోడువాడు అని. చూచినారా పూర్వము పేరు పెట్టుటలోని సార్థకత. ఆలోచిస్తే భారత యుద్ధమునకు ఈ పేరే దారి తీయించిందేమో అనిపిస్తుంది.

ఇక రెండవ వాడు సంజయుడు. సత్+జయుడు సంజయుడౌతుందని అందరికీ తెలిసిన విషయమే. 'ఏకం సత్' అన్నది వేదం వాక్కు.అంటే ఆ సత్తే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ను జయించినవాడే సంజయుడు. 'ఏకం సత్' అన్నది వేదవాక్కు. అంటే' ఆసత్తే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను జయించినవాడే సంజయుడు. అంటే వ్యాసుడు విష్ణువు యొక్క అంశయే కదా. సంజయుడు ఆయన అనుగ్రహము పొందుట అంటే ఆయనను జయించినట్లే కదా.

భారతము ఇతిహాసమని సోదాహరణముగా పండితులచేత నిరూపింప బడినది. ఇది ఇపుడు నిర్వివాదము. అప్పుడు ఇందులోని పాత్రల పేర్లు కథ కొరకు పెట్టినవి కావని ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు. వారి పేర్లు వారి స్వభావమునకు ఎంత అతికినట్లు సరిపోతూ వుందో పైన దొరికిన రెండు మెతుకులు పట్టి చూస్తే తెలుస్తుంది.

కృష్ణుడు అర్జనునకు చేయు గీతోపదేశ మటుంచి ఆ ఉపదేశానికి ఉపోద్ఘాతమునకు , ఒక ఉత్పాతములయందు ఉత్సాహము కల్గినవాడు, ఎట్లు నాంది పలుకుచున్నాడో గమనించండి. భగవద్గీత ధృతరాష్ట్రుడు సంజయున్ని ప్రశ్నించిన ఈ శ్లోకముతో మొదలౌతుంది.

శ్లో.ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మమకాః పాణ్డవాశ్చైవ కిమ కురవత సంజయ

ఈ శ్లోకాన్ని బాహ్యంగా గమనిస్తే

సంజయా! యుద్ధము చేయ నిచ్చగించినవారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున కూడిన నావారును పాండవులును ఏమి చేసిరి?

ఇందులో ఒక అంతరార్థము వున్నది. అదేమిటంటే యుద్ధము చేయ నిచ్చాగించినవారు, యుద్ధము చేయుట సహజమే అయినా, చేయనిర్ణయించుకొన్న ప్రదేశము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము. వామన పురాణములో ఈ విధంగా చెప్పబడింది.కురు మహారాజు తన సామ్రాజ్యమునకు సరియగు రాజధానిని సమకూర్చుకొన సంకల్పించి ఎన్నో ప్రాంతములను వేదికి ఈ ప్రాంతమునకు వచ్చి ఈ ప్రాంతపు ప్రత్యేకతలను ఈ క్రింది విధముగా తెలుసు కొన్నాడు.

ఈ ప్రాంతము,బ్రహ్మ ఎన్నో వేల సంవత్సరములు తపమాచ్రించుతవలన బ్రహ్మ వేడిగానూ,సరస్వతీ నది ఉత్తరవాహినియై ప్రవహిన్చుతవలన ఉత్తరవేదిగానూ, సరస్వతీ యమునా నదుల సంగమము దృష్టావతి గా ఇక్కడ పిలువబడేది. ఈ ప్రాంతము సప్త గుణ సంపన్నమైనదని ఇచ్చట నగరము నేర్పరచ తన అనుచర గణమునకు నిర్దేశించినాడు.ఈ సప్త గునములేమిటివన:1.తపస్సు 2.సత్యము 3.క్షమ 4.దయ 5.శుచి 6.దానము 7. బ్రహ్మచర్యము. ఈ ప్రాంతమును రాజధానిగా ఎన్నుకొన్న తన పరమ భక్తుడైన కురు మహారాజుకు శ్రీ మహావిష్ణువు రెండు వరాలను ప్రసాదించినాడు . 1.ఆ ప్రదేశమికపై కురుక్షేత్రముగా పిలువబడుతుందని
2.అక్కడ మరణించిన వారు స్వర్గవాసులౌతారని.

ఋషులు అనేకక్రతువులను నిర్వహించుట వలనను,వేదవ్యాసులవారు వేదములను ఋగ్ యజుస్ సామ అధర్వణములుగా విభజించుట వల్లను ఈ ప్రదేశమునకు ధర్మక్షేత్రమనే పేరు కూడా స్థిరపడినది. అందువల్లనే ధృతరాష్ట్రుడు 'ధర్మక్షేత్రే' 'కురుక్షేత్రే' వాడినాడని చెప్పవచ్చును.

ఇందులో ఒక గూఢార్థము కూడా ద్యోతకమగుచున్నది. 'క్షి' యనగా నాశము (చెడు కర్మలు చేయుటవల్ల )
'త్ర' అనగా రక్షణ (పుణ్య కార్యములు చేయుటవల్ల) 'కురు' చేయుటవల్ల కలిగించేది.ఆ క్షేత్రము వేరే కాదు ఈ శరీరమే. అందువల్ల ఈ శరీరమే కురుక్షేత్రమయ్యింది.
మమకారము తనవారిపైన చంపుకోలేని ధృతరాష్ట్రుడు అందుకే 'మామకాః' అని వాడియుంటాడు. ఇక 'పాండవాః'
అని కూడా ఆయన వాడుతాడు. 'పాండువు' అంటే తెలుపు స్వచ్చత అని అర్థం. పాండురాజు రక్త హీనత వల్ల పాలిపోయిన శరీరుడై (బొల్లి - తెల్లదనము వల్ల) పాండురాజైనాడు. ఇక పాండు కు 'స్వచ్చత' అన్న అర్థము ఉండుటవల్ల సత్వ గుణ సంపన్నులైన పాండవులు ధర్మ పరులైనందువల్ల ఆమాట ఆయనచే వాడబదినదేమో.
కావునకురుక్షేత్ర సంగ్రామ ఉపోద్ఘాతములోనే చెడ్డ పై మంచి గెలుస్తుందని చెడ్డని పుట్టించిన వ్యక్తి(తండ్రి) యే
చెప్పినాడంటే భారత కాలములో వైయక్తిక జీవన విదానమేట్లున్నది మనము అర్థము చేసుకోన వచ్చును.
ఈ శరీరిభూమిపై ఉన్నంత కాలము ఈ మంచిచెడుల అంతర్మథానము కొనసాగుతూనే వుంటుంది.

కావున ఈ వివరణను సంగ్రహించితే, 'శ్లోకము', కురుక్షేత్రమగు ఈ శరీరముతో సత్కర్మల నాచరించి దానిని ధర్మ క్షేత్రమొనరించి రజస్తమోగుణములపై సత్వము జయము సాధించవలయునని తెల్పుచున్నదని నా భావము .
స్వస్తి.

Thursday, 9 May 2019

Dr. వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ గారు


Dr. వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ గారు
https://cherukurammohan.blogspot.com/2019/05/dr.html
ఆస్య గ్రంధిలోనికి నేను అడుగు పెట్టేవరకూ వారిని గూర్చి నాకు తెలియదు, నన్ను గూర్చి వారు తెలుసుకొనే అవకాశమేలేదు. కాలంతరములో ఆస్య గ్రంధిలోని మా రచనలు మా ఇరువురినీ దగ్గరకు చేర్చినాయి. నిజానికి మాది పర్వత పరమాణు సారూప్యము, అజగజ సామ్యము, ఆయన నడిచే విజ్ఞాన సర్వస్వము. విషయము ఆస్య గ్రంధిలో ఎవరు వ్రాసినదైనా కానీ, నిర్మొహమాటముగా విమర్శించే వారి తీరు  నాకెంతో నచ్చినది. ఆయన స్వర్గాస్తుడయి ఆయన చేత సందేహములు తీర్చుకొనుటకు దేవేంద్రుడే స్వర్గములోని తన మహాసభలో ఉన్నత స్థానమోసగి సభికునిగా చేసుకోన్నాడేమో!
2013 నుండి 2016 వరకు ఆస్య గ్రందియోక్క రూపురేఖలు వేరు. ఎవరికి ఏ విషయముపై అభినివేశామేక్కువగా వుంటుందో దానిని గూర్చి విశ్లేషణా పూర్వకముగా వివరణాత్మకముగా వ్రాసేవారు. ఆ విషయముపై శ్రద్ధగలిగినవారు. తమతమ అభిప్రాయములతో స్పందించేవారు. సందేహమేర్పడితే అడిగేవారు. ఆ సమయములో శర్మ గారు ప్రతి సందేహాన్నీ సాధికారకారక టిప్పణితో తీర్చేవారు. వారు దానిని ఏకారణము చేతనైన చూచియుండకపోతే ఆ బాధ్యత నేను తీసుకొనేవాడిని.
నేనేదయినా ఒక ముఖ్యమైన విషయముపై వ్రాస్తే తప్పనిసరిగా దానిపై వారి అభిప్రాయము ఉండి తీరవలసినదే! వారు  సద్గురు శివానంద మూర్తిగారి ఆధ్వర్యమున వచ్చే సంచిక ‘సుపథగ’ కు ఆంగ్లములోనూ తెలుగులోనూ వ్యాసములు వ్రాసేవారు. నారచనపై ఎవరయినా కుతర్కము చేస్తే ముందు దానికి జవాబుగా వారి స్పందన ఉండేది. వారి రచనల కుతార్కికులకు నేనూ అదేవిధముగా స్పందించేవాడిని. ఒకరికొకరము యథాదృష్టి అంటే నేరుగా చూచుకొనకపోయినా మామద్యన ఒక ఆత్మీయతాభావము నెలకొనియుండేది. ఆంగ్లములో ‘Historicity’ ని గూర్చి వారు ‘సుపథగ’ కు వ్రాయదొడగిన వ్యాస శృంఖలను నాకు ‘Email’ లో పంపి ఒకసారి చూసి అవసరమున్నచోట మార్పునకు అవకాశము ఉన్నదేమో చూడమన్నారు. నిజానికి ఆయనముందు నేను పిపీలికమును. ఈ విషయము ఆయన యొక్క నిగర్వమును చాటుతుంది. ఇక వారిని గూర్చి ఇది కాక ఇంకాస్త తెలుసుకొందాము.

వీరు ఆది నుండి తుది వరకు చదువులో అగ్ర తాంబూల గ్రహీత. దేశంలో సుప్రసిద్ధమైన భారతీయ విఙ్ఞాన్ సంస్థాన్ (Indian Institute Of Science) విద్యుత్ తాంత్రిక విభాగమునుండి 1964, 1966, 1971 లో BE, ME, PhDలు పొందినారు. 1967లో అక్కడే ఉపన్యాసకునిగా చేరిన వీరు, 2006 లో కంప్యూటర్ సైన్సు మరియు ఆటోమేషన్ విభాగంలో ఆచార్యునిగా పదవీ నివృత్తి పొందినారు. 2012 వరకు అక్కడే INAE Distinguished Professor గా ఉండినారు. ఎన్నో దేశ విదేశ విశ్వ విద్యాలయములకు Visiting Professor గా వుండినారు. సద్గురు శివానంద మూర్తిగారు స్థాపించిన సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు నుండి 2010 విశిష్ట పౌర సన్మానాన్ని అందుకున్నారు. Indian Academy of Science, Indian National Academy of Science మరియు Indian Academy of Engineering లలో విశిష్ట సభ్యునిగా ఎన్నికైనారు. వారు తెలుగు ఇంగ్లీషులలో చరిత్ర, తత్వ శాస్త్రము, సాహిత్య విషయాలపై వ్యాసరచనా వ్యాసంగమును సద్గురువు శివానంద మూర్తిగారి కోరిక మేరకు చేబట్టి నిరాఘాటముగా నిరంతరాయముగా కొనసాగించుచుండినారు.
2017, మె 7 న ఆవ్ష్కరణకు నోచుకొన్న నా పుస్తకములు ‘శంకరదాస ఆష్టోత్తరశ తి’ మరియు ‘సరసరస (వ్యాస సంపుటి)’ లలో ‘శంకరదాస ఆష్టోత్తరశ తి’ కి నేను వారికి తెలిపిన మరురోజుకల్లా తన అభిప్రాయము వ్రాసి email లో పంపిన మహానుభావుడు. వారు తమ అభిప్రాయమును తెలియజేస్తూ వ్రాసిన వారి రచనకు ఉంచిన శీర్షిక ‘ఒక చదువరి అభిప్రాయము’. ఆమహనీయునికి నా సాష్టాంగ పాదాభివందనము. వారు నా పుస్తకముపై అభిప్రాయమును తెలుపుతూ తమ ఉదాత్తతను ఎంత గొప్పగా చాటుకొన్నారో  చూడండి. “పుండరీకము అంటే తామర పువ్వు గుర్తుకొస్తుంది.కానీ బెబ్బులి అన్న అర్థమున్నాడని ఇప్పుడే తెలిసింది.” ఎంతో గొప్పవాడై ఉండికూడా ఆయన ఎంత వినయసంపంనత కలిగియుండినాడో చూడండి. ఆమహనీయునికి మరొక సారి అంజలించుతూ నాయొక్క ‘శంకరదాస ఆష్టోత్తరశతి’ లో వారిని గూర్చి వ్రాసిన ఈ క్రింది పద్యముతో ఈ రచ్జన ముగించుచున్నాను.
సాంకేతికంబైన చదువు నెవ్వరు సాటి
కలన సువిద్య లో గాంచ మేటి
ఆచార్య పదవికే యాతడౌను కిరీటి
సందేహతప్తుని సతత సురటి
సరస గీర్వాణాంధ్ర సాహిత్య ఘనపాఠి
ధర్మ దర్శక మూర్తి ధన్వి ధాటి
విజ్ఞాన మధుపుష్ప విష్టపమ్మున తేటి
వసుధ మేధావిగ్రావంపుకోటి

నాదు ప్రార్థన మన్నించి నలువ రీతి
అట్టి విద్వచ్ఛిరోమణి యాదరాన
వ్రాసె దనమాట, శివునాఙ్ఞ వాటుగొనుచు
శంకరునిదాస విరచిత శతకమునకు
స్వస్తి.

Sunday, 7 April 2019

నుదుటి బొట్టు మన సాంప్రదాయము


నుదుటి బొట్టు మన సాంప్రదాయము
https://cherukurammohan.blogspot.com/2019/04/blog-post.html
కను బొమలు రెండు పర్వత శిఖరములుగా భావించుకొంటే ఆరెంటి నడుమన ఉదయించే సూర్యుడు స్త్రీకి కనుబొమల నడుమగల నుదుటి బొట్టవుతాడు. నేటి కార్యాలయ సాంప్రదాయములలో అసలు సూర్యుడు, వెలుతురు, ఆరోగ్యము అన్నవి అగుపించని ఎత్తుకు ఎగిరిపోయినాయి. బొట్టు కూడా అదే ఎత్తుకు చేరుకొనింది. ఆర్జన తప్ప అన్యము అవసరము లేని కాలములో  ఉన్నాము. స్థితి నిరాశ నిస్పృహకు ఆలవాలమైనా. అంధకార బంధురమైన మన జీవన సరళి అను సొరంగమునకు అటువైపు ఎదో ఒక ఆశా కిరణము అగుపించక పోతుందా? అన్న తపనతో ఈ విషయమును మీకు తెలుప ప్రయత్నించుచున్నాను.

అంగుష్ఠః అంటే బొటన వ్రేలు. సంస్కృతములో అంగుష్ఠమన్నది పుంలింగము. దానికి దార్ఢ్యము చాలాఎక్కువ. మిగత నాలుగు వ్రేళ్ళ బలమును అది కలిగియుంటుంది. వ్రేళ్ళు ఏపనిని కూడాబొటనవ్రేలు సాయము లేనిదే చేయలేవు. ఇది హృదయానికి సంకేతము అని పెద్దలు చెప్పినారు. ఇక మిగిలిన నాలుగు వ్రేళ్ళను 'అంగుళ్యః' అంటారు. ఇవి నాలుగు అందంగా ఆకర్షణీయంగా వుంటాయి. బహుశ అందుకేనేమో ఇవి స్త్రీలింగమునకు చెందు పదములు సంస్కృతములో! వీనిలో మొదటి దానిని 'తర్జని' అంటారు.  తర్జనము అంటే భయము బెదురు అని అర్థము. అందుకే అసంకల్పితముగానే మనము కోపములో ఎవరినైనా హెచ్చరించవలసి వస్తే ఆ వ్రేలునే చూపిస్తాము. 'తర్జని' అంటే బెదిరించేది, భయపెట్టేది' అని అర్థము. కొందరు దీనితో బొట్టు పెట్టుకొంటారు.  మనకనుబొమల నడుమ సుషుమ్న నాడి మరియు ఆజ్ఞా చక్రము వుంటాయి.  సుషుమ్న, మన ముక్కు కుడివైపునుండి ఇడ అన్న నాడి నుదుటికి ప్రాకి అక్కడ ఎడమ వైపునుండి వచ్చిన పింగళ అన్న నాడితో కలిసే చోట ఉంటుందని పెద్దలు చెబుతారు.  ఈ తర్జనితో  బొట్టు పెట్టుకొంటే మనకు ఆ బెదిరించే లేక కోపగించుకొనే లేక అసహనమనే లక్షణాలను కలిగిపజేస్తుంది సుషుమ్న వద్దనున్న ఆజ్ఞా చక్రము. కాబట్టి చూపుడు వ్రేలితో బొట్టు పెట్టుకొనరాదు.
   ఇపుడు చివరి వ్రేలును గూర్చి తెలుసుకొందాము. దీనిని సంస్కృతములో 'కనిష్ఠిక' మంటారు. కనిష్ఠము అంటే చిన్నది, బలహీనమైనది (Least, weak) అని అర్థము. ఇక్కడ ఒక్క విషయము  చెప్పవలసి వస్తుంది. వివాహములో వదూవరులకు పాణిగ్రహణము చేయించి నడిపించే సమయములో ఇరువురినీ చిటికెన వ్రేళ్ళు పెనవేసుకొని నడువ మంటారు. ఇది పాణిగ్రహణము కానేరదు. 'కనిష్ఠికా' గ్రహణము ఔతుంది. కావున ఇరువురూ చేతులను చేతులు కలిపి (shake hand లో లాగా) నడిపించాలి. బలహీనమగు వ్రేలితో బొట్టు పెట్టుకోనకూడదు.  ఇక మిగిలి పోయినవి రెండు వ్రేళ్ళు. చిటికెన వ్రేలికి ప్రక్కనున్న వ్రేలును సంస్కృతములో అనామికమంటారు. అనామికము అంటే పేరులేనిది అని అర్థము. అసలు మన వ్యాసమునకు సంబంధము లేక పోయినా ఇక్కడ . 'కనిష్ఠిక' మరియు అనామిక ను గూర్చి ఒక చిన్న కథ చెప్పుకొందాము.
కాళిదాసు ఒక కవితామేరువు. అందుకే విద్వాంసులు ఈ విధముగా అంటారు అన్న ఒక ప్రసిద్ధమైన చాటువు మన మధ్యన ఉంది. పూర్వ కాలము ఒక విద్వత్ కవి పండిత సదస్సులో అందరికన్నా గొప్పయగు ఒక ఐదుగురు కవుల పేర్లు గుర్తించ దలచినారట. అనుకొన్నదే తడవుగా గుర్తుకొచ్చిన మొదటి పేరు కాళిదాసుది. ఆతరువాత ఎవరు అన్నది ఎంత గింజుకొన్నా గుర్తు రాలేదట. దానిని ఈ శ్లోక రూపములో ఎంత హృద్యముగా చెప్పినారో చూడండి:
పురాకవీనాం గణన ప్రసంగే

కనిష్ఠికాధిష్టిత కాళిదాసా:

అద్ద్యాపి తత్తుల్య కవేరభావేత్
అనామికా సార్థవతీ భభూవ
ప్రాచీన కవులలో గొప్పవారెవరా అని ఒక పెద్ద పండితుడు  వేళ్ళు లెక్కబెట్టుట , చిటికెన వేలితో మొదలుపెడుతూ  కాళిదాసు అన్నారట. తరువాత వ్రేలిని లేపి పేరు చెప్పబోగా కాళిదాసుతో సమానుడైన మరోకవి ఎవరూ తోచక ఆపివేసినాడట. ఆ విధముగా ఆ వ్రేలికి అనామికమ'న్న పేరు సార్థకమయిందట. ఇందులోని చమత్కారము ఏమిటంటే సంస్కృతములో చిటికెన వ్రేలికి ప్రక్కనున్న వ్రేలికి  అనామికము అన్న పేరు మాత్రమే ఉంది. అనామికము అంటే పేరులేనిది అన్నది తాత్పర్యము.
కానీ తెలుగులో ఆ వ్రేలిని ఎంతో గౌరవించి మనము  ఉంగరపు వ్రేలు అంటాము.
ఇప్పుడు పెరులేనిది అన్న మాటకు ఉంగరపు వ్రేలు అన్నది సమన్వయము చేద్దాము. కాళిదాసు తరువాత అంతటి గొప్ప కవి లేడన్నాము కదా! ఒకవేళ ఉంటే, అతనే, ముద్రిక అనగా ఉంగరము ధరించగల యోగ్యుడు. అది జరగని పని కాబట్టి ఆ వ్రేలు 'అనామకము' గానే మిగిలిపోయింది సంస్కృతములో!
ఇక తిరిగీ విషయానికి వస్తే అనామికమునకు పేరే లేదు కావున దాని గుణగణములూ మనకు తెలిసే అవకాశము లేదు. కావున బొట్టు పెట్టుకొనుటకు ఇది కూడా నిషిద్ధము.
ఇక మిగిలినది మధ్యమము. అసలు మధ్యే మార్గము మంచి మార్గము అన్న సామెత ఒకటి మనకుంది. ఇదికాక ఈ మధ్య వ్రేలు పొడవు గానూ బలిష్టముగానూ ఉంటుంది. దీనితో కుంకుమ తీసుకొని ఆడవారు కానీ మగవారుకానీ నుదుటిపై అదిమి పెట్టుకొనుటవల్ల ఆజ్ఞా చక్రమును ఉత్తెజితము చేసినట్లవుతుంది. రోజంతా అది మనకు రక్షగా పనిచేస్తుంది. కాబట్టి నుదుటి బొట్టును ఎప్పుడూ మధ్యవ్రేలుతో అదిమి పెట్టుకొనవలెను. అదే ఒకరు ఇంకొకరికి బొట్టు పెట్టునపుడు  బొటన వ్రేలును ఉపయోగించమని పెద్దల మాట.
కానీ ఈ రోజు ఆడ మొగ ఎవరికీ ఆ కష్టము లేదు. ఎందుకంటే మగవాళ్ళు మానేసి ఒక శతాబ్దము కావస్తూ ఉన్నదేమో! ఆడవారు కూడా 6౦ సంవత్సరముల క్రిందటే కుంకుమ మాని Plastic Stickers ను ప్రత్యామ్నాయముగా చేసుకొన్నారు. నేటి అతివలు ఆ ఖర్చుకూడా తగ్గించుకొని బోసి నుదుటి తో ఉండుటయే బోగొప్ప అని భావించుతున్నారు. ఈ సందర్భములో నాకు గుర్తుకు వస్తున్న ఒక చాటువును తెలుపుతూ విరమించుతాను
చాకివానితోడి జగడాలు పడలేక
సిరిగలాడు పట్టు చీర కట్టె
శివుడు తోలు గప్పె ఛీయని మదిరోశి
భైరవుండు చీర బారవైచె
చాకలితో ఇది చినిగింది, అది పోగొట్టినావు అది ఇంకా తేలేదే అన్న పోరు పడలేక విష్ణువు పట్టు పీతాంబరములు ధరించినాడట, అవి రోజూ ఉతుకనక్కరలేదు అందుకని, అసలు ఉతికే పనే ఉండదు కదా అని శివుడు తోలు చుట్టుకొన్నాడు, అసలు తోలు కూడా ఎల్లకాలమూ ఒంటికి అతుక్కొని ఉంటే వాసన వస్తుందని భైరవుడు అంతా విడిచిన వాడు ఎంత భాగ్యశాలి అనుకొంటూ అదికూడా లేకుండా దిగంబరంగానే ఉండిపోయినాడట. అనేకమంది మన భారతీయ వనితలు బొట్టు విషయములో నేడు భైరవుని POLICY నే అనుసరిస్తున్నారు.
స్వస్తి.