Friday, 21 October 2016

నా తెనుగు

నా తెనుగు
కాంచనమగు నా తెనుగది కన 'అజంత' సుందరము
గాన కవన రసమందున కన అజంత సుందరము
               భువన విజయ కవి సారము భువి కృష్ణా నయగారము
                గాన  కవన  రసమందున  కన   అజంత   సుందరము
 మావి పైని నునుపుదనము మావిలోని తీయదనము
గాన కవన రసమందున కన అజంత సుందరము
                మది మెచ్చే కుందనము మరులు గొల్పు చందనము
                గాన  కవన  రసమందున  కన  అజంత  సుందరము
 కలితాక్షర ధని యాంధ్రము గన 'అజంత' సుందరము
గాన కవన రసమందున కన అజంత సుందరము


చెరుకు రామ మోహన్ రావు

Thursday, 20 October 2016

విక్రమార్కుని ఆస్థాన నవరత్నములు

నవరత్నములు

"శ్లో|| ధన్వంతరి, క్షపణ కామరసింహ,శంకు, బేతాళ, భట్టి, ఘటఖర్ప, కాళిదాసాః|, 

ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయం, రత్నానివై వరరుచే ర్నవ విక్రమస్య|| " 

అను ఈ శ్లోకమునందు చెప్పబడిన ధన్వంతరి, క్షపణకుఁడు, అమరసింహుఁడు, 

శంకువు, బేతాళుఁడు, భట్టి, ఘటఖర్పరుఁడు, కాళిదాసుఁడు, వరాహమిహిరుఁడు 

అను తొమ్మండుగురును విక్రమార్కుని సభయందలి నవరత్నములు అని 

ప్రసిద్ధి చెంది ఉన్నారు

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.


ముదితల్ నేర్వగరాని విద్య గలదే 
ముద్దార నేర్పించినన్.

తెలుగు మాట్లాడుతూ, తెలుగు చదువుతూ ఉండే వారికి ఈ పద్యపాదము సదా సుపరిచితము. కానీ మిగతా మూడు పాదములు తెలిసినవారు తక్కువగా ఉండవచ్చు. అందుకే ఈ ప్రయత్నము.

చదవన్నేర్తురు పూరుషుల్ వలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో

నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో

నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.

 

ఇది చిలకమర్తి వారి నరకాసుర వధ లేక ప్రసన్న యాదవమను నామాంతరములు గల నాటకములో సత్యభామ యుద్ధ కౌశలాన్ని వీక్షిస్తున్న శ్రీకృష్ణుని చేత కవి గారు
పలికించిన ఆణిముత్యము ఈ పద్యము. వనితలు చేయలేని పనిలేదు. ఏపనిలోనైనా వారు పురుషులకన్నా ఎక్కువే! అందుకే నీతి శాస్త్రము ఈ విధముగా చెబుతుంది.
స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే.
మగవాడితో పోలిస్తే స్త్రీలు ఆహారం రెట్టింపు తీసుకుంటారు, తెలివి నాలుగురెట్లు, ఆరు రెట్లు సాహసం, కామం ఎనిమిదిరెట్లు ఉంటుందని చెబుతున్నారు నీతిశాస్త్రము వ్రాసిన మహనీయులు.
ఇదే మాటను భర్తృహరి మహాకవి ఏవిధముగా తెలుపుచున్నారో చూడండి.
నూనం హితే కవివరా విపరీతవాదో
యే నిత్య మాహూరబలా ఇతి కామినీస్థాః
యాభిర్వైలోలతరతారకదృషిపాతైః
శక్రాదయ్ఽపి విజితాస్త్వబలాః కధం తాః?

అతివలజూచి వీరబల లంచు వచించు మహాకవీంద్రులు
ద్ధతవిపరీతవాదు,విది దబ్బర గాదు, విలాసినీసమం
చితతరలాక్షిపాతములచే గెలువంబడి రింద్రముఖ్యులున్
ధృతి నటువంటి వా రబల లేగతి నైరి తలంచి చూడగన్?

స్త్రీలను చూచి వీరు బలం లేనివారని (వీరు+అబలలు = వీరబలలు) వర్ణించే కవుల మాటలు, గమనించినచో, సత్యదూరములు. కేవలము, చంచలములైన తమ కనుపాపల కదలికచే, సర్వరాక్షస సంహారము గావించుటయే గాక, ఇంద్రాదిదేవతలను తృటిలో  గెలువగలిగిన వారు అబలలెట్లగుదురు? కావున వారు సబలలు అన్నది భర్తృహరి సంస్కృతములోనూ,  దానిని అనువదించిన ఏనుగు లక్ష్మణ కవి గారు తెనుగులోనూ తెల్పిన మాట.

చెప్పుకోతగ్గ కాలం మన దేశాన్ని శాసించినది ఒక ‘విదేశీ మహిళ’. ఆమె అత్త దేశానికి నిరంకుశ నేతయై పాలించింది. డిల్లీ ఒకప్పటి ముఖ్యమంత్రి మహిళ,  నేడు మన దేశపు వంగ రాష్ట్రమును పాలించేది మహిళ. డిసెంబరు 5, 2016 వరకు తమిళనాడును ఏలినది ఒక మహిళ. ఆమె ప్రాణగండముగా ప్రచారము పొంది, కారావాసము చేస్తూ కూడా అక్కడి శాసనములను తనకనువుగా మలచుకోన్నది మహిళ.  ఒకనాటి రూపాయికాసుబొట్టుతో  ప్రముఖ రాజకీయ పార్టీని నడిపింది మహిళ. ఇక సంపూర్ణ విద్యావంతుల రాష్ట్రముగా పేరు పొందిన పొరుగు రాష్ట్రములో నేటికీ మాతృ స్వామ్యమే! ఇక వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మహిళలలు ఎందఱో ప్రపంచములోనే అగ్రస్థానమును పొందినారు కదా! అంతెందుకు మా ఇంటిలో నాభార్యదే రాజ్యము. తన అంగరక్షకులు సామతులు నా కుమార్తెలిద్దరూ. ఇంత వరకూ చెప్పినదంతా కొందరు అత్యాధునిక భారతీయ మహిళల గూర్చి మాత్రమే!
ఇంత చెప్పించిన్బ చిలకమర్తివారికి, సకల మహిళాస్వరూపమైన అనుట ఎలా, సకల చరాచర సృష్టికి మూలము జగజ్జనని యగు ఆ తల్లియే కదా!
అందుకే జగద్గురువగు ఆది శంకరులవారు  
శ్లో.. శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి
అతస్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుంవా  కథ మకృత పుణ్యః ప్రభవతి !!
ఇది సౌందర్య లహరిలోని మొట్టమొదటి శ్లోకం. క్లుప్తంగా దీని భావం ఏమిటంటే..”అమ్మా..శివుడు శక్తితో (నీతో) కూడి ఉన్నప్పుడే సృష్టించగలడు. లేని పక్షంలో ఆ మహాదేవుడు కదలడానికి సైతం అశక్తుడే.అందుకే త్రిమూర్తులకు ఆరాధ్యురాలవగు నిన్ను స్తుతించడానికి గాని,నీకు ప్రణమిల్లడానికి గాని పూర్వపుణ్యం లేనివాడు ఎలా సమర్ధుడవుతాడు..??
ది పరాశాక్తికి నమస్కరించి శెలవు తీసుకొంటాను.
స్వస్తి.

Friday, 7 October 2016

శుద్ధబ్రహ్మపరాత్పర రామ

రామ రామ జయ రాజారామ |
రామ రామ జయ సీతారామ |
బాలకాండము-
శుద్ధబ్రహ్మపరాత్పర రామ | కాలాత్మకపరమేశ్వర రామ |
శేషతల్పసుఖనిద్రిత రామ | బ్రహ్మాద్యమరప్రార్థిత రామ |
చండకిరణకులమండన రామ | శ్రీమద్దశరథనందన రామ |
కౌసల్యాసుఖవర్ధన రామ | విశ్వామిత్రప్రియతమ రామ |
ఘోరతాటకాఘాతుక రామ | మారీచాదినిపాతక రామ |
కౌశికమఖసంరక్షక రామ | శ్రీమదహల్యోద్ధారక రామ |
గౌతమమునిసంపూజిత రామ | సురమునివరగణసంస్తుత రామ |
నావికధావికమృదుపద రామ | మిథిలాపురజనమోహక రామ |
విదేహమానసరంజక రామ | త్ర్యంబకకార్ముకభంజక రామ |
సీతార్పితవరమాలిక రామ | కృతవైవాహికకౌతుక రామ |
భార్గవదర్పవినాశక రామ | శ్రీమదయోధ్యాపాలక రామ |
అయోధ్యాకాండము-
అగణితగుణగణభూషిత రామ | అవనీతనయాకామిత రామ |
రాకాచంద్రసమానన రామ | పితృవాక్యాశ్రితకానన రామ |
ప్రియగుహవినివేదితపద రామ | ప్రక్షాళితనిజమృదుపద రామ |
భరద్వాజముఖానందక రామ | చిత్రకూటాద్రినికేతన రామ |
దశరథసంతతచింతిత రామ | కైకేయీతనయార్థిత రామ |
విరచితనిజపితృకర్మక రామ | భరతార్పితనిజపాదుక రామ |
అరణ్యకాండము-
దండకావనజనపావన రామ | దుష్టవిరాధవినాశన రామ |
శరభంగసుతీక్ష్ణార్చిత రామ | అగస్త్యానుగ్రహవర్ధిత రామ |
గృధ్రాధిపసంసేవిత రామ | పంచవటీతటసుస్థిత రామ |
శూర్పణఖార్తివిధాయక రామ | ఖరదూషణముఖసూదక రామ |
సీతాప్రియహరిణానుగ రామ | మారీచార్తికృతాశుగ రామ |
వినష్టసీతాన్వేషక రామ | గృధ్రాధిపగతిదాయక రామ |
శబరీదత్తఫలాశన రామ | కబంధబాహుచ్ఛేదన రామ |
కిష్కింధాకాండము-
హనుమత్సేవితనిజపద రామ | నతసుగ్రీవాభీష్టద రామ |
గర్వితవాలిసంహారక రామ | వానరదూతప్రేషక రామ |
హితకరలక్ష్మణసంయుత రామ |
సుందరకాండము-
కపివరసంతతసంస్మృత రామ | తద్గతివిఘ్నధ్వంసక రామ |
సీతాప్రాణాధారక రామ | దుష్టదశాననదూషిత రామ |
శిష్టహనూమద్భూషిత రామ | సీతవేదితకాకావన రామ |
కృతచూడామణిదర్శన రామ | కపివరవచనాశ్వాసిత రామ |
యుద్ధకాండము-
రావణనిధనప్రస్థిత రామ | వానరసైన్యసమావృత రామ |
శోషితశరదీశార్థిత రామ | విభీషణాభయదాయక రామ |
పర్వతసేతునిబంధక రామ | కుంభకర్ణశిరశ్ఛేదక రామ |
రాక్షససంఘవిమర్ధక రామ | అహిమహిరావణచారణ రామ |
సంహృతదశముఖరావణ రామ | విధిభవముఖసురసంస్తుత రామ |
ఖఃస్థితదశరథవీక్షిత రామ | సీతాదర్శనమోదిత రామ |
అభిషిక్తవిభీషణవందిత రామ | పుష్పకయానారోహణ రామ |
భరద్వాజాభినిషేవణ రామ | భరతప్రాణప్రియకర రామ |
సాకేతపురీభూషణ రామ | సకలస్వీయసమానస రామ |
రత్నలసత్పీఠస్థిత రామ | పట్టాభిషేకాలంకృత రామ |
పార్థివకులసమ్మానిత రామ | విభీషణార్పితరంగక రామ |
కీశకులానుగ్రహకర రామ | సకలజీవసంరక్షక రామ |
సమస్తలోకోద్ధారక రామ |
ఉత్తరకాండము-
ఆగతమునిగణసంస్తుత రామ | విశ్రుతదశకంఠోద్భవ రామ |
సితాలింగననిర్వృత రామ | నీతిసురక్షితజనపద రామ |
విపినత్యాజితజనకజ రామ | కారితలవణాసురవధ రామ |
స్వర్గతశంబుకసంస్తుత రామ | స్వతనయకుశలవనందిత రామ |
అశ్వమేధక్రతుదిక్షిత రామ | కాలానివేదితసురపద రామ |
ఆయోధ్యకజనముక్తిద రామ | విధిముఖవిభుదానందక రామ |
తేజోమయనిజరూపక రామ | సంస్మృతిబంధవిమోచక రామ |
ధర్మస్థాపనతత్పర రామ | భక్తిపరాయణముక్తిద రామ |
సర్వచరాచరపాలక రామ | సర్వభవామయవారక రామ |
వైకుంఠాలయసంస్థిత రామ | నిత్యనందపదస్తిత రామ |
రామ రామ జయ రాజారామ |
రామ రామ జయ సీతారామ |
మంగళం-
భయహర మంగళ దశరథ రామ | జయ జయ మంగళ సీతా రామ |
మంగళకర జయ మంగళ రామ | సంగతశుభవిభవోదయ రామ |
ఆనందామృతవర్షక రామ | ఆశ్రితవత్సల జయ జయ రామ |
రఘుపతి రాఘవ రాజా రామ | పతితపావన సీతా రామ |