Saturday, 21 June 2014

శ్రీ కృష్ణ తత్వ విశేషములు (సద్గురు శివానంద మూర్తిగారు)


శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
1
మనకు వేదాలు ప్రమాణం.ఈ యుగ ప్రారంభంలో వ్యాసుడు వేదరాశిని నాలుగుగా విభజించి నలుగురు శిష్యులకు వాటి సంరక్షణకై ఈ నాలుగు భాగాలు ఇచ్చాడు. వేదంలో భాగాలు సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ఉపనిషత్తులను వేదం చివరచేర్చడం వలన అవి వేదాంతము అనిపిలువబడతాయి. ఈ ఉపనిషత్తులసారాన్ని 18 అధ్యాయాలలొ సుమారు 700 శ్లోకాలుగా మనకై ఇచ్చినవాడు శ్రీకృష్ణుడు. అర్జునుని వ్యాజంతో మనందరికీ బోధించిన గురువయ్యాడు. అందుకే భగవద్గీతను గీతోపనిషత్ అంటారు. వేదాలు అర్థంచేసుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని వేదాంగాలు అంటారు. ఇవి వ్యాకరణం, జ్యోతిషం, నిరుక్తం, కల్పం,శిక్ష,ఛందస్సు. వేదంలోని విషయాలను కథలలో చెప్పేవి పురాణాలు.ముఖ్యమైనవి 18. ఇవీ వ్యాసుడే సామాన్యులకై చెప్పాడు. న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం. మీమాంస, వేదాంతం - ఈ ఆరూ ఆస్తిక దర్శనాలు. వ్యాసుడు పైలుడికి ఋగ్వేదము, వైశంపాయనుడికి యజుర్వేదం, జైమినికి సామవేదం, సుమంతునికి అథర్వ వేదం ఇచ్చాడు. రోమహర్షణునికి పురాణాలు ఇచ్చాడు. ఈయన సూతుడనే పేరుతో తరువాత కాలంలో నైమిశారణ్యంలోశౌనకాది మహర్షులకు పురాణ ప్రవచనాలు ఇచ్చారు
2
శ్రీకృష్ణుడు మనకి బాగాతెలిసినదైవం. భగవంతుడే మానవునిగా వచ్చాడు. ఈ కలియుగం ఆరంభంలోనే 5000 సం. ముందు వచ్చాడు.మనకు ఆయనను గురించి తెలుసు అనుకుంటాము. కాని ఆయన తత్త్వం మనకు తెలియదు. వ్రేపల్లెలో లీలలు, బృందావనంలో ఆటలు, రాసక్రీడలు, 16000 గోపికలు, రాధ - అంతే మనకు తెలిసినది. ఆయన 125సం.దీర్ఘ జీవితంలో ఇవి కేవలం మొదటి 12 సంవత్సరాల విశేషాలు. ఆయనను అపార్థం చేసుకోవడమే మనకు అర్థమైనది. జారుడు, వెన్నదొంగ, మానినీచిత్తచోరుడు -- ఇవి మనం ఆయనకు ఇచ్చిన బిరుదులు. వీని పరమార్థమూ మనకు తెలియదు. సద్గురుబోధనుండి సేకరించినవి - తెలియవచ్చినంత తేట పరతు.
3
అసలు శ్రీకృష్ణుడు ఎవరు? భాగవతం, హరివంశం, మహాభారతం, బ్రహ్మవైవర్తపురాణం చదివితే ఆయన వృత్తాంతం తెలుస్తుంది. దశవతారాలలో ఆయన ఉన్నాడా? లేకపోతే దశావతారాలు ఏమిటి? కృష్ణస్తు భగవాన్ స్వయం - అని వ్యాసుడు ఎందుకు అన్నాడు? జయదేవుని అష్టపదులు చెప్పినది ప్రమాణంకాదు. ఫరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు మాత్రమే విష్ణువు దశావతారాలలోనికి వస్తారు. అవి విష్ణువు అంశలు. కృష్ణావతారం అంటాము కాని అది కృష్ణుడి స్వయం అవతరణ. ఈ కృష్ణుడికి, విష్ణువుకి సంబంధం ఏమిటి?

4
కృష్ణుడు-విష్ణువు వీరిసంబంధం తెలియాలంటే మత్స్యావతారంనుండి శ్రీరామునివరకూ గల అవతారాలనూ శ్రీకృష్ణుని ప్రత్యేకతనూ పరిశీలించాలి. సృష్టిలో ద్వంద్వాలు ఎప్పుడూ ఉంటాయి. దేవతలను సృష్టించిన పరమేశ్వరుడే, రాక్షసులనీ సృష్టించాడు. పూర్వయుగాలలో రాక్షసులూకూడా తపస్సులుచేసి లోకకంటకులైనప్పుడు, విష్ణువు ఒకొక అవతారంలో ఒకొక బలీయమైన దుష్టశక్తిని పరిమార్చాడు. క్రితము ద్వాపరయుగంనాటికి అటువంటి రాక్షసులు లేరు. రాక్షసత్వం, కౄరత్వం, అధర్మం చాలామందిలో ప్రవేశించింది. కంస, జరాసంధ, శిశుపాలాదులు కృష్ణుని బంధువులే. అజ్ఞానంకూడా అనేకంగా వ్యాపించింది. కృష్ణుని పాత్ర 125 సంవత్సరాల వ్యవహారం. పైగా అది యుగాంతం. సమాజ ప్రక్షాళన అతడి కార్యక్రమమైనది. రాక్షస సంహారము విష్ణుతత్త్వమైతే అనేక ఇతరదేవతల అంశలను కూడా తీసుకుని కృష్ణుడు వచ్చాడు. ఈ కృష్ణుడు త్రిమూర్తులలో విష్ణువు కాదు. పరాశక్తి, శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇలా అనేక దేవతల సంగమం ఆయన.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 2
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
5
శ్రీకృష్ణుడు అంటేనే యోగం గుర్తుకు వస్తుంది. ఆయన మహాయోగి, యోగీశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు. భగవద్గీతలో ప్రతి అధ్యాయం ఒక యోగమే. యోగ అన్నపదానికి అర్థం రెంటిని కలుపుట. సంయోగం కలయిక, ఐతే వియోగం విడిపోవడం. "యోగక్షేమం వహామ్యహం" అంటాడు పరమాత్మ. యోగమంటే లేనిది లభించడం, క్షేమమంటే ఉన్నది నిలబడడం. గీతలో యోగం అంటే జీవాత్మను పరమాత్మతో ఐక్యం చేయడం. దీనికి అనేక దర్శనాలు అనేక మార్గాలు. వాటన్నిటినీ సమన్వయంచేసి గీతలోచెప్పినవాడు భగవంతుడు. గీత వృద్ధులకు పనికి వచ్చే పుస్తకమా? కానేకాదు. నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘర్షణకు మార్గం చూపిస్తుంది. దానిని మించిన Management Textbook లేదు.
6
వసుదేవసుతందేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం 
మనము కృష్ణుడు మహాయోగి అనిచెప్పుకున్నాము. అసలు ఆయన ముఖ్యతత్త్వం జగద్గురు తత్త్వం. ఇది విష్ణుతత్త్వం కాదు. విష్ణువు ఏ అవతారంలోనూ ఎవరికీ బోధ చేయలేదు. ఇది కృష్ణునిలోని శివ తత్త్వం, సుబ్రహ్మణ్య తత్త్వం. కృష్ణునికి శివునికీ ఉన్న సంబంధం మామూలుగా గుర్తించనిది. భీష్ముడు ధర్మరాజు కు విష్ణు సహస్రం బోధించాడు. కృష్ణుడు ధర్మరాజుకు శివసహస్రనామావళి, శివ పూజా ప్రాశస్త్యం బోధించాడు. ప్రభాస తీర్థంలో (సోమనాథ క్షేత్రం)శివ దీక్ష, శివ పూజా నిర్వహించాడు. అర్జునుని శివునికై తపస్సుచేసి పాశుపతం పొందమని చెప్పాడు. శివుని బోధరూపం దక్షిణామూర్తి. సుబ్రహ్మణ్యుని శివగురువు అంటారు. ఆయన వాహనం నెమలి. అందుకే కృష్ణుడు శిఖిపింఛమౌళి. కృష్ణునిబోధలు భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవ గీతలు. భ్రమర గీత కూడా. కృష్ణుని భంగిమ నటరాజ స్వామి కుంచితపాదాన్ని పోలి ఉంటుంది. ఆయన వేణువు శివుడే. కృష్ణుడు వంశీ మోహనుడైతే, శివుడు వంశ మోహనుడు (శివసహస్రంలో ఒకపేరు).
7
ఇప్పుడు సృష్టి గురించి తెలుసుకోవాలి. పురాణాలు ఐదు లక్షణాలు కలిగి ఉంటాయి .సర్గ, ప్రతిసర్గ, మన్వంతరం, వంశం, వంశానుచరితం. - అనంత కాల చక్రం ఆద్యంతాలులేనిది. మానవజీవితమునకు సుమారు 100 సంవత్సరాలు పరిమితి అయితే, కలియుగ పరిమితి 4,32,000 సం. 4:3:2:1 లొ ఉన్న నాలుగు యుగాలు ఒక మహాయుగం. ఎన్నో మహాయుగాలు గడిస్తే కల్పం, మన్వంతరం వంటివి వస్తాయి. యుగాంతం లో ప్రళయాలు వస్తాయి. విష్ణువు పాలసముద్రంలో ఆది శేషునిపై యోగనిద్రలో ఉంటాడు. ఆతడే సృష్టి కర్త. ఆధునికులం పాలసముద్రాన్ని Milky Way Galaxy గా భావించుకోవచ్చు. ఆయన సృష్టికోసం ఒక పరిమిత విశ్వాన్ని సృష్టించాడు. ఆది బ్రహ్మాండము. దీనిలో భూమితొ సహా భూ, భువ, సువ, మహ, జన, తప, సత్య - అనే 7 ఊర్ధ్వలోకాలు , అతల, వితల, .... పాతాళ అనే 7 క్రిందిలోకాలు సృష్టించాడు. సత్యలోకములో ప్రతిసృష్టిచేసే బ్రహ్మదేవుణ్ణి సృష్టింఛాడు. ఈ బ్రహ్మలోకంపైన పరమేశ్వర లోకాలనే వైకుంఠం, కైలాసం, గోలోకం, మణిద్వీపం ఉంటాయి. అక్కడ లక్ష్మీనారాయణులు, శివపార్వతులూ, రాధాకృష్ణులూ, లలితా పరమేశ్వరి వారి లోకాలలో ఉంటారు.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 3
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
8
పంచబ్రహ్మ సిద్ధాంతములో వరుసగ సదాశివ బ్రహ్మ (లేదా పరబ్రహ్మ), (కామేశ్వర, కామేశ్వరి లేదా (పురుషుడు,ప్రకృతి),విష్ణువు,బ్రహ్మ,రుద్రుడు,(త్రిమూర్తులు)ఉంటారు. మనకి శివాదిషణ్మతములు ఉన్నాయి. సాంఖ్యులు ప్రకృతి పురుషుడు అన్నదానినే కైలాస, వైకుంఠ,గోలోక, మణిద్వీప వాసులలొ ఎవరినన్నా అనుకోవచ్చు. బ్రహ్మ వైవర్త పురాణం , చైతన్య సాంప్రదాయం గోలోకములోని రాధాకృష్ణులను అత్యున్నతస్థితిగా పరిగణిస్తాయి. ఆ కృష్ణుని పూర్ణ అవతారమే మన ద్వాపర యుగ కృష్ణుడు. ఆ ప్రకృతియే,(లేదా శక్తి, లేదా యోగమాయ) రాధ.రాధ పాత్ర భాగవతంలో కనబడదు. కృష్ణుడు అంటే పురుషతత్త్వం, శ్రీకృష్ణుడు అంటే శక్తితో కూడిన కృష్ణుడు. శ్రీకృష్ణుడు అనడమే మనకు శ్రేయోదాయకం. శ్రీ అంటే మహాలక్ష్మి ఆమెయేరాధ. బ్రహ్మ వైవర్త పురాణంలో బ్రహ్మ ఖండం, ప్రకృతి ఖండం, గణేశ ఖండం, కృష్ణ ఖండం అని నాలుగు భాగాలు. ఇది సృష్టి చరిత్ర (సర్గ, ప్రతి సర్గలు)
9
శ్రీకృష్ణుడు మానినీ చిత్తచోరుడు అంటే ఏమిటి? ముందు చిత్తమంటే ఏమిటో తెలుసుకోవాలి. పంచ జ్ఞానేంద్రియాల తరువాత మనస్సు అనే అంతఃకరణ. మనసు అంటే ఆలోచనలే. కోతిలా గంతులు వేస్తుంది. ఆ పైన బుద్ధి. వివేకానికి కేంద్రము. ఆపైనది చిత్తం. హృదయ తత్త్వం. తరువాతది అహంకారం (మమకారంతోపాటుగా) . నేను, నాదీ అనుకోడం ఇవన్నీ ఆత్మను ఆవరించే జీవ లక్షణాలు. ఇంగ్లీషులో చెబితే mind, intellect, consciousness, ego covering pure soul matter. గోకుల నివాసులందరి హృదయాలు కృష్ణునితో నిండిపోయాయి. గోపికలు మొదట్లో "మధురానగరిలో చల్ల నమ్మబోదూ" అని తిరిగేవారు. ఇప్పుడు పాలూ, పెరుగూ, వెన్నా మరచిపోయారు. అత్తగారు భర్తా, పిల్లలూ ఎవరూ గుర్తులేరు. కొందరు భర్తగా, కొందరు కుమారుడుగా, ఆవులు దూడగా భావించుకున్నారు. ఎవరిఊహ వారిదే. ఎవరికి వారు అతడి సాన్నిహిత్యంలోనే ఉన్నారు. ఇదే యోగం. పతంజలి మాటలలో "చిత్తవృత్తి నిరోధం." గోకులంలో అందరూ మానినులే. అందరి హృదయాలలోనూ కృష్ణుడే. ఈపరిస్థితిలోనే ఒక రాత్రి వారికి రాసక్రీడ అనుభవం జరిగినది. మధ్యలోనే కృష్ణుడు వెళ్ళిపోయాడు. తరువాత వెంటనే గోకులాన్ని వదలి అక్రూరునితో మధుర వెళ్ళిపోయాడు. కాని అందరిహృదయాల్లో చిత్తచోరుడుగా ఉండిపోయాడు. చోరుడు అంటే చిత్తాన్ని పూర్తిగా ఆక్రమించినవాడు.
10
ఆదిశక్తికి పరమేశ్వరునికీ ఉన్న సంబంధం - పరమాత్మయైన శ్రీకృష్ణుని స్త్రీమూర్తిగా తలచుకోవాలంటే లలితాదేవిని తలచుకోవాలి. భాగవతంలో ప్రారంభ పద్యాలు చూడండి - లలిత స్కంధము, కృష్ణమూలము .. భాగవతాఖ్య కల్పతరువు.. భాగవతమనే కల్పవృక్షానికి లలిత - స్కంధము (మాను), కృష్ణుడు - మూలము (వేరు). అలాగే శ్రీరాముడు స్త్రీ గా శ్యామల.---- వైదేహీ సహితం సురద్రుమతలే, హైమే మహామండపే ... రామం భజే శ్యామలాం. అలాగే వేంకటేశ్వరుని పేరు బాలాజీలో బాల.
11
కృష్ణునికీ కాత్యాయనీ వ్రతానికీ గోపికావస్త్రాపహరణానికీ సంబంధం ఏమిటి? వ్రజభూమిలోగోపికలు నందకిశోరుడే భర్తకావాలని కాత్యాయనీవ్రతంచేస్తారు. కాళిందిలో(యమునలో) స్నానంచేసి అమ్మవారిని పూజిస్తారు. తమ వస్త్రాలు ఒడ్డునే ఉంచి నదిలోదిగుతారు. స్నానంచేస్తూండగా కృష్ణుడు వచ్చిఆ వస్త్రములు అపహరించి ఆప్రక్కన ఉన్న వృక్షంపైన ఎక్కి వాళ్ళను పిలుస్తాడు. మీరు వస్త్రాలు లేకుండా వ్రతభంగం చేశారు. పైకి వచ్చి నమస్కారంచేయండి. అనిచెబుతాడు. కథ తెలిసినదే. వస్త్రం ఆవరణ, ఆచ్ఛాదన. గోపికలు జీవాత్మలే. అజ్ఞానం వస్త్ర రూపంలో కప్పి ఉంచింది. అజ్ఞానపు తెరతొలగిస్తే అంతా పరమాత్మస్వరూపమే. చెట్టుపైనా క్రిందనూ ఉన్న వస్తువు ఒకటే.వ్రతఫలం అప్పటికప్పుడు పురుషరూపంలో కాత్యాయనియే ఐన కృష్ణ దర్శనం లభించింది. వారి అజ్ఞానపు తెరలు తొలగినవి.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 4
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
12
కృష్ణుని పేరు ఏమిటి? వింత ప్రశ్న. ఎవరు పెట్టారా పేరు? చిన్నప్పుడు బారసాల (బాలసారె) వంటి సంస్కారములు జరిగినట్లు ఎక్కడా వినలేదే? పుట్టగానే తండ్రి వసుదేవుడు యమునను దాటించి నందుని ఇంట్లో విడిచి వచ్చాడు. తండ్రి బియ్యంలోపేరు వ్రాసి నామకరణం చేయాలి. తల్లితండ్రుల నివాసం కారాగారం. వ్రేపల్లెలో తరచు పూతనాది రాక్షసుల రాకపోకలు. ఒకనాడు గర్గమహర్షి వచ్చాడు. నందయశోదలు కృష్ణుని బాలారిష్టములను గురించి బెంగ పెట్టుకొని ఆయనకు కృష్ణుని చూపింఛారు. ఆయన నవ్వుతూ ఈబాలుడు ఎవరనుకొన్నారు? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. సకలదేవతాస్వరూపుడు. విష్ణువే. గోలోక కృష్ణుడు. మీపిల్లవాడు కాదు. దేవకీవసుదేవులబిడ్డడు. మీకు ఆడపిల్ల జన్మించినది. మీకు తెలియకుండా ఈ మార్పిడి జరిగినది. ఈయనకు మనము పెట్టే పేరులేదు. కృష్ణుడు అనే పిలవండి. పైగానల్లనివాడు. ఆపేరు సార్థకము. క అంటే బ్రహ్మ. రు అంటే అనంతుడు. ష అంటే శివుడు. ణ అంటే ధర్మము. అ అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు)
13
నలుపు సరే నీలము ఎక్కడనుంచి వచ్చినది? ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది? (సర్ సి. వి.రామన్ గారి పరిశోధన) అక్కడ నీలవర్ణపు వస్తువులేదు. అది అనంతమైన ఆకాశము యొక్క సహజమైన తేజస్సు యొక్క వర్ణము.) 15 వ శతాబ్దములో చైతన్య మహాప్రభువు శిష్యుడైన రూపాగోస్వామి ఉజ్జ్వల నీలమణి అని కృష్ణుణ్ణి అదేపేరు గల గ్రంథంలో వర్ణించాడు. అన్నమయ్య శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము అని నవరత్నములతో పోల్చే కీర్తనలో చెబుతాడు. రంగు నలుపు. తేజస్సు నీలము.
14
11-12 సం. వయస్సులో కృష్ణుడు బృందావనం విడిచి మథురవెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడూ తిరిగిరాలేదు. మళ్ళీ మనకు బాగా తెలిసినవి కృష్ణుడి పెళ్ళిళ్ళూ, 16008 భార్యలు, సత్యభామతో సరాగాలు, ఇవన్ని ఆయన 30-40ల లోనివి అనుకుందాము. ఈ మధ్యకాలంలో ఆయన ఏమిచేశాడు? మళ్ళీ బాగా తెలిసినవి ద్రౌపదీ మాన సంరక్షణ, రాయబారం, యుద్ధం, భగవద్గీతా బోధ. మహాభారత యుద్ధ కాలానికి ఆయన వయస్సు 80 సంవత్సరాలు. యుద్ధం తరువాత ఆయన 125 సం. వచ్చేవరకు జీవించి ఉన్నాడు. అప్పుడు ఆయన కార్యక్రమం ఏమిటి? మనకు తెలిసినది 25 ఏళ్ళ జీవితం.. బాగా తెలియనిది 100 సంవత్సరాలు. భగవంతుడు భూమిపై అవతరించి చిన్ననాటి లీలలు, వైవాహిక జీవితం కాక ఆయన చేసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏమిటవి? అసలు ఆయన రాక కారణాలు ఏమిటి? చూద్దాం

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 5
Top of Form
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)

15

బలరామ కృష్ణులు నందాదులతో కలసి కంసుని ఆహ్వానంపై మథుర వెడతారు. రాజ సభకు వెడతారు. కంసుడు ముష్టికుడు, చాణూరుడు వంటి మల్లయుద్ధ ప్రవీణులని దారిలో వీరిని అంతంచేయడానికి నియోగిస్తాడు. చిన్నపిల్లలతో ఏనుగులవంటివారి మల్ల యుధ్ధాన్ని చూచి అందరూ కంసుని పన్నాగానికి దుఃఖ పడతారు. కాని బలరామ కృష్ణులు వారందరిని తేలికగా మల్ల యుద్ధంలోనే చంపుతారు. అదిచూచి కంసుడు భయంతో కంపించి సింహాసనం దిక్కుగా వస్తున్న రామ కృష్ణులను చంపడానికి తన కత్తి, డాలు పట్టుకుని సిద్ధమౌతాడు. ఒక క్షణంలో కృష్ణుడు అతడిపై లంఘించి మెడపట్టుకుని మల్ల యుద్ధంజరిగే ప్రదేశానికి విసిరేసి, అతడిపై దూకుతాడు. ఏఆయుధము వాడ కుండానే కంసుడు బహుశా భయముతో వచ్చిన ఆఘాతము (shock) తోనే మరణిస్తాడు. దేవకీవసుదేవులను కలుసుకొని వారినీ, తాత అయిన ఉగ్రసేనుణ్ణి విడిపిస్తాడు. ఉగ్రసేనుడు కృష్ణునే మధురను పాలించమని అడుగుతాడు. కృష్ణుడు దానికి నిరాకరిస్తాడు. సామాన్యంగా తెలియని విషయం కృష్ణునికి మల్లయుద్ధం అంటే చాలా ఇష్టం. మల్లయుద్ధంలో శ్రీకృష్ణుని ఓడించగల వ్యక్తి ఒక్కరే. జైన తీర్థంకరుడు అరిష్టనేమి. వసుదేవుని అన్న సముద్రవిజయుని కుమారుడు. శ్రీకృష్ణుని కన్న వయసులో పెద్ద. శ్రీకృష్ణునికి ఆయన అంటే అమితగౌరవం.
16
కలియుగంలో సనాతన ధర్మంతో సహజీవనం చేసినవి జైన, బౌద్ధ మతాలు. మనతప్పుల తడకల చరిత్ర పుస్తకాలను పక్కన పెడితే - మనకు లభించే ఆధారాలు గ్రంధాలు. సాంప్రదాయ నిర్ణయం ప్రకారం కృష్ణుని సమకాలికుడైన వేదవ్యాసుడు వ్రాసినవే భారత, భాగవతాలు. కృష్ణుని తరువాత వచ్చినది బుద్ధావతారం. ఈ ఊహకు ఆధారం భాగవత శ్లోకం.
తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురాద్విషామ్
బుద్దో నామ్నా జినసుతా కీకటేషు భవిష్యతి -- (భాగవతం - 1.3.24)
తరువాత కలియుగంలో సురద్వేషులైన నాస్తికులను సమ్మోహన పరచుటకు కీకట దేశంలో బుద్ధుడనే పేరుతొ జినసుతుడుగా ప్రభవిస్తాడు. ఇదంతా కలియుగంకొరకు ఉద్దేశింపబడిన శ్రీకృష్ణుని గురుతత్త్వ ప్రభావమే! ఈ బుద్ధుడెవరు? 12వ శతాబ్దపు జయదేవుని అష్టపది ప్రకారం గౌతమ బుద్ధుడు గుర్తుకు వస్తాడు --
నిందతి యజ్ఞవిదే రహః శ్రుతిజాతం,
సదయ హృదయ దర్శిత పశుఘాతం
కేశవ ధృత బుద్ధ శరీరా, జయ జగదీశ హరే ||
కాని భాగవత శ్లోకం లో జినసుత అనే పేరు, ఆ బుద్ధుడు వేరు అని సూచిస్తుంది. జైనం తో సంబంధాన్ని సూచిస్తుంది. దానికి అర్థం వసుదేవుడు జినుడు. వాసుదేవుడు జిన సుతుడు.
17
దేవకీ వసుదేవులు వారికి ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి కాశీ పంపిస్తారు. ఈలోపునే కంసుడి మామగారయిన జరాసంధుడు మధురను ముట్టడిస్తాడు. కాశీలో వారు జరా సంధుని గూఢ చారుల బారినుండి తప్పించుకోడానికి బ్రాహ్మణ బాలురవేషాలతో వెడతారు.అక్కడ వారికి అవంతీ(నేటి ఉజ్జయిని) వాసుడైన సాందీపని అనే ముని దర్శనం అవుతుంది. అప్పుడు ఆయన గురుకులంలో చేరడానికి వెళ్తారు. సాందీపని వద్ద విద్యాభ్యాసం కృష్ణుని మరియొక కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 6
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
18
అంగీరసునిశాపంతో ఋషిపత్నులు బృందావనంలో విప్రస్త్రీలుగాజన్మిస్తారు. ఒకదినంగోపాలకులు శ్రీకృష్ణ బలరాములతోకలసి అరణ్యంలో పశువులనుమేపడానికి వెళ్ళారు. అక్కడ వారికి ఆకలివేస్తుంది. వెంటనే గోపాలకులు రామకృష్ణులను ఆశ్రయిస్తారు. అప్పుడు కృష్ణుడు అక్కడ సమీపములోనే ఉన్న విప్రపత్నులను అనుగ్రహించదలచి గోపాలురతో ఇలా అంటాడు. "సమీపము లోనే కొందరు బ్రాహ్మణులు స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో అంగీరసమనే ఒక యజ్ఞము చేస్తున్నారు. అక్కడ అనేక ఆహార పదార్థాలు వండి సిద్ధంగా ఉన్నాయి. వెళ్లి వారితో మేము మిమ్మలిని పంపించామనిచెప్పి ఆ పదార్థాలు తీసుకొని రండి" అని చెప్పి పంపిస్తారు. వాళ్ళు ఆ బ్రాహ్మణుల వద్దకు వెళ్లి "ధర్మం తెలిసిన విప్రులారా! రామకృష్ణుల ఆదేశం మేరకు మేము వచ్చాము. మేమంతా ఆకలిగా ఉన్నాము. మీరుమాకు ఆహారము ఈయండి" అని ప్రార్థిస్తారు. ఆబ్రాహ్మణులు శ్రీకృష్ణుని గురించి వినియున్నారు. కాని యజ్ఞదీక్షితులై ఉండి పూర్ణాహుతి జరగకుండా నైవేద్యములకు ఉద్దేశించిన ఆహారము ఈయవచ్చునా? అనే మీమాంసలో పడ్డారు. అవును, కాదు అని చెప్పలేదు. ఆపిల్లలకు విసుగుపుట్టి కృష్ణుని వద్దకు పరుగుపెట్టారు. కృష్ణుడు నవ్వి "వీరికి శాస్త్రములపై ఉన్న నమ్మకం సత్యంపైలేదు. స్త్రీలు సహజంగా ఎక్కువ ప్రపంచజ్ఞానము కలిగి ఉంటారు. వారి పత్నులను అడగండి." అని వెనుకకు పంపిస్తారు. గోపాలురు విప్రస్త్రీల వద్దకు వెళ్లి ప్రసాదం ఇమ్మని, రామకృష్ణులు ఆకలితో ఉన్నారని చెబుతారు. ఆస్త్రీలు వెంటనే వారు వండిన ప్రసాదాలనన్నిటినీ తీసుకొని కృష్ణుడు ఉన్న చోటికి వెడతారు. భర్తలు, పుత్రులు వారిస్తున్నా వారు లెక్కచేయలేదు. యమునా తీరంలో దరహాసంతో, శిఖి పింఛంతో, వేణువుతో, పీతాంబరంతో, వనమాలతో ఉన్న నల్లనయ్య వారికి కనుపిస్తాడు. వారు ఆ దర్శనంతో మైమరిచి చిత్తాన్ని హరిపరంచేస్తారు. కృష్ణుడు వారిని వెనుకకు వెళ్లి యజ్ఞము సమాప్తిచేయించండి అని చెబుతాడు. మా వారు వారిస్తుంటే వచ్చాం. మరల మమ్ములను రానిస్తారా అని వారి భయం. "నా సమీపమున నున్నారంచు నలుగరు బంధులు భ్రాతలు బతులు సుతులు మిము దేవతలైన మెత్తురంగనలార" అనికృష్ణుడు వారికి చెబుతూ వారుతెచ్సిన భక్ష్యాలు ఆరగిస్తాడు.
పరమేశ్వరార్పణంబుగ
బరజనులకు భిక్షమిడిన బరమపదమునన్
బరగెదరట తుది సాక్షా
త్పరమేశ్వరు భిక్షసేయ ఫలమెట్టిదియో..
ఆభర్తలు తమకు "కాంతలపాటి బుద్ధిలేదు" అని చింతిస్తారు. జపహోమాధ్యయనములు, తపస్సులు లేని తరుణులు భగవంతుని చేరగలిగితే, అన్నీ ఉండి భక్తిలేక తాము హరినిచేరలేకపోయామని ఆవిప్రులు ఆలస్యముగా తెలుసుకుంటారు. శ్రీకృష్ణుని అవతార సమయంలో చదువురాని గోపాలురు, గోపికలు ముక్తిపొందితే, ఆయన సాన్నిహిత్యంవలన బాగు పడనిది అక్కడఉన్న బ్రాహ్మణులు. వారికి కృష్ణుడు అద్భుతములుచేసే గొల్లపిల్లవానిగనే కనుపింఛాడు. యాదవులు అమాయకులై అతడిని ఆరాధిస్తున్నారు అనుకున్నారు. విప్రులు తమని తాము వేదాలు చదువుకున్న పండితులమని, సమాజంలో అధికులమని భావించుకునేవారు. యోగికి పాండిత్యముతో పనిలేదు. భక్తుల చిత్తాన్ని యోగి గ్రహింపగలడు. భాగవతం భక్తుల చరిత్ర. సామాజిక వర్గాలని కృష్ణుడు పట్టించుకోలేదు.
యజ్ఞపతియైన హరికి ఆహారమిచ్చి అంగీరసుని శాపంతో విప్రస్త్రీలుగా జన్మించిన ఋషిపత్నులు తపోలోకం కంటె ఉన్నతమైన గోలోకదర్శనంచేసుకున్నారు. వేదాలుచదివిన విప్రులు తమఎదురుగాఉన్న భగవంతుని పోల్చుకోలేకపోయారు.
శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 7
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
19
భారతదేశంలో ఏడు మోక్షనగరాలున్నాయి. అయోధ్య, మథుర, మాయ (హరిద్వార్), కాశీ, కాంచీ, అవంతిక (ఉజ్జయిని), ద్వారవతి (ద్వారక). అయోధ్య రాముని పాద స్పర్శ వల్ల మోక్షపురి అయినది. మథుర, కాశీ, అవంతిక, ద్వారక, మాయాపురి (విష్ణుమాయ), శ్రీకృష్ణ సంబంధం కలవి. కాంచీపురంలో విష్ణుకంచి గజేంద్రమోక్షణ కథతో సంబంధం కలది. రామ కృష్ణుల విద్యాభ్యాసం కాశీ, అవంతీలలో జరిగినది. వాళ్ళు అక్కడ వేదాలు, వేదాంగాలు, ధనుర్వేదం వంటి క్షత్రియోచిత విద్యలు నేర్చుకున్నారు. సాందీపని వారికి ఛందస్సు - అనుష్టుప్, గాయత్రి వంటి ఛందస్సులగురించి చెప్పాడు. ఈ రెండూ పాదానికి 8 మాత్రలను కలిగి ఉంటాయి. ఉదహరణకు –
కృష్ణం వందే జగద్గురుం, భర్గో దేవస్య ధీమహి లవలే. గాయత్రి మూడు పాదాలు, అనుష్టుప్ నాలుగు పాదాలు కలిగిఉంటాయి. సాందీపని కృష్ణునికి గాయత్రీ మంత్రము ఉపదేశించినపుడు ఆయనకు చిత్రమైన అనుభవం కలిగినది. గాయత్రీదేవికే గాయత్రి ఉపదేశిస్తున్న భావన. అపుడు కృష్ణుడెవరో ఆయనకు పూర్తిగా తెలిసినది. సామాన్యుల కంటే తక్కువ సమయంలోనే వారు విద్యలన్నీ నేర్చుకున్నారు. చదువు పూర్తి చేసుకొని ఆయనను గురుదక్షిణ ఏమికావాలని అడిగారు. వారి శక్తి తెలిసిన గురువు తగిన కోరిక చెప్పారు. కొన్నిసంవత్సరాల క్రితం చనిపోయిన వారి పుత్రుని తిరిగి తెమ్మని అడిగారు. అదొక అద్భుత ఘట్టం.
20
యమునితో ముఖాముఖీ
మనుష్యులు తప్పించుకొనలేనిది మృత్యువు., ఆత్మీయులు దూరమైనప్పుడు కలిగే దుఃఖాన్ని ప్రతివారూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసినదే. అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని అనుగ్రహంతో చిరంజీవి అయ్యాడు. సావిత్రి యమునితో వాదించి భర్త సత్యవంతుడి ప్రాణాలు తిరిగి తీసుకురాగలిగినది. నచికేతుడు యమునితో వాదించి యముని వద్దనుండి తిరిగి రాగలిగాడు. కృష్ణుడు, బలరాముడు యముని వద్దకి వెళ్ళి సాందీపని పుత్రుని ప్రాణాలు తీసుకొని వచ్చారు. తరువాత కృష్ణుడు ఉత్తరాగర్భంలోని మృత శిశువుని బ్రతికేస్తేనే పరీక్షిత్తు బ్రతికి బట్టకట్టాడు. ఇది ఎలా సాధ్యం? దేవుళ్ళు కాబట్టి అనే సమాధానం, కల్పిత కథ కాబట్టి అనేసమాధానం పొసగవు. కృష్ణుడు తన వేణువును ఇంద్రజాలికుని దండంవలె మూడు సార్లు తిప్పి
సాందీపని కుమారుడా! తిరిగిరా, రా అని మంత్రం చదవలేదు. ఇవికాక యముని తో ముఖాముఖీలో ప్రాణాలు తిరిగి పొందడం గురించి పురాణాల్లో ఇతర గాధలు లేవు. దీనికి సమాధానం ఉంది. దీనికి కారణం కృష్ణుని దివ్యత్వం కాదు. ఆయన యోగీశ్వరుడవటం వలన ఇది సాధ్యమైనది. ఆధునిక యుగంలోకూడా యోగసిద్ధులు సాధ్యమని చెప్పే నిజజీవిత గాధలున్నాయి. అందరూ చదవవలసిన పుస్తకం పరమహంస యోగానంద (1893-1952) గారి "ఒక యోగి ఆత్మ కథ" The Autobiography of a Yogi. ఇంగ్లీష్ లోను తెలుగులోనూ లభ్యం అవుతుంది. యోగానంద 1952 లోనే సిద్ధిపొందారు. ఆపుస్తకంలోనే మహాయోగి త్రైలింగస్వామి ప్రసక్తి వస్తుంది. ఆయన యోగానందకు పరమ గురువులైన లాహిరి మహాశయుల సమకాలికుడు. ఆయన 1607 నుండి 1887 వరకు 280 సంవత్సరాలు జీవించారు. ఆయన తెలుగుదేశంలో జన్మించినా బహుకాలం కాశీలో నివాసం ఏర్పరచుకొన్నారు. రామకృష్ణపరమహంస ఆయనను కాశీపుర వీధులలో నడయాడే శివుడన్నారు. ఆచార్య బిరుదురాజు రామరాజు గారు "ఆంధ్ర యోగులు" అని నాలుగు సంపుటాలు ప్రచురించారు.
కృష్ణుడు యమలోకానికి ఎలా వెళ్ళిఉంటాడు? (నచికేతుడు యమలోకానికి వెళ్ళడము, యమునితో సంభాషించి మృత్యుంజయత్వాన్ని సాధించే విద్యను సంపాదించి భూలోకానికి తిరిగి రావడము సద్గురు శ్రీ శివానంద మూర్తిగారి "కఠ యోగము" పుస్తకములో విపులంగా లభిస్తుంది.)
శ్రీ కృష్ణుడు తనగురువు కొరకై ఏ యోగి, ఏ తపస్వి చేయని యోగ ప్రక్రియ చేసినాడు. గురుదక్షిణగా తన మృత పుత్రుని తీసుకు రావలేనని సాందీపని ఆయనను కోరెను. కృష్ణుడు వెంటనే ధ్యాన ముద్రలో స్వాధిష్ఠానమునకు వెళ్ళినాడు. వెంటనే అతని దివ్య శరీరము యమలోకములో ప్రత్యక్ష మైనది. యముడు ఏమికావాలని అడుగగా కొన్ని సంవత్సరముల క్రితం చనిపోయిన గురుపుత్రుని జీవాత్మ కావలెనని అడిగి తీసుకొని భూలోకమునకు వచ్చినాడు. అప్పటి వయసు ఎంత ఉండునో, అట్టి శరీరమును యోగశక్తిచే సృష్టించి, జీవుని అందు ప్రవేశింపజేసినాడు. ఇది అనితర సాధ్యము అనిపిస్తుంది.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 8
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
21
రాధ ఎవరు? పశ్చిమ సముద్రతీరములోని ద్వారక రాధికా క్షేత్రమే. ద్వారకలోని పరాశక్తి అంశ రాధ. దాక్షాయణి హృదయము అక్కడ ఉంది. కృష్ణావతారసమయములో ఆమె మానవస్త్రీగా జన్మించినప్పుడు ఆమెలో గోలోక జ్ఞానము ఉన్నది. ఆమె లోకాతీతజ్ఞానముతో పుట్టినది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి రూపమైన రాధనే. ఆమె మానవ స్త్రీ గావచ్చి ఆయనతో సాహచర్యము చేసి వెళ్ళినది. ఆమె జ్ఞానాంశ. కృష్ణునితో అభేదము కలిగియున్నది. ఈ ద్వారకా నాథుడు కూడా పరశివ తత్త్వము. కృష్ణుడు ప్రభాస తీర్థములోని సోమనాథుని ఆరాధించాడు. ఆ సమీపములోనే ఆయన మహాపరి నిర్వాణము కూడా జరిగినది. ఆయన లోని విష్ణుతత్త్వము అవతార సమాప్తి కాగానే వైకుంఠమునకు వెడలిపోయినది. శివతత్త్వమే మిగిలిఉన్నది. కృష్ణుడు భూమి మీద అవతరించక ముందే భూలోకములో ఆయనకై వేచియున్న పరాశక్తి రాధ.
 

22
బ్రహ్మ వస్తువు రూపగుణములులేని నిత్య సత్యము. జగత్తు నిత్యమూకాదు, సత్యమూ కాదు. దీని నిర్మాణమునకు ఆ నిర్గుణబ్రహ్మమునుండి పుట్టి అందులోనే లయమయ్యే రెండు తత్త్వములు కారణము. అవి పురుష స్త్రీ తత్త్వములు. మనమున్న 14 లోకముల బ్రహ్మాండ సృష్టికి మహావిష్ణువు అనే పురుషతత్త్వము, బ్రహ్మ, రుద్రుడు అనే మరిరెండు పురుష రూపములు, లక్ష్మి, సరస్వతి, పార్వతి అనే స్త్రీ తత్త్వములు కారణము. ఈ సృష్టిలోని జీవులు ఈ త్రిమూర్తులను ఆరాధించి వరములు పొందుతారు. ఈ లోకములు కాక బ్రహ్మాండమందు గోలోకమనే లోకము ఉన్నది. ఈ లోకములో జీవులు నిత్యులు, ఆనంద స్వరూపులు. ఈ లోక పాలకులు రాధాకృష్ణులు.శుద్ధ ఆనందమైన బ్రహ్మ స్వరూపులు. ద్వాపరాంతమందు వీరే భూమియందు అవతరించినారు. వారి ఉపాసన వలన సర్వ కర్మాతీతమై ఏ కర్మఫలమూ కానటువంటి ఒకానొక ఆనందము మనకు లభిస్తుంది.
 
23
దేవీభాగవతం రాధాదేవి ఉపాసనను వివరిస్తుంది. గోలోకంలో రాధాకృష్ణులను దేవతలందరూ అర్చించారు. సరస్వతి, బ్రహ్మ, శివుడు, లక్ష్మి, దుర్గ, మొదలైన వారందరూ దుర్గా మహోత్సవం జరిపినట్లు, పురాణ కథనం. బ్రహ్మకోరిక మేరకు శివుడు గానం చేయగా, ఆ గానరసంలో రాధాకృష్ణులు కరగి జలమై ప్రవహించారట. ఆ విధముగా గంగయే రాధ. శివుడు తిరిగి స్తుతించిన తరువాత రాధాకృష్ణుల దర్శనం అందరికీ లభించింది. ఈ గంగ భూలోకంలోని రాసమండలంలో ఉద్భవించినదనికూడా చెబుతారు. రాసమండలమంటే శ్రీకృష్ణుడు రాసలీల నిర్వహించిన వర్తులాకార స్థలము. దీని అంతరార్థము రాధాకృష్ణులు కేవలము రసమయ స్వరూపులు. వారి రస తత్త్వము అనురాగ జన్యమైన ఆనందము. భూమిపై అవతరించిన శ్రీకృష్ణుడు రాధయందు గోపికల యందు మానవాతీతమైన అనురాగమును కలిగించినాడు.
 
24
శ్రీకృష్ణుడు తన భార్యలందరినీ సమముగా ప్రేమించినాడు. అందులో ఆశ్చర్యమేమున్నది? అతడు సమస్త ప్రాణికోటినీ సమానముగా ప్రేమిస్తున్నాడు. ఒక సారి కృష్ణుని భార్యలైన మిత్రవింద, కాళింది అనేవారికి ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు? అనే సందేహము వచ్చింది. శ్రీకృష్ణుడంటే ఎక్కువ భక్తి కలిగినది రుక్మిణి అని ఎక్కువ ప్రేమ కలిగినది సత్యభామ అనీ వారి అనుమానము. వారినే వాళ్ళు అడిగారు. సత్య సమాధానం "భక్తి, ప్రేమలలో ప్రేమ ప్రధానం. అందరు భార్యలకంటె నేనే ఆయనకు ఇష్టము" అని ఆమె అన్నదట. రుక్మిణి ఇలాచెప్పినది. "ఆయనకు సమస్త జీవరాసులపై సమానమైన ప్రేమ.అట్టివారిలో నేనొకతెను." శ్రీకృష్ణుడు దక్షిణ నాయకుడు, భార్యలందరిపై సమాన ప్రేమ కలవాడు. సత్యభామ, రుక్మిణీ, రాధ వీరి ప్రేమలలో తేడా ఏమిటి? సత్యభామది భూతత్త్వము. ఆమె నిరంతరం ఆయన భౌతిక సాన్నిహిత్యము కోరుతుంది. ఇది తామసిక ప్రేమ. రుక్మిణి అతడు తనవద్దకు వచ్చినప్పుడు పూజిస్తుంది. అతడు దగ్గరలేనప్పుడు హృదయమందు ధ్యానిస్తుంది. ఇది రాజసిక ప్రేమ. రాధ ఎప్పుడూ కృష్ణుని సన్నిధిలోనే ఉన్నట్లు భావించుకుంటుంది. అతడు సన్నిహితముగా లేని భావనయే ఆమెకు ఉండదు. ఆమెది సాత్త్విక ప్రేమ. రాధాకృష్ణుల తత్త్వము అర్ధనారీశ్వర తత్త్వమే. ఒక నాణెమునకు కృష్ణుడు ఒకవైపు, రాధ మరియొకవైపు. వారు సనాతనులు.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 9
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
25
భగవంతుడు మత్స్యావతారములో వేదరాశిని సముద్రగర్భమునుండి సోమకాసురుని నుండి రక్షించి జగత్తుకు తిరిగి ఇచ్చాడు. సోమకుడు అపహరించాడంటే అర్థం ఏమిటి? ధ్వనిరూపములో విశ్వవ్యాప్తమైన వేదమును ఉపసంహరించి, ఆ శబ్దస్వరూపమును పరాస్థితిలో ఉంచి ఎవరికీ వినపడకుండా ఉండే ప్రయత్నముచేశాడు. సృష్టి, స్థితి, లయ జ్ఞానముల నివ్వగలిగిన వేదమును ఉపసంహరించడం వలన త్రిమూర్తుల కార్యక్రమములోనే అంతరాయం కలిగినది. విష్ణువు మత్స్యావతారంలో ఆ అసురుని సంహరించి ఆ జ్ఞానమును తాను గ్రహించి జగత్తుకు తిరిగి ఇచ్చాడు. తిరిగి ఆవేద సారమును భగవద్గీత రూపముగా ప్రవచించి లోకానికి అందజేశాడు. తరువాత తానే బుద్ధుడుగా వేద కర్మలను ఉపసంహరించి జ్ఞానబోధ చేశాడు. ఒకరకముగా వైదిక కర్మకాండ ప్రాముఖ్యతను తగ్గించి కలియుగమునకు తగినట్లు జ్ఞాన బోధచేయడం శ్రీకృష్ణుని ఉద్దేశ్యం. కలిపురుషుని అవతారమైన దుర్యోధనుని ఎదురుగా దేవేంద్రుని అంశయైన అర్జునునికి గీతాబోధచేయడంలో అంతరార్థమిదే.
 
26
భగవద్గీత విచిత్రమైనది. ఒకొకరికి, వారికి ఉచితమైన సందేశం ఇచ్చినట్లు కనబడుతుంది. ప్రారంభములో యుద్ధము చేయనన్న అర్జునుని "క్షుద్రం హృదయ దౌర్బల్యం" అని హెచ్చరించి, చివరలో "సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అని అన్నింటినీ వదలమని చెప్పాడు. గీత వివిధ మనస్తత్వాలకు వివిధమైన స్ఫురణలు ఇస్తుంది. ఈ 28వ మహాయుగము వరకు తపస్సులు, స్వాధ్యాయనిరతి, యజ్ఞ కర్మ, భగవత్తత్వ జ్ఞానము మోక్ష ప్రాప్తికి మార్గములు. కలియుగ వాసులకు ఇవి అసాధ్యములని భగవంతుడైన శ్రీకృష్ణుని నిర్ణయము. వీరి అర్హతకు తగిన నూతన మార్గము కృష్ణునిచేత ఆవిష్కరింపబడినది. ఇక్కడ భక్తి ప్రేమలను భగవత్పరము చేయడమే ముక్తి మార్గము. గోపికలు ఆతని వంశీగానము విని ఆత్మానంద భరితులై ఆ కృష్ణ రూపమును మోహించి, కాంక్షించి తరించారు. కుచేలుడు తత్త్వవేత్త. దూరంగా ఉంటోనే తత్త్వగ్రహణముచేత ఆయన యందు లీనమైనాడు. అమాయకులైన గోపాలకులు ఆయన స్నేహములో మోహావిష్టులై తరించారు. చైతన్యుడు బోధించినది ఇదే. కృష్ణుని చేరుటకు మధురభక్తి మార్గము ఈ యుగములోనే పుట్టినది.
 

27
అధర్వణవేదంలో కృష్ణోపనిషత్తు ఉంది. ఇది కృష్ణావతారానికి ముందే ఉన్నది. శ్రీరామావతారములోనే కృష్ణుని జన్మకు నాంది ఏర్పడినది. శ్రీ రాముని జగన్మోహన రూపమును మునులు చూచి, ఉపాసించి మోహబద్ధులై గోపికలుగా జన్మించారు. సృష్టిలో ఈ మోహము జీవలక్షణముగా ఉన్నది. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, భోగభాగ్యములపై మోహము ఈ రెండూ మనుష్యుని దృష్టి ని పారమార్థిక విషయములపై పోనివ్వటంలేదు. ఇట్టి మోహావిష్టుని కొరకు ఆవిర్భవించినదే కృష్ణుని మోహనరూపము. త్రేతాయుగమందు శ్రీరామదర్శనము పొందిన తపశ్శాలురు, కృష్ణావతార సమయములో విజ్ఞానము లేని మందబుద్ధులైన గోపికలుగా జన్మించారు. రాముని రూపముచే మోహితులైన మునులు, గోపికలుగా ఆమోహావేశముచేతనే ముక్తులైనారు. ఇదే దీనిలోని తత్త్వ రహస్యము. కాలగతిలో ముక్తిమార్గములలోని మార్పులు కృష్ణునిచేత సూచించబడినవి.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 10
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)

28
శ్రీకృష్ణావతారము యొక్క ఆవిర్భావము పరమాత్మ సంకల్పము. అప్పుడే రుద్రాదిదేవతల ఆవిర్భావముకూడా జరిగినది. సకల దేవతాంశలూ కృష్ణునిలో ఉన్నాయి. రుద్రుని ఘోరరూపము కృష్ణుని నందకమనే ఖడ్గము. కృష్ణుని వేణువు సకల కళామయమైన రుద్రుని శాంతరూపము. ఇంద్రుడు శృంగముగా, బ్రహ్మ యష్టికగా జన్మించారు. సాందీపనిముని బ్రహ్మయే. బ్రహ్మానందము నందుడు, ముక్తికాంత యశోద.అందుకే ఆనందస్వరూపుడైన కృష్ణుని బాల్యం నందగోకులములోగడచినది. బలరామకృష్ణులే వేదార్థము. "ఉపనిషదర్థం ఉలూఖలేనిబద్ధం" అన్నారు.(అంటే ఉపనిషత్తుల అర్థమైన కృష్ణుడు యశోదచేత ఱోలుకి కట్టబడ్డాడు.) ఉలూఖలము (ఱోలు) కశ్యప ప్రజాపతి. రజ్జువు అదితి. అది ఖండనమండనలకు అతీతమైనది. గోప, గోపికలు వేదమతులైన ఋషులు. పరమేశ్వరుని ఉచ్చ్వాస నిశ్వాసములు వేణువులో ప్రవేశించి నాదరూపమున వెలువడినవి. గోకులము వైకుంఠము. వనమునందలి వృక్షములు నారదాది మునులు. పదహారు వేలగోపికలు ఉపనిషన్మంత్రములు. చాణూర ముష్టికులు ద్వేష, మాత్సర్యములు. కంసుడు కలహము. సుదాముడు శమము. ఉద్ధవుడు దమము. అకౄరుడు సత్త్వగుణము. వైజయంతీమాల వేదముల తేజస్సు. దాని సువాసన ధర్మము. గద కాళిక, సంహార శక్తి. ఇటువంటి వివరణకూడా ప్రచారములో ఉన్నది.
 
29
మనుష్యులు మిత్రభావనతోగాని, శతృభావనతోగాని, శృంగారభావనతోగాని, ప్రేమ, భక్తి భావనలతో కాని భగవంతుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయనను తమవంటి మనుష్యునిగానే చూస్తారు. దాతగా చూస్తారు, సంహర్తగా చూస్తారు, అతడు తనని చంపబోతున్నాడనే భయంతో చూస్తారు, చనిపోతారుకూడా, ప్రియునిగా చూస్తారు. అనుగ్రహాన్ని అనుభవించి ఆనందం పొందుతారు. ఏ భావంతో ఈశ్వరునిచేరుతారో ఆ అనుభూతి వారికి లభిస్తున్నది. ఆయన క్రియాశూన్యుడు, నిర్లిప్తుడు. భాగవతం జీవులచరిత్ర.
 
30
కృష్ణావతారం ధర్మ సంస్థాపనకు వచ్చినది కదా, ఈ గోపికలు, పదివేలమంది భార్యలు వీటినన్నిటినీ ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మనం ఆయనను ఒక మానవుని వ్యక్తిత్వం కలవానిగా చూడడంవలన వచ్చిన సందేహం. ఈ స్త్రీలందరితో సంచరించిన కృష్ణుడనే వ్యక్తి అక్కడలేడు. అతడు చేసినట్లు భావింపబడుతున్న శృంగార చేష్టలు ఆయనకు వర్తించవు. జీవుల మనస్సులోని భావనలు మాత్రమే అక్కడ ఆజీవులకు అనుభవంలోకి వస్తున్నాయి. పరమాత్మ సర్వకారణకారణుడే కాని వ్యక్తుల సుఖ, దుఃఖాలనే తాత్కాలిక అనుభవాలలో అతని పాత్ర లేదు. పుణ్యంచేసినవాడు పుణ్యఫలంపొందినా, పాపంచేసినవాడు పాపఫలం పొందినా అదిదైవ శాసనమేకాని, ఆయన కర్తగా ఏపనీ చేయడంలేదు. ఆయన నిర్లిప్తుడు. కార్యంలేదు. క్రియలేదు. పరమాత్మ. సర్వాంతర్యామి. సాక్షీభూతుడు. మనవంటి మానవమాత్రునిగా చేసిన భావనలోనే ఆయన దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ కూడా ఉన్నాయి. ఈ ద్వంద్వస్థితిలో మానవమాత్రులమైన మనము ఉండటంవలన ధర్మాధర్మ విచక్షణ మనకు కలిగి, ఆయనకు ఆపాదిస్తున్నాము.
 
31
శుకుడు పరీక్షిత్తుకు చెబుతున్నాడు: ఈ ప్రపంచములో అసత్యము అసత్యాన్నే పొందుతుంది. జీవుడే అసత్యం. అతడు పొందే కర్మఫలం అసత్యం. ఒక గోపిక పొందిన ఆలింగన, చుంబనాది సుఖములన్నీ ఆజీవుడు ఊహించి, కోరుకొని, ఆస్థితిని అనుభవించాడు. అక్కడ ఉన్న కృష్ణుడు ఎప్పుడూ ఒకవిధంగానే ఉన్నాడు. అతడు సుఖదుఃఖాలకి అతీతుడు. అతనిశరీరం అతనిని బంధించదు. ఆయన సుందర మోహన రూపం కూడా గోపికలు ఊహించుకున్నదే. కంస, శిశుపాలురకు ఆకృష్ణుడే భయంకరంగా కనుపించాడు. వారి వారి భావనలను అనుసరించి వారికి అనుభవం అవుతుంది. గోపికలు పొందిన విరహం, కలయిక, సంతోషం, దుఃఖం అంతా చిత్తవృత్తియే, భ్రాంతియే. ఈ చిత్తంలోనున్న ఆత్మవస్తువు పరమాత్మకు సన్నిహితంగానే ఉంటుంది.చిత్తానికి అంతకంటె సమీపవర్తి మరియొకటి లేదు. ప్రేమతో ఒకరు, మోహముతో మరియొకరు, శత్రుభావంతో ఇంకొకరు సాయుజ్యం పొందారు. "బాలోన్మత్త పిశాచవత్" అంటారు. చిన్న పిల్లలవలె ఆ అనుభూతికలిగిన తరువాత ప్రపంచ స్పృహ కోల్పోవడం అందరికీ సాధ్యమైనదే. అందుకే రాసలీలలో అందరు గోపికలకు ఏకకాలంలో అందరుకృష్ణులు లభించారు. వారి పూర్వ జన్మ తపస్సు, ఈ జన్మలోని తపన వలన వారికి ఆ అనుభవం సాధ్యమైనది. అది వాళ్ళకు మోక్షహేతువు అయినదని భాగవతం చెబుతుంది.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 11
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)

32
కృష్ణతత్త్వాన్ని సంపూర్ణంగా అర్థంచేసుకోవడం సాధ్యంకాదు. ఆ తత్త్వము ఒక అద్దము వంటిది. అందులో ఎదుటివారి తత్త్వమే ప్రతిబింబిస్తుంది. శత్రుభావముతో దానిముందు నిలబడితే అందు శత్రుత్వమే గోచరిస్తుంది. ప్రేమభావంతో ముందుకువెడితే ప్రేమను అందిస్తుంది. మహాత్ములు ముందు నిలిస్తే అదీ మహాత్ముడే అవుతుంది. ఎట్టిభావములేకుండా
 నిర్లిప్తతతోనిలిస్తే అందులోనూ నిర్లిప్తతే కనబడుతుంది. ఈవిధముగా దాని సంపూర్ణత్వాన్ని తెలుసుకోగలిగే అవకాశం ఉంది. జగత్తులో అన్ని వ్యాపారాలలోనూ ప్రవర్తిస్తూ తాను నిర్లిప్తుడుగా ఉండగలగడం కృష్ణునకే చెల్లింది. పదివేలమంది భార్యలూ, అష్టమహిషులు, బంధుమిత్రులూ అందరినీ వదలి, ఎవరికీచెప్పకుండా వెళ్ళి దేహత్యాగంచేసిన కృష్ణుడిని ఏమి బంధించగలదు? తాను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైనదని ఒక్కరికీచెప్పలేదు. రాజుగా నిర్వర్తించవలసిన బాధ్యతతో, స్త్రీలను రక్షించమని అర్జునునికి కబురు చేశాడు. "అహం కాలోస్మి" అనిచెప్పిన కాల స్వరూపుడుగా మాత్రమే ప్రవర్తించాడు. గీతాబోధ సమయంలో తాను రక్షిస్తానని అర్జునునికి వాగ్దానం చేయలేదు. వారంతా మరణిస్తున్నారు. మీరు గెలుస్తారు. 30 సం. రాజ్యం చేస్తారు. తరువాత మీరూ పోతారు. అని అని కాలగమనాన్ని మాత్రమే సూచిస్తాడు.
33
తన అవతార సమయములో శ్రీకృష్ణుడు ఏక కాలంలో మనుష్యునిగాను, భగవంతునిగాను రెండు భూమికలు సమర్ధతతో నిర్వహించాడు. లౌకిక విషయములలో లౌకిక ప్రజ్ఞనుమాత్రమే ప్రదర్శించాడు. భీష్ముడు, విదురుడు వంటి జ్ఞానులు మాత్రము ఆయన చేతలవెనుకయున్న భగవల్లక్షణమును గ్రహించారు. సామాన్యులకు సామాన్యునివలెనే కనబడుతూ, జ్ఞానికి అతిగంభీరుడైగోచరిస్తూ ధ్యానిస్తేతప్ప అంతుబట్టని వానిగా సంచరించాడు. మహా భారత యుద్ధము తప్పదని తనకు తెలుసు. దానికి తాను నిమిత్తకారకుడని తెలుసు. ఆయన కేవలము ఒక మనుష్య రాయబారివలెనే కురుసభలో సంధి ప్రయత్నముచేశాడు. ఆయన మనుష్యునికి అతీతమైన సంకల్పముచేస్తే అది జరిగితీరుతుంది. కాని అలాచేయలేదు. పాండవులు సాధువులు. వారి ధర్మమే వారిని రక్షిస్తుంది. అందుచేత ధర్మ మార్గమును అవలంబించమని కౌరవులకు చెబుతూ వచ్చాడు.
34
శ్రీకృష్ణుని లౌకికప్రజ్ఞకు ఈ ఉదాహరణ ఈయవచ్చు. పాండవులు లాక్షాగృహములో దహనమయ్యరని వార్త తెలియగానే దుఃఖితుడై శ్రీకృష్ణుడు వారి ఉత్తరక్రియలు శ్రద్ధతో చేస్తాడు. పాండవులకు అప్పటికి వివాహము కాలేదు.సంతానములేదు. అందుకు తానే చేస్తాడు. ఆయన వంటి యోగీశ్వరునికి అంతరంగంలో వారు ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తుంది. ఐనా ఆయన భార్య రుక్మిణికి కూడా ఈవిషయం చెప్పలేదు. తను దుఃఖించి ఉత్తర క్రియలుచేస్తే దుర్యోధనాదులకు వారి మరణం గురించి ఏ అనుమానాలు ఉండవనే ఆయన అలా చేశాడు. దుర్యోధనుడు పాండవుల ఉనికిని కనుక్కొనే ప్రయత్నాలు చేయడనే ఉద్దేశ్యంతోటే కృష్ణుడు ఈ పనిచేశాడు.
35
హృదయమందున్న జ్యోతియే ఆత్మ వస్తువు. దానితేజస్సు సర్వ వ్యాప్తమైఉంటుంది. అందులోనే లోకములన్నీ కనుపిస్తాయి. బాల కృష్ణుడు ఈదీపశిఖలో కనుపింఛే బ్రహ్మాండాన్నే తన నోటిలో యశొదకు చూపిస్తాడు. ఈజ్యోతి అతి సూక్ష్మమైనది. కృష్ణుడు నోరుతెరచి తన హృదయాంతర్గతమైన జ్యోతినే యశోదకు చూపిస్తాడు. చిత్తముయొక్క విక్షేప శక్తివలన ఆమె అబ్బురపడి చూస్తూ ఉండిపోయినది. ఆమె యశోద. అంటే యశమును ఇచ్చునది. ఆమెద్వారా ఈ సంఘటన లోకానికి తెలిసినది. ఆయన యశస్సు లోకానికి చాటిచెప్పినది.ఆమెకు జగత్తుకు కారణమైన బిందువుని చూపిస్తే , ఆమెకు దానిలోని లోకములన్నీ కనుపించాయి. అర్జునునికి ఒక్క విశ్వరూపం మాత్రమే చూపించాడు. కృష్ణుడు ఆమె అవిద్యను ఆమెకి తిరిగి ఇచ్చివేశాడు. ఆమె కృష్ణుని దివ్యత్వంతెలుసుకోలేదు. బాలునికి ఏగాలో సోకినది. అని అనుకొని విభూతి పెట్టి ఉంటుంది.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 12
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
36
యుద్ధరంగములో శ్రీకృష్ణుడు అర్జునునకు గీతాబోధన ఈశ్వరునిగా చేశాడా, గురువుగా చేశాడా, పార్థసారథిగా చేశాడా? అన్నప్రశ్నలు వస్తే గురువుయొక్క స్థాయిలోనే చేశాడనిచెప్పాలి. కేవలము బోధమాత్రమే కాదు, యథోచిత కర్మను కూడా చేయించాడు. తన సమర్థతను తెలియచేయడానికి హృదయపు తెర తీసి విశ్వరూపమును ప్రదర్శించాడు. అనేకులు మహర్షులు, యోగులు, సద్బ్రాహ్మణులు ఉన్నకాలంలో తాను జ్ఞానబోధచేయటమేమిటి అనే ప్రశ్న రాకుండా తన సర్వజ్ఞత్వము, సర్వేశ్వరత్వము నిరూపించుకోనుటకై ఈ విశ్వరూప ప్రదర్శన అవసరమైంది. ఈ నాడు అవతారములు లేవు, మహర్షులూ లేరు. ఈ కాలములోని గురువులు అహంకారమును జయించి, భగవంతునిచేత ఆదేశింపబడిన మానవ మాత్రులుగా, నిమిత్తమాత్రులుగా ఈశ్వరునిగురించిన జ్ఞానం తమ అనుయాయులకు కలుగజేస్తే అది దేశానికి మంగళకరమౌతుంది.
 
37
పరమేశ్వరుడు గురువుగా భూమిపై అవతరించి ఏది యోగమో, ఏది క్షేమమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఎందుకు జీవించాలో, ఏమార్గములో ఏఏగుణదోషములున్నాయో అన్నీవిశ్లేషించి మార్గదర్శకుడైన తరువాత ఈ భూలోకంలో గురు వ్యవస్థ అవతరించినది. అంతకు పూర్వం ఊర్ధ్వలోకములలోని గురువులు కపిల, దత్తాత్రేయాది మహర్షులు, దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్యాదులు. ఈ భూలోకములో ప్రధమముగా ఈ వ్యవస్థకు కారకుడు శ్రీకృష్ణ పరమాత్మయే. అందుకు ఆయనను జగద్గురువు అనిచెబుతాము. ఆయన గురువేనని కృష్ణతత్త్వమును మనకు తెలియజప్పినవాడు విష్ణువు అవతారమే ఐన వేదవ్యాసుడు. సృష్టి రహస్యములు తెలిసినవాడు, ప్రకృతి లక్షణములు తెలిసినవాడు, భగవంతుడైనవాడు, ముక్తికి అతిసులభోపాయము తెలిపి, బంధ విముక్తిని కలిగించువాడే జగద్గురువు. ఆర్య వైదిక సంస్కృతిలోని పలురకముల మార్గములను సమన్వయ పరచి మనము వాటిని ఎలా స్వీకరించవలెనో, మన బాధ్యతలు ఏమిటొ చెప్పవలసిన కాలము సమీపించినప్పుడు, కృష్ణుడు అవతరించి జగద్గురువైనాడు. అతడు ఎవరినైనా ఉద్ధరింపగాలడు.
 
38
కృష్ణుని జగత్రయ గురువని వ్యవహరిస్తారు. భూ, భువ, సువర్లోకములకు ఆయన గురువు. ఈ ముల్లోకవాసులందరిపై ఆయన తన అనుగ్రహమును ప్రసరింపచేస్తాడు. కొందరిని రక్షిస్తాడు. కొందరిని అవసరమైనప్పుడు శిక్షిస్తాడు. కొందరికి ముక్తి మార్గమును చూపిస్తాడు. తమస్సునుండి జ్యోతివైపు తీసుకువెళ్ళగల సమర్ధత ఆయనది. తమస్సు అంటే జీవుని అవిద్యాస్థితి. ముక్తికాంక్ష శుభేచ్ఛ. అది పూరింపగలవాడు జగద్గురువు. ఆయన కేవలము ఒక సంప్రదాయమునకు, ఒక దేశకాల పరిస్థితికి చెందినవాడు కాడు.
 
39
కృష్ణుడు అర్జునునికి కేవలం రథం నడుపుతాననీ, ఆయుధంపట్టననీ, యుద్ధంచేయనని చెబుతాడు. యుద్ధ ప్రారంభములో అర్జునుడు హృదయదౌర్బల్యానికి లోనై యుద్ధంచేయజాలనని అన్నప్పుడు తటస్థముగానుండక ఉపదేశకార్యమునకు పూనుకొని భగవద్గీత అంతా చెప్పాడు. "నీవు యుద్ధం చేస్తానంటే సారధిగా వచ్చాను. లేదంటే మరలి పోతాను" అనిచెప్పలేదు. "నీది క్షుద్రమైన దౌర్బల్యం. నీవు నీస్వధర్మం పాటించి కర్మచేయాలి. అంటే నీవు యుద్ధంచేసితీరాలి" అని పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు. మాములుగా భగవంతుడు మనుష్యులా కర్మలకు సాక్షిమాత్రంగా ఉంటాడు. ఆయనకు స్వంత ప్రేరణ ఏదీ ఉండదు. జీవులు ఇష్టకామ్యార్థ సిద్ధికొరకు కర్మలు చేస్తారు. భగవంతునకు కోరికలు యేమీలేవు. మరి అర్జునుని విషాదానికి ప్రతిస్పందనగా గీతాబోధ ఎందుకుచేసి కర్మకు సుముఖుడిని చేశాడు? అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తులు ఉంటే ఒక్క అతని విషయంలో భగవంతుని స్పందన ఉంటుందని భావించాలి.

కృష్ణతత్త్వ విశేషాలు -13

(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)

40

కృష్ణావతారమంటే కృష్ణుడు మరియొక రూపంతో అవతరించాడనికాదు. భగవంతుడు కృష్ణునిగా అవతరించాడనే అర్థము. శ్రీకృష్ణావతారమని అనడమే సాంప్రదాయం. "శ్రియః సహిత శ్రీకృష్ణః" - అంటే లక్ష్మితో కూడుకొన్న కృష్ణుడు. శ్రీ చేరిస్తేనే నామానికి పరిపూర్ణత వస్తుంది. శ్రీ అనగా లక్ష్మి, మాయ, పరాశక్తి. మాయా విశిష్టుడైన కృష్ణపరమాత్మ చరిత్రయే శ్రీకృష్ణతత్త్వము. ముందు పేరుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పార్వతీ పారమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణీ హిరణ్యగర్భులు అన్నట్లే శ్రీకృష్ణుడు అనాలి. స్త్రీలు శక్తిరూపులై, వారికి ముందుండి శక్తిని ప్రసాదిస్తుండడం వలననే, త్రిమూర్తులకు ఆచంద్రాతారార్కమైన ,ప్రతిష్ఠ లభించినది. గృహిణి ఉన్నప్పుడే సౌభాగ్యవంతమైన గృహస్థాశ్రమము.
 
41

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో అర్జునునితో ఇలా అంటాడు. "అజో'పి సన్నవ్యయాత్మా భూతానామ్ ఈశ్వరో'పి సన్ । ప్రకృతిం స్వం అధిష్ఠయ సంభవామి ఆత్మమాయయా ॥" (భ. గీ. 4.6). నాకు జన్మ లేదు, మరణములేదు. జన్మించే అవసరము కాని, మరణించే అవసరము కానిలేదు. శతృ, మిత్ర భావన లేదు. ఒక కార్యనిమిత్తమై ఆవిర్భవిస్తూ ఉంటాను. అవ్యక్తమైన తత్త్వము వ్యక్తము కావడము, తరువాత వ్యక్తమైన తత్త్వము అవ్యక్తము కావడము నా ఆవిర్భావములో కనుపిస్తుంది. భూదేవి గోరూపమును ధరించి, బ్రహ్మ, శంకరుల ఆదేశముమేరకు తన భారమును, బాధలను తొలగింపమని విష్ణుదేవుని కోరినది. ద్వాపరయుగాంతములో దేవకీవసుదేవుల సంతానముగా తాను జన్మించి, ఆమె బాధలను తొలగిస్తానని నారాయణుడు ఆమెకు అభయమిచ్చాడు. శ్రీకృష్ణావతారానికి బీజమప్పుడు పడినది. కాని భగవంతుడు వైకుంఠములోని రూపముతో భూమిపై సంచరించలేడు. ప్రకృతిలో ఇతరమనుష్యులవలెనే కనుపిస్తూ వారిలో ఒకడై జీవించాలి. ఉత్తమ జీవులు మాత్రం వారి అంతరంగంలో ఆయన నిజతత్త్వం గ్రహించ గలుగుతారు. మిగిలినవారికి ఆయన అందరిలో ఒకరిగానే కనపడుతారు. తల్లిదండ్రులు, ఆకలి దప్పులు, భార్యా పుత్రులు, శతృవులు, మిత్రులు - అందరూ ఉంటారు. జనన మరణాలు కూడా సామాన్యంగానే కనుపిస్తాయి. అందుకే అనేకులకు ఆయన తమకంటే ఏ విధమైన ఆధిక్యత లేని వ్యక్తిగానే కనుపించాడు.
 

42

"గచ్ఛ దేవీ వ్రజం భద్రే గోపగోభిరాలంకృతం" (భాగ. 10.2.6.) దేవీ నీవు గోపకులతోను, గోవులతోనూ అలంకరింపబడిన వ్రజభూమికి వెళ్ళుమని ఆయన యోగమాయను ఆదేశిస్తాడు. "నేను భూలోకంలో మధురలో ఆవిర్భవిస్తాను. వెంటనే నందగోకులానికి వెడతాను. అక్కడ పన్నెండు సంవత్సరాలు నాలీలలను ప్రదర్శిస్తాను. నీవు ముందు అక్కడకు వెళ్లి ఏర్పాట్లు చూడమని ఆమెకు చెబుతాడు. యోగమాయ ఆవిధంగా చేసి, కృష్ణలీలలకు రంగస్థలం సిద్ధంచేసినది. భగవంతుడు ఆమెకు ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవం దీనిలో తెలుస్తాయి. గోకులంలో ఆయన అందరికీ కనుపించినది ప్రాకృత రూపంలో. ఐనా ఆయన అప్రాకృత తత్త్వం అన్నిలీలలలో స్పష్టంగా కనుపిస్తుంది.


శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 14

(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)

43

ఛాందోగ్యోపనిషత్తులో పంచాగ్ని విద్య అనేది చెప్పబడినది. "ద్యుః పర్జన్య పృథివీ, పురుషః, యోనిః " అని ఐదు అగ్నులుగా జీవుని సృష్టిక్రమం చెప్పబడినది. ఒకవ్యక్తి మరణించినతరువాత జీవుడు యమ లోకంలో నిర్ణయించబడిన సుకృత, దుష్టకర్మల ఫలాలను అనుభవించిన తరువాత జీవకణం వరుసగా చంద్రమండలం, మేఘమండలం, భూమండలం, ఓషధుల ద్వారా పురుషునిలో ప్రవేశించి తరువాత పురుషుని వీర్యముద్వారా స్త్రీ గర్భాశయంలో ప్రవేశ పెట్టబడుతుంది. అక్కడకొంతకాలము తరువాత వృద్ధికలిగి అన్నమయకోశము ఏర్పడి, అక్కడ రక్తము, మాంసము, మేధస్సు, చర్మము, మొదలైనవి కలిగిన శరీరము ఏర్పడుట పంచాగ్ని విద్యలో ఉన్నది. దేవకీ వసుదేవులకు కృష్ణునికి ముందు జన్మించినవారు బ్రహ్మచేత శపించబడిన మరీచి మహార్షి పుత్రులు. కంసునిచేత వెంటనే వధింపబడి శాప విమోచనము కలిగి వెళ్ళి పోయినారు. భగవానుడు ఈవిధముగా జన్మింపలేదని శ్రీభాగవతం స్పష్టంగా చెబుతుంది. దేవకీ గర్భమునందు భగవానుని ప్రవేశానికి దేవకీవసుదేవులకు శారీరక సంబంధములేదు.
 

44

" మనః ఆవేశాత్ ముఖం మే ఆవివేశ అంశభావేన " - భగవానుడు తానుభూలోకమునకు రావలసిన నిర్ణీత ముహూర్తమునకు వసుదేవుని మనస్సును ఆశ్రయించాడు. అంతవరకూ దేవకీ వసుదేవులు కారాగారములో ఉన్నా వారి దాంపత్యజీవితానికి భంగమురాలేదు. వసుదేవుని మనస్సును భగవంతుడు ఆశ్రయించిన నాడు దేవకీదేవికి వసుదేవునిముఖంలో ఒక దివ్యతేజస్సు కనబడినది. ఆమె విభ్రాంతి చెందినది. తరువాత వసుదేవుడు ఆమెను తదేకదృష్టితో చూచాడు. తనను ఆవహించిన శక్తిని దేవకీదేవి దృష్టిద్వారా ఆమె గర్భాశయములో ప్రవేశపెట్టబడినట్లు శాస్త్రములు చెప్పుచున్నవి (శ్రీధరీయము). తన గర్భములోని జీవుడు కర్మ బద్ధుడు కాడు. ఈ గర్భధారణ చిన్మయ రూపము. (పవిత్రమైన చిత్తమునుండి వెలువడిన ఆలోచనకు కార్యరూపము). యోగభూమికలో గర్భము ధరించి గర్భములో పిండము కదలికలను అనుభవించే సౌభాగ్యము ఆమెకు స్వాయంభువ మన్వంతరములో చేసిన పుణ్యఫలము వలన లభించిన అదృష్టము.
 

45

ఎవరు ఈ వసుదేవుడు? సాక్షాత్తు నారాయణుని పుత్రునిగా ఎలా పొందగలిగాడు? వసుదేవుడు మానవ శరీరమును ధరించిన కశ్యప ప్రజాపతియే. కశ్యపుడు ఒకసారి విష్ణువుని ప్రార్థింఛాడు. "దేవా నాకు ఎన్ని జన్మలు ఉన్నాయో తెలియదు. నా కార్యక్రమం పూర్తి అయ్యేవరకు నాకు ఎన్ని జన్మలున్నాయో అన్నిజన్మలలోనూ నీవే నాకు పుత్రునిగా జన్మించాలి" సరే అని విష్ణువు వరమిచ్చాడు. ఆ వరప్రభావంచేతనే విష్ణువు వసుదేవునికి పుత్రుడైపుట్టి వాసుదేవునిగా ప్రఖ్యాతిపొందాడు. దేవకి కశ్యపుని భార్య అదితి. ప్రధమంగా అదితి కశ్యపులకు సంతానముగా వామనుడు జన్మించాడు. బలి చక్రవర్తి స్వర్గమును ఆక్రమించినప్పుడు అదితి కశ్యపునితో మొరపెట్టుకున్నది. దితి పుత్రులు తన పుత్రుల రాజ్యాన్ని ఆక్రమించారని ఆమె అభియోగం. కశ్యపుడు ఆమెను విష్ణువు గురించి తపస్సు చేయమని చెబుతాడు. విష్ణువర ప్రభావముతో అదితి కశ్యపులకు వామనుడు జన్మించి బలిని పాతాళమునకు పంపి, దేవతలకు స్వర్గం లభించేటట్లు చేస్తాడు. మహాభారతం శాంతిపర్వములో (12.43.6) ధర్మరాజు శ్రీకృష్ణునితో నీవు మూడు యుగాలలో ఏడు సార్లు అదితీగర్భంలో జన్మించావని చెబుతాడు.
 

ఒక సమయంలో కశ్యపునికి గోవులు కావలసి వచ్చాయి. సముద్రుని అడిగితే ఆయన కొంత గోధనాన్ని కశ్యపునికి ఇచ్చి, మీరు తిరిగి కొన్నిరోజులతరువాత నాకు తిరిగి ఇచ్చేయాలి అని చెబుతాడు. కశ్యపుడు తీసుకోని వాటి క్షీరాదులను అనుభవిస్తూ,సముద్రునికి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కొన్ని దినాలకు సముద్రుడు వచ్చి అడిగితే కశ్యపుడు తిరిగి ఇచ్చే ఉద్దేశ్యంలో ఉన్నా అతని భార్యలు అదితి, కపి అనేవారు ఈయకుండా అడ్డుపడ్డారు. కొంతకాలం సహించి ఊరుకున్న సముద్రుడు ఒకనాడు "కశ్యపా! నీవు గోవుల విషయంలో లోభత్వం ప్రదర్శించావు. నీవు గోపాలకుడవై భూమిమీద ఒక జన్మ ఎత్తు అనిశపిస్తా డు. ఆ శాపమువలన కశ్యపుడు వసుదేవునిగా జన్మించి కంసుని గోగణానికి అధిపతిగా నియుక్తుడైనాడు. అదితి దేవకిగాను కపి రోహిణిగాను జన్మించారు. ఇది హరివంశంలోని వృత్తాంతం.
 

46

మరి దేవకి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? ఒక సమయంలో కశ్యపుడు తన భార్యలలో ఒకరైన అదితితో ఏకాంతములో ఉన్నప్పుడు సంతానార్థియై కద్రువ కూడా అక్కడకు వచ్చినది. భర్త వద్ద అదితి ఉండటం చూచి దుఃఖించినది. సవతిమీద, భర్తమీద కూడా ఆమెకు ఆగ్రహం పెల్లుబికి, "మీరిద్దరు మానవ జన్మలు ఎత్తండి" అని శపించింది. పైగా తాను ఉత్తమ సంతానంపై కోరికతో భర్తవద్దకు వస్తే అక్కడ అదితి ఉండటం వలన "నీకు మానవ జన్మలో సంతాన సౌఖ్యము కూడా ఉండదు" అని శాపము ఇచ్చినది. కశ్యపుడు,కద్రువ ద్వాపరాంతములో వసుదేవుడు, దేవకిగా పుట్టారు. ఆశాపము వలననే కృష్ణునిముందు పుట్టిన దేవకి పిల్లలు అందరూ కంసునిచేత హత్య చేయ బడతారు. ఈగాథ బ్రహ్మవైవర్త పురాణంలోనిది.


శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 15

(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)


47
స్వయంభూ మన్వంతరములో తానుచేసిన పుణ్యకర్మల ఫలముగా దేవకి గర్భాశయంలో ఆపరాత్పరుడు ప్రవేశించి ఆమెకు అఖండమైన అనుభూతిని ప్రసాదించాడు. ఇది యోగమాయ మహిమచేతనే జరిగినది. త్రిశతిదేవతలు, త్రిమూర్తులు దేవకీగర్భములో ఉన్న దేవదేవుని స్తోత్రం చేశారు. అంబుజాక్షుడై, నీలమేఘశ్యాముడై, దివ్య, అనన్య లావణ్య, సౌందర్య విభ్రాజమానమైన ముఖ కాంతితో పీతాంబర,ధారియై, గదను, శంఖ, చక్రములను ధరించి చతుర్భుజుడై స్వాయంభువ మన్వంతరంలో దర్శనమిచ్చిన రూపంతోనే తిరిగి దర్శనమిచ్చాడు. వారికి పూర్వజన్మ స్మృతి కలిగింది. వెంటనే వారికి ప్రకృతికంగా పుట్టిన శిశువు వలే మారిపోయాడు. ,వీటి అన్నిటి వెనుక యోగమాయ విభూతి ఉన్నది. కృష్ణలీలలన్నిటి వెనుకా సూత్రరూపంలో యోగమాయ పాత్ర ఉన్నది.
 

48
మరి నంద, యశోదల పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? యశోదా నందులు పూర్వజన్మలో ధరా ద్రోణులనే పుణ్యదంపతులు. భర్త శాస్త్ర పారంగతుడు. బ్రాహ్మీ ముహూర్తమున నిద్రనుండి లేచి తన నిత్యానుష్ఠానములను పూర్తిచేసుకొని సమీపములోని పట్టణమునకు వెళ్లి, భిక్షాటన చేసి, ఆవచ్సిన దానిని అతిథి అభ్యాగతులకు నివేదించిన పిమ్మట మిగిలిన దానిని మాత్రమే ఆదంపతులు ప్రసాదముగా స్వీకరించువారు. మిగులనినాడు కేవలం జలముతో బ్రతికేవారు. ఒకనాడు వారి ఆశ్రమమునకు వారిని పరీక్షించుటకు, పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతులవలె, శ్రీహరి వారి పుత్రునివలే రూపములు ధరించి వచ్చారు. తల్లిదండ్రులకు ఆకలితో శోష వస్తున్నదని చెప్పి ఆయువకుడు కూడా మూర్చతో పడిపోయాడు. అప్పటికి భర్త తిరిగిరాలేదు. వారికి ఇచ్చుటకు తమ వద్ద ఏమీలేదు. ఎప్పుడూ బయటకు వెళ్ళని ధరాదేవి పట్టణములోని అంగటికి సరకులు తెచ్చుటకు వెళ్తుంది. తన వద్ద మాంగల్యము తప్ప ధనమువేరేలేదనీ, ముగ్గురు అతిథులకు సరిపడ దినుసులు ఇమ్మని దుకాణదారుని అడుగుతుంది. అతడు వారుచేసేది వ్యాపారమని, సరుకులకు బదులుగా ధనమునికాని, లేకున్న ఆమె అందమునుగాని ఈయవలెనని అడుగుతూ, ఆమె వక్షస్థలమువైపు ఆశగా చూస్తాడు. అప్పుడామె అక్కడ ఉన్న ఒక కత్తిని తీసుకొని తన ఒక స్తనమును కోసి వానివైపు పడవేసి రక్త ధారలతో ఇంటికిచేరి అతిథుల పాదాలపై పడి ప్రాణావశిష్ట స్థితి లో ఉంటుంది. వచ్చిన వారు తమనిజ స్వరూపాలతో ఆమెకు ప్రత్యక్షమై ఆమెను పూర్వస్థితికి తీసుకు వస్తారు. శ్రీహరి ఆమె రక్తదారకు బదులుగా అపారమైనక్షీరధారను ఇస్తానని తానే శిశువుగా అదిస్వీకరిస్తాననీ చెబుతాడు. ఆ దంపతులే నంద యశోదలుగా ద్వాపరంలో జన్మిస్తారు.
 

49
వసుదేవుడు అప్పుడే పుట్టిన శిశువును తీసుకొని వ్రేపల్లెలో నందుని ఇంటికి వచ్చినప్పుడు యశోద ప్రసవ వేదనతో తనకు పుట్తిన శిశువు మగ శిశువో, ఆడ పిల్లో తెలియని స్థితిలో అచేతనంగా పడి ఉన్నది. ఆ స్థితిలోనే వసుదేవుడు తన బిడ్డను అక్కడ ఉంచి యశోదకు పుట్టిన ఆడ పిల్లను తీసుకొని తిరిగి మధురకు వెళ్ళిపోతాడు. ఆమెకు స్పృహ వచ్చేసరికి నీలమేఘచాయతో అసమాన తేజస్సు తో మెరిసిపోతున్న బాలుడు కనుపిస్తాడు. ఆశిశువు ఏడుపు ఆమెకు ప్రణవనాదంలా వినిపిస్తుంది. పూర్వజన్మ స్మృతి వస్తుంది. ఆపాదాలు ఎన్నడో తాను చూచినవని తెలుస్తుంది. పాదాలకు నమస్కారం చేస్తుంది. మళ్ళీ మాయలో పడి తనకు జన్మించిన శిశువే అని భావిస్తుంది. యశోదకు కలిగిన ఈ అనుభవమంతా యోగమాయ ప్రభావం వలననే జరిగినది. శ్రీ కృష్ణుని బాల్యలీలలన్నిటిలో ఈ యోగభూమిక స్పష్టంగా కనుపిస్తుంది.
 

50
యశోదకు పుట్టిన స్త్రీశిశువును వసుదేవుడు తీసుకొని వెళ్ళినా, వ్రేపల్లెలో, బృందావనంలో శ్రీకృష్ణుడెప్పుడూ యోగమాయా సమావృతుడయ్యే ఉన్నాడు. ఒక శరత్కాలంలో వెన్నెలవేళలో ఆయన యమునా తీరంలో విహారిస్తుండగా ఆయనకు గోపికలు కనుపించారట. వారా సమయంలో నిజానికి అక్కడ లేరు. ఎవరింటిలోవారు నిత్య కార్యాలలో నిమగ్నులై ఉన్నారు. వీక్షణామునకు దృక్కు, ద్రష్ట, దృశ్యము ఉండాలి. ప్రాకృతుల దృష్టికి పరిమితులు ఉంటాయి, భగవంతునికి అవిలేవు.
 

కృష్ణావతారంలో భగవంతుని సేవించిన జీవులలో మూడు రకాల జీవులున్నారు. త్రేతాయుగంలో మునులుగా జన్మించి, తపస్సులలో శ్రీరాముని దర్శించి, ఆయన సాన్నిహిత్యంకోరినవారు, ద్వాపరంలో గోపికలుగా జన్మించారు. భగవంతుని తత్త్వము వేదములచేత తెలియబడుతుంది కాబట్టి శ్రుతులు గోపికలుగా అవతరించాయి. అప్సరసలు క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు జన్మిచారు. అందుకే వారు లక్ష్మీదేవిని సోదరిగా భావిస్తారు. వారుకూడా భగవంతుని సేవించడానికి గోపికలుగా జన్మించారు.
 
శ్రీకృష్ణుని వంశీనాదం ఊరిలోనున్నఈ మూడు రకముల గోపికలకు కూడా వినిపించింది. వారంతా యమునా తీరానికి చేరారు. చిత్తమంతా శ్రీకృష్ణునే నింపుకున్నవారికి సంసారబంధాలు అడ్దురాలేదు. ఒకేరాత్రి వారికి రాసలీల అనుభవం జరిగినది. శ్రీకృష్ణుడు వారికి తన బాల్యములో పదకొండు సంవత్సరాలు మధురరసాన్నీ, భక్తి రసాన్ని, వారి వారి పురాకృత పుణ్యవిశేషం కొద్దీ, వారి వారి తారతమ్యాలతో కూడిన ఉపాధుల ప్రకారం పంఛి ఇచ్చాడు. రాసలీల తరువాత కృష్ణుడు వాళ్ళ చిత్తములో స్థిరముగా ఉండిపోయాడు. ఆయన మాత్రము వెంటనే బృందావనం వదలి వెళ్ళి పోయాడు. మళ్ళీ ఎన్నడూ రాలేదు.
 

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు -16

(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)

51

విశ్వం, విశ్వరూపం
విష్ణు సహస్రనామం లో మొదటినామం "ఓం విశ్వాయ నమః". విశ్ + వం అంటే అంతటా ప్రవేశించినవాడు, జ్ఞాన రూపంకలిగిన వాడు. విశ్వం అంటే విశాలమైన అనంతమైన జగత్తు. అది ఆయనయే అని చెప్పబడుతున్నది. ఆయనే జగత్తు అంటే ఎలా అయినాడు? అన్న ప్రశ్న పుడుతున్నది. జగత్తు అంటే అనేక పదార్థములు, పదార్థములతో కూడిన లోకములు ఉన్నాయి. విశ్వాంతరాళములో అనంతమైన ఖాళీ ప్రదేశము (ఆకాశము) ఉన్నది. ఈ పదార్థములు, ఆకాశముకూడా ఆయనయేనా? సూర్యుడున్నాడు. భూమి యున్నది ఈ సూర్యుడతడే, ఈ భూమి అతడే, మధ్యనున్న ఆకాశముకూడా అతడే. అంటే విశ్వం మొత్తమంతా వ్యాపించినవాడు అతడు. అంటే అతడే సర్వ వ్యాపకుడైన విష్ణువు. ఇది రెండవ నామము "శ్రీ విష్ణవే నమః". ఇంకొక నామం "ఓం విశ్వకర్మణే నమః" అంటే సృష్టికి రణభూతుడు. సృష్టియందలి చైతన్యముతో కూడిన సర్వక్రియారూపుడు. "ఓం విశ్వ రేతసే నమః" సమస్త సృష్టికి కారణమైన బీజ రూపుడు అతడే. "ఓం విశ్వయోనయే నమః" సృష్టియొక్క బీజములోనే విద్య, అవిద్య కలసియుంటాయి. ఆ బీజాన్ని మొలకెత్తించే వాడు బ్రహ్మ. విద్య, అవిద్యలు బ్రహ్మ కర్త కాదు. స్థితి లయాలు కలిగించే విష్ణువు, రుద్రుడూ బీజములోనే ఉండుటవలన ఆయన విశ్వయోని. "నమో రుద్రాయ విష్ణవే మృతుర్మే పాహి". విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమో నమః, రుద్ర మంత్రాలు. "ఓం విశ్వాత్మనే నమః" సమస్త విశ్వమునకు ఆత్మ రూపుడైన వాడు అతడే. ఆయనయే విశ్వధ్రుక్, విశ్వమును, విశ్వభారమును ధరించి యున్నవాడు, విశ్వభుక్, సర్వసృష్టికి భోక్త. "ఓం విశ్వబాహవే నమః" విశ్వవ్యాప్తమైన బాహువులతో విశ్వమును సృష్టించి, రక్షించి,లయము కూడా చేయగలవాడు. "ఓం విశ్వదక్షిణాయనమః" = విశ్వములోని సమస్త కర్మలలో దక్షుడైన వాడు. "ఓం విశ్వదక్షిణాయనమః" = విశ్వములోని సమస్త కర్మలలో దక్షుడైన వాడు. "ఓం విశ్వమూర్తయే నమః" ఈ విశ్వమంతా ఆయన రూపమే. విశ్వమంతా ఆయన మూర్తియే నిండి ఉన్నది. ఆయనకు విశ్వమునకు అవినాభావ సంబంధమే ఉన్నది.

52
భాగవతములోనే శ్రీకృష్ణుడు తల్లికి నోటిలో బ్రహ్మాండమును చూపిన ఘట్టము ఉన్నది,
జననాథ! యొకనాడు చన్ను చేఁపినఁ దల్లి 
చిన్నిముద్దులకృష్ణుఁ జేరఁ దిగిచి 
యెత్తి పెందొడలపై నిడికొని ముద్దాడి 
చ న్నిచ్చి నెమ్మోము చక్క నివిరి 
యల్లని నగవుతో నావులించిన బాలు 
వదన గహ్వరమున వారినిధులు 
దిశలు భూమియు వనద్వీపశైలంబులు
నేఱులు గాలియు నినుడు శశియు 
చూపు
దహనుఁ డాకసంబు దారలు గ్రహములు
నఖిలలోకములు చరాచరంబు 
లైన భూతగణము లన్నియు నుండుటఁ 
జూచి కన్నుమోడ్చి చోద్యపడియె. (భాగవతము 10.1.280)

ఈ దర్శనము తరువాత యశోదకు జ్ఞానోదయమయినదా? అని ప్రశ్నిస్తే లేదని చెప్పాలి. యశోద చంటిపిల్లవానికి ఏదో అయినదని భయ పడినది. తన భ్రమ అనుకున్నది. రక్షగా శిశువునకు విభూతి పెట్టి ఉంటుంది. దిష్టి తీసి ఉంటుంది. నిజానికి ఆ దర్శనానికి ఎంత జ్ఞానం రావాలి. యశోదలోని మనుష్యత్వ లక్షణమే ఇది. ఈ సంఘటన వలన కృష్ణునికి యశస్సు వచ్చినది. ఆమెకు యశోద అనే పేరు సార్థక నామమయినది. ఇది కృష్ణుడు చూపిన మొదటి విశ్వరూప దర్శనము.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు -17
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
52 Continued
హృదయ మందున్న జ్యోతియే ఆత్మవస్తువు. దాని తేజస్సు విశ్వవ్యాప్తమై ఉండి, దానిలో లోకములన్నీ కనబడుతాయి. అతి సూక్ష్మమైన ఈ జ్యోతి శిఖనే కృష్ణుడు తన నోటిలో తల్లికి చూపించాడు. కాని ఆమె చిత్తము యొక్క విక్షేప లక్షణము వలన అబ్బురపడి ఉండిపోయింది. ఇంకా అతడు తన శిశువు అనే భావనలోనే ఉండిపోయింది. ఆభావనను సమాకర్షము చేసి, జగత్కారణమైన బిందువును ఆమెకు చూపి,తిరిగి ఆమె అవిద్యను ఆమెకు కృష్ణుడు తిరిగి ఇచ్చినాడు. 
ఇదే విశ్వరూపదర్శనము యశోదకు మరియొక మారు కలిగినది. వెన్నుడు మన్ను తినెనని బలరామాదులు యశోదకు చెబుతారు. తల్లి ప్రశ్నకు సమాధానముగా కృష్ణుడు తల్లితో ఇలా అన్నాడు. 
అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో? 
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవుగొట్టంగ వీ 
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం 
ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే.
అప్పుడు కృష్ణుడు నోరుచూపించగా అ నోటిలో 

ఆ లలితాంగి గనుంగొనె 
బాలుని ముఖమందు జలధి పర్వత వన భూ
గోళ శిఖి తరణి శశి ది 
క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్ (భాగవతము 10.1.340)
అప్పుడు యశోద మనసులో కలిగిన భావాలను పోతన అద్భుతముగా వర్ణిస్తాడు. 
కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో! 
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర 
స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర 
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్ (భాగవతము 10.1.342)
యశోద తిరిగి ఒక క్షణములో విష్ణుమాయతో అతడు తన కొడుకే అని భ్రాంతిలో పడిపోయినది.
53

మరియొక విశ్వరూప సందర్శనము కురుక్షేత్ర రణభూమిలో, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చూపించినది. గీతలో తనబోధనంతా గురుపరముగానే చేసినాడు. తాను గురువుయొక్క స్థాయిలోనే కనుపించినాడు. జ్ఞానియైన గురువు తాను సర్వ సమర్థుడనన్న భావమును శిష్యునికి కలిగించక పోతే శిష్యునిలో అది సందేహాలకు దారితీస్తుంది. కాబట్టి, తానెవరో తెలుసుకొనమని లోపలి కవాటమును తెరచి విశ్వరూపమును చూపించినాదు. ఇది శిష్యునిలోని అవిద్య , అహంకారాల నిర్మూలనకు తోడ్పడుతుంది. ఆనాడు దేశములో అనేక మహర్షులు, యోగులు, పండితులు ఉండేవారు. ఇతడు బోధింపడమేమన్న సందేహం వస్తుంది. తాను సామాన్య యాదవ వీరుడిని కాదనీ , తన సర్వజ్ఞత్వము, సర్వేశ్వరత్వము ఋజువు చేయడముకొరకే విశ్వరూప దర్శనము చేయించినాడు. 

54

విశ్వరూప దర్శనము అర్జునునికి సాధన వలన లభించిన ఆత్మ దర్శనము కాదు. గురువు శిష్యుని అంతఃకరణలోని తెర తీసి చూపించాడేతప్ప అది శిష్యుని జ్ఞానమువలన కలిగినది కాదు. తపోబలముచేత యోగముచేత సంపాదించుకున్న జ్ఞానము శాశ్వతము. యుద్ధరంగములో అర్జునుని మోహమును తొలగించుటకు ఉపయోగపడిన తాత్కాలిక అనుభవమే ఆ దర్శనము. అది అర్జునుని మనోనేత్రానికే కలిగినది. యుద్ధరంగములోని మిగతావారికి కాదు. 

యుద్ధ ప్రారంభములో ఇరు సేనల మధ్య నిలిచిన రథములో బావా, బావ మరదులిద్దరూ యుద్ధం చేయకుండా ఏమి మాట్లాడుతున్నారు? ఇరు పక్షాలవారు కొంత విసుగుతో ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. వాచా మాట్లాడినది తక్కువ. ఒక క్షణం లోపలి తెర తొలగించి తిరిగి ఆ తెరను వేసేసాడు. యశోదకు జరిగిన అనుభవమే అర్జునునిది కూడా. అర్జునుడు బ్రహ్మజ్ఞాని అయిపోతే యుద్ధంచేయడు కదా! 

అందుకే చాలా కాలంతరువాత "కృష్ణా ఎన్నడో కురుక్షేత్రంలో అనేక యోగములను గురించి చెప్పావు. మళ్ళీ రాజభోగాలలో పడి అన్నీ విస్మరించాము. అప్పుడు అర్థమయినట్లే ఉన్నది కాని ఏమీ అర్థము కాలేదు. మళ్ళీ నాకు గీతా బోధ చేయి". అప్పుడు తపస్సుచేసే మార్గం అర్జునునికి ఉత్తరగీతలో తిరిగి బోధించాడు.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు -18
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
55

శ్రీ కృష్ణుడు కౌరవసభలో మూర్ఖులైన కౌరవులు తనను త్రాళ్ళతో బంధింప వచ్చినప్పుడు విశ్వరూపమును ప్రదర్శించినాడు. ఆ త్రాళ్ళూ సామాన్యులను లేవకుండా, కదలకుండా బంధించగలవు. ఆయనను వారు కట్టలేక పోయారు. దానికి కారణం ఆయన వారికి అందనంత ఎత్తులకు పెరిగిపోయాడు. బ్రహ్మాండమైన బలముతో కట్టినాక తెంపుకునే ప్రయత్నం చేయలేదు. కొంత దూరములో ఆయనను నలుగురు త్రాళ్ళతో కట్టడానికి వచ్చినప్పుడు ఆయన భుజమువరకు తాడు పొడవు ఉన్నది. వెంటనే మెడ చుట్టూ త్రాడు వేసి క్షణములో కట్టివేయగలమని వారు అనుకున్నారు. ఒక అడుగు ముందుకు వేసే సరికి వారి తలలు ఆయన మోకాలువద్దకు వచ్చాయి. కాళ్ళని కట్టివేయచ్చని వారు అనుకోగానే వారు ఆయన పాదముముందు ఇసుక రేణువులవలె ఉన్నారు. వారు భయముతో మూర్చ పోయారు. ఆ విశ్వరూపము అటువంటిది. మీరు నన్ను ఏమీచేయలేరు అని వారికి తెలియజేయడానికే ఈ విశ్వరూప సందర్శనము. ఆ గుడ్డిరాజుకు పూర్వ పుణ్యం కొంత ఉన్నది. అందుకే అతడికి ఆ దర్శనానికై దివ్యదృష్టి లభించినది. నీవు భగవంతుడివి అని దణ్ణం పెట్టాడు తప్ప సద్బుద్ధి, జ్ఞానము కోరుకోలేదు. పుత్రవ్యామోహం పోలేదు. 

56

కౌరవ సభలో విశ్వరూప దర్శనం సందేశం ఏమిటి? మనుష్యుడు తనచుట్టూ ఉండే బంధములకు లోనుగాక తాను వాటిని అధిగమిచేలా పెరగాలి. "నేను పెరుగుతాను. నేను విశ్వుడను. నేను విశ్వవ్యాప్తమైన పరమాత్మ తత్త్వమును. నేను శివుడను. శివోహం. నేను పరబ్రహ్మ తత్త్వమును. అహం బ్రహ్మాస్మి. ఈ జన్మలో నాకు వచ్చిన సతీపుత్రాదులు, ఐశ్వర్యములు కేవలం ఈ జన్మకు సంబంధించినవే. వీరే నన్ను బంధింపగలిగితే అనేక జన్మలవారు కూడా నన్ను బంధింపవలసినదే. తన పెరుగుదల వలన ఈ బంధములకు బద్ధుడు కాక వాటి నన్నిటినీ తృణప్రాయంగా చూడగల శక్తివస్తుంది.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 19
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
కృష్ణం వందే జగద్గురుం

58
సర్వప్రవర్తకుడైన పరమేశ్వరుడు ఈ భూమిపై గురువుగా అవతరించి ఏది క్షేమమో, ఏది యోగమో, ఏది మంచిదో, ఏది కాదో ఎందుకు జీవించవలెనో, అనేక మార్గములలో ఎటువంటి గుణదోషములు ఉన్నవో అన్నీ విశ్లేషణ చేసి మార్గదర్శకుడైనప్పుడే గురుతత్త్వమనే వ్యవస్థ మన భూలోకములో అవతరించినది. అందుకే మనము ఆది గురువుగా శ్రీ కృష్ణపరమాత్మనే చెప్పుకుంటాము. అతడే గురువని మనకు తెలియజెప్పినవారు వ్యాస భగవానులు. ఆయన గ్రంధములవలననే, బోధల వలననే మనకు శ్రీకృష్ణ తత్త్వము అవగతమైనది. గురు పూర్ణిమ నాడు మనము వ్యాసుని తలచుకుంటాము. "భూమిపై అవతరించిన ఈ కృష్ణ భగవానుడే మీకు గురువు. ఇతనినే మీరు అనుసరించాలి" అని చెప్పిన వారు వ్యాసదేవుడు. 

సృష్టి రహస్యములు తెలిసిన వాడు, ప్రకృతి లక్షణములు తెలిసిన వాడు, తానే భగవంతుడైన వాడు. ముక్తికి అత్యంత సులణోపాయమును తెలిపి, బంధమోచనము చేసి ముక్తికి తీసుకువెళ్ళగలిగిన వానినే జగద్గురువు అని వ్యవహరించాలి. అలా కానప్పుడు కేవలము ఒక సాంప్రదాయమునకు చెంది, వారి మార్గములే ఉత్తమములని బోధించే వారు జగద్గురువులు కాలేరు. ఆర్య సంస్కృతిలో భగవంతుని చేరుటకు అనేక మార్గములున్నవి. అందుకై శ్రీకృష్ణుడు అవతరించి వాటిని సమన్వయ పరచి మనము వాటిని ఎలా స్వీకరించవలెనో, మన బాధ్యతలు ఏమిటో చెప్పవలసిన అవసరం వచ్చినది. జగత్తుని గురించి, లోకాతీత జ్ఞానమును గురించి అధికారికముగా ఒకే సమయములో చెప్పగలిగినది భగవంతుడే. అతడే జగద్గురువు. ఎవరినైనా ఉద్ధరించగల సమర్థుడు. 
59 
జగద్గురువు పదమునకు రెండు అర్థములున్నవి. జగత్తు ఉన్నంత వరకు ఉండే గురువని ఒక అర్థము. సృష్టికి పూర్వమే జీవులకు ముక్తి మార్గము ఏర్పరచినవాడు జగద్గురువు. సృష్టి లోనే జీవులయందు అనుగ్రహము ఉన్నది. జీవులకు చీకటి నుండి వెలుగులోనికి, అజ్ఞానమునుండి జ్ఞానములోనికే వెళ్ళే అవకాశము సృష్టివలననే ఏర్పడుతున్నది. ఈ విధముగా భగవంతుడు జీవులను తనలోనికి తీసుకుంటున్నాడు. దేవతలకు కూడా జగద్గురు తత్త్వము అవసరమే. మహర్షులు కూడా మౌనియైన దక్షిణామూర్తిని పొంది యున్నారు. ఇతడే ప్రప్రథమ జగద్గురువు. అత్రిమహర్షిపుత్రుడు, త్రిమూర్తుల అంశలతో జన్మించిన దత్తాత్రేయుడు మరొక జగద్గురువు . అతని తరువాత భూమిమీద అన్నిమార్గములను సమన్వయముచేసిన జగద్గురువు శ్రీకృష్ణుడు. సామాన్యులమైన మనకు మనస్థితికి తగిన బోధలు ఇవ్వగలవారిని జగద్గురువు తత్త్వములోని ఒక మెట్టుగా పరిగణించాలి. 
శ్రీకృష్ణునికి ముందు తపస్సు ద్వారా, లేదా యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా దేవతలను మెప్పించి ఊర్ధ్వలోకములు లేదా క్రమ ముక్తి పొందే విధానములే విరివిగా ఉండేవి. కాని కాలగతిలో కలియుగ ప్రవేశము నాటికి పూర్వ వేద విహిత విధానములకు కావలసిన మనోదారుఢ్యము, ఇంద్రియ నిగ్రహము, శరీర స్థైర్యము మనుష్యులలో క్షీణించినది. అందువలన జగత్తుకు మూలకారణమైన శుద్ధచైతన్యమును వినియోగించుకునే పద్ధతిగా యోగమును శ్రీకృష్ణుడు ప్రప్రథమముగా ఈ లోకమున ప్రవేశ పెట్టుట జరిగినది. కృష్ణుడు ఇంద్రాదులైన దేవతలకు కూడా తన యోగ సిద్ధులను చూపించినాడు. భగవద్గీతలో సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము మొదలైన మార్గములన్నిటినీ యోగములుగానే నిర్వచించినాడు.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 20
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
60
శ్రీ రామావతార కాలములో ఋషులు, మునులు, జ్ఞానులు శ్రీ రాముని సాంగత్యము, సాన్నిహిత్యము కోరి, కృష్ణావతార సమయములో గోపికలుగా జన్మించారు. వారి కోరిక ప్రకారమే వారికి ఆయన దర్శన, స్పర్శ, ధ్యాన, భౌతిక సామీప్యములు లభించినవి. అందువలన వారి గత జన్మ విజ్ఞానమంతటిని వారు విడువవలసి వచ్చినది. అందువలన వారు పాండిత్యము, విద్యలేని సామాన్య స్త్రీలుగా జన్మించారు. వారు తమ సంసార బాధ్యతలలో మునిగి ఉన్నారు. వారి విషయములో అవిద్య, అమాయకత్వము, పారదర్శకత్వము మొదలగు గుణములే వారికి మహోన్నత గుణములైనవి. 

శ్రీ శుకుని ద్వారా భాగవతము వినే సమయములో పరీక్షిత్ మహరాజుకు ఒక సందేహం వచ్చినది. "కృష్ణస్తు భగవాన్ స్వయమ్ అనే విషయము మనకు భాగవతములో వ్యాసుడు చెప్పినప్పుడు కదా తెలిసినది. గోపికలకు ఆ విషయము తెలియదు. కేవలం కృష్ణునిపై వారికిగల మోహభావం వారి ముక్తికి హేతువౌతుందా?" అని శ్రీశుకుని ప్రశ్నించాడు.దానికి శుకుడు శిశుపాల కంసాదులుకూడా ద్వేషము, భయము, క్రోధము వంటి భావములచేత కూడా తరించారు. ఎవరైతే పరమాత్మను అనన్యచింతతో అహర్నిశలూ అతనియందే ద్వేషము చేతగాని, భయము చేతగాని, క్రోధము చేతగాని, ప్రేమ చేతగాని, మోహముచేతగాని తమ మనో బుద్ధి చిత్తములను లయము చేయ గలిగితే వారు తరించగలరని శుకుడు సమాధానం ఇస్తాడు.
 
61
మోహముతో గోపికలు చేరిన ముక్త స్థితి యౌగిక దృక్పథములో విశ్లేషించవచ్చును. మనలను ఈ లోకానికి బంధించేది మనస్సు. మనస్సు వామనాడియైన ఇడానాడి అధీనములో ఉన్నది. దానిని ఆధారముగా చేసుకునికూడా పైకి వెళ్ళవచ్చును. లోకములో అనేక వస్తువులపై పెంచుకునే మోహమును పరమేశ్వరునియందే పెంచుకొనవచ్చును. అన్నికోరికలు తీరుటకు ఆయననే ఆరాధింపవచ్చును. మధురమైన పాయసమును త్రాగితే కలిగే సంతృప్తిని ఆయనే ఈయగలడు. ఆయన చూపించేది ముక్తి మార్గమే అవుతుంది. విష్ణువు ధరించే కౌస్తుభమణియే హృదయాకాశములో ఉండే చింతామణి. నారాయణ తీర్థుల లీలా తరంగిణి అంతా గోపికలను దృష్టిలో పెట్టుకొని రచించిన శ్రంగార కావ్యమే. గోపికల వలె జీవించమని ఆయన భావము.యోగ సాధనలో మణిపూరక చక్ర రహస్యాలు లీలా తరంగిణిలో పొందుపరచబడి ఉన్నాయి. అజ్ఞానులైన గోపికలు మోహభావముతో జగన్మోహనుడైన శ్రీకృష్ణునిచేరారు. ఆయన నిర్గుణ తత్త్వముకాని, జగత్తుకు మూలకారణ తత్త్వముకాని వారికి తెలియదు. కేవలము మోహ బుద్ధితో మణిపూరకాన్ని అధిగమించి వెళ్ళారు. ఈ గాఢ మోహ స్థితిలో తమ సంసారమును, పిల్లలను, భర్తలను, పాడి ఆవులను, ఇండ్లను వదలి చిత్తమంతా కృష్ణునితో నింపుకొని వెళ్ళారు. వారిది సామాన్య మోహము కాదు. జ్ఞానమసలే కాదు. శుద్ధజ్ఞాన స్వరూపుని యందు మోహము. విద్య, అవిద్య కలసియుంటే అది సంపూర్ణ మోహము కాదు. వారి సంపూర్ణ మోహమే వారిని ఉత్తీర్ణులను చేసింది. యోగశాస్త్రములో మణిపూరకము స్వాధిష్టానమునకు పైన అనాహతమునకు దిగువ ఉన్నది. విద్య, అవిద్యల మిశ్రమములో జీవించే సామాన్యునికి పంకమువలె ఉన్న ఈ మణిపూరకమును దాటుట సంభవము కాదు. 
62
కృష్ణుడు తన అవతార సమయములో చేసిన లీలలన్నిటినీ యోగ సిద్ధులని కొందరు చెబుతారు. ఆయనను మహాయోగి, యోగేశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు అంటారు. అన్నియోగములు ఆయన యందే పుట్టినవి. ఆయన చేసినలీలలకు ఆయనకు యోగశక్తులు, సిద్ధులు అవసరములేదు. సంకల్పమాత్రముననే అవి జరిగినవి. యోగములన్నీ ఆయనను జేరుకునే మార్గములు. యోగులకు లభించే యోగశక్తులు ఆయన శక్తికి అనుకరణములు (simulation of divinity).

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 21
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
63
మధురలో కుబ్జకు సౌందర్య ప్రదానము చేసిన విధానము క్రియాయోగ ప్రక్రియ. శరీరములో సకలేంద్రియములను వశములో ఉంచుకునే ఒక కేంద్రమున్నది. దానిని వశములో ఉంచుకొన్న యోగి స్పర్శదృగింద్రియములను ప్రభావితము చేసి, ఒకరూపమును మనసులో భావించి, ఆవ్యక్తిని స్పృశించినప్పుడు ఆ వ్యక్తికి ఈ రూపము ప్రాప్తిస్తున్నది. పద్మాసనములో కూర్చునిచేసేవి,పడుకొని చేసేది వంటి క్రియాయోగప్రక్రియలు ఉన్నాయి. మూలాధారమందు గణపతిని, సహస్రారమందు అనంతుని (వేయిపడగల ఆదిశేషుని) భావించాలి. మూలాధారమునుండి సహస్రారమువరకు జీవుని ప్రయాణము. ఈ సహస్రారమునే సహస్ర దళకమలమని యోగులు అంటారు. పురుష సూక్తములో "సహస్రాక్ష సహస్రపాత్" అంటే ఇదే. అనంతుడైన ఆదిశేషునిపై శయనించిన మహావిష్ణుపాదములవద్ద లక్ష్మి ఉన్నది. ఇప్పుడు జీవుడు తనలోని ప్రకృతిని లక్ష్మివద్ద వదలిపెట్టాలి. ఈ లక్ష్మియే మూలప్రకృతి. ప్రకృతిని విసర్జించిన జీవుడు పరిశుద్ధుడు అవుతాడు. ఇంకమిగిలినది పరమాత్మలో ఐక్యమే. అనంతమైన ఆదిశేషువు అంటే ఆద్యంతములులేనివాడు. జగత్తు అనంతముగా ఉన్నది. ఆదిశేషువే అది. కృష్ణుడు చెప్పిన క్రియాయోగరహస్యము ఇదే. 

64

యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని దయకు పాత్రులైనవారిలో ఘంటాకర్ణుడనే గంధర్వుని వృత్తాంతము ఉన్నది. అతడు ఉత్తరదిశలోనున్న కుబేరుని రాజ్యంలో ఉండేవాడు. కుబేరుడు, ఘంటాకర్ణుడు కూడా గొప్ప శివభక్తులు. కొన్ని దినములకు కుబేరునికి ఘంటాకర్ణుడు తనకంటె గొప్ప శివభక్తుడేమోనని అనుమానం వచ్చినది. కొంత అసూయతో ఘంటాకర్ణుని శపిస్తాడు. "నీ శరీరము దుర్భరమైన చర్మ వ్యాధితో, దుర్గంధముతో, రక్తస్రావముతో నిండి ఉంటుంది. అప్పుడు నీవు శివపూజ, ధ్యానాదులు చేయలేక పడిఉంటావు" ఇది కుబేరుని శాపం. ఘంటాకర్ణుడు ఆ స్థితిలోకూడా మనస్సుని శివునిపై నిలుపుకొని ఉండిపోయినాడు. శివుడు ప్రత్యక్షమై " నీకు శాప విముక్తి కలుగుతుంది. నీవు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది" అని చెబుతాడు. 
అది శ్రీకృష్ణుడు భూమిపై సంచరిస్తున్న కాలము. కైలాస పర్వతము సమీపములో తపస్సుచేసి శివదర్శనము చేయాలని శ్రీకృష్ణుడు గంధర్వదేశానికి వెడతాడు. అక్కడ ఘంటాకర్ణుడు అతనికి కనబడుతాడు. కృష్ణునితో "నేను తమకు అనువైన ప్రదేశం కైలాస సమీపములో చూపిస్తాను. అసూయతో నాప్రభువైన కుబేరుని శాపం వలన రోగగ్రస్తమైన ఈ శరీరముతో కైలాసమునకు రాలేను" అని చెప్పగానే కృష్ణుడు విషయముగ్రహించి, దయతో తన వేణు దండముతో అతనిని కదిలించి స్పృశించాడు. అతని జీవుడు మరియొక అద్బుతమైన సుందరశరీరమును ధరించినది. శరీరము తేజోవంతమై, సుగంధము వెదజల్లినది. కృష్ణుడు గంధర్వునికి విష్ణువుగా దర్శనమిచ్చి "నీవు నాకు ఏమి ఇస్తావు?" అని అడిగాడు. "అక్కడ దుర్గంధపూరితమై పడిఉన్న ప్రాణములేని పూర్వ కళేబరమును తమకే సమర్పిస్తాను" అంటాడు. "నీవు దానిని దహనముచేయుము" అని చెప్పి శ్రీకృష్ణుడు తనదారిన వెళతాడు. (ఈ కథ ఉత్తర హరివంశము లోనిది.) ఆ పూర్వ శరీరమును దహించినప్పుడు కూడా సుగంధము వచ్చినది. 
ఈ కథలో గురుతత్త్వము నిరూపితమౌతున్నది. గురువు నీపూర్వ శరీరమును దహింపజేసి వెనుకకు తిరిగి చూచినప్పుడు దాని పూర్వపు స్థితి జ్ఞాపకములేకుండా చేస్తాడు. ఒకవేళ అలాగ చూడగలిగినా, ఒకప్పుడు ప్రపంచములో నీ ఉనికిని గుర్తించి దానిని ఒక వింతగాచూడగలవేగాని అదిభోగ్యమైన స్వప్నముగా కనుపించదు. తన పూర్వ శరీరమును గురువుకు ఇస్తున్నాను అనడములో తన గతమును ఇస్తున్నాడు. ఆంటే గతజీవితమును వదలివేస్తున్నాడని అర్థము. తన గురువు ఇచ్చిన నూతన దేహమును వదలుకొనక గురువు నిర్దేశించిన నూతన మార్గములో పయనిస్తాడు.
ఘంటాకర్ణుడు మంత్రరూపుడైనాడు. భూతప్రేత పిశాచములను వదలించుకోడానికి ఘంటాకర్ణ మంత్రమును జపిస్తారు.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 22
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
కృష్ణం వందే జగద్గురుం
65
శ్రీకృష్ణుని జీవితముతో సంబంధమున్న ఒక విఖ్యాత మహర్షి అష్టావక్రుడు. ద్వాపర యుగంలో ద్వారకలో శ్రీకృష్ణుడు ఉన్న రోజులలో ఆయనను వెదుక్కుంటూ ఒకరోజు అష్టావక్ర మహర్షి వచ్చాడు. ఆయన శ్రీకృష్ణుని దర్శించి ధ్యానయోగంలో నమస్కరించాడు. శ్రీకృష్ణుడు ఆయనను ఆహ్వానించి గౌరవించాడు. అర్ఘ్య పాద్యాలు ఈయబోతున్న సమయములో కృష్ణుని పాదాలపై శిరస్సు ఉంచి ఆయన శరీరాన్ని వదలిపెట్టాడు. శ్రీకృష్ణుడు స్వయముగా ఆయనకు అంత్యక్రియలు జరిపించి, ఉదకములిచ్చి, ఆజీవునికి ఎంతోగౌరవమైన సద్గతిని ఇచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుని పత్నులు, మంత్రులు అందరూ, ఆయన చరిత్రను చెప్పమని కృష్ణుని అడిగారు. అప్పుడు ఆయన జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. 
66

"ఈ అష్టావక్రుడు నాకు పరమభక్తుడు. జితేంద్రియుడు. పూర్వము నేను నాభి కమలమునుండి బ్రహ్మను సృష్టించి విశ్వసృష్టిచేయమని అతనిని నియోగించాను. అతడు మొదట సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనే నలుగురు మానస పుత్రులను సృష్టించాడు వారు తపోన్ముఖులై సృష్టికార్యాన్ని తిరస్కరించారు. తరువాత బ్రహ్మదేవుడు వశిష్ఠ, మరీచి, ప్రచేతస, అంగీరసాదులైన మహర్షులనూ, ప్రజాపతులను సృష్టించాడు. వారుకూడా మొదట తపస్సులుచేసినా బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించి వివాహములు చేసుకొని సంతానమును కన్నారు. ప్రచేతసుని కుమారుడు అసితుడు. అతడు రుద్రుని గురించి తపస్సు చేస్తే రుద్రుడు ప్రత్యక్షమై రాధా మంత్రాన్ని ఉపదేశించాడు. రాధాదేవి అనుగ్రహముతో అతనికి కలిగిన కుమారుడు దేవల మహర్సి. ఆ దేవలమహర్షి తీక్షణమైన తపస్సు చేస్తే, ఇంద్రుడు తపోభంగము చేయమని రంభను పంపాడు. రంభను ఆయన తిరస్కరిస్తే, ఆమె అష్టావక్రునిగా జన్మించమని దేవలుని శపించింది. ఏకపాదుని కుమారుడుగా ఆయన జన్మించి మహాజ్ఞానిగా, దివ్య చరితుడైనాడు. కృష్ణుని సన్నిధిలో ప్రాణాలు వదలాలనే సంకల్పంతోనే ఆయన జన్మించాడు."

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 23
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
67
రాధాదేవి ఎవరు? ఒక సిద్ధాంతము ప్రకారం శ్రీకృష్ణుడు కేవలం విష్ణువుయొక్క అవతారము మాత్రమే కాదు. గోలోకాధిపతియైన రాధాకృష్ణులు ఉన్నారు. ఆలోకములో వారిద్దరు పరాశక్తి పరమ పురుషులే. కార్యబ్రహ్మలైన త్రిమూర్తులలోని విష్ణువు పరిపాలించే విష్ణులోకము పైస్థానమే ఈ గోలోకము. గోలోకాధిపతియైన ఈ శ్రీకృష్ణుడే ద్వాపరయుగాంతమున భూమిపై నివసించినది. అనేక బ్రహ్మాండములకు సంబంధించిన అనేక విష్ణువులు, బ్రహ్మలు, రుద్రులు, గోలోకమునుకు వెళ్ళీ కృష్ణుని దర్శిస్తారు. అక్కడ రాధాదేవి పరాశక్తియే. ఈ మంత్రమే అసితునికి రుద్రుడు ఇచ్చినది. ఈ మంత్ర ప్రభావమువలన జన్మించిన దేవలుడు, తన తరువాత జన్మలో అష్టావక్రునిగా కృష్ణతత్త్వములో లీనమయినాడని ఈ గాధను మనము అన్వయించుకోవాలి. అష్టవక్రుడు త్రేతాయుగము, ద్వాపరయుగములలో ఉన్నాడు. కృష్ణావతారమునకై వేచిఉండి తన జన్మ కార్యక్రమము పూర్తి అయిన తరువాత కృష్ణునిలో విలీనంపొందాడు. ఈ ప్రస్తావన బ్రహ్మ వైవర్త పురాణములొ శ్రీకృష్ణఖండములో ఉన్నది. ఆయన అష్టావక్ర సంహిత నిత్య పారాయణ యోగ్యమైనది. 
68
అష్టావక్ర మహర్షి శ్రీకృష్ణునికై చేసిన స్తోత్రము బ్రహ్మ వైవర్త పురాణములో ఉన్నది. 

గుణ బీజ గుణాత్మక 
నిర్గుణ గుణి బీజాప్రమేయ గుణనాథ మహా 
గుణ శోభిత గుణ రూపక 
గుణ నికరధార దేవ గుణి వర వినుతా 1
సిద్ధేశ సిద్ధ రూపక 
సిద్ధిప్రద సిద్ధబీజ సిద్ధాధార 
సిద్ధి స్వరూప కేవల
సిద్ధాచార్యవర నిన్ను చేరి భజింతున్ 2
వేదజ్ఞ వేద బీజక
వేదాత్మక వేదవేద్య వేదాధారా 
వేదాతీత గుణాత్మక 
వేద జనక నిన్ను భక్తి వినుతింతు నొగిన్ 3
సర్వేశ సర్వ రూపక
సర్వోత్తమ సర్వబీజ సర్వాధారా 
సర్వజ్ఞ సర్వవందిత
సర్వాతీత నిను భక్తి సన్నుతిచేతున్ 4
ప్రకృతీశ ప్రకృతివందిత
ప్రకృతి పురుష రూప ప్రాజ్ఞ ప్రకృతివిదూరా 
ప్రకృతి తరు బీజ కేశవ 
ప్రకృతి స్థిర నిన్ను భక్తి ప్రణుతింతు మదిన్. 5
సృష్టీశ సృష్టి కారణ 
సృష్టి స్థిత్యంత బీజ సృష్ట్యాధారా 
సృష్టి విరాట్తరు బీజక 
సృష్టీశ్వర జనక నిన్ను సేవింతు మదిన్ 6
ప్రకృతియు మూలంబు బ్రహ్మేశ విష్ణువుల్ 
శాఖలు సురలుపశాఖలఖిల 
తపములు పుష్పముల్ విపుల సంసారాది 
కంబులు ఫల సమూహంబు లగుచాఁ 
దనకు బ్రహ్మండ పాదపమున కర్థినా 
ధారుఁద వటు నిరాధారకుఁడవు 
కడిమి సర్వధారకుడవు తేజొ రూపుఁ 
డవును నిరాకారుఁడవు మహాత్మ 7
సర్వమయుడవు మణియు స్వేచ్చామయుడవు 
ముక్తిమయుడవు నఖిల ముముక్షులకును 
ముక్తిదాయకుడవు సుగన్మూర్తి నీవు 
నీకు నతులాచరించెద నీరజాక్ష 8

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు - 24
(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
69
అష్టావక్రుడు చిన్నతనములోనే ఉగ్రమైన తపస్సుచేశాడు. తండ్రినుండి సృష్టి రహస్యములు తెలుసుకున్నాడు. వివాహమునకు యుక్త వయస్సు వచ్చింది. అష్టవంకరల శరీరము కలవానికి కన్యనెవరిస్తారు? మళ్ళీ తపస్సుకే కూర్చున్నాడు. ఇంద్రుడు ఆయన తపోబలాన్ని ఎరిగికూడా ఆయన సేవకు అప్సరసలను పంపించాడు. అష్టావక్రుడు వారిని చూచి "మీరు ఇంద్రుడు పంపగా వచ్చారు. ఆట పాటలు ప్రదర్శించారు. సంతోషం. మరలిపోండి" అని చెబుతాడు. వారు దానికి "మీరు తపస్సంపన్నులని, మహాత్ములని ఇంద్రుడు చెప్పాడు. మీరు మాకు ఒక వరమీయగలరా? అని అడిగారు. దానికి ఆయన సమ్మతించాడు. "మమ్మలిని మహావిష్ణువు పెండ్లిచేసుకోవాలి. అది మాకోరిక" అంటారు. దానికి ఆయన "ద్వాపరంలో విష్ణువు భూమిమీద కృష్ణునిగా జన్మిస్తాడు. మిమ్ములను వివాహంచేసుకుంటాడ"ని చెబుతాడు. వాళ్ళు హేళనగా నవ్వుతారు. దానికి ఆయన కుపితుడై నావలన వరంపొంది నన్నే పరిహసిస్తారా? మీరు కృష్ణుని భార్యలుగా ఉన్నప్పుడు మీకంటె ముందే ఆయన అవతార పరిసమాప్తి జరుగుతుంది. మీకు వైధవ్యయోగం ఉంటుంది. సామాన్యమైన నిషాదులు, దొంగలచేతిలో అవమానాలు పొందుతారు" అనిశపిస్తాడు. కృష్ణుడు అవతారం చాలించినప్పుడు అర్జునునికి అంతఃపుర స్త్రీలను రక్షించమని కబురు పంపుతాడు. అర్జునుడు వారిని ద్వారకనుండి తీసుకు వెళ్ళుచుండగా దొంగలు దోచుకుంటారు. అర్జునుడు దొంగలను ఎదిరించలేకపోతాడు. ఇది అష్టావక్రుని శాప ఫలితమే. 

70
ఈ బ్రహ్మాండములో ప్రసిద్ధమైన 14 భువనములకు పైన ఉన్నగోలోకమునకు యజమానులు రాధాకృష్ణులు. వారు శుద్ధ ఆనందమైన బ్రహ్మ స్వరూపులు. ద్వాపరమున ఆ తత్త్వములు మానవరూపమున భూమికి దిగివచ్చినవి. ఈ రాధ ఉమా, లక్ష్మీ, సరస్వతుల వలె పూజలందుకొని వరములిచ్చే దేవతాస్వరూపము కాదు.కృష్ణుడూ అట్టివాడే. అట్టివారు మనమధ్యే మనవలెనే స్త్రీపురుష రూపములలో సంచరించి ఏపనిచేసినా అది మాయాశబలిత కర్మ కాదు. వారి పరస్పర ప్రేమను మనము ఉపాసించుటవలన సర్వ కర్మాతీతమై, ఏ కర్మఫలమూకాని అలౌకిక ఆనందము మనకు లభిస్తుంది. వారిద్దరిని వేద మంత్రములు, పూజాదులవంటి క్రియలచేత పొందలేరు. అలా పొందబడేవారు కాదు. వారి అనుబంధము కేవల ఆనందస్వరూపము. మనుష్యులభాషలో అది స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వలె కనుపించును. కాని అది మనమెరిగిన యోగ, యాగ, తపో, భక్తి మార్గములకు భిన్నముగాయున్న ఒక వినూతన నిత్యసత్యానందప్రదమైన మార్గము. దాని దృశ్యరూపమే రాధామాధవులు. బ్రహ్మాండమునకు అతీతముగాయున్న వారు, మన ఉపాసనా మార్గములకు అతీతులు. వారియందు మాయామోహములు లేవు. అవిద్యామూలక కర్మలులేవు. వారిని సంతోషింపచేసే వైదిక కర్మకాండలేదు. యాగాదులు లేవు. వారు విష్ణు సంకల్పమున కొంతకాలము మానవ రూపమున మనను అనుగ్రహించ వచ్చిన నిత్యానందరూపములు. వారి రాక మానవులకు ఒక విశేష అవకాశము. దానిని ఉపయోగించుకొనుట మానవుల విషయము. పౌరాణికముగా చూస్తే పశ్చిమతీరమున ద్వారకా క్షేత్రమున ఈ రాధాకృష్ణులే ఆరాధింపబడుతున్నారు. అక్కడ పరాశక్తి స్వరూపమే రాధ. క్షేత్ర పాలిక కూడా. ఆమెయే శ్రీకృష్ణుని నిజతత్త్వమైన ఆనంద స్వరూపిణి.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు -- 25

(సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)
71
శ్రీ కృష్ణుడు - కుచేలుడు
అడుగకనే ఈయడం భగవంతుని ఒక శుభలక్షణం. ఇది కుచేలుని విషయంలో జరిగినది. కుచేలుడు పరమ విరాగి. ఏకోరికలు లేవు. భార్యా పిల్లలు దారిద్ర్యమును అనుభవించలేక సంపదలు కోరుకుంటారు. భార్య కుచేలుని ఒప్పించి కృష్ణుని అడగమని అతని వద్దకు పంపిస్తుంది. ఆమె తరఫున అతడు అడుగుతాడేమోనని కృష్ణుడు భావించి కుచేలుడికి అడిగే అవకాశం ఈయడు. కుచేలుడు అడిగితే అతని జ్ఞానస్థితికి భంగం వస్తుంది. "నీకు కోరికలు లేవుకదా. అలాగే ఉండిపో. నీభార్య అడిగినది. కోరినవారి కోరికలు తీరుతాయి. నీవు వెనుకకు వెళ్ళిపో " అని చెప్పకనే చెప్పి నూతన వస్త్రాలు కూడా ఈయకుండా కుచేలుని పంపించివేస్తాడు. ఈ విధముగా కృష్ణుడు భక్తుని జ్ఞాన వైరాగ్యాలను రక్షిస్తాడు. "యోగక్షేమం వహామ్యహం" అంటే అర్థం ఇదే. తన వద్ద కూర్చొనియున్న సమయంలో అతనికి సంసారము, దారిద్ర్యము, భార్యా పిల్లలు గుర్తు రాకూడదు. అందుచేత తాము సాందీపనివద్ద గడపిన బాల్యములో సంఘటనలను గుర్తు చేసి తన మాయను ప్రదర్శిస్తాడు. తాను స్వగృహానికి చేరేసరికి ధనము, గృహము, క్షేత్రము అని భార్యపిల్లలు కోరినవన్నీ వారికి సమకూరుస్తాడు. "నేను అడగలేదు, వారికి కావాలి వారికి సమకూర్చాడు" ఈ రహస్యం కుచేలునికి అర్థమైంది. 
ఇది అనుగ్రహ స్వరూపమైన భగవంతుని మాయ. పతన హేతువైన మాయతోబాటు ఇటువంటి మాయకూడ ఉంటుంది. ఒక దొంగ దోచుకోటానికి బయలుదేరుతాడు. దారిలో స్పృహ తప్పి పడిపోతాడు. ఆ పాపము చేయకుండా రక్షింపబడుతాడు. ఈవిధముగా ప్రపంచమంతా వ్యాపించిన విష్ణుమాయ అనూహ్యము, అప్రమేయము. అంటే కొలవటానికి వీలు లేనిది. భగవంతునికి కర్తవ్యములేదు. ఇదేమిటి? తాను చేయడము చేయకపోవడమూ కాదు. జీవునిచేత చేయించడమూ,చేయించకపోవడము. అది భగవంతుని మాయారూపమైన అద్భుత రక్షణ శక్తి.

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు -- 26

మనం కొన్నిరోజులుగా సద్గురు శివానందమూర్తిగారు చెప్పిన శ్రీకృష్ణతత్త్వ విచారములోని కొన్ని అంశాలను స్మరించుకుంటున్నాము. దీనిలో భాగముగా గురువుగారి గీతాప్రసంగములలో నున్న కొన్ని విషయాలను కూడా తలచుకుందాము. ఇది నా శక్తికి మించినపని అనిపిస్తున్నా ప్రయత్నిస్తాను.
 

శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత - 1
(సద్గురు శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరణ)
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్||
శ్రీకృష్ణ భగవానుడు సుమారు 5000 సంవత్సరాలక్రితము కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునునికి ప్రత్యేకముగాను, సమిష్టిగా కలియుగ మానవాళికీ గీతోపదేశము చేశారు. "అధరం మధురం, వదనం మధురం, వచనం మధురం,... మధురాధిపతేరఖిలం మధురం" అని చెప్పబడిన కృష్ణుని ఉపదేశముకనుక గీతకూడా మాధుర్యముతో నిండినదే. కలియుగ మానవులకు వరప్రసాదము. 
గీత భౌతిక శాస్త్రము కాదు. ఆధ్యాత్మిక విద్య. నిత్యజీవితములో మనుష్యానుభవమునకు వచ్చే ఆనందము, దుఃఖము మనసుకు సంబంధించినవే. అక్కడినుండే మానవునికి అనేక ప్రశ్నలు పుడతాయి. వాటికి సమాధానం ఇచ్చేదే ఆధ్యాత్మ విద్య. భగవద్గీత సందేహాలు తీర్చి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. పండిత పామరులందరికీ కూడా వారి వారి పాండిత్యము, బుద్ధివికాసములతో సంబంధములేకుండా అజ్ఞానము, అవిద్య ఏనాడైనా ఆవరించవచ్చును. ఆ అజ్ఞానాన్ని, దానివలన కలిగిన దుఃఖాన్నీ పోగొట్టే శక్తి గీతకు ఉన్నది. ఇది అన్ని వయసులలోనూ కావలసినది. కాని వార్ధక్యములో దానిని ఆశ్రయిస్తున్నారు. 
ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రములను ప్రస్థానత్రయం అంటారు. గీత ఒక్కటి చదివితే వీటన్నిటినీ, పురాణాలను కూడా తెలుసుకున్న వారవుతారు.సాధనామార్గములో ప్రవేశించేవారికి ఇది తొలి సోపానం. పైన పేర్కొనిన గ్రంధాలన్నిటికంటే చదవడానికి తేలిక అయినది, సులభంగా అర్థమయ్యేదీ గీత. తెలుగు, సాహిత్యం, కించిత్ సంస్కృత జ్ఞానం ఉన్నవారు స్వయంగా చదువతగినది. నెట్ లోనే ప్రతిపదార్థముతోకూడా లభిస్తుంది. ఇది సామాన్యులకు చెప్పబడినది. కాలక్రమేణా వేలాది వ్యాఖ్యానాలు వచ్చినా స్వయముగా ఎవరికివారు మూలాన్నీ, సరళమైన అనువాదాన్నీ చదువుకుంటే చాలు. జగద్గురువైన కృష్ణుని తలచుకుని ఒకొక శ్లోకము అన్వయము చేసుకొని చదివేతే చాలు. గీతను చెప్పినది ఒక కవి, పండితుడు, జ్ఞాని లేక యోగి కాదు. సాక్షాత్తూ పరమాత్మ. ప్రతి శ్లోకాన్ని, వాక్యాన్ని పరమ సత్యంగా, స్వతః ప్రమాణంగా తీసుకోవాలి.

శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
 

43

రాగద్వేషవిముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్|
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి|| 2-64 ||
రాగద్వేషములనుండి విముక్తిపొందినవాడు, తన వశములోనున్న ఇంద్రియములతో విషయానుభవము (దేహయాత్రకు ఉపయుక్తమైన అన్నపానాదులు) పొందువాడైనను, మనోనిర్మలత్వమును (మనశ్శాంతిని) పొందుతున్నాడు (ప్రసాద మధిగచ్ఛతి) (ప్రసాద = tranquility, serenity of disposition)

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే|
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే|| 2-65 ||
మనోనిర్మలత్వము కలుగగా మనుజునకు సమస్త దుఃఖములు ఉపశమించుచున్నవి. ప్రసన్న చిత్తముగలవానికి శీఘ్రముగానే బుద్ధి సుస్థిరమగును.
Bottom of Form


No comments:

Post a Comment