నన్నెచోడుడు - మానవల్లి రామకృష్ణ
కవి
https://cherukurammohan.blogspot.com/2017/11/blog-post.html
ముందు మానవల్లి రామ కృష్ణ కవి గారిని
గూర్చి తెలుసుకొందాము.
ఆంగ్లేయుల ప్రాపుతో, తిమ్మిని బమ్మిని
చేసి కూడా, అవ్యయమైన పేరు ప్రతిష్ఠలు
సంపాదించిన మహనీయులు ఎందఱో ఉన్నారు, ‘సర్’ ‘రావు
బహద్దర్’ ఆదిగా గల
బిరుదులను, నాటి ‘Madras University’ Senate Membership పొందిన
మహనీయులు ఎందఱో తెలుగును ఆంద్ర భాషా చరిత్రను తమ మనసుకు నచ్చిన రీతిలో, సమగ్రమైన
కృషి లేకుండానే, మనకు కట్టబెట్టిన ఆ మహానీయులకందరకు ప్రణామములు.
కొందరు అట్లుగాక నిజమైన చరిత్రను
ఎన్నో ఆర్ధిక శారీరిక కష్టాలకు ఓర్చి నిజమైన
చరిత్ర మన ముందు ఉంచినా అవి మన
అందుబాటులోనికి రానీకుండా చేసి, ఆ
కృషిచేసిన మహానుభావుల రూపురేఖలు కూడా లేకుండా
చేసినారు. అయినా కూడా
ఎంతో కష్టించి, మానవల్లి రామకృష్ణ కవి గారిని వెలుగులోనికి
తెచ్చుటకు ప్రయత్నించిన
డా.బోయినిపల్లి ప్రభాకర్, తెలుగు సహాయ ఆచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
ఆర్మూర్,
నిజామాబాద్ జిల్లా, గారికి ఎంతో రుణపడి ఉన్నాము. మానవల్లి
రామకృష్ణ కవి గారి
పేరును, తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవాళ్లందరూ స్మరించుకొనవలసిన
పేరు.
తన కాలంనాటికి చరిత్రకు ఎక్కకుండా, తాళపత్రాల్లోనే మరుగున పడిపోతున్న సాహితీ
సంపదను
వెలికితీసిన కీర్తి రామకృష్ణ కవి గారిది. నన్నయకు పూర్వమే తెలుగు
సాహిత్యం కాంతులీనిందన్న వాదనకు ఆధారమైన నన్నెచోడుడు అనేవాడు
ఒకడున్నాడని లోకానికి చాటింది
మానవల్లి వారే! ఒక్క కుమారసంభవమే కాదు,
కాలమాళిగలోంచి ఎన్నో కావ్యాలు, కవులను వెలుగులోకి తెచ్చిన మహా
పరిశోధకులాయన.
సాహిత్యచరిత్ర వికాసానికి మూలం ‘మౌలిక
పరిశోధనే’ అని నిరూపించిన వ్యక్తి మానవల్లి
రామకృష్ణకవి. ‘‘ఆనాడా వాఙ్మయతపస్వి
విస్మృతకవులు అనుపేర, సాహిత్యపు
ప్రపంచమంతకుముందు కనివిని యెఱుగని కావ్యములను,
ప్రకటింపబట్టియే నేటి మన
సారస్వత చరిత్ర యిట్టి పరిణత స్థితికి వచ్చినది. ఆయన
జన్మించి యుండకపోయిన
యెడల ఆంధ్ర సాహిత్యచరిత్ర అంధకారబంధురమై యుండెడిదనుటలో
అతిశయోక్తి
లేదు’’ అన్నారు నిడుదవోలు వెంకటరావు. నిజంగానే మానవల్లి జీవితమంతా
చరిత్ర
విస్మరించిన కవులు, కావ్యాల పరిశోధనకే
అంకితమైంది.
మానవల్లి రామకృష్ణ కవి 1866లో మద్రాసులోని
నుంగంబాకంలో జన్మించినారు.
ఆయనది పండిత కుటుంబం. తండ్రి నాట్యశాస్త్రానికి
వ్యాఖ్యానం వ్రాసినారు. ఇక
రామకృష్ణ కవివర్యులు బాల్యంలోనే కవితాశక్తిని
ఒడిసిపట్టుకున్నారు. తెలుగు,
సంస్కృతం, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లోనూ ప్రావీణ్యం సాధించినారు. ఆ పాండిత్యం,
తాళపత్ర గ్రంథాలపట్ల ఆసక్తి ఆయన్ను గొప్ప మౌలిక
పరిశోధకునిగా నిలబెట్టాయి.
రామకృష్ణకవి సంస్కృతం, తెలుగు ప్రధానంగా MA
చదివినారు. మౌలిక
పరిశోధనపట్ల ఆసక్తితో తంజావూరు సరస్వతీమహల్‌ను ఆశ్రయించినారు.
అందులో
లభ్యమైన కావ్యాలను ఎలా ప్రచురించవలెనని అనుకుంటున్న తరుణంలో, ఆయనకు
1904లో వనపర్తి
సంస్థానంలో ఉద్యోగం లభించింది. అక్కడి ‘బ్రహ్మవిద్యా విలాస
ముద్రాక్షరశాల’ ద్వారా
‘విస్మృతకవులు’ ధారావాహికలో భాగంగా, అపూర్వమైన
కావ్యాలను వెలుగులోకి తెచ్చినారు. ఈ సమయంలో సంస్థాన ఉద్యోగులు కొంతమంది
ఆయన మీద
అపవాదులను ప్రచారం చేసినారు. మంచికి మననుగడ అంత సులభము
కాదు కదా! హంస గొప్పదనము కొంగలకు తెలిసే అవకాశము లేదు
కదా! దాంతో
1912లో వనపర్తిని వదిలిపెట్టి మళ్లీ
మద్రాసు చేరుకున్నారు.
ఆ తర్వాత రామకృష్ణకవి తన దృష్టిని సంస్కృత సాహిత్యం మీదికి మరల్చారు.
1915లో మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఉద్యోగంలో
చేరారు.
భాండాగారం తరఫున కేరళలో పర్యటించి అమూల్యమైన సంస్కృత సాహితీ సంపదను
పోగుచేశారు. ఆ ప్రయత్నంలో నంబూద్రి బ్రాహ్మణుల దగ్గర భాసవిరచితమగు, ఆయన
రచనల జాబితాలో చేరని, ‘డమరుకం’ అనే నాటకాన్ని, సంపాదించి
మనకందించినవారాయన. 1926 వరకు అక్కడే పనిచేసినారు.
అయితే భాండాగారం
నిబంధనలకు విరుద్ధంగా కుందమాల, కౌముది
మహోత్సవం నాటకాలను స్వయంగా
ప్రకటించి ఉద్యోగం కోల్పోయినారు. మరి పనిచేసే ఉత్సుకత
కలిగినవాడు
తప్పులుచేస్తాడు.
తర్వాత 1932 వరకు రాజమండ్రిలో ఉపాధ్యాయుడిగా పనిచేసినారు. అది
తాత్కాలిక
ఉద్యోగం కావటంతో పింఛనుకు నోచుకోలేదు. దాంతో తన 66వ ఏట మళ్లీ ఉద్యోగ
ప్రయత్నం చేసినారు. అలా మద్రాసు
విశ్వవిద్యాలయంలో ఏడాదిపాటు ఉండి 50
మెకంజీ
సంపుటాలను తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించినారు. 1933లో
తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాశాఖ అధికారిగా, 1940- 54 మధ్య శ్రీవేంకటేశ్వర
ప్రాచ్య పరిశోధన సంస్థలో సంస్కృత
శాఖాధ్యక్షులుగా ఉద్యోగాలు నిర్వహించినారు.
పరిశోధన కోసం తన సంపదనంతా వెచ్చించిన
రామకృష్ణకవి చివరిదశలో దుర్భర
పేదరికాన్ని అనుభవించినారు. ఈ స్థితిలో ప్రభుత్వం
ఆయనకు నెలకు రూ.150
గౌరవభృతిని
మంజూరుచేసింది. 1957 సెప్టెంబర్ 20న ఈ ‘మౌలిక పరిశోధనా
దురంధరుడు’ కీర్తిశేషులయినారు.
ఆయన పడిన శ్రమ, ప్రాచీన కవులపై ఆయన
కున్న గౌరవ ప్రపత్తులు
కొలమానమునకందనివి. అసలు సాహిత్యచరిత్ర పరిణత స్థితికి
ప్రధానపాత్ర పోషించేది
మౌలిక పరిశోధనే. అంటే చరిత్రకెక్కని ప్రాచీన కావ్యాలను, కవులను గురించి
ప్రకటించడంలో భాగంగా- తాళపత్రాలను సేకరించడం, వాటిని సరిపోల్చడం,
పాఠ్యభేదాలలో
సరైన దాన్ని గ్రహించి పరిష్కరించడం, కవి దేశ
కాలాలను నిర్ణయించి,
విపులమైన పీఠికతో ఆ
కావ్యాన్ని ప్రకటించడం లాంటివి. ఇదెంతో కష్టమైన పని.
అలాంటి మౌలిక పరిశోధనను ఓ
యజ్ఞంలా భావించి, తన జీవితాన్ని
అర్పించినారు
రామకృష్ణకవి. ఆ కృషిలోంచి మొగ్గతొడిగిందే ‘విస్మృత కవులు’ గ్రంథమాల. 1908లో
‘కుమార సంభవం’ మొదటిభాగంతో మొదలుపెట్టి ‘క్రీడాభిరామం, నీతిసార ముక్తావళి,
ప్రబంధమణిభూషణం, పరతత్త్వ రసాయనం, అనర్ఘరాఘవం, త్రిపురాంతకోదా హరణం,
శ్రీరంగమాహాత్మ్యం, కుమార సంభవం రెండోభాగం, సకలనీతి
సమ్మతం’ తదితర
గ్రంథాలను విపులమైన పీఠికలతో తొలిసారిగా ప్రకటించినారు. ఆయన రాసిన
పీఠికలు
ప్రత్యేక సాహిత్య ఖండాలుగా స్థిరపడినాయి. ఈ పీఠికలు పుస్తకానికి ఉన్నంత
ప్రసిద్ధి
సాధించినాయి. కుమారసంభవం, క్రీడాభిరామం
పీఠికలు ఈ కోవలోవే.
అంతవరకు సాహితీ ప్రపంచంలో తెలియని ప్రాచీనకవుల విశిష్టతను వివరిస్తూ
వైజయంతి,
భారతి, ఆంధ్ర సాహిత్య
పరిషత్పత్రిక, శ్రీవేంకటేశ్వర ప్రాచ్యపరిశోధన
పత్రికల్లో
రామకృష్ణ కవి వ్యాసాలు వ్రాసినారు. ‘ఆంధ్ర రాజకవులు’ (1910) వ్యాసంలో నన్నెచోడుడు
నుంచి పాలవేకరి కదిరీపతి వరకుగల
రాజకవులను గురించి స్థూలంగా
తెలపడంతోపాటు, ముకుందమాల
కర్త సాయప వేంకటపతి; ద్విపద రామాయణ
రచయిత
కట్టా వరదరాజ కవులను సాహితీలోకానికి పరిచయం చేశారు. ఇంకా ఈ
వ్యాసంలో
ఆముక్తమాల్యదను రాయలు రచించలేదనీ, ఎవరో వైష్ణవుడు
రచించాడని
ప్రతిపాదించారు. ఇది నాటి పండితుల్లో చర్చకు దారితీసింది. ఎన్నో కొత్త
విషయాలు
వెలుగులోకి రావడానికి తోడ్పడింది. 1915లో ‘తెనాలి కవులు’ వ్యాసంలో
రామకృష్ణుడితోపాటు ఆ వంశపు ఇతర కవులను, వారి గ్రంథాలను గురించి వ్రాసినారు.
‘పాండురంగ మాహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్రం, ఘటికాచల
మహాత్మ్యాలే కాకుండా
హరిలీలా విలాసం, కందర్పకేతు
విలాసం’ అనే ప్రబంధాలనూ తెనాలి రామకృష్ణుడు
రచించినాడని చెప్పినారు.
కందుకూరి వీరేశలింగం ‘కవులచరిత్ర’లో
లేని కవులను వెలుగులోకి తేవడానికి ఎక్కువ
కృషిచేసినారు రామకృష్ణకవి. 1916లో వసుచరిత్రను గురించి రాస్తూ- దీనికి
సంస్కృతంలోనేకాక
తమిళ అనువాదం కూడా ఉందన్నారు. సంస్కృతంలోని కొన్ని
విస్మృత నాటకాలు, తెలుగు- సంస్కృత నరసభూపాలీయాలు, కొన్ని కాకతీయ
శాసనాలు, రామకృష్ణార్జున
రూప నారాయణీయం, తుక్కాపంచకం, ఎలకూచి
వేంకటకృష్ణరాయకవి, శ్రీకృష్ణ లీలాశుకకవి, కాళకలభకవి, ఉదయనోదయం,
లీలావతికథ, కవికంఠపాశం లాంటి కావ్యాలు, కవుల గురించి తొలిసారి వ్యాసాలు
రాసింది మానవల్లి వారే! రఘునాథ రామాయణం, కవి గజాంకుశాలను ఆంధ్ర సాహిత్య
పరిషత్పత్రికలో, శుకసప్తతి కావ్యావతారికను, వాల్మీకిచరిత్రను ‘సరస్వతీ’ పత్రికలో
తొలిసారిగా ప్రకటించారాయన. తరిగొండ
వెంగమాంబ,
గణపవరపు వేంకటకవి,
పట్టమెట్ట
సోమనాథ సోమ యాజి, కస్తూరి భట్టురాజు, చింతలపల్లి కవులనూ
వెలుగులోకి తెచ్చినారు.
తాళపత్ర పరిశోధనలోనే కాదు, కవిత్వంలోనూ
రామకృష్ణకవిది అందెవేసిన చేయి.
‘మృగావతి, వసంతవిలాసం’
కావ్యాల్లో ఆయన ప్రౌఢ మధుర కవిత్వం బయటపడుతుంది.
ఈ సామర్థ్యమే ‘కుమారసంభవ’
కర్తృత్వం విషయంలో ఆయన మీద ఆరోపణలకు
కారణమైంది. ఇంకా ‘కళింగసేన’ నాటకం, ‘వత్సరాజ చరిత్ర’ నవలలను
రచించడంతోపాటు భాస నాటకాలైన
కర్ణభారం,
అవిమారకాలను అనువదించారు.
మౌలిక పరిశోధనలో భాగంగా
ఆంగ్లంలోనూ వ్యాసాలు రాశారు. నిడుదవోలు
వెంకటరావు, డా।। పోణంగి శ్రీరామ అప్పారావుల సంపాదకత్వంలో ‘మానవల్లి కవి-
రచనలు’ పేరిట 1972లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఓ బృహత్ గ్రంథాన్ని
ప్రచురించింది.
'దక్షిణ భారతి గ్రంథమాల పేరుతో మానవల్లి అపూర్వమైన విస్మృత సంస్కృత నాటకాలను,
కావ్యాలను ప్రకటించినారు. వాటిలో భాగముగా 'కుందమాల' నాటకాన్నిప్రచురించినారు.
"ఆయన జీవిత సార్తక్యానికి ఈ ఒక్క నాటకమే చాలు" అని రాహుల్ సాంకృత్యాయన్
మానవల్లిని కీర్తించినారు. సామ్బోపాఖ్యానము, ఐరావత చరిత్రము, హరిభాట్టు గారి
'ఉత్తర నారసింహ మస్త్యపురాణాలు' దండి 'అవంతీ సుందరి కథ' , శూద్రకుడి 'వత్సరాజు కథ, విజ్జికాదేవి కౌముదీ మహోత్సవము' లతో బాటు భరతుడి నాట్య శాస్త్రానికి అభినవ గుప్తుడి వ్యాఖ్యలనుమానవల్లి తొలిసారిగా ప్రకటించినారు. ఇంకా సంగీత నాత్యశాస్త్రాలలోని పారిభాషిక పదాలతో 'భారేఅత కోశం' పేరిట సంస్కృత బృహత్ నిఘంటువును సంకలనము చేసినారు.
రామకృష్ణకవికి తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన
గుర్తింపును తెచ్చిపెట్టిన కావ్యం
‘కుమార సంభవం’. తొలిసారి దాన్ని సంపాదించి
పరిష్కరించి, ప్రకటించిన ఘనత
ఆయనదే. దీనిపై
చెలరేగినంత వివాదం మరే కావ్యంపైనా రాలేదు. కవి కాల నిర్ణయంలో
మానవల్లి అనేక శాసన, మత ప్రమాణాలు, వ్యాకరణ ఛందో
విశేష అపూర్వపద
ప్రయోగాల ఆధారంగా నన్నెచోడుడు నన్నయకంటె ముందువాడని ప్రతిపాదించినారు.
దీనిమీద జరిగిన వాదవివాదాల్లో ఆనాటి ప్రసిద్ధ పండితులంతా పాల్గొన్నారు. దాంతో
నన్నెచోడుని మీద ప్రత్యేక వాఙ్మయమే వెలువడింది. కొంతమంది విమర్శకులు,
కుమారసంభవాన్ని రామకృష్ణకవే రాసి, నన్నెచోడుడి పేర వెలయించారని అన్నవాళ్లూ
ఉన్నారు.
మొత్తానికి, మానవల్లి వాదాన్ని సమర్థించని వాళ్లు
ఎక్కువగా ఉండటంతో
నన్నెచోడుడు నన్నయ, తిక్కనల
నడిమివాడన్న అంగీకారం సాహితీలోకంలో
స్థిరపడింది. బహుశ ప్రాంతీయ తత్వము ఇందుకు
ఎక్కువగా ఉపకరించి ఉంటుంది. కాకుంటే ‘కుమార సంభవ’ కావ్యము మానవల్లి వారే వ్రాసి ‘నన్నే
చోడు’ని పెరునతికించినారన్న అపవాదును ఆయన పై వేయుటకంటే మించిన హేయభావన వేరేమయినా
ఉంటుందా!
ఎంతోమంది ప్రసిద్ధ వ్యక్తులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే గుర్తింపు, గౌరవం
లభించడం చరిత్ర అసమగ్రతకు తార్కాణం. రామకృష్ణకవి
విషయంలోనూ ఇది
వర్తిస్తుంది. ఆయనకు తెలుగు సాహితీ ప్రపంచంలో రావాల్సినంత గుర్తింపు
రాలేదు.
పరిశోధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాళపత్రాలను వెలికితీయడాన్ని,
ప్రచురించడాన్ని మానవల్లి మానుకోలేదు. ఒకవేళ ఆయనే గనుక ఈ
పనికి
పూనుకోకపోతే ఎన్నో ప్రాచీన గ్రంథాలు మనకు దక్కేవి కావు.
రామకృష్ణ కవి, ఆ తరువాత వచ్చిన వేటూరి ప్రభాకర శాస్త్రి, తిరుమల రామచంద్ర
మొదలైన సాహితీ పరిశోధకులకు మార్గదర్శకుడైనాడు. మానవల్లి వారు పూర్వకాలపు
సంకలన గ్రంథమైన 'ప్రబంధ మణిభూషణా'న్ని బైటపెట్టగా, ప్రభాకరశాస్త్రి దానివిలువను
తెలిసినవాడై, చాటుపద్య మణిమంజరి రెండు భాగాలను, ప్రబంధ రత్నావళిని వలవేసి
బైటికి లాగినారు. రామకృష్ణ కవి క్రీడాభిరామాన్ని తెలుగువారికి అందజేయగా,
శాస్త్రిగారు ఆ పుస్తకాన్ని ముచ్చట లొలికే పండిత కూర్పును, చక్కని పీఠికతో విందు
జేసినారు. మానవల్లి వారి దోవ ప్రభాకర శాస్త్రికి ఘంటాపథమయింది.
‘‘పగడపు పురుగులు మహాసముద్రంలో చుట్టూ గోడలను కట్టుకొంటాయి. అవి మానవులకు దీవులవుతాయి. అట్లే
మానవులలో మేధావులు తమ లాభం కోసం, పొగడ్తల కోసం గాక
నైసర్గికంగా పనిచేసుకొని పోతారు. దానివల్ల జాతికి మాత్రమే శాశ్వత ప్రయోజనం’’ అన్న
టేకుమళ్ల కామేశ్వరరావు మాటలు మానవల్లి రామకృష్ణకవికి అక్షరాలా సరిపోతాయి.
స్వస్తి.
నన్నె చోడుని గూర్చి మరొక మారు ముచ్చటించుతాను.
నన్నెచోడుడు
నన్నెచోడుడు కడప జిల్లాలో తూరుపు
ప్రాంతాలతో చేర్చి నేటి నెల్లూరు ప్రకాశం
జిల్లాలలోని కొన్ని ప్రాంతములకు అధిపతియై పాలించినాడు. ప్రసిద్దుడగు కరికాల
చోళుడు
తమ పూర్వీకుడని చెప్పుకొన్నాడు ఈయన. ఈయన తండ్రి చోడబలి యని, తల్లి
శ్రీసతి యని తెలియవస్తూ వున్నది. ఈయన కడప జిల్లా
నందలురులోని ప్రసిద్ధిగన్న
సౌమ్యనాథస్వామి ఆరాధకులు. ఈయనకు శివ కేశవ భేదము లేదు.
ఇక అసలు
విషయమునకు వత్తము.
మానవల్లి రామకృష్ణ కవి (1866-1957) సాహిత్య పరిశోధకుడు, కవి మరియు
సంస్కృతాంధ్ర పండితుడు. బహుభాషా కోవిదుడు. సంస్కృతము, ఆంధ్రము, అరవము,
కన్నడము, మలయాళము మరియు
ఇంగ్లీషు భాషలలో పాండిత్యము కలవాడు.
అన్నమయ్యను వెలుగులోనికి తెచ్చిన మొట్టమొదటి
మహనీయుడు ఈయన.
రాయలసీమ ప్రాంతానికి ఉద్యోగ రీత్యా వచ్చి స్థిరపడిన రామకృష్ణ కవి 1933లో టీటీడీ
విద్యాశాఖాధికారిగా పనిచేసినాడు.
'కుమార సంభవ' కావ్యాన్ని కనుగొని, పరిష్కరించి అజ్ఞాత వాసము నుండి బయటకు
తెచ్చి, ప్రచురించిన పట్టుదల ఈ మహనీయునిది. అసలు అప్పటివరకు వరకూ
తెలుగు
సాహిత్యంలో నన్నెచోడుడనే కవి ఒకడున్నాడనే సంగతే ఎవరికీ తెలియదు. ఇతర
కవులెవ్వరూ నన్నెచోడుని గురించి గానీ, అతని కుమార
సంభవ కావ్యమును గురించి
గానీ, పూర్వ కవి
ప్రశంసల్లో గానీ మరెక్కడా గానీ ఒక్క ముక్క కూడా వ్రాసిన పాపాన
పోయినది లేదు.
తంజావూరు లోని సరస్వతీ మహల్ గ్రంథాలయములో ఒక మూలపడి
ఉన్న తాళపత్ర గ్రంథమును
కనుగొని,
దానిని పరిష్కరించి 1909లో ప్రకటిస్తూ నన్నె
చోడుడు నన్నయ
కంటే ముందువాడని రామకృష్ణ కవి చేసిన ప్రతిపాదన పండిత
లోకాన్ని ఎంతటి ఆశ్చర్యానికి
గురి చేసిందంటే చెప్పుట మాటలకు శక్యము కాదు. ఈ
ప్రతిపాదన మీద చర్చలూ, ఉపచర్చలూ, వాదోపవాదాలూ బాగానే
జరిగి,
అరిగించుకోలేక, అసలు ఈ
కావ్యమును నన్నెచోడుడు వ్రాయలేదు-రామకృష్ణ
కవి రాసి నన్నెచోడుని పేరు పెట్టినాడని కొర్లపాటి శ్రీరామమూర్తి పుస్తకం వ్రాసినారు.
ఒక్కొక్కసారి మితిమీరిన ప్రాంతీయాభిమానములుకూడా వాస్తవాలను గతములో తప్పుదారి
పట్టించిన దాఖలాలు మనకు ఎన్నో కానవస్తాయి.
కడప జిల్లాకు సంబంధించిన తూరుపు ప్రాంతాలను
పొత్తపి రాజధానిగా చేసుకొని పాలించిన మహారాజు నన్నె చోడుడు. కడప
జిల్లా తో బాటూ నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొంత భాగము వీరి ఎలుబడి క్రింద
ఉండేది. క్రీ.శ.రెండవ శతాబ్దంలో అరణ్యప్రాంతంగా ఉన్న
"పొత్తపి" ప్రాంతాన్ని, సోమరాజు, మలిదేవరాజులు, సంయుక్తముగా బాగుచేసి, బాహుదానదికి దక్షిణంలో విశాలమైన కోట
నిర్మించినారు. గతంలో దీనిని పలువురు రాజులు, రాజధానిగా చేసుకొని పరిపాలించినారు. దీనికోసం
ముస్లిములు అప్పట్లో దండయాత్రలకు యుద్ధాలకు పాల్పడి, ముఖ్యమైన నిర్మాణాలను నాశనం
చేసినారు. ప్రస్తుతం దీనికి చెందిన శివాలయాలు, అవశేషాలు, శాసనాలు ఉన్నవి. 30 మంది రాజులు దీనిని
పాలించినారు. చివరగా బ్రిటిషువారు పరిపాలించినారు. గతంలో పొత్తపి, సిద్ధవటం తాలూకాలో ఉండేది.
మండలాల పునర్వ్యవస్తీకరణలో భాగంగా, పొత్తపి, నందలూరు మండల పరిధి లోనికి వచ్చినది. దీనికి ఘన
చరిత్ర ఉన్నది. ప్రముఖ పుస్తక పరిశోధన రచయిత, కవనికౌముది బిరుదాంకితులైన శ్రీ పోతురాజు వెంకట
సుబ్బన్న, దీని
ప్రాచీన చరిత్రను, ప్రాశస్త్యముపై, సమగ్ర పరిశోధన చేసి, పుస్తక రూపం లోకి తెచ్చినారు.
మొట్టమొదట ఛందోబద్ధ పద్య పాదములు రేనాటి రాజుల కాలము లోనే కడప ప్రాంతములో
దర్శనమిచ్చిన దాఖలాలున్నాయి. తిరిగీ నన్నెచోడుని విషయమునకు వస్తే, ఈయన కాళీదాస మహాకవి గారి కుమార
సంభవమును తెనిగించినారు. కానీ రచనకు తనదైన శైలి ఉరవడిని జోడించినారు. కావ్య
ప్రారంభములో సకల దేవతా ప్రార్థన , గురు ప్రార్థన , పూర్వకవి స్తుతి,, కుకవి నింద, కవి స్వ విషయం కృతి పతి వర్ణన, షష్ఠ్యంతాలు, రచియించి భావి తెలుగు కావ్యములకు బాట వేసినాడు.
పరిశోధక తపస్వి యనబడు బి.యన్. శాస్త్రిగారి
శాసనాధారమగు పరిశోధనలో
నిర్ద్వంద్వముగా నన్నె చోడుడు ఆదికవి యని తేటతెల్లము గావించినారు.
''ఆదికవి నన్నెచోడుడు'' అనే
పేరుతో ఆయన ప్రతిపాదిత అంశాలు 1972 భారతి,
ఫిబ్రవరిలో ప్రచురింపబడినాయి.
''కుమార సంభవము తెలుగులో
రచింపబడిన మొట్టమొదటి గ్రంథము'' అనే వాక్యాలతో
ఆరంభమైన ఈ
వ్యాసంలో ''నన్నెచోడుడు నన్నయ - తిక్కనల తరువాత కవి
అనే
అభిప్రాయానికి ఆధారాలు లేవు'' అని కుండ బద్దలు కొట్టినట్లు
వ్రాసినారు ఆచార్య
బి.ఎన్. శాస్త్రిగారు. కుమార సంభవము ''కావ్యశైలిలో
రచించిబడిన ప్రబంధము'' అని
సూత్రీకరించినారు. నన్నెచోడుడు ఎందుకు
ఆదికవి అవుతాడో శాసనాల ఆధారంగా ఈ
వ్యాసంలో సమగ్రముగా విశ్లేషింశించినారు.
నన్నెచోడుడు రెండవ యుద్ధమల్లుని
సామంతుడు (930-934) అని పేర్కొన్నారు. ఈ వ్యాసాన్ని ఒకటికి
రెండుసార్లు శ్రద్ధగా
చదివిన వారికి నన్నెచోడుడే తెలుగు ఆదికవి అనే అభిప్రాయం
బలపడుతుంది. అంత
తర్కబద్దంగా ఉన్న వ్యాసమిది. వ్యాసంలోని ముగింపు వ్యాఖ్యను ఒకసారి
నిశితంగా
పరిశీలించండి.
''ఇట్లు ఆంధ్రభాషలో తొలి
కావ్యమును రచించిన ఆదికవి నన్నెచోడుడు
శివకవియైనందున మరుగుపడి, పదియవ
శతాబ్ధిలో ఆంధ్రమునందాది కావ్యము
రచింప, ఇరువదియవ శతాబ్ధిలో ఆ గ్రంథము వెలుగులోనికి
రాగా, ఆంధ్ర
పండిత
ప్రకాండులు చారిత్రకులు, నన్నెచోడుని పన్నెండవ శతాబ్దివాడుగా
నిర్ణయించుట
చూడగా కొన్నికొన్ని దురభిమానములెంత శక్తిమంతమైనవో ఊహింపవచ్చును."
విషయమును ‘స్తాళీ పులాక న్యాయము’లో
తెలియజేసినాను. విస్తారముగా
జిజ్ఞాసువులు పరిశోధించవచ్చును.
స్వస్తి.