Tuesday, 13 December 2016

అజామీళుడు

అజామీళుడు
https://cherukurammohan.blogspot.com/2016/12/blog-post.html

ఈ కథ నాకు మా అమ్మమ్మ నన్ను తన వడిలో కూర్చోబెట్టుకొని చెప్పినది. పెద్దయి భాగవతము చదివిన పిదప నేటి బాలలకు పెద్దలు చెబుతారనే ఆశతో వ్రాసినాను.
అజామీళుడు
పూర్వ కాలమందు కన్యాకుబ్జ మను నగరమున చతుర్వేద పండితుడైన ఒక విప్రుడుండెను. అతని పేరు సత్య వ్రతుడు అతనికి తగిన హేమవతి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలునికి అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు అతి గారాబము వలన పెద్దలను కూడ ధిక్కరించి దుష్ట సహవాసములు చేయుచు, బ్రాహ్మణ ధర్మములు పాటించక, విద్య నభ్యసింపక కాలము గడుపుచుండెను. యౌవనము రాగా కామంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞోపవీతము త్రెంచి, మధ్యము చేత మత్తుడై ఒక ఎరుకల స్త్రీ ని వలచి, యింటికి రాకుండా, ఆమె తోడనే ఉండిపోయెను. అతి గారాబము గుడ్డిది. అదుపు తప్పినా అబ్బాయి తాడు తెగిన గాలిపటమే కదా ! ఆజామీళుడు కుల భ్రష్ఠుడు కాగా, వాని బంధువులు అతనిని విడిచి పెట్టిరి. ఆజామీళుడు పక్షులను, జంతువులను వేటాడుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ ఎరుకలసాని చనిపోయెను. ఆ మెకు అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా అజామీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. మరుల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ'అని పేరు పెట్టి ప్రేమతో సాకు చుండిరి. కాని ' నారాయణ' నామ స్మరణ తనను పాప రహితుని చేయునని మాత్రము ఆతనికి తెలియదు. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజామీళునకు రోగగ్రస్తుడై చావునకు సిద్దపడెను.
కొడుకు పై ప్రేమతో నారాయణా నారాయణా అంటూ ప్రాణముల నాతడు విడిచెను. భయంకరాకారులైన యమ భటులు ప్రత్యక్షమైరి కానీ అజామీళుని నోట ' నారాయణా' శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు శ్రీ మన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ' ఓ యమ భటులారా! వీడు మావాడు మేము వీనిని వైకు౦ఠమునకు తీసుకొని పోవ వచ్చితిమి'యని చెప్పి, అజామీళుని విమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు ' అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కోరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొడ౦గిరి.
'ఓ యమ దూత లారా! మేము విష్ణు దూతలము వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూతలారా! మానవుడు చేయు పాపపుణ్యములను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, వాయువులు,రాత్రి౦బవళ్లు సంధ్య కలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చుందురు. మా ప్రభువుల వారీ కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు.
వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారును, గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు, పర స్త్రీ లను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను - గురువులను - బంధువులను- కుల వృతిని తిట్టి హింసి౦చు వారున్నూ, జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించు వారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును, పెళ్ళిళ్ళు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండి౦పుడని మా యమ ధర్మ రాజు గారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజా మీళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకు లోనై కుల భ్రష్టుడై జీవ హింసలు చేసి, కామాంధుడై వావి వరసలు లేక, సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు? ‘అని యడగగా విష్ణు దూతలు ' ఓ యమ కి౦కరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయు వారును, జప దాన ధర్మములు చేయు వారును- అన్నదానము, కన్యాదానము, గోదానము , సాలగ్రామ దానము చేయు వారును, అనాధ ప్రేత సంస్కారములు చేయు వారును, తులసి వనము పెంచు వారును, తటాకములు త్రవ్వి౦చు వారును, సదా హరి నమ స్మరణ చేయువారు మరణ కాలమందు ' నారాయణా'యని శ్రీ హరిని తెలిసిగాని తెలియక గాని మరే రూపమున గాని స్మరణ చేసిన వారు పుణ్యాత్ములు! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనను మరణకాలమున" నారాయణా"అని పలికి వైకుంఠ వాసమునకు అర్హత సంపాదించెను.
సంస్కృత భారతములో వ్యాసులవారు ఏమంటున్నారో చూడండి. వ్యాస'భాగవతం' లోని షష్ఠమ స్కందంలో సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళన మేవవా |
వైకుంఠ నామగ్రహణం అశేషాఘహరం విదుః ||
పతితః స్ఖలితః చిన్నహ సందశ్తః తప్త ఆహతః |
హరిరిత్యవశేనాః పుమాన్ నార్హతి యాతనాం ||

అనగా, ఎవరికైనా పెట్టిన పేరు పెట్టి పలికినా, పరిహాసంగా పలికినా, వెక్కిరిస్తూ హేళనగా పలికినా, ఊత పదంగా పలికినా, యే విధంగా అయినా భగవన్నామమును ఉచ్చరిస్తే పాపాలన్నీ సమసి పోతాయి. ఎత్తు పై  నుండి పడినప్పుడు కాని, ఎముకలు విరిగినప్పుడు కాని, పాము, తేలు లాంటివి కరచినప్పుడు కాని, వళ్ళు కాలినప్పుడు కాని, జ్వర తీవ్రతలో కాని, అమ్మ, నాన్నా అని అరచే బదులు శ్రీహరినామావళిని ఉచ్ఛరిస్తే, అదే  ఔషధమై పని చేస్తుంది. అందుకే వ్యాసులవారు మనకు విష్ణుసహస్రనామావళిని ఎంతో మమకారముతో అందించినారు. 

ఈ సందర్భములో పోతన్న విష్ణుదూతలతో ఈ పద్యమును చెప్పించినాడు.
6-117-ఉ.
 ఈతఁడు కోటిసంఖ్యలకు నెక్కుడు పుట్టువులందుఁ జెంది యా
యాతము లైన పాప నివహంబుల నన్నిటిఁ బాఱఁ దోలెఁ బ్ర
ఖ్యాతమతిన్ మహా మరణ కాలమునన్ హరిపుణ్యనామ సం
భూత సుధామయాద్భుత విభూతిక రాక్షర సంగ్రహంబునన్.
మఱియు వినుండు, జన్మంబు శాంత ఘోర మూఢ గుణంబులచేత నైనను, సుఖదుఃఖ గుణంబులచేత నైనను, ధార్మికాది గుణంబులచేత నైనను, సకల భూతంబులుఁ ద్రైవిధ్యంబు నే ప్రకారంబునం బొందు, నా ప్రకారంబున జన్మాంతరంబునం బొందుచుండు; దేవుండైన యముండు సర్వ జీవాంతర్యామియై ధర్మాధర్మయుక్తం బయిన పూర్వ రూపంబుల మనస్సుచే విశేషంబుగఁ జూచుచుండి, వాని కనురూపంబులఁ జింతించుచుండు; అవిద్యోపాధి జీవుండు తమోగుణయుక్తుం డై ప్రాచీన కర్మంబులచేత నేర్పడిన వర్తమాన దేహంబు, నే నని తలంచుచుండి, నష్ట జన్మ స్మృతి గలవాడై పూర్వాపరంబు లెఱుంగం జాలకుండు; మఱియుఁ గర్మేంద్రియంబులచేతఁ గర్మంబులం జేయుచుండి, జ్ఞానేంద్రియముల చేతఁ దమోవిషయంబు లయిన శబ్ద స్పర్శ రూప రస గంధంబుల నెఱుంగుచుండి, పదియాఱవది యైన మనంబుతోఁ గూడి, పదియేడవవాఁ డగుచుండి, షోడశోపాధ్యంతర్గతుం డై యొక్కరుం డైన జీవుండు, సర్వేంద్రియ విషయ ప్రతిసంధానంబు కొఱకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోవిషయంబులఁ బొందుచుండి, షోడశ కళలు గలిగి, లింగ శరీరం బనం బరఁగి గుణత్రయకార్యం బను నిమిత్తంబున హ ర్ష శోక భయంబుల నిచ్చుచున్న సంసారంబు ధరియించుచుండు; విజిత షడ్వర్గు డైన దేహి కర్మంబు లొల్లని బుద్ధి నెఱింగియు, వినియుఁ, గర్మంబులు జేయుచుండి, తన సంచార కర్మంబునం జుట్టుకొన్న పసిడికాయ పురువునుం బోలె నిర్గమోపాయం బెఱుంగక నాశంబు నొందుచుండు, వర్తమాన వసంతాది కాలంబు, భూత భావి వసంతాది కాల యోగ్యంబైన పుష్ప ఫలాదులు తత్కాల జ్ఞాపకంబు నెట్లు జేయు, నట్లు భూత భావి జన్మంబులకు ధర్మాధర్మంబులు నిదర్శనంబులు జేయుచుండు; ఒక్క నరుండు నొక క్షణంబును గర్మంబు జేయకుండువాఁడు లేఁడు; పూర్వసంస్కారంబులం గల గుణంబులచేతఁ బురుషుం డవశుండు గావున బలిమిఁ గర్మంబులు చేయింపంబడుచుండు; అవ్యక్తనిమిత్తంబు నొంది తదనురూపంబు లయిన స్థూల సూక్ష్మ శరీరంబులు మాతా పితృ సదృశంబు లగుచుండు; ఇట్టి విపర్యయంబు పురుషునికిఁ బ్రకృతి సంగమంబునం గలుగుచుండు; ఆ ప్రకృతి పురాణపురుషుం యయిన యప్పరమేశ్వరుని సేవించినం దలంగుచుండు.


అజామీళుడు విష్ణు దూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది " ఓ విష్ణు దూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. మహా పాపిని యైన కుమారుని యందున్న ప్రేమతో 'నారాయణా' యనుట తప్పించి నేను ఏ పుణ్యము చేయలేదు. అంత మాత్రమునకే నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను!' అని అనెను. యమ దూతలు నిరాశతో వెనుదిరుగగా విష్ణు దూతలు ఇకనైనా నారాయణ నామ సంకీర్తన తోనే అకుంఠిత మగు వికుంఠము చేరు వరకు ఎన్ని జన్మలు ఎత్తినా జీవితము గడుపమని చెప్పుచూ అతనిని తీసుకొని వైకుంఠమునకు జనిరి.


పై కథను నేను ప్రకటించిన పిదప చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చి తమ ఆమోదమును తెలిపినారు. ఇరువురు మాత్రము తమ అభిప్రాయమును ఈ విధముగా వ్రాసినారు.

This is wrong story, you please read Pothannagaru/Vyasa bhagavatam, kindly don't post this kind of wrong stories without having full knowledge...

 Dear Sir,
If we tell the stories of this type to children, they try to commit all sins thinking that they would get rid of all the sins by reciting NARAYANEEYAMU MANYRM. This is no good for society. With every respect t you I request you to tell the stories which teach fear to commit any harm to society or any individual. This is very very necessary to the present society.
Regards,
పై రెండు అభిప్రాయములను తెలిపిన వారల పేర్లు తెలుపుట లేదు, అది సంస్కారవంతము కాదు అని అనిపించుటచే. మొదట వ్రాసిన వ్యక్తి ఆ కథ నేను బుద్ధి హీనత చే సక్రమముగా చెప్పలేదు అని వ్రాసినారు. నిజమునకు అజామీళుడు నూనూగు మీసాల నూత్న యవ్వనములో ప్రవేశించి యుండగా ఆయన తండ్రి దర్భలు సమిధలు తెచ్చుటకు అడవికి పంపుతాడు. అక్కడ ఆయన తన జీవితములో మొదటిసారిగా ఇరువురు ఆటవికుల కామకేళీ కలాపము చూస్తాడు. మనసు వాంఛకు బానిసౌతుంది. తానూ దుర్జాతునిగా మారి పోతాడు . పోతన చాలా పద్యములలో అజామీళుని యవ్వన ప్రాప్తి, రతికేళిలనుగూర్చి కొంత వివరముగా వ్రాసినారు. ఇక్కడ అది మొత్తము అప్రస్తుతము కావున ఉదాహరణకు నాకు వలసిన మేరకు మాత్రమే తీసుకున్నాను.
6-95-వ.
అంత ననంగబ్రహ్మ తంత్రమునకు వసంతుడొనర్చు నంకురార్పణారంభంబునుం బోలె లలిత కిసలయ విసర ప్రసార భాసుర బహు పాదపాది పురోపవన పవన జనన ప్రభావ పరికంపిత విటవిటపీ జన హృదయ ప్రఫుల్ల పల్లవ భల్లంబును, అనూన ప్రసూన నిర్భర గర్భావిర్భూత సురభి పరాగపటల పటఘటిత నభోమంలంబును, నమంద నిష్యంద మరంద బిందు సందోహ కందళిత చిత్త మత్త మధుప సంకుల ఝంకార ముఖరిత సకల దిశావలయంబును, నిరంతర ధారాళ రసభరిత పరిపక్వ ఫలానుభవ ప్రభావ సమ్మోదవాద శుక ప్రముఖ పతంగ కోలాహలంబునునై, మధుమాసంబు సర్వ జన మనోహరంబునునై, నిఖిల వనపాదపంబుల నలంకరించె; అయ్యవసరంబున నజామీళుండు పితృనిర్దేశంబునం గుశ సమిత్పుష్ప ఫలార్థంబు వనంబున కరిగి, తిరిగి వచ్చు సమయంబున, నొక్క లతాభవనంబున
ఒక గణిక (వేశ్య) ను తన విటునితో మైమరచి సంగమించుట గాంచినాడు. మరి చిన్న పిల్లలకు ఈ మాట చెప్పుట మంచిదా లేక భాగవతములో లేకున్నా అజామీళుడు చిన్న తనము నుండియే దుర్వర్తనుడైనాడనుట మంచిదా! ఇక అజామీళుడు ఆ సన్నివేశమును ఏ విధముగా చూచినాడు అని పోతన వర్ణించినాడో గమనించండి. గమనించి తెలుపండి ఇటువంటివి పిల్లల కొరకు వ్రాస్తే సాంప్రదాయ బద్ధులు శాపనార్థాలు పెట్టకుండా ఉంటారా!




6-98-శా.

హాలా ఘూర్ణిత నేత్రతో మదన తంత్రారంభ సంరంభతో
ఖేలాపాలన యోగ్య భ్రూవిభవతోఁ గీర్ణాలకాజాలతో
హేలాలింగన భంగి వేషవతితోఁ నిచ్ఛావతీమూర్తితోఁ
గేళిం దేలుచునున్నవానిఁ గనెఁ బుంఖీభూత రోమాంచుఁడై
నేను ఇటువంటి వర్ణనలు కథలో వ్రాసి చెప్పుట మంచిదా! కథలో నేను అజామీళుడు బాల్యము నుండియే తప్పుదారి పట్టినాడు అని తెలుపుటచే తల్లులు తమ పిల్లలకు ఈ కథ చెప్పునపుడు మీరు ఇటువంటి పనులు చేయ కూడదు అని చెప్పగలరు. నేను భాగవతములో వున్నది ఉన్నట్లు వ్రాస్తే ఆ విషయములను పిల్లలకు చెప్పుటకు వీలవుతుందా! మన దేశములోని వివిధములయిన రామాయణములలో పాత్రలు సన్నివేశములు వాల్మీకమును అనుసరించియే ఉన్నాయా!
అసలు వ్యాసులవారు కనబరచిన సన్నివేశములు కొన్ని వాల్మీకి రామాయణములో లేనివి. తులసీ రామాయణము అంతే! కంబ రామాయణమూ అంతే. పురాణములలో కూడా రామకథలో మార్పులు కనబడుతాయి. ఏ మార్పులు వున్నా రాముడు సీత రావణుడు హనుమత్సుగ్రీవాది బలగము, మేఘనాథ కుంభకర్ణాది రావణ బలగము, రామంకితుడైన  విభీషణుడు మారరు. మరి వారినందరినీ తప్పుపట్టగలమా! ఇందులో మళ్ళీ నా తప్పు వెదుక ప్రయత్నించవద్దు. నేను పైన తెలిపిన మహనీయుల పాద ధూళికి కూడా సమానము కాను. నా ఆలోచన అంతా మంచిని పంచడము మంచిని పెంచడము. అంతవరకే. పిల్లలకు బాల్యమునుండి ఇతిహాస పురాణ గాథలను చెప్పకపోతే, వారు పాఠశాలకు పోయినప్పటి నుండి పరమత పాఠములు నేర్చుకొనవలసి వస్తుంది. పిల్లలకు ఇప్పటి నుండి ఒక పునాది ఏర్పరచితే పెద్దయిన పిదప చదివి తెలుసుకోగలుగుతారు. పిల్లల మెదడు ఖాళీ ఇంటితో సమానము. పెద్దలుగా మనము ఏవిధముగానైతే నూతన దంపతులకు సంసారమునకు  తగిన వస్తువుల నిచ్చి సంసారమును ఏర్పరచుతామో అదే విధముగా  బాలురకు తగిన విధముగా, ‘తగిన విధముగా’ అన్న ఈ మాటను మరువవద్దండి, అవసరమైతే కథను మార్చియైనా సరే బాలురకు అనుకూలముగా చెప్పవలసియుంటుంది. అసలు  చి. వనదీప్ మరియు కాశీపతి శాస్త్రి గారి విశ్లేషణ చూసి పైన తేలిపిన మొదటి వ్యక్తి తన మాటలను వెనక్కు తీసుకొన్నాడు. అంటే తీసివేసినాడు ప్రకటనా ఫలకము పైనుండి. రెండవ వ్యక్తి పై ఇరువురి మాటలకు ప్రభావితుడై తన అభిప్రాయమును మార్చుకొన్నాడు. కొంత పని భారము మరియు Type చేయుట నాకు కష్టమగు పని యగుట చేతను కాస్త ఆలస్యముగా జవాబు వ్రాస్తూవున్నాను.
చక్కగా విశ్లేషించిన కాశీపతిగారి అభిప్రాయమును యథాతథముగా మీమున్దున్చుచున్నాను.



Chinthalapalle Kasipathi అజామీళుడి విషయం
సాధారణంగా లోకంలో ప్రసిద్ధిగావున్న విశ్వాసం యేమిటంటే, ‘జీవితంలో ఎన్ని దుష్కర్మలను చేసినప్పటికీ అంత్యకాలంలో నారాయణా!అని అంటే ఆ దుష్కర్మల ఫలములన్నీ నశించి మోక్షం లభిస్తుందిఅన్నది. కానీ యిది వాస్తవంగాదు. అంత్యకాలంలో నారాయణాఅని ఉచ్చరించడగలుగడం, అందుకు తగిన మన: పక్వత లభించడం అంత సులభం కాదు. ఈ మనో పక్వత అనేక జన్మలలో చేయబడిన సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది. మోక్షం అన్నది కేవలం ఒక్క జన్మ అంత్యంలో నారాయణనామోచ్ఛరణచే లభించగలిగినది కాదు. దీనినే భగవాన్ గీతలో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతేఅని అంటున్నారు. గీత (7-19).

గీతలో అర్జునుడు ఈ విధంగా భగవాన్ ను ప్రశ్నిస్తాడు, ‘కృష్ణా! నీవు చెబుచున్న ఈ సాధన, మనసు చాలా చంచలమైనది గావడంచే నాచే అనుష్ఠించుటకు వీలు పడటంలేదు!ఎలా? అర్జునుడి అభిప్రాయంతో ఏకీభవించిన భగవాన్ అర్జునా వాస్తవమే! చిత్తం చాలా చంచలమైనదే. అందులో సంశయంలేదు. కానీ దానిని నిగ్రహించడం అభ్యాస, వైరాగ్యాలచే వీలవుతందిఅని అంటారు.

అప్పడు అర్జునుడు కృష్ణా! మనసు చాలా చంచలమైనది కాబట్టి ఈ విధంగా సాధన చేస్తున్నవాడు, యెప్పడో బలహీనమైన క్షణంలో చిత్త స్థైర్యతను కోల్పోవడానికి ఆస్కారముంటున్నది గదా! ఆ విధంగా చిత్త స్థైర్యతను కోల్పోయినవాడు, పతనమగుచున్నాడుగదా! వాడు ఐహిక సుఖాలను పరిత్యజించి నిన్ను పొందవలెనన్న తీవ్రమైన పట్టుదలతో సాధన చేస్తున్నాడు. ఇప్పుడు వాడు మనో స్థైర్యతను కోల్పోవడంచే రెండింటికి చెడిన రేవడి కావడం లేదా?’ అని ప్రశ్నిస్తాడు.

అందుకు భగవాన్, ‘అర్జునా! అటువంటి యోగ భ్రష్టుడికి యిహంలోగానీ, పరంలోగానీ నాశనం కలుగడం లేదు. నన్ను పొందవలెనుఅన్న సత్సంకల్పంతో వాడు తన సాధనను ప్రారంభించాడు. అటువంటి వాడికి యెన్నటికి నాశనం లేదు. వాడు తప్పక తన గమ్యమును చేరుకొంటాడు. ఈ జన్మలో వీలవనప్పటికీ భవిష్యత్తులో వాడు అందుకు అనువైన జన్మనే పొందుచున్నాడు. ఆ జన్మలో వాడు తన పూర్వ జన్మలలోని సాధనా సంస్కారముచే, అనుకొన్నది సాధించుచున్నాడు.

అజామీళుడి విషయంలో కూడా జరిగినది యిదే, ‘అతడు, అనేక పూర్వజన్మలలో యెంతో మహత్తరమైన సాధనను చేసివున్నాడు. ప్రస్తుత జన్మలో యేదో బలహీనమైన క్షణంలో యింద్రియ సుఖాలచే ఆకర్షింపబడి పతనమైనప్పటికీ, పూర్వ జన్మల సంస్కారంచే తన కొడుకును నారాయణా!అని సంభోదించాడు. అది చాలు, పరమాత్మ కరుణించి అతడిని మళ్ళీ సన్మార్గములో వుంచడానికి! పరమాత్మ అదే చేశాడు. అతడికి నరకమును తప్పించాడు. అతడు తన చేసిన పొరబాటును గుర్తించి పశ్చత్తాపపడే విధంగా చేశాడు. దానితో అతడు సాధనను పునః ప్రారంభించి, భగవదనుగ్రహంచే ఈ మాఱు యెటువంటి తప్పిదముగానీ లేకుండా దానిని నిర్విఘ్నంగా కొనసాగించి తన లక్ష్యమును పొందాడు.

శ్రీ మధుసూధన సరస్వతి తమ గీతాభాష్యంలో క్రింది శ్లోకమును వ్యాఖ్యానిస్తూ అజామీళుడి కథను ఉదాహరణంగా తీసుకొంటున్నారు:

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మన్తవ్య: సమ్యగ్వ్యవసితో హి సః || గీత 10-30

మిక్కిలి చెడు నడవడిగలిగినవాడైనప్పటికీ అన్య చింతనలేక నన్ను ఆరాధంచుచున్నవాడిని సాధువుగానే (అంటే మంచి మార్గములోనే) వుంటున్నట్టు యెంచవలెను. ఎందుకంటే వాడు (సమ్యక్) యథార్థమైన నిశ్చయచిత్తంతో వుంటున్నవాడు.

అంటే, వాడి బాహ్య ప్రవర్తన చూస్తున్నవారికి దురాచారముగా కనిపించినప్పటికీ వాడు మనసులో సదా ఆ పరమాత్మనే ధ్యానించుచూ వేఱువిధమైన చింతనలేక యుంటున్నవాడు. అందుకే భగవాన్ అతడిని సాధువుగానే పరిగణించవలెనని అంటున్నారు.

తరవాతి శ్లోకంలో భగవాన్ నా యందు అనన్యమైన భక్తిని కలిగివుండటంచేవాడు వెంటనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని (మోక్షమును) పొందుచున్నాడని చెబుచున్నారు.

పైన నాచే చెప్పబడినది శ్రీమద్భగవద్గీత యింకా శ్రీమద్భాగవతం వీటి ఆధారంగా నాకు అనిపించినది.

అజామీళుడు అనేక పూర్వజన్మలలో భగవద్ ప్రాప్తి కొఱకు సాధన చేసియున్నాడు. అత్యంత నిష్ఠాగరిష్టుడైన అజామీళుడు యెటువంటి పరిస్థితిలో స్త్రీ వ్యామోహమునకు గుఱి కాబడినవాడో భాగవతంలో స్పష్టముగా యివ్వబడినది. స్థలాభావముచే యిక్కడ దానిని వివరించట అసాధ్యం. కానీ భగవంతుడి మాయను దాటడం బహుదుర్లభము గదా! అందుకే అతడు మోహమునకు వశుడయ్యాడు. కొడుకును చివరి క్షణంలో నారాయణాఅని సంబోధించనంత మాత్రముచే, అతడిలో పూర్వ జన్మ పుణ్యవాసనలన్నియు ఒక్కసారిగా బహిర్గతమైనవి. భగవంతుడు జీవుడిని యెంత మోహములో పడవేసినప్పటికీ, తనను ఆశ్రయించినవాడిని దారినుండి మళ్ళించి పెడత్రోవ పట్టించడు. మళ్ళీ అతడిని సక్రమ మార్గములో వుంచవలసిన బాధ్యతనుకూడా తానే తీసుకొంటాడు. అతడిలో తాను చేసిన తప్పిదమునకు పశ్చాత్తాపపడే విధంగా చేస్తాడు. అతడిని ధర్మాత్ముడిని చేస్తాడు. చివరికి అతడు అనుకొన్నదానిని సాధించటకు సహకరిస్తాడు. అదే భగవంతుడి కరుణా హృదయం. ఇందుకు అజామీళుడి కథ ఉదాహరణం. అజామీళుడి గుఱించి లోకంలో అనేకులకు మంచి అభిప్రాయము లేదు. అందుకే నా commentsతో అతడిపైవున్న దురభిప్రాయము తొలగిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. దీనిని అందఱికీ అర్థమయ్యే విధంగా చేయడమే నా ఉద్దేశ్యము. మన పురాణముల ఔన్నత్యమును యదార్థమైన కోణంలో ఈ కాలం వారికందఱికీ తెలియజేయడమే నా ఉద్దేశ్యము మీ postను విమర్శిస్తూ comment చేసినవారినికూడా నేను అభినందించుచున్నాను. ఎందుకంటే అటువంటి అభిప్రాయము బహిర్గతమైనప్పుడే నావంటి వాళ్ళకు విశ్లేషించి యదార్థమైన విషయమును తెలియపఱచడానికి అవకాశము లభిస్తుంది. ఈ ప్రయత్నంలో మిమ్ములను నొప్పించివున్నట్టైతే నన్ను క్షమించండి. 
కాశీపతి శర్మ గారూ మీరు చక్కగా తెలియజేసినారు . ధన్యోస్మి


స్వస్తి.

Friday, 9 December 2016

"వివాహం"

"వివాహం"

 చతుర్విధ పురుషార్థాలు 1. ధర్మము 2. అర్థము 3. కామము 4. మోక్షము. ధర్మము అనేది ఆర్థ కామ మోక్షాలకు రైలు ఇంజను లాంటిది. మిగతా మూడు బోగీలు. ఈ బోగీలు కదలవలెనంటే ధర్మమూ అన్న ఇంజనును అంటిపెట్టుకొని వుంటే డ్రైవరు అనబడు పరమాత్మ జీవితము అన్న పట్టాలపై సులభముగా నడిపించి చేరవలసిన గమ్యము చేర్చుతాడు. మరి మోక్షము అన్నది గమ్యముకదా అది బోగీ ఎట్లవుతుంది అన్న సందేహము కలుగవచ్చు. ఇక్కడ మోక్షము అన్నది A/C Coach లాంటిది. అది మనలను పరమాత్ముని వద్దకు చేర్చుతుంది.

అంటే అర్థ కామ మోక్షాలు నీ ధర్మ వార్తన తోనే ముడి పడి వుంటాయి . విద్యాది అర్థదాయకములైన, అంటే సంపాదనా మార్గములైన అర్హతలు సంపాదించి ( ఆ కాలములో కులానుగుణముగా, ఇప్పుడు కాలానుగుణంగా ) ఆపై తన గృహస్థాశ్రమ యోగ్యత సిద్ధించుకొనుటకు సిద్ధ పడుతాడు మగవాడు. ఆ యోగ్యత కలిగించేదే వివాహము.

 ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది.

వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. పరినయనము అంటే ఒకరినొకరు చూచుకొనుట అన్న అర్థాన్ని చెప్పుకోనవచ్చును. వధూవరులిద్దరు మొదట ఒకరి దృష్టిలో మరొకరు పడి అటుపిమ్మట ఒకరినొకరు జాగ్రత్త గా, కష్టసుఖాలలో తోడూ నీడగా ఒకరినినొకరు  జాగ్రత్తగా చూసుకొంటూ వుంటారు.

"పెళ్ళి చూపుల" సాంప్రదాయం

పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. "పెళ్ళి చూపుల" సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన ముఖ్యులుఅమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు. వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవుతారు. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకుంటారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు కట్న కానుకలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు. ఈ సందర్త్భంగా పెద్దలు చెప్పిన ఒక మాటను గుర్తు చేసుకొందాము.

కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతం

బాన్ధవాః కులమిచ్ఛంతి మృష్టాన్న మితరే జనాః

ఈ పెళ్ళిచూపులలో కన్యకు వరుని రూపము పై ఆసక్తి,తల్లి ,ఆ అబ్బాయి మంచి సంపాదనాపరుడా లేదా అని చూస్తుంది. తండ్రి అబ్బాయి పేరు ప్రతిష్ఠల తోబాటు కుటుంబగౌరవము చూస్తాడు, బంధువులు అబ్బాయి కులగోత్రాలు చూస్తె మిగతావారు పెళ్లిరోజు భోజన వసతి సదుపాయాలను గురించి ఆలోచించుతారు.



నిశ్చితార్థం

వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్దానం. అంటే: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం).ఏ విషయానికి అయితే అంతా ఒక్చ్త చేరినారు ఆ అర్థానికి నిశ్చితత్వము సమకూర్చడము నిశ్చితార్థము.

తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు "నిశ్చయ తాంబూలం". వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది.  నిశ్చితార్థం రోజున వధూవరులు ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు.

సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు-చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి-పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే. అంటే ఇది ఒక AGREEMENT లాగా పనిచేస్తుందన్నమాట. రెండు ప్రక్కలా అతి ముఖ్యమన వారి నడుమ అమ్మాయి ఇంటిలో జరిగే ఈ తంతు ENGAGEMENT పేరుతో విపరీతంగా ఖర్చు చేసి , చేస్తున్నారు.

ఆడ పెళ్లివారిచ్చేవి- మగ పెళ్లివారిచ్చేవి

సాధారణంగా ఆడ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధు-పర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం-బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్-షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా-సత్యనారాయణ వ్రతమప్పుడు వధూ-వరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు-అత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె (సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులు-ఐదు రవికె గుడ్డలు, శనగ-సున్నిపిండిపసుపు- కుంకుమ, చీరె-ధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు) ముఖ్యమైనవి.

సాధారణంగా మగ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు-ఇతర చీరెలు, నగలు-ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి,పుట్టినిన్తివారు చేయించే తాళి అత్తగారి ఇంటి తాళికన్నకొంచెము బరువులో తక్కువగా ఉండుట కూడా సాంప్రదాయము. ), మెట్టెలు, , వధువు తల్లి కడుపు చీరె-తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇచ్చిపుచ్చుకోవదములోపట్టువిడుపులు అత్యంత ఆవశ్యకము.

ముహూర్త నిశ్చయం *

వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. దంపతుల భవిష్యత్తుకు  తప్పకుండా  "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారం-పద్ధతి". ***



నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు"గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళి వారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ "శుభ లేఖలు" పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోప-తాపాలు కూడా వస్తాయి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ-ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే.

"స్నాతకం"

పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని "సత్యాన్న..." అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది.

"సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు" అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, "వరుడికి శుభం కలుగుగాక" అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తాడు పురోహితుడిక్కడ.

స్నాతకానికి "సమా వర్తనం" అన్న పేరు కూడా వుంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమా వర్తనం అంటారు. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కాశీ ప్రయాణం - బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి "అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి" అని చెప్పి బొట్టు పెట్టి,బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు.

కాశీ యాత్ర

కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధు-మిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు. ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (బావ మరిది-మేన మామ-తాత గారు లాంటి వారు) "బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వారి "అమ్మాయి" నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి, కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు-మిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరుతారు. బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడం – నిందించడం - దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.

పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం

పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూ-వరుల ఇళ్లలో, ఉదయం తెల-తెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లి-తండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. స్నాతకం చేసుకున్న నాడే, లాంఛనంగా అక్కడ కన్యా దాత ఇంట్లో, వధువుని "పెళ్ళికూతురు" చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ముందు-వెనుకల కూడా జరగొచ్చు. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" లో చేస్తారు.

స్నాతకం చేసుకున్న రోజునే మగ పెళ్లివారు ఆడ పెళ్ళివారి వూరికి తరలి పోతారు. ఒక్కోసారి అక్కడకు పోయి స్నాతకం చేసుకుంటారు.

విడిది మర్యాదలు

మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్లి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం సరదాగా-సందడిగా జరుపుకునే మరో వేడుక. విడిదిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి (సబ్బులు, పేస్టులు, బకెట్లు, తుండు గుడ్డలు, వేడి నీళ్లు లాంటివి) ముందు (హాలులో) భాగంలో పెద్ద తివాచీ లాంటిది పరిచి ఎదురు చూస్తుంటారు ఆడ పెళ్ళి వారు. మేళ-తాళాలతో ఆహ్వానించి కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. పెళ్ళికొడుకు ఆ పనిని బావమరిదితో చేయిస్తారు. ఈ కాళ్లు కడగడమనేది రెండు-మూడు పర్యాయాలు జరిపే వ్యవహారం. ఆ తర్వాత అందరికీ కాఫీ-పలహారాలిచ్చి మర్యాదలు చేసి, స్నానాలు ముగించుకొని సిద్ధంగా వుంటే, భోజనాలకు తీసుకెళ్తామంటారు. లేదా అక్కడే ఏర్పాటు చేస్తారు.

వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరవలేని సంఘటన. కొందరు కల్యాణ మండపాలను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెటూర్లలో కొబ్బరి ఆకుల పందిరి వేయడం వలన మండపం ఆవశ్యకత తగ్గింది. పట్టణాలలో టిప్ టాప్ పందిరి మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.

గౌరీ పూజ-వర పూజ- మధు పర్కం

ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి,సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు.

వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీర) "గౌరీ పూజ" కు తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా, ఆడ పెళ్ళి వారు-వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వాని్స్తారు. వరపూజలోనే ఇరువైపువారు, ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది.

మగ పెళ్లివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం-సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్ల మని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు.

మధుపర్కం:

మధువు అంటే తేనె. కుమార్తెకు భర్తగా వరుడి ఎంపిక తరువాత అతను వధువు తల్లి-తండ్రికి సంప్రదాయాన్ననుసరించి పుత్ర సమానుడౌతాడు. వివాహానంతరం "మధుపర్కం" అంటే తీయటి పానీయం అని అర్ధం. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. వరుడు ఆ పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత వరుడు నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు.

గోత్రం-ప్రవర

గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "గోత్రం" అంటే వంశం, "ప్రవర" అంటే ఆ వంశం మూల పురుషుల సమాచారం. మీ అమ్మాయిని, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-…. …. …. త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, ….. …. శర్మణో నప్త్రే, …. … శర్మణ పౌత్రాయ, … …. శర్మణ పుత్రాయ, .. … శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న …… గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించేవాడూ, … మునిమనుమడూ, …. మనుమడూ, …. పుత్రుడూ అయిన … అనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇలా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్‌లో అనవచ్చు.

కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, ఆ సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు.

గంపలో వధువు-కాళ్లు కడగడం

గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు.

కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. కన్యాదాతేమో వయసులో పెద్ద-వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ వుందంటే దానికి సాంప్రదాయ బద్ధమైన అర్థం వుండి తీరాలి. కన్యా దాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్పుతాడు. "నా లోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా వుండుగాక" అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యా దాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన "అర్ఘ్యాన్ని" (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, " ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని-పాడి పంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని చేసి, రక్షించండి" అని చెప్పిస్తారు. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు.

వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, ఆ విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించుతారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.

మహా సంకల్పం

మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భరత వర్షం-భరత ఖండం, దానిలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యా దాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్థం గడవగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పాలలోని శ్వేత వరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో-శాలివాహన శకంలో-ఇరవై ఎనిమిదవ మహా యుగంలో-కలియుగంలో-ఫలానా సంవత్సరంలో-ఫలానా మాసంలో-ఫలానా తిది రోజున, ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషితైన ఈ కన్యను దానం చేస్తున్నాను అని కన్యా దాత చెప్పే సంకల్పం ఇది. ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని,స్తోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక- ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలని కన్యా దాత సంకల్పం చేస్తాడు.

కన్యాదానం

ఇక ఆ తర్వాత, "కన్యా దానం" తంతు, అంటే, ముహూర్తం సమయం దగ్గరపడుతున్నదని అర్థం. "కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !! అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పాలి కన్యా దాత: " సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మామ గారు (కన్యా దాత) (వరుడి) చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యా దాత వరుడితో. దీనికి సమాధానంగా, "నాతి చ రామి" అని వరుడితో చెప్పించాలి. సుముహూర్తం వచ్చేస్తున్నదనె దీనర్థం.

"జీల కర్ర- బెల్లం"

వధూ-వరులను కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తి అయిన పిదప, అమ్మాయి-అబ్బాయిల జాతకాల ననుసరించి జ్యోతిష్యంలో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచుకుంటారు. సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లుతారు దంపతులు మీద.

జీల కర్ర-బెల్లం ముద్దను వధూవరులు పెట్టుతున్న సమయంలో, పురోహితుడు చదివిన మంత్రానికి, "వరుణుడు, బృహస్పతి, మీకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చెదరు గాక ! అగ్ని దేవతలు మిమ్ములను దీవించెదరు గాక ! పంచభూతాలు స్థిరంగా వుండు గాక ! ఈ సుముహూర్తం మీకు శుభ ముహూర్తం అగుగాక !" అని అర్థం వస్తుంది. జీల కర్ర-బెల్లం మిశ్రమంలో పరస్పరాకర్షణ వుంటుందని మన పెద్దలు చెప్పడమే కాకుండా, శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. ఇక వధూవరులమైన మేమిద్దరం, ఆ తర్వాత, సకల దేవతలకు నమస్కరించి, "నూతన దంపతులమైన మా ఇరువురి ప్రేమానుబంధం చాలా గొప్పది. మా బంధాన్ని పితృదేవతలు కూడా ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతోనే మేం భార్యా-భర్తలం అయ్యాం. ఈ శుభ సమయంలో బంధువులైన మీరందరూ ఆనందంగా వుండండి. వధువు బంధువులు కొద్దిగా మానసిక ఆందోళనకు గురికావడం సహజమే" అని మంత్రాల ద్వారా పురోహితుడు అనిపిస్తాడు. ఇక ఇక్కడినుంచి మాంగల్య ధారణ తంతు మొదలవుతుంది.

మాంగళ్య ధారణ-తలంబ్రాలు

వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం.

సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు. "శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది.

పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం.

మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు.

కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.

స్థాళీపాకం-సప్తపది-నాగవల్లి-సదశ్యం

తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా హోమం దగ్గర అన్నం వండించే పని, ఆ తర్వాత సప్తపది వుంటుంది.

వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు, ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం వధువు తన అంగీకారాన్ని తెలియ పరుస్తుంది. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి. సప్తపది పూర్తైన తర్వాతనే, వధువు గోత్రం-ప్రవర-ఇంటి పేరు, వరుడి గోత్రం-ప్రవర-ఇంటి పేరు గా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ-హిందూ సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పదనాన్ని విశదపరిచే మంత్రాన్ని చదువుతారు. అందులో, "ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ, ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక" అన్న అర్థం స్ఫురిస్తుంది.

వధువును అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరం నకుగానీ, ఏడు మంత్రాలతో, ఏడు అడుగులు నడిపించుతున్న వరుడితో జపం-హోమం చేయించుతారు. ఇక్కడే చెప్పిన మరో మంత్రంద్వారా వధూవరులిద్దరు, ఇకనుంచి స్నేహితులం అన్న అర్థం కూడా వుంటుంది. "మన ఇద్దరం స్నేహితులం. నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయులకు మైత్రి కలిగింది. నీ చేతిని నేనెప్పుడూ విడవను-నన్ను నీవు కూడా విడవవద్దు. మంచి మనస్సుతో అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం. పరస్పరం చర్చించుకొని కుటుంబ పనులను నెరవేరుద్దాం. అనుకూల దంపతులమై సంసార యాత్ర కొనసాగించుదాం. నువ్వు భూమివి-నేను ఆకాశాన్ని. నువ్వు వాక్కువు-నేను మనస్సును. నేను చేసే ధర్మ కార్యాలకు నీ సహకారం కావాలి. యోగ్యమైన సంతానాన్ని-సంపదను మనం ఇద్దరం కలిసి అనుభవించుదాం" అని దానర్థం. " రాత్రి గాని, పగలు గాని, ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో నువ్వుండాలి నీకు ఎటువంటి ఇబ్బందీ కలగరాదు. సుమంగళివై-సత్ సంతానంతో గృహలక్ష్మివై, అభివృద్ధి చెందాలి" అని రక రకాలుగా అనునయించే మాటలివి.

సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం. సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు, వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం వుంటుంది. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు. ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమితృల కోలాహలం మధ్య "భుజం బంతి భోజనాల" హడావిడి వుంటుంది. వధూవరులిద్దరిని పక్క-పక్కన కూచోబెట్టి, వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి, వరుసకు బావా-మరదళ్లలాంటి వారి వేళా-కోళాల మధ్య భోజన చేయడం ఆరంభించుతారు అందరూ. మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో వుంచడం, పక్క వారందరూ తినమని బలవంతం చేయడం అక్కడ జరిగే వేడుక.

ఉంగరాలు తీయడమనే "ప్రధానాంగుళీయకం" వేడుకలో మూత కురుచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోసి, దానిలో మెట్టెలు, ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నించే తంతుంటుంది. వుంగరం దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమితృల కోలాహలం చోటుచేసుకుంటుంది. ఆ కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది.

అప్పగింతలు-గృహ ప్రవేశం

కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో, వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ ఆ టైంలోపల జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు. కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు.

భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ: "అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా, అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు. బహుశా అప్పగింతల ద్వారా, పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం చేయడం కొరకు, ఈ వేడుకను జరిపిస్తుండవచ్చు.

అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో ఊయలలాగా చేసి, అందులో ఈ చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి ఆ బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాప-బాబును జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లనిపించిన తర్వాత, ఆడబిడ్డకు ఆ పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు.

ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది.

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.


వివాహ బంధం
భార్యాభర్తల సంబంధం ఎట్లుండవలెనని మన పెద్దలు నిర్దేశించినారో చూడండి :--

వివాహ సమయంలో సప్తపది అనే తంతలో చదివే మంత్రాలలో 
ఒక మంత్రం:
సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః,
సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం ,
సఖ్యాన్యే మయోష్టా:

అనగా ఈ ఏడడుగల బంధంతో భార్య, భర్తలమైన మనం ఇకపై
స్నేహితులుగా ఉంటూ, పరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా
పయనిద్దాం. ఎంత ఉదాత్తమైనభావన!
ఆపత్స మిత్రం జానీమః
కష్టాలలో ఆదుకొను వాడే మిత్రుడు. అట్టి మిత్రభావంతో భార్యాభార్తలు
ఉంటే, వారి మధ్య కలతలు, కార్పణ్యాలు , ఆవేశకావేశాలు,
అసమానతలు లేకుండా నిత్య వసంతంలా వారి జీవితం
సాగిపోతంది. ఇంకా—
సంతుష్టో భార్యయా భర్తా భర్తా భార్య తధైవచ/
యస్మిన్నేవ కులేన్నిత్యం కల్యాణం తత్రవైధ్రువం
అనగా
భార్య ,భర్తలు పరస్పరం ఒకర్ని ఒకరు గౌరవించుకొంటూ ప్రేమానురాగాలతో సంతుష్టంగా ఉంటారో |
ఆ ఇల్లు నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా విలసిల్లుతుంది