Monday, 23 November 2015

మయిండ్ మీడియా ఉపన్యాస సంగ్రహము, తెలుగు 26 / 11 / 2015

26 / 11 / 2015 For Broadcast

పరమేశ్వర స్వరూపులగు పాఠకులకు నమస్కారము .
నేను వ్రాసిన ఈ పద్యానికి కాస్త అర్థము చెప్పే ప్రయత్నము చేస్తాను

మామ మామ మీకు మా సంపదలనిచ్చి

మసల జేయు మంచి సంతు నిచ్చి

మామదీశు నతము మది నిల్పి నుతియించి 

మంచి పొందగలరు మరల మరల

మామ మామ అంటే మామకు మామ అని. లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు విష్ణువుకు మామ . అదే విధంగా

విష్ణువు పాదముల వద్ద పుట్టుట వల్ల (హరి పాదోద్భవ ) ఆయన కుమార్తెయై సముద్రుణ్ణి కలవటం వల్ల,

సముద్రుడు తిరిగి విష్ణువుకు అల్లుడైనాడు. అంటే విష్ణువు సముద్రునికి మామ అయినాడు . ఇది మామ 

మామకు అర్థము.

మా అంటే లక్ష్మి లేక సిరి. కాబట్టి మాసంపదలు అంటే సిరిసంపదలు అని. మా అంటే మహా లేక గొప్పగా

అధికముగా అనే అర్థము కూడా వుంది . అంటే మీకు ఐశ్వర్యము అధికముగా ఇస్తూ మంచి సంతాన సౌభాగ్యాన్ని

కూడా కలిగించాలి అని అటువంటి, మామదీశు అంటే లక్ష్మీదేవి మనసుకు అధిపతి యైన వాడు,అంటే విష్ణువును కలకాలము భక్తితో ప్రార్థించుతూ మీరు కోరుకొనే మంచినెల్లా పొందగలరు అని నాకు తెలిసిన అర్థము. ఒక 50 సంవత్సరాలు వెనక్కు మళ్ళితే మన జీవన విధానములో వచ్చిన పెనుమార్పులను జూసి ఆత్మావలోకనము చేసుకొంటే ఎంత పోగొట్టుకున్నాము అన్నది మనకు అవగతమౌతుంది. మాకాలములోపుస్తకముల సారము మెదడు కెక్కేది. నేడు పుస్తకాలు సంచుల కెక్కుతున్నాయి. జీవన విధానములోని పెను మార్పు ఇందులకు కారణము. భార్య భర్త ఉద్యోగానికి పొతే పిల్లల బాధ్యత ఎవరిది. ఆయాది. ఆయా నేడు ఆయా రేపు గయా. తల్లిదండ్రులు దేవునికి కైమోడ్చి 'దేవా చూపించు నీ దయ' 
 అనాలి మళ్ళీ! చిన్న వయసులో కళ్ళజోళ్ళు వస్తున్నాయి, ఆరోగ్యాలు అవకతవకలౌతున్నాయి , అయినా మన జీవన విధానమును పునర్విమర్శ చేసుకొనే పురుసత్తు కూడా లేదు. దీనికి కారణము 

ఇంటి పొయ్యి మంట పైన 
 వంటజేయు పెంటెందుకు
 మింటికెగయు ధరలున్నా
 కంటి కింపు పంటి కింపు
 తారామణి హారమ్ముల
 పణ్యారపు భవనమ్ముల
 వంటలె మా కనులపంట
 అనుచు పోవు పిల్లలతో 
 భార్యాభర్తల జంట
 వారి మాట కాదనుటకు
 మనమందరమెవ్వరంట

మరి ఈ పరిస్థితిలో ఆరోగ్యమును గూర్చి ఆలోచించే అవకాశమే అందుబాటులోకి రాదు. కాబట్టి కొంచెము పెద్ద అయిన వెంటనే ఏ pizza hut నుండినో లేక కంటగింపైన కెంటకీ చికెనే కంటికింపని తలచి తెప్పించుకొని తిని కోరి కోరి ఆరోగ్యమును పాడుచేసుకొనే నేటి యువత సరళిని గూర్చి నేను వ్రాసిన నాలుగు మాటలు వినండి . 
 యువత సరళి 
పిజ్జాలు బర్గర్లు ప్రియ భోజనమ్మాయె 
మంచిజొన్నల రొట్టె మరుగు పడియె

నూడుల్సు ఫాస్తాలు నోరూరగా జేసె
సద్దియంబళులెల్ల సమసి పోయె 

చాక్లెట్లు కేకులు చాల ప్రియమును గూర్చె
వేరుశెనగలుండ వెగటుగలిగె

కెంటకీ చికెనేమొ కంటికింపైపోయె 
ఇంటి వంటకాలు మంట గలిసె 

వైను బ్రాందీల విస్కీల వరద మునిగి
స్టారు హోటళ్ళ కేగేటి సరళి పెరిగి 
పనికిమాలిన యలవాట్ల ఫలితమంది
ఆసుపత్రుల పాలైరి అధిక యువత 

చెడ్డను గూర్చి చెపూకొన్నము మరి మంచిని గూర్చి చెప్పుకోవద్దూ! ఈ రోజు ఇంకొక అజరామర సూక్తిని గూర్చి చెప్పుకొందాము.

శతేషు జాయతే శూరాః సహస్రేషు చ పణ్డితః

వక్తా దశసహస్రేషు దాతా భవతి వా న వా

- వ్యాసస్మృతి

నూటికి ఒక శూరుడు, వెయ్యికి ఒక పండితుడు, పదివేలకు ఒక వక్త కలుగుతారు కానీ దాత మాత్రము దొరుకుతాడని చెప్పనలవి కాదు.

శూరుడు మనకు అందరిలో కనిపించడు. అసలు శూరత్వము అంటే యుద్ధాలలో పాల్గొనడము కాదు. తలపెట్టిన కార్యమును సమర్థవంతముగా  నిర్వహించడము శూరత్వము. అందుకే 'కార్య శూరుడు' అన్న పలుకుబడి ప్రాచుర్యమునకు వచ్చినది. ఈ కార్యశూరత కలిగిన వాడు ఒక నిస్సహాయునికి చేయూతనిస్తే సమాజమే శ్రేయోదాయకమౌతుంది. అటువంటి శూరులు పూర్వము నూటికి ఒకరు వుండేవారు. ఇప్పుడు వీరత్వము,ధీరత్వము, శూరత్వము అన్నీ స్వార్థములో మాత్రమె నిండి యుంటాయి . ఈ కాలము ఒకరికోరకు పాటుపడేవాడు దొరుకుట సముద్రములో మంచినీరు వెదుకడమే నేమో? 

ఇక పాండిత్యము విషయానికి వస్తే  ఎదో కళాశాలలకు పోవడమో స్నాతక పట్టాలను పుచ్చుకోవడము మాత్రము కాదు. పాండిత్యమునకు జిజ్ఞాస అవసరము. కోరిక వుంటేనే కదా తీర్చుకోవలెనను తపన వుండేది. పూర్వము అటువంటి వారు వెయ్యికి ఒక్కరు వుండేవారట. అటువంటి వారి వద్ద నేర్చుకోవలేననే తహ తహ కూడా నాటి జనులలో వుండేది. మరి నేడో 
అందరూ పండితులే , ఆమాటకొస్తే ఏమీ తెలియని నేను కూడా పండితుడనే!
ఇక వక్తృత్వమును గూర్చి! 'ప్రియ వక్తృ త్వం' 'వాక్ భూషణం ' 'వచః ప్రసంగం' అని ఎన్నో విధాలుగామాట యొక్క మహిమను గూర్చి తెలిపినారు నాటి మహనీయులు. పూర్వము అట్టి వక్తలు పది వేలకు  ఒకరు వుండే వారట. అప్పుడు చెప్పేవారు తక్కువ వినేవారు ఎక్కువ. మరి నేడో అందరూ చెప్పేవారే! ఇక వినేవారేరీ. మన రాజకీయనాయకు మాట్లాడితే ఎదుట నిలిచినవాడు తల తప్ప వళ్ళంతా తడిసి ముద్ద యగుట తప్పించి వేరే ప్రయోజనమేమీ ఉండదు. అది గాలికి నిలిచే ఊక, అంటే  గాలికి ఊక అసలు నిలువదు గదా !     
ఇక దానగుణము. లక్షల సంవత్సరముల కాలములో దాతలుగా మన మనసున చెరగని ముద్ర వేసిన వారు చాలా కొద్ది మంది. వారిలో శిబి చక్రవర్తి, బలిచక్రవర్తి, రంతిదేవుడు, దాన కర్ణుడు  మొదలగు వారు వాశి కెక్కిన వారు. అందుకే దాత ఎన్ని కోట్లలోనైనా దొరుకుతాడో దొరకడో చెప్పుట కష్టము అన్నారు ఆకాలము లోనే. మరినేడో వంద రూపాయలు ఇచ్చినవాడుకూడా తనపేరు వార్తా పత్రికలో ప్రముఖంగా కనిపించాలనుకొంటాడు. మరి ఈ విషయము ఎన్నికలకు ఇచ్చే చందాలకు వర్తించదు ఎందుకనో?  ఒకచేత ఇచ్చిన దానము ఇంకొక చేతికి తెలియకూడదన్నది పెద్దల మాట.    ఈ కాలములో వాగ్దానము కూడా దానముక్రిందనే జమ.  ఈ కాలము చిన్న దానము కూడా పెద్ద 'హోర్డింగ్' లకు  ఎక్కుతుంది.





త్రైలింగ స్వామి
       
మనకు ప్రేమానంద తెలుసు, నిత్యానంద తెలుసు, బాలసాయి తెలుసు, అసారాం తెలుసు,పీర్ బాబా తెలుసు కానీ నిజమైన యోగుల గూర్చి తెలియదు. ఎందుకంటే ప్రచార సాధనాలకు కావలసిన మసాలాలు నిజాయితీ లో  వుండవు. ఒక స్వామి రామకృష్ణ, స్వామి వివేకానంద్వా, రమణ మహర్షి,స్వామి శివానంద,లాహిరీ మహాశయులు ఈ విధంగా చెప్పుకొంటూబొటే చెంతాడంత అయ్యే ఈ మహనీయుల గూర్చి మన వార్తా పత్రికలలో, దుర్దర్శనులలొ(దూర దర్శనులలో) బహు తక్కువగా వింటాము. ఈ జాబితాలోఒక మహారత్నమే త్రైలింగ స్వామి. ఇప్పుడు, మన తెలుగు వాడయి వుండి మనలో ఎక్కువమందికి తెలియని,తెలిసినా తలువని,తలచినా  తెలుపని ఆ మహనీయుని గూర్చి తెలుసుకొందాము.
పుట్టింది తెలుగు నాట నయినా ,ఆయన జీవితములో అధిక శాతము కాశీ లోనే గడిచింది .ఆయన చూపించిన మహిమలు పొందిన సిద్దులు, దివ్య విభూతులు అనేకం,అపారం, అనంతం .ఆయన అసలు పేరు శివ రామయ్య .విశాఖ పట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామం లో జన్మించినారు .తండ్రి నరసింహారావు ,తల్లి విద్యావతి ,సంపన్న బ్రాహ్మణ కుటుంబం .ఆయన జననం  19 -12 -1607   తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు .చిన్నప్పటి నుంచి ఐహిక వాంఛల  మీద కోరిక లేదు .నలభై ఏళ్ళకు తండ్రి ,యాభై రెండో ఏట తల్లి చని పోవడం జరిగింది. .శ్మశానాన్నే ఇల్లు గా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చి ,అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళ దాకా గడిపి హటాత్తుగా స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానం లో వున్న బస్తర్ చేరి అక్కడ భాగీరధి స్వామి తో పుష్కర తీర్దానికి వెళ్ళి ఆయనతో సన్యాస దీక్ష గడించి గణపతి స్వామి అనే దీక్షా నామమును స్వీకరించినాడు. గురు సమక్షం లో పదేళ్ళ సాధన చేసి అద్భుత శక్తుల్ని సంపాదించు కొన్నాడు. సిద్ధులు పొందిన కాలమునుండి ఆయన దిగంబరుడే! ఆయనకు అప్పుడు 78 సంవత్సరాలు వయసు. గురువు మరణించిన తర్వాత తీర్ధ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరినాడు. అచ్చట ఆయన చూపిన  లీలలకు ఆశ్చర్య చకితులై ఆయనను అపర రామలింగేశ్వరుడేయని  కొనియాడినారు అక్కడివారు .అక్కడి నుండి నేపాల్ చేరి అక్కడ అడవి లో తపస్సు చేసుకొంటూవుంటే ఒక పులి వచ్చి ఆయనకు ఎదురుగా చేష్టలుడిగి కూర్చొని వుండి పోయింది. రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి  పులిని చంపటానికి ప్రయత్నిస్తే వలదన్నాడు ఆయన. నేపాల్ రాజుకు ఆవిషయము తెలుపగా ఆయన వచ్చి సాష్టాంగ దండ ప్రణామము నాచరించి అనేక కానుక లిస్తే వలదని  జంతు హింస చేయ వద్దన్న హితవు చెప్పి అక్కడి నుండి టిబెట్ , తరువాత మానస సరోవరం సందర్శించి ,దారిలో ఎన్నో అద్భుతాలను చూపి హిమాలయాలలో చాలా కాలము తపస్సు చేసి నర్మదా నదీ తీరం లో మార్కండేయ ఆశ్రమం లో ఖాఖీ బాబాఅనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించినాడు. ఒక రోజూ తెల్ల వారు ఝామున నర్మదా నది లో నీటికి బదులు పాలు ప్రవహిస్తున్నట్లు ఈయన దానిని  తాగుతున్నట్లు ఖాఖీ బాబా చూసి ఆయన మహిమ ను గుర్తించడం జరిగింది. ఆవిషయము స్వామికి తెలిపితే తనను వదలి వెళ్ళిపోతాడని మిన్నకుండినాడు. అయినా ఈయన ఒక చోటునుండే వాడు కాదు గదా!
           1733 లో  ప్రయాగ చేరారు .తపో నిష్ఠలో ఉండగా ఒక సారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తారణ భట్టా చార్య ఆశ్రమం లోకి పోదామని చెప్పినా కదల లేదు .దూరం లో ఒక పడవ మునిగి పోతోందని దాన్ని రక్షించాలని సంజ్ఞ చేయడమే కాకుండా,అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగు తుంటే  . స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించినాడు. ఆశ్చర్య పడటము శిష్యుని  వంతైనది.
  వూరూరు తిరుగుతూ వీరు 1737 లో తన 130వ ఏట కాశీ చేరడము జరిగింది. అంతే ! తాను జీవాత్మనుపరమాత్మ సాయుజ్యము చేర్చేవరకు అంటే 150 సంవత్సరములుకాశీ లోనే గడపడము జరిగింది.ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహము.గడ్డాలు ,మీసాలు పెరిగి దీర్ఘ శరీరం తో దిశ మొలతో .మెడలో పెద్ద రుద్రాక్ష మాలతో,బాన కడుపుతో కాశీ నగర వీధుల్లో సంచరించే వాడు . క్షురకులెవరైనా తనకు క్షురకర్మ చేస్తే చేయించుకొనేవాడు. గంటల కొలదీ గంగా జలం పై పద్మాసనం లో తేలి ఉండే వాడు లేదంటే గంటల కొద్దీ నీటిలోనే మునిగియుండే వాడు. ప్రాణాయామ అంటే శ్వాస నియంత్రణ. రేచక (గాలిని బయటికి వదలడం), పూరక (లోనికి పీల్చడం), కుంభక (లోపలి ప్రాణ వాయువును అలానే నిలిపి ఉంచడం ) హృదయాన్ని పరిపుష్టం చెయ్యడానికి, మనస్సును ఒకే విషయం మీద లగ్నం చేయడానికి ప్రాణాయామం ఉపకరిస్తుంది. ఇందులో ఆ మహనీయుడు పరాకాష్ట నందుకోగలిగినాడు కాబట్టి ఆయనకు ఆ విద్యలు సిద్ధించినాయి. కుష్టు రోగులకు సేవ చేసి వారి ని ఆదరించాడు బాబా .వేద వ్యాస ఆశ్రమం చేరి అక్కడ సీతా నాద బందోపాధ్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి, హనుమాన్ ఘాట్ చేరినాడు. కొంత కాలము తరువాత అక్కడినుండి దశాశ్వమేధ ఘాట్ కు తన మకామును మార్చినాడు ఆ మహనీయుడు.  ఒక మరాఠీగృహిణి రోజూ విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తూ ఈ దిగంబర స్వామిని చూసి ఏవగించు కొనేది .ఆమె భర్తకు రాచపుండు .ఆవిడ శ్రేయోభిలాషులెందరో ఆమెను దిగంబరస్వామి శరణు వేడమన్నారు. తాను ఏవగించుకొనే వ్యక్తిని శరణు కోరడము ఆమెకు మింగుడు పడలేదు. భర్త వ్యాధి ముదర జొచ్చింది. గత్యంత్రాలనీ తలుపులు మూసివేయడముతో స్వామిని శరణు కోరక తప్పలేదు. కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళటానికి సందేహించింది . చివరికి వెళ్లి
ఆయన కాళ్ళ మీద పడింది . దయామయుడైన ఆయన ఇచ్చిన విభూతి తో జబ్బు మాయ మైంది
                  కాశే మహా నగరం లో ఎందరో తెలుగు వారు ఉపాధ్యాయులు గా అధ్యాపకులు గావుండేవారు. వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించినారు .ఆయనకు త్రైలింగ స్వామి అనే పేరు పెట్టినారు .తెలుగు దేశం అంటే త్రిలింగ దేశమే కదా .అప్పటి నుంచి ఆ పేరే స్థిర పడి పోయింది .1800  లో తన మకాం ను దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవానికి మార్చినారు.

ఎప్పుడూ మౌనమే   ,ధ్యానమే ,తపస్సు యోగ సమాధే .అనుకే ఆయన్ను మౌన బాబా అన్నారు .ఆనోటా ఈనోటా స్వామివారి మహాత్మ్యము ప్రాకి కాశీ రాజును చేరింది. ఆయన గంగా నది లో వున్నారని తెలిసి తన పడవలో ఆప్రాంతము చేరినారు. స్వామిని గుర్తించి పడవలోనికి సాదరముగా ఆహ్వానించినారు. స్వామి అందులో కూర్చున్న తరువాత వారితో ముచ్చటిస్తూ బ్రిటీషు వారు తన గొప్పదనమునకు బహుమతిగా ఇచ్చిన ఖడ్గమును స్వామికి చూపింప దలచి ఆయన చేతికందివ్వబోతే అది జారి గంగలో పడిపోయింది. వెంటనే అంత లోతుకు దిగి దానిని తెచ్చేవారు దొరకరుకదా ! వారు వచ్చేవరకు కత్తి గంగలో వున్న చోటనే ఉండిపోవదు కదా! ఖిన్నుడయిన రాజును చూసి స్వామి పడవలో కూర్చొనియుంటూనే తన చేతిని గంగలోపలికి పోనివ్వజేసినాడు. ఆచేయి ఎంత లోతుకుపోయినదో మనకు తెలియదు కానీ అది బయటికి మాత్రం రెండు ఒకే విధమైన కత్తులతో వచ్చింది. తన కత్తిని తీసుకొమ్మని రాజును అడిగితే ఆయన అది గుర్తించలేకపోయినాడట. స్వామి రాజుకత్తిని రాజుకు ఇచ్చి తెండవ కత్తిని తిరిగీ గంగలో పారవేసినాడట.
           దిగంబరం గా తిరగటం కొంత మందికి నచ్చక కేసు పెట్టారు .కోర్టు లో కేసు నడిచింది .ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని న్యాయాధీశుని ఉత్తరువు. రాజు తలచితే దెబ్బలకు కుదువా!. స్వామిని తక్షణము న్యాయస్థానములో ప్రవేశ పెట్టినారు. ఆయన మహిమలను అధికారులు ఆయన కు వివరించినా ఆయన పెడచెవిని పెట్టటము జరిగింది.. స్వామి శుద్ధ శాఖాహారియని తెలిసిన ఆ న్యాయాధిపుడు  మాంసం స్వామి తింటే శిక్షించను అన్నాడు.  స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు. జవాబు వచ్చేలోపలే  తన చేతి లో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని తినేశారు .మతి పోయింది న్యాయాధీశునకు! విడ్డూరమైన విషయము ఏమిటంటే  దుర్గంధమునకు బదులు సుగంధ పరిమళం కోర్టు అంతా వ్యాపించింది .స్వామి మహిమను గ్రహించిన న్యాయపతి వారు దిగంబరముగా తిరగవచ్చునన్న తీర్పును ఇచ్చివేయడము జరిగింది.
ఒక సారి ఒక ఆకతాయి ఆయన బజారు లో వెళ్తుంటే మర్మాంగాన్ని గుంజాడు .అది కొన్ని గజాలు సాగింది .వాడు భయ పడి పారి పోయాడు ..దుండగులు కొందరు సున్న పు తేట ఇచ్చి పాలు అని చెప్పారు .శుభ్రం గా తాగేశాడు స్వామి .ఆ దుండగుని కడుపు మండనారంభించింది .వాడు తప్పు తెలుసుకొని స్వామి పాదాలపై వాలినాడు. స్వామి వానితో " ఇప్పుడు తెలిసినదా నీవు నేను వేరుకాదని" అన్నారు. దుండగీడు చెంపలు వేసుకొని స్వామికి సాగిలబడి మ్రొక్కి క్షమాపణ చెప్పుకొని అచటనుండి నిష్క్రమించినాడు. స్వామి మిగిలినదానిని మూత్ర రూపమున విసర్జించినారు. 
                      శ్రీ రామ కృష్ణ పరమ హంస 1868 లో కాశీ వచ్చి నప్పుడు తన మేనల్లుడు హృదయ నాద్ తో కలిసి మౌన  స్వామిని దర్శించారు .ఆయనకు బాబా నశ్యం వేసుకొనే కాయ కానుక గా ఇచ్చారు .స్వామిని నడయాడే విశ్వనాధుడు అని చెప్పారట పరమ హంస ..ఇంకో సారి అర్ధ మణుగు పాయసం వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తిని పించారట .పరమ హంస స్వామినిఈశ్వరుడు ఏకమా అనేకమా అని ప్రశిస్తే -సమాధి స్తితి లో ఏకం అనీ ,వ్యావహారిక దృష్టి లో అనేకం అని సైగల తోనే చెప్పారు స్వామి .పరమ హంస స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు .ఇద్దరు మహా పురుషులే .పరమ హంసలే .ఒకరి విషయం రెండో వారికి తెలుసు .ఎన్నో అద్భుతాలు చేసిన రామ కృష్ణులు స్వామిని అంతగా గౌరవించినారంటే మన త్రైలింగ స్వామి ఎంతటి మహిమాన్వితుడో మనకు అర్థమౌతుంది. ఒక సారి రాజ ఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికికేదార్ ఘాట్ లో ఉన్న  స్వామి దగ్గరకు  వచ్చారు .ఇద్దరు గాఢంగా ఆలింగనం చేసుకొన్నారు .కాసేపట్లో అందరు చూస్తుండ గానే ఇద్దరు మాయమైనారు .అరగంట తర్వాత స్వామి తిరిగి వచ్చారు .తాను ఆయన్ను రాజ ఘాట్ లో దింపి వచ్చాను అని స్వామి అందరి సందేహాల్ని తీర్చారు . అంటే ఆయన అష్టసిద్ధులు గడించిన మహిమాన్వితుడు అన్న విషయం మనకర్థమౌతుంది.

వారణాశికి వచ్చిన మరొక మహనీయుడైన లాహిరీ మహాశయుని గూర్చి త్రైలింగ స్వామివారు నాలుగు మాటలు చ్వెప్పుటకు తమ మౌనము వీడినారు. వారి శిష్యులు వెంటనే " స్వామీ! సర్వ సంగ పరిత్యాగులై పరమేశ్వరానుగహము బడసిన మీరు ఒక సామాన్య సంసారి కొరకు మౌనము వీడుటయా!" అన్నారు. అందుకు స్వామివారు ఈ విధంగా తమ శిష్యులకు శెలవిచ్చినారు " ఏమాత్రము నొప్పి కలిగించకుండా తల్లి పిల్లి తన కూనలను ఎక్కడ వుంచితే అక్కడ యిమిడి పోతాయి. లాహిరీ మహాశయులు కూడా అటువంటి యొక పిల్లికూన వంటివారు. తల్లి ఆదేశము ప్రకారము ఆయన సంసారమన్న స్థావరములో ఇమిడి పోయినారు. నేను సర్వసంగ పరిత్యాగినై సాధించినది వారు సంసారములో వుంటూనే సాధించ గలిగినారు. వారిని గూర్చి మాట్లాడుట నాకు అమ్మ యొసగిన వర"మన్నాడు. ఇప్పుడు నేను వ్రాసిన వారి మహాత్మ్యములను గూర్చి కూడా లోకులు అనేక విధములుగా వారిని గూర్చి తెలిసిన వారు చెప్పుకొంటారు. కానీ వారి మహత్తును గూర్చిన అనుమానము ఎవ్వరికీ లేదు.
పంచ గంగా ఘట్టం లో చిన్న భూ గృహం నిర్మింప జేసుకొని  32 ఏళ్ళు సేవ చేసి ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండు నెలల గడువు కావాలని కోరితే మరణాన్ని వాయిదా వేసుకొని ,భక్తుడైన మంగళ దాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధి లో ఉంది ,తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనం లో కూర్చుండి ,బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించుకొని 26 -12 -1887 న సర్వజిత్తు నామ  సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమ వారం  స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు .ఆయన శరీరాన్ని చెక్క పెట్టె లో పెట్టి ఆయన కోరిన విధం గానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహం లో వదిలారు .ఆ రోజూ నుండి ఈ రోజూ వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం పూజా జరుగుతాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్ లోని మఠం లో జరగటం విశేషం . పతంజలి యోగం లో విభూతి పాదం లో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు ,కుంభక యోగం లో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకొన్నారు .ఆయన సంస్కృతం లో రాసిన మహా వాక్య రత్నావళి కి వ్యాఖ్యను బెంగాలి లో రాశారు .కాని మన తెలుగు వారి దృష్టి దాని మీదికి పోలేదు. 280 సంవత్సరాలు జీవించి, స్వచ్చంద మరణాన్ని పొంది, యోగ సిద్దులలో త్రివిక్రములై  ఆశ్రిత జన కల్ప వృక్షమై మౌన  ముద్రాలంకారులై తెలుగు వారై ఉండి ఉత్తర దేశం లో అందులోను కాశీ మహా క్షేత్రం లో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రైలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించ టానికి .



వేదాంగములు

శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం
నమామి భవత్పాదం శంకరం లోక శంకరం
జగద్గురువు శంకరాచార్యులవారు భూమి పైనున్నది ముప్పది రెండు వర్షములైనా వారి గొప్పదనం ఈ క్రింది శ్లోకం తెలుపుతుంది.
               అష్ట వర్షే చతుర్వేది ద్వాదశే సర్వ శాస్త్ర లిత్
          షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే ముని రత్యగాత్
వారి ఎనిమిదవ ఏటికే నాలుగు వేదాలు నేర్చుకొంటే పదిరెండు వత్సరాలకు సర్వ శాస్త్రాలు కరతలామలకం చేసుకొన్నారు.  పదునారు సంవత్సరములకు వ్రాయవలసిన భాష్యములెల్ల వ్రాసి ఆసేతు శీతనగపర్యంతము పర్యటించి మండనమిశ్రుని  వంటి    వయో  జ్ఞాన  వృద్ధులైన దిగ్దంతులను ఓడించి శిష్యుల గావించుకొని ధర్మాన్ని పునః ప్రతిష్ఠ చేసి  తమ ముప్పది రెండవ ఏట  పరమ పదాన్ని అందుకొన్న అపర శంకరులు.  వారిచే ఏర్పాటు చేయబడిన కంచికామకోటి   పీఠము  నధిష్టించి నాస్తిక్యము ప్రబలమైన ఈ భూమిని తిరిగి ధర్మస్థాపన మొనర్చిన జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరసరస్వతీ సంయమీంద్రులు.  వారి భాషణల సహాయ సహకార సౌజన్యాలతో నాదైన రీతిలో వేదాంగముల గూర్చి తెలుపుటకు ప్రయత్నించినాను.  ఇందులో దొరలిన తప్పులేవైనా వుంటే క్షంతవ్యుణ్ణి.
బృహదారణ్యక ఉపనిషత్తులో రుగ్యజుస్సామ వేదాలు పరబ్రహ్మ ‘నిశ్వాసితం’ అని చెప్పబడినది.   కావున వేద పురుషుడైన ఆ పరమాత్మ వదలిన ఊపిరి నుండి వేదములు ప్రభవించినవి.  భాగవత పురాణంలోని మొదటి శ్లోకంలో “తేనే బ్రహ్మ హృదయ అధికవయే” అని ఉన్నది.  అంటే ఈశ్వరునిలో వేదాలు  ఆయన శ్వాసగా వున్నట్లు అవగతమగుచున్నది.  విద్యారణ్యులవారు తన గురువు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నంటూ ఆయన నిశ్వాసమే వేదాలని పునరుద్ఘాటించినారు. 
వేదాలు నేర్చుకొనుటకు వేదాంగాలు అత్యంత అవసరం.  ఒక మనిషికి కళ్ళు, కాళ్ళు, చేతులు ఎంత అవసరమో వేదపురుషునికి కూడా అంగాలు అంతే అవసరం.  వేదాధ్యయనానికి వేదాంగాలు ఎంత అవసరమో విశధ పరుప ప్రయత్నిస్తాను.
ఈ వేదాంగములు ఆరు:
1.శిక్ష   2.వ్యాకరణము  3.ఛందస్సు  4.నిరుక్తము   5.జ్యోతిషము   6.కల్పము
లాఘవముగా ఈ ఆరింటిని గూర్చి తెలుపుటకు నేను చేసే ప్రయత్నాన్ని చిత్తగించ ప్రార్ధన.  ఇక్కడ లాఘవము అంటే ‘అతి తక్కువగా’ అనేకాని అన్యథా కాదు.
1.శిక్ష   
మంత్రాన్ని ఉచ్చరించటమంటే అక్షరాన్ని శుద్ధంగా స్పుటంగా కాల పరిణామానుకూలంగా (అంటే timing) స్థాయీ భేదానుసారంగా పలుకవలెను.  స్థాయిని కుడా నిర్దుష్టంగా మూడు విధాలుగా విభజించినారు.  అవి 1.ఉదాత్త (హెచ్చు) , 2.అనుదాత్త (తగ్గు) , 3.స్వరితము(సమము)లు.  అప్పడు సస్వరంగా పలికినట్లగుతుంది.
మంత్రాలను సంస్కృతంలోనే ఎందుకు చదువ వలెనంటే, భావాన్ని పదములతో పదములను అక్షరములతో ఛందోబద్ధమైన (ఛందస్సును గూర్చి తరువాత చెప్పుకొందాము) ప్రణాళికతో స్వరయుక్తముగా భగవంతునిచే పలుకజేయ నొసంగిన దానిని మన ఇచ్చ వచ్చిన రీతి వాడుకొనుట మహాదోషము.  పాణిని మహర్షి తన వ్యాకరణ గ్రంధంలో మంత్రములెట్లు చదువ వలెనన్నది ఈ క్రింది శ్లోకములోని పోలిక ద్వారా తెలియబరిచారు.
 ‘వ్యాఘ్రీ యధా హరేత్ పుత్రాన్ దంష్ట్రాభ్యాంచ నపీడయేత్
భీతి ర్పతన భేదాభ్యాం తావద్వర్ణాన్ ప్రయోజయేత్’
పులి (లేక పిల్లిని మనం చూస్తూనే వుంటాము) తన కూనలను పళ్ళతో గట్టిగా పట్టుకొని ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకొని పోయినా పిల్లలకు ఎటువంటి బాధ కలుగనివ్వక పిల్లలకు ఎంత హాయిని చేకూర్చుతుందో మంత్రోచ్ఛారణ అంత హాయిగా ఉండవలెనన్నారు.
శిక్ష అందువల్ల వేదమంత్రాలకు ఊపిరి కావున వేద పురుషునికి నాసికా స్థానమౌతుంది.
2. వ్యాకరణము  
 “నృత్తావసానే నటరాజ రాజే  నవనాద ఢక్కాం నవపంచవారం
 ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం”
నృత్యం చివరి దశకు వచ్చినపుడు చర్మ వాద్య వాదన సంపూర్తి చేయబోవు చున్నప్పుడు ఆ వాద్యాన్ని వేగంగా వాయించుతారు. దాన్ని చోపు అంటారు.  ఆ సందర్భములో ఆ నృత్యాన్ని తమ దివ్య చక్షువులతో తిలకించుచున్న మహర్షులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు మరియు పతంజలి వ్యాఘ్రపాద పాణినీ ప్రభృతులలో పాణిని మహర్షి ఆ శబ్దంలో వినిపించిన నవపంచవారం అంటే [నవ=9 + పంచ=5] 14 దరువులు కంఠస్తం చేసి ‘అష్టాధ్యాయి’ అనే ప్రాథమిక సూత్ర గ్రంధాన్ని రచించినాడు.  భావానికి భాష ప్రధానమైతే భాషకు వ్యాకరణం  ప్రధానమౌతుంది.  వ్యాకరణం లేని భాష ‘వాక్య రణమే కదా!’  అందువల్ల దీనిని వేదపురుషుని ముఖ స్థానంగా ఋషులు తెలిపినారు.
3.ఛందస్సు     శ్రీ కృష్ణ పరమాత్మ సృష్టి వృక్షానికి “ఛందాంసి యస్య పర్ణాని” అని తెలిపినారు.  ఇక్కడ ‘ఛందాంసి’ అన్న శబ్దము వేదములకు వాడబడినది.  కారణం వేదాలయొక్క అనువాకాలలోని మంత్ర నిర్మాణం అంతా ఛందో బద్ధమయి ఉండుట కారణం కావచ్చును.
ఒక పద్యం లేక శ్లోకానికి ఛందస్సు ఎటువంటిది అంటే ‘ఆల్తీ’ తీసుకొని చక్కగా అతికినట్లు కుట్టిన ‘డ్రస్సు’ లాంటిది.  వేదాలలో గాయత్రి, అనుష్టుప్, త్రిష్టుప్ ఆదిగా గల ఛందో నిర్మాణ మంత్రములను శ్లోకములను మనము చూడవచ్చును.  ఛందో బద్ధమైన మంత్రాలను, శ్లోకాలను, పద్యాలను కంఠస్తం చేయుట ఎంతోసులువు.  అదే వచన పాఠమైతే మనకు నేర్చుకొనుట కష్టమగును.
వేదాధ్యయనం కొనసాగుటకు కంఠ పాఠము గావించుకొనుట తప్పనిసరి కావున ఛందస్సు వుండి తీరవలసినదే.  వేద పురుషునికి ఇది పాద ద్వయంగా చెప్పబడినది.
4.నిరుక్తం   
 వేద భాషా పదోత్పత్తి శాస్త్రమును ‘నిరుక్తము’ అని చెప్పవచ్చు.  యాస్కుల వారు రచించిన ‘నిరుక్తము’ ఆ కోవకు చెందిన గ్రంధముల యందు తలమానికము.
సంస్కృత భాషలో పదములు ధాతు జన్యములు.  ‘లిత్’ అన్న ధాతువు నుండి విద్య ‘ముజ్ఞ్ చ్’ అన్న ధాతువు నుండి మోక్షం  ‘జ్ఞ్’ ధాతువు నుండి జ్ఞానం పుట్టినవి.  ఇవి ఉదాహరణలు మాత్రమే.  వేదానికి శబ్దం యొక్క వినికి  (hearing) ముఖ్యం కావున దీనిని వేదపురుషుని కర్ణద్వయం అన్నారు.
5.జ్యోతిషం   
 ‘సర్వే జనాః సుఖినో భవంతు’ ‘సర్వం సమస్త సన్మంగళాని సంతు’ ‘శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే’ ‘శాంతి రేవ శాంతి’.  ప్రతి క్రతువుకు చివర చెప్పే ఈ శుభాకాంక్షలను గమనించితే ఒక కార్యక్రమము జరిగిన తరువాత చేసిన వాడు, చేయించిన వాడే కాకుండా ‘చుట్టము-పక్కము’ ‘ఇరుగు-పొరుగు’ ‘దేశం-విదేశం’ ‘సమస్త భూమండలము’ ‘అనంత విశ్వము’ సుఖము, శుభము, సౌభాగ్యము, శాంతి మొదలగు శోభాయమానములైన గుణములు కల్గి వర్దిల్ల వలెనని ప్రార్ధిస్తూ ముగిస్తారు.
ఇటువంటి శ్రేయోదాయకమైన కార్యాచరణమునకు నియమావళి, సుముహుర్తము సత్శకునములు అవశ్యము ఆచరణీయములు.  ఈ మూడు శాఖలను కల్గిన ‘స్కందత్రయాత్మక’మైన శాస్త్రమునే జ్యోతిషమంటారు.
నియమావళిని గూర్చి తెలిపే మొదటి స్కందాన్ని సిద్ధాంత స్కందమంటారు.   ఇందులో అంక గణితం, బీజ గణితం, క్షేత్ర గణితం(geometry), త్రికోణమితి(trigonometry) గూర్చి విపులంగా చెప్పడం జరుగుతుంది.  అంటే యజ్ఞగుండము యొక్క పొడవెడల్పులు యజ్ఞ గుండము వద్ద వేయ వలసిన వివిధములైన చతురస్ర, త్రికోణ, వృత్తాకృతులు మొదలగునవి తత్సంబంధమైన కొలతలు కోణముల ప్రకారమే చేయ వీలు కల్పించుతుంది. 
ఇక రెండవ స్కందాన్ని ‘హోర స్కంద’మంటారు.  ఈ ‘హోర’యే ఆంగ్లమందు ఉచ్చారణా దోషముతో ‘HOUR’ అయినది. ఒక ఘడియ అనగా 24 నిముసములు.  ‘సార్ధ ద్విఘటికా హోరాః ఇత్యేతత్ హోర లక్షణం’ అన్నారు. అంటే రెండున్నర ఘడియల కాలం ఒక హోర యని అర్ధం.  అంటే అరవై నిముసములు అన్న మాటే కదా!
ఈ స్కందము ఇంకా గ్రహముల గూర్చి, గ్రహచలనముల గూర్చి, నక్షత్ర మండలము గూర్చి తెలుపుతుంది.  అంతే కాక వీనికి మానవ దైనందిన జీవితమునకు గల అవినాభావ సంబధమును గూర్చి తెలుపుతుంది.
అనన్య ప్రతిభావంతులైన ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు మొదలగు మహామహులు ఈ జ్యోతిష శాస్త్రమును గూర్చి అనేక గ్రంథములను రచించుటయే కాక  ఏనాడో అంటే పాశ్చాత్యులకంటే ఎన్నో శతాబ్దాల ముందే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూవున్న వేద ప్రామాణికమైన విషయముల గూర్చి విశదముగా, వివరముగా తెలియబరచినారు.
ఇక మూడవది ‘సంహిత స్కందము’ ఇందు భూగర్భ జలాలు, గనులు, గృహనిర్మానాది వస్తు విషయములు మరియు శకున నిమిత్తముల గూర్చి తెలియబరుపబడుతుంది.  పైన తెలిపిన విషయములలో శకున నిమిత్తముల మాత్రము స్పృశించి చివరి వేదాంగము వద్దకు చేరెదము.  
‘శకునము’ అంటే ‘పక్షి’ ఇందు వివిధ రకములైన పక్షి భాషలు, మనమేదైనా పనికి బయలుదేరునపుడు, ఒక దిశ నుండి వేరొక దిశకు పోవుట వల్ల కలుగు ఫలితమేమి, జంతు జాలము యొక్క నడకలు, నడతలు, అరుపులు, హావభావాలు మొదలగు వానిని మనము మన భవిష్యత్తుకు ఏవిధముగా అన్వయించుకొనవలెను అన్నది తెల్పుతుంది.
ఇక నిమిత్తమంటే జరుగవలసినది ముందే నిర్ణయింపబడి వుండుట.  అంటే ఇది భావిష్యద్వాణి.  ఇది తెలుసుకొన్న వారు పరితాప పడుటకు బదులు పరిహారమునకై ఆలోచన చేస్తారు.  కావున ఒక సత్కార్యము చేయుటకు చక్కటి ముహుర్తము కడుంగడు అవసరము.  అందువల్ల జ్యోతిష్యాన్ని వేదపురుషుని నయన ద్వయంగా చెబుతారు.  అసలు జ్యోతిషానికి ‘నయన’మన్న మరోపేరు వుంది.  ‘నయ’ అంటేనే దారి చూపుట అని అర్ధం.
6.కల్పము         
ఇంత వరకు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషములను గూర్చి పరిచయం చేసుకోన్నాము.  ఇక ఈ ఐదు అంగాలనూ ఆచరణలో పెట్టుటకు కల్పము తోడుకావాలి.  ఆశ్రమ ధర్మముల ననుసరించి అంటే బాల్య, కౌమార,యవ్వన, వార్ధక్య ఆశ్రమాలలో ఏ కర్మ ఎప్పుడు చేయవలె, ఏ మంత్రము ఏ కర్మయందు వుపయోగించవలె, ఏమేమి సామగ్రి వాడవలె, ఆకర్మకు అధిష్ఠాన దేవతలెవరు, ఎంతమంది ఋత్విక్కులు వుండవలెను అన్న విషయములేకాక ఇంకా ఎన్నెన్నో విషయముల గూర్చి తెలుపును.
భరద్వాజ, ఆపస్తంబ, బోధాయనాది మహర్షులు కల్పక సూత్రములను గ్రంథస్తం చేసినారు.  దహన సంస్కారము కుడా ఈ కర్మలలో ఒక భాగమే.
దీనిని వేదపురుషుని బాహువులుగా అభివర్ణించినారు. 
ఈ షడంగములు మరియు మీమాంస, నయ, పురాణ, ధర్మ శాస్త్రములనబడు నాలుగు ఉపాంగముల సాయముతో వేదాధ్యయనము  గావింపబడుచున్నది.  వేదములు నాల్గింటితో కలిపి వీనిని చతుర్దశ విద్యలనుచున్నారు. 
ఇంకా ఈ విద్యలు అభ్యసించి అనుష్టించు మహితాత్ములచే ఈ ప్రపంచము సక్రమమైన దిశలోనే ఇంకా పయనించుచున్నది.
‘అనంతా వై వేదా’  అంటే వేదాలు అనంతాలు అన్న దెంత నిజమో ఆ వేదాలను గురించి చెప్పుట కూడా అనంతమన్నది అంతే నిజం. 
అంతా తెలియదు.  కావున, తెలిసిన కొంతలో కొంత తెలియబరచి ఈ వ్యాసాన్ని ఈ వేద వాక్యంతో ముగిస్తున్నాను.
భద్రం కర్ణేభీః శ్రుణుయామ దేవాః
భద్రం పశ్యే మా క్షభిర్య జత్రాః
స్థిరై రంసైః స్తు ష్టువాగం సస్తనూభీః
వ్యశేమ దేవ హితం యదాయుః
అర్ధము:        మా చెవులు శుభప్రదములైన విషయములే వినుగాక.  మా కళ్ళు శుభస్కరమైన విషయములనే చూచును గాక.  ధృడమైన అవయవములు గలిగిన శరీరముతో అహరహము (మిమ్ము) స్మరిస్తూ ఈ జీవితాన్ని దేవహితార్ధమే గడుపుదుము గాక.
ఓం తత్సత్

చెఱకు రామ మోహన్ రావు 



       























Friday, 20 November 2015

కార్తీక పౌర్ణిమ

Script For 25/11/2015 Broadcast


పరమేశ్వర స్వరూపులైన myind media శ్రోతలకు నమస్కారము. నా 

పేరు చెరుకు రామమోహన్ రావు. నేను విశ్రాంత 

భారత రాష్ట్రీయ వార్దుషీ యదికారిని. అంటే State Bank Of India 

Retd. Officer ను.వార్దుషి అంటే bank అని. నిజానికి వార్దుషి అన్నది  

bank కన్నా చాలా అనుగుణమైన పేరు. కానీ మనకు విదేశీ వ్యామోహము 

ఎక్కువ కదా! సరే , గీత దాటకుండా విషయములోనికి అడుగు పెడతాను.

మీతో మాట్లాడే అవకశాన్ని నాకు కలిగించిన myind media కు 

ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

పుట్ట పగిలితే చీమలు వచ్చినట్లు, bank తెరిచితే చెక్కులు వచ్చినట్లు నోరు 

తెరిచితే ఆవులింతలు వచ్చినట్లు, బడి వదిలితే విద్యార్థులు వచ్చినట్లు, 

బ్రహ్మానందము కనబడితే ప్రేక్షకులకు నవ్వులు వచ్చినట్లు,web తెరిచితే 

గబ్బువస్తుంది. గబ్బుల మబ్బులు తొలగించితే అబ్బురపరచే మంచి కూడా 

సుబ్బరంగా కనబడుతుంది. నిప్పుతో కొంపలనూ అంటించవచ్చు, వంటా 

చేసుకోవచ్చు.కాబట్టి ఈ మంచి చెడులన్నవి మన మనసు మీద 

ఆధారపడేవి. ఆ విధమైన web media నుండి చెడ్డను వంచి,మెల్లిగా 

తుంచి, మంచిని ఎంచి,మంచిగా పెంచి ,సంతరించి, మిమ్ము వరించి తరించ 

దలచి మీతో పంచుకోవలేనన్నధ్యేయముతో ముందుకు వచ్చిన, వారు,  

ఎంతయో అభినందనీయులు. వారు తలపెట్టిన యజ్ఞములో నేను సమిధను 

మాత్రమే . ఏ కల్తీ సారాయి పోయ్యిక్రింద కట్టెగా కాలుట కంటే సమిధ గా 

కాలుట గర్వహేతువే కదా! వారు ఇటువంటి మంచి మంచి పనులింకా 

ఎన్నెన్నో తలపెట్ట వలయునని, కేవలము వయసులో పెద్దనైన నేను 

ఆశీర్వదించుటకు చొరవ తీసుకొంటున్నాను. ఈ బృహత్కార్యము 

నెరవేరుటకు మీ ఆదరము, అభిమానము, ఆప్యాయత

అనురాగము,ప్రేమ, 

వాత్సల్యమును, మమకారములను చూపించి , పాలూ నీరు ,జీర గులాబ్ 

జామూన్, ఇడ్లీ సాంబారు కలిసినట్లు సంస్థలో భాగమై మా తప్పులను 

సవరించుతూ, ఒప్పులకు భేష్ అంటూ మమ్ము నడిపించి మీ 

హృదయములకు కలకాలమూ చేరువగా వుంచుకొంటారని  

ఆశించుతున్నాను.ఆరంభమున హేరంబా యని తలచి స్వామి 

యనుగ్రహము కోరుట, ముఖ్యముగా మంచిపనులు చేయుటకు అత్యంత 

అవసరము. అందులో భాగముగానే నేనే వ్రాసి బాణీ కట్టిన పాట 

మీముందు ఉంచుతున్నాను. నేను సంగీతము అణుమాత్రము కూడా 

నేర్చుకోలేదు. పాట బాగుంటే పరమేశ్వరానుగ్రహము లేకుంటే నా చేతగాని 

తనముగా భావించ ప్రార్థన.

వందే వందే గజాననా
గౌరీ ప్రియసుత గజాననా
హారతి గొని మా కలుష మెల్లను
హరియించుమయా హరుతనయా       || వందే వందే గజాననా ||

సకల కార్యముల కాద్యుడవీవే
సర్వ శుభములను కూర్తువు నీవే
నీదు పాదములు మదిలో నిలిపి
నిన్నే నిన్నే వినుతింతుమయా             || వందే వందే గజాననా ||                                    

ఆగ్రహ నిగ్రహ శక్తి యుతుడవు
అనుగ్రహించుము మాపైన
కరములు కలిపి వేడుకొందుము
కనికరించుమా కరుణాహృదయా           || వందే వందే గజాననా ||

కార్యక్రమాన్ని ఒక మంచి మాటతో మొదలు పెడదామన్నది నా ఉద్దేశ్యము. 

అజరామర సూక్తి

విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం

విద్యా భొగకరీ యశః సుఖకరీ విద్యా గురూణాం గురుః

విద్యా బంధుజనో విదేశగమనే విద్యాపరా దేవతా

విద్యా రాజసు పూజితా న హి ధనం విద్యా విహీనః పశుః

- నీతిశతకము, భర్తృహరి

దీనిని ఏనుగు లక్ష్మణ కవి గారు ఈవిధముగా తెనిగించినారు:
విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాల పూజితము విద్య నేరుంగనివాడు మర్త్యుడే.

వ్యక్తికి విద్యయే రూపము. విద్యయే గుప్త ధనము,విద్యయే సకల భోగములను,కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే గురువువలె అన్నింటిని బోధించును. పరదేశమునందు చుట్టము వలె సహాయము చేయును. విద్యయే రాజపూజితము. ఇట్టి విద్య లేనివాడు మనషుడే కాదు.

విద్య తోటి వచ్చు వినయము విద్వత్తు
విద్య తెచ్చు కీర్తి విత్తములను 
విద్య నేర్వకున్న విలువేది ధరలోన 
విద్య లేని వాడు వింత పశువు
ఈ పద్యములోని చివరి పాదము పుష్పగిరి తిమ్మన గారి తెలుగు సేతలోని చరణమనుకొంటాను లేక ఎలకూచి బాలసరస్వతి గారిదో! అది చాలా ప్రసిద్ధి గన్నది. మిగతా మూడు చరణములు తెలియనందువల్ల నా పైత్యమే జోడించినాను.
విద్య మరియు విజ్ఞానం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వమే మారుస్తుంది. విద్య వినయము విజ్ఞానమును కూడా ఇస్తుంది. ధనము యశస్సును ఆర్జింపజేస్తుంది. గుణనిధుల సహవాసమును గూర్చుతుంది. ఇచ్చే కొద్దీ పెరుగుతుంది. దీనిని bank locker ల లో పెట్టనవసరములేదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా విద్యావంతుని ఆదేశము గౌరవించుతుంది. విద్యకు వినయము, విధేయత  కర్ణునికి కవచకుండలముల వంటివి . అవి వదిలి కర్ణుడు దిక్కులేని మరణము పొందినాడు. వినయ విధేయతలు గలిగినవాడు గౌరవపాత్రుడౌతాడు. ఆ పాత్రత కలిగితే ధనము వద్దన్నా వస్తుంది. అధివస్తే తానూ తినవచ్చు పదిమందికీ పెట్టవచ్చు. ఈ విద్య విషయములో మనము ఇద్దరు వ్యక్తులను పోల్చవచ్చును. ఒకరు అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఇంకొకరు అబ్దుల్ కలాం . ఖదీర్ అంటే ఆంగ్లములో Powerful అని. కలాం అంటే speech అని. మొదటి వ్యక్తి పాకిస్తానీ శాస్త్రజ్ఞుడు . ఆయన అంతస్తు హోదా కోరుకున్నాడు. దానికి తగిన మార్గము ఏదయినా ఫరవాలేదనుకొన్నాడు. రెండవ వ్యక్తి కలాం అంటే speech. తన speech తో పిల్లలకు preach చేస్తూనే మన గుండెలకు reach అయ్యి తన తనువు చాలించినాడు. అంటే తాను పొందిన విద్యకు వినయుడై విధేయుడై మన గుండెలలో నిలచినాడు.
జ్ఞానమునకు  ఎటువంటి అడ్డంకులు, హద్దులు లేవు. ఇది ప్రపంచ వ్యాప్తంగాగౌరవింప బడునది.దీనిని ఇంత మాత్రమె పొందవలేనన్న ఆంక్షలు వుండవు. ఈ ధనము పై Income Tax లేదు. రాజులైనా విద్యానిదులగు సత్పురుషులను గౌరవించక తప్పదు.
ఆలోచనా శక్తి గలిగి జ్ఞాన సముపార్జన చేయవలసిన వ్యక్తి మన్నుదిన్న పాము మాదిరి ఊరక గూర్చుంటే అతనికీ జంతువుకు తేడా ఏముంది.
అందుకే విద్య లేనివాడు వింత పశువు అన్నారు. మామూలు పశువు కూడా కాదు పాపం!
*********************************************************************************
కార్తీక పౌర్ణమి

కార్తీక పౌర్ణమికి అత్యంత ముఖ్యమైనది దీపము. అందునా సంధ్యా దీపము. ఒకటి ప్రాతః సంధ్య, రెండు సాయం సంధ్య. సూర్యోదయము ఉదయము ఆరు గంటలకు అవుతుందనుకొంటే, దాన్నికి ఒక గంటన్నర ముందు కాలాన్ని బ్రహ్మీ ముహూర్తము అంటారు. అంటే తెల్లవారుజ్హామున 4 - 30 కు మొదలవుతుందన్నమాట. ఈ సమయములో దంతదావనాది కాలకృత్యములు 
తీర్చుకొని శుచిగా స్త్నానము చేయావలె. ఆకాశగంగలో స్త్నానానికి సప్త ఋషులు ఆ సమయములో బయలుదేరుతారట.మనము ఆ సమయములో స్త్నానము చేయుటవల్ల వారి అనుగ్రహ దృష్టి మనపై ప్రసరించుతుంది. స్త్నానము చేసిన పిదప సూర్యోదయాత్పూర్వమే  ప్రాతః సంధ్యా దీపమును వెలిగించవలె.అదే విధముగా సాయం సంధ్య యందు సూర్యాస్తమయాత్ పూర్వమే సాయం సంధ్యాదీపమును వెలిగించవలె. శక్తి, అవకాశము కలిగినవారు కేవలము ఆవునేయితోనే దీపమును వెలిగించ మన్నది శాస్త్ర వచనము. దానివల్ల శుక్లములు రావన్నది ఆర్య వాక్కు. అట్లు కాకుంటే తైలము తోనే వెలిగించవలె.'తిలేభ్య ఇదం తైలం' తిలల ద్వారా వచ్చినది మాత్రమె తైలము . ఇది సర్వ విధాలా ఆరోగ్యకరము. ఆలివ్ నూనెను గూర్చి వారు తెలుపలేదు. దాని అవసరము వారికి కలుగలేదు కాబట్టి. అటువంటి దీపమునకు ఈ శ్లోకమును చెప్పి నమస్కరించవలె. ఈవత్తికి ఎన్ని పురులు వుండవలెనంటే  మూడు పురులు అంటే మూడు వత్తులు పేని ఒకటిగా జేసి దీపమును వెలిగించవలె. పెద్దలు 
"సాజ్యం త్రివర్తి సంయుక్తం-- వహ్నినా యొజితమయా
గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం" అన్నారు . స + ఆజ్యము అంటే ఆజ్య సహితముగా అని మీకు తెలిసినదే! ఆజ్యము అంటే ఆవు నెయ్యి మాత్రమె. 3 పురులు కలిగిన వత్తి నేతిలో తడిపి పెట్టమన్నారు. అది సర్వ శ్రేష్ఠము. దీపము మూడు లోకముల చీకటులను పారద్రోలి జగములకు వెలుగులు నింపుతుంది.
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వ తమోపహం 
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపా నమోస్తు తే
ఇది చెప్పవలసిన శ్లోకము దీపము పెట్టు సమయములో !

పాశ్చాత్యులు,  Light Trapping System అన్న ఒక పద్ధతిని వారి వారి పేర్లమీద ప్రచారమునకు తెచ్చినారు. మరి దేనికయినా ఒక మూలము అవసరము కదా! దానికి మూలము మన దేశమే! మనము పిలుచుకొనే దీపావళి, దీపోత్సవము , కార్తీక దీపారాధన ప్రభావమే వారి పుర్రెలో పుట్టిన భావము. అసలీ దీపోత్సవము వెనుక దాగియున్న శాస్త్రీయతను చూద్దాము. (correction**) వర్ష ఋతువులో వర్షము పడుట మూలమున పెరిగిన పంటలు కోతలకు రావటముతో అవి కోయుటవలన వానిపై నివసించిన కీటక,పతంగములు ఇళ్ళలోనికి రావటము ఎక్కువౌతుంది. భూమి లోపల చేరిన నీటి కారణమున అంతకు ముందు ఋతువులో గ్రహించిన వేడితో మిశ్రితమౌట వలన వివిధ వాయువులు (విషవాయువులు ఎక్కువగా వుంటాయి) ఆవిరులరూపములో వాతావరణములో ప్రవేశించుతాయి. పగలైతే సూర్య ప్రకాశము వుంటుంది కానీ రాత్రికి ఎట్లు ? అందుకే కార్తీక మాసములో నూనె దీపములు వెలిగించేది. మన ఋషులు ద్రష్టలు. వారు అనుగ్రహించిన విధానమే ఈ కార్తీక దీపారాధన. దీనికి కేవలము((correction**) ఆవునెయ్యి అదిలేకుంటే నూవుల నూనెను మాత్రమె ఉపయోగించ వలెనన్నది వారి యాదేశము. ఇందుకు ముఖ్యమైన కారణములు రెండు. ఒకటి ఆ దీపములనుండి వచ్చు పొగ విషవాయువులకు విరుగుడుగా పని చేస్తుంది. ఆ దీపమూల వెలుగులకు ఆకర్షింపబడి క్రిమి కీటక పతంగ శలభములు, అందులో ఆహుతి యగుట చేత మానవాళి రోగముల నుండి రక్షింపబడుతుంది. ఇంత గొప్ప విషయమును పేరుకొరకు ప్రాకులాడకుండా ప్రజలకు పంచినవారు మన ఋషులు. మనమేమి చేసినా వారి ఋణము తీరదు కానీ మనసారా మరచి పోకుండా వారిని తలచుకొంటూ వుందాము. ఇక కార్తీక మాసములోనికి అడుగు పెడదాము.
కృత్తికా నక్షత్రమునకు, పున్నమి చంద్రుడు దగ్గరగుటవల్ల ఈ మాసమునకు కార్తీక మాసమని పేరు. కార్తీకమాసంలో సూర్యుడు తులారాశియందు ప్రవేశించును. ఆ సమయమున సమస్త నదులు కూడా గంగానది తో సమానముగా విష్ణుమయమౌతాయని కార్తీక పురాణమున చెప్పబడినది. కార్తీకమాసం వర్షాకాలం ముగిసిన తరువాత వస్తుంది. అంటే శరదృతువు లోని చివరి నెల కార్తీకము. అప్పటిదాకా వానలు పడి చిత్తడిగా ఉన్న భూములు పొడివారతాయి. అటు వానలు, ఇటు ఎండలు లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి వాతావరణము ఇటు శరత్తులోను అటు వసంతములో వస్తాయి. అందువలన అన్ని పండుగలకు నోములకు ఆలవాలము. అందులో అత్యంత ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి. (correction**) ఈ ఋతువులో హృద్రోగములు ఎక్కువవుతాయి. అందుకే ఈ నక్తాలు ఉపవాసాలు . (correction**)ఉసిరిక చెట్టు లేక దాత్రీ వృక్షము క్రింద భోజనాలు. ఆమలకము అన్నివ్యాధులకు మందు అంటారు.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన (correction**)తరువాతి రోజు నుండినే కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ (correction**)ప్రాతః సాయంవేళల దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. (dialogue delete) ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహా పూరాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు. ఈ రోజు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులు తోడూ రాగా త్రిపురాసుర సంహారము చేయుట జరిగింది. అందుకనే దీనిని త్రిపుర పౌర్ణిమ అంటారు.
మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. దేవతలను నానావిధాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వారు. రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కృత్తిక అన్నది ఒక నక్షత్రము కాదు, ఆరు నక్షత్రముల సముదాయము. కృత్తికలు మాతృకలు. అగ్ని సప్తఋషులు చెయు హవనమున వారి ధర్మపత్నులజూసి మొహితుడౌతాడు.వశిష్ఠుని భార్య అరుంధతి రూపము తప్ప మిగిలిన సప్తఋషులలోని ఆరుమంది రూపము దాల్చి, అగ్ని భార్య స్వాహాదెవి ఆయనకు ప్రీతిగలిగించుతుంధి. ఆ యువతులు తమ భార్యలని భ్రమపడి ఋషులు వారికి శాపములిస్తారు . వారే 6 కృత్తికలు  . 
పరమేశ్వరుడు పార్వతీ దేవితో క్రీడించు సమయమున, దేవతలు కైలాసమువచ్చి స్వామిని ఎలుగెత్తి పిలువడముతో ఆయన హృదయస్థానమునుండి వెలువడిన రేతస్సుతో వారి ముందునకు వచ్చి ఇక నా శక్తిని పార్వతి కడుపులో నిక్షిప్తము చేయలేను కావున తగినవారెవరని యడిగితే భూమి యని చెబుతారు దేవతలు. స్వామి భూమిపైకి తన రేతస్సును జారవిడుస్తాడు. భూమి భరించలేక పోవుట మూలాన  ఆ వేడిని అగ్నిమాత్రమే గ్రహించగలడని అగ్నిని వేడుకొంటారు దేవతలు. అగ్ని దానిని గ్రహించుతాడు కానీ భరించలేక పోతాడు. అప్పుడు తన మిత్రుడైన వాయువు సహాయముతో రేతస్సును పార్వతికి సహోదరియైన గంగకు ఇస్తారు. అప్పుడు గంగ  ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. కానీ గంగకు కూడా అది  చేతగాని పనియే అవుతుంది.(correction**) కొంత కాలము తరువాత ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరముల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకము నందు విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకము నుండి, ఆరుముఖములతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుక్లషష్ఠినాడు, షణ్ముఖుడు ఉద్భవించుతాడు.. (correction**)శరవణ తటాకము నుండి ఉద్భవించిన కారణముగా స్వామికి శరవణభవ అని నామము వచ్చినది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించినాను కాబట్టి, నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామము వచ్చినది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో, వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామములు వచ్చినాయి. దేవతలను రక్షించుటకొరకై శివుని నుండి, స్ఖలనమై (correction**)వచ్చిన కారణముగా స్వామికి 'స్కంద' అనే నామము వచ్చినది. అక్కడ వున్న   ఆరుమంది కృత్తికలు ఆయన ఆరు ముఖములకు స్తన్యమిచ్చినారు. కానీ దానికి గానూ వారు తమకొక నిరంతరమైన గుర్తింపు (correction**) కావలెనని అడిగినారు.దానికి తోడుగా  సుబ్రహ్మణ్యుడు తమకొడుకు గా కూడా గుర్తింపబడవలయునన్న ఒక కోరిక కోరినారు. అందు వలన ఆయన కార్తికేయుడై తక్షణ యవ్వనము పొంది తారకాసురుని ఈ పౌర్ణమినాడు నిర్జించినాడు. దేవతలు ఆనందించి ఈ దినము చేసుకొన్న దీపావళే 'దేవ దీపావళి' అయినది. కలకాలము వారి పేరు నిలుచుటకుగానూ ఇంద్రునితో చెప్పి వారికి విశ్వాంతరాళములో కృత్తికా నక్షత్రముగా విరాజిల్లులాగున (correction**)ఏర్పాటుచేసినాడు కార్తికేయుడు..
ఈ మాసమునందు దీపమునకున్న ప్రాశస్త్యము ఇంత అంత కాదు. ఈరోజు 360 వత్తులతో ఒక గుత్తి చేసి ఆలయములలో దానిని ముఖ్యముగా ఆవునెయ్యితో వెలిగిస్తారు. దీనికి కూడా తగిన కారణమున్నది. మనము సాధారణముగా "ఆయింట్లో దీపము పెట్టేవారు లేరు అని ఏదయినా ఒక తాళము వేయబడిన ఇంటినిగూర్చి అంటూ ఉంటాము." దీపానికున్న ప్రాముఖ్యత అది. ఏకారణము చేతనయినా మనము కొన్ని రోజులపాటు తాళము వేసి వేరు వూరికి పోవలసి వస్తే ఆ రోజులలో దీపము పెట్టె దిక్కు వుండరు. దీపము వెలిగించుట యజ్ఞము చేయుటకు ప్రతీక. దీపము పెట్టి ఒక చిన్న బెల్లపు ముక్క దేవునికి నైవేద్యముగా పెడితే అది ఇంటికి ఎంతో శోభస్కరము. ఈ విధముగా తలుపు తాళము వేయుటవల్ల ఆరోజులలో దీపమును పెట్టలేము కావున భగవంతుడు మనకు ఈ వెసలుబాటును ఇచ్చినాడు. ఈ పౌర్ణమిరోజు 360 వత్తులు ఒక గుత్తిగా చేసి దేవాలయములోని ప్రమిద లో ఆవునెయ్యి తో వెలిగించుటవల్ల ఆ దోషము పరిహారమగుటయే గాక సర్వ శుభాములనూ సమకూర్చుతుంది. మరి సంవత్సరమునకు 365 రోజులు కదా అంటారేమో. మనము భూమి చుట్టూ తిరిగే చంద్రుని భ్రమణ కాలమును తీసుకొంటాము. ఒక సంపూర్ణ భ్రమణము పూర్తియైతే ఒక వృత్తము పూర్తియైనట్లు.మరి వృత్తమునకు 360 డిగ్రీలే కదా వుండేది. ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క రోజుగా పరిగణించి 360 వత్తుల గుత్తి చేస్తాము. (correction**)హెచ్చు తగ్గులు శూన్య మాసము అధిక మాసములతో సవరించుకొంటాము.
దీపం అంటే అగ్ని. జ్ఞానానికీ ఆనందానికీ సిరిసంపదలకూ ప్రతీక. దీపకాంతిలో ఉండే ఎరుపు, పసుపు, నీలి కాంతులు ముగురమ్మలకూ సంకేతం అని నమ్మిక. దీపారాధన వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని పురాణ ప్రతీతి. వెలిగించేవాళ్లకి సహాయకులుగా ఉన్నా... కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. అలాగే ఈరోజున... కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీకపురాణం చెబుతోంది.
అన్ని దానాలు ఒక యెత్తు అయితే దీపదానం ఒక్కటీ ఒక యెత్తు. దీపదానం చేసేవారు పైడి ప్రత్తితో స్వయంగా వత్తులను తయారు చేసుకుని వరిపిండితో గానీ, గోధుమపిండితో గానీ ప్రమిదను చేసుకుని అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానికి నమస్కరించి నదీతీరంలోగానీ, దేవాలయప్రాంగణంలో గానీ బ్రాహ్మణుడికి దానం యివ్వవలెను. దీపదానం చేసే సమయంలో . అసలు ఉసిరిక కాయను తొలచి అంధుడి విత్తనము తీసి వత్తియుంచి ఆవునేతితో దీపము వెలిగించుట అత్యంత శ్రేయస్కరము. ఆ పొగ అత్యంత ఆరోగ్య ప్రదము.

సర్వ జ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్శుభావాహం
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ

కార్తీకపౌర్ణమినాడు వేకువజామునే లేచి శివనామస్మరణతో తలారా స్నానం చేసి భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి వాటిని అరటిదొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతుంటారు మహిళలు. పెళ్లికాని అమ్మాయిలు కార్తీకదీపాలను నదుల్లో వదిలి రాత్రికి తులసికోటలో కాయలతో ఉన్నఉసిరిక కొమ్మపెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వసిస్తారు. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు , మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు. కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేసి అమ్మవారు స్వామీ దానిని దాటగానే వారివెంట తామూ దాటితే  సర్వపాపాలు తొలగుతాయి. జ్వాల తోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి. జ్వాలాతోరణమునకు సంబంధించిన పురాణ కథనము ఈవిధముగా వుంది. క్షీర సాగర మథనములో మొదట వచ్చిన హాలాహలాన్ని , లోకకల్యాణార్థమై, మ్రింగుటకు పరమేశ్వరుడు ముందుకువచ్చి మ్రింగుతాడు . ఆ దినము కార్తీక పౌర్ణిమ. ఆ కాలకూట విషాగ్ని అగ్నినే దహించివేయగల సామర్థ్యము కలిగినది. అట్టి అగ్నిని స్వామి కంఠము నుండి క్రిందికి జారకుండా ఆపి అమ్మవారు స్వామి ఉదరములోని చతుర్దశభువనములను కాపాడింది. ఆసందర్భామున ఆమె అగ్నిని , తనభర్త కంఠము లో శాశ్వతముగా వున్నా అటు ఆయనకు ,ఇటు లోకాలకు ఎటువంటి హాని కలిగించకుండునట్లునూ, అందుకు ప్రతిగా ప్రతి కార్తీక పౌర్ణమి నాడు తానూ తన భర్తతో సహా జ్వాలాతోరణము ముమ్మారు దాతుతానని చెప్పిందట. అందుకే ఈ తిథినాడు రెండు గుంజలను మధ్యన కాస్త దూరముంచి పాతి, వాటి పైన అడ్డముగా ఒక పురితిప్పిన ఎందుగడ్డిని చుట్టి వెలిగించి పల్లకిలో అమ్మవారిని స్వామిని త్రిప్పుతారు. వారితో బాటు భక్తులు కూడా తిరిగి తమ తమ పాప వినాశము చేసుకొంటారు.
కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. 
కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 
ఇక ఈ దినము పరమేశ్వరుడు త్రిపురారులను చంపినట్లుకూడా చెప్పుకొంటారు. భాగవతము సప్తమస్కంధములో ఈ విధముగా వున్నది. త్రిపురాసురులచే విపరీతమైన కష్ట నష్టాలననుభవించిన దేవతలు విష్ణుని ఆజ్ఞ మేరకు శివుని ఈ విధముగా ప్రార్థించినారు.
దీనులము గాక యుష్మద
ధీనులమై యుండు మేము దేవాహితదో
ర్లీనుల మైనారము బల
హీనుల మగు మమ్ముఁ గావు మీశాన! శివా!

అప్పుడు శివుడు
శరి యై కార్ముకి యై మహాకవచి యై సన్నాహి యై వాహి యై

సరథుండై సనియంత యై సబలుఁడై సత్కేతన చ్ఛత్రుఁ డై
పరమేశుం డొక బాణమున్ విడిచెఁ ద ద్బాణానల జ్వాలలం
బురముల్ కాలె ఛటచ్ఛటధ్వని నభోభూమధ్యముల్ నిండగన్.

(భా-7-405-వ.)

వచనము.
ఇట్లు హరుండు దురవగాహంబు లైన త్రిపురంబుల నభిజిన్ముహూర్తం

బున భస్మంబు చేసి కూల్చిన, నమర గరుడ గంధర్వ సాధ్య యక్ష
వల్లభులు వీక్షించి జయజయశబ్దంబులు జేయుచుఁ గుసుమ వర్షం
బులు వర్షించిరి; ప్రజలు హర్షించిరి; బ్రహ్మాదులు గీర్తించి; రప్సరసలు
నర్తించిరి; దివ్య కాహళ దుందుభి రవంబులును మునిజనోత్సవంబు
లును బ్రచురంబు లయ్యె; నిట్లు విశ్వజనీనం బగు త్రిపురాసురసంహా
రంబున నఖిలలోకులును సంతసిల్లి శివ కేశవులకు కృతజ్ఞత తెల్పుకొనిరి.
జ్యోతిష్ శాస్త్రానుసారము అభిజిత్ముహుర్తము ఒక దినములో సర్వ శ్రేష్ఠమైనది. పరాత్పరుని మనసారా పూజించి ఈ ముహూర్తమున ఎపనిజేసినా విజయము వరించక తప్పదు.సాధారణముగా ఇది 45 నిముసములుంటుంది. కానీ దీని వ్యవధి సూర్యోదయ సూర్యాస్తమయాలతో ముడివడి యుంటుంది. నారదపురాణానుసారము తిథివారనక్షత్రములేవీ ఈ ముహూర్తమునకు వర్తించవు.ఒక్క దక్షిణ దిశా ప్రయాణము మాత్రము నిషిద్ధము.

రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 360 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. 
 కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. 
కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి  ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. 
ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరిక దానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు. 

చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. 
మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. 

పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. 
పూర్వం   నైమి శారణ్యంలో శౌనకాది మహర్షులతో  సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి  బోధించటం జరిగింది. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 
బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి ఈ వ్రతవిధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వటము చేస్తారు. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిదాని చెబుతారు. 
ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి. ఇందులో భాగంగా మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. 
1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. 
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. 
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును. 
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. 
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. 
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. 
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. 
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన). 
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు. 
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది. 
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును. 
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును. 
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును. 
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. 
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

ఈ కార్తీక పౌర్ణమి శుభ సందర్భముగా శివునికి కేశవునికి సబందిన , నేనే వ్రాసి మేట్టుకట్టిన  రెండు పాటలు మీకు వినిపించుతాను.


పేరేపెన్నిది వేరేమున్నది చేరగ నీ సన్నిధి 
శివా నా మది మరి మరి యన్నది

కాలపు మాయా జాలపు ఎరనై 

విదివిధానమను వింటికి గురిని నై
జవసత్వములే చేయివదలగా
తెలిసేనాకిపుడు తేటతెల్లముగ
దాతవు నీవని త్రాతవు నీవని 
భీతిల పని యేలని 
శివా నామది మరి మరియన్నది         ||పేరే పెన్నిధి ||

నీ విభూతిలో నిరతము నెలవై 

నిలిచిపోయెదను ను నె రేణువునై
భస్మదారి యో భవభయహారి 
ఉండనివ్వు నీవంటినంటిమరి
తల్లివి నీవని తండ్రివి నీవని 
సకలము నీవేనని 
శివా నా మది మరి మరియన్నది.       ||పేరే పెన్నిధి ||     

మరుభూములలో మసలే దేవా 

నీపద రక్షణ చేయగ నీవా
అరచేతులనే పరచేతునయా 
నీ పదాల నేనంటియుందునయ 
నా స్థితి నీవని నా గతి నీవని 
గమ్యము నీవే నని 
శివా నా మది మరి మరి యన్నది      ||పేరే పెన్నిధి ||

ఈ కార్తీక పౌర్ణమి నాడే గోపికలకు కృష్ణ సాయుజ్యము కలిగినదని యంటారు . అట్టి సందర్భములో ఈ పాట వినండి.


రాస క్రీడకు రయమున రమ్మని 

రాగాలాపన రవళించేను 
రావె పోదాము మనసా 
యమునా తటమునకు
మనసా యమునా తటమునకు

ఎదలో దాగిన యదునందనుడు 

ఏదో గుసగుస వినిపించేను 
ఏమి సేతునే నేటుల సైతునే 
రావె పోదాము మనసా 
యమునా తటమునకు                         ||రాస క్రీడకు||

మెరుగుల సరిగెల మేఘాంబరమున 

ఎడనెడ నగుపడె నెలమానికము
కలువదివ్వెగొని కలువ మోహనుని 
రావె పోదాము మనసా 
యమునా తటమునకు                         ||రాస క్రీడకు||

హరిత సాలముల హరిణీ తతుల

వెలుగుల జిలుగుల హర్మ్య దీపికల
యమున వెలిగెలే హరిమయమౌచును
రావె పోదాము మనసా 
యమునా తటమునకు                         ||రాస క్రీడకు||

శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః.