Showing posts with label మహాభారత యుద్ధము పిమ్మట ధృతరాష్ట్ర పుత్రుడు యుయుత్సుడు మిగిలినాడు.. Show all posts
Showing posts with label మహాభారత యుద్ధము పిమ్మట ధృతరాష్ట్ర పుత్రుడు యుయుత్సుడు మిగిలినాడు.. Show all posts

Saturday, 25 December 2021

మహాభారతములో యుయుత్సుడు

 

 

మహాభారతములో యుయుత్సుడు

https://cherukurammohan.blogspot.com/2021/12/blog-post_25.html

యుయుత్సుడు మహాభారతంలోని ప్రముఖ పాత్రలలో ఒకడు. యీతడు ధృతరాష్ట్రునికి 

వైశ్య వర్ణస్తురాలగు దాసీ కుమారుడు. ఇతను ధర్మపరుడు. మహాభారత యుద్ధపు 

ప్రారంభసమయమున. యుధిష్ఠిరుని పిలుపుతో, అతను కౌరవ సైన్యాన్ని విడిచిపెట్టి

పాండవ సైన్యంలో చేరి వారి తరపున పోరాడుతాడు.

గాంధారి గర్భమున నూరుమంది శిశువుల పిండము ఒకటిగా ఉండినది. గర్భవతిగా 

ఆపిందమును మోయుట బరువై తానూ సహజముగా అనుదినమూ చేసే పతిసేవ 

చేసుకోనలేక పోయినది. అందుచే అంధుడగు తన పతిసేవకొరకు,  ఆమె సేవ కోసం 

ఒక వైశ్య యువతిని దాసిగా ఉంచినది. ధృతరాష్ట్రుడు అట్టితరి  ఆమెకు చేరువ 

కావటము తటస్థించినది. తత్ఫలితముగా  యుయుత్సుడు ఆమెకు జన్మించినాడు. 

అతను ధృతరాష్ట్ర కుమారుడగుటచే దాసీ పుత్రుడైనా. విదురునికి రాచ గౌరవము 

లభించినట్లే, యుయుత్సుడికి కూడా రాచగౌరవము ఇవ్వబడినది.

యుయుత్సుడు కూడా అందుకు తగినట్లుగా, విద్యావంతుడు, బుద్దిమంతుడు మరియు 

అన్నివిధములా యోగ్యునిగా నిరూపించుకొన్నాడు. అతను ఏరోజూ  దుర్యోధనుని 

అనుచిత ప్రవర్తనను ఇష్టపడలేదు. సమయము వచ్చినపుడల్లా  ఆతనిని 

వ్యతిరేకించేవాడు. ఈ కారణంగా దుర్యోధనుడు మరియు అతని ఇతర సోదరులు 

అతనికి తగిన ప్రాముఖ్యత ఇవ్వలేదు, పైపెచ్చు, అతనిని ఎగతాళి చేసేవారు.

యుయుత్సుడు అకారణ అధర్మ మహాభారత యుద్ధమును ఆపుటకు తన స్థాయిలో 

ఎంతో కృషిచేసి విఫలుడైనాడు.

ఆంద్ర మాహా భాగవతము, ప్రహ్లాదచరిత్రమున ఈ దిగువన చెప్పినరీతిగా

అంధేందూదయముల్ మహాబధిరశంఖారావముల్ మూకస

ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ

బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస

ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్.

లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు

మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరిక ఫలించదు

కృతఘ్నుడికి బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగ 

మైనవి; పిసినిగొట్టు వాడికి సంపదపనికి వచ్చేది కాదు; పందికి పన్నీరు వంటి 

సువాసనలు తెలియనే తెలియవు; అన్నచందమున, అమృతోపమానములగు ఆయన 

మాటలు దుర్యోధనాదుల చెవికెక్కలేదు.

 మహాభారత యుద్ధము ప్రారంభం కానున్న సమయంలో యుయుత్సుడు కూడా 

దుర్యోధనుడి పక్షాన పోరాడేందుకు రంగములోనికి దిగినాడు. కానీ, అదే సమయంలో

యుద్ధం ప్రారంభానికి ముందు, ధర్మతత్పరుడగుయుధిష్ఠిరుడు తనపై నేరము 

ఉంచుకొనకుండా, కౌరవ సైన్యమును ఉద్దేశ్యించుతూ, ఇలా ప్రకటించినాడు - "నాది 

ధర్మపక్షము. ధర్మము కోసం పోరాడాలనుకునే వారు ఇప్పటికీ నా వైపు రావచ్చు. నేను 

అట్టివారికి స్వాగతము పలుకుతాను." ఈ ప్రకటన విని యుయుత్సుడు మాత్రమే కౌరవ 

పక్షం నుండి బయటకు వచ్చి పాండవుల పక్షంలో చేరినాడు. యుధిష్ఠిరుడు ఆతనిని 

ప్రియమార కౌగిలించుకొని స్వాగతము పలికినాడు. కౌరవులు అతన్ని వైశ్యస్త్రీ కొడుకు 

అనీ పిరికివాడు అనీ గేలిచేసినా అతను తన నిర్ణయమును మార్చుకోలేదు.

 

ఇక్కడ ఒక్కమాట యుధిష్ఠిరుని గొప్పదనమును గూర్చి చెప్పవలసియున్నది.

ధృతరాష్ట్ర పుత్రుడయ్యును పాండవ పక్షమున నిలచినది యుయుత్సుడొక్కడే!

అందుచేత ఆతనిని తమతోబాటూ యుద్ధము చేయించ నిచ్చగించినచో ఆతను టా 

అన్నదమ్ములనే చంపవలసిరావచ్చును లేకుంటే వారి చేతిలో తాను మరనిచవచ్చును. 

ధృతరాష్ట్రుని ఏకైక వారసునిగా ఆతనిని నిలుపుటకుగానూ ఈవిధముగా చేసిన 

ధర్మనిష్ఠాగరిష్ఠుడు.

ధర్మజుడు ఆతనిని, యోధుల కోసం ఆయుధాలు మరియు రవాణా సరఫరాలను 

చూసేందుకు నియమించినాడు. అతను చాలా బాధ్యతాయుతంగా ఈ బాధ్యతను 

నిర్వర్తించినాడు. యుద్ధము తర్వాత కూడా అతని పాత్ర ముఖ్యమైనది. మహారాజగు 

యుధిష్ఠిరుడు అతన్ని మంత్రిగా చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడి కోసం విదురుడు 

పోషించిన పాత్ర, యుధిష్ఠరుడి కోసం యుయుత్సుడు పోషించినాడు. ఇది మాత్రమే 

కాదు, యుధిష్ఠిరుడు స్వర్గారోహణ నిర్ణయము తీసుకోన్నప్పుడు, పరీక్షిత్తును రాజుగా 

చేసి, యుయుత్సుని ఆతనికి సంరక్షకునిగా చేసినాడు. యుయుత్సుడు కూడా తన 

జీవితపు చివరి క్షణం వరకు ఈ బాధ్యతను పూర్తి భక్తితో మరియు అంకితభావంతో 

నిర్వహించినాడు.

ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలలో మరియు రాజస్థాన్‌లోని తూర్పు 

ప్రాంతాలలో నివసించే జాట్ ప్రజలు తాము ఆ  మహాత్ముడగు యుయుత్సుని 

వారసులుగా నమ్ముతారు.

స్వస్తి.