Wednesday, 16 June 2021

మహాభారత ఇతిహాసము - సాంకేతికపరమగు కాలనిర్ణయము

మహాభారత ఇతిహాసము – సాంకేతికపరమగు కాలనిర్ణయము

https://cherukurammohan.blogspot.com/2017/03/16-5561.html

అక్కడక్కడ తప్ప ఈ వ్యాసములో నేను వ్రాసినది పెద్దగా ఏమీ లేదు. 2014 లో నేను 

సేకరించినపుడు రచయిత పేరు గ్రహించుట మరచినాను. క్షమించ ప్రార్థన.

మొన్నటివరకు క్రైస్తవ సంఘ నిర్వాహక పాఠశాలలో రామాయణ భారతములను Myths 

అనేవారు. ఇప్పుడు కలన యంత్రములు (Computers) అంతర్జాలము (Internet) 

మొదలయినవి వచ్చుటతో వారి నోట పచ్చివేలగ పడి, వారివాదము, మోదము కూర్చక 

వారికే ఖేదమయి కూర్చున్నది.

ఈ దిగువ వ్యాసము ‘ద్వారక... ఓ పరిశీలన:::హిందు శాస్త్ర విజ్ఞానం (HINDU SHASTRA 

VIGNANAM) వారి సౌజన్యము’ .

16అక్టోబరు 5561(క్రీస్తుపూర్వం)నాడు మహాభారత యుద్దం కురుక్షేత్రలో 

ప్రారంభమయింది. 2 నవంబరు 5561 నాడు పద్దెనిమిది అక్షౌహిణులు, కౌరవులు 

సంపూర్ణంగా నశించడంతో ముగిసింది. ఖచ్చితంగా మహాభారత కాలాన్ని 

నిర్దేశించడానికి చేపట్టిన పరిశోధనలో ఎన్నో సవాళ్ళు.. వీటన్నింటికీ సమాధానంగా 

భారత మేధావులు మహాభారత కాలరచనని చేశారు. ఈ పరిశోధన శాస్త్రసాంకేతిక 

రంగాల మేలు కలుయికగా సాగిన పరిశోధనా ఫలం.

ఆధునిక సాంకేతికతతో...

భారతీయుల ఇతిహాసాలు సంస్కృతంలో ఉన్నాయి. కనుక సంస్కృత భాషలో ప్రావీణ్యత 

సాధించినవారి కృషి మొదటిది. ఆంగ్లభాషలో అనువదించగలిగిన భాషాకోవిదులు 

రెండవ స్థానం. ఖగోళశాస్త్ర నిపుణత, పురావస్తు పరిశోధనలో ప్రజ్ఞతోపాటు కంప్యూటర్ల 

వినియోగంపై పట్టు కలిగి ఉండాలి. అంతరిక్షంలోని ఉపగ్రహాలను పనిచేయించడం 

తెలిసి, దాని సహాయంతో భూగ్రహాన్ని పరిశోధించగల సామర్థ్యం ఉండాలి. ఇవికాక 

థెర్మోలూమినెసెన్స్ డేటింగ్ (thermoluminescence dating)విధానం తెలిసి, వివిధ 

శాస్త్రాలను సమన్వయపర్చగలవారు కూడా కావాలి. ఉదాహరణకు, పురావస్తుశాస్త్రము

ఖగోళశాస్త్రము రెండూ తెలిసినవారు మరియు అలాగే సముద్రగర్భశాస్త్రము, తెలిసి 

పురావస్తుశాస్త్రముతో సమన్వయ పర్చ గల వివిధ వేద శాస్త్ర పండితులు కావాలి. ఇవన్నీ 

ఉంటేగానీ భారతీయ చరిత్ర రచించలేము. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ 

ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్త ఆర్.ఎస్.అయ్యంగార్ ప్రముఖంగా దీనిలో కృషిచేసినారు.

పురాణాలే ఆధారమా?....

ఏదేశ చరిత్ర చూసినా తవ్వకాలు, అందులో దొరికిన అవశేషాలు మాత్రమే 

ఋజువులుగా ఉంటాయి. కానీ భారతదేశంలో పురాణాలు చరిత్రను పదిలంచేశాయి. లక్ష శ్లోకాలతో వ్యాసభగవానుడు రాసిన మహాభారతం కేవలం నేడు 8,800శ్లోకాలతో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులోని అంశాల ఆధారంగా పరిశోధన సాగింది. గ్రహణాలు పురాణాలలో అనేకచోట్ల వివరించబడ్డాయి. దర్మరాజు పుట్టిన సమయంలోని గ్రహాల స్థానాలు వీటినిబట్టి ప్రస్తుతం నక్షత్ర, గ్రహస్థానాలు ప్రాతిపదికగా చేసుకుని చరిత్ర కాలరచన చేసినారు. దీనికోసం ఖగోళనక్షత్ర గమనాలు అంచనాలు వేసే సాఫ్ట్ వేర్ ను ఆధారం చేసుకున్నారు. ఈవిధంగా ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఫలానా గ్రహకూటమి, గ్రహణంలో ఏర్పడిందో లెక్కలుకట్టి సశాస్త్రీయంగా నిరూపించినారు. పెళ్ళిళ్ళకూ, గర్భాదానాలకు ఉపయోగపడేదే జ్యోతిషం అనుకుంటున్న తరుణంలో తిథి,వార,నక్షత్ర,యోగ, కరణాలు ఉన్న పంచాంగాల సత్తా తెలిసింది. ఏ గ్రహణం ఎప్పుడొస్తుందో తెలియాలంటే కోట్ల కోట్ల రూపాయలు ఖరీదుచేసే కంప్యూటర్లు కావలసిన పాశ్చాత్యులు... వేలకొలదీ ఏళ్ళనుంచి నోటిలెక్కలు కట్టి గ్రహణపట్టు విడుపులు చెప్పగలిగిన ఆర్యభట్టారకులను చూసి ఆశ్చర్య పోతున్నారు. నక్షత్రాలు, గ్రహగతులు, భూపరిభ్రమణము, నుంచి నిమిషాలు, సెకెండ్లతో సహా లెక్కించే విధానమే ఖగోళ శాస్త్రము. అందులోని ఒక భాగము జ్యోతిషము. దీనిని ప్రాతిపదికగా చేసుకుని సమయ నిరూపణ చేయుటయే శాస్ర్యీయ విజ్ఞానము.

మూడు గ్రహణాలు :

మహాభారతంలో పేర్కొన్న మూడు గ్రహణాలు ముఖ్యమైనవి. మొదటిద ’సభాపర్వంలో 

(79:29) విదురుడు పేర్కొన్న సూర్యగ్రహణం. ఇది పాండవులు అరణ్యవాసము 

సందర్భంలో సంభవించింది. భీష్మపర్వం(3:29)లో రెండవ సూర్యగ్రహణం ఉంది. దీనికి 

పక్షము రోజుల ముందు చంద్రగ్రహణం కూడా నమోదు అయింది. ఈ 

సూర్య,చంద్రగ్రహణాల మధ్య మహాభారతం మొదలైంది. ఇక మూడవది...శ్రీకృష్ణ అవతార 

పరిసమాప్తి సమయంలో సంభవించింది. దీనిని మౌసలపర్వం (2:20నుంచి 2:29) వరకు వివరించినారు. ఇది అప్పటి ద్వారకలో కనిపించింది. ఆధునిక అధ్యయనాల ప్రకారం చూసినా, ప్రతి ఏభై సంవత్సరాలలో మూడు గ్రహణాలు ఏర్పడడం శాస్త్రీయమే. మొదటి రెండు సూర్యగ్రహణాలు కురుక్షేత్రంలో కనిపించినాయి. మూడవ సూర్యగ్రహణం ద్వారకలో కనిపించింది. రెండవ సూర్యగ్రహణం తర్వాత 35ఏళ్ళకు మూడవ సూర్యగ్రహణం సంభవించింది.

సముద్ర గర్భ, పురావస్తు పరిశోధన :

భారత పురావస్తు పరిశోధనా సంస్థ, జాతీయ సముద్రగర్భ శాస్త్ర సంస్థల సంయుక్త 

పరిశోధన జరపాలని జడ్.డి.అన్సారీ, ఎమ్.ఎస్.మతే ప్రతిపాదించారు. దీనిద్వారా డాక్టర్ 

రావు ఆధ్వర్యంలో చెప్పుకోదగిన కృషిజరిగింది. సముద్రంలో ఉన్న ద్వారక రహస్యాలు ఈ 

మహాసాహసికుని పరిశోధనల ఫలమే. ఈయనకు వరల్డ్ షిప్ ట్రస్ట్ అవార్డు అనే 

అత్యున్నత పురస్కారం కూడా లభించింది. సముద్రగర్భంలో పరిశోధించగలిగిన 

సాహసికులు, గజ ఈత ఛాయా గ్రాహకులు, నిష్ణాతులైన పురావస్తు పరిశోధకులు వీరి 

బృందంలోండినారు. వీరు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినారు. వీటిలో 

ఎకోసౌండర్స్, మడ్-పెనట్రేటర్స్, సబ్ బాటమ్ ప్రొపెల్లర్స్, జలాంతర్గత లోహ అన్వేషణ 

యంత్రముల సహాయము వీరికి ఎంతగానో సహకరించినాయి. 1983 నుంచి 1992 

వరకు 12 సార్లు సాగరం మధించినారు. ఫలితంగా నాటి ద్వారకకు చెందిన వస్తువులు 

సేకరించి ఫిజికల్ రిసెర్చి లేబొరేటరీకి పంపుట జరిగినది. అక్కడ థెర్మోలూమినెసెన్స్

కార్బన్ డేటింగ్ వంటి అత్యాధునికపరీక్షలు జరిగినాయి. ఈ పరీక్షల వల్ల, ఆ వస్తువులు 

క్రీస్తుపూర్వం 15నుండి 18వ శతాబ్దాల క్రిందటివని తేలింది. భారతదేశ చరిత్రలో 

శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక కనుగొనటం ఒక మైలురాయి. దీనివల్ల ద్వారక, శ్రీకృష్ణుడు

మహాభారతాలపై విమర్శకులు చేస్తున్న పుక్కిటి పురాణవిమర్శకు కాలం తీరిపోయిందని 

డాక్టర్ ఎస్.ఆర్.రావు అన్నారు.

'తీరప్రాంతాన్ని నిత్యం తాకుతూ ఉన్న సముద్రం ఒక్కసారిగా భూమిమీదకు దాడిచేసింది. 

ఒక్కసారిగా ద్వారకా నగరాన్ని మొత్తం ముంచివేసింది. అతి సుందరమైన మేడలన్నీ 

ఒక్కొక్కటీ కనుమరుగయ్యాయి. కొద్దిక్షణాలలో నా కళ్ళముందు సముద్ర జలాలు మాత్రమే నిలిచినాయి. ఇక మీద ద్వారక ఒక మధుర జ్ఞాపకం మాత్రమే` అని అర్జునుని వర్ణన. దీన్ని పరిశీలిస్తే ఏదైనా సునామీ వచ్చి ద్వారక మునిగిపోయిందేమో అన్న సందేహం పరిశోధకులలో తలెత్తుతుంది.

కలి యుగము యొక్క కాల పరిమాణము 432000 సంవత్సరములు, అందు 

సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. హిందూ, బౌద్ధ 

కాలమానములకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతము ప్రకారము క్రీ.పూ. 3102 

ఫిబ్రవరి 13 (00:00) న కలియుగము ప్రారంభమైనది. శ్రీకృష్ణుడు తనువు చాలించుట 

కూడా అప్పుడే జరిగినది. అంటే కలియుగము ఇప్పటికి 5,122 సంవత్సరాల క్రిందట 

ప్రారంభమైంది.

పైన తెలిపిన పరిశోధకులు తెలియజేసిన కాల వివరములు ;

పాండవుల అరణ్యవాసం ప్రారంభం 4 సెప్టెంబరు 5574

అజ్ఞాతవాసం 19మే5562

కీచకవధ 1ఏప్రిల్ 5561

కీచక సోదరుల వధ 2 ఏప్రిల్ 5561

అజ్ఞాతవాస పరిసమాప్తం 9 ఏప్రిల్ 5561

అర్జునుడు అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చింది 16 ఏప్రిల్ 5561

మిగిలిన పాండవులు అజ్ఞాతవాసం వీడింది 19 ఏప్రిల్ 5561

అభిమన్యు ఉత్తరల వివాహం 4 మే 5561

కృష్ణుడు రాయబార నిర్ణయం 27 సెప్టెంబరు 5561

హస్తినలో శ్రీకృష్ణ ప్రవేశం 30 సెప్టెంబరు 5561

కుంతి-కృష్ణుల సమావేశం 1 అక్టోబరు 5561

కౌరవసభకు కృష్ణునికి ఆహ్వానం 2 అక్టోబరు 5561

మొదటిది 3 అక్టోబరు 5561

రెండవ సభలో కృష్ణుని బంధించాలని ప్రయత్నించింది 4 అక్టోబరు 5561

మూడవ సభలో విశ్వరూప సందర్శనం 7 అక్టోబరు 5561

రెండవ సారి కుంతీ దర్శనం 8 అక్టోబరు 5561

కృష్ణ-కర్ణుల సంవాదం, యుద్ధనిర్ణయం, తిరుగుప్రయాణం 9 అక్టోబరు 5561

మహాభారత యుద్ధ ప్రారంభం 16 అక్టోబరు 5561

అభిమన్యుని మరణం 28 అక్టోబరు 5561

యుద్ధం ముగిసింది 2 నవంబరు 5561

ధర్మరాజు పట్టాభిషేకం 16 నవంబరు 5561

భీష్మ నిర్యాణం 22 నవంబరు 5561

పరీక్షిత్తు పుట్టుక 28 జనవరి 5560

అశ్వమేధ యాగం 1 మార్చి 5560

యదుకుల నాశనం 5525

పరీక్షిత్తు మరణం 5499

పైన తెలిపిన తేదీల పట్టిక ఆ శాస్త్రజ్ఞులు ఎరుక పరచినవే!

గమనిక: ఈ వ్యాసము సంపూర్ణముగానూ సమగ్రముగానూ లేదు. ఔత్సాహికులగు చరిత్ర 

అధ్యయనము చేయువారు దీనిని చూడ తటస్తించితే తప్పక ఇందులోని 

విషయములేవయినా ఉపయోగపడితే వాని ఆధారముగా పరిశోధన కొనసాగించి 

మనచరిత్ర మధ్యందిన భానుమండల ప్రభాసమని నిరూపించగలిగితే సంతసించే కోట్ల 

మందిలో నేనూ ఒకడిని.

స్వస్తి.

No comments:

Post a Comment