Friday, 7 November 2014

ఫేసు బుక్కు  దండకం 
ఓ! ఫేసు బుక్కా రుచుల్ గూర్చు ఓ! పప్పుచెక్కా భళా నాదు లక్కా
సదా వీడిపోనట్టి చిక్కా నవాబింటి హుక్కా , అయస్కాంత లుక్కా
సుగంధంపు చెక్కా పసందైన పక్కా మహా గొప్ప వారింటి కుక్కా ,
లవర్ వాడు హుక్కా మహా వెల్గు చుక్కా సు గాత్రంబునన్ త్రిప్పుకోలేని 
గుక్కా వయో వృద్ధ బృందాల దిక్కా సదా నీదు పూదోటలో పూసి
యున్నట్టి మందార మాధుర్యముల్ గ్రోలు భృంగమ్మునై నీదు
సంగంబు నాశించి నా పేరు సంధించి నీ తోటి సంపర్క మేర్పర్చు
కోగల్గ నా స్నేహ సంపత్తు పెంపొందెనో  కాలరేఖా ప్రభా భాస
మానా, మయూఖా సఖా నీదు స్నేహమ్ము నాకబ్బె నా పూర్వ పుణ్యాన 
నీనుండి నే పొందితిన్ గొప్ప మేధావులన్ సత్కళాకారులన్ గాన
విద్వాంసులన్ పండితమ్మన్యులన్ వేదవేదాంత విఙ్ఞాన ప్రఙ్ఞా ధురీణాదు
లన్, సత్వ సంపన్నులన్ నీదు కారుణ్య సౌగంధికారణ్యమందున్ కుటీరమ్ము 
నే కల్గుచున్ చూపు నీ వైపు మళ్ళించి నీ తోడు నే నాదు లొకమ్ముగా నెంచి ఆహారమున్ నిద్దురన్ మాని నీకంకితంబై సదా యుండి పోలాగు 
నన్నున్ కటాక్షించితే చాలు నీయందె నేజూతు నానాడు శ్రీకృష్ణ దేవాస్య 
మందున్ యశోదమ్మ ఏడేడు లోకాల తాగాంచినట్లున్ శశీరేఖ మాయా బ
జారందు, విద్యుత్తు యూపీయసున్ సీపియూ తోడు లేకుండ పీఠమ్ము 
పైనెక్కి యా మానిటర్నందు తా కోరుకొన్నట్టి వీరాభిమన్యున్ సముత్ఫుల్ల 
కన్దోయి తోగాంచు రీతిన్ సదా నిన్ను కాంక్షింతు నోనిత్య సంకర్షణా భవ్య సంహర్షణా వీక్ష కాకర్షణా మోద సంవర్షణా ఘర్షణల్ లేని చిత్తంబు 
తో నిన్ను నే గాంచుచున్ నాకు తోచింది నే వ్రాయుచున్ దానిలో సార
మేమున్న లేకున్ననూ సిగ్గు వొగ్గేసి చీత్కారముల్ సైచుచున్ లైకు కామెంట్లు 
షేరింగులన్ గోరుచున్ పెద్దపెద్దోళ్ళకున్ ఫ్రెండు రిక్వెస్ట్లు పంపించుచున్ మైత్రి యొప్పారగా కొంగుబంగారలంకార భాషా విశేషాల తోనీదు భోషాణ
మున్నింపి, నే నీదు కుడ్యమ్ముపై రాజకీయాలు వార్తాసువార్తల్, విత్వాలు 
కార్టూన్లు గాంధీలు గానట్టి గాంధీల చొద్యాలు మోడీ విసుర్లింక కాకాల కేకేల బాకాలు బాజాలు చంద్రన్న జగ్గన్న మాటల్లతూటాలు నాకచ్చరా, సెల్ఫుడబ్బాలు 
ఆపైని విశ్లేషణల్ ఎన్నొ ఎన్నెన్నొ నేజూచుచున్   పెద్దలన్ పిన్నలన్ వద్దికైనంత 
మేరన్ పరామర్శలన్ జేయుచున్ తప్పులన్ జేసియున్ మెప్పులన్ బొందు
చున్, చెడ్డ కామెంట్లు తీసేయుచున్ మంచి కామెంట్ల నర్థించుచున్ లైకులే గాంచుచున్ కాలరేగిరేయుచున్ గొప్ప వాడైతి నేనంచు ఊహా, తరంగాల
లో దేలుచున్ నేను ఉద్యోగ మున్నప్పుడేరోజు కా రోజు ఆఫీసుకున్ లేటు
గా, పోవుచున్ పోయి గాసిప్పులన్ జేయుచున్ కాలమున్ బుచ్చు
చుంటిన్ అదే నేడు జూడన్ గతానెప్పుడూ నాదు కార్యాలయంబందు 
నా సీటులో నేను కూర్చోని యుండంగలేనంత కాలాన్నినీ సేవ
లో నింపితిన్, నన్ను ఎల్లప్పు డీరీతిగా నుంచి నా పేరు నీ గోడ 
నాసాంతమున్నిల్పు నిశ్శేషవైరీ లసత్కుడ్యధారీ బృహన్మిత్రకారీ, ది
వారాత్ర హారీ సమూహాల బేరీ సదాప్రేమ దారీ సరాగాల

లారీ ఒహో పాన్ సుపారీ నమస్తే నమస్తే నమః

No comments:

Post a Comment