ఉల్లిపాయ దండకం
ఉల్లిపాయ తో జతకట్టిన వేడి పకోడీ ఎంతగా నోరూరిస్తుందో మనకు
తెలియనిదికాదు. తింటూవుంటే ఇంకా తినాలనిపిస్తుంది. కడుపు ఉబ్బరించి మన పైజమాల
నాడాలే ఊడీపోవచ్చు, నాదాలే బయటికీ రావచ్చు. పెళ్లి చేసుకోని
వాడుంటాడేమో గానీ ఉల్లి తినని వాడుండడు.
ఉల్లిని గూర్చి అందరూ యధాశక్తి కథలగానో కార్టూన్లగానో ముదవతి (joke కు నేను పెట్టుకొన్న పేరు )గానో ఆస్య గ్రంధి (face
book కు నే పెట్టుకొన్న నామాంతరము) లో ప్రచురించి నారు .ఊడుతా
భక్తిగా నేనూ నాకు తోచిన యోగదానము చేస్తే నా కాత్మ తృప్తి యని నిర్ణయించుకొని
ఉల్లిని మదిలో తలచి , తలచిన ఉల్లిని వలచి, నే వ్రాసిన ఈ దండకమునే దండగా మలిచి ఉల్లికే వేయ
దలచి, కలన యంత్రము(computer) ముందు
కదలకుండా నిలిచి సాదరముగా మిమ్ము పిలిచి ఉల్లి నా చేత పలికించిన దానిని మీకు
తిలకించి పులకించి ఉల్లిరసము నాస్వాదింప
కోరుచున్నాను.
ఉల్లిపాయ దండకం
ఉల్లిని వాడని వాడును
తల్లిని తలపోయనట్టి తనయుడు కనగా
మల్లెలు కొప్పున తురుమని
ఇల్లాండ్రను గాంచలేము ఇద్ధరలోనన్
వేడి పకోడీ కెప్పుడు
జోడుగ రుచి కూర్చు వుల్లి తోడుగ నుండన్
నాడాలు వూడిపోవే
వేడిగ నవి నోట బడిన వివరము గాంచన్
ఓఉల్లిపాయా పొరల్ గల్గి యుండేటి కాయా తమిళ్ నాటి సాంబారు
రాయా మదిన్ వీడి పోనట్టి
ఛాయా ప్రియా సర్వ శాఖా మయూఖా
సఖా నీదు నామంబు విన్నంతనే
జిహ్వ గంగా తరంగాల నుత్పత్తి జేసేసి
నిన్నందులో ముంచి నా పొట్ట సంద్రమ్ము చేర్చంగ నెంతెంత సంతోషమున్
బొంది నిన్ గూర్చి చింతింతునో చెప్ప నా శక్తి లేదేను ఎన్నెన్ని
మార్గాల
యోచించినన్ నిన్ను నేనెంచకుండా సదా నిన్ను సాదంబులో జూడకుండా
నెటుల్ నేను ముద్దెత్త గల్గేను దాన్నేట్లు మ్రింగేను అది
యెట్టులరిగేను నీతోడు
నాకున్న పొంగేను లేకున్న క్రుంగేను నీ'వన్నియన్'
కాదు నా'అన్నియున్' ఔను
నా 'ఆనియన్' నాదు 'కంపానియన్' నేను నీ 'యూనియన్'
నీదు రూపమ్మె
నా కళ్ళ కన్పట్టు నా గుండియన్ డోల లూగించు చుండున్ మరిన్ నాదు
నాసంబు నీ వాసనల్ బొంద చిందేయు చుండున్ గనన్ నీవు నా ఉల్లి
నా తల్లి నాచెల్లి నాయింటిలో మల్లి నా గారె లో చిల్లి నా యూహలన్
బల్లి
నా బుద్ధిలో నల్లి నా చంకలో పిల్లి లేకున్నచో లొల్లి నీ దాయ
వెల్లుల్లి
నేచెప్పుచున్నట్టిదంతా స్వభావోక్తి లేదే కుయుక్తిందు యుక్తంబు నే పల్కితిన్
స్వాద రాజా సదా పేద భోజా మహా కల్ప భూజా యశొభూష తేజా ప్రజా
బంధు నీవున్న నా ముందు నీ రూపె కన్విందు గ్రీష్మమ్ము లో మందు
మూణ్ణెల్ల
పంటా సదా కళ్ళ మంటామ్ర పచ్చళ్ళ జంటా బలే వింత జూడంగ నీ పొట్టు
దాపెట్టు నీ గుట్టు రట్టవ్వకుండా అదే అండదండయ్యహో వాన కుర్వంగ నీ
నీరసంబెల్ల కన్పట్టులే నీ రసంబెల్ల లోలోననే కార్చి నిన్ కృంగగాజేసి
ఏరేసి
పారేసి నీ రాశి పోకార్చగా జేసి మా ఫ్రైలు మా రొస్ట్లు మాసూపు
సాలాడ్లు
మా గుత్తి వంకాయ మా ఉల్లి పచ్చళ్ళు మా లోని ఆకళ్ళు లేకుండగాజేసి
మా స్వస్థతన్ పాడు జేసేసి మాలోన సేల్లీనియం (Selenium)
ఫాస్ఫరస్సోడియం
కాల్షియంబున్ పొటాషీయమున్
మాగ్నిషీయంబు తగ్గించుచున్ మమ్ము రోగాల
రాగాల బందీలుగా జేయుచున్నట్టి కాలాన్ని పోద్రోలి హాయిన్ ప్రసాదించు
ఆశ్వీజ
మాసమ్ము రప్పించి ఆ చంద్రకాంతుల్ ప్రసారింప జేయించి మాకైన శక్తిన్
ప్రసాదించు సర్వెశు నర్చించి ప్రీతిన్ సదా నిన్ను లోనెంచి కై
మోడ్చి నిన్ మ్రొక్కు
మా సంకటాలెల్ల దీర్చేసి మాతోడు నీడై సదానిల్వు ఈ మధ్య నీ రేటు మా
గేటు
దాటింది తా రూటు మార్చింది కొండెక్కి కూర్చుంది అట్లయ్యునూ నిన్ను
మా
రూటు లో బెట్టు యత్నాలు ఎన్నెన్నియోజేసి మే మంతయో ఇంతయో ఎంతయో
కొంత తగ్గించి నిన్ మేము సాధించి మాయింటిలో జేర్చి జాగ్రత్తగా
వాడుచున్నాము
నీ పొట్టు తీసేసి ఓ కొక్కికిన్ గూర్చి మా ఫ్రిజ్జి లోయుంచి నీతోడు
లేనట్టి సాంబారు
పై మూత తీసేసి మేమందులోయుంచి నీ వాసనల్ పూర్తిగా తాను పీల్చేట్టు
గాజేసి
మేమప్పుడా వంటకం దెచ్చి అన్నంబులోకల్పి స్వర్గమ్ము లో రంభ
నాట్యాన్నిజూపించు
నీ వాసనాస్వాదమున్ జేయుచున్ తన్మయత్వంబునన్ భోజనంజేసి సంతృప్తి
పొందేము వెంకన్న లడ్డా
జగజ్జలధిలో జీవికౌనావ తెడ్డా గరీబింటి బిడ్డా
సదా మాదు ఫుడ్డా భళా ఉల్లిగడ్డా నమస్తే నమస్తే నమః
ayyaa saamjalibandhaka namaskaram
ReplyDeleteOne needs full expertise to describe ulli in various formats. Quite interesting and thanks for the efforts.
ReplyDeleteఉల్లిపాయను గురించి రెండు పద్యాలను రమ్యంగా రచించేరు.
ReplyDeleteతదుపరి దాదాపు 36 పాదాలతో అమోఘమైన రీతిలో
ఉల్లిపాయ దండకమును రచించేరు.
ఉల్లిపాయ రూపం వర్ణనలు,వివిధ కూరలూ, సాంబారు పచ్చళ్ళూఫాస్ట ఫుడ్స్, టిఫిన్ లలో ఉల్లి వాడబడే తీరు తెన్నులను బహువిధ చమత్కృతులతో రంగరించి అత్యద్భుతమైన రీతిలో,
అనిదం పూర్వముగా చాలా గొప్పగా రచించేరండీ..
మీ హస్యయుత చమత్కారాలతో దివ్యమైన ఉల్లిపాయ దండకము రచనకు అనేక అభినందనలండీ...రామ మోహన రావు గారూ...