సీతారామం
(అద్వితీయ దాంపత్యం)
https://cherukurammohan.blogspot.com/2023/04/blog-post_24.html
కౌసల్యాగర్భసంభూతం వేదిగర్భోదితాం
స్వయమ్ ।
పుండరీకవిశాలాక్షం
స్ఫురదిందీవరేక్షణామ్ll
శ్రీ రామ రామ రామేతీ......
ఈవిషయముమీకుతెలిసినదే!
శ్రీరామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్ర నామ తస్తుల్యం రామ నమ వరాననే
'ఒంనమో నారాయణాయ' అన్నఅష్టాక్షరిలో 'రా' ఐదవఅక్షరము. అదే'నమశ్శివాయ' అన్నపంచాక్షరిలో 'మ' రెండవఅక్షరము. 5x2=10 . అదే మూడు మార్లయితే
10 x10 x 10 =1000 . కావున 'రామ' అని మూడు మార్లంటే 1000 మార్లన్నట్లవుతుంది. ఇంకొక విధంగా 'యరళవ' లో'ర' రెండవఅక్షరము.' 'పఫబభమ' లో 'మ' ఐదవ అక్షరము. ఈవిధముగాకూడా 5x2=10.
అంతటి మహనీయత దాగివుంది రమ్యమైన ఆ రామ
నామములో!
రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
మనసును రమింప జేసేవాడు, సర్వదా సకల శుభములనూ సమకూర్చే వాడు, పరబ్రహ్మ స్వరూపుడు, రఘువంశ తలమానికమైనవాడు, సీతా మహా సాధ్వి
పతి యైన శ్రీ రామ చంద్రునికి నమస్కారము.
రామాయణమును అంతరార్థముతో పరిశీలించక
పోతే అంతా రాద్ధాంతమే అనిపిస్తుంది.
రామాయణము మహాకావ్యము. వ్రాసిన
మహనీయుడు అటు బ్రహ్మచే ఇటు నారదునిచే అంతటి మహా కావ్యమును వ్రాయ నీతడు మాత్రమే
సమర్థుడు అని అనిపించుకున్న వాడు. మరి నాయకుడూ స్వయముగా పరమాత్ముడే! పరమాత్మ
నాయకుడైతే పరదేవతయే నాయకురాలు. ప్రతి నాయకుడు అకుంఠిత శివపూజా తత్పరుడు. వనచరుడై
భార్యా వియోగియైన రాముని సైన్యము వనచరులే. కష్టములో సుఖమును గుర్తించి మనకు మార్గ
నిర్ధేశము చేసిన మహా మనీషి. ఈ మాట ఎందుకన్నానంటే ఆయన తన నేనాడు దైవముగా
ప్రకటించుకొన లేదు. ఇంకొక ముఖ్యమైన విషయమును గమనించండి.
ధర్మసంరక్షణార్థం భగవంతుడు దాల్చిన
అవతారాలలో "రామావతారం'' పూర్ణావతారము.
జన్మబంధాలులేని పరమాత్మ జగత్కళ్యాణ కాంక్షతో జగతిపై నరునిగా జన్మించి, ధర్మాన్ని ఆచరించి, శ్రీరామునిగా సర్వలోకాలకూ ధర్మపథావలంబకుడై ఇదీ "రామాయణం'' అని చాటి చెప్పినాడు. అంటే రాముడు నడచే దారి ఇదే అని
చెప్పినాడు. ఆయనము అంటే గమనమనియే కదా అర్థము.
రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య
పరాక్రమః !
రాజా సర్వస్య లోకస్య దేవానా మఘ వానివ
!
అరణ్యకాండ లోని ముప్పయ్యేడవ సర్గ
లోని పదమూడవ శ్లోకమిది.
దీనిని మారీచుడు రావణునికి చెబుతాడు.
రాముని గూర్చి రావణుడు తప్పుగా మాట్లాడబోతే దానికి అంగీకరించక ఆతనికి మారీచుడు
ఉపదేశము చేస్తాడు. “రాముడు వేరెవరో కాడు ఆయన మూర్తీభవించిన ధర్మము. ఒకరి జోలికి
పోయి వారికి కష్టము కలిగించని సాదువు, సత్యనిష్ఠ కలిగినవాడు, అత్యంత
పరాక్రమవంతుడు. దేవతలకు ఏవిధముగానైతే ఇంద్రుడు అధిపతియో అంటే ఎవరి ఆదేశము దేవతలకు
శిలాశాసనమో అదే విధముగా శ్రీరామచంద్రుడు సమస్త లోకములకూ ప్రభువు.” అని చెబుతాడు.
తనను చంప దలచిన శత్రువునే ప్రశంశించినాడంటే రామునికి అంతకు మించిన యోగ్యతా
పత్రమును ఊహించ గలమా! ఆతడు రాముని కాలము నాటి రక్కసుడు. రాముని చే దెబ్బ తిన్న
వాడు. అతనే ఆమాట అంటూ వుంటే, ఇప్పటి మిడి మిడి
జ్ఞానము గలిగిన శత్రువులు చేసే దుర్వ్యాఖ్యానములు చిన్న చాకు చేత బూని సింహాన్ని
ఎదుర్కొనుట లాంటిదే! ధర్మ మూర్తి అన్న మాటకు, ఇక్కడ కొంత వివరణ మీకు నేను అందిస్తాను, కాస్త ఆలకించండి. రామాయణము ఏడు కాండల ఇతిహాసము. 1. బాల కాండ, 2. అయోధ్యాకాండ, 3. అరణ్య కాండ, 4. కిష్కింధ కాండ, 5. సుందరాకాండ, 6.యుద్ధకాండ, 7. ఉత్తరాకాండ.
మిగిలిన కొంత మళ్ళీ.....
సీతారామం -- 2
ఇందులో మొదటి కాండ అంతా దేవతలు
వస్తారు. ఆయన దేవతాధర్మము తెలిసినవాడు కాబట్టి, రెండవ కాండ అంతా మానవులు అందుకే ఆయన మానవ ధర్మ యుతముగా నడచుకొని తండ్రి మాట
జవదాటక,
అటు వివాహ విషయమున గానీ ఇటు వనవాస గమనమున గానీ తండ్రి మాట
జవ దాటడు. అరణ్య కాండలో ఋషి ధర్మమును పాటిస్తాడు. ఎందుకంటే అక్కడ అంతా ఋషులే !
అందుకే వారి అభిమానమును అమితముగా చూరగొని ఎన్నో అద్భుత శస్త్రాస్త్రములను మరియు
వారి ఆశీర్వాదములను, అనుగ్రహమును
అందుకుంటాడు. తరువాతది కిష్కింధ కాండ. ఇందులో అందరూ వానరులే. వానర ధర్మము నెరిగిన
వాడు కాబట్టి అటు వాలిని చంపుట లో కానీ, సుగ్రీవునితో మైత్రి సల్పుటలో గానీ, హనుమంతుని ఆత్మీయునిగా తలచుటలో గానీ, కామము చె కళ్ళు కప్పబడి నపుడు సుగ్రీవుని లక్ష్మణుని ద్వారా నిగ్రహించుటలోగానీ
వానర ధర్మము ననుసరించియే నడచుకుంటాడు. ఇక సుందరాకాండ. సుందరాకాండ లో తన వలె రాక్షస
ధర్మమును సంపూర్ణముగా ఎరిగిన హనుమంతుడు లంకకు పోవు విధముగా ఏర్పాటు చేస్తాడు తన
కుశాగ్ర బుద్ధితో శ్రీ రాముడు! ఇక యుద్ధ కాండలో యుద్ధ ధర్మము సంపూర్ణముగా
తెలిసినవాడు కావున రెండవ రోజు యుద్ధములో విగత శస్త్రాస్తుడైన రావణుని ఆయుధ సమేతుడై
ఆవలి రోజు రమ్మని చెబుతాడు. మిగిలినది ఉత్తర కాండ. ఇందులో రాజ ధర్మమును, బాంధవ్య ధర్మమును ఎంతగా ఎరిగిన వాడో అన్నది మనము శ్రీరాముని
యందు చూస్తాము. లోకాపవాదముచేత రాజుగా గర్భవతి యైన సీతను రాజ ధర్మము ననుసరించి
బహిష్కరించ వలసి వచ్చినపుడు ఒక భర్తగా, ఒక కాబోయే తండ్రిగా యోచించి ఆమెను వాల్మీకి ఋష్యాశ్రమమునకు దగ్గరగా దిగ
విడువమంటాడు లక్ష్మణుని. ఏమిటి కారణము. అది సుందర వనము. అందు వాల్మీకి ఋషి వాటిక.
ఒకవైపు ప్రకృతి రామణీయకము మరొకవైపు
సాదు వర్తనము, సచ్ఛీలము, నిరాడంబరము, మానసిక నియంత్రణము, మరియు బోధనానుకూలమైన వాతావరణము. అందుకే కుశీలవులు తండ్రిని మించిన తనయులై
ఆరితేరినారు. ప్రతి కాండ లోనూ శ్రీరామ చంద్రుని ధర్మ స్వరూపము మనకు ద్యోతకమౌతూ
వున్నది. పై పెచ్చు రావణ సంహారానంతరము స్త్నాతయై దివ్య వస్త్రాభారనాలక్రుతయై
వచ్చిన సీతను ఇంత కాలము నీవు పర పురుషుని పంచలో వున్నావు. నీ పరపురుష వ్యామోహము
వుంటే సుగ్రీవునో విభీషణునో వివాహము ఆడమంటాడు. ఎందుకో తెలుసా? ఆమె, స్వర్ణమృగార్థము
రాముడు వెడలి మారీచుని మోసమునకు గురియైనపుడు వెంటనే రాముని సహాయమునకు పొమ్మంటుంది
సీత లక్ష్మణుని. ఆయన వద్దని వారించుట చె ఆమె నానా దుర్భాష లాడుతుంది ఆయనను. అది
గుర్తుంచుకున్న రాముడు ఆత్మీయుల ములుకుల వంటి పలుకులు ఎంత గాయము చేస్తాయో
సోదాహరణముగా ఆమెకు తెలియజేస్తాడు.
ఇంకొక కోణమును చూద్దాము.
శ్రీరమ సీతగాగ, నిజసేవకబృందము వీరవైష్ణవా
చార జనంబుగాగ, విరజానది గౌతమి గాగ, వికుంఠము
న్నారయ భద్ర శైల శిఖరాగ్రము గాగ, వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ!
కరుణాపయోనిధీ!
తాను శ్రీరామ భ్రుత్యుడై తనకు
శ్రీరామునే భ్రుత్యునిగా చేసుకున్న కంచెర్ల గోపన్న అనబడు రామదాసు చెప్పిన మాట ఇది.
భక్తుడైన గోపన్న చెప్పినా తానెక్కడా పరమాత్ముడినని చెప్పుకొనని తత్త్వము శ్రీరామ
చంద్రునిది. ఆయన భగవంతుడన్నది భక్తులకు అనుభవములోనికి రావలసినదే కానీ తానెక్కడా
ఆయనప్రకటించుకోడు. తాను మానవ మాత్రుడుడినని మనకు నిముసనిముసమూ జ్ఞాపకము చేస్తాడు.
ఆయనకు తండ్రి మాటే శిరౌధార్యము. అది మానవ ధర్మమూ. మరి రాముడు ధర్మ విగ్రహకుడు కదా!
విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషి . వసిష్ఠుడు బ్రహ్మ ఋషి. రాముని అవతార ప్రయోజనము
తెలిసిన మహనీయులు వారు. అందుకే రాక్షస దౌష్ట్యమును అరికట్టి యజ్ఞ క్రతువును
కాపాడుటకు రాముని కోరుతాడు విశ్వామిత్రుడు. కేవలము
పుత్రవాత్సల్య పరుడైన సాధారణ
మానవుడగు దశరథునికి నచ్చ జెప్పు నపుడు కావాలంటే తన గురువు, బ్రహ్మర్షి అయిన వసిష్ఠుని సలహా తీసుకోమ్మంటాడు
విశ్వామిత్రుడు. వసిష్ఠుడు విశ్వామిత్రుని ప్రశంసించుతూ రాముని పంపమంటాడు. దశరథుడు
రాముని అనుమతించిన తరువాతనే రాముడు విశ్వామిత్రునితో కదలుతాడు.
పుత్రా ధర్మమును చూడండి. తాటకిని
విశ్వామిత్రుడు చంపమన్నపుడు గూడా ఆయన ఆమె స్త్రీ యని తలంపక విల్లు ఎక్కు పెట్టె
లోపల విశ్వామిత్రుడు “ రామా ఆమె స్త్రీ యని సంశయింపక విల్లెక్కు పెట్ట మంటాడు.
అందుకు రాముడు విశ్వామిత్రునికి తన తండ్రి మాట గుర్తు చేస్తాడు. ఆయన తో రాముడు ఈ
విధముగా అంటాడు “ ఋషివరేణ్యా మా తండ్రి మమ్ము మీతో పంపునపుడే మీరు చెప్పినట్లు
నడచుకొమ్మన్నారు. వారి యాజ్ఞ మీ వాక్కు నాకు శిరౌధార్యమంటాడు రాముడు. రాముని గుణ
మెరిగిన వాడు కావున యాగ సంరక్షణము ముగిసిన పిదప సీతా స్వయంవర విషయమును తెలుపక
మిథిలలో జనకుడు నిర్వహించే మహాయజ్ఞమునకు పోదామని బయలుదేరా దీస్తాడు. గుర్వాజ్ఞ
మేరకు రామ లక్ష్మణులు ఆయనతో బయలుదేరుతారు. మిథిల చేరిన పిదప జనకునితో “ మా
రామునికి మీ శివ ధనుస్సు చూప”మంటాడు విశ్వామిత్రుడు. ఆయన దానిని చూపించినపుడు
వేరేమీ చెప్పకుండా చూడమంటే చూసి ఎక్కుపెట్ట మన్నపుడు దానిని అవలీలగా ఎత్తి ఎక్కు
పెట్ట ప్రయత్నించుతాడు.
తక్కినదితరువాత........
సీతారామం -- 3
దానిని పరమాత్మ అంటే శివకేశావాభేదము
కలిగినవాడు ఎత్త గలడు లేకుంటే జగన్మాత ఎత్తగలదు. మహేశ్వరుని ధనుస్సు నెత్తుట, అది ఎవరికీ సాధ్యము ? శక్తి స్వరూపిణి యైన జానకికి పరమాత్మ యైన రామునికి, స్వంతదారుడైన శివునికి. అసలు రాముడు శివుడు అంతా పరమాత్మే.
రాముడు కళ్యాణ గుణ ధాముడు శివుడు ఎవరు? కళ్యాణ స్వరూపుడు. అంతా ఒకటే. రాముడు విష్ణువు అవతారమని మనకు తెలుసు, శివాయ విష్ణు రూపాయ అని కూడా మనకు తెలుసు. కావున ఆ
ధనుస్సును రాముడు అవలీలగా ఎత్తగలడని మనకు ముందే తెలుసు.
అది సీతా కల్యాణము సీతారామ
కల్యాణమునకన్నా సీతా కళ్యాణమనుట సముచితము. ఎందుకంటే
పతిం విశ్వశ్వాత్మేశ్వరగుం శాశ్వతగుం
శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం
పారాయణం
ఆ పరమాత్మయే విశ్వపతి. ఆయనే
విశ్వాత్మ. ఇక సృష్టి లోని చరాచర జీవరాశి యంతా స్త్రీ రూపమే! ఇందులో ఆడ మగ తేడా
లేదు. అంటే ఆయన బ్రహ్మము. మనము జీవుడు. జీవబ్రహ్మైక్యమే కల్యాణము.
రాముడు కేవలము నరునిగా భాసిల్లితే
తప్ప అసలుకు నరజాతి ప్రతిష్ఠ నిలబడదు. అందుకే ఈ తంతు అంతా. విశ్వామిత్రుని పాత్ర
సీతా కళ్యాణముతో ముగుస్తుంది. ఆయన నేరుగా రామునికి సీతను పెళ్లియాడుటకు గానూ
విల్లునెక్కుపెట్టమంటే తండ్రి యనుమతి కావాలంటాడు. అందుకే ఈ పనిని ఎంతో గుంభనముగా
జరిపినాడు. శివుని విల్లు విరిచిన తరువాత వీర్య శుల్క యైన సీతను పెళ్లి యాడమని
జనకుడు అంటే తండ్రి యనుమతి కావాలంటాడు రాముడు.
సీత అయోనిజ. అందువల్ల జనకునికీ
అయోమయము. అందుకే ఆయన శివధనుస్సును ఎక్కు పెట్టిన వానికి సీతను వధువుగా ఇస్తాననుట.
ఆశరీరవాణి నాగేటిచాలు తగిలి పైకి
లేచిన ఈవిడ నీ యొక్క ధర్మ సుత
అని చెప్పింది. ఆమె ఏ పెట్టెలో
నుండీనో బయటకు రాలేదు. అశరీర వాణి
తెలుపుటచే ఆమె ఆ తండ్రికి కూతురు
అయినది. కన్న తండ్రి కి కూతురు, మేనమామకు కోడలు ఎడమ
తొడ పై కూర్చునుట శాస్త్ర సమ్మతము. ఎడమ తొడపై మాత్రము భార్యకు తప్ప ఎవరికీ
అధికారము ఉండదు. రామ కర్ణామృతము లో శంకరులవారు ఈ విషయాన్నే శ్లోక రూపములో
ప్రస్ఫుటము చేస్తారు. ఆవిధముగా లోక కళ్యాణమునకై సీతా కల్యాణము జరిగినది. ప్రస్తుతం
నేపాల్ దేశంలో ఉన్న జనక్ పూర్ అప్పటి మిధిలా నగరమని చెబుతారు.
మరి దానికి షరతేమిటి.
మహేశ్వరుని ధనుస్సు నెత్తుట. అది
ఎవరికీ సాధ్యము ? శక్తి స్వరూపిణి
యైన జానకికి పరమాత్మ యైన రామునికి, స్వంతదారుడైన శివునికి. అసలు రాముడు శివుడు అంతా పరమాత్మే. రాముడు కళ్యాణ గుణ
ధాముడు శివుడు ఎవరు? కళ్యాణ స్వరూపుడు.
అంతా ఒకటే.
సీతా మహాసాధ్వి వాల్మీకి మహర్షితో
ధర్మ స్వరూపుడైన తన భర్త చరిత్ర చెప్పించి వారిని వర్తమానమున రుజువర్తనులైన
బాలకులుగా భవిష్యత్తున
అత్యుత్తమమైన పాలకులుగా తీర్చి
దిద్దింది.
సీతా రాములు అభిన్న మూర్తులు. సీత
సర్వదా నిత్యానపాయిని( = కలకాలమూ తోడుగా వుండేది)
రామాయణమును అంతరార్థముతో పరిశీలించక
పోతే అంతా రాద్ధాంతమే అనిపిస్తుంది.
శ్రీరాముడు పునర్వసు నాలుగవ పాదము
శ్రీ రామ చంద్రునిది. అది కటక లేక కర్కాటక లగ్నమౌతుంది. ఆయన జన్మ సమయమున బృహస్పతి
చంద్రునితో కలిసి యుండినాడు. ఆ సమయములో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండుట జరిగింది. శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య
మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు .
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్
ముహూర్తంలో అంటే మధ్యాహ్నము 12 గంటల వేళలో
త్రేతాయుగంలో జన్మించినాడు. అంటే ఆయనది పునర్వసు నాలుగవ పాదము.
60 సంవత్సరముల కాలము
చారిత్రక ఆధారాలను బట్టి భద్రాచలంలో
పంతొమ్మిది వందల ఇరవై ఏడు లో ఈ పట్టాభిషేకం నిర్వహించినట్లు చెబుతున్నారు.
పంతొమ్మిది వందల ఎనబై ఏడులో, అంటే ప్రభవాది 60 సంవత్సరములు గడిచిన పిదప, ఈ మహత్కార్యాన్ని అప్పటి నిర్వాహకులు చేపట్టినారు. మళ్ళీ ఆ వేడులకు రావాలంటే
అరవై సంవత్సరాలు కావాలి. అందుకని మహా పండితులు, అర్చకులు అంతా కలిసి ఆలోచించి పన్నెండు ఏళ్ళకు ఒకసారి పుష్కర సామ్రాజ్య
పటాభిషేకం చేయాలని నిర్ణయించి ఆ విధముగా జరుపు చున్నారు. ఈ నిర్ణయం తరువాత పుష్కర
సామ్రాజ్య పట్టాభిషేకం తొలిసారిగా పంతొమ్మిది వందల తోబైతోమ్మిది లో జరిగింది.
పన్నెండేళ్ళ అనంతరం మళ్ళీ 2011 న, నవమి నాడు కల్యాణం అయిన తరువాత దశమి నాడు ఈ పుష్కర
సామ్రాజ్య పట్టాభిషేకం జరుపినారు. మళ్ళీ 2023 లో జరుపుతారు.
రాముడు పుట్టిన తిథి నవమియైనా
కల్యాణము కూడా అదే రోజు చేయుట అనూచానముగా వస్తూవున్న ఆచారము. ఆ రోజు సీతమ్మకు అత్త
గారింటి తాళి అమ్మ గారింటి తాళి కాకుండా రామదాసుడైన భక్తాగ్రేసరుడు గోపన్న
చేయించిన తాళి కూడా మూడవదిగా కట్టుట భద్రాచలమున ఆచారము.
క్రొత్త దంపతులను సీతా రాములవలె
ఉండమని ఆశీర్వదిస్తారు కదా మరి వారి మాదిరి కష్టాలు పడమని అర్థమా అని అడిగే వారు
గూడా ఉండవచ్చును. వారు అడవులకు పోయినా, అన్యుల వద్ద ఉండవలసి వచ్చినా అన్యోన్యత చెక్కు చెదరలేదు. గర్భవతి యైన సీతను
వాల్మీకి ఋష్యాశ్రమము చేర్చినా సీతకు రామునిపై గల అవ్యాజ ప్రేమ చెక్కు చెదరలేదు.
అందుకే ఆమె తన పుత్రులకు ఉదాత్తమైన రామ కథను వాల్మీకి చేత నేర్పించింది.
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజాను బాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
స్వస్తి.
Good descriptive article presented. Thanks for the efforts sir.
ReplyDelete