Saturday, 19 June 2021

వేదముల ఉనికి నాడు నేడు

వేదముల ఉనికి నాడు నేడు 

https://cherukurammohan.blogspot.com/2021/06/1131-13.html

వ్యాసులవారు వేదములు విభజించిన కాలానికి ఉన్న మొత్తము వేద శాఖలు 1131, 

ఇప్పుడు ప్రాణముతో వున్నవి 13. వీనిలో కూడా 7 మాత్రమే ఇప్పుడు పరంపరాగతముగా 

దేశములోని వివిధ ప్రాంతములలో వినవస్తున్నవి. మిగతా 6 కేవలము వ్రాతప్రతులలో 

మాత్రమే చూడగలము.

                                 ఉండినవి         ఉన్నవి

ఋగ్వేదము                    21                    2

యజుర్వేదము               101                    6

సామవేదము              1000                   3

అథర్వణ వేదము              9                    2

వ్రాతప్రతులకు పరిమితమైన ఈ 6 శాఖలకు గురువులు లేరు ఛాత్రులూ లేరు. ఈ 7 

శాఖలను చెప్పె గురువులు కూడా ఎంతో వయసుమీరిన వారు. వీరికి శిష్యులు లేరు. 

కాలాంతరములో ఇవి కూడా కనుమరుగు కావచ్చునేమో! ఆవిధముగా 99% 

వేదవాజ్ఞ్మయము కనుమరుగైనట్లే! మిగిలది 1% మాత్రమే!

ప్రపంచమే ఒప్పుకొనుచున్న ఒక వాస్తవమేమిటంటే ఈ 1% కూడా క్షుణ్ణముగా పరిశీలించి 

పరిశోధించగలిగితే జగతికి అద్భుతములను అందజేయవచ్చు.

జగత్తున వేదమహిమ తెలిసిన మహనీయులు కొందరు తిరిగీ వేద పాఠశాలలను 

పునరుద్ధరించి పునాదిని పదిలపరచుచున్నారు. తిరిగీ వేదాధ్యయన పాఠశాలలను 

ప్రారంభించుచున్నారు. వేద సంహితల ముద్రనాకార్యమును చేపట్టినారు. వేదభారతి 

సంస్థ ఈ దిశగా మహత్తర క్రుషిచేయుచున్నది. ఈ మహత్తర ప్రణాళికకు నాయకుడు 

బ్ర.శ్రీ.వే. డా.రేమెళ్ళ అవధానులు గారు.

తిరుపతి తిరుమల దేవస్థానము వారు ఈ విషయముగా తాళపత్ర ప్రతుల యొక్క 

 Scaning, Microfilming చేయించుటతయే గాక అందుబాటులోనున్న అందరు 

వేదపండితులను అక్కున చేర్చుకొని 1980 లో ప్రారంభించి ఇప్పటికి వారిచే 1000 

గంటల వేదనిధులను Audio Cassets గా రూపొందించినారు.

అదేవిధముగా నాసిక్ వాస్తవ్యులైన వేదమూర్తులు శ్రీ కిషన్ లాల్ శారద గారు శుక్ల 

యజుర్వేదము యొక్క కొన్ని భాగములను Video Cassets గా రూపొందించినారు. ఈ 

మార్గమే కాకుండా తిరుమల లోని ధర్మగిరిపై  తిరుపతి తిరుమల వేదపాఠశాల, కృష్ణా 

నది ఒడ్డున మాది పాడు నందు మల్లాది ట్రస్ట్ వారి వేదపాఠశాల, శతాబ్దముల చరిత్ర 

గల్గిన, గోదావరి ఒడ్డున గల, రాజోలు, కపిలేశ్వరపురములోని   వేదపాఠశాలలు, 

శ్రీశైలములోని శ్రీదేవీ వేదవిద్యాలయము, హైదరాబాదు నందు గల వేదభవన్ 

వేదపాఠశాల మరియు పొరుగు రాష్ట్రములలో ఆదిశంకర పీఠ ఆధ్వర్యమున కంచి 

శృంగేరి కాలడి మున్నగు చోట్ల గల వేదవిద్యాలయములు, ఎన్నో ఈ వేదవిద్యను 

అంతరించకుండా కాపాడుచున్నాయి. ఇన్ని ప్రయతములు జరుగుచున్నా, నిజానికి ఇవి 

చాలవు.

దీనికి ఇంకా నవీన సాంకేతిక నైపుణ్యమును జోడించవలసియున్నది. ఇదికాక నేటి 

Electronic Media కలిగిన కోట్ల కొద్దీ సమాచార నిధులను భద్రపరచాగలిగిన      భారీ 

వసతులను ఉపయోగించుకొనవలసియున్నది. కాబట్టి ఈ మొత్తము వేదనిధిని 

Computer Data Base లోకి పూర్తిగా మార్చితే ఈ సంపదను కలకాలమూ 

కాపాడగలిగినవారమౌతాము.

ఈ విషయములనన్నింటినీ సమీక్షించి బ్రశ్రీవే రేమెళ్ళ అవధానుల వారు

SRI VEDABHARATI (A PUBLIC CHARITABLE TRUST) ను 1994 లో ఏర్పాటు చేసి 

ముఖ్యముగా ఈ క్రింది అంశములపై పరిశ్రమ చేయుచున్నారు.

1.       వేద శబ్దమును, వేద సాహిత్యమును Computer Technology ద్వారా

శాశ్వతముగా భావి తరములకు అందజేయుట

2.    వేదచోదిత  శాస్త్రవిషయముల నుండి నేటి Science ఎంత విజ్ఞానమును గ్రహించినదని 

     లోకమునకు తెలియజేయుట

ఇచట Dr. అవధాన్లు గారిని గూర్చి నాలుగు మాటలు చెప్పుకోనవలసియుంటుంది.

1.       ఆయన స్వోత్కర్షకు తావునివ్వని గొప్ప మనీషి.

2.     అవధానులు గారు 1969లో న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చేసిన తర్వాత కొంతకాలం     లెక్చరర్ గా పనిచేసినారు.

3.    ప్రతిరోజు కాలేజ్ కి వెళ్ళి వచ్చిన పిదప ఖాళీ సమయం ఉండడంతో వేద పాఠశాలలో 

     వేదము నేర్చుకునేవారు. ఆ సమయంలోనే సైన్స్ కు మన వేదానికి ఏదో సంబంధం  

     ఉన్నట్టుగా ఆయనలో అనుమానాలు రేకెత్తినవి. అంటే వేదము పై అభిలాషకు ఇది  

      నాంది.

4.    తర్వాత హైదరాబాద్ ఈసిఐఎల్ లో టెక్నికల్ ఆఫీసర్ గా ఉద్యోగమును చేపట్టినారు.    

     వృత్తి పరంగా తాన విధులు ఎంత నియమబద్దముగా చేసేవారో  మన సంస్కృతి      

     సాంప్రదాయలను కూడా అంతే గౌరవించేవారు. 

5.    మన తెలుగు మీద ప్రేమతో 1976 భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలుగు 

     అక్షరాలను కంప్యూటర్ లోకి తీసుకువచ్చినారు.

6.    వేదాలలో సైన్స్ మీద పి.హెచ్.డి చేసి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో 

     అందించినారు. వీరు సంస్కృతములో కూడా స్నాతకోత్తర పట్టా పుచ్చుకొన్నారు.

7.    బ్రిటీష్ వారు, మహ్మదీయులు, డచ్, పోర్చ్ గీస్ మొదలైనవారు మన దేశంపై దండెత్తి 

    వనరులను మాత్రమే కాక కమ్యూనిష్టులు గతములో ప్రభుత్వమును నడిపిన రాజకీయ 

    నాయకులు  మన చరిత్రను ఎన్నోవిధముల  ధ్వంసము చేయగా  మన సంస్కృతిని 

    కాపాడుకునేందుకు వాటిని భవిషత్తు తరాలకు అందించడానికి అవధానూలు గారు 

    దశాబ్దాలుగా అవిరళమగు  కృషి చేస్తూనే ఉన్నారు. ఇది అనితర సాధ్యమనుటలో తప్పు 

    ఏమాత్రమూ లేదు.

వేదమపౌరుషేయమగు వేదము  ధర్మ పథమ్ము గాంచగన్

వేదము నీతి బోధకము వేదము శాస్త్రసముచ్ఛయంబగున్

వేదము దైవ రేచకము వేదము యోగుల సంశ్రవంబగున్

వేదము భారతీయనిధి వెల్లువ గాంచగ వేదభారతిన్

మత్స్యావతారుడై సోమకుని బారినుండి వెదములనుద్ధరిన్చిన  శ్రీ మహావిష్ణువు మనకు 

తోడునీడగా నిలబడి వేదములకు పునర్వైభవము సమకూర్చవలెనని ప్రార్ధించుతూ శెలవు 

తీసుకొనుచున్నాను.

స్వస్తి.

 

 

No comments:

Post a Comment