Saturday, 15 June 2019

బుద్ధిః కర్మానుసారిణీ


బుద్ధిః కర్మానుసారిణీ
https://cherukurammohan.blogspot.com/2019/06/blog-post_15.html

నేను అంటే శరీరం – మనస్సు – బుద్ధి.
శరీరము బాహిరమైనది. దానికి సంజ్ఞలందజేసేది మనసు. దానిని ప్రచోదనము చేసేది బుద్ధి.
 పూర్వజన్మముల కర్మఫల సారాంశమే బుద్ధి. తప్పో ఒప్పో మనసును ప్రేరేపించేది బుద్ధి.
మరి బుద్ధికి కూడా వెనుకల ఒక నడిపే శక్తి అవసరము. పరమేశ్వరునికే పరాశక్తి అవసరమైతే మనమెంత. కావున ఈ బుద్ధిని ఉసిగొల్పుటకు ఏర్పడిన శక్తే కర్మఫలము.
ఒక చిన్న ఉదాహరణ తీసుకొందాము. పదవీ విరమణ చేసిన 65 సంవత్సరముల వ్యక్తి తానూ పనిచేస్తూ వుండిన కార్యాలయము ఇంటికి దూరమైనా అదేపనిగా ఆటో లో వెళ్లి వయసులో ఉన్న పారిశుధ్యపు కార్మికురాలితో పరాచికాలాడేవాడు. ఒకరిద్దరు అతనితో ఇదేమి ఖర్మ అంటే నాకు తెల్లవారితే స్నానము దేవుడు దైవము ఏదీ అనిపించదు, కనిపించదు. ఈమెయే కళ్ళముందు కనిపిస్తుంది. కష్టముమీద కార్యాలయ సమయము వరకు వేచియుండి ఆమెతో పరాచికాలాడుటకు వస్తాను అని చెప్పినాడు. ఈ విషయమును ఇక్కడ నిలిపితే, ఆ వయసు వారందరూ ఆపని చేయుట లేదు. వాళ్ళు గుడి గోపురము, దేవుడు దైవము అంటూ తిరుగుచున్నారు. దీనివల్ల మనకేమి తెలియుచున్నది. బుద్ధిని ప్రేరేపించే శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉన్నది అని తెలియవస్తూవుంది. ఆ శక్తియే వారి వారి కర్మ ఫలము.
భగవద్గీత ఈ క్రింది శ్లోకముతో మొదలౌతుంది.
శ్లో.ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మమకాః పాణ్డవాశ్చైవ కిమ కురవత సంజయ
ఈ శ్లోకాన్ని బాహ్యంగా గమనిస్తే
సంజయా! యుద్ధము చేయ నిచ్చగించినవారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున కూడిన నావారును పాండవులును ఏమి చేసిరి?
ఇందులో అత్యంత గూడార్థము ఇమిడియుంది. ఒకసారి విశ్లేషించుకొందాము.
'క్షి' యనగా నాశము (చెడు కర్మలు చేయుటవల్ల)
'త్ర' అనగా రక్షణ (పుణ్య కార్యములు చేయుటవల్ల) 'కురు' చేయుటవల్ల కలిగించేది. ఆక్షేత్రము వేరేదీ కాదు ఈ శరీరమే. అందువల్ల ఈ శరీరమే కురుక్షేత్రమయ్యింది.
మమకారము తనవారిపైన చంపుకోలేని ధృతరాష్ట్రుడు అందుకే 'మామకాః' అని వాడినాడు. మామ అంటే ఒకవిధముగా అంతా నాకేకావలెనన్న అత్యాశగా చెప్పుకోనవచ్చును. ఇక 'పాండవాః'
అని కూడా ఆయన వాడుతాడు. 'పాండువు' అంటే తెలుపు స్వచ్చత అని అర్థం. పాండురాజు రక్త హీనత వల్ల పాలిపోయిన శరీరుడై (బొల్లి - తెల్లదనము వల్ల) పాండురాజైనాడు. ఇక పాండు కు 'స్వచ్చత' అన్న అర్థము ఉండుటవల్ల సత్వ గుణ సంపన్నులైన పాండవులు ధర్మ పరులైనందువల్ల ఆమాట ఆయనచే వాడబడినట్లు తెలియుచున్నది కదా!.
కావునకురుక్షేత్ర సంగ్రామ ఉపోద్ఘాతములోనే చెడ్డ పై మంచి గెలుస్తుందని చెడ్డని పుట్టించిన వ్యక్తి(తండ్రి) యే చెప్పినాడంటే భారత కాలములో వైయక్తిక జీవన విదానమేట్లున్నది మనము అర్థము చేసుకోన వచ్చును.
ఈ శరీరిభూమిపై ఉన్నంత కాలము ఈ మంచిచెడుల అంతర్మథనము కొనసాగుతూనే వుంటుంది.
కావున ఈ వివరణను సంగ్రహించితే, 'శ్లోకము', కురుక్షేత్రమగు ఈ శరీరముతో సత్కర్మల నాచరించి దానిని ధర్మ క్షేత్రమొనరించి రజస్తమోగుణములపై సత్వము జయము సాధించవలయునని తెల్పుచున్నదని నా భావము .
భగవద్గీత కర్మ యోగములో కర్మలు చేయక తప్పదు అని పరమాత్ముడు మనకు తెలుపుతాడు. అసలు ఊరక కూర్చునత కూడా ఒక కర్మే. దానికి తగిన సమయములో ఫలితముంటుంది.  ఒకవేళ  కర్మ సత్కర్మయైుతే కర్తకు సత్ఫలితం వస్తుంది. దుష్కర్మ అయితే కర్తకు దుష్ఫలితమే వస్తుంది. అయితే ఈ కర్మఫలాలు కర్మ చేసిన వెనువెంటనే రాకపోవచ్చు, కనిపించపోవచ్చు. అందుకే పుణ్యాలు చేస్తున్నవాళ్లు సుఖాలు పొందుతున్నట్లు కనిపించకపోవడం, పాపాలు చేస్తున్నవాళ్లు కష్టాలు అనుభవిస్తున్నట్లు కనిపించకపోవడం చూస్తుంటాం. ఈ విపరీతమే జనులను పుణ్యకార్యాలను చేయడంలో నిరుత్సాహపరచడం, పాపాలను చేయడంలో ప్రోత్సహించడం చేస్తుంది. దీనిలో మనం చేయగలిగింది ఏదీ లేదు. ప్రకృతి నియమం ఆవిధముగా ఉంది.
ఈ కర్మలను నియంతించేది కూడా ప్రమాత్మయగు అంతరాత్మ. కావున మన కర్మ బుద్ధిని ప్రేరేపించినా ఆవిషయమును అంతరాత్మకు నివేదించి అనుజ్న పొంది చేయవలసి ఉంటుంది.
క్లుప్తముగా తెలిపినాను.
కనుకనే కర్మానుసారాణీ బుద్ధిః అన్నారు.
స్వస్తి.

1 comment:

  1. Well explained about బుద్ధిః కర్మానుసారిని 🌷 గురుదేవులు చెరుకు రామ్మోహన్ రావు Sir గారికి ఆత్మ ప్రణామములు 🌷 yvreddy nandyal andhrapradesh

    ReplyDelete