చింత
https://cherukurammohan.blogspot.com/2019/01/blog-post_29.html
భగవత్ చింతన ఉత్తమోత్తమ మైనది. నేను దానిని గూర్చిగాక లౌకికమైన చింతను గూర్చి తెలియజేయుచున్నాను.
చితా చింతా సమాహ్యుక్తా బిందుమాత్రవిశేషతఃl
చితా చింతా సమాహ్యుక్తా బిందుమాత్రవిశేషతఃl
చితా దహతి నిర్జీవం
చింతా ప్రాణయుతం వపుఃll
चित चिंत (చిత, చింత) అన్న రెండు పదాలు
దేవనాగరి లిపిలో వ్రాస్తే చింతలో ఒక బిందువు ఎక్కువ వుంటుంది. కానీ అర్థభేదము అపారము.
చిత అన్నది శవాలను కాలుస్తుంది కానీ చింత జీవించే వారినే కాల్చివేస్తుంది. దీనిని
బట్టి చింత ఎంత ఘాతుకమో మనము అర్థము చేసుకొనవచ్చును. ఈ విషయమును నాదయిన రీతిలో చెప్పిన
ఈ పద్యమును చదవండి.
చింత అదెంతయైన
మరి చెంతన చేరగ చిత్తగించినన్
ఎంతటివాడు కూడ గతినెంచగ తప్పును కొంతయైనయున్
సంతసమన్నదే వెదుక సంతనగూడ లభించగల్గునే
సంతసమన్నదే వెదుక సంతనగూడ లభించగల్గునే
కంతలు గల్గు దుప్పటిని
గప్పిన వేడిమి రాదు మోహనా!
అర్థము సుగమము కాబట్టి నేను విశ్లేషించలేదు.
చింతలన్న కంతలున్న దుప్పటి కప్పుకొంటే చలితో ఏర్పడిన వణుకు తగ్గదు కదా!
సుభాషిత భాండాగారములోని
ఈ అనర్ఘ రత్నమును పరికించండి.
అగ్నౌ దగ్ధం జలే
మగ్నం హృతం తస్కరపార్థివైః
తత్సర్వం
దానమిత్యాహుః యది క్లైబ్యం న భాషతే
-
సుభాషితరత్నభాండాగారము
ఒకవేళ మన వస్తువేదయినా , అగ్నిలోబడి కాలి
పోవడము గానీ, నీటిలోబడి మునిగి పోవడము గానీ లేక చోరులచేత
తస్కరింపబడటము కానీ జరిగితే , పోగొట్టుకొన్న దానిని గూర్చి
పరితపించక కృష్ణార్పణం అన్న దృష్టిని
అలవరచుకొంటే అంతకు మించిన ఆనందమే ఉండదు. మనసులో బాధ లేకుంటే వుండబోయేది ఆనందమేగదా
. కాబట్టి పోగొట్టుకొన్న వస్తువును దానమిచ్చిన
దృష్టితో చూస్తే ఆవేదన పోతుంది, ఆత్మ సంతృప్తి
వస్తుంది. ఆవిధంగా మనము వుండలేకపోయినంత మాత్రాన ఎవరూ ఉండరని మాత్రం అనుకోవద్దు.
ప్రపంచములో మహా పురుషులింకా వున్నారు. వారలే మనకాదర్శము. ధర్మరాజు ఈ కోవకు
చెందినవాడు. తానావిధముగా ఉండుటయేగాక
తన తమ్ములను, కలత్రమును కూడా ఆ దారిలోనే నడిపించినాడు. ఇక్కడ ఆయన రాజ్యము ఎట్లు
పోగొట్టుకొన్నాడు, అది ధర్మ సమ్మతమా లేక వ్యసనమా అన్న వాదమునకు ఇక్కడ తావులేదు.
భగావానుడగు శ్రీకృష్ణుని తోడునీడయే పాండవుల నిబద్ధత చాటుతుంది.
శ్రీనాథ కవి సార్వభౌముడు తాను వ్రాసిన కాశీ ఖండములో,
ఈర్ష్య వల్ల
ఏర్పడిన చింత వింధ్యాదీశుని గర్వము సర్వము ఖర్వము గావించినది అన్నది
జీవితాంతము మానవులమైన మనము గుర్తుంచుకొనవలసిన విషయము.
శ్రీనాథ
విరచిత కాశీ ఖండములోని వింధ్యాద్రి స్వగతమును ఒకసారి పరికించండి.
మేరువు
తనకన్నా గోప్పదేమో అన్న ఒక్క చింత వింధ్యపర్వతము యొక్క మనస్సును చింతాజ్వరముతో కృశింపజేస్తూ
వుంది.
భేషజం బెద్దాని భేదింపఁజాలదు
లంఘనంబున నెద్ది లావు చెడదు
తఱిగించు బుద్ధినిద్రామహోత్సాహ క్షు
ధాకార తేజోబలాది నెద్ది
నాసత్యచరక ధన్వంతర ప్రభృతి వై
ద్యులకు నసాధ్యమై యుండు నెద్ది
దివసంబు లీరేడతిక్రమించిన యప్డు
జీర్ణత్వదశ నధిష్ఠింపదెద్ది
ప్రత్యహంబు
నవత్వంబు వడయు నెద్ది/
యట్టి చింతా
జ్వరంబు తన్నలముకొనియె/
నేమి సేయుదు నింక నే
నెచటఁ జొత్తు/
నెట్టు నిర్జింతు
మేరు మహీధరంబు.
దేనిమీదనయితే
ఏ మందులూ పనిచేయవో, ఉపవాసాలు ఎన్నిజేసినా దాని లావు సన్నగిలదో, ఏదయితే బుద్ధి,
నిద్ర ఉత్సాహ ఆకలి ఆకారము తేజస్సు మొదలగునవి క్రుశిమ్పజేస్తుందో, తరిగించుతుందో, చరక ధన్వంతరి వంటి మహా
భిషగ్వరులకు కూడా దేనిని రూపుమాపుట సాధ్యము కాదో, ఏదయితే ఎంతకాలమునకైనా
జీర్ణించుకొన శక్యము కాదో, ప్రతి దినము కొత్తపోకడలతో దహించుచున్నదో అట్టి చింతా
జ్వరము అలముకొన్నది. నేను ఏమి చేసేది?
ఎచటికి పోయేది. ఆ మేరుపర్వతమును ఎట్లు జయించేది? అని వాపోవుచున్నది వింధ్యపర్వతము.
చింతకు
ఈర్ష్య చేరితే ఏ విధముగా వుంటుంది అన్న ఈ పద్యమును శ్రీనాథులవారు వింధ్యేంద్రుని
ద్వారా చెప్పించిన ఈ పద్యము వింటే ఇది భారతములో పరాభవము చెందిన దుర్యోధనుడు కదా
ఇది చెప్పినది అనిపిస్తుంది. ఈర్ష్య ఎంతగా
వ్యక్తిని వ్యాకులపరుచుతుందో చూడండి.
కంటికి
నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటకమిందునే? యితర వైభవముల్
పదివేలు మానసం
బంటునె? మానుషంబుగలయట్టి
మనుష్యునకెట్టి వానికిన్
గంటకుఁ
డైన శాత్రవుఁడొకండు దనంతటి వాఁడుగల్గినన్.
కంటికి
నిద్ర రాదట, రతికేళి కూడా సుఖమును కూర్చదట, ఎంత రుచికరమయిన వంట
కూడా నోటికి ఇంపితము కాదట, అవి పదివేల విధములగు వైభవములే
కానీగాక మనసు ఇష్టపడదట, ఎవరికి, ఎటువంటివానికి అంటే మానవత గల్గిన మనిషికి ఎవనికైనా
తనంతటి శత్రువు ఒకడు ఏర్పడినాడంటే వాడు ‘చెప్పులోని రాయి, చెవిలోనిజోరీగ, కంటిలోని
నలుసు, కాలిముల్లు కదా’!
ఇది
ఈర్ష్య తో కూడిన చింత. ఇది ఇంకా బయంకరమైనది. గమనింంచినావు కదా!
ఈ
కథను ఒకసారి గమనించు. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరి సంపద చూసి ఇంకొకరికి ఈర్ష్య. దానిచే ఒకనికన్నా ఇంకొకడు అమిత ధనవంతుడు కావలెనను చింత. ఎంతో యోచించి పెద్దవాడు, తపస్సు చేస్తే తనకోరిక సాధించుకోనవంచును అన్న ఆలోచన కలుగుటచేత
ఒక కొండగుట్ట చేరి తపమాచరించ మొదలుపెట్టినాడు. ఇది తెలిసిన తమ్ముడు తానూ కూడా అదే
పని అదే కొండపై అన్నకు కాస్త దూరములో మొదలుపెట్టినాడు. ఎత్లయితేనేమి దేవుడు ముందు
తపస్సు మొదలుపెట్టిన పెద్దవానికి ప్రత్యక్షమై వారము కోరుకొమ్మన్నాడు. వాడు కళ్ళు
తెరువగానే దేవునికన్నా ముందు తమ్ముడు తపస్సు చేయుట చూసినవాడై, దేవుని ‘స్వామీ!
నీవు ఎటూ ఆ తపస్సు చేసుకొనే వానికి కూడా ప్రత్యక్షమౌతావు కదా! వాడు కోరిన దానికి
నాకు రెండితలివ్వు.’ అన్నాడు. పనిలో పనిగా దేవుడు తమ్ముని ఎదుట నిలిచి వారము
కోరుకొమ్మన్నాడు. వానికి ‘అన్న’ చింత కదా! ‘వాడేమి కోరినాడ’ని అడిగినాడు.
అబద్ధామంటే తెలియని దేవుడు ఉన్నమాట చెప్పినాడు. తమ్ముడు వెంటనే “స్వామీ అట్లయితే
నాది ఒక కన్ను గుడ్డి చేయి” అన్నాడు. తక్షణం వీడికి ఒక కన్ను వాడికి రెండుకళ్ళు
పోయినాయి. ఈర్ష్య చింత కలిస్తే ఇంత అనర్థము దాపురించుతుంది.
ఈ
సందర్భముగా నేను వ్రాసిన ఈ పద్యమును గమనించండి.
ఎంతటి వానికైన
మది నేర్పడు చింతకు ఊపిరూదుచున్
చెంతన ఈర్ష్య
వున్న ఇక చింత
దవానలమౌచు రేగి ఏ
పొంతన లేని
దుష్టగుణ పూత విపత్తి విషాద మూకలన్
సంతతముంచి చిత్తమును సాంతము గాల్చును రామమోహనా!
పూతము= చిక్కనయిన
అందుకే చింత అన్నది luggage తో పోల్చుకొంటే నాకు
ఒకకాలమునాటి Railway Slogan గుర్తుకు వస్తుంది.
Less luggage More Comfort Make Travel A Pleasure.
స్వస్తి.
Well said sir. One should learn from mistakes by himself.
ReplyDeleteచింతా క్రాంత మనస్కుడు యెన్ని విధాలా బాధలు పడతాడో అను విషయాన్ని యెన్నో గొప్ప శ్లోకములను ఉటంకిస్తూ వివరించారు.
ReplyDeleteసుభాషితం భాండాగారం నుండి పద్యము నందించి అద్భుతమైన రీతిలో వివరించారు.
ఏ వైద్య ప్రముఖుడూ చింతల వల్ల వచ్చే రోగాలను నయం చేయ లేడని బాగా వివరించారు.
శ్రీ నాధుని పద్యము ద్వారా ఈర్ష్య గలవాడు పడే చింత వలన బాధల తీవ్రతను బోధ పరచేరు.
మీరు రచించిన పద్యములో చింత వలన కలిగే దుష్ప్రభావాలు గురించి చాలా విషయాలు తెలిపారు...
అద్భుతమైన మీ రచనకు అనేక అభినందనలండీ రామ మోహన రావు గారూ.
Good Message 🌷 yvreddy nandyal andhrapradesh
ReplyDelete