ఒక
చాటువు
ఈ
చాటువునకు కర్త ఎవరో నాకు తెలియదు, చాటుపద్య మణిమంజరిలో చదివినట్లు గురుతు, కానీ
ఇందులోని భావమును గ్రహించుటకు మాత్రము మెదడుకు పదును పెట్టవలసిందే! ముందు పద్యమును
చదవండి.
"సరసిజనేత్ర!
నీ మగని చక్కని పేరది యేదొ చెప్పుమా"
"అరయఁగ
నీవు న న్నడుగ నాతని పే రిదె చిత్తగింపుమా
కరియును, వారిరాశి, హరుకార్ముకమున్, శర, మద్దమున్,
శుకం
బరుదుగ
వ్రాయఁగా నడిమి యక్షరముల్ గణుతింపఁ బే రగున్"
మొదటి
రెండు పాదములు ఒకావిడ(భావన మాత్రమే. మగవాడు కూడా ఆ స్త్రీని అడిగియున్దవచ్చును. దానికి ప్రాధాన్యత
లేదు.) మరియొక ఆవిడను భర్తపేరు చెప్పమనుట, ఆమె
కరి, వారిరాశి, హరుకార్ముకము, శర, అద్దము, శుకము అన్న పేర్లు
చెప్పి వీని నామాంతరముల మధ్యాక్కరములను గ్రహించిన తన భర్త పేరు వస్తుంది అని
చెబుతుంది. ఇపుడు ఆయా పేర్లు ఏమిటో చూద్దాము.
‘కరి
– సారంగం (ఏనుగు, లేడి తుమ్మెద
అన్న అర్థములు కూడా వున్నాయి), వారిరాశి – సాగరం, హరు కార్ముకము – పినాకం, శరము – సాయకం (బాణం), అద్దం – ముకురం, శుకము – చిలుక.’
ఇందులోని
మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ పర్యాయ పదములు ఆరున్నూ మూడక్షరములు కలిగినవే! ఈ విధముగా
వ్రాయుట అంత సులభమగు విషయము కాదు.
పై
ఆరు పదాల్లోని మధ్యాక్కరములను కలిపితే ‘రంగనాయకులు’ అవుతుంది. ఆ సుందరాంగి
భర్తపేరు రంగనాయకులు అని నేరుగా చెప్పకుండా చెప్పింది. పూర్వము భర్త పేరు
చెప్పకూడదు అన్న ఆనవాయితీ వుండేది. ఎంత సుందరంగా చెప్పిందో కదా!.
చెఱుకు
రామ మోహన్ రావు
No comments:
Post a Comment