కారణమేమిటంటే పూర్వులు తరువాతి
తరములవారు సులభముగా గుర్తుంచుకొనుటకు గానూ తాము చెప్పదలచినది శ్లోకరూపములో
వ్రాసినారు. సాధారణముగా శ్లోకమునకు రెండు పాదములు. మరి తెలుపదలచిన భావమును
స్థలాభావము లేకుండా చెప్పుటకు మరియు పాఠకుడు సులభముగా గుర్తుంచుకొనుటకునూ ఈ
విధముగా వ్రాయుట జరిగినది. అందుకే ధారణ గలిగినవారు నేటికీ, మహా
కావ్యములను కూడా కంఠస్థము చేసియుండుట మనము చూస్తూనే ఉన్నాము. పై పెచ్చు శ్లోకము
అంటే చందోబద్ధమై వుంటుంది. కావున అర్థము చెడకుండా తగిన పదమును వారు ఆచితూచి
వేస్తారు. కావున విశ్లేషణ తప్పదు. అసలు ఈ విధముగా కంఠస్థము చేసుకొని ఉంచుకొనుట చేతనే
వేదశాస్త్రపురాణాదులు భూమిపై నిలచినవి. లేకుంటే అన్నీ అగ్నికి ఆహుతయి ఉండేవి
తురుష్క పాశ్చాత్య పాలనలలో!
తిరిగీ విషయమునకు వస్తే
శతభిషము కుంభరాశికి చెందినది. దానికి అధిపతి వరుణుడు. ఆతని వాహనము మకరము. ఎందుకంటే
ఆకాశములో క్రింద మకర రాశి పైన కుంభరాశి ఉంటుంది. రాసుల పేర్లు చెప్పేసమయమున మకరము
తరువాతనే కదా కుంభము వస్తుంది. ఈ కుంభరాశికి అధిపతి వరుణుడు. వరుణునికి క్రింద
మకరము వున్నది కావున, వరుణుని
వాహనము మకరమైనది. ఒకవేళ అదే కుంభమునకు పైన వుండి వుంటే ధ్వజమై వుండేది.
ఈ 27 నక్షత్రములు సూర్య గతితో
సంబంధమున్నవి. ఇవికాక అనంతమగు నక్షత్రములు నింగిలో మనకు కనిపించుతాయి. అందులో
దక్షిణార్ధగోళములో కనిపించే ఒక నక్షత్రము అగస్త్య నక్షత్రము. ఇది మన భారతీయ ఋషులు
ఆ నక్షత్రమునకు పెట్టుకొన్న పేరు. దీనినే ఆంగ్లములో Canopus అంటారు. ఆవిధముగా దానికి
దగ్గరగా కనిపించే ఇంకొక నక్షత్రము ‘ఇంద్రద్యుమ్న’ నక్షత్రము. ఇది చాలా పొడవైన
నక్షత్రమని చెబుతారు. బహుశ ఆయన కీర్తి అంతగా విస్తరించినది అన్న మాట అందుకే
చెబుతారేమో! ఆంగ్లములో FOMALHAUT అని వ్రాస్తారు FOMALO అని పలుకుతారు. ఇక్కడ మేరు
పర్వతమందు ద్రోణము అంటే లోయలో వరుణుని వనము అందు తటాకము అందు ఆయన వాహనము మొసలి
వున్నది.
కృతయుగకాలంలో ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా పరిపాలిస్తూండేవాడు. ఎన్నో యజ్ఞకార్యాలు కూడా చేయడంతో అతను మరణించిన పిదప స్వర్గము చేరినాడు. ఆయన స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ ఆనందిస్తూ ఎంతకాలం వుండినాడో అతనికే తెలియదు. ఒకరోజు ఇంద్రద్యుమ్నుని వద్దకు దేవదూతలు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలము ముగిసింది తిరిగీ భూలోకమునకు వేరొక జన్మతో వెళ్లవలయు’ నన్నారు.
‘మరి నేను ఇంకా కొంతకాలము
ఇచట వుండే అవకాశము లేదా అన్నాడు’ ఇంద్రద్యుమ్నుడు. అప్పుడు ఇంద్రుడు ‘నీవుచేసిన
పుణ్యకార్యములవల్ల ఇంకా నీపేరు భూమిపై తలచుకొనబడుతూ వుంటే నీకు ఇచట ఇంకా వుండే
అవకాశము వుంటుంది’ అని అన్నాడు. ఇంద్రుని మాటకు వల్లెయని ఆయన దేవదూతలతో భూలోకమునకు
బయలుదేరినాడు. తన తదనంతరము ఎన్నో మార్పులు వచ్చుటచేత ఇంద్రద్యుమ్నునకు భూలోకము
కొత్తగా కనిపించింది. తెలిసిన వారెవరూ కనిపించలేదు. భూలోకవాసులలో చిరంజీవి మరియు అతి వృద్ధుడగు
మార్కండేయునివద్దకువెళ్ళి తననుగూర్చి అడిగితే ‘నేనపటికి పుట్టలేదేమో!
అందుచే నాకు తెలియదు, నాకన్న వృద్ధుడు ‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబను అడిగితే విషయము
తెలియగలదు’ అన్నాడు మార్కండేయుడు.
అందరూ కలిసి ఆ గుడ్లగూబ వద్దకు వచ్చి అదే ప్రశ్న అడిగితే ‘మీరెవరో నాకు తెలియదుకానీ నాకన్న వృద్ధుడగు ‘నాళీకజంఘుడు’ అను కొంగను అడిగితే తెలుసుకొనే అవకాశము వున్నది’ అని చెబుతూ అందరూ కలిసి ఆ కొంగ దగ్గరకు బయలుదేరినారు. ఇంద్రద్యుమ్నుని అదే ప్రశ్నకు ‘నాకన్న పెద్దయగు ‘ఆకూపారుడు’ అన్న తాబేలు కు తెలియవచ్చు,వెళ్లి అడుగుదాము రండి ’ అనుటచే అందరూ కలిసి నాడీజంఘుని వద్దకు వచ్చినారు. యథాలాపముగా రాజు ‘నేనెవరో తెలుసా’ అని అడిగినాడు అకూపారుని. అందుకు అకూపారుడు ‘మిమ్ము నేనెలా మర్చిపోగలను. మీరు ఎన్నో యజ్ఞములు చేసి అపారమగు గోదానములు ఇచ్చుటచే లక్షలసంఖ్యలో తోలుకోనిపోబడుచున్న ఆ ఆవుల కాలి గిట్టల తొక్కుడు చేత ఈ కొలను ఏర్పడగా మాకిది వాసయోగ్యమైనది. ఎడతెగని నీటియూట గల్గిన ఈ హ్రదమునొదిలి వేరేచోటికీ వెడలు అవసరము మాకు కలుగలేదు అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని మీ పేరే పెట్టుకొన్నాము. నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు. దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లటంజరిగింది. ఆయన తన పుణ్య ఫలము తీరిన తరువాత భూమిపై పుట్టి ప్రజారంజకముగా పాలన సాగించుచూ, ఎదో కారణమున అదే పర్వతమున తపము నాచారించు సమయమున వచ్చిన అగస్త్యునికి సముచిత గౌరవము సేయలేకపోయినందున అగస్త్యుడు "మదముచే కన్నూమిన్ను కానక వ్యవహరించినందుకు మదగజమువై పుట్టుము, నీ పరివారము కూడా ఏనుగులై నీతో ఉండుగాక!"" అని శపించుతాడు. ఆ గజేంద్రుడే మన గజేంద్రమోక్షము లోని గజేంద్రుడు.
ఇపుడు ఈ కథకు మన
నక్షత్రమందలమునకు గల పోలిక చూస్తాము. బేయర్ అన్న పాశ్చాత్య శాస్త్రజ్ఞుడొకడు
దక్షిణార్ధములోని అంటే మన దక్షిణాపథమునకు ఇంచుమించు 17౦౦ క్రీ.శ. లో వచ్చి ఆకాశమున
కొంగను బోలిన నక్షత్ర సముదాయమును జూసి దానికి Gruss అన్న పేరును పెట్టినాడు. Gruss అంటే లాటిను భాషలో కొంగట. అట్లే అతను గుడ్ల గూబ ఆకారమును బోలిన
నక్షత్రతతిని జూచి Phoenix అన్న పేరు పెట్టినాడు. క్రీ.శ. 1752
లో Lokeyt అన్న పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు
తాబేలు వంటి నక్షత్ర సముదాయమును మన దక్షిణ దేశమున గమనించి దానికి Sculptor అన్న పేరును పెట్టినాడు. ఇపుడు కథలో వచ్చిన ముఖ్యమగు పేర్లతో
నక్షత్రములున్నట్లు మనకు పాశ్చాత్యులు చెప్పుటచే, వారు మనకు
ఆరాధ్యులగుటచే, రూఢియైనది. కథ జరిగినదా లేదా అన్న తర్కమును
వదలి పెద్దలు ఆకాశములో కనిపించే వాస్తవాలతో చెప్పిన కథ మనము మరువము కదా!
భాగవత కథనము ప్రకారము ఈ మకరి
బారిన పడి గజేంద్రుడు మోక్షము పొందుతాడు. పైన తెలిపిన ఇంద్రద్యుమ్నుడు అగస్త్యుని
శాపముచే మదించిన ఏనుగుల రాజవుతాడు. పైన తెలిపిన అగస్త్య,ఇంద్రద్యుమ్న శతభిష
నక్షత్రములున్నపుడు అక్కడ ఈ మత్తగజ నక్షత్రము ఉన్నదేమో! లేక ఇంద్రద్యుమ్న
నక్షత్రమే ఆరూపమున ఉన్నదేమో! ఏనుగు శరీరము ఎక్కువ పొడవును కలిగియుంటుంది కదా! అదీ
అంతరిక్షములో గజేంద్రుని కథ. నాకయితే ఈ విషయము తారసిల్లలేదు. ఇంకా శాస్త్రజ్ఞులు
కనుగొనవలసి ఉందేమో!
స్వస్తి
No comments:
Post a Comment