సీతమ్మా శ్రీరాముని కొమ్మా
నాకు సహజన్ములు లేకపోయినా రామరాజుగారిని త్రికరణ
శుద్ధిగా నా అన్నగారిగా తలుస్తాను. వారి శ్రీమతి సీతమ్మ నా వదినమ్మే! పంచ మాతృకలలో
వదినది రెండవ స్థానము. అంటే తల్లి తరువాత తల్లి వంటిది ఆమె నాకు. నా కుటుంబముపై
ఆమెకు గల వాత్సల్యమును నేను ఈ జన్మకు తీర్చుకోగలిగినది కాదు. కానీ ముభావముగా
వుండిపోలేక అశ్రునయనములతో నా భావమును ప్రకటించుచున్నాను.
సీతమ్మా శ్రీరాముని కొమ్మా
నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా
మెరిసె నవ్వై విరిసే పువ్వై
మచ్చలేని పూర్ణేందుబింబమౌ
చందన నందన వదనమునందున
వెలలకు అందని నవ్విక ఏదమ్మా
సభ్యసమాజపు కాసారంలో
మెరమెచ్చులనే కలుష జలంలో
పంకమునంటక ఉదయ కిరణముల
రంగులనంతా గ్రహించి భానుని
రంగులనంతా గ్రహించి భానుని
తెల్లమొగము వేయించుచు తల్లీ
విరిసినావు నవ పుండరీకమై
సీతమ్మా శ్రీరాముని కొమ్మా
నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా
కరి మకరులచే కలతల చెందక
పాల వెలుగు దీపాల తారకల
చూపి నీవు నీ దరహాసమ్మున
సౌదామినులుగ భ్రమింప జేసి
పారద్రోలితివి భయమే చెందక
ఎంత ధైర్యమది ఏమి స్థైర్యమది
సీతమ్మా శ్రీరాముని కొమ్మా
నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా
రామ రాజ్యమే నీకాసారము
నీ కాసారమె నీ సంసారము
పూరేకులె నీ పుత్రీపుత్రులు
పగలు రాత్రులే సుఖ దుఃఖమ్ములు
పతిదేవుడు తన పనుల మునిగినా
సంసారమ్మును చక్కగ నడిపిన
సీతమ్మా శ్రీరాముని కొమ్మా
నిర్మలమౌ ఆ నవ్విక ఏదమ్మా
చెరుకు రామ మోహన్ రావు
No comments:
Post a Comment