Saturday, 31 October 2015

వేదాంగములు

వేదాంగములు

శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం
నమామి భవత్పాదం శంకరం లోక శంకరం
జగద్గురువు శంకరాచార్యులవారు భూమి పైనున్నది ముప్పది రెండు వర్షములైనా వారి గొప్పదనం ఈ క్రింది శ్లోకం తెలుపుతుంది.
               అష్ట వర్షే చతుర్వేది ద్వాదశే సర్వ శాస్త్ర లిత్
          షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే ముని రత్యగాత్
వారి ఎనిమిదవ ఏటికే నాలుగు వేదాలు నేర్చుకొంటే పదిరెండు వత్సరాలకు సర్వ శాస్త్రాలు కరతలామలకం చేసుకొన్నారు.  పదునారు సంవత్సరములకు వ్రాయవలసిన భాష్యములెల్ల వ్రాసి ఆసేతు శీతనగపర్యంతము పర్యటించి మండనమిశ్రుని  వంటి    వయో  జ్ఞాన  వృద్ధులైన దిగ్దంతులను ఓడించి శిష్యుల గావించుకొని ధర్మాన్ని పునః ప్రతిష్ఠ చేసి  తమ ముప్పది రెండవ ఏట  పరమ పదాన్ని అందుకొన్న అపర శంకరులు.  వారిచే ఏర్పాటు చేయబడిన కంచికామకోటి   పీఠము  నధిష్టించి నాస్తిక్యము ప్రబలమైన ఈ భూమిని తిరిగి ధర్మస్థాపన మొనర్చిన జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరసరస్వతీ సంయమీంద్రులు.  వారి భాషణల సహాయ సహకార సౌజన్యాలతో నాదైన రీతిలో వేదాంగముల గూర్చి తెలుపుటకు ప్రయత్నించినాను.  ఇందులో దొరలిన తప్పులేవైనా వుంటే క్షంతవ్యుణ్ణి.
బృహదారణ్యక ఉపనిషత్తులో రుగ్యజుస్సామ వేదాలు పరబ్రహ్మ ‘నిశ్వాసితం’ అని చెప్పబడినది.   కావున వేద పురుషుడైన ఆ పరమాత్మ వదలిన ఊపిరి నుండి వేదములు ప్రభవించినవి.  భాగవత పురాణంలోని మొదటి శ్లోకంలో “తేనే బ్రహ్మ హృదయ అధికవయే” అని ఉన్నది.  అంటే ఈశ్వరునిలో వేదాలు  ఆయన శ్వాసగా వున్నట్లు అవగతమగుచున్నది.  విద్యారణ్యులవారు తన గురువు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నంటూ ఆయన నిశ్వాసమే వేదాలని పునరుద్ఘాటించినారు. 
వేదాలు నేర్చుకొనుటకు వేదాంగాలు అత్యంత అవసరం.  ఒక మనిషికి కళ్ళు, కాళ్ళు, చేతులు ఎంత అవసరమో వేదపురుషునికి కూడా అంగాలు అంతే అవసరం.  వేదాధ్యయనానికి వేదాంగాలు ఎంత అవసరమో విశధ పరుప ప్రయత్నిస్తాను.
ఈ వేదాంగములు ఆరు:
1.శిక్ష   2.వ్యాకరణము  3.ఛందస్సు  4.నిరుక్తము   5.జ్యోతిషము   6.కల్పము
లాఘవముగా ఈ ఆరింటిని గూర్చి తెలుపుటకు నేను చేసే ప్రయత్నాన్ని చిత్తగించ ప్రార్ధన.  ఇక్కడ లాఘవము అంటే ‘అతి తక్కువగా’ అనేకాని అన్యథా కాదు.
1.శిక్ష   
మంత్రాన్ని ఉచ్చరించటమంటే అక్షరాన్ని శుద్ధంగా స్పుటంగా కాల పరిణామానుకూలంగా (అంటే timing) స్థాయీ భేదానుసారంగా పలుకవలెను.  స్థాయిని కుడా నిర్దుష్టంగా మూడు విధాలుగా విభజించినారు.  అవి 1.ఉదాత్త (హెచ్చు) , 2.అనుదాత్త (తగ్గు) , 3.స్వరితము(సమము)లు.  అప్పడు సస్వరంగా పలికినట్లగుతుంది.
మంత్రాలను సంస్కృతంలోనే ఎందుకు చదువ వలెనంటే, భావాన్ని పదములతో పదములను అక్షరములతో ఛందోబద్ధమైన (ఛందస్సును గూర్చి తరువాత చెప్పుకొందాము) ప్రణాళికతో స్వరయుక్తముగా భగవంతునిచే పలుకజేయ నొసంగిన దానిని మన ఇచ్చ వచ్చిన రీతి వాడుకొనుట మహాదోషము.  పాణిని మహర్షి తన వ్యాకరణ గ్రంధంలో మంత్రములెట్లు చదువ వలెనన్నది ఈ క్రింది శ్లోకములోని పోలిక ద్వారా తెలియబరిచారు.
 ‘వ్యాఘ్రీ యధా హరేత్ పుత్రాన్ దంష్ట్రాభ్యాంచ నపీడయేత్
భీతి ర్పతన భేదాభ్యాం తావద్వర్ణాన్ ప్రయోజయేత్’
పులి (లేక పిల్లిని మనం చూస్తూనే వుంటాము) తన కూనలను పళ్ళతో గట్టిగా పట్టుకొని ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకొని పోయినా పిల్లలకు ఎటువంటి బాధ కలుగనివ్వక పిల్లలకు ఎంత హాయిని చేకూర్చుతుందో మంత్రోచ్ఛారణ అంత హాయిగా ఉండవలెనన్నారు.
శిక్ష అందువల్ల వేదమంత్రాలకు ఊపిరి కావున వేద పురుషునికి నాసికా స్థానమౌతుంది.
2. వ్యాకరణము  
 “నృత్తావసానే నటరాజ రాజే  నవనాద ఢక్కాం నవపంచవారం
 ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం”
నృత్యం చివరి దశకు వచ్చినపుడు చర్మ వాద్య వాదన సంపూర్తి చేయబోవు చున్నప్పుడు ఆ వాద్యాన్ని వేగంగా వాయించుతారు. దాన్ని చోపు అంటారు.  ఆ సందర్భములో ఆ నృత్యాన్ని తమ దివ్య చక్షువులతో తిలకించుచున్న మహర్షులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు మరియు పతంజలి వ్యాఘ్రపాద పాణినీ ప్రభృతులలో పాణిని మహర్షి ఆ శబ్దంలో వినిపించిన నవపంచవారం అంటే [నవ=9 + పంచ=5] 14 దరువులు కంఠస్తం చేసి ‘అష్టాధ్యాయి’ అనే ప్రాథమిక సూత్ర గ్రంధాన్ని రచించినాడు.  భావానికి భాష ప్రధానమైతే భాషకు వ్యాకరణం  ప్రధానమౌతుంది.  వ్యాకరణం లేని భాష ‘వాక్య రణమే కదా!’  అందువల్ల దీనిని వేదపురుషుని ముఖ స్థానంగా ఋషులు తెలిపినారు.
3.ఛందస్సు     శ్రీ కృష్ణ పరమాత్మ సృష్టి వృక్షానికి “ఛందాంసి యస్య పర్ణాని” అని తెలిపినారు.  ఇక్కడ ‘ఛందాంసి’ అన్న శబ్దము వేదములకు వాడబడినది.  కారణం వేదాలయొక్క అనువాకాలలోని మంత్ర నిర్మాణం అంతా ఛందో బద్ధమయి ఉండుట కారణం కావచ్చును.
ఒక పద్యం లేక శ్లోకానికి ఛందస్సు ఎటువంటిది అంటే ‘ఆల్తీ’ తీసుకొని చక్కగా అతికినట్లు కుట్టిన ‘డ్రస్సు’ లాంటిది.  వేదాలలో గాయత్రి, అనుష్టుప్, త్రిష్టుప్ ఆదిగా గల ఛందో నిర్మాణ మంత్రములను శ్లోకములను మనము చూడవచ్చును.  ఛందో బద్ధమైన మంత్రాలను, శ్లోకాలను, పద్యాలను కంఠస్తం చేయుట ఎంతోసులువు.  అదే వచన పాఠమైతే మనకు నేర్చుకొనుట కష్టమగును.
వేదాధ్యయనం కొనసాగుటకు కంఠ పాఠము గావించుకొనుట తప్పనిసరి కావున ఛందస్సు వుండి తీరవలసినదే.  వేద పురుషునికి ఇది పాద ద్వయంగా చెప్పబడినది.
4.నిరుక్తం   
 వేద భాషా పదోత్పత్తి శాస్త్రమును ‘నిరుక్తము’ అని చెప్పవచ్చు.  యాస్కుల వారు రచించిన ‘నిరుక్తము’ ఆ కోవకు చెందిన గ్రంధముల యందు తలమానికము.
సంస్కృత భాషలో పదములు ధాతు జన్యములు.  ‘లిత్’ అన్న ధాతువు నుండి విద్య ‘ముజ్ఞ్ చ్’ అన్న ధాతువు నుండి మోక్షం  ‘జ్ఞ్’ ధాతువు నుండి జ్ఞానం పుట్టినవి.  ఇవి ఉదాహరణలు మాత్రమే.  వేదానికి శబ్దం యొక్క వినికి  (hearing) ముఖ్యం కావున దీనిని వేదపురుషుని కర్ణద్వయం అన్నారు.
5.జ్యోతిషం   
 ‘సర్వే జనాః సుఖినో భవంతు’ ‘సర్వం సమస్త సన్మంగళాని సంతు’ ‘శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే’ ‘శాంతి రేవ శాంతి’.  ప్రతి క్రతువుకు చివర చెప్పే ఈ శుభాకాంక్షలను గమనించితే ఒక కార్యక్రమము జరిగిన తరువాత చేసిన వాడు, చేయించిన వాడే కాకుండా ‘చుట్టము-పక్కము’ ‘ఇరుగు-పొరుగు’ ‘దేశం-విదేశం’ ‘సమస్త భూమండలము’ ‘అనంత విశ్వము’ సుఖము, శుభము, సౌభాగ్యము, శాంతి మొదలగు శోభాయమానములైన గుణములు కల్గి వర్దిల్ల వలెనని ప్రార్ధిస్తూ ముగిస్తారు.
ఇటువంటి శ్రేయోదాయకమైన కార్యాచరణమునకు నియమావళి, సుముహుర్తము సత్శకునములు అవశ్యము ఆచరణీయములు.  ఈ మూడు శాఖలను కల్గిన ‘స్కందత్రయాత్మక’మైన శాస్త్రమునే జ్యోతిషమంటారు.
నియమావళిని గూర్చి తెలిపే మొదటి స్కందాన్ని సిద్ధాంత స్కందమంటారు.   ఇందులో అంక గణితం, బీజ గణితం, క్షేత్ర గణితం(geometry), త్రికోణమితి(trigonometry) గూర్చి విపులంగా చెప్పడం జరుగుతుంది.  అంటే యజ్ఞగుండము యొక్క పొడవెడల్పులు యజ్ఞ గుండము వద్ద వేయ వలసిన వివిధములైన చతురస్ర, త్రికోణ, వృత్తాకృతులు మొదలగునవి తత్సంబంధమైన కొలతలు కోణముల ప్రకారమే చేయ వీలు కల్పించుతుంది. 
ఇక రెండవ స్కందాన్ని ‘హోర స్కంద’మంటారు.  ఈ ‘హోర’యే ఆంగ్లమందు ఉచ్చారణా దోషముతో ‘HOUR’ అయినది. ఒక ఘడియ అనగా 24 నిముసములు.  ‘సార్ధ ద్విఘటికా హోరాః ఇత్యేతత్ హోర లక్షణం’ అన్నారు. అంటే రెండున్నర ఘడియల కాలం ఒక హోర యని అర్ధం.  అంటే అరవై నిముసములు అన్న మాటే కదా!
ఈ స్కందము ఇంకా గ్రహముల గూర్చి, గ్రహచలనముల గూర్చి, నక్షత్ర మండలము గూర్చి తెలుపుతుంది.  అంతే కాక వీనికి మానవ దైనందిన జీవితమునకు గల అవినాభావ సంబధమును గూర్చి తెలుపుతుంది.
అనన్య ప్రతిభావంతులైన ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు మొదలగు మహామహులు ఈ జ్యోతిష శాస్త్రమును గూర్చి అనేక గ్రంథములను రచించుటయే కాక  ఏనాడో అంటే పాశ్చాత్యులకంటే ఎన్నో శతాబ్దాల ముందే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూవున్న వేద ప్రామాణికమైన విషయముల గూర్చి విశదముగా, వివరముగా తెలియబరచినారు.
ఇక మూడవది ‘సంహిత స్కందము’ ఇందు భూగర్భ జలాలు, గనులు, గృహనిర్మానాది వస్తు విషయములు మరియు శకున నిమిత్తముల గూర్చి తెలియబరుపబడుతుంది.  పైన తెలిపిన విషయములలో శకున నిమిత్తముల మాత్రము స్పృశించి చివరి వేదాంగము వద్దకు చేరెదము. 
‘శకునము’ అంటే ‘పక్షి’ ఇందు వివిధ రకములైన పక్షి భాషలు, మనమేదైనా పనికి బయలుదేరునపుడు, ఒక దిశ నుండి వేరొక దిశకు పోవుట వల్ల కలుగు ఫలితమేమి, జంతు జాలము యొక్క నడకలు, నడతలు, అరుపులు, హావభావాలు మొదలగు వానిని మనము మన భవిష్యత్తుకు ఏవిధముగా అన్వయించుకొనవలెను అన్నది తెల్పుతుంది.
ఇక నిమిత్తమంటే జరుగవలసినది ముందే నిర్ణయింపబడి వుండుట.  అంటే ఇది భావిష్యద్వాణి.  ఇది తెలుసుకొన్న వారు పరితాప పడుటకు బదులు పరిహారమునకై ఆలోచన చేస్తారు.  కావున ఒక సత్కార్యము చేయుటకు చక్కటి ముహుర్తము కడుంగడు అవసరము.  అందువల్ల జ్యోతిష్యాన్ని వేదపురుషుని నయన ద్వయంగా చెబుతారు.  అసలు జ్యోతిషానికి ‘నయన’మన్న మరోపేరు వుంది.  ‘నయ’ అంటేనే దారి చూపుట అని అర్ధం.
6.కల్పము         
ఇంత వరకు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషములను గూర్చి పరిచయం చేసుకోన్నాము.  ఇక ఈ ఐదు అంగాలనూ ఆచరణలో పెట్టుటకు కల్పము తోడుకావాలి.  ఆశ్రమ ధర్మముల ననుసరించి అంటే బాల్య, కౌమార,యవ్వన, వార్ధక్య ఆశ్రమాలలో ఏ కర్మ ఎప్పుడు చేయవలె, ఏ మంత్రము ఏ కర్మయందు వుపయోగించవలె, ఏమేమి సామగ్రి వాడవలె, ఆకర్మకు అధిష్ఠాన దేవతలెవరు, ఎంతమంది ఋత్విక్కులు వుండవలెను అన్న విషయములేకాక ఇంకా ఎన్నెన్నో విషయముల గూర్చి తెలుపును.
భరద్వాజ, ఆపస్తంబ, బోధాయనాది మహర్షులు కల్పక సూత్రములను గ్రంథస్తం చేసినారు.  దహన సంస్కారము కుడా ఈ కర్మలలో ఒక భాగమే.
దీనిని వేదపురుషుని బాహువులుగా అభివర్ణించినారు. 
ఈ షడంగములు మరియు మీమాంస, నయ, పురాణ, ధర్మ శాస్త్రములనబడు నాలుగు ఉపాంగముల సాయముతో వేదాధ్యయనము  గావింపబడుచున్నది.  వేదములు నాల్గింటితో కలిపి వీనిని చతుర్దశ విద్యలనుచున్నారు. 
ఇంకా ఈ విద్యలు అభ్యసించి అనుష్టించు మహితాత్ములచే ఈ ప్రపంచము సక్రమమైన దిశలోనే ఇంకా పయనించుచున్నది.
‘అనంతా వై వేదా’  అంటే వేదాలు అనంతాలు అన్న దెంత నిజమో ఆ వేదాలను గురించి చెప్పుట కూడా అనంతమన్నది అంతే నిజం. 
అంతా తెలియదు.  కావున, తెలిసిన కొంతలో కొంత తెలియబరచి ఈ వ్యాసాన్ని ఈ వేద వాక్యంతో ముగిస్తున్నాను.
భద్రం కర్ణేభీః శ్రుణుయామ దేవాః
భద్రం పశ్యే మా క్షభిర్య జత్రాః
స్థిరై రంగైస్తు ష్టువాగం సస్తనూభీః
వ్యశేమ దేవ హితం యదాయుః
అర్ధము:        మా చెవులు శుభప్రదములైన విషయములే వినుగాక.  మా కళ్ళు శుభస్కరమైన విషయములనే చూచును గాక.  ధృడమైన అవయవములు గలిగిన శరీరముతో అహరహము (మిమ్ము) స్మరిస్తూ ఈ జీవితాన్ని దేవహితార్ధమే గడుపుదుము గాక.
స్వస్తి

చెఱకు రామ మోహన్ రావు 

No comments:

Post a Comment