ఈ వ్యాసమునునేను క్లుప్తముగా 12\8\2013 లో వ్రాయుట జరిగినది. ఇపుడు దానిని విస్తరించుతూ నా శక్తికి తగిన విధముగా సందేహ నివృత్తి గావించుతూ వ్రాసిన ఈ వ్యాసము శ్రద్ధాళువులను ఆకర్షించుతుందని నా నమ్మకము.ఈ వ్యాసము వ్రాయుటకు ఆలంబనము శ్రీయుతులు వింజమూరి వెంకట అప్పారావు గారు మరియు, కీర్తి శేషులు VVS శర్మ గారు. నాకన్నా పెద్దవారయిన వారిద్దరికీ మనః పూర్వక నమస్కారములు ఘటించుచున్నాను.
తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్
తిరుమల
వేంకటేశ్వరుడు -2వ భాగము
ఇక ఆ పరమాత్మ
మొదట ఆటవికుల దేవునిగా ఉండినాడు అనుటలో నాకు అఔచిత్యము కనిపించుట లేదు. భీతిని
గూర్చు భయంకర మృగములకాలవాలమై, పాంథులకు గమ్యము పారదర్శకము కానిదై, ఆహస్సునే నిశమా
అను భ్రమ కలిగించునదై యున్న ఆ దుర్గమభీకరారణ్య మధ్యమును ప్రవేశించు సాహసులు
ఎంతమందిని మనము జనావాసములందు చూడగలము. అటువంటప్పుడు అక్కడ ఉన్న ఆటవికులే ఆయనను
కొలిచే అవకాశము ఉంటుంది. అంతకు తప్పించి వేరేమీ నాకు గోచరమగుట లేదు. వీరు ఈ
మూర్తిని శరభేశ్వరునిగా కొలిచేవారు. శరభము అన్న పదమునకు అర్థము ఎందరకు తెలుసునో
నాకు తెలియదు కానీ, శరభము అన్నది నేటి కాలమున అగుపించని వింత
మృగము. సింహము కన్నా భయంకరమైనది. రెక్కలు కలిగి ఎగురగలిగే సామర్థ్యము కూడా
ఉంటుంది. శరభేశ్వరునికి సంబంధించిన ఒక ఐతిహ్యము ఈ విధముగా ఉంది.
ఆగ్రహోదగ్రుడైన
నరసింహ మూర్తి హిరణ్యకశిపుని తెగటార్చిన పిదప రోషారుణ నేత్రములతో, పర్వత కాయముతో, కంపించు
శరీరము కలవాడై, భీకరముగా గర్జించుచూ ప్రహ్లాదాది భక్తగణమునకు,
ఇంద్రాది దేవతలకు కళ్ళు తెరచి చూచుటకే వీలుకాని రూపమును
కలిగియుండుటచే వారు ఈశ్వరుని ప్రార్థించగా ఆయన ప్రోగుపోసిన ఆభీలమై శరభాకృతి గల్గిన
మానవ శరీరమును దాల్చి నారసింహుని ఎదుట ప్రకటితమగుటతో ఆయన కోపము చల్లారినదట. అందుచే
ఆటవికులు, జంగమ దేవరలు వీరంగము అన్న ఒక విధమగు లయను కల్గిన
చిందులు వేస్తూ వుంటారు. దానిని గూర్చి ఈ నాల్గు మాటలు చదవండి.
శరభ, శరభ:
వీరు
శివరాత్రి పర్వదినాలలో వారున్న గ్రామంలో బండ్ల మీద ప్రభలు కడతారు. వీటిని వీథి
వీథికి ఊరేగిస్తారు. శివాలయం వద్దకు చేరుస్తారు. శరభ, శరభా, దశ్శరభ శరభా
అంటూ జంగందేవర వేషు కట్టి ప్రభముందు, సన్నాయి వీరంగానికి అనుగుణంగా నృత్యం చేస్తారు.
ఇది ఎంతో ఆవేశంతో కూడుకుని వుంటుంది. కొంత మంది పులితోలు కట్టుకుని పెద్ద పులి
నృత్యం చేస్తారు. మరి కొంత మంది రంగు రంగుల గుడ్డముక్కలతో నిలువుటంగీ తొడిగి
విభూది రేఖలను తీర్చి దిద్దుకుని, లింగము కాయను మెడలో ధరించి శివరాత్రి పర్వ దినాన నృత్యం చేస్తారు. వీరు నాటి
తిరుమలలోని ఆ మూర్తిని శివుడు అని నమ్ముటకు మరియొక కారణము విగ్రహము నొసట మూడవకన్ను
కలిగియుండుట అదికాక పరమాత్మ నయనములు నిమీలితములై ఉండుట. విష్ణు విగ్రహములు, అర్ధ నిమీలితములై ఉంటాయి లేకుంటే పూర్తిగా
తెరువబడే ఉంటాయి. ఎందుకంటే అవి సూర్య చంద్రులుగా అభివర్ణించబడినాయి. శంకరునివలె యోగ ముద్రలో విష్ణువు ఉండడు. ఇక్కడ విగ్రహము
యొక్క నేత్రములు నిమీలితములై ఉండుటయే గాక నొసట మూడవకన్నుగూడా ఉన్నది. మరి వారు ఆ విధముగా
తలుచుటలోనూ కొలుచుటలోనూ తప్పు కనిపించదు.
అందువలన వరాహ
పురాణంలో వెంకటేశ్వరస్వామిని గిరిజన జాతులకు చెందిన దేవతగా అభివర్ణించిన విషయంను
నేను జీర్ణించుకోలేక పోయినాను. వాస్తవముగా ఆమాట అందులో ఉందా లేదా నాకు తెలియదు. అందుచేతనే నా తర్కమునకు అందినంతవరకు, నేను సంపాదించిన వివరముల మేరకు నాకు తెలిసినది
తెలియజేసినాను. తమిళ ప్రాచీన కావ్యం 'శిలప్పది కారమ్''లో తిరుమల
గురించి ప్రస్తావించబడి ఉన్నందున, ఒకటవ శతాబ్దము నాటికే
విగ్రహం ఉండవచ్చన్న అభిప్రాయం కొందరిలో ఉంది. మరి ఈ విషయమును ఉటంకించిన గ్రంధములలో
‘భూ వరాహ స్వామి’ ప్రస్తాపన లేదు.
ఈ సందర్భముగా
నేను ఆంద్ర భూమిలో వచ్చిన ‘తిరుమల వరాహస్వామికి సంబంధించిన ఒక వ్యాసములోని
మనకవసరమైన భాగమును యథాతథముగా మీముందుంచుచున్నాను.
శ్రీ
వరాహస్వామిని తొలుత దర్శిస్తేనే శ్రీ వేంకటేశుడు కూడా సంతసిస్తాడు
వరాహ దర్శనా
త్పూర్వం శ్రీనివాసం నమేన్న చ
దర్శనా త్ప్రా
గ్వరాహస్య శ్రీనివాసో న తృప్యతి
అంటే శ్రీ
వేంకటేశుని తొలి దర్శనం సాక్షాత్తూ స్వామివారికి సైతం అప్రియం. క్షేత్ర సంప్రదాయం
ప్రకారం శ్రీ వరాహస్వామిని దర్శించిన తరువాతే శ్రీస్వామి వారిని దర్శించడం
ఫలప్రదం.
చారిత్రక
నేపథ్యం
శ్రీ
వరాహస్వామి ఆలయ ప్రాచీనతకు సంబంధించిన వివరాలకు ఆధారాలు లేవు. అయితే తొలిసారిగా క్రీ.శ 1380 కాలం నాటి శాసనంలో
శ్రీ వరాహస్వామి ‘‘ వరాహ నాయనార్’’ గా పేర్కొనబడినాడు.
నాయనార్లు
క్రీ.శ 5 మరియు 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించినట్లుగా
చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన
తమిళ ప్రబంధం పెరియపురాణంలో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష
సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా
భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని
దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు. ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ
మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది
నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. (వికీ)
మిగతది
మరొకమారు ..........
తిరుమల
వేంకటేశ్వరుడు - 3వ భాగము
అటు తరువాత
కీ.శ 1476వ నాటి శాసనంలో వరాహస్వామిని ‘‘జ్ఞానప్పిరాన్’’ అని పేర్కొన్నారు. అంటే
వరాహస్వామిని దర్శించిన భక్తునికి శాశ్వత జ్ఞానోదయం లభిస్తుందని ప్రశస్తి అటు
తరువాత ఆనంద ప్రదాతయగు శ్రీ వేంకటేశుని దర్శించిన భక్తునికి శాశ్వత ముక్తి
లభిస్తుందన్నది ఆర్యోక్తి. క్రీ.శ 1481లో ‘‘ ఆది వరాహ పెరుమాళ్’’ అని తొలిసారిగా
శ్రీ వరాహస్వామిని పేర్కొనడం జరిగింది. క్రీ.శ 1800లో బ్రిటీష్‌వారు ఆదాయం తక్కువ
ఉన్న కారణంగా ఈ వరాహస్వామి ఆలయ పర్యవేక్షణను నిర్లక్ష్యం చేశారు. అయితే కీ.శ 1900
సంవత్సరం ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని మహంతు ప్రయాగదాసు భక్తి
శ్రద్ధలతో పునరుద్ధరించాడు. అటు తరువాత 1982 ఏప్రిల్ 21 నుంచి 26 వరకు అప్పట్లో ఈ
ఆలయానికి తి.తి.దే మహా సంప్రోక్షణను ఘనంగా నిర్వహించింది. మూల విరాట్లు వేధిక
ఎత్తును పెంచడం, స్వామివారి చుట్టూ బంగారు మకర తోరణాన్ని అమర్చడం, ఆలయంపై పెద్ద
విమానాన్ని నిర్మించడం, బంగారు కలశ స్థాపన వంటి కార్యక్రమాలను ఘనంగా
నిర్వహించింది. అప్పటినుంచి ఆది వరాహక్షేత్రమైన శ్రీ భూవరాహస్వామికి అఖండమైన
పూజాది కార్యక్రమాలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతున్నాయి.
మరి పై రచనలో
ఎక్కడా వరాహ స్వామి విగ్రహమును స్వయంభు అని అనలేదు. పైగా తొలిసారిగా క్రీ.శ 1380 వరకు ఆయన వివరము
తెలియకుంటే మరి వెంకటేశ్వరా విగ్రహమునకంటే అది పురాతనము కాజాలడు. అంతకు ముందు
కాలము నాటి శాసనములు ఏవీ శ్రీ
వరాహస్వామిని గూర్చి తెలిపినట్లు తెలియుట లేదు. పైపెచ్చు పైన తెలిపిన ‘వరాహ
నాయనార్’ అన్న పదము శివభక్తి తత్పరతను వ్హాతుచున్నది. మరి ‘నాయనారు’ళ శివభక్తులు
కదా! దీని భావమేమి తిరుమలేశా!
ఇక ఇంకొక
ముఖ్యమైన విషయమును మీ ముందుంచుతాను.
ధ్వజస్తంభమునకు
ఈశాన్యాన చిన్న శిలాపీఠం మీద క్షేత్రపాలక శిల కన్పిస్తుంది. రుద్రుడు తిరుమల
క్షేత్రపాలకుడు. తెల్లవారుజామున స్వామి కైంకర్యానికి వస్తున్నప్పుడు, ఏకాంత సేవ తర్వాత ఇంటికి వెళ్లిపోతున్నప్పుడూ,
అర్చకులు తాళాలను క్షేత్రపాలక శిలకు తాకించుట ఒక నియమమము.
ప్రతి
క్షేత్రానికి ఒక క్షేత్ర పాలకుడున్నట్లే, తిరుమలకు క్షేత్రపాలకుడు రుద్రుడు అని పైన
చెప్పుకొన్నాము. సాధారణంగా ప్రతిష్ఠించిన లింగములు ఏటూ కదలవు. కానీ , ఈ క్షేత్రపాలక
లింగము పలుమార్లు, పలు ప్రదేశములకు తరలించబడింది. మొదట ఈ లింగము
సంపంగి ప్రదక్షిణమార్గమున ఉండేది. అక్కడ సంపెంగ మొక్కలు విరివిగా ఉండుటచే ఆ
ప్రదేశానికి సంపెంగ మార్గము అన్న పేరు ఏర్పడింది. పార్వతీదేవికి సంపెంగ పువ్వులంటే
చాల ఇష్టము. అందుకే పరమ శివుడు తన బార్యకు ఇష్టమైన చోటే కొలువైయుండినాడేమో! అనంతరం
ఆ లింగ రూప క్షేత్ర పాలకశిల సంపెంగ మార్గము నుండి ధ్వజస్తంభము వద్దకు
తీసుకురాబడినది. ఒకసారి పూర్ణశిల (రాతి గుండు) రాత్రి సమయంలో ఆలయం చుట్టూ తిరుగుతూ
వుండగా, ఒక చిన్న పిల్లవాడు ప్రమాదానికి గురియై పరమపదించుటచే, క్షేత్ర
పాలక శిల అంశావతారాన్ని మాత్రమే ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర వుంచి, పూర్ణ స్వరూపాన్ని
గోగర్భం (పాండవతీర్థం) దగ్గర ఉంచినట్లు చెబుతారు. క్షేత్ర పాలకుడైన శివుడు తిరుమల
ప్రధాన గర్భాలయం ఎదురుగా గల ధ్వజస్తంభం దగ్గర శిలగా అంశ రూపంలోనూ, ప్రస్తుతము 'గోగర్భ క్షేత్రము' గా పిలవబడుచున్న 'పాండవతీర్థము' దగ్గర పూర్ణ స్వరూపంతోను భక్తులకు
దర్శనమిస్తున్నాడు.
ఈ పద్ధతులు, ఈ కథలు, ఎటుదిరిగీ ఎదో ఒక రూపమున శివుని పూజించడమూ జిజ్ఞాసువుల హృదయములలో
ఎన్నో నిరుత్తర సందేహములకు దోహదములైనాయి. ఎవరో శివాలయాలకు విష్ణువు విష్ణ్వాలయాలకు
శివుడు క్షేత్రపాలకులుగా ఉంటారన్నట్లు వ్రాసినారుకానీ నాకు అటువంటి ప్రధాన
పుణ్యక్షేత్రము కంటబడలేదు ఒక్క తిరుమల తప్ప. బహుశ సింహాచలములో కూడా ఇదే పరిస్థితి
ఏమో! ఇది వాస్తవికతకు చాలా దూరమనే నాకనిపిస్తుంది.
విష్ణువు
యొక్క దశావతారములలో ఒక్క నారసింహావతారము తప్ప మిగత విష్ణు క్షేత్రములన్నీ నదీ
తీరములలో గానీ సముద్రతీరములలో గానీ ఉంటాయి. శివాలయములు కొండలు కొనలలోనే వుంటాయి.
అసలు అందువల్లనే ఈశ్వరుడు వెంకటేశ్వరుడైనాడేమో! ( వెంగడం=దుర్గాటవీగ్రావములు అంటే
క్రిక్కిరిసిన వృక్షసంపద, భయంకర
అటవీ మృగములు కలిగిన కొండల వరుస అని అర్థము అన్న విషయమును ముందే చెప్పుకొన్నాము.)
వేం= సమస్త
పాపాలను, కట=దహించునది కావున కావున వేంకటాద్రి. వేం= అమృతత్వాన్ని, కట=
ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువల్ల వేంకటాద్రి అన్న అన్వయములను కొందరు
ఉటంకిచుతారు కానీ అవి వాస్తవికతకు దూరమని నాకనిపిస్తుంది పైగా ఆవిధమగు అర్థములు
ఉన్నట్లు పండితులు సాదికారముగా చెప్పినట్లు నేను చదువలేదు. ఈ విషయము గమనించండి.
స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి
పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది. మరి అంతటి ఘోష శివుని జటాజూటము నుండి
పతనమగు గంగకే కదా సాధ్యము.
గర్భగుడిలో
నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం
ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు. జలపాతము అన్న ప్రస్తాపన కూడా
ఇక్కడ వస్తూవుంది. మరి ఇది శివునికే కదా సాధ్యము.
ఇక
ఎడుకొండలగూర్చి ఒకమాట.
శ్రీ
వెంకటేశ్వర సుప్రభాతమును 15వ శతాబ్దములో మనవాళ మహాముని శిష్యుడగు ప్రతివాద భయంకర
అణ్ణన్ వ్రాసినాడు. అందున్న ఈ శ్లోకమును గమనించండి.
శ్రీ శేషశైల
గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి
వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం
త్వదయవసతే రనిశం వదంతి
శ్రీ
వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 15
తా. ఓ
వేంకటేశ్వరా! నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి
మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక. 7వ కొండ
పేరు చెప్పలేదు.
సప్తగిరులు:
*శేషాద్రి, నీలాద్రి, *గరుడాద్రి, అంజనాద్రి, *వృషభాద్రి,
*నారాయణాద్రి మరియు *వేంకటాద్రి. (వికీ పీడియా)
సుప్ర భాతములో
తెలిపిన 'వృషాద్రి' వికీ పీడియా లో లేదు. వికీ పీడియా లో తెలిపిన 'నీలాద్రి, అంజనాద్రి' సుప్రభాతములో లేవు. అసలు ఈ సప్తగిరులకు
సంబంధించి కొన్ని దశాబ్దముల క్రిందట 2 శ్లోకములు చదివి యుండినాను. ఇపుడు నా
స్మృతిలో లేవు. ఎంత వెదకినా కలన యంత్రములో (Computer) దొరుకలేదు. ఆ రెండు శ్లోకములలో కనిపించేవి
కొన్ని, వేరువేరుగా కనిపించేవి మరి కొన్ని. మొదటి శ్లోకములో 'వెంకటాచలము లేదు. మరి అధునాతనమైన వెంగడము నుండి పుట్టిన వెంకటాచలమునకు పౌరాణిక ప్రతిపత్తిని ఆపాదించలేము కదా! మరి
వాస్తవమేమిటో పరిశోధకులు తేటతెల్లము చేయవలసి యున్నది. ఇక్కడ మనము మరియొక విషయమును
గూర్చి ఆలోచించవలసి యున్నది. పైన తెలిపిన సుప్రభాత శ్లోకము శ్రీతో మొదలౌతుంది.
తిరుమల మొదలు శ్రీశైలము వరకూ గల ఈ పర్వతశ్రేణిని శ్రీగిరి,
శ్రీశైలము అనే పిలిచేవారు. తెలుగులోనైనా అరవము లోనైనా కొండని ‘మల’
‘మలై’ అనుట కద్దు. తమిళమున ‘శ్రీ’కి బదులుగా ‘తిరు’ అన్న శబ్దమును వాడుతారు. మనము
అనగా తెలుగువారము ‘శ్రీరంగము’ అంటే తమిళులు ‘ తిరు+అరంగం=తిరువరంగం’ అంటారు. ఆ
విధముగా ‘శ్రీ శైలమును’ భగవద్రామానుజులవారు ‘తిరుమల’ చేసినారు. అసాంతము సర్పాకృతి
కలిగిన ఈపర్వతము తల ‘తిరుమల’, కటి ప్రదేశము నారసింహ
క్షేత్రమగు ‘అహోబిలము’ (నారసింహుని మలమును జూచి అహోబల అని,
ఆయన హిరణ్యకశిపుని దునుమాడుటచే ‘ఆహోభళ’ అని అనుటచే ఆ ప్రసంతము
‘ఆహోబలమై’ లేక ఆహోభళ’మై కాలాంతరములో ‘ఆహోబిలము’గా రూపాంతరము చెందినది.) పృచ్ఛ (తోక) భాగము ‘శ్రీశైలము’. ఇదంతా ఎందుకు
చెప్పుకువచ్చినానంటే ‘శ్రీ’ అన్నది కూడా ఒక పర్వతము పేరుగా తీసుకొంటే అప్పుడు 7
పర్వతములౌతాయి. అందుకే ఆయన ‘శ్రీనివాసు’డైనాడేమో! పైగా ‘సుప్రభాతము’ రామానుజులవారి
12వ శతాబ్దము తరువాత వ్రాయబడినది (14వ శతాబ్దము) కాబట్టి పై శ్లోకములో
‘వెంకటాద్రి’ చేరినది. ఇంకొక ముఖ్యమైన విషయము ఏమిటంటే విష్ణు సహస్ర నామ
స్తోత్రములో ‘వెంకటేశ్వర’ ‘శ్రీనివాస’ శబ్దములు లేవు. అంటే ఈ వాదములన్నీ
కాలాంతరమున కలిగినవే కదా! ‘శిలప్పదికారం’ 11వ విభాగములో 41 నుండి 51 వరకు వున్న
ద్విపదలలో ఆ విగ్రహమునకు శంఖ చక్రములున్నట్లు వున్నది. మరి ఉంటే ప్రతిరోజు
అమర్చవలసిన అవసరము లేదు కదా! పైపెచ్చు గురువారమునాడు మస్నాము, స్వామివారి నిరాభారణ దర్శనము చేసుకొంటే ఈ వాస్తవము
మనకు తెలియవస్తుంది.
ఇక శ్రీయుతులు
అప్పారావు గారి సందేహ నివృత్తికై శంకరులను గూర్చి వారి అద్వైతమును గూర్చి కాస్త
తెలియజేసుకొంటాను.
తిరిగీ మరొకమారు కలుద్దాం......
తిరుమల వేంకటేశ్వరుడు
– 4వ భాగము
శంకరాచార్యులవారిది
‘అద్వైత సిద్ధాంతము’.
శాస్త్రము అద్వైతమును 'న
ద్వితీయే ఇతి అద్వైతం' అంటుంది
. ఆ ఏకైక తత్వమే పరబ్రహ్మ అంటుంది . కానీ ఈ పరబ్రహ్మ వాచామగోచరము. మరి ఈ విగ్రహమో
వాచా గోచరము. విగ్రహము పైన మనఃస్థిరత సాధించితే సాధకుడు అప్పుడు విశ్వ వ్యాపియన
భగవంతుని అందరిలోనూ అంతటానూ చూడగలుగుతాడు. అసలు తనలోనే పరమాత్మను చూడ గలుగుతాడు.
విష్ణు నామముగా భావించేహరి అన్న ఒక్క శబ్దానికి అనంతమైన అర్థాలునాయి. అసలు హరి
యన్నా హరుడన్నా హరించే వాడే. ఏమిటి హరిస్తున్నది అంటే మన అన్వయాన్ని బట్టి
ఉంటుంది. అప్పుడు మనము ఈ విగ్రహాన్ని ఆ పరబ్రహ్మ కే అనుసంధించుకొంటే 'ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం సర్వ దేవ
నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి' అన్న శాస్త్ర వచనము లోని నిజమును నిరుపించిన వారామౌతాము. అంతే
కాకుండా ఈ కొండ మస్తకము, పరబ్రహ్మను
సూచించితే (మనము పైననే చెప్పుకొన్నాము ఈ విగ్రహము బ్రహ్మ (సృష్టి) రూపమని
అంటారనికూడా) కటి భాగము విష్ణువుకు(స్థితి) నెలవైతే పృచ్ఛ భాగము శివునికి(లయము) అగుచున్నది. ఈ
పర్వతశ్రేణి అంతటి విశిష్ఠత కలిగి యున్నది. పైగా శంకరుల కాలమునకు ఈ విగ్రహము
వైష్ణవ విగ్రహముగా పరిగణింప బడినట్లు ఎటువంటి ఆధారముల ద్వారా కూడా తెలిసిరాదు.
పైగా జగద్గురువగు ఆయన సాక్షాతూ శంకరుడు మరియు లోక శంకరుడు. కావుననే ఆయన ఏఏ
యంత్రములను ఎక్కడ అవసరమో అక్కడ వుంచినాడు. ఆయన అద్వైతములో శివకేశవ భేదము లేదు.
అసలు ఆయన భాష్యము మొదట భాష్యము వ్రాసిన సహస్రనామము విష్ణువుదే! పైగా వారి రాజముద్రపై
శ్రీమన్నారాయణ అని ఉంటుంది. కావున వారికి తరతమ భేదాలు లేవు. అతి సూక్ష్మముగా
చెప్పవలసి వస్తే అదే అద్వైతము.
ఇక
భగవద్రామానుజులు (1017–1137)
భగవద్రామానుజులవారు
దాదాపు 120 సం. బ్రతికినారు. ఎన్నో ఉత్థాన పతనాలను
అనుభవించినారు. రామానుజులవారు వైష్ణవము నకు ప్రాచుర్యము సంతరింప జేయు వరకు ఆ
మూర్తి వెంకటేశ్వరుని గానే ఆరాధింప బడుచుండినది . రామనుజులవారి గురువు యాదవ ప్రకాశ
యతి(అద్వైతి), రామానుజుల తెలివితేటలపై మాత్సర్యము వహించుటచే
కాలాంతరమున రామానుజులవారు శ్రీ యమునాచార్యుల(అలవందార్ ) వారి శిష్యులై
విశిష్ఠాద్వైతియై అద్వైతము పై ఆగ్రహమేమైనా పెంచుకొన్నారేమో వారి కాలములో
వాగ్స్పర్ధ లేకాక వైష్ణవ మతాంతరీకరణములు దేవాలయ మూల విగ్రహ నామాంతరీకరణములు
జరిగినట్లు పెద్దల వల్ల విన్నాను .
ఏది ఏమైనా
వారికి పూర్వము తిరుమలలోని ఆ విగ్రహాన్ని 6 నెలలు శైవాగమ
విధానము గాను 6 నెలలు వైష్ణవాగమ విధానము గానూ పూజించేవారు .
వారి కాలములో
చంద్రగిరి రాజులు వైష్ణవులైనందువల్ల వారి మాట పై గురుత్వము చేత ఆ స్వయంభూ విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహముగా మార్చినట్లు
తెలియ వచ్చుచున్నది .
శ్రీయుతులు
అప్పారావు గారు వెలిబుచ్చిన సందేహమునకు జవాబుగా నేను విన్న, తెలుసుకొన్న విషయములను తెలియజేస్తాను. ఈ విషయమై
అసలు, వెంకటేశ్వరుని మూలమూర్తిని శివునిగా విష్ణువుగా
బాలాత్రిపురసుందరిగా సుబ్రహ్మణ్యునిగా కొందరు బ్రహ్మగా కూడా అన్వయించుకొనుటకు గల
కారణములను అన్వేషించుదాము . ఈ విశ్లేషణకు ముందు భక్తాగ్రేసరులైన అన్నమాచార్య,
త్యాగారాజాదులు ఈవిగ్రహమునందలి భగవంతుని, తమకిష్టమైన రీతులలో
దర్శించగలిగిన వారేమేమన్నారో చూద్దాము.
వెంకటేశ
పాదాధ్యాయుడై తొలుత అద్యైతియయ్యు పిదప వైష్ణవమును స్వీకరించిన భక్త శిఖామణి
అన్నమయ్య ఒక పదము లోని పాదములో ఏమన్నారంటే :
'కొలుతురు
మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు
మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము
శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
సరి నమ్ముదురు
శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు
మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే
అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే
ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు'
అదేవిధంగా పరమ
రామ భక్తుడైన త్యాగరాజు గారు తన కృతి లో'శివుడవో మాధవుడవో' అని ప్రశ్నిస్తాడు .
ఇక
విషయానికొస్తే ఈ విగ్రహాన్ని 'అమ్మ' అనుకొనుటకు గల
కారణమేమంటే
ఔత్తరాహికులు
ఈ మూర్తిని అనాది నుండి 'బాలాజీ' అనే సంబోధిస్తారు .'జి' అనేది మర్యాద సూచకము. రాజగోపుర ప్రాకారానికి నలువైపులా యుండే సింహ
విగ్రహాలు సింహవాహినీ తత్వాన్ని మనకు సూచిస్తాయి. శుక్రవారములందు ఈ విగ్రహానికి
అభిషేకాలు జరుగుతాయి. ఆరోజు విగ్రహానికి చీర కట్టడం జరుగుతుంది. అమ్మవారికి జరిగే దసరా ఉత్సవాలు
ఈ మూర్తికి జరుగుతాయన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. అంతేకాక ఉత్తుంగమైన వక్షస్సు, చూపు మరల్చుకో
లేని ముఖ వర్చస్సు, విగ్రహపు వేనుకవైపునుండే ధమ్మిల్లము(కొప్పు) ఇత్యాదులు 'అమ్మ' నే సూచిస్తాయి కదా. విగ్రహము నెత్తిపై చిక్కుపడని నిజమైన కురులను నేటికినీ
మనము చూడవచ్చు.
ఇక
శివుడనుకోడానికి గల కారణమేమంటే ఆ మూర్తికి అభిషేకము జరుగుతుంది బిల్వదళ పూజా జరుగుతుంది. 'అలంకార ప్రియో విష్ణుః అభిషెక ప్రియో శివః' అన్నది ఆర్యొక్తి. ఆ మూర్తి కి చేతులకు
నాగాభరణాలున్నాయి. శంఖచక్రములు లేవు. అర్చకులు వానిని అనుదినము అలంకరించుతారు. ఈ విగ్రహములో త్రిశూలాది చిహ్నములు కుడా వున్నాయని
పెద్దలు వాక్రుచ్చుతారు. ఉరమునందు లక్ష్మీదేవిని అమర్చుతారు తప్పించి ఉరమున
లక్ష్మి అమరి లేదు.
స్వామి చరణముల
శరణు కోరమన్న విధముగా ఉండే హస్త ముద్ర అది విష్ణు విగ్రహమని తెలుపుతుంది. కేవలము శివుడే ఐతే లింగరుపము లో ఉండవలెను కదా!
వీటన్నిటికంటే
ఇంకొక ముఖ్య విషయమేమిటంటే ఈ విగ్రహము సుబ్రహ్మణునిది అన్న ఆలోచన కలిగించేది . గుడి
ప్రక్కనే వున్న కొలనును 'స్వామి
పుష్కరణి' అంటారు .
నిరుక్తము సుబ్రహ్మణ్యుని
పేర్లను ఈ విధంగా చెబుతుంది.
'దేవసేనాపతిః
శూరః స్వామీ గజముఖానుజః ... 'అంటే ఇక్కడ 'స్వామి' అన్న పేరు ఆయనకున్నది అని తెలుస్తున్నది. కొండ మీద 'కుమార ధార' అన్న తీర్థము కుడా వున్నది. ఇక కటి హస్తము కుమారుని విగ్రహములకు
మాత్రమే ఉంటుందని పెద్దలు చెబుతారు. నేను మద్రాసులో పనిచేసే కాలములో నాకు
బ్ర.శ్రీ. బాలకృష్ణ శాస్త్రిగళ్(గళ్ అంటేనే గారు అని అర్థము తమిళములో) తో
పరిచయమైనది. అప్పటికే ఆయన చాలా పెద్దవారు. ఆ కాలములో ప్రతి రోజూ ఆయన ఉపన్యాస
సారమును The Hindu లో ప్రచురించేవారు.
ఎన్నేన్నో ఆకాశవాణి ప్రసంగములను చేసినారు. జీవితమును భగవత్ సేవలో గడుపుటకు
స్వచ్ఛందముగా భారతీయ స్టేట్ బాంక్ అధికారి హోదాకు రాజీనామా ఇచ్చినారు.(మొదట Imperial
Bank అటుపిమ్మట State Bank Of India లో అధికారిగా
ఉద్యోగము చేసేవారు.) మాటల వరుసలో ఆయన చెప్పిన ఈ విషయమును గమనించండి:
తలనీలాలు
సమర్పించే సాంప్రదాయము కుమారస్వామికి ఉన్నదని వారు చెప్పగా విన్నాను. తమిళనాడులో
స్కంద పూజ ఎక్కువ. తమిళములో స్కందుని గూర్చి వ్రాసిన అనేక తమిళ గ్రంధములలో
విష్ణువు
నదీతీర ప్రాంతాలలో వెలిస్తే సుబ్రహ్మణ్యుడు కొండలపైనే ఉంటాడట. 1.తిరుపరన్ కున్రం, 2.
తిరుచ్చందూర్ (ఇక్కడ మాత్రమె స్వామీ సతీసమేతంగా దర్శనమిస్తాడు. శూరపద్ముడు అన్న
రాక్షసుని మట్టుపెట్టేందుకు సైన్యముతో సహా ఇక్కడ ఆయన విడిది చేసినట్లు చెబుతారు.
అందుచే ఈ గుడి సముద్రతీరమున ఏర్పడినది. నేటికి కూడా ఈ శూర సంహారమును తమిళులు ఎంతో
వైభవముగా జరుపుతారు), 3. పళని (ఇక్కడ స్వామీ వటువు గా దర్శనమిస్తాడు.
ఈయన కొన్ని చిత్రములలో ముండిత శిరస్కునిగా (గుండు చేయించుకొని) కూడా ఉంటాడు. (ఈ
గుండు చేయించుకొనే సాంప్రదాయమును గూర్చి తమిళములో అనేక స్కంద గ్రంధములలో
అగుపించుతుందని బ్ర.శ్రీ.బాలకృష్ణ శాస్త్రిగళ్ చెప్పినారు.) కూడా దర్శనమిస్తారు.
4. స్వామిమలై, 5. తిరుత్తణి. 6. పళముదిర్చూళై. ఒక్క తిరుచందూర్
తప్పించితే అన్నీ కొండలపైన ఉండేవే! మరి ఈ విషయములు ఆ పరమాత్మ విగ్రహమును స్కంద
విగ్రహముగా బలపరచుతాయి.
మిగతది మరొక్కమారు........
తిరుమల
వేంకటేశ్వరుడు – 5వ భాగము (చివరి భాగము)
తిరుమలలో
స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ, నిజానికి ఆయన
గర్భగుడి కుడివైపు ఒక మూలలో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు
భోధపడుతుంది. మరి అప్పుడు విగ్రహము వెనుక భాగమున ఎదో రహస్యము ఉన్నదని సామాన్య
భక్తుడు ఊహించుకోవలసి వస్తుంది కదా!
స్వామివారికి
ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు ఇది అందరికీ తెలిసిందే!
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాదాపు 50 వేల ఖరీదు చేసే శ్రీవారి సేవ ఒకటుంది (ఇది
బహుశా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన సేవ). అంత సులభముగా అందుబాటుకు రాని ఈ
సేవలో పాల్గొన్న భార్యాభర్తలకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు.
క్రీ.శ. 1800
వ శతాబ్ధంలో గుడి పన్నెండేళ్లపాటు మూసేశారట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి
దగ్గర తప్పు చేసినందుకుగానూ హతమార్చి గోడకు వ్రేలాడదీశాడట. ఆ సమయంలోనే విమాన
వెంకటేశ్వర స్వామి విగ్రహము వెలసిందని చెబుతారు. (telugu.nativeplanet.com)
చారిత్రక
ఆధారములను పరిశీలించినట్టయితే క్రీస్తుశకము 7వ శతాబ్ది నుండి ఆలయం ఉన్నట్లుగా కనిపిస్తుంది. 7వ శతాబ్ది నాటికి కేవలము స్వామికి నీడగా ఒక నాలుగు
గుంజల పందిరి లాంటి ఆలయం ఉండేదని తెలుస్తున్నది. శాసనాల ప్రకారం క్రీస్తుశకం 9వ శతాబ్ధం లేదా 10వ శతాబ్ధ ప్రారంభంలో గుడి నిర్మాణం జరిగింది.
ప్రారంభంలో
గిరిజన దేవుడిగా అభివర్ణించబడిన శ్రీవారు 3-8 శతాబ్దాలలో
విష్ణువుగా, శివుడుగా, కుమారస్వామిగా పూజించ బడిన ట్లు
సన్నిద్దాళ్వారుల దివ్యప్రబంధాలలో పేర్కొన్నారు. క్రీస్తుశకం 7-8 శతాబ్ధాల
కాలంలో వైష్ణవ క్షేత్రంగా రూపుదిద్దుకున్నది. ఆ తరువాత శైవాన్ని సమర్థించే
చోళరాజుల ప్రాబల్యంతో శైవక్షేత్రంగా రూపుదిద్దుకున్నది. (prajasakti.com). క్రీస్తుశకం 1000-1140 సంవత్సరాల
మధ్యకాలంలో జీవించిన రామానుజాచార్యులు శైవులను ఓడించి వైష్ణవ క్షేత్రంగా మార్చుట
జరిగింది.
తంజావూర్ ను పాలించిన చోళుల కాలములో అనగా కులోత్తుంగ చోళుడు1 (క్రీ.శ. 1070–1120) రెండవ కులోత్తుంగ చోళుడు(1133–1150) కాలమున
అంతకు మునుపు నుండి తిరుమల స్వామి విగ్రహము శివునిగా తలచి పూజలు 6 నెలలు జరిగేవి మిగతా 6 నెలలు
విష్ణువుగా జరిగేవి. నాటి
చంద్రగిరిని
పాలించుచుండిన ఇమ్మడి నరసింహ యాదవ రాయలు వైష్ణవ అనుయాయి. భగవత్ రామానుజులు అప్పటి
అర్చకులతో వాదించి యాదవరాజు మధ్యవర్తి కాగా రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట
ఉంచి, ఆ విగ్రహము ఏ దేవతా రూపమయితే ఆ దేవతా
ఆయుధములు గ్రహించగలదని సంకల్పించి బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, పెట్టి తలుపులు మూయగా తెల్లవారి తలుపులు
తెరిచినపుడు ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. అది నిజమయితే ఆ
ఆయుధాలతోనే పరమాత్మ దర్శనమివ్వవచ్చుకదా! మరి ఇపుడు రోజూ శంఖచక్రములు అమర్చుట
ఎందుకు? ఏది ఏమయినా నాడు ఆ యాదవరాజు
గైకొన్న నిర్ణయముతో తిరుమలలోని
మూలవిరాట్టు శ్రీనివాసుడైనాడు.
ఆయన వాదము
లోని చివరి అంశము ఏమిటంటే గర్భగుడిలో,(
అప్పటికి అంటే 12వ శతాబ్దమునకు గర్భగుడి కట్టబడియుండినది.) శివునికి
సంబంధించిన శూలము డమరుకము మరియు విష్ణువుకు సంబంధించిన శంఖ చక్రములు ఉంచి తలుపులకు
తాళము వేస్తే తెల్లవారి ఆ విగ్రహము ఏ దేవుని ఆయుధములను చేబూనితే ఆవిగ్రహమును
ఆదేవునిగా భావించుదాము అన్న ఒడంబడికకు వచ్చినారు.
ఉదయమే ఆ
విగ్రహము శంఖ చక్రములను చేతబూనినాడట. మరి విగ్రహము చేతిలో అవి అటులనే ఉండవలేనుకదా!
మరి ఈశంఖచక్రాలను రామానుజాచార్యులవారే విగ్రహానికి ప్రతిరోజూ విడిగా అలంకరించుటకు
ఏర్పాటు చేసినారు. తిరుమలను వైష్ణవమునకు మార్చి అందుకు అనుబంధంగా రామానుజులవారు
తిరుపతిని నిర్మింపజేసినారు.
క్రీ.శ. 1336-1681 వరకు
పరిపాలించిన విజయనగర రాజులు తిరుమలకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి పరిచినారు.
వీరిలో 1505 -1576లలో తుళువ వంశీయులైన శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు కాలంలో తిరుమల బాగా వ్యాప్తిలోకి
వచ్చింది.
ఈ విగ్రహమును
గూర్చి ఇంకాస్త లోతుగా పరిశీలించుదాము. ఈ విగ్రహమునకు పచ్చకర్పూరము నిత్యమూ అలదుట
కద్దు (ముఖ్యముగా గడ్డపారతో కొట్టబడినట్లు చెప్పే గడ్డము వద్ద. దీనికి ఉన్న గుణము
విపరీతమగు వేడిమి కలిగించుట. శాతాబ్దములనుండీ అత్యంత వేడిమి కలిగించే ఈ
పచ్చకర్పూరము అలదుచూ ఉండిన బీటలు బారు అవకాశము మెండు. ఈ విగ్రహమునకు అట్టి కీడు
ఎప్పుడూ జరుగలేదు. శివుడు హాలాహలమునే మ్రింగినవాడు పచ్చకర్పూర లేపనము ఆయనకొక లెక్క
కాదు. పైపెచ్చు నేను తెలియబరచినట్లు ఆ విగ్రహము వెనుక మనము జలపాతపు హోరు నిత్యమూ
వినవచ్చు.
ఈ విగ్రహముపై
ఉలి సుత్తె ఉపయోగించిన గుర్తులు కానరావు. ఈ విగ్రహము స్వయంభువనుటకు ఈ నిదర్శనము
చాలు. వేకువ ఝాముననే పాలతోనూ నీరముతోనూ అభిషేకము అనుదినమూ జరుగుతూ కూడా
స్త్నానానంతరము విగ్రహమును తుడిచేవారికి ఆ విగ్రహము వేడిగా చేతికి తగులుచుండుటచే
పరీక్ష చేయించగా ఆ విగ్రహము ఉష్ణోగ్రత 110 డి. F ఉంటుందని
తెలుసుకున్నారు. హాలాహలము మ్రింగిన శివుడు ఉష్ణము తగ్గుటకే కదా నిరంతర జలాభిషేకము.
ఆశ్చర్యమగు
విషయము ఏమిటంటే ఈ విగ్రహమును నేటికినీ అమ్మవారిగా 4రోజులు విష్ణువుగా 2 రోజులు
శివునిగా ఒకరోజు పూజించుతారట. విష్ణ్వాలయములలో పూజకు బిల్వమును వాడరు. అదేవిధముగా
శివాలయములలో తులసిని పూజకు వాడరు. కానీ ఇక్కడ రెండూ వాడబడుతాయి. ఇచట బిల్వమును
ప్రతి శుక్రవారమునాడే కాక మార్గశిరమాసమంతా బిల్వముతోనే అర్చించుతారు.
మార్గశిరము(డిసెంబర్-జనవరి మధ్యకాలము) శివునకు అత్యంత ప్ర్తియమైన మాసము. శివరాత్రి
రోజు ప్రతి ఏడాది క్షేత్రపాలిక ఉత్సవము చేస్తారు. గోగర్భము వద్దవున్న, నేను ఇంతకు మునుపు విశదపరచిన, శిలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకమును నిర్వహించుతారు.అప్పుడు
స్వామికి విభూతి ధారణ చేయించి ఊరేగింపు జరుపుతారు.
ఇక ఆ
విగ్రహములో అమ్మవారి లక్షణములేమున్నాయో చూద్దాము.
ఆ విగ్రహము
నందు సింహ తలాటము, యోగముద్ర,
భోగముద్ర, వరద ముద్ర, కటివిలంబిత
ముద్ర, మెట్టెలు, గొలుసు ఇవన్నీ
చూడగలము. కానీ సామాన్యులమైన మనకు ఆ అదృష్టము లేదు. అది అక్కడి అర్చకులకే
దక్కుతుంది. ఈ కటి విలంబిత ముద్రను మనము కంచి కామాక్షీ విగ్రహమున, తిరువిడైమరదూర్ మూగాంబిగై (పార్వతి), తిరువయ్యారు
ధర్మ సంవర్ధిని, మైలాదుత్తురై మూగాంబిగై,
మరియు
కన్యాకుమారి అమ్మవార్లయందు చూడనగును. అసలు కేరళలోని భారతపాపుజా\ళ నది ఒడ్డున గల భగవతీ దేవి యందు ఇంచుమించు మన
తిరుమల విగ్రహమునందలి అమ్మవారి పోలికలను యథాతథముగా చూడవచ్చును.
విగ్రహమునకు
చీర కట్టుట, శుక్రవార అభిషేకములు, పసుపునీటి స్నానములు, శరన్నవరాత్రి బ్రహ్మోత్సవములు,
51 కలశ స్నానములు (51 శక్తి పీఠములకు ఆనవాలుగా) మొదలగు ఈ అంశములు ఆ
విగ్రహమును అమ్మవారి విగ్రహమని తెలియజేయుచున్నవి.
ఉపసంహారము: నాకు తెలిసి ప్రపంచములోనే అత్యంత మహిమాన్వితమైన
విగ్రహము ఈ తిరుమలాధిపతిది. ఇక్కడి సౌలభ్యము ఏమిటంటే మనసున ఆ మూర్తిని మనము
మనకిష్టమైన ఏ దేవీ దేవతా మూర్తులనైనా తలచుకొని మ్రొక్కచ్చును. కోరికలు తీర్చు
కొంగుబంగారము ఆ విగ్రహము. అచంచల మనోనిగ్రహము ఆ విగ్రహము. సకల దేవతా సంగ్రహము ఆ
విగ్రహము. సకల కళ్యాణ గుణ కదంబము ఆ విగ్రహము,
కామిత వరానుగ్రహము ఆ విగ్రహము, కలి గోమాయు తతి
వ్యాఘ్రము ఆ విగ్రహము, దేశానికి అందు ముఖ్యముగా మనకు ఇచ్చిన
పరమాత్ముని అనుగ్రహము ఆ విగ్రహము. నమ్మండి, మీ దేవుడు
మాదేవుడు అన్న సంకుచితత్వమును వీడండి, అత్యంత భక్తి
ప్రపత్తులతో పూజించండి, ఆ పరమాత్ముని అనుగ్రహముతో భవసాగరమును
తరించండి.
శివుడవొ విష్ణువో
హారివొ చిన్మయివో మరి స్కందమూర్తివో
కవిజన భావ కల్పనల
గమ్యము దాటి చరించు మూర్తిగా
అవిరళ భక్తిభావమున
ఆత్మ దలంచుచు నేను మ్రొక్కగా
ఎవరని ఎంచగావలెను ఏర్పడ
దెల్పుము వెంకటేశ్వరా!
మహాకవి
కాళీదాసు 'ఎకైవమూర్తి
ర్బిభిదే త్రిధాసా ' అన్న మాటతో వెంకటేశ్వరునికి నమస్కరిస్తూ
నిలుస్తాను.
స్వస్తి.
.........
ఓమ్ నమో వేంకటేశాయ
ReplyDeleteఎంతో వివరంగా వ్రాసినారు ఎన్నో కొత్త విషయాలు తెలిసినవి కలియుగ దైవాన్ని గూర్చి
కలియుగ దైవం వెంకన్న వెనుక ఇంత విషయము ఉందని నిజంగా నాకు తెలియదు ఇంత విషయం రాయడానికి మీరు ఎంత కష్టపడి వుంటారో అర్థమవుతుంది
ReplyDeleteస్వామి పుష్కరిణి అంటే ఏమిటో దేనిని అంటారో వివరంగా మీరు తెలిపినారు
శంకరుల గూర్చిగూడా వివరంగా వ్రాసినారు స్వామి విగ్రహం గూర్చి ఆయన శక్తి గూర్చి నాకు మీ రచన ద్వారా ఎంతో తెలిసినది
నాకు స్వామి సేవచేసుకునే భాగ్యం పరకామని ద్వారా కలిగినది అప్పుడు స్వామి వారి విగ్రహం యొక్క వెనకనున్న గొప్పదనం శక్తి నాకు అప్పుడు తెలియదు
ఇన్ని విషయములు తెలిపిన మీకు ధన్యవాదములు sir