Tuesday, 8 March 2022

బ్రతికియుండగనే నేతాజీకి నివాళులిచ్చిన నాటి భారత ప్రభుత్వం

బ్రతికియుండగనే నేతాజీకి నివాళులిచ్చిన నాటి భారత ప్రభుత్వం

https://cherukurammohan.blogspot.com/2019/11/blog-post_25.html

కాంగ్రెసు వారి క్విట్టిండియా పోరాటం కొన్నేంళ్లకే ముగిసిపోయింది. కనుచూపు మేరలో మనలనేలుచున్న బ్రిటీషు వారితో  పోరాటాలూ లేవు. అటువంటి సమయములో సడి సవ్వడి లేకుండా వారు పలాయనము చిత్తగించుట జరిగినది. అంత అర్ధాంతరముగా మనకు స్వాతంత్య్రమును ఇచ్చివేసి వారు ఎందుకు పోవలసి వచ్చినది. GD Bakshi గారి 'Bose: An Indian Samurai' పుస్తకము చదివితే తెలిసివస్తుంది.

India Today Magazine has been able to exclusively access an advance copy of a Knowledge World Publication, 'Bose: An Indian Samurai'. In this book General GD Bakshi quotes from a conversation between former British Prime Minister Clement Attlee and the then Governor of West Bengal Justice PB Chakraborthy. In 1956, Clement Attlee had come to India and stayed in Kolkata as a guest of the then governor. Remember, Clement Richard Attlee was the man, who as leader of the Labor Party and British Prime Minister between 1945 and 1951, signed off on the decision to grant Independence to India.

PB Chakraborthy was at that time the Chief Justice of the Calcutta High Court and was also serving as the acting Governor of West Bengal.

అంటే - ఈనాడు మనము అనుభవిస్తున్న స్వాతంత్య్రం ప్రధానంగా నేతాజీ శౌర్యఫలం. ఆయనే అసలు సిసలు జాతీయ నాయకుడు అని నిస్సంకోచంగా పేర్కొనవచ్చు. బాధాకరమగు విషయమేమిటంటే ఆయన కనీస మర్యాద, మన్ననలకు కూడా నోచుకోలేదేమో అనిపిస్తుంది.

ప్రపంచంలోని ఏ దేశంలోనైనా - విముక్తి పోరాట కాలంలో ప్రజాకంటక ప్రభుత్వం జాతీయ యోధులను వెంటాడి, వేటాడుతుంది. స్వాతంత్య్రము సిద్ధించైనా పిమ్మట అదే యోధులు స్వదేశంలో ఘన నీరాజనాలందుకుంటారు. కానీ స్వాతంత్య్రంవచ్చిన తదుపరి కూడా అట్టి మహానీయులగు జాతీయ వీరులను ప్రమాదకారులుగా పరిగణించి, వారి కుటుంబాల మీద నిఘా పెట్టే తప్పుడు పని చేయుటకు నాటి మన ప్రభుత్వమునకే చేల్లినదేమో!

ప్రజాస్వామ్య విలువలను, ఉదార భావాల మహానాయకునిగా గుర్తింపబడిన మాననీయ  నెహ్రూ గారు బోసు కుటుంబీకులకు, ఆయన సన్నిహితులకు వచ్చే ఉత్తరాలపై నిఘా ఉంచమని, వారి కదలికలను నీడలా వెంటాడమని కేంద్ర గూఢచారి దళాన్ని పురమాయించాడట. ఆయన నిష్ఠగా సాగించిన ఈ నిఘా యజ్ఞాన్ని ఆయన సుపుత్రిక ఇందిర కూడా 1971 దాకా యథావిధిగా నడిపించిందట. ఏ రాజకీయ లబ్ధిని ఆశించి, ఎవరిని సాధించడానికి అయితేనేమి పశ్చిమ బెంగాల్ ఏలిక మమతా దీదీ బయట పెట్టించిన ప్రభుత్వ రహస్య పత్రాల్లో ఈ గుట్టు కాస్తా రట్టు అయింది.

ఇక్కడో సందేహం సహజం.

నేతాజీ బోస్ 1945 ఆగస్టు 18నే ఫార్మోసా వద్ద విమాన ప్రమాదంలో మరణించినట్టు సర్కారు వాఋ ధృవపరచినారు కదా? ఆయన చితాభస్మమని చెప్పబడేదాన్ని టోక్యోలోని రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరచడమూ ఆ రోజుల్లోనే అయింది కదా? తమకు సింహస్వప్నమైన నేతాజీ మరణించినప్పుడు, ఆయన వలె రాజకీయాల్లోకి దూసుకొచ్చి తమకు తలనెప్పి తేగలవారూ ఆయన బంధువుల్లో ఎవరూ లేనప్పుడు నెహ్రు ప్రభుత్వం ఎందుకు భయపడింది? తమ మానాన తాము బతుకుతున్న సామాన్య కుటుంబీకుల కదలికల మీద ఎందుకు గూఢచర్యం జరిపింది?

వారిని చూసి కాదు బెదురు. అసలు భయం నేతాజీకి ఏమయిందన్న రహస్యం దేశవాసులకు ఎక్కడ తెలిసిపోతుందోనని!

1945 విమాన ప్రమాదంలో బోస్ మరణించాడన్న అబద్ధాన్ని 1956 నాటి షానవాజ్ ఖాన్ కమిటీ చేత, 1970 ఖోస్లా కమిటీ చేత నొక్కి చెప్పించినా బూటకపు విచారణలను ఎవరూ నమ్మలేదు. 1999లో కోర్టు ఉత్తర్వువల్ల సుప్రీంకోర్టు మాజీ జడ్జి మనోజ్‌కుమార్ ముఖర్జీతో ఏర్పాటైన విచారణ కమిషన్ విమాన ప్రమాదం అబద్ధం, ఆ తరవాత కూడా నేతాజీ బతికే ఉన్నాడు అని నిర్ధరించింది. కాని దాని నివేదిక వెలువడే సరికి ఎన్డీఏ సర్కారు పోయి యుపిఎ జమానా వచ్చింది. తమ ఇలవేల్పులను ఇరుకున పెట్టే నివేదికను మన్మోహన్ సర్దార్జీ బానిస ప్రభుత్వం ఎంచక్కా బుట్టదాఖలు చేసింది.

శత్రువుకు శత్రువు మిత్రుడని భావించి, దేశానికి బ్రిటిష్ పెత్తనం పీడ విరగడ చేయటానికి, బ్రిటన్ శత్రువులైన జర్మనీ, జపాన్‌లతో చేతులు కలిపి సాయుధ సమరం సాగించాలని నేతాజీ ఆలోచన. ఈ ప్రణాళిక మొదట్లో బాగానే సాగింది. కాని నాజీ హిట్లర్ నమ్మదగిన వాడు కాదని అర్థమయ్యాక, జపాన్ సైతం చిక్కుల్లో పడ్డాక వ్యూహాన్ని మార్చుకోవటం తప్పనిసరి అయింది. సోవియట్ యూనియన్‌ను ఆశ్రయించి, బ్రిటన్‌పై పోరుకు సహాయం పొందాలని సుభాష్ బోస్ ఆశించాడు. ఆ ఉద్దేశంతోనే విమాన ప్రమాదం మిషతో మాయమై రష్యా చేరాడు. వేగంగా మారిపోయిన సైనిక సమీకరణల్లో బ్రిటన్, రష్యాలు ఏకమయ్యాయి. మిత్రదేశపు రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు నేతాజీని సోవియట్ నియంత స్టాలిన్ సైబీరియాలో నిర్బంధించాడు.

విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని టోక్యో రేడియో చేసిన ప్రకటన అనుమానాస్పదంగా ఉంది. అతడు అజ్ఞాత వాసంలోకి వెళ్లదలచుకుంటే ఇలాంటి ప్రకటనే చేయిస్తాడని నా నమ్మకం. ఇంతకీ ఏమయిందో, అతడు ఎక్కడున్నాడో కనుక్కో’మని అప్పటి ఇండియా వైస్రాయ్ వేవెల్ తన హోం మెంబరును పురమాయించినాడు. ఆగ్నేయాసియాలోని బ్రిటిషు గూఢచారి దళం ద్వారా అతను సమాచారమును  రాబట్టినాడు. యుద్ధ నేరస్థుడిగా బోస్‌ను ఇండియాకు తీసుకొస్తే ప్రమాదం. ప్రజల సానుభూతి అతడికి దండిగా ఉంది. అతడిని ఉన్నచోటనే ఉండనివ్వటం మనకు క్షేమం అని హోం మెంబరు చెప్పగా, వైస్రాయ్ తల ఊచినాడు.

ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇండియాలో అధికారం చేతులు మారింది. దేశవాళీ సర్కారు గద్దెనెక్కింది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణం కట్టుకథ అని నెహ్రూ ప్రభుత్వానికి తెలుసు. బోస్ బతికే ఉన్నాడని గాంధీగారు కూడా చెబుతూనే ఉన్నాడు. కొత్త ప్రభుత్వం తలచుకుంటే నేతాజీని సైబీరియా చెరనుంచి విడిపించి స్వదేశానికి సగౌరవంగా తీసుకురాగలిగేదే!

కాని బోస్ వస్తే తమ పని ఖాళీ అని నవభారత నేతలకు తెలుసు. ప్రజాబలము కలిగిన అతడి ముందు వినాయకులగు ఈ నాయకులు  ఎదురు నిలవగలగటం కలలో మాట. కాబట్టి అతడిని ఉన్నచోటే ఉండనివ్వటం తమకు క్షేమమని తలచినారు. ఈలోపు అసలు సంగతి బోస్ బంధుమిత్రులకు ఎక్కడ తెలిసి పోతుందోనని భయపడి నేతాజీ సన్నిహితులందరి మీద గూఢచారులను పెట్టినారు. వారికొచ్చే ఉత్తరములను చించి, చదివి తమకు ఇబ్బంది కలిగించే లేఖలను రహస్యముగా దాచియుంచినారు. సైబీరియా ఖైదులో సుభాష్ బోస్‌ను తాను చూసినట్టు... ఆ వైనాన్ని రహస్యంగా ఉంచే షరతు మీద అధికారులు రష్యాలోని భారత రాయబారి కూడా ఆయనను చూడనిచ్చినట్టు సోవియట్ గూఢచారి సంస్థ కె.జి.బి.లో పని చేసిన వాడు ఒకడు తాను రాసిన పుస్తకంలో కొన్ని సంవత్సరాల క్రితమే బయటపెట్టినాడు. అప్పట్లో అదో పెద్ద సంచలనము. ఎవరెన్ని ప్రశ్నలు గుచ్చిగుచ్చి అడిగినా భారత సర్కారు నోరు మెదిపితే ఒట్టు.

ఎట్టకేలకు తుట్టతుదకు కట్టకడపటికి చిట్టచివరకు పాత ప్రభుత్వము ఎన్నికలలో కానీ ఎన్నికలలో ఓడిన తరువాత క్రొత్త ప్రభుత్వము ఒక్కొక్కటిగా బయట పెడుతూ వుంది. నేడు ఆ మహావీరుడు సహజ మరణము పొంది ఉండవచ్చును. భారత దేశము భూమిపై ఉన్నంతవరకు ఆయనను ఈ దేశము మరువదు,

స్వస్తి.

Saturday, 1 January 2022

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము

నాందీ వచనము

విశాఖదత్త విరచిత ముద్రారాక్షస నాటకము

వివరణ - విశ్లేషణ

 ముద్రారాక్షస మన్నది సంస్కృత పదమే అయినా  పదము  దాని వాడకము తెలుగులో ఎక్కువ. అది కూడా రాతలో దొర్లిన తప్పు వాడుతారు. కానీ వాస్తవానికి ఈ పదమును ఒక వాస్తవార్థములో విశాఖదత్తుడు తన నాటకమునకు శీర్షికగా  సృష్టించినాడు. అసలు విషయము చదువునపుడు మీకే అర్థమౌతుంది.

చరిత్రకారుడగు ఇర్ఫాన్ హబీబు అంచనా ప్రకారము చంద్రగుప్త పాలనా కాలమును  క్రీ.పూ. 322-298 అని పేర్కొన్నాడు. చాణక్యుడు  క్రీ.పూ. 322 కు ఒక 30 సంవత్సరములు ముందువాడయి ఉండవచ్చు. ఏది ఏమయినా అంతటి జ్ఞాని, చతురుడు, దీర్ఘదర్శి, సనాతన ధర్మ రక్షకుడు, నిర్దుష్ఠ ధ్యేయ సాధకుడు కలియుగ చరిత్రలో కనిపించడు.అట్టిమహానుభావుడు చంద్రగుప్త మౌర్యుని సామ్రాట్టు గా చేయుటకు, తనలాగే తెలివిమంతుడగు, నందవంశపు మహామంత్రి యగు,  రాక్షస మంత్రిని, తన కుటిల నీతితో, యుద్ధము, రక్తపాతములు లేకుండా, ఓడించుటయే గాక ఆయననే చంద్రగుప్తునికి మహామంత్రిని జేయుట చాణక్య చతురతకు పరాకాష్ట.

స్త్రీపాత్ర లేని నాటకము ప్రదర్శనా నిషిద్ధము అన్నది నాటి కట్టుబాటు. కానీ ఆ సాంప్రదాయమును త్రోసిరాజని తన నాటకమును ముఖ్యముగా గుహ్య సంభాషణలతో రక్తి కట్టించి అజరామరము చేసినాడు విశాఖదత్తుడు.


నేను భాషాపాండిత్య హీనుడనైనా ఉత్సాహము కొద్ది, యువతకు చాణక్య, రాక్షస, చంద్రగుప్తుల ఆదర్శ ప్రాయమగు అపూర్వ గుణవిశేషములను తెలియ జేయుటకు ఈ ప్రకల్పమునకు (Project) కు పూనుకొన్నాను. సంపూర్తి చేయుటకు చాలా రోజులే పట్టినది. చదివి ఆ మహనీయుల గొప్పదనమును గ్రహించగలిగితే నా శ్రమ మరచిపోతాను. 

ఇది ఉపోద్ఘాతము మాత్రమే! రేపటి నుండి విషయ ప్రచరణ ప్రారంభిస్తాను.


విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము

https://cherukurammohan.blogspot.com/2022/01/blog-post.html

ముద్రా రాక్షసము అంటే ‘ముద్రయో గృహీతం రాక్షస మది కృత్య కృతో గ్రంధః ముద్రా 

రాక్షసం’ అని పెద్దలు వ్యుత్పత్తి అర్ధం చెప్పినారు. ముద్ర అంటే రాజ చిహ్నం అయిన 

ఉంగరము లేక అంగుళీయకము. ఇదే నాటకాన్ని నడిపిస్తుంది ఎత్తులతో జిత్తులతో. 

ఈఎత్తుగడలకు సూత్రధారి చాణక్యుడు. పాత్రధారి ముద్రిక. ఈ అంగుళీయక ముద్రికయే 

రాక్షసుడిని దాసోహము చేసింది పరిస్థితులకు. అందుకు ఆలంబన కౌటిల్యుని అసమాన 

ధీ శక్తి. అందుకే ఈపేరు నాటకానికి సముచితముగా విశాఖదత్తుడు సమకూర్చినాడని 

ముక్త కంఠముతో పండిత జనశ్రేణి పలికినది.

కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతలా l

తస్యాంచ చతుర్ధ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయంll

అన్నట్టుగా కావ్యాలకంటే నాటకాలు రమ్యంగా ఉంటాయి. నాటకాలలో శాకుంతలం

అందులో మళ్ళీ నాల్గవ అంకము, అందులో కూడా శ్లోక చతుష్టయం. ‘ఇక్కడ మనకు 

‘కావ్యేషు నాటకం రమ్యం’ వరకు మాత్రమే మనకు కావలసినది. ‘నాటకమే దృశ్య 

కావ్యము. దర్శనీయమయినవే దృశ్యకావ్యములు. అంటే ఇందు దర్శింపజేయ తగినవి 

దర్శింపజేయ తగనివి, ఏవేవి నిషిద్ధములు అన్నవి భరత ముని తన ‘నాట్య శాస్త్రము’లో 

విశధముగా వివరముగా వ్రాసినాడు. నేటి చలన చిత్ర పాక శాస్త్ర దురీణులు వాటిని 

అన్నింటినీ కట్టకట్టి సముద్రములో పడవేసి, మూత్రవిసర్జన, చుంబనము, మైధునము, 

జుగుప్సాకరమైన హింస, వల్లమాలిన భయోత్పాతములను చూపించి అవి తమ 

ప్రతిభయని గుండెలు బాదుకొనుచున్నారు.

‘దశ రూపకములు’ అని ధనంజయులవారు ఒక దృశ్య రూపకమును వ్రాసినారు. ఇందు 

దృశ్యమానమగు చూపించగిన రీతులు ఎన్నివిధములు అన్నది సవిస్తరముగా 

వ్రాయబడినది. ఇందు మొదటిదిగా నాటకమును గూర్చి చెప్పబడినది. అసలు 

సాహిత్యాధ్యయనము ఎంత చేసినా అది నాటకాధ్యయనము తోనే సంపూర్ణమౌతుంది. 

అందుకే నాటి పెద్దలు ‘నాటకంతం హి సాహిత్యం’ అన్నారు. అసలు ఎన్ని కావ్యములు 

వ్రాసినా ఒక్క నాటకమైనా వ్రాయక పోతే ఆ కవి సమగ్రత పొందలేడు, అందుకని 

‘నాటకాంతం హి కవిత్వం’ అన్న ప్రతీతి కూడా వచ్చింది. ఈ నాటకాలను గూర్చి కాళిదాస, 

భవభూతి, శూద్రక ఆది మహా నాటక కర్తలను విని ఉంటాము. కానీ అట్టి నాటకములలో 

అత్యంత విలక్షణమైనది విశాఖదత్తుని ‘ముద్రా రాక్షసము’.

స్త్రీపాత్ర లేని నాటకమును ఆదరించకూడదని నాటి కవులే చెప్పియున్నారు.  అందుకే 

వారు ‘కావ్యాలాపాంశ్చ వర్జయేత్’ అన్నారు. అహోబల పండితులవారు తమ ‘అహోబల 

పండితీయము’ లో ‘ముద్రారాక్షసాది అసత్కావ్య విషయత్వాత్’ అన్నారు. అంటే ఈ 

నియమము ‘ ముద్రారాక్షసాది అసత్కావ్య విషయములలో మాత్రమే! అని కుండ బద్దలు 

కొట్టినారు. ఈ రచనకు ఇప్పుడు నేను చెప్పబోయే మాట అసంబద్ధమైనా, ఆహోబల 

పండితులవారు  ‘పోతన’ కవిత్వమును ఛందోలోపభూయిష్టమన్నారు. పోతన గారు 

భాగవతము లోని తమ అనేక పద్యాలలో ‘సాధు రేఫ’ కు ‘శకట రేఫ’కు యతి మైత్రి 

చెప్పటము జరిగినది. దానిని తప్పు పట్టినారు అహోబలపండితులవారు.

సూర్యుడు ఉదయించిన దిక్కును తూర్పు అంటారు కానీ తూర్పుదిక్కును వెదకి పట్టి 

అచట సూర్యుడు ఉదయించడు కదా! మహానుభావుల రచనలు కూడా అంతే! వారిని 

బట్టి మనము పోవలసినదే కానీ మనల బట్టి వారిని పొమ్మంటే పోరు.

విశాఖదత్తుని తాతగారిపేరు సామంత వటేశ్వరుడు. పృథు అతని కుమారుడు. పృథు 

యొక్క కుమారుడే ప్రస్తుత చర్చనీయామ్శామైన ‘ముద్రారాక్షస’ నాటక కర్త యగు ‘విశాఖ 

దత్తుడు’. తాత సామంతుడు కావచ్చు కానీ తండ్రీకొడుకులు స్వతంత్ర రాజులుగా 

తెలియవచ్చుచున్నది.

గుణాఢ్యుడు పైశాచిక భాషలో వ్రాసిన ‘బృహత్ కథ’ ను సోమదేవ భట్టు 

‘కథాసరిత్సాగరము’ అను పేరుతోనూ, క్షేమేంద్రుడు ‘బృహత్ కథా మంజరి’ అన్న 

పేరుతోనూ, పై ఇరువురివలె కాశ్మీరమునకు చెందిన ‘బుధస్వామి’  ‘బృహత్ కథా శ్లోక 

సమగ్రహ’ మన్న పేరుతోనూ రచించుట జరిగినది. ఇందు సోమదేవుని ‘కథా 

సరిత్సాగరము’ ఖ్యాతి గన్నది.  

అసలు నాటకమును గూర్చి తెలుపుటకు మున్ను, అందుకు సంబంధించిన 

పూర్వాపరములు తెలుపవలెనన్న ఉద్దేశ్యముతో విషయమునకు కొంత దూరము జరిగి 

వివరములనందిస్తున్నాను.

రేపు గుణాఢ్యుని కథ తెలుసుకోందాము..........

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము – 2వ భాగము

 అనగనగా ఓ మహారాజు. అతడేలే ఊరు పేరు ప్రతిష్ఠాన పట్టణం. అతని పేరు 

శాతవాహనుడు, అతనే హాలుడు. శాలివాహనుడు అనేది ఇంకో పేరు. అతడు శక కర్త

అంటే ఒక కొత్త శకం అతని పేరుతో ప్రారంభమయింది. అది శాలివాహన శకం. క్రీ.శ. 

ఒకటి రెండు శతాబ్దాలకు చెందిన తెలుగు రాజతను. అతనికి ప్రాకృత భాషపై అంతులేని 

అభిమానం. ఎన్నెన్నో ప్రాకృత గాథలను అతడు సేకరించాడు, సంకలించాడు. స్వయంగా 

రచించాడు కూడా. అతనికి ప్రాకృత భాషపై ఉన్నంత అభిమానమూ అభినివేశమూ 

సంస్కృత భాషపై లేవు. కానీ అతని భార్యకు సంస్కృత భాషపై అభిమానం. అందులో 

ఆమె గొప్ప పండితురాలు. తన పాండిత్యాన్ని రాజు ముందర ప్రదర్శిస్తూ ఉండేది. అది 

రాజుగారి మనసును గిచ్చుతూ ఉండేది. ఆమె సింహళ దేశీయురాలు.

శాతవాహనుని, సంస్కృత భాషా ప్రియురాలయిన , సింహళ దేశపు, రాణి భర్తతో 

జలక్రీడలాడుసమయమున 'రాజా!  కిం మోదకైస్తాడయ (రాజా! ఎందుకు నీళ్లతో నన్ను 

కొడతావు)'

అన్న మాటను, సంస్కృతము తెలియని రాజు 'నన్నెందుకు మోదకములతో అనగా 

ఉడ్రాళ్ళతో కొట్టవు' అని అన్నదని  రాజు పొరపాటుగా అర్థం చేసుకొని మోదకాలను 

 తెప్పించి రాణి మీదికి విసరసాగాడు. రాజుకు సంస్కృతము రానందున రాణి  వెకిలిగా 

నవ్వింది. అవమానముతో వంగి క్రుంగిపోయిన రాజుఆ లోటును ఎలాగైనా 

పూరించుకోవలెనని నిశ్చయించి, పండిత సభనేర్పాటుచేసి, తన సభలోని ఇద్దరు ఉద్దండ పండితులగు గుణాఢ్య శర్వ వర్మలను సంప్రదించుతాడు, సంస్కృత భాషలో 

పాండిత్యము సంపాదించేందుకు ఎంత కాలము పడుతుంద’ని. గుణాఢ్యుడు, గొప్ప 

పండిత కవి. అయితే, ముక్కుసూటి మనిషి. కాస్త ఆవేశపరుడు కూడాను. సంస్కృత భాష 

నేర్వాలంటే పాణినీ విరచితమగు సంస్కృత వ్యాకరణ ‘అష్టాధ్యాయి’ పట్టుబడాలని

అందుకు కనీసం పన్నెండు సంవత్సరాలు పడుతుందని చెప్తాడు. అయినా, తాను 

మహారాజుకు ఆరు సంవత్సరాలలో బోధించగలనని అంటాడు. రెండవ పండితుడు 

శర్వవర్మ. ఇతను రాజు పరిస్థితి గమనినిచి. గుణాఢ్యునిపై తన గొప్పతనము 

చాటుకోవలెనను ఉద్దేశ్యముతో వాస్తవావాస్తములను ప్రక్కనుంచి, రాజుగారికి తాను 

ఆరు నెలలలో సంస్కృత భాష బోధించగలనని సవాలు చేస్తాడు. గుణాఢ్యుడు అది 

అసంభవమని, అదే కానీ జరిగితే తనకు తెలిసిన సంస్కృత, ప్రాకృత, దేశ భాషలు 

మూడింటినీ విడిచిపెట్టేస్తానని శపథం చేస్తాడు. ఒకవేళ తాను రాజుని ఆరు నెలలలో 

సంస్కృత భాషలో పండితుని చేయలేకపోతే గుణాఢ్యుని చెప్పులు తలపై పెట్టుకొని 

అతనికి ఊడిగం చేస్తానని శపథం చేస్తాడు శర్వవర్మ. శపథమైతే చేసినాడు కానీ ఆరు 

నెలలలో సంస్కృత భాషను నేర్పడం మానవ సాధ్యం కాదని శర్వవర్మకు తెలుసు. తాను ఉపాసించే సుబ్రహ్మణ్యస్వామి గూర్చి తపస్సు చేసి, స్వామి మెప్పు పొంది, కాలాపము’ 

లేదా ‘కాతంత్రము’ అన్న పేరుతో సంస్కృత భాషకు సులభతరమైన ఒక కొత్త వ్యాకరణం 

రచిస్తాడు. దాని సహాయంతో, స్వామి కృపతో, హాలునికి ఆరు మాసాలలో సంస్కృతం 

నేర్పిస్తాడు. అన్న మాటకు కట్టుబడి గుణాఢ్యుడు తనకు వచ్చిన భాషలన్నింటినీ త్యజించి 

మౌనిగా మారి, కొంత శిష్యబృందంతో అరణ్యాలకు వెళ్ళిపోతాడు. ఇంతాజేసి అసలు 

విషయము ఏమిటంటే గుణాఢ్యుడు తెల్గు వాడేకాక తెలంగాణాకు చెందినవాడు.

ఆ విధముగా అడవికి వెళ్ళిన గుణాఢ్యుడు అడవిలో తిరిగే పిశాచాల సాహచర్యంతో 

పైశాచీ భాష నేర్చుకుంటాడు. నేర్చుకోవడమేమిటి, ఆ భాషలో కవిత్వం అల్లగల 

పాండిత్యం సంపాదిస్తాడు! దీని కోసమే ఎదురుచూస్తున్న ‘కాణభూతి’  అనే ఒక పిశాచం 

వచ్చి మహత్తరమైన కథలను వినిపిస్తాడు. వాటిని పైశాచీ భాషలో ఏడేళ్లు శ్రమపడి ఏడు 

లక్షల శ్లోకాలతో ఏడు బృహత్ గ్రంథాలుగా రచిస్తాడు గుణాఢ్యుడు. అయితే, ఆ అడవిలో 

అతనికి రాసేందుకు సాధనాలు ఎక్కడివి? చెట్ల బెరడులను పత్రాలుగా చేసి, వాటిపై తన 

రక్తమే సిరాగా ఉపయోగించి రాస్తాడు. అంతటి బృహత్ గ్రంథము అడవి కాచిన వెన్నెల 

కాకూడదని, దాన్ని లోకంలో ప్రచారం చేసే శక్తి మహారాజు హాలునకే ఉందన్న 

విషయము తెలిసినవాడగుటచే, ఆ గ్రంథాన్ని శిష్యులకిచ్చి హాలుని వద్దకు పంపిస్తాడు. 

హాలుడు పూర్తిగా సంస్కృత భాషాభిజాత్యంలో మునిగిపోయిన వాడైనందున, పిశాచ 

భాషలో, రక్తంతో రాసిన గ్రంథమని విని, దాన్ని అసహ్యించుకొని శిష్యులని పంపేస్తాడు. 

వారు తిరిగి వచ్చి చెప్పిన విషయాన్ని విన్న గుణాఢ్యుడు మనసు విరిగి, తన శిష్యులచేత 

అగ్నిని పేర్పించి, తన గ్రంథంలో ఒక్కొక్క శ్లోకాన్నీ చదువుతూ ఒక్కొక్క పత్రాన్ని అగ్నికి 

ఆహుతి చేస్తాడు.

అలా కొన్ని రోజులు గడిచిన తరువాత, రాజుగారి భోజనంలో ఏరుచీలేని మాంసమును 

వంటవాడు వండి రోజూ వడ్డిస్తూవస్తుఉంటాడు. దానికి రాజు వానిని నిలదీసి అడుగగా 

దానికి వంటవాడు, 'రాజా అడవిలో జంతువులన్నీ ఒకేచోట కూర్చొని ఆహారంలేకుండా 

ఉన్నాయి. అక్కడ ఒకాయన మంటచేసి అందులో ఏదో చదువుతూ చదివిన తాళపత్రాన్ని 

అందులో వేస్తున్నాడు. ఆయన చుట్టూ జంతువులన్నీ వున్నాయి’ అని చెప్పగా రాజు 

ఆశ్చర్యంతో అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ గుణాఢ్యుడే అది చదివి అందులో 

వేస్తున్నాడన్నది గమనించి తానెంత పొరపడ్డాడో అర్థమై ఆయన్ను ప్రాథేయపడి 

అక్కడినుండి పిలుచుకు వెళ్ళాడట. ఆ మిగిలిన కథే ఇప్పుడు మనకున్న బృహత్కథ. 

అందులోని ఒక కథే మనము చేపట్టిన ‘ముద్రారాక్షస నాటకము’ నకు ఆలంబనము.

మిగిలినది మరొక మారు .........

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము - 3వ భాగము

ఇందు మనకు మన నాటక కథానాయకులగు చాణక్య, చంద్రగుప్త, రాక్షసుల యదార్థ 

గాధ తెలియవస్తూ వున్నది. ఇందు తెలియజేసిన చంద్రగుప్తుడు 23 శతాబ్దముల క్రిందటి 

వాడు. మగధ దేశపు రాజధానిగా  పాటలీ పుత్రము లేక కుసుమ పురము ఉండినవని 

చెబుతారు. జరాసంధుడు రాజ్యమేలిన తరువాత, ఆయనకు 37వ తరము వాడు 

నందుడు. నందుని మహాపద్మ నందుడు అనుట కూడా కద్దు. ఆయన భార్య రత్నావళి. 

అతి సౌందర్యరాశియగు ఆమె యందు 9మంది సంతానము కలిగినారు. వారు 

కాలక్రమేణా నవ నందులుగా పిలువబడినారు. ఆమెతో కాక ముర అను బుద్ధిశాలి, 

సౌందర్యవతియగు దాసీకి చంద్రగుప్తుడను నామధేయుడగు కుమారుని కన్నాడు. ముర 

యొక్క సంతాన మగుటచే కాలక్రమమున అతడు ‘చంద్రగుప్త మౌర్యు’డయినాడు.

నందునకు ముగ్గురు ముఖ్యమగు మంత్రులు ఉండేవారు. 1. వక్రనాసుడు 2. 

శకటారుడు, 3. రాక్షసుడు. వక్రనాసుడు మొదటి నుండి నందుని మంత్రియే! అప్పగించిన పనిని నెరవేర్చుట తప్ప అతిశయించి అంతా నెత్తిన వేసుకొనేవాడు కాదు. అయినా నమ్మకస్తుడు. రెండవ వాడు శకటారుడు. హిమాలయ పర్వత సానువులలో గల రాజ్యమునకు రాజగు పర్వతేశ్వరునకు సేనాధిపతియై ఉంటూ యుద్ధమున తన రాజు ఓడిపోగా మాయోపాయముచే మహానందుని మంత్రిగా కుదురుకొన్నాడు. రాక్షసునిపై దేబ్బతీయుట అన్నది ఈతని జీవితాశయము. ఇక మూడవ మంత్రి రాక్షసుడు.

నిజానికి ఈ వ్యక్తిపేరు రాక్షసుడు కాదు. ఈయన నిజనామము సుబుద్ధి శర్మ. ఆయన 

మంచో చెడుగో తాను నమ్మిన తరువాత తలచిన దానికి మనసా వాచా కర్మణః కట్టుబడి 

ఉంటాడు. ఒకానొక యుద్ధములో ఈయన తన రాజగు నందుని పక్షము వహించి, 

సైన్యమంతా అలసిపోయినా అలుపన్నది ఎరుగక తన రాజుకు విజయమును 

చేకూర్చినాడు.  అప్పటినుండి ‘రాక్షసుడు అన్నది ఆయనకు స్థిరనామమై కూర్చుంది. 

ఈయన మహా జ్ఞాని మరియు బుద్ధికుశలత కలిగినవాడు. ఒక మహానుభావుడు 

రావణాసురుని, రాక్షసామాత్యుని కలిపి ఒకే శ్లోకములో ఈ విధముగా వర్ణించినాడు.

యో లంకోపనివాసః రామాదిషు నిరాదరః l

నయజ్ఞేషు ప్రసన్నాత్మా సత్యం రాక్షస ఏవ సహ ll

మొదట రావణ పరముగా అర్థము చెప్పుకొందాము. ఎవరైతే లంకను స్థావరముగా 

చేసుకొన్నాడో, శ్రీరామ చంద్రుని ఆయన అనుచరులను నిరాదరించినాడో, 

యజ్ఞయాగాదులకు విఘాతము కలిగించుతూ ఉండినాడో, అట్టి వ్యక్తి రాక్షసుడు కాక 

వేరేమిటి?

ఇక రాక్షస మంత్రి పరముగా అర్థము చెప్పుకొందాము.

ఎవరికైతే కోపము అనేది ఉండదో, ఆడవారిని అసహ్య భావనతో చూడడో, నయజ్ఞ 

అంటే నీతిమంతులను ఎంతగా ఆదరించుతాడో, ఆరాధించుతాడో, అతడే 

రాక్షసామాత్యుడు.

మహానందుడు స్వతహాగా మంచివాడు కానీ అపరిమితమైన కోపిష్ఠి. ఒకసారి ఆయన 

దాస దాసీ జనముతో బహుశ తన అంతఃపురమునకు దగ్గరగా ఉన్న వనములో 

విహరించుతూ ఒక మర్రిచెట్టు క్రింద సేద తీర్చుకొంటూ ఉండినాడు. వింజామర 

పట్టుకొని దగ్గరగా ఒక ముఖ్య పరిచారిక సేవకు సిద్ధముగా నిలుచొని యుండినది. 

ఆమెపేరు విచక్షణ అని సుమంగళ అని వేరువేరు సంస్కృత అనువాద పుస్తకములలో 

ఉన్నది. మేనువాల్చి ఎటో చూస్తున్న రాజుకు ఒక 10,15 చీమలు ఒక రావి విత్తనమును 

కష్టపడి తమ కలుగులోనికి ఈడ్చుకొని పోతూ కనిపించగా పక్కున నవ్వినాడు. రాజు 

చూసి ఆ దాసీ కూడా నవ్వుట తటస్తించినది. రాజు కుపితుడై ఆమె నవ్వుకు 

కారణమడిగినాడు. ఆమె భయ కంపితయై ‘మీరు నవ్వుటచే నేను నవ్వినాను’ అన్నది. 

‘మరి నేనెందుకు నవ్వినాన న్నాడాయన’. తెలియదు అన్న ఆమెతో ‘రెండు రోజులలో 

తెలుసుకొని కనిపించు. తెలియలేదు అంటే నీకు మరణమే శరణము’ అన్నాడు రాజు. 

 అందుకే పెద్దలు ఈ 6 విషయములలో జాగ్రత్త వహించమన్నారు.

బాల సఖత్వ మకారణ హాస్యం స్త్రీషు వివాదమసజ్జన సేవ l

గార్దభయాన మసంస్కృత వాణి షట్సునరో లఘుతామపయాతి ll

అన్నారు పెద్దలు.

మిగిలినది మరొకమారు.......

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము - 4వ భాగము

మనకంటే అన్నివిధాలా బాగా చిన్నవారితో స్నేహము చేయ రాదు. కారణములేని 

హాస్యము, నవ్వు ఎప్పటికీ పనికి రాదు. ఆడవారితో కలహము అనర్థ దాయకము. 

పూర్వము హీనమైన పనులు చేసినవారిని అరగుండు జేసి, అరా మీసముంచి, పెద్ద పెద్ద 

సున్నపు పట్టెలు పెట్టి గాడిదపై ఊరేగించేవారు. అది హత్యాసాదృశమయ్యేది. సంస్కృత 

వాణి అంటే సంస్కృత భాష కాదు సంస్కారములేని మాటలు అని అర్థము, ఈ ఆరున్నూ 

మనిషికి న్యూనతను చేకూర్చుతాయి.

వ్యాకులచిత్తయైన ఆ దాసిరాజు వెడలిన తరువాత కూడా స్థాణువై అచటనే 

కూలబడియుండి పోయినది. ఎప్పుడో సాయంకాలము ఆదారిన పోతూ చింతాకులిత 

మాన మానసయై యున్న ఆయువతిని  సుబుద్ధి శర్మ (రాక్షసుడు) చూసి 

కారణమడిగినాడు. ఆమె విషయమంతా పూస కృచ్చినట్లు వివరించింది. అప్పుడు 

సుబుద్ధిశర్మ ఆమెతో ఈవిధముగా చెప్పినాడు “ తల్లీ! రాజు నవ్విన కారణము 

చెప్పుచున్నాను వినుము. చీమలు ఈ రావి విత్తనమునైతే ఎంతో శ్రమపడి మోసుకొని 

పోవుచున్నవే, అదే ఈ విత్తనము భూమినబడి మహావృక్షమైతే ఏనుగులకు కూడా కదప 

శక్యము కాదే ఏమి ఈ సృష్ఠి వైపరిత్యము అని తలచి నవ్వినాడని తెల్పుము”. 

సంతోషాంతరంగయైన దాసి సుమంగళ, రాజు వద్దకు వెళ్లి సుబుద్ధి శర్మ గారు చెప్పిన 

రీతిగా, తన మాటగా తెలియ జేసినది.  ఆమె జవాబుకు మెచ్చి రాజ్య ఆమెకు రత్నాల 

హారమును బహూకరించినాడు. అప్పటికి ఆమె సంతోషముగా వెళ్లిపోయినది.

కొంత కాలము గడచిన పిమ్మట హిమాలయ పర్వత పొలిమేరలలో ఉన్న రాజులంతా 

కలిసి నందునిపై దండయాత్ర చేయదలచినారు. తమ పనుపున ఒక గూఢచారికి 

మొదలు తుది సమంగా ఉండే ఒక కట్టెను ఇచ్చి (పూర్వపు రూళ్ళ కర్రను ఊహించుకొండి) దాని మొదలు తుది తెలియజేయ అడుగమని చెప్పినారు. రాజుల ఆజ్ఞానువర్తియై ఆ గూఢచారి, తన ఉనికిని దాచి నందునికి తన ప్రశ్న నివేదించి తగినంత సమయమును తీసుకొని చెప్పామన్నాడు. రాజు, ఆ కర్రను అంతఃపురమునకు తీసుకొనిపోయి దీర్ఘముగా ఆలోచించిన పిదప ఒక నిర్ణయమునకు వచ్చి సభజేరి దాసియగు సుమంగళను పిలిపించమన్నాడు. అమె వచ్చి రాజు ఎదుట నిలువగా నాడు తనకు సలహా ఇచ్చిన ఆవ్యక్తిపేరు తెల్పమని యడిగినాడు. ఆమెకు ఆయన పేరు తెలిసియున్నందువల్ల సుబుద్ధిశర్మ అని చెప్పలేక ఆనవాలు చెప్పగలిగినది. రాజు వెంటనే చారులను పంపి ఆయనను తనవద్దకు రప్పింపజేసినాడు. ఆయన సమక్షమున నిలువ, రాజు తన చేతిలోని కర్రను చూపించి “రెండు రోజుల సమయమును తీసుకొనియైనా ఈ కర్ర మొదలు తుది చెప్పగలరా” అని అడిగినాడు. సుబుద్ధి శర్మ వెంటనే “దీనికి రెండురోజుల సమయము అవసరము లేదు. కర్రకన్నా పెద్దదగు పాత్ర నిండా నీరు నింపి తెప్పించమని అడిగినాడు. రాజు వెంటనే అట్లే చేసినాడు. సుబుద్ధిశర్మ ఆ కర్రను ఆ పాత్రలు వేసి నీట మునిగినది ‘మొదలు’ తేలినది ‘చివర’ అని తేల్చి చెప్పినాడు. రాజు పరమానంద భరితుడై ఆయనను వెంటనే తన రాజ్యమునకు ప్రధాన మంత్రిగా చేసినాడు. ఇది స్వతహాగా ఈర్ష్యాళువు అయిన శకటారుడు భరించలేక పోయినాడు. కాలాంతరమున మహానందుడు మరణించుట జరిగినది. దానిని గూర్చి ముందు ముందు విశధముగా తెలుసుకొందాము.

మిగిలినది మరొక మారు ..........

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము - 5వ భాగము

ఇది ఇలా ఉండాగా, నేపాళదేశము నుండి నీలకంఠ దీక్షితులన్న ఒక మహాగురువుగారి శిష్యులు, పరకాయ ప్రవేశముతో సహా సకల విద్యా సంపన్నులు ఆస్థానమునకు వచ్చుట జరిగినది. వారు, సుశీలుడు, బహుశ్రుతుడు, సువిద్యుడు. పరకాయ ప్రవేశ విద్య యందు సువిద్యుడు నిష్ణాతుడు. అసలా మువ్వురు మహానందుని ఔదార్యమును గూర్చి విని, తమ విద్యా బుద్ధుల ప్రదర్శించి లక్ష వరహాలు బహుమతిగా పొంద సంకల్పించి యుండినారు.  రాజు మరణించిన వార్త విని ఎంతో ఖిన్నులయి అచటి నుండి వెడలినారు.

వారు ఒక నిర్జన ప్రాంతమునకు చేరిన పిమ్మట, తన మిత్రులకు సువిద్యుడు ఒక సలహానిచ్చినాడు. “ఉత్తరక్రియలు జరుగక ముందే నేను నేర్చిన పరకాయ విద్య ద్వారా నాశరీరమునిచట విడిచి రాజు శరీరమున ప్రవేశించుతాను. అప్పుడు బహుశ్రుతుడు నా శరీరమునకు కాపుగా యుండి సుశీలుని నా వద్దకు పంపితే అతని పాండిత్యమునకు లక్ష వరహాలిచ్చి పంపుతాను. తరువాత నేను, రాజు శరీరమును విడిచి, వచ్చి నా శరీరమును పొందుతాను”అన్నాడు. మిత్రులు అందుకు సరే అనగా సువిద్యుడు ఆ విధముగనే చేసినాడు.

నిజానికి మహానందుడు లక్ష వరహాలిచ్చే అంత దానపరుడు కాదు. ఈ సందేహమును కలిగిన రాక్షసుడు, తన గుర్రముపై నగర సంచారము చేయదొడగినాడు. ఒకచోట డబ్బుతో బహుశ్రుతుడు సుశీలుడు కనిపించగా వారిని తరిమి, మేధావి అయినందున విషయము తెలుసుకొని, అచట తాను చూసిన కళేబరమును తగులబెట్టించినాడు. నాటి అర్ధ రాత్రి సమయమున సువిద్యుడు రాజు శరీరమును వదలి తన శరీరము ఉన్న చోటు చేరి బూడిద చూసి విషయము తెలిసినవాడై విచార వదనముతో  తిరిగీ రాజు శరీరములో ప్రవేశించినాడు. ఉన్న మంత్రులలో మేధావి రాక్షసుడే కాబట్టి ఇది ఆతని ఆతనిపనియేనని నిశ్చయించుకొని ఆతని మీద ద్వేషమును పెంచుకొన్నాడు.

ఆద్వేషమే శకటారునితో మైత్రికి కారణమైనది. రాక్షసుని దూరముంచసాగినాడు. ఒకరోజు మహారాజు అనగా సువిద్య నందుడు కొంత సైన్యముతో వేటకు బయలుదేరినాడు. పోనుపోను వారిరువురి గుర్రములు వేగము పుంజుకొని సైన్యమునకు బాగా దూరమై అలసిపోగా, వారు ఒకచోట దిగి సేద తీర్చుకొంటూ ఉండినారు. రాజు త్రాగునీరు కావలెనంటే శకటారుడు వెదుకగా కనిపించిన కొలనులో ఒక తామర ఆకును దొన్నెగా చేసి నీరు తీసుకొంటూ ప్రక్కన ఉన్న ఒక శిలను, దానిపై ఉన్న శ్లోకమును చూచట జరిగినది. ఆ శ్లోకము యొక్క సారాంశము ఏమిటంటే ‘రాజు మంత్రి ఇరువురూ తెలివయినవారయితే సమయము దొరుకబుచ్చుకొని ఇరువురిలో ఒకరు ఇంకొకరిని చంపవచ్చును’. అది గమనించిన శకటారుడు, ఎందుకైనా మచిదని తలచి ఆ బండరాయిని కొలను లోనికి దొర్లించి స్వచ్ఛముగా ఉన్నవైపు నీటిని ఆ తామరాకు దొన్నెలో తీసుకొని రాజుకు ఇచ్చినాడు. కానీ బడలిక ఎక్కువగుటచే సుషుప్తి లోనికి జారుకొన్నాడు. ఇచ్చిన నీరు చాలకపోవుటచే, దగ్గర ఉన్న కొలను యొక్క ఉనికిని, శకటారుడు,నీరు తీసుకొనునపుడే గ్రహించిన రాజు ఆదిశగా బయలుదేరి చేరుకొని ఒకవైపు బురుదగా ఉన్న కొలను లోని శిలను అప్పుడే దొరలించినట్లు తెలుసుకొని దానిని తిరిగీ దొరలించితే శ్లోకము ఉన్నవైపు కనిపించినది. విషయము అర్థము చేసుకొనులోపునే, అర్ధాంతరముగా నిదుర లేచిన శకటారుడు నీటి శబ్దమును గ్రహించి, రాజు అచటికి పోయియుండునని తలచి, అచట రాజును చూసి వెనుకవైపుగా ఒక పెద్ద బండరాయితో ఆయన తలను మోది చంపి ఎవరికీ సులభముగా కనుపించని రీతిలో దాచియుంచి రాజు కనిపించుటలేదను కలకలమును సృష్టించినాడు.  

తండ్రి పార్థివ శరీరమునకు అంత్యక్రియలను చేయలేక పోయితిమే అన్న సంతాపము అధికమగుటచే నవనందులలో పెద్దవాడు తన వద్దనున్న అతి ముఖ్యమగు 6 మంది గుప్తచరులను రావించి తన తండ్రి కళేబరమును కనుగొని తీసుకురాని పక్షములో వారికి మరణ దండనయే గతి అన్నాడు. వారిలోని వయోధికుడొకడు అమితమగు పట్టుదల గలిగినవాడై రాజు వేటకు వెడలిన మార్గమున, కొన్ని చిహ్నములను అనుసరించి నడువసాగినాడు. ఆయనకు మార్గ మధ్యమున ఒక కాళికా ఉపాసకుడు కనిపించినాడు. ఆతనిని ఈ గూఢచారి తన సమస్యను వివరించగా, ఆ ఉపాసకుడు కాళికను భృకుటిన ఆవేశపరచుకొని విషయమంతా చెప్పి రాజు అస్తిపంజరము ఆభూషణములతో సహా ఎక్కడ పడియున్నది చెప్పినాడు. ఆ గూఢచారి ఆ అస్తిపంజరమును ఆ దారిన కనబడిన వారి సాయముతో నందుల వద్దకు చేర్చినాడు. ఆగ్రహోదగ్రుడైన ఆ జేష్ఠ నందుడు శకటారిని చంపి ఆతని 6 మంది కుమారులను ఒక గుహలోనికంపి దానిని గాలి పోవుటకు మరియు 6 మందికి 6 కబళములు పంపుటకు వీలుగల రంధ్రము కలిగిన కదిలించ వేలుగాని బండరాయితో మూయించినాడు. ఆ 6 మందిలో చివరివాడు ‘వికటారుడు’. తమ పిడచ అన్నమును వానికే పెట్టి పెట్టి మిగిలిన 5 మంది చిక్కి శల్యమై మరణించినారు. నందజేష్ఠుడు వికటారునిపై జాలితో విముక్తుని గావించినాడు. అప్పటికే పర్వతేశ్వరుని వద్దకు చేరిన రాక్షసుని బ్రతిమలాడి తన వద్దకు రప్పించుకొన్నాడు. తన బహిప్రాణమై యుండుమని ప్రాధేయపడి ఒప్పించినాడు. నందునికి నచ్చని వాడగుటచే, రాక్షసుని పంచన చేరినాడు వికటారి. రాజునకు జరుగవలసిన ఉత్తరక్రియలలో, బ్రాహ్మణ భోక్త కావలసి వచ్చి వికటారుని పంపినాడు రాక్షసుడు. వికటారి తనకు ఉపయోగపడు బ్రాహ్మణునికై వేదకుచుండగా ఒక ముళ్ళ చెట్టుచుట్టూ పాదు తవ్వి అందు తేనె పోయుచున్న ఒక అనాకారి, కాంతిహీనమగు బాపడు ఆతనికి కనిపించినాడు. వికటారి ఆతనిని కారణమడుగగా తనతండ్రి ఆముల్లు కుచ్చుకొని మరణించుటచే ఆచెట్టునే సమూలముగా నాశనము చేయుచున్నట్లు తెలిపినాడు ఆ బాపడు. అతనే చాణక్యుడు అనబడు విష్ణుగుప్తుడు. కౌటిల్యుడు అన్నది కూడా అతనికి నామాంతరము.

ఆతనిని తన పథకమునకు తగినవాడని తలచి భోక్తగా పిలుచుకొని జేష్టుడగు నందునివద్దకు పోయినాడు. ఆతని శరీరాకృతి చూచిన నందుడు ఇంతటి అనాకారి అయోగ్యుడు తప్ప వర్చస్వియగు విప్రుడే దొరకలేదా అని కోపగించుకొన్నాడు. దానిని అవమానముగా భావించిన చాణక్యుని, భటులు జుట్టు పట్టుకొని ఈడ్వగా  నంద వంశమును నాశము చేసే వరకూ తన జుట్టు ముడివేయనని శపథము చేసి వెళ్ళిపోతాడు చాణక్యుడు.

ఆయన, మురకుమారుడగు చంద్రగుప్తుని గూర్చి విన్నవాడై అచటికి చేరుతాడు. ఇక అక్కడినుండి తన ఎత్తులను ప్రారంభించుతాడు. ముందు పర్వతేశ్వరునకు లేఖబంపి, అప్పటికే తమవద్ద తగినంత సేనావాహిని కలదని, నందులపై యుద్ధములో తమకు సాయపడితే ఆతనికి అర్ధ రాజ్యమని  కబురు పంపుతాడు. పర్వతేశ్వరుడు అందుకు సిద్ధపడుతాడు. ఆతని సాయముతో నందులను సంహరించి పర్వతేశ్వరునికూడా స్వర్గవాసుని చేస్తాడు, రాక్షసుడు చంద్రగుప్తునిపై ప్రయోగించిన విషకన్య సహకారముతో! సమయము తీసుకొని ఆ అపవాదును చాణక్యుడు మెల్లమెల్లగా రాక్షసునిపై నేట్టుతాడు. పర్వతేశుని కుమారుడు మలయకేతు భయపడి, తండ్రి మరణానంతరము రాక్షసుని శరణు జొచ్చుతాడు. ఇందంతా నాటకమునకు పూర్వ రంగము.

చాణక్యుని ఈ రాక్షస రాజకీయం ఎవరికోసం అంటే మౌర్య వంశ  స్థాపకుడిగా చంద్ర గుప్తుని అభిషేకించ టానికే. దీన్ని  చంద్రుడిని ఆసరాగా చేసుకొని మొదటినుంచి చివర వరకు చాణక్యుడే ఆడించినాడు నాటకాన్ని. సఫల మనోరథుడైనాడు. చేసిన ప్రతిజ్ఞా తీర్చుకొన్నాడు .కులం ,ఆభిజాత్యం ప్రధానం కాదు. గుణం ప్రధానం రాజుకు అని రుజువు చేసి చూపించినాడు .ఆదర్శ చక్రవర్తిని తీర్చిదిద్దినాడు. ముర అనబడు  నిమ్న జాతి స్త్రీ  సంజాతుడయినా  చంద్ర గుప్తుడు సకల సద్గుణ సంపన్నుడు కాబట్టి చాణక్యుని దృష్ఠి చంద్రునిపై పడింది.  రాజ్యానికి సర్వ సమర్ధుడని భావించి పావులు కదిపినాడు .మన నాటకాలకు నాయకుడు క్షత్రియుడై ఉండాలి కాని ఇక్కడ’’ దృశ్యం’’ వేరు అయినా, నాయకుడు చంద్రుడే . స్త్రీ పాత్ర లేని నాటకము నాటకము కాదు అని అలంకార శాస్త్రాను సారం ఇది తప్పుఅని, పండితులు ఈసడించినారు .కాని సూర్య కాంతిని అరచేతులతో ఆపలేరు కదా!

నాటక భానుమండల తేజో పుంజమయినది ముద్రా రాక్షసము.

ముద్రారాక్షసము విశాఖదత్తుడు రచించిన సంస్కృత చారిత్రక నాటకము. భారతదేశ చక్రవర్తిగాచంద్రగుప్త మౌర్యుడు రాజ్యం చేపట్టిన తరువాత  జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను ఈ నాటకమున చిత్రీకరించుట జరిగినది. నందవంశాన్ని చాణక్యుడు తన మేధో చతురతతో నిర్మూలించి చంద్రగుప్తుడు పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో నాటకం ప్రారంభం అవుతుంది. పాటలీ పుత్రమునకు కుసుమపురము అన్నది నామాంతరము. నందుని మహా మంత్రి రాక్షస మంత్రి తన రాజు మరణానికి ప్రతీకారం తీర్చుకోదలచి చంద్రగుప్తుని చంపేందుకు ఎత్తులు వేస్తూండగా, చంద్రగుప్తుని పక్షాన చాణక్యుడు వాటన్నిటినీ చిత్తు చేస్తూ పైఎత్తులు వేయడంతో నాటకం కొనసాగుతుంది. చివరికి చాణక్యుని మంత్రాంగానికి చిక్కి రాక్షస మంత్రి చంద్రగుప్తునికి మంత్రిత్వం వహించేందుకు అంగీకరించడంతో నాటకం పూర్తవుతుంది.

మిగిలినది మరొకమారు.........

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము - 6వ భాగము

నాటకము యొక్క నాంది  ప్రారంభమవుతుంది. రంగస్థలము మీదికి సూత్రధారుని ఆగమనముతో ఆరంభమౌతుంది. రంగస్థలముపై నిలిచి, సూత్రధారుడు తన భార్యనుద్దేశించి ఈ విధముగా అంటాడు “ దేవీ! ఇంటిలో, నాకు తెలియకుండగానే ఏదో సంతర్పణ జరుగుచున్నట్లున్నది’ అని. అప్పుడు ఆమె ‘కౄర గ్రహః సకేతుః చంద్రం అభిభవితమిచ్ఛతి బలా’ అంటే కేతువు కలిగిన కౄర గ్రహము అంటే కేతువే, కేతువు అనగా తోక అని ఒక అర్థము, చంద్రుని మింగుటకు వచ్చుచున్నది. కావున బ్రాహ్మలకు ముందుగా భోజనము పెట్టుచున్నాను అన్నది. అప్పుడు సూత్రధారుడు పారంపర్యముగా క్షుణ్ణముగా జ్యోతిష్ శాస్త్రమును అభ్యశించిన నేను ఇంటవుండగా ఎవరి మాటలో విని ఈవిధముగా చేయుట తగదు అని మందలించినాడు. ఆ గృహిణి చెప్పిన మాటను తనదైన రీతిలో అర్థము చేసుకొని చాణక్యుడు ఈ విధముగా అంటూ రంగస్థలము పైకి వస్తూ ఉన్నాడు. ఆయన ఏవిధముగా అర్థము చేసుకోన్నాడంటే, కౄర గ్రహము (రాహుకేతువులు కౄర గ్రహములు, విష్ణు చక్రముచే ఖండింపబడక ముందు రాహువు రాక్షసుడే!) అనగా రాక్షసుడు కేతువు అంటే మలయకేతు (వచ్చి రాక్షసుని ఆశ్రయించినాడు కదా!) చంద్రుడు అంటే చంద్రగుప్తుడు, అంటే వారిరువురు కలిసి చంద్రగుప్తుని మ్రింగ ప్రయత్నించుచున్నారు అని తలచి ‘నేనుండగా చంద్రగుప్తునిపై చేయివేసేదేవరురా!’ అంటూ రంగప్రవేశము చేస్తాడు. సంస్కృత నాటకములలో, వేణీ సంహారము, ప్రబోధ చంద్రోదయము మరియు ఈ ముద్రారాక్షసములలో, ఎక్కువగా బాహ్యార్థమును తరచితే అంతరార్థము గోచరించుతుంది. ఈ నిగూఢత, పై నాటకములలో మనకు విరివిగా కనిపించుతుంది. అంత సూత్రధారి కలుగజేసుకొని చంద్రుని కేతువు ఏమీ చేసుకోలేడు ఎందుకంటే చంద్రునితో బుధుడు కలిసియున్నాడు. కావున గ్రణమే ఏర్పడదు అని అన్నాడు. ‘రక్షత్యేనంతు బుధయోగః’ అన్న ఈ మాటకు పైన చెప్పినది ఒక అర్థమైతే ‘చంద్రగుప్తునితో మేధావి యగు చాణక్యుడు కలిసియున్నాడు కావున అతనికి ఎటువంటి ముప్పూ వాటిల్లదు’ అన్నది మరియొక అర్థము. నేను ఈ మాట చెప్పులోపలనే ఆగ్రహావేశ భరితుడై చాణక్యుడు ఇట్లు అన్నాడు. రోషారుణ నేత్రుడగు చాణక్యుని కంటబడిన మనము భాస్మీభూతమగుదుము. కావున ఇచ్చటి నుండి మనము తక్షణము బయలుదేరుదము అంటూ సతీసమేతుడై సూత్రధారి రంగస్థలమునుండి నిష్క్రమించుతాడు.

దత్తుడు నాటక కళలో అందే వేసిన చెయ్యి అని ప్రతి అంకం లోను రుజువు చేస్తాడు. ప్రతి సంభాషణా, ఔచిత్యానికి పరాకాష్ఠగా ఉంటుంది. రాజకీయాన్ని దృశ్య కావ్యముగా మలచిన తీరుకు ఎవరయినా ఈ నాటకమును చూస్తూ లేక చదువుతూ అనుసరించితే, జోహారనక తప్పదు. తరువాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియని ఉత్కంఠతతో నాటకాన్ని నడిపించుతాడు, విశాఖ దత్తుడు. అతని రచనా పాటవాన్ని గమనిస్తే విశాఖుడైన కుమార స్వామి దేవ సేనాధిపత్యానికి యెంత అర్హుడో దత్తుడు కూడా ఈ నాటక నిర్మాణ,గమన, విజయాలకూ అంటే సమర్ధుడై అన్వర్ధ నాముడై అలరారుతాడు. లక్ష్య సాధనకు ప్రతి అంకము తోడ్పడింది .అతని వ్యూహానికి ఇది గొప్ప విజయము.

చంద్రగుప్తునికి ఆపద కలుగుతుంది అన్న సూత్రధారుల సంభాషణ విని కోపంతో తానున్నంత వరకూ చంద్రగుప్తునికి అవమానం కలుగజేసే మొనగాడెవరంటూ చాణక్యుడు రావడంతో నాటకం ప్రారంభం అవుతుంది అని పైన చెప్పుకొన్నాము. ఐతే నందవంశాన్ని నిర్మూలించి చంద్రగుప్తుణ్ణి రాజుగా నిలబెట్టడం, నందుని మంత్రి రాక్షసుడిని వశుణ్ణి చేసుకున్నాకనే సంపూర్ణమౌతుందని గ్రహిస్తాడు. తన రాజైన నందుణ్ణి చంపి రాజ్యం చేపట్టిన చంద్రగుప్తుణ్ణి ఎలాగైనా చంపాలని పగతో రగులుతూంటాడు రాక్షస మంత్రి. అందుకోసం తన వలెనే చంద్రగుప్తునిపై కత్తికట్టిన మలయకేతువు, పర్వతేశ్వరుల వంటివారితో చేయికలుపుతాడు. చంద్రగుప్తుణ్ణి మట్టుపెట్టేందుకు తయారుచేసిన విషకన్యను చంద్రగుప్తుని పైకి ప్రయోగిస్తాడు రాక్షసుడు. ఆ విషకన్యతోనే పర్వతేశ్వరుణ్ణి చంపేలా చేసిన చాణక్యుడు, రాక్షసుని వల్లనే మరణించినట్టు ప్రచారం చేస్తాడు. ఈ విషయము పైనే తెలిపినాను. పర్వతేశ్వరుని కుమారుడు మలయకేతువు, రాక్షస మంత్రిని చేరుతాడు. ఇది ఇలా ఉంచి నాటకులోనికి తొంగిచూద్దాము.

మిగిలినది మరొకమారు...........

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము - 7వ భాగము

నాటకము ప్రారంభమవుతుంది. చాణక్యుడు తన శిష్యుడు శారజ్ఞరవునితో ఎక్కడికో కలిసి వెళ్తూ కాస్త అలసటగా ఉంది, ఒక్క క్షణము ఈ బండరాయిపై కూర్చుంటాను అని కూర్చుని, రాక్షసుని బారినుండి చంద్రగుప్తుని రక్షించుటకు, ఏకైక మార్గము ఆతనిని చంద్రగుప్తునికి ప్రధానమంత్రిగా చేయుటయే అని తలపోస్తాడు. తన తంత్రముచే చాణక్యుడు నవనందులను నాశనము చేస్తాడు. ఇక నందవశములో మిగిలిన ఏకైక వ్యక్తి నందుల పినతండ్రి కొడుకగు సర్వార్థ సిద్ధి మాత్రమే! అతను కూడా చాణక్య చంద్రగుప్తులకు భయపడి పలాయనము చిత్తగించుతాడు. అతని పీడా వదిలించుకొంటే ఇక మిగిలినది చంద్రగుప్తునికి రాజమకుటము నలంకరించుటయే! మరి రాక్షసుడు నందుల మరణానంతరము మరణించిన పర్వతేశ్వరుని కుమారుడగు మలయకేతు నకు మంత్రిగా వ్యవహరించుచున్నాడు.  అందువల్ల,ముందు మలయకేతును మట్టుబెట్టితేనే మిగత పనికి మార్గము సుగమమౌతుంది.   అందుకు తగిన పథకముగా, రాక్షసుని ముద్రకలిగిన ఉంగరమును అపహరించి,  అంతా సర్వనామములతో, ఎవరినీ సంబోధించకుండా ‘దీనితో ఒకర్ని ఎలాగయినా పట్టుకొని మనకు స్వాధీనము చేయి’ అన్న రీతిలో వ్రాయించుట యందు ఆరితేరిన చాణక్యుడు, అవసరానికి తగినట్లుగా ఒక లేఖ వ్రాసి,  వ్రాసిన లేఖపై ఆ ఉంగరమునకున్న ముద్రను వేసి పంపవలసిన వారికి పంపి, కార్య సాఫల్యము జరిపించుకొన దలుస్తాడు. ఇది భవిష్యత్తుకు సంబంధించిన విషయము.

చాణక్యుని ముఖ్య గుప్తచరులలో ఒకడైన ‘చారుడు’ ఒకడు. ఒకనాడు,  చాణక్యుడు తన కుటీరములో నుండగా, బయట శారజ్ఞరవుడు బయట కాపుదారుగా ఉంటాడు. అప్పుడు చారుడు అక్కడికి వచ్చి శారజ్ఞరవునితో తాను చాణక్యునికి, ఒకవిషయము తెలియజేయుటకు, చూడవచ్చినానని చెబుతాడు. ఒకచిత్రమైన విషయము ఏమిటంటే చాణక్యునికి తన గూఢచారులన్దరిగూర్చి తెలుసునే కానీ వారిలో వారికి ఒకరిని గూర్చి ఒకరికి తెలియదు. అందుచే శారజ్ఞరవుడు సర్వజ్ఞుడైన మా గురువుకు వీడు తెలియజేసేతంతటి వాడా అని తలచి, ‘సర్వజ్ఞత్వం ఆచార్య సశంకసే!’ అంటాడు. అంటే సర్వజ్ఞుడగు మా గురువుకే చెప్పేతంతటి వాడివా! అని అర్థము, అప్పుడు శారజ్ఞరవుని కంటే పూర్వుడయిన చరుడు, అతనికి తలతిరిగిపోయే రీతిలో ఈ విధముగా అంటాడు. ‘యత్కించిత్ భవదుపాధ్యాయో జానాతి, యత్కించి దహమపి జానామి నహి సర్వం సర్వం జానాతి’ అని అంటాడు. అంటే నీగురువుకు కొంత తెలిసియుండవచ్చు నాకు కొంత తెలిసియుండవచ్చు, అంతే కానీ ప్రతియొక్కనికీ అన్నీ తెలియవలసిన అవసరము లేదే! అని అర్థము. అప్పుడు శారజ్ఞరవుడు తగ్గి, విషయము తెలుపమంటాడు. అంత చరుడుకస్మై కుసుమాని అప్రియం’ ‘కుసుమములు ఎవరికిష్టముండదు’ అని, ఆ మాటను తెలుపమన్నాడు.

ఇక్కడ ఒకవిధముగా అర్థము చేసుకొంటే పూవులు అందరికీ ఇష్టమైనవే! అని ఒక అర్థము. వేరు విధముగా ఆలోచిస్తే ‘పూవులంటే ఎవరికి ఇష్టముండదు?’ దీనిని ప్రశ్నార్థకముగా తీసుకొంటే ఇష్ట పడని వారి పేరు తెలుపుము? ఇది కొంచెము మెదడుకు మేత. ఇపుడు పలు విధముల పూవుల పేర్లు చెప్పుకొంటూ పోతే, తామరలు కలువలు వస్తాయి. మరి మన కతానాయకుడగు చంద్రగుప్తునికి అన్వయించుకొంటే చంద్రుని చూస్తె తామరలు ముకుళించుకొంటాయి కదా! అంటే వానికి చంద్రుడు సరిపోదు అనే కదా అర్థము. అటువంటి విరోధులు కుసుమ పురములో ఉన్నారు అని అర్థము. ‘కుసుమ’ శబ్దము అందువల్ల సంభాషణలో వాడబడినది. బిగ్గరగా చెప్పుటచే కుటీరము లోనున్న చాణక్యునికి అది వినబడి ఆ చెప్పిన వ్యక్తి తన గూఢచారియని గ్రహించి, శారజ్ఞరవుని, ఆవ్యక్తిని లోనికి పంపమంటాడు.

చారుడు లోనికి వెళ్లి విషయము విశధముగా తెలిపి ముఖ్యముగా చంద్రగుప్తునికి ముగ్గురు శత్రువులు కుసుమపురమునందు ఉన్నారంటాడు. వారిలో ఒకడు సిద్ధార్థకుడు అన్నాడు. నిజానికి ఈ సిద్ధార్థకుడు చాణక్యుని అనుచరుడే! అతను చంద్రగుప్తునికి విరోధి అని కనబరచుకొనుటచే రాక్షసునికి చేరువ కావచ్చునన్నది ఉద్దేశ్యము. ఆవిధముగా చేరువై మలయకేతుని మట్టుబెట్టవలయున్నది ఉద్దేశ్యము. ఇక రెండవ వాడు శకట దాసుడు. వీడు రాక్షసామాత్యునివద్ద లేఖలు వ్రాసేవాడు అని తెలుపుతాడు చరుడు. ‘అల్పొదిర్భుః నోపేక్షణీయః’ అంటే శత్రువు అల్పుడైనా అతి జాగరూకత వహించవలసిదే అనుకొంటాడు మనసులో చాణక్యుడు. సిద్ధార్థకుడు నెమ్మదిగా రాక్షసుని ప్రాపు సంపాంచుతాడు. ఆవిధముగా శకటదాసును తన చెప్పుచేతలలో ఉంచుకొన గలుగుతాడు.

ఇక మూడవ వాడు చందనదాసుడు. ఇతనిని మణికార శ్రేష్టి అంటారు. ఇతడు పెద్ద, మణుల, వ్యాపారస్తుడు. రాక్షసామాత్యునికి బహిఃప్రాణము. ఎందుకయినా మంచిదని తలచి, తనకుటుంబమునకు చాణక్యునిచే ఎటువంటి ఆపద రాకుండా ఉండుటకు చందనదాసుని ఇంట ఉంచుతాడు రాక్షసుడు.

రాక్షసుని కుటుంబం ఆయన మిత్రుడు చంనదాసు రక్షణలో ఉన్నట్టు తెలుసుకుని, చందనదాసుతో రాక్షస మంత్రి కుటుంబాన్ని తనకు అప్పగించమని చాణక్యుడు అడుగుతాడు. కానీ చందనదాసు రాక్షసుని కుటుంబము తన రక్షణలో ఉండేది కానీ ఇప్పుడు లేదంటాడు. చాణక్యుడు ‘ఔరా! నిజమైన సహవాసమునకు నిలువుటద్దము కదా ఈతడు అని మనసున అనుకొన్నా బయటికి తెలుపడు. పైపెచ్చు చందనదాసుని కుటుంబము మొత్తమును బందీచేయమని చెబుతాడు.

ఈ, బందీ చేసేలోపు చందనదాసుని ఇంట్లో ఒక చిన్న, కానీ కథకు అతి ముఖ్యమైన ఉదంతము జరుగుతుంది. చందన దాసుని ఇంట్లో తస్న తల్లితోబాటు ఉన్న రాక్షసుని కుమారుని చేతిలో రాక్షస అన్న పేరుకలిగిన ముద్రిక పడుతుంది. పిల్ల చేష్టలు కాబట్టి ఆ ఉంగరము వ్రేలికి పెట్టుకొని, తల్లి వారించుతూ ఉన్నా, తండ్రి ఉంగరము తనవ్రేలికి ఎంతో వదులుగా ఉన్నా పట్టుకొని ఇంటిబయతకు పరిగిడుతాడు. ఆ ఇంటి దాసీ కూడా ఆబాలునితో పరుగెత్తి అతనిని పట్టి ఎత్తుకొని ఇంటిలోనికి పోతుంది. ఈ పెనుగులాటలో ఆబాలుని వ్రేలికి ఉన్న తన తండ్రి ఉంగరము క్రిందబడుతుంది. అది గమనింపక దాసీ బాలునితో గృహములోనికి వెళ్ళిపోతుంది. అదే సమయమున అచట చందనదాసుని ఇంటిపై కన్నువేసియుంచిన చాణక్యుని గుప్తచరుడు ఆ ఉంగరమును గ్రహించి చాణక్యుని వద్దకు చేరి విషయము చెప్పి ఆ ఉంగరము ఆయన చేతికి ఇస్తాడు. దీనితో రాక్షసుని సంసారము చందనదాసుని ఇంట్లో ఉన్నట్లు బలపడుతుంది చాణక్యుని మనసులో. తను చేసిన పని సమంజసమనికూడా తలచుతాడు.

మిగిలినది మరొక మారు............

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము - 8వ భాగము

అదే అదనుగా తానూ ఒక లేఖవ్రాసి దానికి రాక్షసముద్ర వేయ తలపోస్తాడు. అక్షరాలూ అర్థమయ్యే రీతిగా ఉండకపోవుటచే మనసులో ఈ విధముగా అనుకొంటాడు ‘ప్రయత్నేన లిఖితాచ స్ఫుటాని శ్రోత్రియాని అక్షరాణి’ ఎంత ప్రయత్నించి వ్రాసినా శ్రోత్రియుడు అక్షరములను గుండ్రముగా వ్రాయలేడని తలచి సిద్ధార్థకునికి కబురు పంపి శకటదాసునితో ఈ విధముగా వ్రాయించమంటాడు:

‘5గురు రాజులుంటారు. ముగ్గురికి భూమినివ్వు, ఒకరికిఏనుగులను, ఒకరికి గుర్రములను ఇవ్వు’. ఆ సందేశము క్రింద రాక్షసామాత్యుని ఉంగరపు ముద్ర ‘రాక్షస’ అని ఉంటుంది. విచిత్రమగు విషయము ఏమిటంటే ఈ లేఖకు సంబోధన అనగా ఎవరిని ఉద్దేశ్యించి వ్రాయబడినది అన్న విషయము, పొరబాటున వేరేవారి చేతబడినా అర్థము కాదు. ఆ ఐదుగురు ఎవరన్నది మనకు తిరుపతి వెంకటకవుల’ముద్రారాక్షస’ అనువాదము ద్వారా ఈ విధముగా తెలియవస్తూ వున్నది.

తిరుపతి వెంకట కవులు తెనిగించిన 'విశాఖదత్తుని ముద్రారాక్షసమున రాక్షసుని అనుసరించు 5గురు రాజులు ఈ దిగువన తెలుపబడుచున్నారు.

కౌలూత దేశాధికారమ్ము గావించు

               వసుమతీశుడు చిత్ర వర్మ యొకడు

మలయా దేశీయ సామ్రాజ్య మనుభవించు

               నరసింహుడగు సింహనాడుడొకడు

కాశ్మీర దేశ భూకాంతుడై హతవైరి

               యగుచు బొల్పగు పుష్కరాక్షుడొకడు

సింధు దేశంబేలు క్షితిపతి రిపుకుల

               ప్రాణ మృత్యువు సింధు షేణుడొకడు

 

పారసీకపు క్ష్మాపతి బహుళ తురగ

సేనకధిపతి మేఘాళి ధానుడొక్క

డేనుగురు వీరిపేరులు దీన వ్రాతు

దుడిచి వేయుచు చిత్రగుప్తుండు వాని

అసలు ఈ ఐదుగురూ రాక్షస సన్నిహితులు. రాక్షసుడు మలయకేతుని మట్టుబెడితే ఎవరెవరికి ఏమేమి ఇవ్వవలనన్నది రాక్షస ముద్రతో వ్రాయబడినది. ఈ లేఖ మలయకేతుని చేతిలోబడితే, మలయకేతునికి రాక్షసుడు శత్రువై పోతాడు. ఇది చాణక్యుని ఉద్దేశ్యము. ఈ లేఖ మలయకేతుని చేతిలోబడి రాక్షసుని అపార్థము చేసుకొని ఆవేశపూరితుడై  ఆయనపై దాడిచేసి మరణించుట చాణక్యుని ఎత్తుగడ. ఇటువంటి ఎత్తుగడలతో నందవంశమును సమూలముగా మట్టుబెట్టుటయేగాక, పర్వతెశ్వరుని, ఆతని తమ్ముని, చివరకు పర్వతెశ్వరుని కుమారుడగు మలయకేతిని కూడా మట్టుబెట్టి, రాక్షసునికి, చంద్రగుప్తుని మహామాత్యుడగుట తప్ప వేరొక వికల్పము లేకుండా చేస్తాడు. ఇది చాణక్యుని కౌటిల్యములో ఒక భాగము మాత్రమే! ఏనుగును బంధించుటకు కందకము ఒకటే సరిపోదు. దానిపై కప్పుటకు చెట్లకొమ్మలు, లాగుటకు మోకు తప్పక కావలసినదే కదా! కావున అందుకు తగిన షడయంత్రములను కూడా రచించి సిద్ధముగా పెట్టుకొన్నాడు, చాణక్యుడు. అందులో ఒకటి చందనదాసుని కుటుంబమును నిర్బందిచుట. రెండవది తనకు చంద్రగుప్తునికి నడుమ మనస్పర్ధలు ఏర్పడినవని ప్రచారము సల్పుటయేగాక అది రాక్షసుని వరకు చేరవేయుట.

ఇది ఇట్లుడగా రాక్షసుని వద్దకు ‘ఆహితుండికుడు’ అనగా పాములనాడించేవాడు, వస్తాడు. నిజానికి అతడు రాక్షసుని చారులలో, విరాధగుప్తుడు అనువాడు. వయోభారముచే, అతడు ఫలానా అని, చాణక్యునివలె తక్షణము గ్రహించలేకపోతాడు. విరాధ గుప్తుడు చెప్పమొదలిడిన తరువాత విషయము తెలుసుకొంటాడు రాక్షసుడు. ఇక్కడ కాస్త జరిగి అలంకారశాస్త్రములోని ఒక విషయమును తెలియజేస్తాను. అలంకారములలో భ్రాంతిమద అలంకారము ఒకటి. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకచిలుక చెట్టుపై కూర్చొని ఉంది. ఎర్రగా ఉన్న ఆ చిలుకముక్కును చూసి తుమ్మెద దానిని దాడిమీ పుష్పమని భ్రమించి ఓహో! ఈ పుష్పముపై వాలి దీని మకరందమును జుర్రుకొంటాను అని తలపోస్తుంది. చిలుక ఆ తుమ్మెదను నేరేడు పండుగా భావించి ఈ పండు నాముక్కును చేరితే నేను హాయిగా తినవచ్చునని భ్రాంతి జెందుతుంది. చాణక్య రాక్షసుల ఎత్తులు జిత్తులు ఈ విధముగా ఉన్నాయి.

పర్వతేశ్వరుడు, రాక్షసుడు చంద్రగుప్తునిపై ప్రయోగించిన విషకన్యకు బలియైపోతాడు చాణక్యుని తెలివితేటల వల్ల. నేరము రాక్షసునిపై పడుతుంది. ఇక మిగిలినది పర్వతేశ్వరుని తమ్ముడు వైరోచకుడు. అన్నకు చెందవలసిన సగము రాజ్యము వైరోచకునిది అని ఉద్ఘాటించుతాడు చాణక్యుడు. ప్రథమద్వారమగు సింహ ద్వారము సమీపించగనే  “పెద్దవానివగు నీవు ముందు సింహాసనాధీశునివి కావలెను” అని చెప్పి ఆతనిని ముందుంచుతాడు. రాక్షసుడు, ద్వారమునకు పైనకట్టిన తోరణములో ఉన్న కత్తి ఆచటినుండి జారి వైరోచకుని శిరసు ఉత్తరించుతుంది. ఈ మాట రాక్షసునికి తెలియజేస్తాడు విరాధ గుప్తుడు. తన మొదటి ఎత్తు ఫలించనందుకు రాక్షసుడు చాలా బాధపడుతాడు.

మరి మన రెండవ ఎత్తుగడ ఏమయినది అని అడుగుతాడు రాక్షసుడు. అందుకు విరాధుప్తుడు “ఆర్యా! చంద్రగుప్తుడు చేరవలసినియా గదిలోనికి ముందు చాణక్యుడు వెళ్ళిచూడగా గోడకు ఏర్పడిన బిలము నుండి చీమలు మెతుకు చిదపలతో బారులుగా వచ్చుట గమనించి అది త్రవ్వించగా అందులో ముందే దాగియున్న 5 మంది బయటపడినారు. తక్షణము వారిని చంపించినాడు చాణక్యుడు. ఈ మాట విరాధగుప్తుడు చెప్పుటతోడనే రాక్షసుడు హతాశుడైనాడు.

మూడవ ప్రయత్నముగా ఒక అమిత బలశాలికి ధనము ఇతోదికముగా ఇచ్చి, రాక్షసుడు చంద్రగుప్తుని చంపమనగా, వాడు ఆధానమును విచ్చలవిడిగా ఖర్చుపెట్టుట జూసి సైనికులను పంపి వానిని బంధించి ఆరా తీయగా వాడు వాస్తవము తెలియజేసినాడు. ఆ సైనికులు వానిని అట్లే యమసదనమునకంపినారు. ఈవిధముగా రాక్షసుని మిగిలిన ఎత్తులు కూడా నిష్ఫలములైపోయినవని గ్రహించినాడు రాక్షసుడు ఆ చారుని మూలమున.  నిజానికి ఎవరూ చంపబడలేదు. అది చాణక్యుడు వ్యాపింపజేసిన పుకారు మాత్రమే!

మిగిలినది మరొక మారు...............

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము - 9వ భాగము

విషయము లోని నిజమును తెలియక ఎంతో నిస్పృహతో తాను పంపినవందిమాగధుడగు స్థనకలశుని గూర్చి అడుగుతాడు. అప్పుడు విరాధగుప్తుడు ఆతను ఇంకా ఉన్నాడని చెబుతాడు. ఈతనిని చంద్రగుప్తుని వందిమాగధులలో చేర్చుట యందుగల ఉద్దేశ్యమేమిటంటే వాడు అవకాశము దొరికినపుడల్లా  నీవు అఖండ ప్రజ్ఞా ధురీణునివి, అసమాన మేధాశాలివి, అతులిత బలసంపన్నునివి అని అతనిలో అవధిలేని అహంకారమును కూర్చడము. అందువల్ల అతను చంద్రగుప్తునిలో చాణక్యుని పై తేలిక భావమును ఏర్పరచి వారి మధ్య వైరుధ్యమును సృష్టించుట ఉద్దేశ్యము.

అసలు రాక్షసుడు చంద్రగుప్తని రూపు మాపుటకు చేసిన ప్రయత్నములు ఇన్ని అన్ని కావు. విషకన్య

ద్వారా చంద్రగుప్తుని చంపజూచినాడు. ప్రధాన శిల్పియగు దారువర్మని, చంద్రగుప్తుని మావటివాడగు బర్బరకుని, రాజ వైద్యుడగు అభయదత్తుని, శయనాధికారియగు ప్రమోదకుని, మర్మ ఘాతకులగు బీభత్సకాదులను లోబరచుకొని సమయము దొరికినపుదేల్లా చంపింపజూచెను. కానీ చాణక్యుని మేధోబలము, చంద్రగుప్తునిపై దైవానుగ్రహము ఆతనిని అన్నివిధములా కాపాడెను.

ఇది ఈ విధముగా కొనసాగుతూ ఉండగా కుసుమపురములో శరత్ పూర్ణిమ నాడు ‘శరత్ జోత్స్నోత్సవము’ జరిపించవలెనను కుతూహలము కలిగినది చంద్రగుప్తునిలో. ఆవిధముగా చాటింపజేయను కూడా చేసినాడు. సాయంసమయమాసన్నమైనది. చంద్రగుప్తుడు, వైహీనరుడు అన్న కంచుకితో ( ఇక్కడ అంతఃపుర కాపలాదారుడు అని అన్వయించుకొనవచ్చును) మేడమీదికి వెళ్లి దీపోత్సవము చంద్రుని వెలుగులు విరజిమ్ముచున్నదా లేదా చూడవలెనను ఉత్సుకతతో మాడీ పైకి చేరుకొంటాడు. పరికించితే దీపోత్సవమూ లేదు ఎటువంటి వేడుకా కనిపించలేదు. చంద్రగుప్తుడు వైహీనరుని కారణమడుగుతాడు. అతడు, ఆర్య చాణక్యుడు ఆపించినాడని తెలుపుతాడు. ముందు విశేషణము లేకుండా చాణక్యుని ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ సంబోధించరు. చాణక్యుడు చంద్రగుప్తుని ఏ రోజూ రాజా అని సంబోధించడు. కేవలము ‘వృషల’ అని మాత్రమే సంబోధిస్తాడు. ‘వృషల’ అంటే శూద్రస్త్రీ కి పుట్టినవాడు అని ఒక అర్థము. మరియొక అర్థము ఏమిటంటే, వృష అన్నమాటకు ‘ధర్మము’ అని ఒక అర్థము ‘ల’ అంటే నిలుపువాడు అంటే ధర్మసంరక్షకుడు అని ఒక అర్థము. చంద్రగుప్తుని లోని అహంకారము ఎట్టి పరిస్థితిలోనూ పెరుగ కూడదన్నది మొదటి అన్వయము, రెండవది రాజునకు కర్తవ్య బోధన. గమనించండి నాటి మహానుభావులెంతటి  విజ్ఞాన ఖనులో! మనమూ ఉన్నాము అమృత తుల్యమగు సంస్కృతమును పోగొట్టుకొని, తెలుగును సర్వనాశనము చేయుటకు శతవిధములా ప్రయత్నించుచున్నాము.

ఆర్య చాణక్యుని పేరువినగానే చంద్రగుప్తుడు ‘తర్హి తమ్ ద్రష్టుమిచ్ఛామి’  అన్నాడు. అనగా అయితే ‘ఆతనిని తక్షణము చూడవలెను’ అని అర్థము.

వైహీనరుడు ఆయనను పిలువ ఆయన కుటీరమునకు బయలుదేరినాడు. ఆ గుడిశను చేరి లోపల చూసి మనసున ఈ విధముగా తలపోసినాడు. ‘ఉపలశకలమేకం భేదకం గోమయానాం...... అహో రాజాధిరాజ మహామంత్రిణో గృహభూతిః’ అంటే ‘ఆహా! రాజాధిరాజు యొక్క ఈ  ప్రదానామాత్యుని వైభవము చెప్పనలవి కాదు. ‘చూచితిరా, పెళ్ళలు పెళ్ళలు గా రాలి పడుతున్న గోడకు మన్ను పేడ కలిపి చాణక్యుని వద్ద చదువుకొనే ఒక విద్యార్థి గోడకు అలడుతూ వుంటే వేరొకడు సమిధలు పేర్చి కట్టి అగ్నిహోత్రమునకు సిద్ధము చేస్తున్నాడు’ అని అంటాడు. భావి భారత సార్వభౌముని ప్రదానామాత్యునిది ఎంత నిర్లిప్తత, ఐహిక సుఖములపై ఎంత ఉదాసీన భావము. ఎంతటి కార్యదీక్షా దక్షత. ఇలా చెప్పుకొంటూ పోతే మనలాంటి వారికి  ఎన్నెన్ని అనుసరణీయ గుణాలో! ఇటువంటి నియమ నిష్ఠాగరిష్ఠులకే నిర్భీతిగా మాట్లాడుటగానీ మాట్లాడినది చెల్లించుకొనుటగానీ సాధ్యమౌతుంది. తక్కొరులకు ఇది అసాధ్యము. ఆయనకు శిరసువంచి నమస్కరించి నిలచినాడు వైహీనరుడు.

వైహీనరుని చూసిన చాణక్యుడు అతని రాకకు కారణమడుగుతాడు. వైహీనరుడు, రాజు చాణక్యుని పిలిచినట్లు చెబుతాడు. కారణము లేకండా తనవద్ద పనిజేసే అధికారులను రాజు పిలువరాదు అని అంటాడు చాణక్యుడు. ‘రాజు తలపెట్టిన ‘శరత్ జోత్స్నోత్సవమును నేనే నిలిపించినానని నీవు రాజుతో చెప్పియుంటావు’ అన్నది కూడా నాకు తెలుసు. ‘అయినా వస్తున్నాను పద అంటాడు చాణక్యుడు.

మాన్యవరుడగు చాణక్యుని చూడగానే ఆసనము నుండి దిగ్గున లేచి చంద్రగుప్తుడు ఆయనకు సాష్టాంగ దండప్రనామము ఆచరించుతాడు. ఆతనిని లేపి కూర్చుండజేసి తనను పిలుచుటకు కారణమడుగుతాడు చాణక్యుడు.

ఇక్కడ మీరు గమనించితే ‘ నాయనా చంద్రగుప్తా భోంచేసినావా, దినచర్య సక్రమముగా సాగుతూ ఉన్నది కదా’ మొదలగు ప్రశ్నలు ఏమీ వేయకుండా నేరుగా విషయమును స్పృశించుతాడు. వ్యవహారము ఆదర వాక్యములకు అవకాశములేదు అన్నది ఆయన మతము. అందుకే  ‘వర్ణేనా ప్త్యనర్థకేన నభవితవ్యం’ అంటే సంభాషణలో అక్షరము ముక్క కూడా వృథాగా వాడరాదు అని అంటాడు చాణక్యుడు. ఈ చిన్న వాక్యము చాలు ఆయన గొప్పదనము తెలియజేయుటకు.  ‘స్వప్నేతి చాణక్యః చేష్టతే చేత స్వప్రయోజనమేవ’‘ నిద్రలోకూడా ఆయన ప్రక్కకు పోరలితే  అందుకు కూడా ఎదో కారణముంటుందట. చూడండి ఆయన మహితకు కొలబద్ద ఉండే అవకాశము కలదా!

‘సరే ఎందుకు పిలిచినావో చెప్పు’ అన్నాడు చాణక్యుడు. ‘ఎదో నాకు జోత్స్నోత్సవము చేయించ బుద్ధికలిగి చాటింపజేసినాను’. ‘ అది కూడదు అని నాకు అనిపించి నిలిపించినాను’ అన్నాడు చాణక్యుడు. భయం భయంగానే ‘ ఇది చంద్రగుప్త రాజ్యమా లేక చాణక్య రాజ్యమా ‘ అన్నాడు చంద్రగుప్తుడు. సహనము కూడా ఆలస్యము చేయకుండా ఇది ‘చాణక్య రాజ్యమే’ అన్నాడు చాణక్యుడు. కారణము చెబుతాను విను.

మిగిలినది మరొక మారు...............

 

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము - 10వ భాగము

పాలకులు మూడు విధములగు బుద్ధులలో తమకు చక్కగా అనుకూలమైన ఒక దానిని  అనుసరించుతారు అవి 1. సచివాయత్త బుద్ధి 2. రాజాయత్త బుద్ధి 3. ఉభయాయత్త బుద్ధి.

సచివాయత్త బుద్ధి అంటే ఆలోచన అనగా మంత్రాంగము అంతా మంత్రి చేతిలో ఉంటుంది. రాజు దానిని కేవలము అమలుపరచుతాడు. రాజాయత్త బుద్ధి అంటే ఇక్కడ మంత్రి నామావశిష్ఠుడు. ఆతను చిన్న చిన్న ఆలోచనలకే పరిమితము. పెద్దపెద్ద ఆలోచనలు , నిర్ణయాలు అన్నీ రాజువే! ఇక మూడవది ఉభాయాయత్తబుద్ధి అంటే  ఇరువురూ కలిసి సుదీర్ఘముగా ఆలోచించి నిర్ణయము తీసుకొంటారు. ఇక్కడ అమలులో ఉన్నది సచివాయత్త బుద్ధి. కావున తాను చెప్పిన ప్రకారమే జరుగవలసియుంటుందని నొక్కి చెబుతాడు చాణక్యుడు. ‘మీరు ముఖ్య విషయములు నాకు చెప్పుటలేదు. 9మంది నందులనే మట్టుబెత్తగాలిగిన మీరు మలయకేతుని ఎందుకు ఇంతవరకూ చంపలేదు, నాకు తెలుసుకొనవలసిన అవసరము ఉంది’ అంటాడు చంద్రగుప్తుడు. ‘నేను చెప్పను, రేపటినుండి అంతా నీవే చూసుకో, నేను వేళుతున్నాను’ అంటాడు చాణక్యుడు. ఇక్కడ చూడండి ‘వెళ్ళిపో’ అనడు చంద్రగుప్తుడు, బదులుగా ‘రేపటినుండి రాజ్య కార్య కలాపములన్నీ నేనే నిర్వహించుతానని చాటించు’ అని కంచుకితో అంటాడు. రోషారుణ నేత్రుడైన చాణక్యుడు ‘నీవు మళ్ళీ నాకు నందుల విషయమును గుర్తుకు తెస్తూవున్నావు అని అంటూ అంటూ బయల్వెడల నుపక్రమించుతాడు.

ఇక్కడ కూడా చాణక్యుని ఎత్తుగడ ఉన్నది. చంద్రగుప్తుని చంపేందుకు రాక్షసుడు పన్నిన పన్నాగములన్నీ విఫలం కావడంతో భేదోపాయాన్ని ఎంచుకుంటాడు. చాణక్య చంద్రగుప్తుల నడుమ విభేదాలు సృష్టించాలని ఒక వైతాళికునిగా స్థనకలశుని  చంద్రగుప్తుని వద్దకు రాక్షస మంత్రి పంపినట్లు ముందే చెప్పుకొన్నాము. ఈతడు చంద్రగుప్తునికి గర్వం, అహంకారం పుట్టించేలాంటి స్తుతి చేస్తూ ఉంటాడు.  చాణక్య చంద్రగుప్తులిద్దరూ తమ తమ కార్యసఫలత వల్ల గర్వులై, సంతృప్తులై ఉన్నారు కనుక వారి మధ్య వివాదం పుట్టించడం సులభమని రాక్షస మంత్రి యోచన.

రాక్షస మంత్రి చేసిన ఈ పన్నాగాన్ని తెలుసుకున్న చాణక్యుడు తమ మధ్య విభేదాలు పొడసూపినట్టు ప్రవర్తించమని చంద్రగుప్తుడితో చెప్తాడు. భేదాన్ని సృష్టించినట్టు నటించేందుకు గాను పాటలీపుత్రంలో కౌముదీ మహోత్సవాన్ని చేయాలని చంద్రగుప్తుడు ప్రకటించగా, కౌముదీ మహోత్సవంలో ప్రజలు, రాజాధికారులు అప్రమత్తులై ఉండగా దండెత్తివచ్చేందుకు రాక్షస, మలయకేతువులకు అవకాశం దొరుకుతుందని చాణక్యుడు అంటాడు. ఆ అవకాశం లేకుండా చేయాలంటే కౌముదీ మహోత్సవాన్ని చేయరాదని చాణక్యుడు శాసిస్తాడు. చాణక్య చంద్రగుప్తులు వాగ్వాదం చేసుకున్నట్టు నటిస్తారు. ఈ అదను చూసుకుని చంద్రగుప్తుని శాంత పరిచే ప్రయత్నమూ మొదటి వైతాళికుడు చేస్తే. జరిగినదంతా నిజమని తలచి  కోపం రెచ్చగొట్టే స్తుతి చేస్తాడు స్థనకలశుడు. ఆరోజుకు తన అధికారమే చెల్లుతుంది కాబట్టి స్థనకలశుని సంహరించమని ఉత్తరువిస్తాడు చాణక్యుడు.

చాణక్య చంద్రగుప్తులు ఉత్సవ విషయముననే కాకుడా మలయకేతును సంహరిచే విషయములో కూడా విభేదించినారని తెలుసుకొన్న వాడై తన పూలు పుటికెలో పడినవని సంతసించుతాడు రాక్షసుడు. కానీ ఇదంతా అతని భ్రమే! నిజానికి మలయకేతునికి రాక్షసునిపై అవిశ్వాసము కలిగించుటలో కృతకృత్యుడౌతాడు చాణక్యుడు.

ఒకనాడు మలయకేతువు తన ఆభరణమును గౌరవపురస్సరముగా రాక్షసునకు బహుమానముగా పంపుతాడు. దానిని ధరించుతాడు రాక్షసుడు. ఇక్కడ సిద్ధార్థకుడు, చాణక్యుడు శకటదాసుని నిర్బంధించి మరణశిక్ష విధించగా, ఆతనిని తప్పించి తిరిగీ రాక్షసుని వద్దకు చేర్చుతాడు. ఇదికూడా చాణక్య పన్నాగమే! రాక్షసుడు మిక్కిలి సంతసించి అతనికి, మలయకేతుడు తనకిచ్చిన హారమును మెడనుండి తీసి సిద్దార్థకునికిస్తాడు. సిద్దార్థకుడు ఎంతో వినమ్రతతో, తనకు చాణక్యుడు ఇచ్చిన రాక్షస ముద్రికను ఉపయోగించి ఒక చింపి తాటియాకు ముక్కపై రాక్షస ముద్రిక యొక్క ముద్రవైచి, పెట్టెను మూసి ‘దీనిని తమయోద్దనే దాచియుంచుడు’ అని సగౌరవముగా ఇచ్చివేస్తాడు.  అట్లే, ఆ ముద్రిక తనకు చందనదాసుని ఇంటివద్ద దొరికినదని అదికూడా తిరిగి ఇచ్చివేస్తాడు. ఇపుడు సిద్దార్థకుడు రాక్షసునకు ముఖ్య అనుచరుడై కూర్చున్నాడు.

రాక్షసమంత్రి విశ్రాంతిగా కూర్చున్న సమయమున శకటదాసుడు ‘మూడు ఆభరణములు అమ్మకమునకు వచ్చినవి కొనమందురా’ యని అడుగ రాక్షసుడు వల్లె యని అంటాడు. ఆ నగలు పర్వతకునివి. రాక్షసునికి అది తెలియక అవి కొనుట జరుగుతుంది. అసలుకు అవి, చంద్రగుప్తునిచే, పర్వతకుని విషకన్య మూలముగా చంపిన తరువాత, తాను పంపిన బ్రాహ్మణులకు దానము ఇప్పించబడినవి. ఆ నగలలో ఒకటి రాక్షసుడు తన గళమున అలంకరించుకొంటాడు.

చాణక్యుడు ఎంతో తెలివితో తనకు ముఖ్య చారుడగు భాగురాయణుని, మలయకేతునికి కృత్రిమముగా కొన్ని ఆపదలు సృష్టించి, వానినుండి భాగురాయణుడు ఆతనిని రక్షించినట్లుజేసి, అతనికి ముఖ్యమిత్రుని గావించుటలో కృతకృత్యుడౌతాడు చాణక్యుడు. ఆ మైత్రిని అవకాశాముగా తీసుకొని అతడు రాక్షసుని తలలో నాలుకయై కూర్చుంటాడు. కొంతమంది చాణక్య చంద్రగుప్తులకు ముఖ్యమైన వారిని ఉద్యోగము నుండి తీసివేయించి భాగురాయాణుని సాయముతో మలయకేతుని వద్ద చేర్చుతాడు. చేర్చునపుడు కూడా వీరు సేనాధిపతి పనుపున వచ్చినవారే కానీ రాక్షసుని వల్లకాదు అని పొయ్యిలో అగ్నిని ఊదుడు గొట్టముతో ప్రజ్వరిల్ల జేసినట్లు రాక్షసునిపై మలయకేతుని కోపాగ్నిని ప్రజ్వరిల్లజేస్తూనే ఉంటాడు.

ఒక సమయములో భాగురాయణునితో వచ్చిన మలయకేతు రాక్షసుని ద్వారము బయటనిలది చంద్రగుప్తుడు చాణక్యుని పదవినుండి తొలగించినాడని చెప్పుట విని తన అనుమానమును ధృవపరచుకొంటాడు.  అయినా లోనికి వెళ్లి చంద్రగుప్తునిపై యుద్ధప్రయత్నమునకు సంబంధించిన విషయముల గూర్చి మాటలాడి వెళ్ళిపోతాడు.

వారనుకొన్న ప్రకారముగా దండయాత్ర జరుగుతుంది. మలయకేతువు కటకము నుండి ఎవరుగానీ భాగురాయణుడు వేసియిచ్చు ముద్రాచిహ్నము లేనిదే వెలుపలికి పోవుట కానీ లోనికి వచ్చుట కానీ నిషేధింపబడినట్లు ప్రకటించుతాడు.

ఇదే సమయమని తలచి సిద్ధార్థకుడు, చాణక్యుని ఆదేశముతో చాణక్యుడు గతమున వ్రాసి తనచేతికిచ్చిన ఉత్తరము మరియు తాను రాక్షసుని వద్దనుండి పొందిన బహుమతులను చేతబూని భాగురాయాణుని ముద్ర లేకుండగనే ప్రయాణమౌతాడు. మరి అందరూ ఒక గూటి పక్షులే కదా!

కానీ నాటకములోని భాగముగా, ముద్రలేకుండా బయలుదేరిన సిద్ధార్థకుని బంధించి, మలయకేతు భాగురాయణులకు అప్పగించుతారు సైనికులు. కొంత హింసింపబడిన పిమ్మట సిద్ధార్థకుడు తాను రాక్షసుని పనుపున, రాక్షసుని ముద్రతోనున్న పేటికను, లేఖను రాక్షసుని ఆదేశముపై తీసుకొని చంద్రగుప్తుని వద్దకు పోవుచున్నట్లు తెలుపుతాడు. మలయకేతువు విషయమును వాస్తవమని నమ్మి రాక్షసుని ద్రోహిగా నిశ్చయించి పిలిపించుతాడు. లేఖ శకటదాసుడే వ్రాసినాడని నిరూపితమగుటచే, విధికి తలవంచినాడు రాక్షసుడు. మలయకేతుడు రాక్షసుని చంప ఆదేశమివ్వబోగా, ‘ఇప్పుడు రాక్షసుని చంపవద్దు, అది చంద్రగుప్తుని మరణానంతరము జరుగవలసినదని’, మలయకేతుని  నమ్మించుతాడు భాగురాయణుడు. ఇది కూడా చాణక్యుని మంత్రాంగమే! అందుచే అతనిని విడిచిపెడుతాడు మలయకేతు. ఇంతజరిగిన తరువాత ఈతని సేవ జేయుట అసమంజసమని తలపోసి, కనీసము తన ప్రాణమిత్రుడగు చందనదాసుని విడిపించుటకు కుసుమపురమునకు బయలుదేరుతాడు రాక్షసుడు.

మిగిలినది మరొక మారు...............

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము - 11వ భాగము

రాక్షసుడు నిరాయుధుడై తన వద్దకు రప్పించుకొనవలెనన్న కారణాన ఒక షడయంత్రము రచించి

తనకు నమ్మకమగు ఒక రాజోద్యోగినిఏమి చేయవలసినది చెప్పి, రాక్షసుడు పాటలీపుత్రము లోని జీర్ణోద్యానము గుండా వస్తున్నాడని గ్రహించి, అచటికి పంపుతాడు. ఆతడు రాక్షసుడు వచ్చుదారిని గ్రహించి ఒక చెట్టుకొమ్మకు ఉరిత్రాడు తగిలించి ఆత్మహత్యకు పూనుకొన్నట్లు  నటించుచుంటాడు. అనుకొన్న విధముగా రాక్షసుడు ఆ దారిన వచ్చి ఆతనిని చూసి ఓదార్చి ఆత్మహత్యకు కారణమడుగగా అతడు తన మిత్రుడు జిష్ణుదాసుడు అనుకోని ఆపదచే అగ్నికి ఆహుతియై ఆత్మార్పణము చేసుకోదలచినాడని, ఆ వార్త వినుటకు మున్నే తాను,ఆత్మార్పణము చేసుకోదలచినట్లు తెలియజేస్తాడు. రాక్షసుడు ఆతనిని ఆపని నుండి నివారించి, తన కర్తవ్యమును ఎరిగినవాడై వెంటనే, వధ్యస్థానమునకు పరుగెత్తి తానే రాక్షసుడనని, తన కొరకు ఆమహనీయుని బలి ఇవ్వవద్దని చెబితే ఆతనిని చాణక్యుని వద్దకు తీసుకుపోతాడు ఒక తలారి. చాణక్యుడు రాక్షసుని చూడగానే తన స్థానము నుండి లేచి నమస్కరిస్తాడు. ఆయన గుణగణములను పొగడి, గతమును గూర్చి తలువక, భావి సామ్రాట్టగు చంద్రగుప్తుని అమాత్యశేఖరునిగా ఉండమని విన్నవించి చంద్రగుప్తుని పిలువనంపుతాడు. చంద్రగుప్తుడు వచ్చినవెంటనే సాష్టాంగ నమస్కారము రాక్షసునకు ఆచరింపజేయించి ఆశీర్వాదము పొందింపజేస్తాడు చాణక్యుడు. చంద్రగుప్తుని సుగుణమునకు ముగ్ధుడైన రాక్షసుడు చంద్రగుప్తునికి మంత్రిత్వము వహించుటకు ఒప్పుకొంటాడు. ఆవిధముగా చందనదాసును రక్షింపగలిగినందుకు రాక్షసుడు సంతసిన్చుంచుతాడు.

రాక్షసుడు తొలగుట వలననూ చిత్రవర్మాదుల ఘోర దండనము వలననూ మలయకేతుడు చాణక్య షడయంత్ర వలయమున బందీయౌతాడు. ఆతనిని బందీజేసి సైనికులు చంద్రగుప్తుని  ముందు నిలుపగా, రాక్షస ప్రార్థితుడైన చంద్రగుప్తుడు ఆతనిని విడిచిపెట్టుటయేగాక ఆతని తండ్రి రాజ్యమును ఏలుకొమ్మని అతనికే ఇచ్చివేస్తాడు. అసలు చాణక్యుని మాయాజాలమున తగుల్కొని మరణించినారని అనిపించుకోన్నవారందరూ సప్రాణులై అచట తీరిన సభలో నిలుపుతారు. అందరూ చాణక్యుని రాజనీతిజ్ఞాతను పొగడినవారే!

ఈ విధముగా, తీరిన ప్రతిజ్ఞ కలవాడగు చాణక్యుడు కథను అన్నివిధముల సుఖాంతము చేస్తాడు.

మిగిలినది మరొక మారు...............

విశాఖ దత్త విరచిత ముద్రారాక్షస నాటకము - 12వ భాగము

పాత్రల చిత్రణ

ఈ నాటకము లోని ప్రతి పాత్రను వ్యక్తిత్వము తో భాసింప జేసినాడు విశాఖదత్తుడు. కౌటిల్య నామాంతరము గల్గిన ఆర్య చాణక్యుని పాత్ర చిత్రణ అద్వితీయమనిపిస్తుంది .ఈయనకు సమ ఉజ్జీగా నందరాజ మంత్రి రాక్షసామాత్యుని తీర్చిదిద్దినాడు. స్థాయి ఏ మాత్రం తగ్గించలేదు. అయితే చాణక్యుడు నిస్వార్ధ జీవి. దేశ రక్షణ నిష్ఠాగరిష్ఠుడు. పండితుడేకాక కార్య శీలి, సాహసి, నిర్దుష్ఠమైనవ్యూహ కర్త. అనుకొన్నది సాధించటానికి ఎంతదూరమైనా పోగలవాడు. చేపట్టిన పని మధ్యలో వదిలిపెట్టని ధీరుడు. కార్యము సానుకూలమగుటకు సర్వ విధములా ప్రయత్నిస్తాడు.

ప్రతి ద్వంద్వి రాక్షమంత్రి కొంచెం మెత్తటి వాడు. దీనికి విరుద్ధము చాణక్యుడు. కార్య సాధనలో అతి కఠినం గా వ్యవహరిస్తాడు. తన మనసులోని ఆలోచనలను రాజగు చంద్రగుప్తునికి కూడా తెలియ నివ్వని రహస్య మంత్రాంగం ఆయనది. రాక్షసుడూ ఏ పదవీకోరుకో లేదు. నంద వంశ సంరక్షణే ధ్యేయం గా జీవించినాడు. ధర్మ పక్షపాతి చాణక్యుడైతే, అధర్మానికి ఆసరాగా నిలిచి రాక్షసుడు దెబ్బతిన్నాడు. కురుక్షేత్ర యుద్ధములో భీష్మాదులు ఏవిధముగా ప్రవర్తించి దెబ్బ తిన్నారో ఇక్కడ రాక్షసుడు, ఆయనను నమ్మిన వారు అదేవిధముగా తమ సర్వస్వమునూ  కోల్పోయినాడు. విజయము ధర్మానిదే అన్న వాస్తవమును ఈనాటకము లో విశాఖ దత్తుడు చెప్పకుండానే  చెప్పినాడు.

ముద్రాక్షస' కథ సాహితీ ప్రపంచమున సుప్రసిద్ధమైనది. ఈ నాటకము యొక్క పేరునకు ఆధారము ఈ సంఘటన - రాక్షసుడు తన ముద్రికను తనకే వ్యతిరేకంగా ఉపయోగించడాన్ని చూసి ఆశ్చర్యపోయి వివశుడైపోతాడు. ఇందులో చంద్రగుప్తుని సింహాసనారోహణ తర్వాత చాణక్యుడు రాక్షసుడి రాజకీయ కుయుక్తులను తిప్పికొట్టిన కథను ఏడు అంకములలో రసవత్తరముగా  వ్యక్తీకరించుట జరిగినది.

నాటక రచయిత యగు విశాఖదత్తుడు,  చాణక్యుడు మరియు రాక్షసుని యొక్క ప్రణాళికలను పూర్తి రాజకీయ చతురతతో మన కనులముందు సాక్షాత్కరింపజేస్తాడు.  నాటక ఘటనాక్రమమును నిర్వహించుటలో, ప్రేక్షకునికి, సహజత్వము, ఉత్సుకత మరియు ఆసక్తికి కలుగురీతిన తన రచనలో, తగినంత శ్రద్ధ కనబరిచినాడు. నాటి రాచరికపు ఎత్తుగడలను అప్పటి రాజకీయ నాయకుల ద్వారా, వారి వారి ఎత్తులను, జిత్తులను, ఆసక్తికరమైన వివరాలతో ఈ నాటకమును స్సంపన్నము చేసినాడు విశాఖదత్తుడు.

చాణక్య చారులుతమకు అప్పగించిన విషయమున, తమ ఆసక్తి-ఆనాసక్తి లేదా తమ స్వేచ్ఛా సంకల్పముల గురించి యోచించక, నిబద్ధతతో  తమకు అప్పగించిన పనులను నిర్వహించించుట వారి స్వామిభక్తికి ఒరపురాయి. ఇది వారి కార్య దీక్షకు  కర్తవ్య నిరతికి ఉత్తమ ఉదాహరణ. సంఘటనల యొక్క దారావాహికత ఈ నాటకము యొక్క ప్రశంశాపాత్రమగు నాణ్యత, మనము అప్రమత్తతతో గమనించినామంటే, వీరి కుట్రల ప్రణాళికలో ఎక్కడా దాడి లక్ష్యంగా లేదు.

చాణక్యుడి మోసపూరితమగు  ఎత్తుగడల కారణంగా కథాంశం సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, నాటక రచయిత దానిని క్రమ మరియు సమన్వయ పద్ధతిలో ఉంచుటలో అద్భుతమైన విజయమును సాధించినాడు. ఇందులో నాట్యశాస్త్రానుసారముగా (నాటకము కూడా నాట్య శాస్త్రములోని భాగమే!) కార్యస్థితి, అర్థ-ప్రకృతులు, సంధులు మరియు వృత్తులు చక్కగా ఉపయోగించబడినాయి.

సర్వేపిస్సుఖినస్సంతు సర్వ్ సంతు నిరామయాl

సర్వ్ బద్నాని పశ్యంతు మాకశ్చిత్ దుఃఖభాగ్భావేత్ ll

స్వస్తి.

రచనలో ఏవయినా తప్పులు దొర్లి ఉంటే అందుకు నేనే బాధ్యుడను.

ఈ రచనకు సహకారమునందుకొన్న గ్రంథములు:

1.       విశాఖదట్టుని సంస్కృత నాటకము ‘ముద్రారాక్షసము

2.    తిరుపతి వెంకట కవుల ‘ముద్రారాక్షస’పు తెనుగు సేత

3.    కీర్తి శేషులు అవధానం చంద్రశేఖర శర్మ గారి ‘ముద్రారాక్షస’పు తెనుగు సేత

స్వస్తి.