Tuesday, 15 January 2019

కనుమ పండుగ


కనుమ పండుగ 
మకర సంక్రాంతి ఎంతో ఉల్లాసముతో ఉత్సాహముతో ముగిసింది. నేడు  “కనుమ” లేక "కనుము" జరుపుకొంటాము. కనుము అన్న మాటకు శబ్ద రత్నాకర నిఘంటువులోతృణ విశేషము అన్న అర్థము కానవస్తుంది. ‘కనుమ’ అన్న మాటకు మార్గము అని తెలియవస్తుంది. ఈ పండుగ పంట పైరుకు సంబంధించినది కాబట్టి ధాన్యమును ఇంటికి తరలించి గడ్డి లేక తృణమును మేట వేయుటతో  వ్యవసాయ కార్యమునుండి రైతుకు విశ్రాంతి దొరుకుతుంది. అందుకు ప్రతీకగా ‘కనుము’ అన్న పదమును పెద్దలు వాడినారేమో!
ఈ రోజున రైతు వ్యవసాయంలో సహకరించిన పశువులను సమ్మానించి పూజించుటతో ఈ పండుగకు తెరపడుతుంది. కొందరు రేపుకూడా ‘ముఉక్కనుము’ పేరుతో యాటలు కోసి, మద్యపానము, కోడిపందేముల కొనసాగింపుతో జరుపుకొంటారు కానీ, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నది పెద్దల మాట.
విషయానికి వస్తే, ఆ రోజున పశువుల కొట్టాలను అంటే పాకలను  చక్కగా అలంకరించి పశువులును కొమ్ములకు రంగులు వేసి పూవుల మాలలతో  బాగా అలంకరించి ఆ రోజున ఉదయం అక్కడ పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు.

దీనినే “ పొలి చల్లటం” అని అంటారు. దీనివల్ల వారి పంటలు బాగా పండుతాయి అని వారి విశ్వాసం. మరియు పశువులు మెడలో వడలతో తయారు చేసిన మాలలు లేక  కొన్ని ప్రాంతాలులో అతిరసములతో అంటే అరిసెలతో చేసిన మాలలు వేసి, ఊరేగించుతారు. కనుము కర్షకుల పండుగ. పాడి పంటలను, పశు సంపదను, లక్ష్మీ స్వరూపంగా అర్పించే రోజు కనుము. ప్రకృతి స్వరూపిణీ అయిన అమ్మ ఆరాధన విశేషమే కనుము.
ఈ రోజు కోడిపందెములు పేకాటలు వివిధరకములగు జూదములు ఈ దినమున విరివిగా కొనసాగుతాయి. డబ్బు చేతిలో వున్నది కదా! గాలిపటములు ఈ రోజు కూడా ఉత్సాహముతో ఎగురవేస్తారు. ఈపండుగను పూర్వము పాశ్చాత్య దేశములలో కూడా ఆడంబరముగా జరుపుకొనేవారు. క్రైస్తవము వచ్చిన పిదప ఆ సాంప్రదాయము సమసిపోయి సార్థకత లేని క్రిస్మస్ ను నెత్తికెత్తుకొన్నారు.
ఏది ఏమయినా తమకు సంవత్సరమంతా పాడిపంటలకు తోడ్పడిన పశువులకు కృతజ్ఞతలు చెప్పడాకి 'కనుము' పండుగను జరుపుకుంటారు. కృతజ్ఞతకు పరాకాష్ట కాదా ఈ సంబరము. అది ఈ సనాతన ధర్మమునకు మాత్రమె చెల్లినది.
స్వస్తి.

2 comments:

  1. చక్కని లఘవ్యాసములో యెన్నెన్నో ముఖ్యమైన విషయాలు తెలిపారండీ.ముఖ్యంగా కనుమ,కనుము పదాలకు గల మార్గము,తృణము అను అర్ధాలను తెలుపుతూ వ్యవసాయదారులు ధాన్యలక్ష్మిని పూజించే పండుగ గనుక తృణము అను అర్ధమే సమంజసమని చక్కగా వివరించారు..రైతులు పొలాల వద్ద చేసే పూజ,పొంగలి వండి దేవునికి నైవేద్యం పెట్టిన ఆ పొంగలిని పొలాల్లో జల్లడం,పశువుల అలంకరణ మొదలగు సంప్రదాయాలను చక్కగా తెలిపేరండీ. మీకు అనేకానేక అభినందనలండీ రామ మోహన రావు.

    ReplyDelete
  2. మీ కవనం చాలా బాగుందండీ.అనేక అభినందనలు సర్

    ReplyDelete