ఇంత రంగము -- అంతరంగము
ఉరకలు పరుగులు ఉరకలు పరుగులు
ఊపిరి సలపని పని నలు చెరుగులు
తారా గ్రహములు తిరుగు ఖగోళము
నా మనసయ్యది గందర గోళము
జీవిత మార్జన కే యంకితమా
జీవితాని కార్జన యంకితమా
ఎంత కాలమీ తలమునకల పని
ఎంత త్రవ్వినా తరగనిదీ గని
పెరిగిన తదుపరి ఏమౌతావని
యడిగిన తెలిపితి తెలియదని
ఇప్పుడు నాకనిపిస్తూవున్నది
‘తరగని
పెన్నిధి బాల్యమన్నది’
టక్కరిగాళ్ళగు మిత్రులు వున్నా
వారియందు గల టెక్కులు సున్నా
పది కాసులు నా దగ్గర వుంటే
ఈగల గుంపులు బెల్లము చుట్టే
జేబులు ఖాళీ అయినాయంటే
తెలియును నా వారెవరో కంటే
నాన్న పెత్తనము ఉండే వరకు
మిగిలిన కోరిక లేవీ చివరకు
పగ్గము చేతులకంద వెంటనే
నిరతము కారెను నీరు కంటనే
అవసర మాదాయమును మించగా
కోరికలే కొడి గట్టి పోయెగా
అడుగుతారు బాగున్నారా యని
తలనూపెదనే దానికి ఔనని
నిజమును చెప్పే ధైర్యము లేదు
పెదవులపై దరహాసము రాదు
విధి మాయ కదా ఈ విపరీతము
విస్తుపోక వేరేమిటి చేతము
జీవుడున్నచో నీట మునుగుదుము
వదలి వేయుచో పైకి తెలెదము
మాయామయమీ మాధవ లీలలు
తెలియ లేములే దేవుని హేలలు
ఆలోచన లో మునిగిపోవగా
గతుకుల దారుల గదిని చేరగా
గురువుల గాంచితినాశ్చర్యముగా
ఒక్కరొక్కరుగ చెప్పిరి సూక్తులు
ప్రాణమునెరుగని జీవన్ముక్తులు
ఇంటి కప్పు తానిట్లు తెలిపెను
‘ఉన్నత
భావములుండ వలయును’
పంఖా ‘నే గది నుంచినట్లుగా
నీ మది చల్లగ వుంచవలెనుగా’
గడియారము ‘నీవుండుము నాలా’
‘పడి
లేస్తూ పనిచేసే అలలా’
అద్దము ‘నీ మది శుద్ధముగుంటే
అందముండు నీ కట్టెదుటే’
కిటికీ ‘చూడుము లోకమునంతా
పిడికిట నుంచుము అనుభవమంతా’
తలుపు తెలిపె ‘నీ తలపుల నెప్పుడు
సమయోచితముగ మూయి తమ్ముడు’
‘జీవితమంటే
ఇంత రంగము
ఉన్నది చూ’డనె అంతరంగము
No comments:
Post a Comment