అంతంకాదారంభం
కుళ్ళు కుట్ర చక్రాలను
కుదురుగా అమర్చుకొన్న
స్వార్థమనే ఇరుసుపైన సాంతము
తా నిలచియున్న
తేరు పైన ఊరేగిన
దిక్కెరుగని దొరతనాలు
చూచినారు ఈ నాటికి చూడలేని
పతనాలు
కనికరమను మాట మరచి కడు
నిర్దయ కందకాల
ప్రజల కప్పి తోలినారు
ప్రబలంగా తేరు కదల
సంభవించె పదచ్యుతి సతమతమౌ
మనస్థితి
నేడు వారిదధోగతి చూడు భవిత
పురోగతి
శ్రావణ మేఘాల నెల్ల
సముద్రమున చేర్చింది
శరదృతువు వచ్చింది శశి
వెలుగులు తెచ్చింది
మూలికలుత్తేజమంది మొండి రోగముల
గుదుర్చు
సోమహాస భాసములో సుజన తతికి
ముదము గూర్చు
కంటకులను కంటకాల కలుపునేరి
పారవేసి
ఫలరసాల సాలములను పాదుగొలిపి
పెంపుజేసి
కష్టజనుల చెమట నీరు కడుపేదల
కంటినీరు
కలసినట్టి కాంక్రీటును
కలుగు బాట వేసినారు
ఒకరికొకరు సాయపడుచు
ఉద్యమధ్యేయాన వారు
నడమంత్రపు సిరి గాళ్ళకు నభ
తారల జూపినారు
ప్రగతి కొరకు పాటుబడని
ప్రభుత లెల్ల బరిమార్చి
మమతారాగాలనెల్ల మనసులోన
చేర్చి పేర్చి
మన యాతాయాతమ్ముల మధురస్మృతి
జేయగోరి
ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు
ఏర్పడింది రహదారి
ప్రగతి కొరకు పాటుబడని
ప్రభుతలెన్నొ మారిమారి
కానీకిది గోదారి కాపాడీ
రహదారి
ఆగవలదు ఇంతటితో ఆపవద్దు
సంరంభం
అయిపోయిందనుకోకిది
అంతంకాదారంభం