Tuesday, 29 January 2019

చింత


చింత
https://cherukurammohan.blogspot.com/2019/01/blog-post_29.html
భగవత్ చింతన ఉత్తమోత్తమ మైనది. నేను దానిని గూర్చిగాక లౌకికమైన చింతను గూర్చి తెలియజేయుచున్నాను.
చితా చింతా సమాహ్యుక్తా బిందుమాత్రవిశేషతఃl
చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపుఃll
चित चिंत (చిత, చింత) అన్న రెండు పదాలు దేవనాగరి లిపిలో వ్రాస్తే చింతలో ఒక బిందువు ఎక్కువ వుంటుంది. కానీ అర్థభేదము అపారము. చిత అన్నది శవాలను కాలుస్తుంది కానీ చింత జీవించే వారినే కాల్చివేస్తుంది. దీనిని బట్టి చింత ఎంత ఘాతుకమో మనము అర్థము చేసుకొనవచ్చును. ఈ విషయమును నాదయిన రీతిలో చెప్పిన ఈ పద్యమును చదవండి.
                                 చింత అదెంతయైన మరి చెంతన చేరగ చిత్తగించినన్
        ఎంతటివాడు కూడ గతినెంచగ తప్పును కొంతయైనయున్
సంతసమన్నదే వెదుక సంతనగూడ లభించగల్గునే
కంతలు గల్గు దుప్పటిని గప్పిన వేడిమి రాదు మోహనా!
అర్థము సుగమము కాబట్టి నేను విశ్లేషించలేదు. చింతలన్న కంతలున్న దుప్పటి కప్పుకొంటే చలితో ఏర్పడిన వణుకు తగ్గదు కదా!
సుభాషిత భాండాగారములోని ఈ అనర్ఘ రత్నమును పరికించండి.
అగ్నౌ దగ్ధం జలే మగ్నం హృతం తస్కరపార్థివైః
తత్సర్వం దానమిత్యాహుః యది క్లైబ్యం న భాషతే
- సుభాషితరత్నభాండాగారము
ఒకవేళ మన వస్తువేదయినా , అగ్నిలోబడి కాలి పోవడము గానీ, నీటిలోబడి మునిగి పోవడము గానీ లేక చోరులచేత తస్కరింపబడటము కానీ జరిగితే , పోగొట్టుకొన్న దానిని గూర్చి పరితపించక  కృష్ణార్పణం అన్న దృష్టిని అలవరచుకొంటే అంతకు మించిన ఆనందమే ఉండదు. మనసులో బాధ లేకుంటే వుండబోయేది ఆనందమేగదా . కాబట్టి పోగొట్టుకొన్న వస్తువును దానమిచ్చిన  దృష్టితో చూస్తే ఆవేదన పోతుంది, ఆత్మ సంతృప్తి వస్తుంది. ఆవిధంగా మనము వుండలేకపోయినంత మాత్రాన ఎవరూ ఉండరని మాత్రం అనుకోవద్దు. ప్రపంచములో మహా పురుషులింకా వున్నారు. వారలే మనకాదర్శము. ధర్మరాజు ఈ కోవకు చెందినవాడు. తానావిధముగా ఉండుటయేగాక తన తమ్ములను, కలత్రమును కూడా ఆ దారిలోనే నడిపించినాడు. ఇక్కడ ఆయన రాజ్యము ఎట్లు పోగొట్టుకొన్నాడు, అది ధర్మ సమ్మతమా లేక వ్యసనమా అన్న వాదమునకు ఇక్కడ తావులేదు. భగావానుడగు శ్రీకృష్ణుని తోడునీడయే పాండవుల నిబద్ధత చాటుతుంది.
శ్రీనాథ కవి సార్వభౌముడు తాను వ్రాసిన కాశీ ఖండములో, ఈర్ష్య వల్ల ఏర్పడిన చింత వింధ్యాదీశుని గర్వము సర్వము ఖర్వము గావించినది అన్నది జీవితాంతము మానవులమైన మనము గుర్తుంచుకొనవలసిన విషయము.
శ్రీనాథ విరచిత కాశీ ఖండములోని వింధ్యాద్రి స్వగతమును ఒకసారి పరికించండి.
మేరువు తనకన్నా గోప్పదేమో అన్న ఒక్క చింత వింధ్యపర్వతము యొక్క మనస్సును చింతాజ్వరముతో కృశింపజేస్తూ వుంది.
భేషజం బెద్దాని భేదింపఁజాలదు 
లంఘనంబున నెద్ది లావు చెడదు
తఱిగించు బుద్ధినిద్రామహోత్సాహ క్షు
ధాకార తేజోబలాది నెద్ది
నాసత్యచరక ధన్వంతర ప్రభృతి వై
ద్యులకు నసాధ్యమై యుండు నెద్ది
దివసంబు లీరేడతిక్రమించిన యప్డు
జీర్ణత్వదశ నధిష్ఠింపదెద్ది
          ప్రత్యహంబు నవత్వంబు వడయు నెద్ది/
          యట్టి చింతా జ్వరంబు తన్నలముకొనియె/
          నేమి సేయుదు నింక నే నెచటఁ జొత్తు/
          నెట్టు నిర్జింతు మేరు మహీధరంబు.
దేనిమీదనయితే ఏ మందులూ పనిచేయవో, ఉపవాసాలు ఎన్నిజేసినా దాని లావు సన్నగిలదో, ఏదయితే బుద్ధి, నిద్ర ఉత్సాహ ఆకలి ఆకారము తేజస్సు మొదలగునవి క్రుశిమ్పజేస్తుందో,  తరిగించుతుందో, చరక ధన్వంతరి వంటి మహా భిషగ్వరులకు కూడా దేనిని రూపుమాపుట సాధ్యము కాదో, ఏదయితే ఎంతకాలమునకైనా జీర్ణించుకొన శక్యము కాదో, ప్రతి దినము కొత్తపోకడలతో దహించుచున్నదో అట్టి చింతా జ్వరము  అలముకొన్నది. నేను ఏమి చేసేది? ఎచటికి పోయేది. ఆ మేరుపర్వతమును ఎట్లు జయించేది? అని వాపోవుచున్నది వింధ్యపర్వతము.
చింతకు ఈర్ష్య చేరితే ఏ విధముగా వుంటుంది అన్న ఈ పద్యమును శ్రీనాథులవారు వింధ్యేంద్రుని ద్వారా చెప్పించిన ఈ పద్యము వింటే ఇది భారతములో పరాభవము చెందిన దుర్యోధనుడు కదా ఇది చెప్పినది అనిపిస్తుంది.  ఈర్ష్య ఎంతగా వ్యక్తిని వ్యాకులపరుచుతుందో చూడండి.

కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటకమిందునే? యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబుగలయట్టి మనుష్యునకెట్టి వానికిన్
గంటకుఁ డైన శాత్రవుఁడొకండు దనంతటి వాఁడుగల్గినన్.

కంటికి నిద్ర రాదట, రతికేళి కూడా సుఖమును కూర్చదట, ఎంత రుచికరమయిన వంట కూడా నోటికి ఇంపితము కాదట, అవి పదివేల విధములగు వైభవములే కానీగాక మనసు ఇష్టపడదట, ఎవరికి, ఎటువంటివానికి అంటే మానవత గల్గిన మనిషికి ఎవనికైనా తనంతటి శత్రువు ఒకడు ఏర్పడినాడంటే వాడు ‘చెప్పులోని రాయి, చెవిలోనిజోరీగ, కంటిలోని నలుసు, కాలిముల్లు కదా’!
ఇది ఈర్ష్య తో కూడిన చింత. ఇది ఇంకా బయంకరమైనది. గమనింంచినావు కదా!
ఈ కథను ఒకసారి గమనించు. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరి సంపద చూసి ఇంకొకరికి ఈర్ష్య.  దానిచే ఒకనికన్నా ఇంకొకడు అమిత ధనవంతుడు కావలెనను చింత.  ఎంతో యోచించి పెద్దవాడు, తపస్సు చేస్తే తనకోరిక సాధించుకోనవంచును అన్న ఆలోచన కలుగుటచేత ఒక కొండగుట్ట చేరి తపమాచరించ మొదలుపెట్టినాడు. ఇది తెలిసిన తమ్ముడు తానూ కూడా అదే పని అదే కొండపై అన్నకు కాస్త దూరములో మొదలుపెట్టినాడు. ఎత్లయితేనేమి దేవుడు ముందు తపస్సు మొదలుపెట్టిన పెద్దవానికి ప్రత్యక్షమై వారము కోరుకొమ్మన్నాడు. వాడు కళ్ళు తెరువగానే దేవునికన్నా ముందు తమ్ముడు తపస్సు చేయుట చూసినవాడై, దేవుని ‘స్వామీ! నీవు ఎటూ ఆ తపస్సు చేసుకొనే వానికి కూడా ప్రత్యక్షమౌతావు కదా! వాడు కోరిన దానికి నాకు రెండితలివ్వు.’ అన్నాడు. పనిలో పనిగా దేవుడు తమ్ముని ఎదుట నిలిచి వారము కోరుకొమ్మన్నాడు. వానికి ‘అన్న’ చింత కదా! ‘వాడేమి కోరినాడ’ని అడిగినాడు. అబద్ధామంటే తెలియని దేవుడు ఉన్నమాట చెప్పినాడు. తమ్ముడు వెంటనే “స్వామీ అట్లయితే నాది ఒక కన్ను గుడ్డి చేయి” అన్నాడు. తక్షణం వీడికి ఒక కన్ను వాడికి రెండుకళ్ళు పోయినాయి. ఈర్ష్య చింత కలిస్తే ఇంత అనర్థము దాపురించుతుంది.
ఈ సందర్భముగా నేను వ్రాసిన ఈ పద్యమును గమనించండి.
ఎంతటి  వానికైన  మది  నేర్పడు చింతకు  ఊపిరూదుచున్
చెంతన  ఈర్ష్య  వున్న  ఇక  చింత  దవానలమౌచు  రేగి  
పొంతన  లేని  దుష్టగుణ  పూత విపత్తి విషాద మూకలన్
సంతతముంచి చిత్తమును సాంతము గాల్చును రామమోహనా!
పూతము= చిక్కనయిన
అందుకే చింత అన్నది luggage తో పోల్చుకొంటే నాకు ఒకకాలమునాటి Railway Slogan గుర్తుకు వస్తుంది.
Less luggage More Comfort Make Travel A Pleasure.
స్వస్తి.

Friday, 25 January 2019

బాధాకర విషయము


బాధాకర విషయము

https://cherukurammohan.blogspot.com/2019/01/blog-post_25.html

మనది ధర్మమే కానీ మతము కాదు అన్నది మనకు తెలిసిన విషయమే! ప్రపంచములో ఆదిపత్యమునకై పోరాడుచున్న పెద్ద మతములు తమ మత గ్రంధములను అనుసరించవలెనన్నది వారల నిబంధన లేక నిర్బంధన.

మన ధర్మమే మనదారి. మన దారిలో మనము పోతున్నాము. ఒకానొక కాలములో అది రాజ మార్గము. రథ్యల(Roads) కు ఇరువైపులా ఆహ్లాదము గొలిపే చెట్లు ఉండేవి. సువాసనలు వెదజల్లే పూలమొక్కలు ఉండేవి. ఆకలిగొన్నవారికి ఆహారమునందించే ఫలసాలములు ఉండేవి. విమతస్థులు ఆ చెట్లను నరికినారు. మొక్కల పెరికినారు. ఫలసాలముల పాదులలో విషము కలిపినారు. అయినా మనకేమీ పట్టదు. ‘ఉదారవాదులము’, ‘మానవతా వాదులము’ అన్న బిరుదములను మనకు మనమే కల్పించుకొని లేక తగిలించుకొని లేక ఇచ్చుకొని మన సముదాయమునే మనమే మార్చుకొనే ప్రయత్నము చేస్తాము. కాళీదాసు ఉద్దండ పండిత కవి. అది కాకమునుపు ఆయన ఒక జ్ఞాన హీనుడు. తను కూర్చున్న కొమ్మను తానే నరికే ఆ కాళిదాసు మనకాదర్శ ప్రాయుడు. మహాపండితుడు, సకల శాస్త్రవేత్త, మహాకవి అయిన కాళీదాసు విషయములో  పేరు తప్ప మనకేమీ తెలియదు. తెలుసుకొనుటకు ఉత్సాహమూలేదు, సంస్కృతమూరాదు. నేర్చుకోవాలన్న తపన లేదు. సంస్కృతము వరకెందుకు మనకు సరిగా తెలుగే రాదు. మాతృ భాషయే సరిగా రాదన్న బిడియము లేదు.

సాధికారికముగా English New Year’s Day అన్నది మన పండుగ కాదు, ఆమాటకొస్తే అది పండుగే కాదు, అందులో అసలు పండుగ చేసుకొనే విధానమే లేదు అని నెత్తిన నోరుపెట్టి కొట్టుకొన్నా చేస్తే తప్పేమి అనే వాళ్ళను మనము ఎంతోమందిని చూస్తున్నాము. ఇటువంటి ఆలోచనా విధానమే పరమతస్థులు మన సాంప్రదాయములతో ఆడుకొనే అవకాశమును కల్పించుచున్నాము.

తమిళనాడులోని ఒక క్రైస్తవ సంఘము చేసిన నిర్వాకము ఇందుతో జతపరచిన చిత్రములో చూడండి. సనాతన ధర్మ అనుయాయులగు తలిదండ్రుల సంతానమగు వారెవరికయినా అది చూస్తే ఆవేశము అవధులు దాటక మానదు. కానీ ‘ ఆవేశము అనర్థదాయకము.’ ‘ఆలోచన సమర్థనీయము.’ మా జీవితము ఈ ధర్మముతోనే ముగుస్తుంది. మరి నేటి యువతీయువకులు వారిసంతానమును గూర్చి ఆలోచించితేనే  ఆవేదన పెల్లుబుకుతుంది.

ఇక్కడ ఇంకొక్క విషయమును చెబుతాను. Costanzo Beci అను 18 వ శతాబ్దములో తమిళనాడులో ఏర్పడిన ఒక మత సంస్థ ‘పెరియనాయగి’ అన్న మన గౌరీమాత పేరును తమ ‘మేరీ మాత’కు తగిలించుకొన్నారు. కాలాంతరములో ఈ పేరు మన అమ్మవారిది అని మరచిపోయి అది మేరీ మాతదే అన్న ఒక దౌర్భాగ్య స్థితికి చేరుకొన్నాము. అసలు వారి ‘మేరీమాత’ క్రైస్తవ పరమగు సిద్ధాంతము ప్రకారము ‘Holy Trinity’ లో కూడా లేదు. అసలు ఉన్నా లేకున్నా మనకు సంబంధములేదు. దీనిని బట్టి వారికి ఎంత సాంప్రదాయ దారిద్ర్యము వుందో అర్థము చేసుకొనేది. లౌకికమయిన మతాంతరీకరణల గూర్చి ఆలోచించుతున్నారే గానీ పారమార్థికముగా ఎంత వెనకలబడియున్నారో గమనించండి. ఇది ఇట్లుంటే ఐరోపా ఖండములోని ఫ్రాన్సు, స్పెయిను, జర్మని, ఇంగ్లాండు, ఇటలీ మొదలగు దేశాలు అన్నీ కలిసి ఐరోపా ఖండమే ఇస్లాం ఖండముగా మారిపోవనుందట. 'Everyone will be Muslim because of our stupidity': Catholic leader says Europe will become an Islamic

State because of the migrant crisis. కారణము ఒక్కటే వలస వచ్చిన ముస్లిములు 5,6 మంది పిల్లలను ఉత్పత్తి చేస్తూ వుంటే క్రిస్టియన్లు 2 లేక మహా అంటే ముగ్గురిని ఉత్పత్తి చేస్తున్నారు. అసలు ఈ మాట ఒక ఇమాం కూడా చెప్పి ఈ విషయమును బలపరచినట్లు WhatsApp లో గాంచివుండినాను.

ఇది మనకు వర్తించదా! తమ మాతృ భూమిలో తమ ఉనికికే ప్రమాదము రాబోతూవుంటే క్రిస్టియనులు మనదేశములోని అమాయకులకు ఎర వేస్తున్నారు. ఇప్పటికయినా మన ఉదార లౌకిక వాదులు కన్ను తెరుస్తారోలేదో! ఈ మాట చెబుతూ వుంటే నాకు భాగవతమున ప్రహ్లాద చరిత్రములోని లోని ఈ పద్యము గుర్తుకొస్తూ వుంది.

అంధేందూదయముల్ మహాబధిరశంఖారావముల్ మూకస

ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ

బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస

ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్.

లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు; మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరికలు ఫలించదు; కృతఘ్నుడికి బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగ మైపోతాయి; పిసినిగొట్టు వాడికి సంపద పనికి వచ్చేది కాదు; పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియనే తెలియవు; అలాగే విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారము లైనవి, వ్యర్థము లైనవి. అని భావిస్తాను. ఇక్కడ విష్ణుభక్తికి , శంకర భక్తికి జోడుగా లేక తోడుగా దేశ భక్తి, మన ధర్మముపై భక్తిని అన్వయించవలసి వుంటుంది. చెవిటి వాని వద్ద శంఖమునూదితే ఎందుకు ఎంక (ఎముక) కోరుకుతున్నావన్నాడట. వయసు మీరిన మేము మాత్రము సలహాకే పనికి వచ్చేది. పిల్లి మేడలో గంట కట్టగలిగినవారు పిల్లలే!

స్వస్తి.

 

Tuesday, 15 January 2019

కనుమ పండుగ


కనుమ పండుగ 
మకర సంక్రాంతి ఎంతో ఉల్లాసముతో ఉత్సాహముతో ముగిసింది. నేడు  “కనుమ” లేక "కనుము" జరుపుకొంటాము. కనుము అన్న మాటకు శబ్ద రత్నాకర నిఘంటువులోతృణ విశేషము అన్న అర్థము కానవస్తుంది. ‘కనుమ’ అన్న మాటకు మార్గము అని తెలియవస్తుంది. ఈ పండుగ పంట పైరుకు సంబంధించినది కాబట్టి ధాన్యమును ఇంటికి తరలించి గడ్డి లేక తృణమును మేట వేయుటతో  వ్యవసాయ కార్యమునుండి రైతుకు విశ్రాంతి దొరుకుతుంది. అందుకు ప్రతీకగా ‘కనుము’ అన్న పదమును పెద్దలు వాడినారేమో!
ఈ రోజున రైతు వ్యవసాయంలో సహకరించిన పశువులను సమ్మానించి పూజించుటతో ఈ పండుగకు తెరపడుతుంది. కొందరు రేపుకూడా ‘ముఉక్కనుము’ పేరుతో యాటలు కోసి, మద్యపానము, కోడిపందేముల కొనసాగింపుతో జరుపుకొంటారు కానీ, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నది పెద్దల మాట.
విషయానికి వస్తే, ఆ రోజున పశువుల కొట్టాలను అంటే పాకలను  చక్కగా అలంకరించి పశువులును కొమ్ములకు రంగులు వేసి పూవుల మాలలతో  బాగా అలంకరించి ఆ రోజున ఉదయం అక్కడ పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు.

దీనినే “ పొలి చల్లటం” అని అంటారు. దీనివల్ల వారి పంటలు బాగా పండుతాయి అని వారి విశ్వాసం. మరియు పశువులు మెడలో వడలతో తయారు చేసిన మాలలు లేక  కొన్ని ప్రాంతాలులో అతిరసములతో అంటే అరిసెలతో చేసిన మాలలు వేసి, ఊరేగించుతారు. కనుము కర్షకుల పండుగ. పాడి పంటలను, పశు సంపదను, లక్ష్మీ స్వరూపంగా అర్పించే రోజు కనుము. ప్రకృతి స్వరూపిణీ అయిన అమ్మ ఆరాధన విశేషమే కనుము.
ఈ రోజు కోడిపందెములు పేకాటలు వివిధరకములగు జూదములు ఈ దినమున విరివిగా కొనసాగుతాయి. డబ్బు చేతిలో వున్నది కదా! గాలిపటములు ఈ రోజు కూడా ఉత్సాహముతో ఎగురవేస్తారు. ఈపండుగను పూర్వము పాశ్చాత్య దేశములలో కూడా ఆడంబరముగా జరుపుకొనేవారు. క్రైస్తవము వచ్చిన పిదప ఆ సాంప్రదాయము సమసిపోయి సార్థకత లేని క్రిస్మస్ ను నెత్తికెత్తుకొన్నారు.
ఏది ఏమయినా తమకు సంవత్సరమంతా పాడిపంటలకు తోడ్పడిన పశువులకు కృతజ్ఞతలు చెప్పడాకి 'కనుము' పండుగను జరుపుకుంటారు. కృతజ్ఞతకు పరాకాష్ట కాదా ఈ సంబరము. అది ఈ సనాతన ధర్మమునకు మాత్రమె చెల్లినది.
స్వస్తి.

Thursday, 10 January 2019

హరిహరాద్వైతం


 ఒకసారి ఒక సామాన్యుడు ఒక పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.
ఆ పండితునకు తెలుసు, తనను ఆశ్రయించిన వ్యక్తికి శివుడు అంటే పడదని. శివకేశవాభేదమును గూర్చిన అద్వైతము అతనికి తెలియదని.
ఆయన అలాగే నంటూ ఒక కాగితం మీద ఒక శ్లోకం వ్రాసి ఇచ్చినాడు. ఆ వ్యక్తి చదివి నివ్వెరపోయినాడు. ఆ శ్లోకము ఈ క్రింది విధముగా వుంది.
గవీశపాత్రో నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః।
లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాదిః పరమేశ్వరో నః॥
ఆశ్చర్య పోయాడు చదవగానే. ఆ శ్లోకము యొక్క అర్థము యథాతథముగా చదివితే ఏమి అర్థము వస్తుందో చూడండి.
గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.
నగజార్తి హారీ ... నగజ అంటే పర్వత పుత్రిక, అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.
కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.
శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.
లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ. అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూఅటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూరావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.
మీకు విష్ణువును గూర్చి వ్రాసేది రాకుంటే ఆ మాటే నాకు చెప్పవచ్చును కదా అని అతడు ఆ పండితుని పై కోపగించుకొన్నాడు.
అప్పుడు ఆ పండితుడు "నీకు సంస్కృతము సమగ్రముగా తెలియక పొరబడినావు. "అది విష్ణువును కీర్తించే శ్లోకమే!" అని చెప్పి అతనికి ఆశ్లోకార్థమును ఈ విధముగా వివరించినాడు. " నేను చివరలో వాడిన అనాది అన్న మాటకు అర్థమును,
నీవు తీసుకోవలసిన విధముగా తీసుకోన లేదు. న+ఆది, అంటే మొదటి అక్షరము తీసి చదువుకొమ్మన్నానుఅని అర్థము ఈ క్రింది విధముగా వివరించినాడు."
గవీశపాత్రః ... లో గ తీసివేస్తే వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధము. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు,
గరుడు ని చేతచేత గౌరవింపబడువాడు, అంటే గరుడుని వాహనుడైన విష్ణువు.
నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసివేస్తే గజార్తి హారీ ... గజేంద్రుని ఆర్తిని దూరము చేసిన వాడు, విష్ణువు.
కుమారతాతః .... 'కు' తీసివేస్తే మారతాతః అంటే మన్మధుని తండ్రి అయిన విష్ణువు. (మదనో మన్మదో మారః... అమరము)
శశిఖండ మౌళి: ... '' తీసివేస్తే శిఖండమౌళిః. నెమలిపింఛము ధరించిన వాడు కృష్ణుడు, అనగా విష్ణువు.
లంకేశ సంపూజిత పాద పద్మ: మళ్ళీ ఆది లేనిదిగా అంటే 'లం' తీసివెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: .
క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు . అంటే బ్రహ్మ రుద్రాదులు పూజించు పాదపద్మములు కలవాడు, విష్ణువు.
గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూబ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ మరియు
 '' తీసివేస్తే రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా! విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .
అడిగినతడు శిగ్గుతో తలవంచుకొన్నాడు.
గణిత, ఖగోళ, జ్యోతిష, జీవ, జంతు, భౌతిక, రాసాయనికాది ఏ శాస్త్రమునకైనా మహనీయులు వ్రాసిన రామాయణ భారత భాగవత రఘువంశాది గ్రంధములకైనా సుసంపన్నమైన భాష సంస్కృతము. ఇప్పటికయినా మేలుకొని పిల్లలకు సంస్కృతము, ఆభాషకు అనుంగు బిడ్డ అయిన ఆంధ్రము నేర్పించండి.
ఆపై ఏ భాష నేర్చుకోదలచినా అవలీలగా వస్తుంది.
మరియొక హరిహర సామ్యము చూడండి.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవేI
శివశ్చ హృదయం విష్ణుం విష్ణోశ్చ హృదయం శివంII
 యథా శివమయోర్విష్ణుః ఏవం విష్ణుమయః శివఃI
యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషిII
 అని చెప్పుచున్నది మనకు వేదార్థము. ఈ శ్లోకములు చాలా మందికి తెలిసే వుంటాయి. ఈశ్వరునికి కాలుడు అని ఒకపేరు. పైగా ఆయన లయుడు. తమోగుణ ప్రతీక అంటారు ఆయనను. కానీ ఆయన శరీరము అంతా తెలుపే. దానికి తోడూ తెల్లనైన భస్మము ధరిస్తాడు. వెండికొండలో ఉంటాడు. స్వచ్ఛమైన చంద్రుని కలిగియుంటాడు. ఆయన వాహనము నంది తెలుపు. ఎప్పుడూ చల్లదనము కలిగియుంటాడు. అభిషేక ప్రియుడు. ఈవిధముగా అన్నీ సత్వగుణ ప్రధానములగు గుణములనే కలిగియుంటాడు. మరి విష్ణువో సత్వగుణ ప్రధానుడు. కానీ ఆయన నలుపు. ఆయన పవళించే ఆదిశేషుడు నలుపు. ఆయన వాహనము గరుత్మంతుడు నలుపు. ఆయన స్థితి నిరత నిద్ర.
మనము కాస్త పరిశీలనాత్మకముగా ఆలోచించితే శివుని స్వరూప స్థితిగతులు సత్వగుణ సూచకములు. కానీ ఆయన లయ కర్త. మరి విష్ణువో బాహ్యలక్షణములన్నీ తామసికములు కానీ కర్తవ్యము మాత్రము దుష్ట శిక్షణ లోక రక్షణ. ఈ విధమగు ఆలోచన చేస్తే వారిది అభేద వ్యాజ్యము అని మనకు అర్థమైపోతుంది.
ఈ చాటువు గమనించండి. ఎంత చక్కగా మనకు ఆ అర్థము సార్థకమౌతుందో అర్థమౌతుంది.
వాసుదేవ ఇతి వామదేవ ఇతి ఆస్తి కల్పక మహీరుహద్వయం
యద్యపీహ సుమభేద సంభవః  నాస్తి తత్ర ఫలభేద సంభవః
వాసుదేవుడు అంటే విష్ణువు. వాసుదేవుని కొడుకైనందువల్ల వాసుదేవుడైనాడు కృష్ణుడు. మరి విష్ణువుకు మున్డునున్దియే వాసుదేవుడను నామము కలదు. ఆయన భూభారత. అందుచే భూమినుండి లభ్యమయ్యే వసువులకు కూడా ఆయనే నాథుడు. అందుకే వాసుదేవుడు. ఇక వామదేవుడు అంటే శివుడు. వామదేవ శబ్దానికి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. సులభమైన అర్థమును గ్రహించుదాము. మనము తూర్పును చూస్తూ నిలబడి ధ్యానాదులు చేయవలెను. అప్పుడు మన ఎడమచేయి ఈశాన్యమును చూపిస్తుంది. అక్కడ వున్నవాడు వామదేవుడు. 'వామముఅంటే ఎడమ అని అర్థము. శివునికి ఎడమవైపు పార్వతివుంటుంది. ఆమెకు దేవుడు అంటే ఆమె భర్త.

ఇక విషయానికి వస్తాము.
పై శ్లోకము యొక్క అర్థము ఏమిటంటే 'వాసుదేవుడు' 'వామదేవుడుఅనునవి రెండు కల్పవృక్షములట. ఆ వృక్షములకు పూవులు వేరట కానీ ఫలమేమో ఒకటేనట. ఇది చోద్యము కాదా! ఇందులో వున్న నిగూఢార్థమును తెలుసుకొంటే ఆశ్చర్యపోతారు. వాసుదేవ లో 'సువామదేవ లో 'అంటే సు-మ మాత్రమె తేడా. (సుమము అంటే పూవే కదా!). మిగతా అంతా ఒకటే. ఇరువురిలో ఎవరిని ఆరాధించినా ఫలమొకటే! ఎంత గొప్ప సందేశమును ఎంత చమత్కారముగా చెప్పినారో చూడండి. శంకరులవారు ఉపదేశించినది ఈ అద్వైతమే!
స్వస్తి